11, జనవరి 2022, మంగళవారం

నాగ్నజితి పూర్వజన్మ

 ముందు శ్రీకృష్ణుని ఎనిమిది మంది భార్యల పేర్లు తెలుసుకున్నాం! వారిలో నాజ్ఞజితిని ఎలా వివాహం చేసుకున్నాడో తెలుసుకున్నాం! 

పూర్వాజన్మలో ఎంతోపుణ్యం చేసుకున్నందువల్లనే నాగ్నజితి శ్రీకృష్ణుని పొందగలిగింది అని గరుడపురాణంలో చెప్పారు. ఇంతకీ ఆమె పూర్వజన్మలో ఎవరు? ఏమి చేసిందో ఇప్పుడు తెలుసుకుందామా!

పూర్వజన్మలో నాగ్నజితి అగ్నిదేవుని కుమార్తె. ఆమెకు శ్రీమహా  విష్ణువును తప్ప మరెవరినీ వివాహంచేసుకోను అని చెప్పి తపస్సు చేస్తాను అని తన తండ్రిని కోరింది. అప్పుడు అగ్నిదేవుడు ఆమెను అలా చేయటానికి కారణం ఏమిటో అని అడిగాడు. ఆమె సర్వసద్గుణ సంపన్నుడు, మోక్షప్రదాత, నిత్యుడు అయినా శ్రీహరిని వివాహం చేసుకోవాలంటే ఏ స్త్రీయైన అనేక జన్మల పుణ్యమును కలిగిఉంటే తప్ప జరుగదు. కలియుగంలో ప్రజలు చాలా తక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు. వారికి విష్ణుభక్తి కలగటం చాలా అరుదు కనుక కలియుగం రాకముందే తాను శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకోవాలనుకుంది. కనుక ఆమె తపస్సు చేయటానికి బయలుదేరింది. 

ఆమె శేషాచలం కొండలను చేరుకుంది. అక్కడ కపిల తీర్ధం లో స్నానం చేసి, శ్రీనివాసుని సేవించుకుని, (ఈ కధ కలియుగమునకు ముందు, త్రేతాయుగంలో జరిగినది కదా! మరి అప్పటికే శ్రీనివాసుడు అక్కడ కొలువు తీరి ఉన్నాడా ? అని అనుమానించవలసిన అవసరం లేదు, కల్పము తరువాత మరొక కల్పం జరుగుతూ ఉంటాయి కనుక కపిల తీర్ధం, శేషాచలం మరియు శ్రీనివాసుడు త్రేతాయుగం సమయానికే అక్కడ ఉన్నారు )

ఆమె చేస్తున్న ఘోరమయిన తపస్సుకు సంతోషించి, శ్రీనివాసుడు ఆమెను తన శ్రీకృష్ణావతారంలో వచ్చి వివాహం చేస్కుంటానని వరం ఇచ్చాడు. ఆ తదుపరి జన్మలో ఆమె శ్రీకృష్ణుని ఎలా వివాహం చేసుకుందో మనం ఇంతకు  ముందే చెప్పుకున్నాం కదా! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి