31, జనవరి 2022, సోమవారం

పిల్లలను దండించుట ఆశీర్వదించడమా?

 పాశ్చాత్య సంస్కృతికి మన సంస్కృతికి ఉన్న అనేక భేదములలో ముఖ్యమయినది, తరువాతి తరములకు అవసరమయినది అని మనం భావించేది పిల్లలను క్రమశిక్షణలో పెంచడం. మన దగ్గర పిల్లలను పెంచడానికి, వారిని ఏ వయస్సులో ఎలా పెంచాలో, వారికి దండన విధించడం వల్ల వచ్చే లాభములు ఏమిటో మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా!

ఇప్పుడు అటువంటిదే పతంజలి వ్యాకరణ భాష్యంలో చెప్పిన శ్లోకం  చూద్దాం!

సామృతైః పాణిఖిర్ఘ్నన్తి గురువో న విషోక్షితైః

లాలనా శ్రయిణో దోషాస్తాడనాశ్రయిణో గుణాః

భావంః
దండించుట వల్ల పిల్లలు, శిష్యులు తప్పులు లేని వారు, మంచి గుణములు ఉన్నవారు అవుతారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లోపల ఈర్ష్యాద్వేషములు పెట్టుకోరు. తమ దయ గలిగిన అమృతతుల్యమయిన చేతులతో కొడతారు. అది పిల్లలను ఆశీర్వదించడమే.

30, జనవరి 2022, ఆదివారం

ఛాయాదేవి సవతి ప్రేమ

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు సంధ్యాదేవి వెళ్ళి పోయిన తరువాత ఛాయ ఏమి చేసింది? ఇప్పుడు తెలుసుకుందాం!

సంధ్యాదేవి వెళ్ళిన తరువాత ఛాయ పూర్తిగా సంధ్యాదేవిలానే ప్రవర్తించ సాగింది. వివస్వంతునికి ఆమె సంధ్యాదేవికాదు అన్న అనుమానమే రాలేదు. వారికి ఇద్దరు పుత్రులు జన్మించారు. వారు సావర్ణి, శనైశ్చరుడు. 

సావర్ణి ః వైవస్వత మనువు తరువాత వచ్చే మనువు సావర్ణి మనువు. 

శనైశ్చరుడుః సర్వప్రాణుల కర్మ ఫలదాత

అప్పటి వరకూ సంధ్యాదేవివలెనే ప్రవర్తించిన ఛాయాదేవి, తనకు సంతానం కలిగిన తరువాత తన పిల్లలను ప్రేమగా చూసుకుంటూ సంధ్యాదేవి పిల్లలను వివక్షతతో చూడసాగింది. 

ఆ వివక్షతను కొంతవరకూ భరించిన యముడు, కొంతకాలమునకు భరించలేక ఆమెను నిలదీశాడు. అలా నిలదీస్తున్న సమయంలో అతను కోపమునకు వశుడయ్యి తన కాలును ఆమె పైకి ఎత్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఛాయాదేవి యముని కాలు భూమిపై పడాలని శపించింది. 

అలా సవతిప్రేమను చూపిన ఛాయాదేవిని వివస్వంతుడు ఏమి చేశాడు? ఆమె సంధ్యాదేవి కాదు అని తెలుసుకున్నారా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

29, జనవరి 2022, శనివారం

విదురనీతి - 3

 మనం ఇంతకు ముందు విదురనీతి శీర్షికలో రెండు భాగాలు  చెప్పుకున్నాం! రెండవ భాగంలో దృతరాష్ట్రుడు విదురుని ప్రశ్నించటం చూశాం! ఇప్పుడు ఆ విదురుడు చెప్పే సమాధానం ఎంత విచిత్రంగా ఉందో  చూద్దాం!

సంస్కృత శ్లోకం:

అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనం 

హృతస్త్వం కామినం చోరమావిశన్తి ప్రజాగరాః

కచ్చిదేతైర్మహాదోషైర్న స్పృష్టోసి నరాధిప

కచ్చిన్న పరవిత్తేషు గృధ్యన్నిపరితప్యసే

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

ఇలబలశాలితోడ నెదురేగెడు హీనబలుడు నన్యకాం 

తల నెదగోరువాడపహృతస్వుడు చౌర్యసమర్ధుడన్న వీ 

రలు గతనిద్రులౌదురు ధరావరయుంటివె వీరిలోన న 

న్యుల ధనమున్ హరింపదలపుంచితివే కతమెద్ది మేల్కొనన్ 


భావం:

ఓ మహారాజా! తనకంటే బలవంతుడిని ఎదుర్కోబోతున్న వాడు, తన ఆస్తిని/ సొమ్మును అంతటినీ పోగొట్టుకున్న వాడు , పరస్త్రీలను మనసునందు కోరుకుంటున్న వానికి, ఇతరుల సంపద దోచుకోవాలని అనుకున్న వారికి నిద్ర రాదు. కనుక మహారాజా మీరు ఇటువంటి ఆలోచనలు ఏమయినా ఉన్నాయా!

