21, డిసెంబర్ 2021, మంగళవారం

అష్టవసువులు

మనం  ఇంతకు ముందు నక్షత్రముల అధిపతుల గురించి, నందిని ధేనువు గురించి చెప్పుకున్న సందర్భంలో మనం  అష్టవసువులు గురించి విన్నాం! ఇంతకీ ఈ అష్టవసువులు ఎవరు?

వీరి పేర్లు గురించి అనేక సందర్భాలలో అనేక రకములుగా చెప్పినా, మహాభారతంలోని ఆదిపర్వంలో చెప్పిన ఈ కింది శ్లోకంలో వారి పేర్లు చెప్పారు

ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలో అనలః

ప్రత్యూష శ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః  

  1. ధరుడు 
  2. ధ్రువుడు 
  3. సోముడు 
  4. అహస్సు 
  5. అనిలుడు 
  6. అనలుడు 
  7. ప్రత్యూషుడు 
  8. ప్రభాసుడు 

18, డిసెంబర్ 2021, శనివారం

ఏకాదశ రుద్రులు

మనం ఇంతకుముందు శివుని  ఏకాదశ నీలలోహిత రుద్రులగురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు నమకంలో చెప్పిన ఏకాదశ రుద్రుల గురించి చెప్పుకుందాం!
విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ:
 
  1. విశ్వేశ్వరుడు 
  2. మహాదేవుడు 
  3. త్ర్యంబకుడు 
  4. త్రిపురాంతకాయ 
  5. త్రికాగ్నికాలుడు 
  6. కాలాగ్ని రుద్రుడు 
  7. నీలకంఠుడు 
  8. మృత్యుంజయుడు 
  9. సర్వేశ్వరుడు 
  10. సదాశివుడు 
  11. శ్రీమన్మహాదేవుడు 

17, డిసెంబర్ 2021, శుక్రవారం

వరరుచి, కేరళ జానపద కథ

మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి, కాలక్రమంలో విధిని తప్పించలేక పంచమకన్యతో  అతనికి జరిగిన వివాహం గురించి, వివాహానంతరం  పొందిన సంతానాన్ని వరరుచి వదలిపెట్టటం గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి కథ చూద్దాం!  

తనకు కలిగిన 11 మంది కుమారులను నిర్దాక్షిణ్యంగా అడవిలో పొత్తిళ్లలోనే వదిలిన వరరుచి భార్య, తనకు ఒక బిడ్డను పెంచుకోవాలని కోరిక బలంగా కలిగింది. అందుకే తనకు 12 వ సారి ప్రసవవేదన మొదలవగానే అడవిలోని పొదల చాటుకువెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఎప్పటి వలెనే వరరుచి "ఆ బిడ్డకు నోరు ఉందా" అని అడిగాడు. పిల్లవాడిని తానే పెంచుకోవాలి అనే కోరిక ఉన్న ఆమె వెంటనే ఆ బిడ్డకు నోరులేదు అని చెప్పింది. ఆ తరువాత బిడ్డను చూస్తే నిజంగానే అప్పుడు పుట్టిన ఆ బిడ్డకు నోరులేదు. 

అప్పుడు వరరుచి ఆ నోరులేని పిల్లవాడిని ఒక కొండమీద దేవతలా ప్రతిష్టించి తన భార్యతో కలసి దారిన అతను యాత్రలలో వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలానికి అతను కాలధర్మం చేసాడు. 

మరి అడవిలో వదిలిన ఆ 11 మంది పిల్లలు ఎం అయ్యారు?

వారిని వివిధజాతులకు చెందిన కుటుంబాలు పెంచుకుని వారి వారి కుటుంబ సంప్రదాయాలను వారి ద్వారా కొనసాగేలా చేసుకున్నారు. కేరళలో ప్రసిద్ధమయిన జానపద కధలలో ఈ వరరుచి కధ ఒకటి. వారికి కలిగిన సంతానం, వారు పెరిగిన కులం/జాతి/వృత్తి ఇప్పుడు తెలుసుకుందాం!

