మహాభారతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మహాభారతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మార్చి 2022, బుధవారం

నల దమయంతుల వివాహం అందరికి సంతోషకారకం అయ్యిందా?

మనం ఇంతకు ముందు దమయంతి నల మహారాజుల వివాహం గురించి,  ఆ వివాహానికి దేవతలు రావడం, వారిని పరిక్షించి,వారికి వరములను ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత వారి  జీవితంలో సంభవించిన మార్పులను గురించి ఇప్పుడు చూద్దాం! 

ఇంద్రాది దేవతలు స్వయంవరం అయిన తరువాత ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా వారికి ద్వాపర, కలి యుగములు భౌతిక దేహముతో పురుషుల వలే ఎదురు వచ్చారు. వారిని చుసిన దేవతలు వారిని ఆపి ఎక్కడకు బయలుదేరారు అని అడుగగా వారు దమయంతి స్వయంవరం లో పాల్గొనడానికి వెళ్తున్నామని చెప్పారు. వారిద్దరిలో కూడా కాళీ అత్యంత ఉత్సాహంగా ఉండడాన్ని గమనించిన దేవతలు వారికి ఆ స్వయంవరం పూర్తి అయినది అని చెప్పారు. ఆ మాటలు విన్న ఆ ఇద్దరు యుగ పురుషులు నిరాశ చెందారు. కానీ దేవతలు అంతటితో ఆగకుండా ఆ దమయంతి నలుని తప్ప దేవతలను కూడా వివాహం చేసుకోనని చెప్పిందని, దానికి ప్రముఖ మయిన కారణం నలుని ధర్మ పరాయణత అని చెప్పిన మాటలు వారు చెప్పారు. 

ఆయా మాటలను విన్న  కలి  కి ఆవేశం వచ్చింది.నలునిలో ఉన్న ఏ ధర్మదక్షతను ఆమె అతనిని వరించిందో ఆ ధర్మమునకు నలుని దూరం చేస్తాను అని కలి ప్రతిజ్ఞ చేసాడు. 

అలా కాళీ చేసిన ప్రతిజ్ఞ కు ద్వాపరుడు కూడా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. 

మరి వారు నలుని నిజంగా ధర్మ బ్రష్టుని చేశారా? లేదా? చేస్తే ఎలా చేయ గలిగారు? దాని వలన నల దమయంతిల జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అని తరువాతి టపా లలో చూద్దాం!

15, మార్చి 2022, మంగళవారం

నలుడు, దమయంతిల వివాహం

మనం ఇంతకుముందు దమయంతి స్వయంవరమునకు దేవతలు వచ్చారని, వారు నలుని దమయంతి వద్దకు రాయభారానికి పంపారని, ఆ రాయబారాన్ని తీసుకుని నలుడు దమయంతి దగ్గరకు వెళ్ళడం గురించి చెప్పుకున్నాం!

నలుడు దమయంతి సమాధానాన్ని దేవతలకు చెప్పాడా? వారు స్వయంవరమునకు ఎలా వచ్చారు?ఆ తరువాత స్వయంవరం ఎలా జరిగింది?  అని ఇప్పుడు తెలుసుకుందాం!

దమయంతి సమాధానమును నలుడు దిక్పాలకులయిన దేవతలకు తెలియజేసాడు. దమయంతి సమాధానమును విన్న దేవతలు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు, కానీ వారు దమయంతి స్వయం వరమునకు తప్పకుండా రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దిక్పాలకులు నలుగురు (ఇంద్ర,వరుణ,అగ్ని మరియు యమధర్మరాజు) ఆ స్వయంవరమునకు నలుని రూపంలో వచ్చారు.

ఆ స్వయంవరమండపం లో అన్ని రాజ్యముల నుండి రాజులు వచ్చారు. వారిలో కొందరు కేవలం ఆమెను చూడడానికి మాత్రమే వచ్చారు. దమయంతి తన చేతిలో వరమాలతో ఆ మండపం లోనికి వచ్చింది. ఆఅమె పక్కన ఉన్న చెలికత్తెలు ఆమెకు ఒకొక్క రాజు గొప్పతనమును చెబుతూ వస్తున్నారు. అలా వస్తున్న వారికి ఒక దగ్గర ఐదుగురు నల మహారాజులు కనిపించారు. అప్పుడు చెలికత్తెలకు ఏమి చెప్పాలో అర్ధంకాలేదు. దమయంతికి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉంది. ఆమెకు అక్కడ ఉన్న ఐదుగురిలో ఒక్కడు నలుడు ఆని మిగిలిన వారు దేవతలు అని తెలుసు కనుక ఆమె వారిని మనస్సులోనే ప్రార్ధించడం మొదలుపెట్టింది. వారిలో మానవుడయిన నలుడు ఎవరో తెలుసుకొనగలిగే ఉపాయమును చెప్పమని కోరుకున్నది. ఆమె దృడసంకల్పానికి సంతోషించిన దేవతలు నిజమయిన నలుని పాదములు భూమిని తాకుతూ ఉంటాయని ఆమెకు స్పురించింది. ఆమె అక్కడ ఉన్న ఐదుగురు నలమహారాజులను గమనించింది. ఆ ఐదుగురిలో కేవలం ఒక్కరి పాదములు మాత్రమే నేలను తాకుతూ ఉన్నాయి. మిగిలిన నలుగురి పాదములు భూమిని తాకకుండా ఉన్నయి. అప్పుడు దమయంతి తన వరమాలను నలుని మెడలో వేసింది. 

వారి వివాహాన్ని చూసి సంతోషించిన ఇంద్రుడు, నల మహారాజు చేసే ప్రతి యజ్ఞమునకు స్వయంగా వచ్చి హవిర్భాగమును స్వీకరిస్తానని, అగ్నిదేవుడు నలుని కోరికపై అతను ఎక్కడ కావాలంటే అక్కడకు వస్తానని, వరుణుడు కూడా నలుని కోరికపై ఎక్కడికి అయినా వస్తానని, యమధర్మరాజు నలుని మనస్సు ఎల్లవేళలా ధర్మం పైననే నిలచేలా చేస్తానని వరములు ఇచ్చారు. 

4, మార్చి 2022, శుక్రవారం

దమయంతి స్వయంవరం ఎలా సాధ్యం?

మనం ఇంతకుముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావం నుండి తప్పించ గలిగిన శ్లోకం గురించి,  నలుని గురించి, దమయంతి గురించి,  స్వయంవరానికి బయలు దేరిన నలునికి దేవతలు ఎదురయినప్పుడు నలుడు వారికి ముందుగానే మాట ఇవ్వడం గురించి, నలుడు వెళ్ళి దమయంతిని కలిసి, దేవతల తరపున దూతగా వచ్చిన విషయము గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు దమయంతిదేవి నిర్ణయం గురించి తెలుసుకుందాం!