విశ్లేషణ:

మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు విదురుడు సాక్షాత్తు ధర్ముని అవతారం. అతనికి ధర్మాధర్మముల విచక్షణ ఉంది. ఇక్క డ దృతరాష్ట్రుడు రాజు, విదురుడు అతనికి వరుసకు తమ్ముడే అయినా అతనికి కేవలం సలహాలు చెప్పే అవకాశం తప్ప అతనిని తిన్నగా ప్రశ్నించే అవకాశం లేదు. కనుక పైన అడిగిన ప్రశ్న అడిగాడు. ఆ సమాధానం చుస్తే నిజంగా అన్ని సందర్భాలు కూడా ఆ సమయంలో దృతరాష్ట్రునికి సంబంధించినవే. 

సంజయుడు పాండవుల సభలో ఎం జరిగిందో ధృతరాష్ట్రునికి చెప్పలేదు. 

తనకంటే బలవంతుడిని : ధృతరాష్ట్రునికి అన్ని వేళలా తమకంటే పాండవులే బలవంతులు అనే నమ్మకం ఉంది. కనుక ఒక వేళ వారు సంధికి ఒప్పుకోకుండా తిన్నగా యుద్ధానికి రమ్మన్నారేమో అని అతని అనుమానం!

తన ఆస్తిని/ సొమ్మును అంతటినీ పోగొట్టుకున్న వాడు: ధృతరాష్ట్రునికి ఆ రాజ్యం మీద సింహాసనం మీద విపరీతమయిన వ్యామోహం. అదే అతని సర్వస్వం. దానిని ఆ పాండవులు లక్కుంటారేమో అని భయం

పరస్త్రీలను మనసునందు కోరుకొనుట:  ఇది ధృతరాష్ట్రుని దృష్టి కాక పోయినా, ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తున్నప్పుడు, అతను ఏమీ మాట్లాడలేదు, పరస్త్రీని మనస్సులో కొరుకొవడానికీ, ఆమెకు నలుగురిలో అవమానం జరుగుతున్నప్పుడు దానిని ఆపకుండ ఉండడానికి తేడాలేదు

ఇతరుల సంపద దోచుకోవడంః నిజంగా ధృతరాష్ట్రునికి పాండవుల రాజ్యమును దోచుకోవాలని కోరిక ఉంది. 

ఇది విదురుని గొప్పతనం. తాను అడగాలని అనుకున్నది అడుగుతూనే, మహారాజు తప్పులను ఎత్తి చూపటం. 

28, జనవరి 2022, శుక్రవారం

కలికాల ప్రభావాన్ని తప్పించుకునే మార్గం

 మనం ఇంతకు ముందు కలి ప్రభావం, కలికాలంలో మానవుని లక్షణముల గురించి తెలుసుకున్నాం కదా!

ఇప్పుడు ఆ కలి ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఒక సులభమయిన మార్గం గురించి చెప్పుకుందాం!

ఈ మార్గన్ని స్వయంగా వ్యాసభగవానుడే మహాభారతంలో అరణ్యపర్వంలో చెప్పాడు. మనం ఇప్పుడు వ్యాసుడు చెప్పిన సంస్కృత శ్లోకం, దాని కవిత్రయ భారతంలోని తెలుగు అనువాదం కూడా చెప్పుకుందాం!

శ్లోః 

కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ

ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం

 తెలుగు అనువాదంః

కర్కోటకుని, దమయంతి, బుణ్యమూర్తియైన నలుని

ఋజు చరిత్రుడైన ఋతుపర్ణు గీర్తింప గలిభయంబు లెల్ల గ్రాగు నధిప

భావంః కర్కోటకుడు అనే పాము, భార్యాభర్తలయిన నల దమయంతుల గురించి, రఘువంశజుడయి మంచి ప్రవర్తన కలిగిన ఋతుపర్ణుడు అనే రాజుని నిరంతరం తలుచుకొనుట వలన కలి వలన కలిగే భయములు అన్నీ తొలగుతాయి. 

విశ్లేషణ

ఈ శ్లోకమును వ్యాసుడు నలదమయంతుల కధకు ఫలశ్రుతిగా చెప్పాడు. వీరి కధ అనేక మలుపులతో ఆసక్తి దాయకంగా ఉంటుంది. ఎంతో అన్యోన్య దాంపత్యమునకు ఉదాహరణగా నలదమయంతులు, వారు విడిపోయిన సమయంలో దమయంతి చూపిన మనోధైర్యం, నలుడు తాను  దూరమయితే తన భార్య పుట్టింటికి వెళ్ళి సంతోషిస్తుంది అనే త్యాగం, తనకు ఉపకారం చేసిన వ్యక్తికి అపకారం రూపంలో ఉపకారం చేసిన కర్కోటకుడు, తాను ఒక రాజు అయ్యి ఉండీ తన వద్ద పనిచేసే ఒక వ్యక్తికి ఎలా మర్యాద ఇవ్వలి, ఒక విషయం వారి వద్ద నేర్చుకున్నప్పుడు వారికి తిరిగి ప్రత్యుపకారం ఎలా చేయాలి అని ఋతుపర్ణుని వద్ద మనం నేర్చుకోవలసిన పాఠములు. ఈ విషయములు అన్నీ మనం అర్ధం చేసుకోగలిగినప్పుడు, కలి అనే విషప్రభావం నుండి మనం బయట పడగలుగుతాము.

ఈ పాఠములు మనం రాబోయే టపాలలో తప్పకుండా నేర్చుకుందాం!