  1. మేళత్తూళ్ అగ్నిహోత్రి : నిత్యఅగ్నిహోత్రులు 
  2. పాక్కనార్ : పంచమజాతి 
  3. రజకుడు :: చాకలి 
  4. నారణతు  బ్రాహ్మణ :నాయి బ్రాహ్మణ 
  5. కారెక్కాల్ మాత :: వరరుచి సంతానంలో ఒకేఒక ఆడపిల్ల 
  6. అకవూర్ చాటన్ :: వైశ్య
  7. వడుతల నాయర్ : సైనిక 
  8. తిరువళ్ళువర్: తమిళనాట ప్రముఖ కవి , కన్యాకుమారిలో సముద్రములో పెద్ద విగ్రహం ఉంటుంది 
  9. ఉప్పుకొట్టం : ముస్లిం 
  10. పాణనర్ : సంగీత కారుడు 
  11. పేరుంథచ్చం :: వడ్రంగి 
  12. వాయిళ్ళకుణ్ణిల్ అప్పన్ : నోరులేని కొండమీది దేవత
మనం చెప్పుకున్న ఈ కథ కేరళలో ఒక ప్రముఖమైన జానపద కథ. ఆ కథపేరు పరాయి పెట్ట పంతిరుక్కులం ఈ పేరుకు అర్ధం "నిమ్నజాతి స్త్రీ ముంది జన్మించిన 12 కులములు".  పైన చెప్పుకున్న వారి సంతతి ఇప్పటికి ఉన్నారు అనై వారు ఇప్పటికి కూడా కలుస్తూ ఉంటారు అని కేరళలో కధనాలు ఉన్నాయి.  

16, డిసెంబర్ 2021, గురువారం

వరరుచి విధి

 మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి, కాలక్రమంలో అతనికి జరిగిన వివాహం గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి కథ చూద్దాం! 

వివాహం జరిగిన  వరరుచి భార్యతో కాలంగడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఉద్యానవనంలో వరరుచి తన భార్యతలను తన ఒడిలో ఉంచుకుని ఆమె జుట్టును చేతితో సరిచేస్తుండగా ఒక నల్లని మచ్చ ఆమె తలపైన గమనించాడు.  అని ఎలా వచ్చింది అని  తన భార్యను ప్రశ్నించాడు. అప్పుడు ఆమె  ఆ బ్రాహ్మణునకు సొంత కుమార్తె కానని, చిన్నప్పుడు ఒక అరటి బోదెలో తలపైన దీపంతో నదిలో కొట్టుకు వస్తున్న ఆమెను ఆ బ్రాహ్మణుడు కాపాడి తన కుమార్తెగా పెంచాడు అని చెప్తుంది. ఆ వివరం విన్న వరరుచికి ఆశ్చర్యం వేసి, విధిని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు అని తెలుసుకుంటాడు. ఆమె జన్మ వృత్తాంతం అంతా ఆమెకు వివరించి చెప్తాడు. కానీ బ్రాహ్మణునిగా పెరిగినా ఆమె ఒక పంచమజాతి కన్య కనుక, ఆమెను వివాహం చేసుకున్నందుకు అతనుకూడా బ్రాహ్మణ్యం వదలి తీర్ధ యాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నట్లు ఆమెకు చెప్తాడు. ఆ తీర్ధయాత్రలు ఆజన్మాంతం చేయాలి అనుకుంటున్నట్లుగా కూడా చెప్తాడు. ఆమె కూడా అతని వెంట తీర్థయాత్రలకు వెళుతుంది. 

ఆ తీర్ధయాత్రలు చేసే క్రమంలో ఆమె పదకొండుసార్లు గర్భవతి అయ్యి పదకొండుమంది మగశిశువుకు జన్మఇచ్చింది. అయితే  ఆమె ప్రసవవేదన పడుతూ అడవులలో గుట్టల ప్రక్కన బిడ్డలకు జన్మ ఇచ్చినప్పుడు వరరుచి ఆ పొదల బయట నిలబడి ఒక ప్రశ్న అడిగేవాడు. పుట్టిన ఆ పసివానికి నోరు ఉందా అని. ఆమె బిడ్డను చూసి ఉంది అని చెప్పగానే "నోరు ఇచ్చిన దేవుడు వానికి ఆహారంకూడా సమకూరుస్తాడు కనుక ఆ బిడ్డను అక్కడే వదలి రా" అని చెప్పేవాడు. ఆమె భర్తమాట విని అలాగే తన 11 మంది పిల్లలను అడవిలో పొదల మద్యవదలి తన భర్తతో తీర్థయాత్రలకు సాగిపోతూ ఉండేది. 