నలుని మాటలను విన్న దమయంతి అత్యంత ఆవేదన చెందింది. తాను ఎంతగానో ప్రేమించే నలుడు తన వద్దకు ఇటువంటి ప్రస్థావన తీసుకురావడం ఆమెకు అత్యంత బాధ కలిగించింది. ఆమె నలునితో తాను అతనినే వరించానని, హంస రాయభారం పంపి, ఇప్పుడు ఈ విధంగా మరొకరిని వివాహం చేసుకొమ్మని చెప్పడం భావ్యం కాదు అని,  స్త్రీ కి ఉండే సహజ బేలతనం కారణంగా ఆమె కన్నీరు పెట్టుకుంది. అతనినే తన భర్తగా 

 నలుని దౌత్యము విఫలం కాకుండా ఏ మార్గంలో తను నలుని వివాహం చేసుకోవాలో నిర్ణయించికుంది. ఆమె కధనం ప్రకారం ఒక దూత తను చెప్ప వలసిన విషయము చెప్పడం మాత్రమే అతని భాద్యత. నలుడు దూతగా తన భాద్యత పూర్తి చేసాడు. అతని మాటలను పూర్తిగా పాటించ వలసిన అవసరం దమయంతికిలేదు. కనుక ఆమె స్వయంవరంలో నలుడిని మాత్రమే వరిస్తాను అని చెప్పింది. 

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

నల దమయంతి ల పరిచయం

మనం ఇంతకుముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావం నుండి తప్పించ గలిగిన శ్లోకం గురించి,   నలుని గురించి, దమయంతి గురించి,  స్వయంవరానికి బయలు దేరిన నలునికి దేవతలు ఎదురయినప్పుడు నలుడు వారికి ముందుగానే మాట ఇవ్వడం గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు ఆ సంక్లిష్ట పరిస్థితి నుండి ఎలా బయట పడ్డాడో చూద్దాం!
    ఇంద్రాది దేవతల మాటలు విన్న నలుడు ఆశ్చర్యమునకు గురి అయ్యాడు. తాను కూడా అదే స్వయంవరమునకు బయలుదేరానని చెప్పాడు. అలా ఒకే స్వయంవరమునకు వెళ్తున్న తనతో ఆ రాకుమారి వద్దకు దేవతలను వివాహం చేసుకోవాలని ప్రస్థావన తీసుకుని దౌత్యం చేయడం సమంజసం గా ఉండదు అని తన భావన దేవతలకు వివరించాడు. 
కానీ ఇంద్రాదిదేవతలు అతనిని పరీక్షించడానికే అక్కడికి వచ్చారు కనుక వారు నలుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాడానికే నిర్భందించారు. ధర్మనిరతుడయిన నలుడు దమయంతి దగ్గరకు దేవతల తరపున దూతగా వెళ్ళాల్సిన పరిస్థితి తప్పలేదు. 
అప్పుడు నలునికి మరొక సందేహం కలిగింది. దమయంతి ఒక రాకుమార్తె. ఆమె స్వయంవరమును కూడా ప్రకటించిన ఈ సందర్భంలో ఆమె మందిరంలో కాపలా కొరకు భటులు నిరంతరం ఉంటారు వారిని ఏమార్చి ఆమెవద్దకు ఎలా చేరుకోవాలి? అని. ఆ సమస్యకు దేవతలే ఉపాయం అందించారు. అతను విదేహ రాజ్యములోని దమయంతి రాజ భవనము/ అంతఃపురం ప్రవేశించే సమయంలో అతనిని దేవతల కృపవలన ఎవ్వరూ అడ్డుకొనరు అని దేవతలు వరం ఇచ్చారు. 
ఆ వర ప్రభావం కారణంగా నలుడు సులభంగా దమయంతీదేవి అంతఃపురాన్ని చేరుకున్నాడు. ఆ అంతఃపుర శోభను చూస్తూ ముందుకు నడిచాడు. అతను దమయంతిని చూశాడు. ఆమె అతనిని చూసి ఆశ్చర్యపోయింది. తన అంతఃపురంలోనికి రావడానికి ఎంత ధైర్యం? నలుని రూపలావణ్యముల గురించి ఇంతకు ముందు విని ఉండుట వలన, ఆమె అతని రూపమును చూసి భటులను పిలవకుండా మాట్లాడడం మొదలు పెట్టింది.
అతనికి ఇంతకు ముందు హంస వివరించిన దాని కంటే దమయంతి అతనికి అత్యంత సుందరంగా కనిపించింది.  అతను తనను తాను అమెకు పరిచయం చేసుకున్నాడు. అతను అక్కడికి వచ్చిన కారణం కూడా ఆమెకు వివరించాడు. 
ఇప్పుడు ధర్మసంకటంలో దమయంతి పడింది. ఆమె తాను కోరుకున్న నలుని వివాహం చేసుకుంటే, అతను సరిగా దూత పని చేయలేదన్న అపకీర్తి వస్తుంది, అలాగని ఆమె దేవతలలో ఒకరిని వివాహం చేసుకోలేదు.
మరి ఆమె స్వయంవరం ఎలా జరిగింది? ఆమె నలునికి ఏమి సమాధానం చెప్పి పంపింది? నలుడు దేవతలకు ప్రియంగా దూత కార్యమును చేసినట్లుగా ఎలా అనుకోవాలి? తరువాతి టపాలలో చుద్దాం!

23, ఫిబ్రవరి 2022, బుధవారం

ఇంద్రాది దేవతలు నలునికి వేసిన ముందరికాళ్ళ బంధం!

మనం ఇంతకు ముందు నలుని గురించి, దమయంతి గురించి, వారి మద్యన జరిగిన హంస రాయభారం గురించి తెలుసుకున్నాం కదా! ఆ తరువాత భీమసేనుడు తన కుమార్తె దమయంతికి స్వయంవరం ప్రకటించారని కూడా చెప్పుకున్నాం!

స్వయంవరానికి భీముడు సకల రాజ్యములకు చెందిన రాజులను అహ్వానించాడు. అందరు రాజులు ఆ స్వయంవరానికి వచ్చేసారు. 

ఆ సమయంలోనే నారదుడు ఆ దమయంతి స్వయంవర వార్తను తీసుకుని స్వర్గమునకు వెళ్ళాడు. దమయంతి సౌందర్యమును, గుణవర్ణనము విన్న తరువాత దేవేంద్రునితో కలిసి అందరు దిక్పాలకులు ఆ స్వయంవరమును చూడడానికి బయలుదేరారు. వారికి నారదుని వలన దమయంతికి సరి అయిన వరుడు నలుడు అని తెలుసుకున్నారు. వారు నలుని ధర్మనిరతిని పరిక్షించాలని అనుకున్నారు. 

వారు స్వయంవరానికి వెళ్తున్న నలునికి ఎదురు వచ్చారు. వారు నలుని చూసి తమను తాము పరిచయం చేసుకోకుండానే తమకు నలునివల్ల ఒక సహాయం కావాలని, నలుడు వారి తరపున దూతగా వెళ్ళాలని కోరుకున్నారు. వారు ఎవరో తెలుసుకోకుండానే వారికి సహాయం  చేస్తాను అని, దూతగా వారి అభీష్టం నెరవేరుస్తాను అని మాట ఇచ్చేసాడు. 

అప్పుడు దేవతలు నలునితో ఇంద్రుడు, తాను ఇంద్రుడననీ, తనతో ఉన్న వారు దిక్పాలకులనీ, వారు దమయంతీదేవి స్వయంవరమునకు వచ్చామనీ, కనుక నలుడు వారి తరపున ఆమె వద్దకు వెళ్ళి, వారి గొప్పతనములను, బిరుదులను, వారి వారి శౌర్య ప్రతాపాలను వివరించి చెప్తే ఆమె వారిలో ఎవరినైనా వివాహం చేసుకొనుటకు అవకాశం దొరుకుతుంది కనుక నలుడిని అలా దౌత్యం జరుపమని కోరుకున్నాడు. 