27, జనవరి 2022, గురువారం

చ్యవన మహర్షి - అశ్వినీదేవతలు

మనం ఇంతకు ముందు చ్యవన మహర్షి గురించి, అతని వివాహం సుకన్యతో జరగటం గురించి, సుకన్యకు అశ్వినీ దేవతలు ఇచ్చిన వరం గురించి తెలుసుకున్నాం కదా! 
మరి వారు సుకన్య కోరికను మన్నించారా లేదా తెలుసుకుందాం!
సుకన్య మాటలు  విన్న అశ్వినీదేవతలు ముసలివాడయిన చ్యవన మహర్షిని తీసుకుని దగ్గరలోని కొలనులో మునిగారు. కొంతసేపటికి ఆ కొలనులోనుండి  అత్యంత సుందరమయిన, ఒకేరూపం కలిగిన ముగ్గురు యువకులు బయటకు వచ్చారు. వారిలో ఇద్దరు అశ్వినీ దేవతలుగాను, ఒకరు తన భర్త చ్యవనుని గాను సుకన్య గ్రహించింది. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని వారించమని వారు కోరగా, ఆమె తన భర్తనే తిరిగి వరించింది. 
 సహాయమునకు ప్రతిఫలంగా చ్యవన మహర్షి, యజ్ఞములలో దేవతలకు లభించే సురాపానం సేవించే అర్హతను వారికి కలుగజేస్తాను అని మాట ఇచ్చాడు. 
ఇప్పటి వరకు అశ్విని కుమారులను మనం అశ్వినీదేవతలు అని చెప్పుకున్నాం కదా! మరి వారికి దేవతలతో సమానంగా యజ్ఞములలో సురాపానం అర్హత ఎందుకు లేదు? వారి కి అలా అర్హతలేకుండా పోవటానికి వారు చేసారు? తరువాతి టపాలలో నేర్చుకుందాం. 

26, జనవరి 2022, బుధవారం

సంధ్యాదేవి - ఛాయ

 మనం ఇంతకు ముందు కశ్యపుడు  - కుటుంబం గురించి తెలుసుకున్నాం కదా! వారిలో అదితి పుత్రులు ఆదిత్యులు అని చెప్పుకున్నాం కదా! ఆ ద్వాదశ ఆదిత్యుల గురించి కూడ చెప్పుకున్నాం. ఇప్పుడు వారిలో వివస్వంతుని గురించి చెప్పుకుందాం!

వివస్వంతుడు దేవశిల్పి విశ్వకర్మ పుత్రిక అయిన సంధ్యాదేవిని వివాహం చేసుకున్నడు. సంధ్యాదేవికి వివస్వంతుని మీద అనురాగం ఉన్నా అతని వేడిని తట్టుకోలేక పోయేది. వారికి కొంతకాలమునకు సంతానం కలిగింది. వారు వైవస్వత మనువు , ధర్మరాజయిన యముడు మరియు యమున కవల పిల్లలు. 

అప్పటికీ ఆమె సూర్యుని వేడిని తట్టుకోలేక తన నీడ నుండి అచ్చం తనలాగే ఉండే ఛాయను తయారు చేసి తనలాగే అక్కడ ఉంటూ, తన భర్తను పిల్లలను చూసుకుంటూ ఉండమని, తను సంధ్యాదేవి కాదు అనే విషయం ఎవరికీ తెలియకుండా ప్రవర్తించమని చెప్పింది. ఆ మాటలు విన్న ఛాయ తన ప్రాణములకు హాని జరుగదు అన్న నమ్మకం ఉన్నంత కాలం ఆ విషయం ఎవరికి చెప్పనని మాట ఇచ్చింది. సంధ్యాదేవి నిశ్చింతగా తన పుట్టింటికి వెళ్ళింది. 

అలా అనుకోకుండా పుట్టింటికి వచ్చిన సంధ్యాదేవిని చూసి అమె తండ్రి కారణం అడిగాడు. ఆమె విషయం చెప్పింది. అతను ఆమెను సముదాయించి తిరిగి పంపించాలి అనుకున్నాడు. ఆమె ఎలాగూ తనవంటి ఛాయను ఆమె తయారు చేసింది కనుక ఆమె తిరిగి వెళ్ళాలి అనుకోలేదు. కనుక ఆమె తన తండ్రికి తన ఇంటికి వెళుతున్నానని చెప్పి, ఉత్తర కురుదేశమునకు వెళ్ళింది. ఆమె తన సొంత రూపంలో ఉంటే ఎవరయినా గమనిస్తారని ఆమె ఒక ఆడ గుర్రం రూపంలో తపస్సు చేస్తూ ఉంది. 

తరువాత ఏమి జరిగిందో తరువాతి టాపాలలో చూద్దాం!



25, జనవరి 2022, మంగళవారం

విదురనీతి -2

 మనం ఇంతకూ ముందు విదురనీతి శీర్షికలో ఒక బాగం చెప్పుకున్నాం . ఆ భాగంలో విదురుని కోసం దృతరాష్ట్రుడు ఒక సేవకుని పంపటం, విదురుడు రావటం వరకు తెలుసుకున్నాం! ఇప్పడు వచ్చిన ఆ విదురుని తో దృతరాష్ట్రుడు ఎం మాట్లాడాడో చూద్దాం! 