అలా వదిలివేయబడిన 11మంది పిల్లలు ఏమి అయ్యారు? ఆమె తనకంటూ ఒక కుమారుని పెంచుకోవాలి అని ఎందుకు అనుకోలేదు? అలా పెంచుకునేందుకు ప్రయత్నించిందా? తరువాత ఏం  జరిగింది ? తరువాతి టపాలో చూద్దాం!

15, డిసెంబర్ 2021, బుధవారం

వరరుచి వివాహం

 మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి కూడా తెలుసుకున్నాం కదా!  తరువాత వరరుచి ఏం చేసాడో ఇప్పుడు తెలుసుకుందాం! 

విక్రమాదిత్యుని ఆస్థానంనుండి బయటకు వచ్చి, దేశాటన చేస్తూ వరరుచి కేరళ చేరుకున్నాడు. అలా గమ్యం లేకుండా తిరుగుతున్న అతనిని ఒక బ్రాహ్మణుడు అతని ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానాన్ని స్వీకరించిన వరరుచి అతని ఇంట్లో భోజనాన్ని స్వీకరించాలంటే కొన్ని షరతులు పాటించాలని చెప్పాడు. 

  1. అతనికి వడ్డించే భోజనం 1008 రకాల వంటకాలతో ఉండాలి, 
  2. ఆ ఆహారాన్ని తిన్న తరువాత  అతను నమలటానికి నలుగురు  కావాలి 
  3. ఆ భోజనం తిన్నతరువాత అతను నిద్రపోతున్నప్పుడు అతనిని నాలుగురు  తమ భుజాలమీద మోస్తూ ఉండాలి 
ఆ షరతులు విన్న బ్రాహ్మణుడు ఏమి సమాధానం చెప్పలేక పోయాడు. కానీ ఆ బ్రాహ్మణుని కుమార్తె ఆ నియమాలకు ఒప్పుకుని అతిధిని స్నానం చేసి రమ్మని పంపింది. వరరుచి భోజన్నని కి వచ్చినప్పుడు అతనికి ఆ బ్రాహ్మణుని కుమార్తె  భోజనం వడ్డించింది.  
  1. అల్లంవేసిన పెరుగు (కేరళ సంప్రదాయం ప్రకారం ఇది 1008 రకాల ఆహారం తో సమానం) 
  2. భోజనం ఆరగించిన తరువాత అతనికి ఆకు, వక్క, సున్నం, యాలకలు ఇచ్చారు నమలటానికి 
  3. అతను నిద్రపోవటానికి మంచం వేశారు. అతను నిద్రపోతున్నప్పుడు ఆ మంచానికి ఉన్న నాలుగు కాళ్ళు అతనిని మోస్తాయి. 
ఈ ఏర్పాట్లు చూసిన వరరుచి ఆ బ్రాహ్మణుని తెలివికి మెచ్చుకున్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడు ఆ ఆలోచన తనది కాదు అని తమ కుమార్తెది అని చెప్పగా ఏంతో  జ్ఞానం ఉన్న వరరుచి అడిగిన ఆ షరతులను ఆమె అంత చక్కగా అర్ధంచేసుకున్నందుకు,  ఆమె తెలివితేటలు మెచ్చుకుని ఆమెను వివాహం చేసుకోవాలన్న ప్రస్తావన ఆ బ్రాహ్మణుని ముందు ఉంచాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కుమార్తెను వరరుచికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. 

ఇంతకూ వరరుచి భార్యకావలసిన ఆ పంచమ కన్య ఏమి అయ్యింది? ఆమె వరరుచి భార్య  కాగలిగిందా లేదా? తరువాతి టపా లో చూద్దాం!

14, డిసెంబర్ 2021, మంగళవారం

వరరుచి అమానుషత్వం

మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యునికి చెప్పటం వల్ల సత్కారం పొందాడు  తెలుసుకున్నాం.  ఆ వరరుచి  విధిరాతలో ఉన్న పంచమజాతి కన్యతో వివాహాన్ని ఎలా తప్పించుకోవచ్చని అనుకున్నాడు? నిజంగా తప్పించుకున్నాడా లేదా? ఇప్పుడు చూద్దాం! 