తాను ప్రేమించి, వివాహం చేసుకోవాలని అనుకున్న అమ్మాయి వద్దకు మరొకరి గురించి దౌత్యం చేయడానికి నలుడు ఒప్పుకున్నాడా? అలా ఒప్పుకోకుండా మాట తప్పాడా? తరువాతి టపాలలో చుద్దాం!

19, ఫిబ్రవరి 2022, శనివారం

దమయంతి -- హంస

మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన,  నలునికి హంస దొరకడం గురించి, ఆ హంస దమయంతికి అతని గురించి చెప్తాను అని చెప్పడం గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు దమయంతి గురించి తెలుసుకుందాం!
విదర్భరాజు భీముడు, అతని భార్య కు సంతానం లేదు. వారు దమనుడు అనే మహర్షికి అనేక సపర్యలు, సేవలు చేసి అతని అనుగ్రహాన్ని సంపాదించారు. అప్పుడు వారికి దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కుమారులు, దమయంతి అని ఒక కుమార్తె కలిగారు. ఆమె అపురూప సౌందర్యవతి, గుణశీలి. ఎలావేళలా ఆమెను కనిపెట్టుకుని ఉండడానికి అమె చుట్టూ అనేకమంది పరిచారికలు ఉండేవారు. వారు నలుని గురించి అనేక విషయములు చెప్తూ ఉండేవారు. వారి వద్ద నుండి నలుని ప్రసంశలు విన్న దమయంతి మనస్సులో నలునిపై ప్రేమ చిగురించింది. 
ఆ సమయంలోనే నలుని దగ్గరి నుండి వచ్చిన హంసల గుంపు ఆమె ఉన్న ఉద్యానవనమునకు వచ్చింది. ఆ హం స ల గుంపును చూసిన ఆమె చెలికత్తెలు వానిని పట్టుకోవాలని ప్రయత్నించసాగారు. అక్కడ జరుగుతున్న కోలాహలం వల్ల హంసలు అటూ ఇటూ పరుగులు పెడుతూ వారికి దొరకకుండా తప్పించుకోసాగాయి. కానీ నలునితో మాట్లాడిన హంస తనకు తానుగా వచ్చి దామయంతీదేవి కి దొరికిపోయింది. అంతేకాక ఆ హంస నలుని ప్రస్తావన తెచ్చి, ఈ భూమండలంమొత్తం మీద ఆమెకు భర్త కాగలిగిన సుందరుడు, రాఅజ కుమారుడూ కేవలం నలుడు మాత్రమే అని అనేక విధములుగా చెప్పింది. ముందే నలుని గురించి ఆలోచనలలో ఉన్న దమయంతికి ఇప్పుడు హంస కూడా అలాగే చెప్పడమ్ వల్ల ఆమె మరింతగా అతని ఆలోచనలలో మునిగిపోయింది. ఆమె చెలికత్తెల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆమె తండ్రి భీముడు ఆమెకు స్వయంవరాని ఏర్పాటు చేసాడు. 
మరి ఆమె తనకు నచ్చిన వరుడిని స్వయంవరంలో వరించిందా? ఆ స్వయంవరం ఎంత విచిత్రంగా జరిగింది? అనే విషయాలు తరువాతి టపాలలో చుద్దాం!

10, ఫిబ్రవరి 2022, గురువారం

నలుడు -- హంస

 మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన చూశాం! మరి ఆ నలుడు ఎవరు? అతనికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉన్నది? అని ఇప్పుడు తెలుసుకుందాం!

నిషాద రాజ్యమునకు రాజు వీరసేనుడు. అతని కుమారుడు నలుడు. నలునికి విదర్భ రాజ పుత్రిక అయిన దమయంతి గురించి అనేక విషయములు తెలుస్తూ ఉండుటవలన ఆమె అంటే అతనికి ప్రేమ కలిగింది. 
ఒకరోజు నలుడు తన ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అతనికి ఆకాశంలో తిరుగుతున్న హంసల గుంపు కనిపించింది. వానిని వెంబడిస్తూ వెళ్ళిన అతను ఒక హంసను పట్టుకున్నాడు. మిగిలిన హంసలు అక్కడి నుండి ఎగిరి పోయాయి కానీ ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. 
నలునికి పట్టుబడిన హంస అతని మనస్సులో ఉన్న దమయంతి పై ప్రేమను గమనించి, నలుడు ఇప్పుడు తనను వదిలితే తను వెళ్ళి దమయంతికి అతని గురించి గొప్పగా చెప్తానని మాట ఇచ్చింది. దమయంతి పేరు విన్న నలునికి తిరిగి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేకుండానే ఆ హంసను వదలి పెట్టాడు. ఆ తరువాత ఆ హంస నిజంగా దమయంతి దగ్గరకు వెళ్ళిందా లేదా? వెళితే ఏమి చెప్పింది? దమయంతికి నలుని పైన ప్రేమ కలిగిందా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

28, జనవరి 2022, శుక్రవారం

కలికాల ప్రభావాన్ని తప్పించుకునే మార్గం

 మనం ఇంతకు ముందు కలి ప్రభావం, కలికాలంలో మానవుని లక్షణముల గురించి తెలుసుకున్నాం కదా!

ఇప్పుడు ఆ కలి ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఒక సులభమయిన మార్గం గురించి చెప్పుకుందాం!

ఈ మార్గన్ని స్వయంగా వ్యాసభగవానుడే మహాభారతంలో అరణ్యపర్వంలో చెప్పాడు. మనం ఇప్పుడు వ్యాసుడు చెప్పిన సంస్కృత శ్లోకం, దాని కవిత్రయ భారతంలోని తెలుగు అనువాదం కూడా చెప్పుకుందాం!

శ్లోః 

కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ

ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం

 తెలుగు అనువాదంః

కర్కోటకుని, దమయంతి, బుణ్యమూర్తియైన నలుని

ఋజు చరిత్రుడైన ఋతుపర్ణు గీర్తింప గలిభయంబు లెల్ల గ్రాగు నధిప

భావంః కర్కోటకుడు అనే పాము, భార్యాభర్తలయిన నల దమయంతుల గురించి, రఘువంశజుడయి మంచి ప్రవర్తన కలిగిన ఋతుపర్ణుడు అనే రాజుని నిరంతరం తలుచుకొనుట వలన కలి వలన కలిగే భయములు అన్నీ తొలగుతాయి. 

విశ్లేషణ

ఈ శ్లోకమును వ్యాసుడు నలదమయంతుల కధకు ఫలశ్రుతిగా చెప్పాడు. వీరి కధ అనేక మలుపులతో ఆసక్తి దాయకంగా ఉంటుంది. ఎంతో అన్యోన్య దాంపత్యమునకు ఉదాహరణగా నలదమయంతులు, వారు విడిపోయిన సమయంలో దమయంతి చూపిన మనోధైర్యం, నలుడు తాను  దూరమయితే తన భార్య పుట్టింటికి వెళ్ళి సంతోషిస్తుంది అనే త్యాగం, తనకు ఉపకారం చేసిన వ్యక్తికి అపకారం రూపంలో ఉపకారం చేసిన కర్కోటకుడు, తాను ఒక రాజు అయ్యి ఉండీ తన వద్ద పనిచేసే ఒక వ్యక్తికి ఎలా మర్యాద ఇవ్వలి, ఒక విషయం వారి వద్ద నేర్చుకున్నప్పుడు వారికి తిరిగి ప్రత్యుపకారం ఎలా చేయాలి అని ఋతుపర్ణుని వద్ద మనం నేర్చుకోవలసిన పాఠములు. ఈ విషయములు అన్నీ మనం అర్ధం చేసుకోగలిగినప్పుడు, కలి అనే విషప్రభావం నుండి మనం బయట పడగలుగుతాము.