సంస్కృత శ్లోకం:

సంజయో విదుర ప్రాప్తో గార్హయిత్వా చ మాం గతః 

అజాతశత్రోః శ్వోవాక్యం సభామధ్యే స వక్ష్యతి

తస్యాద్య కురువీరస్య న విజ్ఞాతం వచో మయా 

తన్మే దహతి గాత్రాణి తదాకార్షీత్ర్పజాగరం 

జాగ్రతో దహ్య మానస్య శ్రేయో యదిహ పశ్యసి 

త ద్బ్రూహి త్వం హి నస్తాత ధర్మార్ధకుశలో హ్యసి

యతః ప్రాప్తః సంజయః పాండవేభ్యో న మే యధావన్మనసః ప్రశాంతిః

సర్వేంద్రియాణ్యప్రకృతిం గతాని కిం వక్ష్యతీత్యేవ హి మేద్య చింతా 

తన్మే బ్రూహి విదుర త్వం యధావన్ మనీషితం సర్వమజాతశత్రోః

యధా చ నస్తాత హితం భవేచ్చ ప్రజాశ్చ సర్వాః సుఖితాః భవేయః

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

ధర్మజుపాలికింజనికృతజుండుపాజ్ఞుడుసంజయుడు స 

నిర్మలచిత్తవచ్చికడు నిందలొనర్చి యజాతశత్రువా 

జ్ఞ్మర్మముజెప్పకుండజేనెనాకదిగ్రాహ్యముగామినంతటన్ 

జర్మముగాల్చుచున్నయది జాగరమున్గలిగించుచుండెడున్ 


పాండవునొద్దకేగి మనపాలిటికాగతుడైన సంజయుం

డొండొకమాటయేమి సభనూదునటంచుశరీరమంతట 

న్జెండుచునుండె హృద్వ్యధయునిద్రయొకించుక లేమిఁజే 

పండితభూమి మర్త్యునకు భద్రము గంటివె చెప్పుమేర్పడన్ 

భావంః

ఓ విదురా! అత్యంత వివేకం కలిగిన సంజయుడు పాండవుల వద్ద రాయబారమునకు వెళ్ళి తిరిగి వచ్చి, నన్ను నిందించి అక్కడ ఏమి జరిగినదో నాకు ముందుగా చెప్పకుండా, రేపటి సభలో అందరి ముందు ఆ అజాతశత్రుడు అయిన ధర్మరాజు మాటలు చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ధర్మరాజు ఏమి చెప్పాడో నాకు తెలియటంలేదు. ఆ ఆలోచనల వల్ల నాకు శరీరం జ్వరంతో కాలిపోతుంన్నది, నిద్రరావటంలేదు ఇంద్రియములు సరిగా పనిచేయటం లేదు. రేపు సభలో సంజయుడు ఏమి చెప్తాడో అని చింతగా ఉన్న నా మనస్సు శాంతించే విధంగా ధర్మార్ధ విషయములలో నిపుణుడయిన నీవు ఏదయినా మంచి విషయం చెప్పు.     


24, జనవరి 2022, సోమవారం

చ్యవన మహర్షి - సుకన్య

 మనం ఇంతకుముందు భృగుపుత్రుడయిన చ్యవన మహర్షి గురించి,  అతను శర్యాతి పుత్రిక సుకన్యను వివాహం చేసుకున్న సందర్భాన్ని  కదా! ఇప్పుడు ఆ తరువాత జరిగిన సంగతులు తెలుసుకుందాం!

అత్యంత కోప స్వభావం కలిగిన  చ్యవనుని రాజపుత్రిక సుకన్య వివాహం చేసుకున్న తరువాత,  మారిపోయింది. ఎంతో ఓర్పుతో,  సహనంతో ఆమె పర్ణశాలలో జీవనం సాగించింది. భర్త అనురాగమును పొందింది. అలా కొంతకాలం గడచిపోయింది. 

ఒకరోజు చ్యవన మహర్షి ఆశ్రమం దగ్గరకు అశ్వినీ దేవతలు వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమె ఎవరు అని అడిగారు. ఆమె  పుత్రికను అని,చ్యవన మహర్షి భార్యను అని చెప్పింది. ఆమె మాటలు విన్న అశ్వినీదేవతలు అంతముసలి వానితో జీవనం సాగించటం ఎందుకు? ఆమె సౌందర్యానికి తగినట్లుగా మంచి యౌవ్వనం కలిగిన వీరుని వరించుకొమ్మని,కావాలంటే వారే అతనిని తీసుకుని వచ్చి ఆమెకు అతనితో వివాహం చేస్తామని చెప్పారు. 

 వారి మాటలు విన్న సుకన్య, తాను చ్యవన మహర్షితో ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పి, వారిని వారించి తన భర్త దగ్గరకు వెళ్లి జరిగిన సంగతి అంతా విన్న చ్యవన మహర్షి ఆమెను వెళ్ళి ఆ అశ్వినీ దేవతలను వరం కోరుకొమ్మని సలహా ఇచ్చారు. భర్త కోరిక మేరకు తిరిగి ఆ అశ్వినీ దేవతలా వద్దకు వెళ్లి ఆమె భర్తనే (చ్యవన మహర్షినే) యవ్వనం కలిగినా వానిగా చేయమని కోరుకుంది. 

