చంద్రవంశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చంద్రవంశం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మే 2020, గురువారం

ధర్మరాజు -- 16 కళలు

మనకు ఉన్న ముఖ్యమయిన గ్రంధాలు రెండు. రామాయణం, మహాభారతం. రామాయణం సూర్య వంశంలో జన్మించిన రాముని యొక్క చరితము. కానీ మహాభారతంలో చంద్ర వంశం గురించి చెప్పినా, ఏ ఒక్కరి గురించి మాత్రమే చెప్పిన కధ కాదు. కానీ ఈ కధలో ప్రధానుడు, ఇప్పటి మన భాషలో "హీరో" గా పిలువటానికి అర్హత  గలిగిన వాడు పాండవుల లో పెద్దవాడు అయిన ధర్మరాజు.
ఇంతకు  ముందు మనం రాముని గురించి  పదహారు కళల (లక్షణాల )గురించి చెప్పుకున్నాం కదా! అలాగే ధర్మ రాజు ని చంద్రునిలా  పదహారు కళలు కలిగిన వానిగా చెప్పిన సందర్భం మహాభారతం లో ఒకచోట కనిపిస్తుంది . అది విరాట పర్వం మొదటి భాగంలో, వారు విరాటుని కొలువులో పనిచేయవలసి ఉంటుంది  అని నిర్ణయించుకున్న తరువాత తన తమ్ములు ధర్మరాజు గురించి చెప్పిన సందర్భంలో ఈ పద్యం చెప్తారు.

సీ : మహనీయ మూర్తియు, మానవైభవమును, 
సౌకుమార్యంబును,సరసతయును  
మార్దవంబు, బ్రభుత్వ మహిమయు, నపగత 
కల్మషత్వంబును, గౌరవంబు 
శాంతియు, దాంతియు, జాగంబు, భోగంబు 
గారుణ్యమును, సత్యసారతయును 
ధర్మమయ క్రియా తత్పరత్వంబును 
గీర్తి, ధనార్జన క్రీడానంబు 

ఆ : గలిగి జనుల నేల గాని, యెన్నందును 
నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని 
యట్టి నీవు విరటు నెట్టి చందంబున 
ననుచరించు వాడ వధిప ! చెపుమ !

భావం : ఓ ధర్మరాజా! నీకు చక్కని రూపం, అభిమాన వైభవం, సౌకుమార్యం, సరసత, మృదుత్వం,ప్రాభవం, నిష్కల్మషత్వం, గౌరవం, శాంతి, దాంతి,  త్యాగం, భోగం, దయ , సత్యం, ధార్మిక క్రియాశీలత, కీర్తి , ధనము అనేవి నీకు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఇతరులను సేవించే నేర్పు నీకు లేదు, (ఇప్పటివరకు అటువంటి అవసరం నీకు రాలేదు), అటువంటి నీవు సామాన్యుడు అయిన విరాటుని ఎలా సేవించగలవు? చెప్పు!