ఈ పాఠములు మనం రాబోయే టపాలలో తప్పకుండా నేర్చుకుందాం!

27, జనవరి 2022, గురువారం

చ్యవన మహర్షి - అశ్వినీదేవతలు

మనం ఇంతకు ముందు చ్యవన మహర్షి గురించి, అతని వివాహం సుకన్యతో జరగటం గురించి, సుకన్యకు అశ్వినీ దేవతలు ఇచ్చిన వరం గురించి తెలుసుకున్నాం కదా! 
మరి వారు సుకన్య కోరికను మన్నించారా లేదా తెలుసుకుందాం!
సుకన్య మాటలు  విన్న అశ్వినీదేవతలు ముసలివాడయిన చ్యవన మహర్షిని తీసుకుని దగ్గరలోని కొలనులో మునిగారు. కొంతసేపటికి ఆ కొలనులోనుండి  అత్యంత సుందరమయిన, ఒకేరూపం కలిగిన ముగ్గురు యువకులు బయటకు వచ్చారు. వారిలో ఇద్దరు అశ్వినీ దేవతలుగాను, ఒకరు తన భర్త చ్యవనుని గాను సుకన్య గ్రహించింది. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని వారించమని వారు కోరగా, ఆమె తన భర్తనే తిరిగి వరించింది. 
 సహాయమునకు ప్రతిఫలంగా చ్యవన మహర్షి, యజ్ఞములలో దేవతలకు లభించే సురాపానం సేవించే అర్హతను వారికి కలుగజేస్తాను అని మాట ఇచ్చాడు. 
ఇప్పటి వరకు అశ్విని కుమారులను మనం అశ్వినీదేవతలు అని చెప్పుకున్నాం కదా! మరి వారికి దేవతలతో సమానంగా యజ్ఞములలో సురాపానం అర్హత ఎందుకు లేదు? వారి కి అలా అర్హతలేకుండా పోవటానికి వారు చేసారు? తరువాతి టపాలలో నేర్చుకుందాం. 

24, జనవరి 2022, సోమవారం

చ్యవన మహర్షి - సుకన్య

 మనం ఇంతకుముందు భృగుపుత్రుడయిన చ్యవన మహర్షి గురించి,  అతను శర్యాతి పుత్రిక సుకన్యను వివాహం చేసుకున్న సందర్భాన్ని  కదా! ఇప్పుడు ఆ తరువాత జరిగిన సంగతులు తెలుసుకుందాం!

అత్యంత కోప స్వభావం కలిగిన  చ్యవనుని రాజపుత్రిక సుకన్య వివాహం చేసుకున్న తరువాత,  మారిపోయింది. ఎంతో ఓర్పుతో,  సహనంతో ఆమె పర్ణశాలలో జీవనం సాగించింది. భర్త అనురాగమును పొందింది. అలా కొంతకాలం గడచిపోయింది. 

ఒకరోజు చ్యవన మహర్షి ఆశ్రమం దగ్గరకు అశ్వినీ దేవతలు వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమె ఎవరు అని అడిగారు. ఆమె  పుత్రికను అని,చ్యవన మహర్షి భార్యను అని చెప్పింది. ఆమె మాటలు విన్న అశ్వినీదేవతలు అంతముసలి వానితో జీవనం సాగించటం ఎందుకు? ఆమె సౌందర్యానికి తగినట్లుగా మంచి యౌవ్వనం కలిగిన వీరుని వరించుకొమ్మని,కావాలంటే వారే అతనిని తీసుకుని వచ్చి ఆమెకు అతనితో వివాహం చేస్తామని చెప్పారు. 

 వారి మాటలు విన్న సుకన్య, తాను చ్యవన మహర్షితో ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పి, వారిని వారించి తన భర్త దగ్గరకు వెళ్లి జరిగిన సంగతి అంతా విన్న చ్యవన మహర్షి ఆమెను వెళ్ళి ఆ అశ్వినీ దేవతలను వరం కోరుకొమ్మని సలహా ఇచ్చారు. భర్త కోరిక మేరకు తిరిగి ఆ అశ్వినీ దేవతలా వద్దకు వెళ్లి ఆమె భర్తనే (చ్యవన మహర్షినే) యవ్వనం కలిగినా వానిగా చేయమని కోరుకుంది. 

ఆమె కోరిక తీరిందా? అశ్వినీ దేవతలు నిజంగా ఆమెకు సహాయ చేయగలిగారా? తిరిగి ఏమి పొందారు అని తరువాతి టపాలలో చూద్దాం!

22, జనవరి 2022, శనివారం

చ్యవన మహర్షి

చ్యవన మహర్షి భృగుమహర్షి కుమారుడు. ఇతని ప్రస్తావన మనకు భాగవతం మరియు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. 
శర్యాతి అనే మహారాజు ఒకసారి తనసైన్యంతో, కుటుంబంతో వనములలోనికి మహర్షుల సేవకోసం వెళ్లారు. కొన్ని రోజుల తరువాత వారి సైన్యంలోనివారికి మలమూత్రస్థంభన జరిగింది. సైన్యం మొత్తం బాధింపబడటం చుసిన శర్యాతికి అలా జరగటానికి కారణం తెలియలేదు. 
అప్పుడు అతని కుమార్తె సుకన్య అంతకు ముందు రోజు జరిగిన సంగతి చెప్పింది. 
ముందురోజు ఆమె తన స్నేహితురాళ్లతో కలసి వనవిహారమునకు వెళ్ళింది. అప్ప్పుడు ఒక చెట్టు మొదట్లో ఒక పెద్ద పుట్ట కనిపించింది. ఆ పుట్టాను దగ్గరగా చూడాలన్న కుతూహలంతో సుకన్య అక్కడికి వెళ్ళింది. ఆ పుట్టలో నుండి ఆమెకు రెండు చిన్న మెరుపులు కనిపించాయి. మిణుగురు పురుగులేమో అనుకుని, అవునోకాదో చూడాలనుకుని ఒక కర్రపుల్లతో వానిని పొడిచింది. అయితే ఆ పోటుకు అక్కడినుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తాన్ని చూసి భయపడిన సుకన్య తిరిగి వచ్చేసింది. 
ఇప్పుడు తమ సైన్యం పడుతున్న బాధలను చూసి తన తండ్రికి విషయం చెప్పింది. ఈ విషయం విన్న శర్యాతి తిరిగి వనంలో తన కుమార్తె చెప్పిన ప్రదేశమునకు వెళ్లి  జరిగిందో తెలుసుకుని బాధపడ్డాడు. 
తన కూతురు పొడిచిన ఆ రెండు మిణుగురులు చ్యవన మహర్షి కన్నులు. ఆ మహర్షికి బాధను కలిగించిన కారణంగానే వారి సైన్యమునకు కష్టములు వచ్చాయి అని తెలుసుకుని, చ్యవన మహర్షిని క్షమాపణ కోరుకున్నాడు శర్యాతి. 
జరిగిన తప్పుకు ప్రాయఃచిత్తంగా తన కుమర్తె సుకన్యను అతనికి ఇచ్చి వివాహం చేసాడు. 
ఆ తరువాత సుకన్య జీవితం ఎలా ఉంది, ఏం జరిగింది అని తరువాతి టపాలో చూద్దాం!