ఆమె కోరిక తీరిందా? అశ్వినీ దేవతలు నిజంగా ఆమెకు సహాయ చేయగలిగారా? తిరిగి ఏమి పొందారు అని తరువాతి టపాలలో చూద్దాం!

22, జనవరి 2022, శనివారం

చ్యవన మహర్షి

చ్యవన మహర్షి భృగుమహర్షి కుమారుడు. ఇతని ప్రస్తావన మనకు భాగవతం మరియు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. 
శర్యాతి అనే మహారాజు ఒకసారి తనసైన్యంతో, కుటుంబంతో వనములలోనికి మహర్షుల సేవకోసం వెళ్లారు. కొన్ని రోజుల తరువాత వారి సైన్యంలోనివారికి మలమూత్రస్థంభన జరిగింది. సైన్యం మొత్తం బాధింపబడటం చుసిన శర్యాతికి అలా జరగటానికి కారణం తెలియలేదు. 
అప్పుడు అతని కుమార్తె సుకన్య అంతకు ముందు రోజు జరిగిన సంగతి చెప్పింది. 
ముందురోజు ఆమె తన స్నేహితురాళ్లతో కలసి వనవిహారమునకు వెళ్ళింది. అప్ప్పుడు ఒక చెట్టు మొదట్లో ఒక పెద్ద పుట్ట కనిపించింది. ఆ పుట్టాను దగ్గరగా చూడాలన్న కుతూహలంతో సుకన్య అక్కడికి వెళ్ళింది. ఆ పుట్టలో నుండి ఆమెకు రెండు చిన్న మెరుపులు కనిపించాయి. మిణుగురు పురుగులేమో అనుకుని, అవునోకాదో చూడాలనుకుని ఒక కర్రపుల్లతో వానిని పొడిచింది. అయితే ఆ పోటుకు అక్కడినుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తాన్ని చూసి భయపడిన సుకన్య తిరిగి వచ్చేసింది. 
ఇప్పుడు తమ సైన్యం పడుతున్న బాధలను చూసి తన తండ్రికి విషయం చెప్పింది. ఈ విషయం విన్న శర్యాతి తిరిగి వనంలో తన కుమార్తె చెప్పిన ప్రదేశమునకు వెళ్లి  జరిగిందో తెలుసుకుని బాధపడ్డాడు. 
తన కూతురు పొడిచిన ఆ రెండు మిణుగురులు చ్యవన మహర్షి కన్నులు. ఆ మహర్షికి బాధను కలిగించిన కారణంగానే వారి సైన్యమునకు కష్టములు వచ్చాయి అని తెలుసుకుని, చ్యవన మహర్షిని క్షమాపణ కోరుకున్నాడు శర్యాతి. 
జరిగిన తప్పుకు ప్రాయఃచిత్తంగా తన కుమర్తె సుకన్యను అతనికి ఇచ్చి వివాహం చేసాడు. 
ఆ తరువాత సుకన్య జీవితం ఎలా ఉంది, ఏం జరిగింది అని తరువాతి టపాలో చూద్దాం!

20, జనవరి 2022, గురువారం

మన బంధువులు ఎవరు?

 మానవుడు సమాజిక జీవి. తనచుట్టూ ఎప్పుడూ తన స్నేహితులు, సన్నిహితులు ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. అయితే అలా తన చుట్టూ ఉన్నవారు నిజంగా తన బంధువులేనా? లేక వారి వారి అవసరాల కోసం తన చుట్టూ చేరుతున్నారా అన్న విషయం ఎవరికీ వారు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మరి మన బంధువులు నిజంగా ఎవరు అని మనకు ఎలా తెలుస్తుంది?

ఆ విషయాన్ని  చాణక్య నీతిలో  ఈ క్రింది శ్లోకం ద్వారా నేర్చుకుందాం!

ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రుసంకటే

రాజద్వారే శ్మశానే చ యస్తిష్టతి స బాంధవః

అర్ధంః ఆతురే = రోగము; వ్యసనే= దుఃఖము; ప్రాప్తే = కలిగినప్పుడు; దుర్భిక్షే = కరువు కలిగినప్పుడు, శత్రు = శత్రువులవల్ల; సంకటే= భయం కలిగినప్పుడు; రాజద్వారే = రాజసభలో, శ్మశానే = శ్మశానంలో;  యః = ఎవడు;  సః = వాడే; తిష్టతి = అం డగా ఉంటాడో; బాందవః= నిజమయిన బంధువు

భావం ః మనకు అనారోగ్యం కలిగినప్పుడు, భరించలేని దుఃఖంలో మనం మునిగి ఉన్నప్పుడు, మనవద్ద జీవనానికి సరిపోను ధనము / ఉపాధి కూడా లేనప్పుడు, మనలను గొప్ప శత్రువులు ముట్టడించినప్పుడు రాజాస్థానంలో నయినా చివరకు శ్మశానంలో అయినా ఎవరయితే ఎల్లప్పుడూ మనలను విడువకుండా మన వెంట మనకు ధైర్యాన్ని ఇస్తూ నిలిచి ఉంటారో వారే మనకు నిజమయిన బంధువులు. 

19, జనవరి 2022, బుధవారం

మూర్ఖుని మనస్సు

 మనం ఇంతకు  ముందు భర్తృహరి సుభాషితాలలో మూర్ఖపద్ధతి అనే ఘట్టంలో ఒక శ్లోకం  చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మరొకటి చూద్దాం!