మహారాజుగారు వరరుచిని విందుకు ఆహ్వానించి,అతను రాజ్యసభలో ఏమి చెప్పకుండా మౌనంగా ఉండటానికి కారణం అడిగాడు. ఆ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ, ఈ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నంలో తనకు వారి రాజ్య భవిష్యత్తుకు సంబందించిన ఒక విచిత్రమయిన విషయం తెలిసిందని, దానిని సభలో అందరి ముందు చెప్పలేక మౌనంగా ఉన్నాను అని చెప్పాడు వరరుచి. 

వరరుచి మాటలు విన్న మహారాజు కు ఆశ్చర్యంతో పాటుగా కుతూహలం కూడా పెరిగి ఆ విషయాన్నీ తమకు చెప్పా వలసినదిగా కోరారు. అప్పుడు వరరుచి తాను ఆలోచించి పెట్టుకున్న వ్యూహాన్ని రాజ్యరక్షణకోసం అన్నట్లుగా మహారాజుకు చెప్పాడు. 

"మహారాజా! నాకు తెలిసిన విషయమా ప్రకారం నిన్నటి రాత్రి మన రాజ్యమునకు సంబందించిన ఒక గ్రామంలో పంచమజాతి స్త్రీ ఒక ఆడపిల్లకు జన్మను ఇచ్చింది. ఆ శిశువు భవిష్యత్తులో ఈ రాజ్యమునకు తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఆ బిడ్డను తక్షణమే అంతమొందించాలి" అని చెప్పాడు వరరుచి. 

వరరుచి తెలివితేటల గురించి, అతని పాండిత్యము గురించి తెలిసిన విక్రమాదిత్యుడు అతని మాటలను ఏమాత్రం అనుమానించలేదు. కానీ ఒక పురిటి పసికందును చేతులారా చంపటానికి మనసుకూడా రాలేదు. ఇదే విషయం  వరరుచికి చెప్పి ఏమి చేయమంటారు అని వరరుచిని సలహా అడిగాడు మహారాజు. దానికి వరరుచి ఆ పసిబిడ్డను ఒక అరటి దూటలో పడుకోబెట్టి, ఆ బిడ్డ తలవైపున ఒక వెలుగుతున్న దీపాన్ని ఉంచి నదిలో వదిలి వేయమని చెప్పాడు. 

విక్రమాదిత్యుడు తూచా తప్పకుండ వరరుచి ఆలోచనను అమలుపరచాడు. తరువాత ఆ విష్యం గురించి మహారాజు, వరరుచి ఇద్దరు మరచిపోయి తమ జీవనాన్ని సాగించారు. కొంతకాలానికి వరరుచి రాజ ఆస్థానాన్ని వదలి గమ్యంలేకుండా దేశాటనకు వెళ్ళాడు. 

ఆ పసిబిడ్డ బ్రతికిందా? వారి వివాహం నిజంగా జరిగిందా? లేక వరరుచి నిజంగా విధిని తప్పించుకోగలిగాడా? తరువాతి టపాలలో చూద్దాం!  

12, డిసెంబర్ 2021, ఆదివారం

వరరుచి ఆలోచన

మనం ఇంతకు ముందు విక్రమాదిత్యుని ఆస్థానం లోని నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని తెలుసుకోవటానికి దేశాటన చేసాడని, ఆ శ్లోకం గురించి కొందరు వనదేవతలు మాట్లాడుకుంటున్నప్పుడు వినిని విక్రమాదిత్యునితో చెప్పగా అతను సంతోషించి బహుమానం కూడా ఇచ్చాడు అని తెలుసుకున్నాం! ఆ శ్లోకానికి ఉన్న కొన్ని అర్ధాలనుకూడా మనం తెలుసు కున్నాం కదా! 

ఇప్పుడు వరరుచి ఆరాత్రి అడవిలో చెట్టు కిందపడుకున్నప్పుడు ఏం జరిగిందో మనం తెలుసుకుందాం!