21, డిసెంబర్ 2021, మంగళవారం

అష్టవసువులు

మనం  ఇంతకు ముందు నక్షత్రముల అధిపతుల గురించి, నందిని ధేనువు గురించి చెప్పుకున్న సందర్భంలో మనం  అష్టవసువులు గురించి విన్నాం! ఇంతకీ ఈ అష్టవసువులు ఎవరు?

వీరి పేర్లు గురించి అనేక సందర్భాలలో అనేక రకములుగా చెప్పినా, మహాభారతంలోని ఆదిపర్వంలో చెప్పిన ఈ కింది శ్లోకంలో వారి పేర్లు చెప్పారు

ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలో అనలః

ప్రత్యూష శ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః  

  1. ధరుడు 
  2. ధ్రువుడు 
  3. సోముడు 
  4. అహస్సు 
  5. అనిలుడు 
  6. అనలుడు 
  7. ప్రత్యూషుడు 
  8. ప్రభాసుడు 

7, జూన్ 2020, ఆదివారం

ముంగీస -ధర్మరాజు అశ్వమేధయాగం - శాప విమోచనం

మహాభారత యుద్ధం అయిపోయిన తరువాత యుద్ధంలో విజయం సాధించిన పాండవులు అశ్వమేధయాగం చేశారు. ఆ యాగమును అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా చేశారు. ఆ యాగమును చూడటానికి వచ్చినవారందరికీ వారు అత్యంత గొప్పవయినా దానాలు చేశారు. అలా రత్నములు, మణులు దానాలు తీసుకున్న రాజులు బ్రాహ్మణులూ వానిని మోయలేక మోయలేక వారి వారి ఇళ్లకు తీసుకెళుతూ ఉన్నారు. ఆ సమయంలో అన్నదానం కూడా జరుగుతోంది.
అలా వివిధములయిన దానములు తీసుకున్న బ్రాహ్మణులు ఒక చోట కొందరు గుంపుగా నిలబడి ఆ పాండవుల ధర్మనిరతని మెచ్చుకుంటూ, వారు చేసిన ఆ అశ్వమేధయాగాన్ని కీర్తిస్తూ, ఇంతగొప్ప దానములు చేసాడు అని మాట్లాడుకుంటూ ఉండగా!
అక్కడే చాటుగా సంచరిస్తున్న వింతగా  సగం దేహం బంగారు కాంతితో మెరిసిపోతున్న ఒక ముంగీస వచ్చి, ఈ అశ్వమేధయాగం ఎంతమాత్రమూ సక్తుప్రస్తుని త్యాగానికి, ధర్మానికి సరితూగదు అని చెప్పింది. ఆ మాటలు విన్న బ్రాహ్మణులూ ఆశ్చర్యపోయి ఆ సక్తుప్రస్తుని కథను తెలుసుకుని ఆనందించారు.  అంతేకాక సక్తుప్రస్తుడు చేసిన దాన విశేషణ ఫలముగా ముంగీసకు సగం దేహం బంగారు వర్ణం కలిగింది. మరి పాండవులు చేసిన అశ్వమేధ యాగ ప్రాంగణంలో ఆ ముంగీస మిగిలిన దేహం బంగారు మాయం కాలేదు కనుక ఆ బ్రాహ్మణులుకూడా ఆ ముంగీస మాటలతో ఏకిభవించారు.
దానికి కారణం కూడా మనకు మహాభారతం లో చెప్పారు. అశ్వమేధయాగం అనేది అశ్వమును వినియోగించి చేస్తారు. అంటే జంతువును హింసిస్తారు. కానీ సక్తుప్రస్తుడు, అతని కుటుంబం చేసిన దానము అహింస అనే పునాది మీద జరిగినది. కనుక ఎల్లప్పుడూ హింసకంటే అహింస ఎంతో గొప్పది.
అలా అక్కడ ఉన్న బ్రాహ్మణులు ముంగీస చెప్పిన మాటలు అంగీకరించారో అప్పుడు ఆ ముంగీసకు ఉన్న శాపవిమోచనం కలిగి ఆనందిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. 

5, జూన్ 2020, శుక్రవారం

సక్తుప్రస్తుని దానం - ఫలం

మనం ఇంతకుముందు మానవుడు తప్పని సరిగా చేయవలసిన పంచమహాయజ్ఞముల గురించి తెలుసుకున్నాం కదా! దానిలో అతిధి యజ్ఞం అద్భుతంగా చేసిన ఒక బ్రాహ్మణుని కధ ఇప్పుడు చూద్దాం!
పూర్వాకాలంలో కురుక్షేత్రం ప్రాంతంలో సక్తుప్రస్తుడు అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి కోరికలు ఏమీలేవు. అతనితో పాటుగా అతని భార్య, కొడుకు ,కోడలు కూడా అదేవిధమయిన భక్తి వైరాగ్యములు కలిగి ఉండేవారు. వారు ఉంచ్చవృత్తి చేస్తూ జీవించేవారు. వారు కేవలం పొలంలో రాలిన, ఎవ్వరూ ఆశించని ధాన్యమును ఏరుకుని తెచ్చుకుని దానిని మాత్రమే తిని జీవిస్తారు.
ఒకసారి వానలు సరిగా పడక పంటలు సరిగా పండక, ఆ ప్రాంతంలో కరువు సంభవించింది. వీరికి ఆహారం దొరకటం చాలా కష్టం అయ్యిపోయింది. వారు నలుగురు తెచ్చిన ఆహారఎం వారికి సరిపోయేది కాదు.
అల ఒకరోజు వారికి కొంత ధాన్యం దొరికింది. అది సాయంత్రానికి వారి భోజనానికి తయారు చేసుకున్నారు. ఆ రోజు చేయవలసిన శాస్త్రోక్తకర్మలను పూర్తిచేసుకుని వారు భోజనం చేయటానికి ఆ ఆహారాన్ని నలుగురూ సమంగా పంచుకుని తినబోతున్న సమయంలో వారి ఇంటికి ఒక అతిధి వచ్చారు. ఆ అతిథికి సకల మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు అడిగిన తరువాత, అతనికి మామగారు తన వంతు భోజనాన్ని అందించాడు. అతిధి ఆ ఆహారాన్ని స్వీకరించాడు. కానీ అతనికి ఆ ఆహారం అతనికి సరిపోలేదు అని ఆ బ్రాహ్మణుడు గమనించాడు. కానీ వచ్చిన అతిథిని ఇంకా ఎలా సంతృప్తిపరచాలో అతనికి తెలియక చూస్తున్న సమయంలో, అతని భార్య తనవంతు భోజనాన్ని అతిథికి ఇచ్చింది. అది కూడా అతనికి సరిపోకపోతే అతని కుమారుడు, ఆ తరువాత వారి కోడలు కూడా వారి వారి భోజనాన్ని పరం సంతోషంగా వచ్చిన అతిథికి సమర్పించారు . అలా అందరూ ఇచ్చిన ఆహారాన్ని బుభుజించిన ఆ అతిథి సంతృప్తుడు అయ్యాడు.
అలా సంతృప్తుడయిన ఆ అతిథి, భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పుతో కూడిన మర్యాద, దయ, అతిధులయందు ప్రేమ అన్ని ఉన్న ఆ బ్రాహ్మణ కుటుంబానికి తను యముడిని అని చెప్పి తన్మ నిజరూపమును చూపించాడు . అంతే కాక వీరి దానగుణమును సకల దేవతలు, సప్తఋషులు కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాడు. దేవతలు వారి మీద పుష్పవర్షం కురిపించారు. యముడు వారిని బ్రహ్మ తనలోకమునకు తీసుకువెళ్ళేందుకు విమానమును పంపిస్తాడు అని చెప్పాడు.   ఆలా చెప్తూ ఉండగానే ఒక విమానం వచ్చింది. అప్పుడు యముడు వారిని ఆ విమానంలో ఎక్కమని చెప్పాడు. వారు ఆ విమానంలో ఎక్కి బ్రహ్మలోకమునకి వెళ్లారు.
ఆ కుటుంబం మొత్తం విమానంలో బ్రహ్మలోకమునకు వెళుతున్న సమయంలో వచ్చిన కోలాహలం విన్న ఒక ముంగీస కలుగులో నుండి  బయటకు వచ్చి  చూస్తూ ఉండగా , ఆ అతిధిగా వచ్చిన యముడు చేతులు కడుగుకున్న నీటిని ఆ ముంగీస సగంశరీరం తాకుటవల్ల ఆ ముంగీస సగం శరీరం బంగారు వర్ణం లోనికి మారింది. ఇంట ఘనంగా దానం చేసిన ఫలములో కొంత భాగం తనకు దక్కినది అని తలచి ఆ ముంగీస మిగిలిన శరీరమును బంగారు వర్ణంగా మార్చుకోవటానికి దానములు జరిగే ప్రతి చోటుకూ వెళ్లి వారు చేతులు కడుగుకునే స్థలంలో తిరుగుతూ ఉండేది. 