 ప్రసహ్య మణిముద్ధరేన్మకరవక్త్రదంష్ట్రాన్తరా  

త్సముద్రమపి సంతరేత్పృచలదూర్మిమాలాకుల౯మ్

భుజ మపి కోపితం శిరసి పుష్పవద్ధారయే

న్నతు ప్రతినివిష్టమూర్ఖ జనచిత్తమారాధయేత్

అర్ధం ః  

ప్రసహ్య = బలవంతంగా; మణిం =మణులను ; ఉద్ధరేత్ = తీసుకోవచ్చు;  మకర = మొసలి; వక్త్ర = నోటిలోని ; దంష్ట్రా = కోరల ; అంతరాత్ = మధ్యనుండి ; సముద్ర= సముద్రమును; మపి =అయినను; సంతరేత్ =దాటవచ్చు ; ప్రచలత్ = వేగంగా కదులుతున్న ; ఊర్మి = అలల ; మాలా = వరుసలు, ఆకులం = భయంకరమయిన  ;  భుజ మపి = పాములనయినా; కోపితం = బుసలు కొట్టే ;  శిరసి = తలపైన; పుష్పవత్ = పూవు వలే; ధారయేత్ = ధరించవచ్చు ; ప్రతినివిష్ట = మొండిగా ఉన్న; మూర్ఖజన = మూర్ఖుని; చిత్తం = మనస్సును; ఆరాధయేత్ = మార్చటం ; న = కుదరదు , వీలుకాదు. 

తాత్పర్యం:

మొసలి నోటిలోని పదునయిన కోరల మధ్యనుండి విలువయిన రత్నమును కష్టపడి బయటకు తీయ్యవచ్చు, భయంకరమయిన అలలు కలిగిన సముద్రమును దాటవచ్చు, కోపంతో బుసలుకొడుతున్న పాములను పువ్వులవలె తలపైన ధరించవచ్చు కానీ మొండిపట్టుపట్టిన మూర్ఖుని మనస్సు మార్చటం అస్సలు జరుగదు. 

ఇదే శ్లోకమునకు తెలుగు పద్యం చూద్దామా!

మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలించ వచ్చు బా

యక చలదూర్మికానికర మైనమహోదధి దాట వచ్చు మ

స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింప వచ్చు మ

చ్చిక ఘటియించి ముర్ఖజనచిత్తము దెల్ప నసాధ్య మేరికిన్



17, జనవరి 2022, సోమవారం

కలికాలంలో మానవుని లక్షణాలు

 మనం ఇంతకుముందు అధర్ముడు గురించి, అతని వంశవృక్షం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు కలికాలంలో మానవుని లక్షణాల  తెలుసుకుందాం!

సన్యాసినో గృహాసక్తా గృహస్థా స్త్వవివేకినః 

గురునిందాపరా ధర్మధ్వజినః సాధువంచకాః 

ప్రతిగృహారతాః శూద్రాహః పరస్వహరణాదరాః 

ద్వయోహ్ స్వీకార ముద్వాహః శఠే మైత్రీ వదాన్యతా 

ప్రతిదానే క్షమాశక్తౌ విరక్తి కరణాక్క్షమే

వాచాలత్వం చ పాండిత్యే యశోర్ధే ధర్మసేవనం 

భావం : కలికాలంలో సన్యాసులకు గృహస్థధర్మమందు కోరిక ఉంటుంది, గృహస్తులు తెలివితక్కువగా వ్యవహరిస్తూ గురువులను నిందిస్తూ, మంచివారిని మోసం చేస్తూ,తాము చేస్తున్న పనే ధర్మమని అనుకుంటారు. తృప్తిలేని శూద్రులు ఇతరుల వద్దనుండి ధనమును దోచుకుంటారు. స్త్రీ పురుషుల పరస్పర అంగీకారం ఉంటే చాలు వివాహములు జరుగుతాయి. కోరి కోరి మోసగాళ్ళతో స్నేహం చేస్తారు. దానములు చేస్తూ వారిని వారే పొగుడుకుంటూ ఉంటారు. బలహీనులను ఈసడించుకుంటూ ఉంటారు. బాగా మాట్లాడకలిగిన వారే పండితులుగా, మేధావులుగా చెలామణి అవుతారు. వారు ఆచరించే అన్ని ధర్మములకు మంచి పేరు పొందటమే పరమావధి. 


విశ్లేషణ: ఇక్కడ మనం కొత్తగా చెప్పుకోవటానికి, విశ్లేషణ చేయటానికి ఏమి ఎక్కువ లేదు కదా! ఈ రోజులలో జరుగుతున్నదే మేధావులయిన మహర్షులు ముందుగానే ఊహించి చెప్పారు. 

11, జనవరి 2022, మంగళవారం

నాగ్నజితి పూర్వజన్మ

 ముందు శ్రీకృష్ణుని ఎనిమిది మంది భార్యల పేర్లు తెలుసుకున్నాం! వారిలో నాజ్ఞజితిని ఎలా వివాహం చేసుకున్నాడో తెలుసుకున్నాం! 