దేశాలు అన్ని తిరిగి అనేక పండితులని కలసి, రామాయణంలోని ముఖ్యమయిన శ్లోకం ఏది అని చర్చలు జరిపిన వరరుచికి అన్ని చోట్ల నిరాశ ఎదురయ్యింది. దానికి కారణం ఏ యిద్దరు పండితులూ ఓకే శ్లోకాన్ని చెప్పలేదు. అలా అతని యాత్ర చివరికి చేరుకున్న సమయంలో అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఒక చెట్టుకిందకు చేరి, అలసట వల్ల నిద్రపోయాడు. 

కొంతసేపటికి అతనికి కొన్ని మాటలు వినిపించి మెలకువ వచ్చింది. ఆ మాటలు అతని నిద్రిస్తున్న చెట్టుమీద ఉన్న వానదేవతలవిగా అతనికి అర్ధం అయింది. 

ఒక వనదేవి ప్రక్క ఊరిలో ఒక పంచమజాతి స్త్రీ ఒక ఆడపిల్లకు జన్మను ఇచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒక వనదేవత మాట్లాడుతూ తనకు తెలిసిన జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆ చంటిపిల్ల ఈ చెట్టుకింద పడుకున్న రామాయణంలో ప్రామూఖమయిన శ్లోకం మామ్ విద్ధి అని తెలియని ఈ పండితునికి భార్య అవుతుంది అని చెప్పింది. 

ఆ మాటలు విన్న వరరుచి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ శ్లోకం గురించి తనకు తెలిసినా దానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోలేక పోయినందుకు చింతిస్తూ, భవిష్యత్తు లో తను ఆ పంచమ కన్యను వివాహం చేసుకోకుండా ఎలా విధిని మార్చుకోవాలా అని ఆలోచిస్తూ అక్కడినుండి తన రాజ్యానికి బయలుదేరాడు. 

తన రాజ్యమునకు చేరుకున్న వరరుచి ఆ శ్లోకాన్ని మహారాజు విక్రమాదిత్యుని చెప్పి, దానికి ఉన్న 18 రకముల అర్థాలను చెప్పాడట. అతని ప్రతిభకు ఆశ్చర్యపోయిన మహారాజు అతనికి సన్మానం చేసి, బహుమానంగా ప్రకటించిన 1000 బంగారు నాణేలతో పాటుగా ఇంకా ఏమి కోరుకున్నా చేస్తాను అని మాట ఇచ్చారు. వరరుచి  ఆమాటకు సాంతోషించినా అతని కోరికను బయట పెట్టకపోవటం వల్ల రాజుగారు వరరుచిని విందుకు ఆహ్వానించారు. 

విందుకు వెళ్లిన వరరుచి ఏమి కోరుకున్నాడు? రాజుగారి మాటని వరరుచి తన విధిని మార్చుకోవటానికి వాడుకున్నాడా? నిజంగా విధి నుండి తప్పించుకోగలిగాడా? తరువాతి టపాలలో చూద్దాం!

11, డిసెంబర్ 2021, శనివారం

విక్రమాదిత్యుడు - నవరత్నాలు

భారత దేశంలో రాజుగా ఉండి సాహితీవేత్త గా పేరుసంపాదించుకున్న వారిలో ముఖ్యులు దక్షిణాదిలో శ్రీకృష్ణదేవరాయలు అయితే ఉత్తరాదిలో ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విక్రమాదిత్యుడు ఒకరు. 
విక్రమాదిత్యుడు తన ఆస్థానంలో తొమ్మిది మంది కవులను కలిగిఉన్నాడని కొన్ని శాసనాలలో చెప్పబడింది. ఆ తొమ్మిది మందిని కలిపి నవరత్నాలు అంటారని తెలుస్తుంది. ఆ తొమ్మిది మంది పేర్లు ఇప్పుడు మనం తెలుసుకుందాం!
  1. విద్యాసింహుడు
  2. ధన్వంతరి 
  3. ఘాటకరూర్ 
  4. కాళిదాసు 
  5. క్షపనక 
  6. శంఖుడు 
  7. వరాహమిహిరుడు 
  8. వరరుచి 
  9. బేతాళ భట్ట 

10, డిసెంబర్ 2021, శుక్రవారం

శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన అష్టదిగ్గజములు

మనం ఇంతకు  ముందు అష్టదిగ్గజములు అంటే భూమిని ఎనిమిది దిక్కులలో మోసే ఎనిమిది ఏనుగులు అని, వాటి పేర్లు చెప్పుకున్నాం  కదా! ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానం లో ఉన్నఅష్టదిగ్గజముల గురించి తెలుసుకుందాం!