3, జూన్ 2020, బుధవారం

జమదగ్ని- శాంతం - శాపం

మనం ఇంతకు ముందు ఋచీకుని కుమారుడు జమదగ్ని అని తెలుసుకున్నాం కదా ! ఆ జమదగ్ని నిష్ఠ గురించి ఒక  సంఘటన ఇప్పుడు చూద్దాం!
ఒకసారి జమదగ్ని శ్రాద్ధం చేయదలచి ఒక ఆవుపాలు స్వయంగా ఒక కొత్త కుండలో తీసుకువచ్చి జాగ్రత్తగా ఒక చోట పెట్టాడు. అతని మనస్సును పరీక్షించాలి అనే ఉద్దేశ్యంతో క్రోధమునకు అధిదేవత సాకారంగా వచ్చి ఆ పాలు ఉన్న కుండను అనుకోకుండా తగిలినట్లు చేసి, ఆ పాలు ఒలికి  పోయేట్లుగా చేసింది. ఆ విధం గమనించిన జమదగ్ని కోపగించకుండా, సావధాన మనస్కుడై ఉన్నాడు. అతనిని గమనించిన క్రోధాదిదేవత అతనిని క్షమాపణ కోరింది.  అతను కోపగించకుండా , అక్కడ సంకల్ప సిద్ధంగా జరగవలసిన శ్రాద్ధ కర్మ సరిగా జరుగక పోవటం వలన పితృదేవతలు శపిస్తారు కనుక, వారు ఆలా చేయక మునుపే ఆమెను అక్కడ నుండి వెళ్లిపొమ్మని కోరాడు. ఆమె వెళ్ళిపోయింది.
అప్పుడు పితృదేవతలు జమదగ్నికి సాక్షాత్కరించి, జరుగవలసిన శ్రాద్ధం సరిగా జరిపించలేదు, దానికి కారణమయిన వారిమీద కోపం చూపించలేదు కనుక వారు జమదగ్నిని ముంగీస గా జన్మించమని శాపం ఇచ్చారు.
అప్పుడు జమదగ్ని వారితో, దీక్షాపరుడయిన కారణంగా క్రోధంవహించుట సరి అయిన పద్దతి కాదు కనుక తానూ కోపం తెచ్చుకోలేదు అని, తనకు శాప విమోచన మార్గం చెప్పమని ప్రార్ధించాడు.
అతని ధర్మ నిరతకు సంతోషించిన పితృదేవతలు, అతను ఏ రోజున పండిత, విద్వాంసులందరినీ కూడా ఒక మహాధర్మమును అధమ ధర్మముగా చెప్పి ఒప్పించగలుగుతాడో ఆ రోజున అతనికి శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు.

మరి ఇంతకూ అలా ముంగీసగా పుట్టిన జమదగ్నికి శాప విమోచనం ఎలా కలిగింది ? ఎలా పండితులను మహాధర్మమును అధమ ధర్మం అని  ఒప్పించగలిగాడు? తరువాతి టపా లో చెప్పుకుందాం!

27, మే 2020, బుధవారం

కశ్యపుడు - కుటుంబం

కశ్యపుని గురించి మనం ఇంతకు  ముందు చాలా సార్లు చెప్పుకున్నాం! నవ బ్రహ్మ లలో ఒకడయిన దక్షుడు తన 13 మంది కుమార్తెలనుకశ్యపునికి ఇచ్చి వివాహం చేసాడు అని కూడా తెలుసుకున్నాం కదా! ఈ 13 మంది దక్షుని కుమార్తెల గురించి అనేక పురాణములలో అనేక రకములుగా చెప్పారు. ఇప్పుడు మనం మహాభారతంలో మరియు భాగవతంలో ఏమి చెప్పారో చూద్దాం!
ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశి కశ్యపుని వంశంలోనివే అని చెప్తారు. అటువంటి విచిత్రమయిన కుటుంబం గురించి తప్పకుండా తెలసుకోవాలి కదా!

 కశ్యపుని భార్యలుగా చెప్పబడిన 13 దక్ష పుత్రికలు, వారివలన కశ్యపునికి కలిగిన సంతానం ఇప్పుడు చూద్దాం!