పూర్వాజన్మలో ఎంతోపుణ్యం చేసుకున్నందువల్లనే నాగ్నజితి శ్రీకృష్ణుని పొందగలిగింది అని గరుడపురాణంలో చెప్పారు. ఇంతకీ ఆమె పూర్వజన్మలో ఎవరు? ఏమి చేసిందో ఇప్పుడు తెలుసుకుందామా!

పూర్వజన్మలో నాగ్నజితి అగ్నిదేవుని కుమార్తె. ఆమెకు శ్రీమహా  విష్ణువును తప్ప మరెవరినీ వివాహంచేసుకోను అని చెప్పి తపస్సు చేస్తాను అని తన తండ్రిని కోరింది. అప్పుడు అగ్నిదేవుడు ఆమెను అలా చేయటానికి కారణం ఏమిటో అని అడిగాడు. ఆమె సర్వసద్గుణ సంపన్నుడు, మోక్షప్రదాత, నిత్యుడు అయినా శ్రీహరిని వివాహం చేసుకోవాలంటే ఏ స్త్రీయైన అనేక జన్మల పుణ్యమును కలిగిఉంటే తప్ప జరుగదు. కలియుగంలో ప్రజలు చాలా తక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు. వారికి విష్ణుభక్తి కలగటం చాలా అరుదు కనుక కలియుగం రాకముందే తాను శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకోవాలనుకుంది. కనుక ఆమె తపస్సు చేయటానికి బయలుదేరింది. 

ఆమె శేషాచలం కొండలను చేరుకుంది. అక్కడ కపిల తీర్ధం లో స్నానం చేసి, శ్రీనివాసుని సేవించుకుని, (ఈ కధ కలియుగమునకు ముందు, త్రేతాయుగంలో జరిగినది కదా! మరి అప్పటికే శ్రీనివాసుడు అక్కడ కొలువు తీరి ఉన్నాడా ? అని అనుమానించవలసిన అవసరం లేదు, కల్పము తరువాత మరొక కల్పం జరుగుతూ ఉంటాయి కనుక కపిల తీర్ధం, శేషాచలం మరియు శ్రీనివాసుడు త్రేతాయుగం సమయానికే అక్కడ ఉన్నారు )

ఆమె చేస్తున్న ఘోరమయిన తపస్సుకు సంతోషించి, శ్రీనివాసుడు ఆమెను తన శ్రీకృష్ణావతారంలో వచ్చి వివాహం చేస్కుంటానని వరం ఇచ్చాడు. ఆ తదుపరి జన్మలో ఆమె శ్రీకృష్ణుని ఎలా వివాహం చేసుకుందో మనం ఇంతకు  ముందే చెప్పుకున్నాం కదా! 

9, జనవరి 2022, ఆదివారం

నాగ్నజితి వివాహం

శ్రీ కృష్ణుని భార్యల గురించి మనం ఇంతకుముందు టపాలలో తెలుసుకున్నాం! వారిలో రుక్మిణి శ్రీకృష్ణుని ప్రేమించి, శిశుపాలుని వివాహం చేసుకోవలసిన సమయంలో శ్రీకృష్ణునికి లేఖరాసి, అతనిని వివాహం చేసుకుంది. సత్యభామ, జాంబవతి లను శ్రీకృష్ణుడు శమంతక మణి గురించిన విషయంలో వారిని వివాహం చేసుకున్నాడు. ఆ కథను మనం వినాయకచవితి కధలో చదువుకున్నాం! మిగిలిన వారిలో నాగ్నజితి ని శ్రీకృష్ణుడు ఎలా వివాహం చేసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం!
  కోసల దేశమునకు మహారాజు నాగ్నజిత్తు. అతని కుమార్తె నాగ్నజితికి వివాహం చేయటానికి నిర్ణయించుకుని, ఆ స్వయంవరం లో నాగ్నజితిని గెలుచుకోవాటానికి  ఏడు మదించిన ఎద్దులను సమకూర్చాడు. ఆ ఏడింటిని ఓడించిన వీరునికి తన కుమార్తెను ఇచ్చివివాహం చేస్తాను అని ప్రకటించాడు. కానీ నాగ్నజితి తన మనస్సులో శ్రీహరిని వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆప్ ఇషయం తెలుసుకున్న శ్రీ కృష్ణుడు అక్కడకు చేరుకున్నాడు. 
శ్రీకృష్ణుని కి ఎదురువెళ్ళి లోపలికి తీసుకువచ్చిన నాగ్నజిత్తు అతనికి సకల మర్యాదలు చేసాడు. అతని ఆతిధ్యమునకు సంతోషించిన శ్రీకృష్ణుడు అతని కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యమని కోరగా, నాగ్నజిత్తు అప్పటికే అతను ప్రకటించిన స్వయంవర షరతులను ప్రస్తావించాడు. 
అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఏడు ఎద్దులను ఓడించి, నాగ్నజితి ని వైభవంగా వివాహంచేసుకున్నాడు. ఆమెను తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఇంతకుముందు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుని ఆ స్వయంవరంలో ఓడిపోయినవారు అందరూ శ్రీకృష్ణునిమీద యుద్దానికి వచ్చారు. నాగ్నజితి కోసం శ్రీకృష్ణుడు వారందరిని ఓడించి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు.  