శ్రీకృష్ణదేవరాయలు మన చరిత్రలో గొప్ప రాజు, వీరునిగానే కాక ఒక గొప్ప కవిగా, సాహిత్యవేత్తగా కూడా పేరు సంపాదించుకున్నారు. వారి ఆస్థానం లో ఎనిమిది మంది గొప్ప మేధావులయిన కవులు ఉండే వారని వారినే అష్టదిగ్గజములు అంటారని మనకు తెలుసు కదా1 మరి ఆ ఎనిమిది మంది పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం! 
  1. అల్లసాని పెద్దన 
  2. నంది తిమ్మన 
  3. మాదయ్యగారి మల్లన 
  4. ధూర్జటి 
  5. అయ్యలరాజు రామభద్రుడు 
  6. పింగళి సూరన 
  7. రామరాజభూషణుడు 
  8. తెనాలి రామకృష్ణ 

9, డిసెంబర్ 2021, గురువారం

రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం

ఇంతకు మూడు టపాలో విక్రమాదిత్యుడు వాల్మీకి రామాయణంలో ని విశిష్టమయిన శ్లోకం గురించి అడిగినప్పుడు వరరుచిచెప్పిన శ్లోకం ఇది అని చెప్పుకున్నాము కదా!  

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్

అయోధ్యామ్ అటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్    

ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలోఅరణ్య కాండ లో 40వ సర్గలో వస్తుంది. రాముడు అరణ్యాలకి వెళ్తున్నాడు అని తెలిసి  లక్ష్మణుడు తను కూడా అరణ్యాలకు బయలుదేరుతూ, తన తల్లి సుమిత్ర ఆశీర్వాదం కోరినప్పుడు సుమిత్ర లక్ష్మణుడికి చెప్పిన సమాధానం ఈ శ్లోకం. ఈ శ్లోకానికి ఉన్న అనేక అర్థాలలో కొన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం.


మొదటి అర్ధం

రామ= రాముడు: దశరథం=దశరథుడు:  విద్ధి=అనుకో: మామ్= నేనే; జనకాత్మజ= జనకుని కూతురు;విద్ధి= అనుకో; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా

తాత్పర్యం: లక్ష్మణా! రాముడే దశరథుడు అనుకో, సీతనే నేను(సుమిత్ర) అనుకో, అడవినే అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళిరా!


రెండవ అర్ధం
రామ= రాముడు: (దశ = పక్షి రథం=రధం) దశరథం= పక్షిని రధంగా కలిగిన వాడు, విష్ణువు ; మామ్= లక్ష్మీదేవి; జనకాత్మజ= జనకుని కూతురు; అయోధ్యా= శతృదుర్భేద్యమయినది(వైకుంఠం); మాటవీం=అడవి; విద్ధి=అనుకో; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్=సుఖంగా
తాత్పర్యం: ఓ పుత్రా! ఈ రాముడే శ్రీమహావిష్ణువు, సీతే శ్రీ మహాలక్ష్మి, వారిద్దరూ ఎక్కడ ఉంటే అదే వైకుంఠం అనుకుని సుఖంగా వెళ్లి రా!

మూడవ అర్ధం
రామ= రాముడు: దశరథం=దశరథుడు: విద్ధి=వలెనే: మామ్=నీ తల్లి (కైకను ఉద్దేశించి ); జనకాత్మజ= జనకుని కూతురు; విద్ధి= వలెనే; అయోధ్యా= అయోధ్య; మాటవీం=అడవి; విద్ధి=వలెనే; గచ్ఛ= వెళ్ళు; తాత= పుత్ర; యథా సుఖమ్= వీలయినంత సుఖంగా
తాత్పర్యం: ఓ పుత్రా! నీ తండ్రి దశరధుడు భార్యమాటని విని, అత్యంత అమూల్యమయిన రాముని సాంగత్యం పోగొట్టుకుని ఎలా దుఃఖిస్తాడో, సీత మాట విని రాముడు కూడా అతనికి అమూల్యమయిన సీతను చేజార్చుకుని దుఃఖాన్ని పొందుతాడు. రాముడు లేక అయోధ్య ఎలా శోకిస్తుందో అలాగే అరణ్యం కూడా సీత జాడ లేక శోకిస్తుంది. కనుక వీలయినంత దైర్యం చెప్తూ రాముని చెంత నీవు ఉండు.