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఇల/సుద్యుమ్నుడు విచిత్రం

సూర్యవంశం లో జన్మించిన ఇల, వసిష్టుని కారణం గా సుద్యుమ్నునిగా(పురుషునిగా) మారినది. సుద్యుమ్నుడు తన తండ్రి అయిన వైవస్వతమనువు రాజ్యమును చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు.
ఒకసారి సుద్యుమ్నుడు తన సైన్యంతో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు. అతిశయించిన ఉత్సాహంతో ఉత్తర దిశగా క్రూరమృగములను తరుముతూ వెళ్లారు. అలా వెళ్లి వెళ్లి చివరకు స్త్రీవనములో ప్రవేశించారు. వెంటనే పరమేశ్వరుని అజ్ఞానుసారం సుద్యుమ్నుడు మరలా స్త్రీగా (ఇలగా)మారి పోయాడు. అతనితో పాటుగా అక్కడకు వచ్చిన అతని సైన్యంకూడా స్త్రీలుగా మారిపోయారు.
ఈవిధముగా అనుకోని పరిస్థితులలో స్త్రీలుగా మారిన వారు ఆ అడవుల్లోనే నివసించసాగారు. ఇల రాకుమార్తె వలే నివసించుచుండగా, సైనికులు ఆమెకు చెలికత్తెలై ఉన్నారు. వారు ఆ విధంగా ఉంటున్న సమయంలో ఒకరోజు చంద్రుని కుమారుడయిన బుధుని (నవ గ్రహములలో ఒకరు) ఆశ్రమం చేరారు.
బుధుడు ఇలను చూసి మోహించాడు, వారు వివాహం చేసుకున్నారు. వారికి పురూరవుడు అనే పుత్రుడు జన్మించాడు. ఈవిధంగా చంద్రవంశం వృద్ధి ప్రారంభం అయినది.
వీరిని గురించి తెలిసిన వైవస్వతమనువు విచారం మరింతగా పెరిగినది. సూర్యవంశ వృద్ధికి కారకుడు కావలసిన తన పుత్రుడు, పుత్రిక రూపంలో చంద్రవంశ వృద్ధికి పునాదులు వేసాడు. తన మనో విచారమును తన గురువైన వసిష్టునకు విన్నవించగా, వసిష్టుడు పరమేశ్వరుని గురించి ప్రార్ధన చేసాడు.
వసిష్టుని ప్రార్ధనలు విన్న పరమేశ్వరుడు ఇలను పురుషునిగా మార్చినట్లయితే అతని శాపం తప్పినట్లు అవుతుంది, అలా కాకుండా ఆమెను స్త్రీగానే ఉంచేస్తే, వసిష్టుని సంకల్పం తప్పినట్లు అవుతుంది కనుక మధ్యే మార్గంగా ఆమెను ఒక నెల రోజుల పాటు పురుషునిగా, మరో నెల రోజులు స్త్రీ గా ఉండే ఏర్పాట్లు చేసారు.
అప్పటినుండి పురుషునిగా ఉన్న నెలరోజులు రాజ్యపాలన చేస్తూ, స్త్రీగా ఉన్న నెలరోజులు ఇలగా అంతఃపురంలో జీవనం సాగిస్తూ ఉన్నాడు.
సుద్యుమ్నునకు అతని భార్య వలన ముగ్గురు కుమారులు జన్మించారు. వారు ఉత్కళుడు, గయుడు మరియు విమలుడు. వీరు ముగ్గురు అత్యంత ధర్మ పారాయణులు, వీరు ఉత్తర దిశలో గల రాజ్యమును పరిపాలించారు.
సుద్యుమ్నుడు వృద్ధాప్యం వచ్చేవరకు రాజ్యపాలన చేసి, అవసాన దశలో తన పుత్రుడయిన పురూరవునకు ప్రతిష్టానపురము అనే రాజ్యమును ఇచ్చి వనములకు వెళ్ళాడు.

నా ఆలోచన:
ఇంతకు ముందు చెప్పినట్లు మన పూర్వీకులకు లింగమార్పిడి గురించిన అద్వితీయమైన జ్ఞానం ఉన్నది. నిస్సంకోచముగా! ఎందుకంటే (నాకు తెలిసినంత వరకు) ఈ రోజులలో జరుగుతున్న లింగ మార్పిడి కేవలం శారీరక మైనది. అలా లింగ మార్పిడి జరిగిన ఎవరూ మార్పు చెందిన లింగమునకు సంబందించిన జీవ ప్రక్రియలు చేయలేరు. ఒక పురుషుడు స్త్రీగా మారితే అతను మిగిలిన స్త్రీలవలే గర్భధారణ చేసే అవకాశం ఉండదు. ఒక స్త్రీ పురుషునిగా మారితే ఆమె మరొక స్త్రీ ద్వారా పుత్రులను పొందుట అసంభవం.
కాని పూర్వకాలం లో ఇల/సుద్యుమ్నుని విషయంలో వారు తప్పని సరిగా విజయం సాధించారు. స్త్రీగా ఉన్న ఇల పురూరవునికి జన్మను ఇచ్చినది. పురుషునిగా ఉన్నపుడు తన భార్య ద్వారా మ్రుగ్గురు పుత్రులను పొందటంజరిగింది.