8, జనవరి 2022, శనివారం

శ్రీ కృష్ణుని ఎనిమిది మంది భార్యలు

శ్రీ కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు. వారి పేర్లు ఇప్పుడు చూద్దాం!  

భాగవత పురాణం ప్రకారం 

  1. రుక్మిణి 
  2. సత్యభామ 
  3. జాంబవతి 
  4. కాళింది 
  5. మిత్రవింద 
  6. నాగ్నజితి 
  7. భద్ర 
  8. లక్షణ 

6, జనవరి 2022, గురువారం

చెప్పుడు మాటలు విన్న దశకంఠుడు

 మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది, దశగ్రీవుడు నిజంగా అంత చెడ్డవాడా,  కైకసి కుమారులు  పొందిన వరముల గురించి తెలుసుకున్నాం కదా! 

వారు పొందిన వరముల గురించి తెలుసుకున్న వారి తాతగారు అయిన సుమాలి, అతని మంత్రులు మారీచుడు, ప్రహస్తుడు మొదలగు వారితో కలిసి వారి వద్దకు వచ్చాడు. తాము సాధించలేనిది తమ వంశంలో వారు సాధించినందుకు ఎంతో సంతోషించారు. వారి స్వార్థం తిరిగి రెక్కలు తొడిగింది. చెప్పిన మాటలను చక్కగా వినే దశగ్రీవుని తన మాటలతో రెచ్చగొట్టారు. 
లంక వారిదే కనుక, ప్రస్తుతానికి అక్కడ నివసిస్తున్న తన అన్నగారు అయిన వైశ్రవణుని అక్కడినుండి తరిమేయాలి అని, ఆ లంకను వారు సొంతం చేసుకోవాలని కోరారు. అంతే కాక అతనికి లభించిన 
పుష్పకం అనే విమానం యొక్క గొప్పదనం గురించి తెలుసుకుని దానిని కూడా సొంతం చేసుకోవాలని కోరారు. 
కానీ వారి మాటలు దశగ్రీవుడు అంగీకరించలేదు. 
వారు సమయానుసారంగా దశగ్రీవునికి ఆ మాటలు చెప్తూనే ఉన్నారు. ఆ మాటలు వినగా వినగా చివరకు దశగ్రీవునకు ఆ మాటలు రుచించసాగాయి. అప్పుడు అతను వైశ్రవణుని వద్దకు ఒక దూతని పంపాడు. ఆ దూత చేత ఆ లంకా నగరం తమది కనుక తమకు అప్పగించమని రాయబారం పంపాడు. 
తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆ లంకానగరాన్ని వదలి వెళ్ళటం ఇష్టం లేకున్నా, దశకంఠుని మూర్ఖత్వాన్ని గురించి తెలుసు కనుక, తన తండ్రి విశ్రవసువు సలహా మరియు సూచనల మేరకు వైశ్రవణుడు ఆ లంకను వదలి,పుష్పక విమానంతో పాటు కైలాసపర్వత ప్రాంతమునకు వెళ్లి అక్కడ తిరిగి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 

5, జనవరి 2022, బుధవారం

తెలిసిన వానికి చెప్పవచ్చు...

తెలిసిన వానికి చెప్పవచ్చు... తెలియని వానికి చెప్పవచ్చు కానీ తెలిసీ తెలియనివానికి చెప్పటం కష్టం  అని మన పెద్దలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా! ఇంతకీ ఆ మాటకు, ఆ సామెతకు మూలం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. 

ఈ విషయం  గురించి భర్తృహరి తన సుభాషితాలలో మూర్ఖ పద్దతి అనే ఘట్టం లో చెప్పాడు. ఆ శ్లోకం మీకోసం 

అజ్ఞ:సుఖమారాధ్యస్సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ:

జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి 

అర్ధం: 

అజ్ఞ: = తెలియనివానికి ; సుఖ = సుఖంగా,సులువుగా;  ఆరాధ్యః =సేవించవచ్చు/ బోదించ వచ్చు; విశేషజ్ఞ:= విషయము తెలిసిన వానికి; సుఖతరం= చాలా తేలికగా; ఆరాద్యతే= సేవింపవచ్చు, బోదించ వచ్చు; జ్ఞాన = తెలివి/విషయ పరిజ్ఞానం, లవ = కొంచెం కలిగి, దుర్విదగ్ధం= గర్వం కలిగిన ; నరం = నరునికి;  బ్రహ్మాపి = బ్రహ్మదేవుడయినా ;న రంజయతి = సమాధాన పరచలేడు. 

తాత్పర్యం: అసలు విషయ పరిజ్ఞానం లేని వానికి సులువుగా బోదించ వచ్చు, విషయము తెలిసిన వానికి చాలా తేలికగా చెప్పవచ్చు, కానీ కొంచెం విషయ పరిజ్ఞానం కలిగి మొత్తం తెలుసు అనుకునే గర్వం కలిగిన మనిషికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమి చెప్పలేడు.  

ఇదే విషయాన్ని మనం ఇప్పుడు చక్కని తెలుగు పద్యంలో చూద్దామా!

తెలియనిమనుజుని సుఖముఁగ 

దెలుపం దగు సుఖతరముగ  దెలుపఁగ వచ్చున్ 

దెలిసినవానిం  దెలిసియు 

దెలియని నరుఁ దెల్ప బ్రహ్మదేవుని వశమే