శ్రీ శివ మహా పురాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ శివ మహా పురాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఫిబ్రవరి 2022, సోమవారం

దారితప్పిన దశగ్రీవుడు

 మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది, దశగ్రీవుడు నిజంగా అంత చెడ్డవాడా,  కైకసి కుమారులు  పొందిన వరముల గురించి, అతనిపై ఉన్న చెప్పుడు మాటల ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాం కదా! 

ఎంత మంచివారయినా తమ చుట్టూ ఉన్నవారిని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. ఆ విషయం దశగ్రీవుని విషయంలో నిజం అని మనం చూడవచ్చు. అతను తన చుట్టూ తన తాత సుమాలి, అతని మంత్రులు ఉన్నారు.  వారు చెప్పే మాటలు వింటూ కాలం గడుపుతున్న దశగ్రీవునికి వారి అలోచనలలో నుండి అనేక చెడ్డ ఆలోచనలు అతని మెదడులో ఊపిరి పోసుకోసాగాయి. అతని మనస్సులోనికి అరిషట్వర్గములు ప్రవేశించాయి. అతనికి తను సొంతం చేసుకున్న స్వర్ణలంక చిన్నది అనిపించసాగింది. హింస ప్రవృత్తి పెరిగింది. స్వార్ధం పెరిగిపోయింది. అహంకారం మితిమీరి ప్రవర్తించసాగాడు. ఋషులను మునులను భాదించడం మొదలు పెట్టాడు. అతని పద్దతులను, అతని జీవన విధానంలోని మార్పులను తెలుసుకున్న అతని అన్న కుబేరుడు అతనిని మార్చాలని అనుకున్నాడు. మరి అతను ఏమి చేసాడు? దశగ్రీవుడు అన్నగారి మాట విన్నాడా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

16, ఫిబ్రవరి 2022, బుధవారం

కుబేరుడు శివునితో స్నేహం

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి, అతను దొంగగా మారుట,  అతనికి శివలోకం లభించిన విధానం, తరువాత అతను దమనుడు అనే రాజుగా జన్మించి జన రంజకంగా పరిపాలించిన సంగతి ,తరువాత అతను పులస్త్యుని వంశంలో విశ్రవసునికి కుమారునిగా జన్మించడం, అతనికి వైశ్రవణుడు అని పేరు పెట్టడం, అతను దిక్పాలకత్వం పొందడం,  ఆ తరువాత అతనే కుబేరునిగా మారడం గురించి కూడా తెలుసుకున్నాం! అయితే ఆ కుబేరుడు పరమ శివునికి మిత్రుడు అని చెప్తారు. అతనికి పరమ శివునికి స్నేహం ఎలా కుదిరింది?

పార్వతిదేవి శాపానికి గురి అయిన తరువాత కుబేరుడు పశ్చాత్తాపాన్ని పొందాడు. ఆ పశ్చాత్తాపంతో సుదీర్ఘకాలం మౌనవ్రతం చేసాడు. అతని మౌనవ్రతాన్ని చూసి ప్రసన్నుడయిన ప్రమ శివుడు కుబేరిని వద్దకు వచ్చి, అటువంటి కఠినమయిన వ్రతమును పూర్వకాలంలో తాను స్వయంగా చేసానని, మళ్ళీ ఇంతకాలం తరువాత కుబేరుడు చేసాడు కనుక అతనికి తనతో సమానంగా, అతని స్నేహితుని స్థానం ఇచ్చాడు. అంతేకాకుండా అతనికి ఏకాక్షి అని పింగళి అని పేరు ఇచ్చాడు. 

26, జూన్ 2020, శుక్రవారం

వైశ్రవణునికి కుబేరుడు అనే పేరు ఎందుకు వచ్చింది?

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి, అతను దొంగగా మారుట,  అతనికి శివలోకం లభించిన విధానం, తరువాత అతను దమనుడు అనే రాజుగా జన్మించి జన రంజకంగా పరిపాలించిన సంగతి తెలుసుకున్నాం కదా!
మరి అంత జనరంజకంగా పరిపాలించిన గుణనిధి/ దమనుడు తరువాత ఏమి అయ్యాడు?
ధనునిగా తన తనువూ చాలించిన తరువాత, గుణనిధి ఆటను చేసిన పుణ్యఫలముల కారణంగా పులస్త్యుని వంశంలో విశ్రవసునికి కుమారునిగా జన్మించాడు. అతనికే వైశ్రవణుడు అని పేరు పెట్టారు. అతనే తరువాతి కాలంలో దిక్పాలకత్వం పొందాడు. అతనే లంకాధిపతిగా కొంతకాలం గడిపాడు. తరువాత తన తమ్ముడు అయిన  దశగ్రీవునిచేత అక్కడి నుండి తరుమబడి కైలాసం దగ్గరలో ఉన్న అలకాపురిలో తన నివాసం ఏర్పరచుకున్నాడు.
ఈ జన్మలో కూడా అతను సర్వదా శివధ్యానం చేస్తూ, దీప దానములు చేస్తూ ఉన్నాడు.
అదృష్టవశాత్తూ, అతని తపఃఫలంగా ఒకసారి శివుడు పార్వతీ సమేతుడయ్యి దర్శనం ఇచ్చాడు. శివుని పై ఉన్న భక్తి కారణంగా శివునికి నమస్కారం చేసిన వైశ్రవణునికి, శివుడు పార్వతికి కూడా నమస్కరించమని చెప్పాడు. శివుడు చెప్పిన మాటను విన్న వైశ్రవణుడు పార్వతిని చూసాడు. అలా చుసిన ఒక్క క్షణంలో ఆమె ఎంత తపస్సు చేస్తే ఇలా శివునిలో సగశరీర భాగం పొందగలిగిందో! అనే అసూయ కలిగింది.
వైశ్రవణునిలో ఎంత భక్తి కలిగినా అరిషట్వర్గములలో ఒకటయిన అసూయ కలిగిన కన్నులతో పార్వతిని చుసిన కారణంగా అతని కన్నుస్ఫుటిత నేత్రంగా మారిపొమ్మని చెప్పింది. అప్పటి నుండి ఆ వైశ్రవణుని అందరూ కుబేరుడు అని పిలిచారు.
కు = చెడ్డ / అసూయతో కూడిన
బేర = చూపు కల్గిన వాడు 