 మహాభారతం ప్రకారం:
  1. అదితి          : ఆదిత్యులు 
  2. దితి              : దైత్యులు
  3. దనువు         : దానవులు 
  4. కాల              : వినాశనుడు, క్రోధుడు మొదలగు 8 మంది 
  5. అనాయువు : విక్షర, బాల, వీర, వృత్రులు 
  6. సింహిక        : రాహువు 
  7. ముని           : భీమసేనాదులయిన గంధర్వులు 16 మంది 
  8. కపిల           : అమృతం గోగణం, బ్రాహ్మణులు, అప్సరసలు 
  9. వినత          : గరుడ, అనూరుడు 
  10. క్రోధ             : క్రోధవశగణములు 
  11. ప్రాద్ధ           : సిద్దులు 
  12. క్రూర          : సుచంద్రాదులు 
  13. కద్రువ        : నాగులు 

భాగవతం ప్రకారం:
  1. అదితి          : ఆదిత్యులు 
  2. దితి              : దైత్యులు
  3. కాష్ట
  4. దనువు         : దానవులు 
  5. అరిష్ట           : గంధర్వులు 
  6. తామ్ర           : డేగ, గ్రద్ద 
  7. క్రోధవశ        : సర్పములు 
  8. సురస          : యాతుధానులు అనే ఒక రకం పిశాచములు 
  9. సురభి          : సురభులు 
  10. ముని            : అప్సరసలు 
  11. తిమి             : తిమింగలములు మొదలగు జలచరములు 
  12. ఇల              : చెట్లు 
  13. సరమ          : గిట్టలు చీలి ఉండే జంతువులు  

అయితే విచిత్రంగా భాగవతంలో తారక్ష్యుడు అనే వానికి భార్యలుగా వినత, కద్రువలను చెప్పారు. ఈ  వినత, కద్రువలను మహాభారతంలో కశ్యపుని భార్యలుగా చెప్పారు. 

22, మే 2020, శుక్రవారం

చిలుక - ఉపకారం

మానవుని జీవితంలో ఒకరికి ఉపకారం చేయటం, మరొకరి సహాయం తీసుకోవటం చాలా సహజం. అయితే మనం ఒకరి వద్ద సహాయం తీసుకుంటే వారి పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పారు. ఆ కదా ఇప్పుడు మనం చూద్దాం!
ఒకానొక సమయంలో కాశీ దేశంలో ఒక వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు ఒకసారి వేటకు వెళ్లి ఒక జింకను వెంబడించాడు. ఆ జింకకు గురిపెట్టి ఒక విషపూరితమయిన బాణమును వదిలాడు. ఆ జింక ఆ బాణం నుండి తప్పించుకుని పారిపోయింది. ఆ బాణం తిన్నగా వెళ్లి ఒక పెద్ద చెట్టుకు తగిలింది. చాలా పువ్వులతో, కాయలతో అద్భుతంగా ఉన్న ఆ చెట్టు ఒక్కసారిగా ఆ బాణమునకు ఉన్న విషం కారణంగా నిర్జీవం అయిపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక కాపురం ఉండేది.
ఆ చెట్టు నిర్జీవంగా మారినా, ఆ చిలుకకు ఇప్పుడు ఏ సహాయం చేసే స్థితిలో లేకపోయినా, ఆ చిలుక ఆ చెట్టు తొర్రలోనే నివసిస్తూ ఉంది. ఎండ,  చలి,వర్షం వంటి ఏ పరిస్థితి లోనూ ఆ చిలుక ఆ చెట్టును వదిలిపోలేదు. కారణం ఆ చెట్టు ఇంతకు  ముందు ఆ చిలుకకు ఆశ్రయం కలిగించుట వలన కలిగిన గౌరవ మర్యాదలు. ఏమి జరిగినా తనకు ఎంతో సహాయం చేసిన ఆ చెట్టును వదిలి పోకూడదు అని ఆ చిలుక దృఢసంకల్పం గురించి ఇంద్రునికి తెలిసింది. ఆ చిలుకను పరీక్షిద్దామని ఇంద్రుడు మానవ రూపంలో ఆ చిలుక దగ్గరకు వచ్చాడు.
ఆ చిలుకను చూసి ఇంద్రుడు "ఓ చిలుకా, ఈ అడవిలో ఎన్నో పుష్పించిన, ఫలములు ఉన్న చెట్లు ఉండగా నీవు ఈ ఎండిపోయిన చెట్టు తొర్రలో ఎందుకు ఉంటున్నావు ?" అని అడిగాడు.
ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా ! మనకు సహాయం చేసిన వారిని అంటిపెట్టుకుని ఉండుట మన ధర్మం కదా! ఈ వృక్షం ఫలములతో పుష్పములతో ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చింది, ఇప్పుడు దీనికి ఆ శక్తి లేదు, ఆశ్రయం ఇచ్చినప్పుడు తీసుకుని, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మనకు సహాయం చేసిన వారిని వదలి వెళ్ళిపోతే కృతఘ్నత అవుతుంది కదా!"అని సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న దేవేంద్రుడు, నేను మారువేషంలో వచ్చినా ఈ చిలుక నన్ను గుర్తుపట్టింది అంటే అది దీని పూర్వజన్మ శుభఫలముల వలెనే కనుక తానూ ఆ చిలుకకు సహాయం చేయాలి అని కున్నాడు.
అప్పుడు ఆ చిలుకతో "ఓ చిలుకా! నీవు చెప్పిన ధర్మమునకు నేను ఏంటో సంతోషించాను, నీకు ఏదయినా వరం ఇవ్వాలి అనుకుంటున్నాను నీకు ఏమి కావాలో కోరుకో" అన్నాడు. ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా! ఈ వృక్షమునకు తిరిగి పూర్వ స్థితి కలిగించు అని చెప్పింది"
 ఆ మాటలు విన్న దేవేంద్రుడు అత్యంత సంతోషించి ఆ చెట్టు మీద అమృతం చల్లి , ఇంతకూ ముందు ఉన్న వైభవం కంటే ఇంకా ఎక్కువ వైభవమును కలుగజేసాడు.
మనం మనకు సహాయం చేసిన వారికి కష్టం కలిగిన పరిస్థితిలో వారికి తిరిగి మన సహాయమును అందించాలి 

21, మే 2020, గురువారం

ఋచీకుడు - పరశురాముడు - విశ్వామిత్రుడు

ఋచీకుడు నవబ్రహ్మలలో  ఒకరయిన భృగు మహర్షి యొక్క కుమారుడు. ఇతను తన తండ్రి వలెనే  అత్యంత తపస్సంపన్నుడు. ఆ తపస్సులో నిమగ్నమయ్యి ఉండుట వలన ఆటను వివాహం చేసుకోకుండానే వృద్దాప్యమును పొందాడు. అయితే ఒకసారి అతను సత్యవతి అనే రాజకుమారిని చూసి, వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె వివరములు కనుక్కున్నాడు. ఆమె జహ్నుని కులంలోని కుశనాభుని కుమారుడయిన గాధి పుత్రిక. కనుక ముందుగా తన తండ్రి అయినా భృగువు అనుమతి తీసుకుని, మహారాజు అయిన గాధి వద్దకు వెళ్ళి రాకుమార్తెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. ఆ ప్రతిపాదన రాజుకు ఇష్టం కాలేదు.  ముసలివాడయిన ఒక ఋషికి తన కుమార్తెను ఇవ్వటం గాధికి ఇష్టంలేదు. ఆ విషయం తిన్నగా చెబితే ఆ మహర్షి శపిస్తాడేమో అని భయం. అందుకే అతి కష్టసాధ్యమయిన ఒక కోరిక కోరాలి అని తలచి, కన్యాశుల్కం / ఓలి కింద తనకు శరీరం మొత్తం తెల్లగా ఉండి, కేవలం ఒక్క చెవిమాత్రమే నల్లగా ఉండే వెయ్యి గుఱ్ఱములు ఇస్తే ఆమెను వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు.