నాలుగవ అర్ధం:

పుత్రా! దశరధుడు లేడనుకో, నేను దశరధుని భార్యగా కాక నా తండ్రికి పుత్రికగానే ఉన్నాను అనుకో, అయోధ్యను మరచి సంతోషంగా రామునితో వెళ్ళు.

నాల్గవ సరి చెప్పిన ఈ అర్ధం వాల్మీకి చెప్పవలసిన భావం అయ్యి ఉండదు. కానీ ఆ పదములకు ఇటువంటి అర్ధం కూడా ఉంది కదా!

ఇంతకు విక్రమాదిత్యుని రాజాస్థానంలోని వరరుచి గురించి తరువాతి టపాలో చూద్దాం! 

8, డిసెంబర్ 2021, బుధవారం

రామాయణం లో అత్యంత ముఖ్యమయిన/ విశిష్టమయిన శ్లోకం ఏది?

ఒకసారి విక్రమాదిత్య అనే రాజుకు తన సభలో ఉన్న నవరత్నాలలో ఎవరు ఉత్తమ పండితులో తెలుసుకోవాలని అనిపించింది. రాజ్యసభ లో ఉన్నా పండితుల అందరినీ పిలిచి రామాయణం లో ఉన్న శ్లోకాలలో అత్యంత ముఖ్యమైన శ్లోకం ఏది అయి ఉంటుంది అని ప్రశ్నించారు. ఆ శ్లోకం గురించి చెప్పిన వారికి 1000 బంగారపు నాణేలు ఇస్తాము అని కూడా ప్రకటించారు. ఈ శ్లోకాన్ని రామాయణంలో నుంచి వెతికి పట్టుకోవడానికి పండితులకు విక్రమాదిత్యుడు 40 రోజుల గడువు ఇచ్చాడు. విక్రమాదిత్యుని రాజ్యసభలో వరరుచి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి ఆ వెయ్యి వెయ్యి బంగారు నాణాలు ఎలాగైనా సంపాదించాలి అని కోరిక కలిగింది. అప్పుడు ఆ వరరుచి దేశాటనకు బయలుదేరి అనేక రాజ్యాల లో తిరిగి రామాయణం లో ఉన్న ముఖ్యమైన శ్లోకం ఏది అని అందరు పండితులను అడగటం మొదలు పెట్టాడు. అయితే అతనికి రామాయణం లో ఉన్న అన్ని శ్లోకాలలో ఒకే ఒక్క శ్లోకాన్ని ఉత్తమమైనది అని చెప్పటం సాధ్యం కాదు అన్న సమాధానంమే దొరికింది. 40 రోజులలో చివరి రోజు అతను తన రాజ్యానికి తిరిగి వస్తూ అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిద్రపోతున్న సమయంలో ఆ చెట్టు మీదకు ఇద్దరు వనదేవతలు వచ్చి సంభాషించుకుంటూ ఉన్నారు. ఆ సంభాషణ విన్నవరరుచికి ఎంతో ఆనందం కలిగింది. అతను వెంటనే విక్రమాదిత్య రాజ్యసభకు వెళ్లి ఆ ముఖ్యమయిన శ్లోకం ఏదో చెప్పాడు. ఆ శ్లోకం ఇది 

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్
అయోధ్యామ్ అటవీం విద్ధి గచ్ఛ తాత యథాసుఖమ్

ఆ శ్లోకాన్ని విన్న విక్రమాదిత్యుడు ఆ శ్లోకానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అని అడిగాడు. అతను

చెప్పిన 18రకాలయిన అర్ధాలను విన్న విక్రమాదిత్యుడు రామాయణంలో ఇదే ఉత్తమమైన శ్లోకం గా భావించి అతనికి

1000 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు.

ఈ శ్లోకంలో ఉన్న అర్ధం ఏమిటి? ఏందుకు ఈ శ్లోకం అంత ముఖ్యమయినదిగా చెప్పారు? ఆ వనదేవతలు ఆ చెట్టుమీద ఏం మట్లాడుకున్నారు? తరువాతి టపాలలో నేర్చుకుందాం!