ఆ మాటలు విన్న  ఋచీకుడు వరుణదేవుని ప్రార్ధించాడు. ఆ ప్రార్థనలకు మెచ్చి వరుణుడు ఋచీకుడు ఎక్కడ కావాలంటే అక్కడే ఆ అశ్వములు వస్తాయి అని చెప్పాడు. ఆ తరువాత ఋచీకుడు గంగానది ఉత్తరపు ఒడ్డున ఆ గుఱ్ఱములు రావాలి అని సంకల్పం చేసాడు. అలా వచ్చిన గుఱ్ఱములను తీసుకుని గాధి కి ఇచ్చి, అతను రాకుమారి సత్యవతిని వివాహం చేసుకున్నాడు.
వీరి వివాహమయిన కొంతకాలానికి ఋచీకునికి సంతానేచ్ఛ కలిగింది. ఆ మాట తన భార్యకి చెప్పగా, ఆ సత్యవతి తన తండ్రికి వంశోద్ధారకుడు లేదు కనుక తనతో పాటు తన తల్లి కోసం కూడా పుత్ర సంతానం కలిగేలా చూడామణి ప్రార్ధించింది. ఆ ప్రార్ధన విన్న ఋచీకుడు ఒక బ్రాహ్మణత్వం కలిగిన ప్రసాదమును, ఒక క్షత్రియత్వం కలిగిన ప్రసాదమును ఇచ్చి బ్రాహ్మణ ప్రసాదమును సత్యవతి ని స్వీకరించమని, క్షత్రీయ ప్రసాదమును ఆమె తల్లిని స్వీకరించమని , ఆ తరువాత వారు ఋతుస్నాతలు అయినా సమయంలో సత్యవతిని మేడిచెట్టును, ఆమె తల్లిని రావి చెట్టును కౌగలించుకోమని చెప్పాడు.
ఆ సమయం వచ్చినప్పుడు సత్యవతి , ఆమె తల్లి ఇద్దరూ తమతమ ప్రసాదమును, వారు కౌగలించుకోవలసిన చెట్టును తారుమారు చేశారు. ఆ విషయం గమనించిన ఋచీకుడు సత్యవతి వద్దకు వచ్చి బ్రాహ్మణుడయిన తనకు క్షత్రియ అంశతో, గాధి మహారాజుకు బ్రాహ్మణ అంశతో ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సత్యవతి బాధపడి, తనకు సద్బ్రాహ్మణుడు కుమారునిగా ప్రసాదించమని అడిగింది. అప్పుడు ఋచీకుడు తన తపో శక్తిని ప్రయోగించి, తమకు ఒక బ్రాహ్మణుడే కుమారునిగా పుట్టేలా, మనుమడు మాత్రం క్షత్రీయ లక్షణములతో పుట్టేలాగా మార్చాడు. ఆ విధంగా ఋచీకుడు, సత్యవంతులకు పుట్టిన పుత్రుడు జమదగ్ని, వారి మనుమడు క్షత్రియ లక్షణములు కలిగిన పరశురాముడు.
మహారాజు గాధికి బ్రాహ్మణ లక్షణములతో జన్మించిన వాడు విశ్వామిత్రుడు.

20, మే 2020, బుధవారం

సుందోపసుందులు

పూర్వం దైత్య వంశంలో నికుంభుడు అనే దైత్యునకు సుందుడు, ఉపసుందుడు  అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారిద్దరూ అత్యంత స్నేహభావంతో పెరిగి పెద్దవారయ్యారు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఒకసారి ఇద్దరూ  కలిసి అనేక సంవత్సరములు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. వారిని ఇంద్రుడు అనేక రకములుగా పరీక్షించినా వారు తపస్సును మానలేదు. ఇక తప్పని పరిస్థితిలో బ్రహ్మదేవుడు వారు ముందు ప్రత్యక్షం అయ్యి వరమును కోరుకొమ్మని అడిగాడు.
అందరు దైత్యులు లాగానే మరణం లేని వరం కోరుకున్నాడు. కానీ ఆ వరం ఇవ్వటం సాధ్యంకాదు అని బ్రహ్మదేవుడు చెప్పిన తరువాత, వారు ఒక విచిత్రమయిన కోరిక కోరారు.
వారు కోరిన వరం , వారు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగేలాగా,అన్ని మంత్రములు, మాయలు వారి వశంలో ఉండేలాగా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలిగేలాగా, వారిని యుద్ధ రంగంలో ఎవరూ ఓడించకుండా, ఒకవేళ వారిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడి యుద్ధం చేసుకుంటే మాత్రమే చనిపోయేలాగా వారు వరం కోరుకున్నారు.
బ్రహ్మదేవుడు తధాస్తు అని దీవించి వారికి ఆ వరములు ఇచ్చాడు.
వర గర్వితులయిన దైత్యులు అన్ని లోకముల మీద దండెత్తి వానిని స్వాధీన పరుచుకోవటం మొదలు పెట్టారు. వీరి ఆగడాలు సహించలేని దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, బ్రహ్మదేవుడు అలోచించి, విశ్వకర్మను పిలిపించాడు. విశ్వకర్మ చేత తిలోత్తమ అనే అప్సరసను సృజింపజేసి ఆమె ను ఆ దైత్యుల వద్దకు పంపారు.
ఆ సుందోపసుందులు ఆమెను చూసి మోహించి, తనకు మాత్రమే సొంతం, తనకు మాత్రమే సొంతం అని గొడవ పడి, వారిలో వారే  యుద్ధం చేసుకుని , చివరకు మరణించారు.  

19, మే 2020, మంగళవారం

పినాకం - శివుని విల్లు

శివుని ధనస్సును పినాకం అంటారు. దాని వల్లనే శివునికి పినాక పాణి అని పేరు వచ్చింది. అయితే ఆ పినాకమును ఎవరు తయారుచేసారు ? దానిని శివునకు ఎవరు ఇచ్చారు? దీనికి సమాధానం స్వయంగా శివుడే పార్వతికి చెప్పిన ఘట్టం మనకు మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది.
మనం ఇంతకూ ముందు కల్పములు మరియు యుగములు గురించి చెప్పుకున్నాం కదా! వాని లోని మొదటి కల్పంలోని మొదటి కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహానిష్ఠ కలిగి అత్యంత కఠినమయిన తపస్సు చేసాడు. ఆటను తపస్సులో లీనమయ్యి ఉండగా, అతని శరీరంమీద పెద్ద పుట్టలు ఏర్పడ్డాయి. పుట్టమీద ఒక వెదురు మొక్క జన్మించినది. ఆ వెదురు మొక్క సహజంగా కాక అతని తపస్సు వలె అత్యంత గొప్పగా పెరిగింది. దాని పొడవు, వెడల్పు చాలా ఎక్కువగా పెరిగాయి. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరములను ఇచ్చాడు.
 ఆ వెదురుని బ్రహ్మదేవుడు తనతో తీసుకుని వెళ్ళాడు. దానిని విశ్వకర్మకు ఇచ్చి రెండు విల్లులు చేయమన్నాడు. అలా తయారయిన విల్లులే శివుని చేతిలో ఉండే పినాకం, ఇంకా శ్రీ మహా విష్ణువు చేతిలో ఉండే శారఙము. ఆ రెండు ధనస్సులే కాక మిగిలిన చిన్న ముక్కతో మరొక విల్లును తయారుచేసాడు విశ్వకర్మ. ఆ మూడవ ధనస్సే అర్జునుని చేతికి వచ్చి చేరిన గాండీవము.