17, జూన్ 2020, బుధవారం

గుణనిధి - పునర్జన్మ- దమనుడు

గుణనిధి కోసం యమదూతలు, శివదూతలు వాదులాడుకుని చివరికి శివదూతలు గుణనిధిని కైలాసమునకు తీసుకువెళ్లారు. సూక్ష్మరూపంలో ఉన్న గుణనిధి వారి వాదనలను విన్నాడు. కైలాసమునకు వెళ్లిన గుణనిధి కొంతకాలం అక్కడ శివుని సేవలో గడిపేశాడు. కొంతకాలం తర్వాత ఆ గుణనిధి తన పూర్వజన్మలో చేసిన చివరి మంచిపనులు కారణంగా తిరిగి భూలోకంలో కళింగరాజ్యమునకు రాజయిన అరిందమునకు కుమారునిగా జన్మించాడు.
అరిందముడు తనకుమారునకు దమనుడు అని పేరుపెట్టారు. తిరిగి మానవునిగా జన్మించిన తరువాత కూడా అతనికి పూర్వజన్మ, చివరి కాలంలో జరిగిన సంఘటనలు గుర్తు ఉన్నాయి. అరిందముని తరువాత దమనుడు కళింగ రాజ్యమునకు రాజు  అయ్యాడు. అతను రాజు అయిన సమయం నుండి ప్రతి మాస శివరాత్రికి ప్రతిశివాలయంలో దీపములు ఏర్పాటుచేయాలని ప్రజలను కోరాడు.
అలా గుణనిధిగా సకల వ్యసనములకు బానిస అయిన వ్యక్తి అదృష్ట వశాత్తు శివపూజ చేసిన ఫలితంగా అతనికి ఉత్తమ గతులు ప్రాప్తించటమే కాక అతని ఒక రాజు అయ్యి తన రాజ్యంలో ఉన్న అందరు ప్రజలను కూడా శివుని భక్తులను చేసాడు. వారికి కూడా ఉత్తమ గతులను కలిగించాడు.  

7, మార్చి 2019, గురువారం

నటరాజ మూర్తి - ఆహార్యం

నటరాజ మూర్తి శివునికి గల అనేక రూపములలో ఒకటి అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అలాగే శివుని రూపం ఆహార్యం గురించి, వినాయకుని ఆహార్యం గురించి  దానిలో దాగి ఉన్న రూపాత్మకత గురించి కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాం! ఇప్పుడు నటరాజ రూపం ఆహార్యం గురించి చెప్పు కుందాం.
ఇది నటరాజ స్వామి రూపం. ఇప్పుడు మనం ఈ రూపం, దీనిలోని విశేషములు గురించి తెలుసు కుందాం.

నటరాజ స్వరూపం పంచ కృత్యాత్మకం. ఇది శివుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది.

  1. అపస్మారక పురుష : నటరాజు పాదముల కింద ఉన్న మానవుని రూపం అపస్మారక పురుషునిది. అపస్మారక స్థితిని నియంత్రణలో ఉంచితేనే జ్ఞానము ప్రకాశిస్తుంది అని దాని భావం 
  2. ఢమరు : పైన ఉన్న ఒక చేతిలో ఢమరు ఉంది. శివ రూప విశ్లేషణ లో మనం ఢమరు గురించి చెప్పు కున్నాం. ఇది నిరంతర జ్ఞాన ప్రవాహమునకు ప్రతీక 
  3. నిప్పు : పైన ఉన్న రెండవ చేతిలో నిప్పు ఉంది. ఈ నిప్పు లయమునకు ప్రతీక. అంతే కాకుండా మండపము వలే తన చుట్టూ అగ్ని కీలలు ఉంటాయి. ఇవి ప్రకృతి నటరాజ నాట్యమును సరిగా ప్రతిబింబిస్తాయి. 
  4. కింద ఉన్న ఎడమ చేయి పైకి లేచిన తన పాదమును చూపిస్తూ ఉంటుంది. తన పాదములను ఆశ్రయించమని దాని అర్ధం. 
  5. అభయ ముద్ర : క్రింద ఉన్న కుడి చేయి అభయ ముద్రలో ఉంటుంది. తన పాదములను ఆశ్రయించిన వారికి తన రక్ష సర్వదా ఉంటుంది అని ఈ అభయం. 
  6. జింక: కొన్ని చోట్ల నటరాజు చేతిలో జింక పిల్ల ఉంటుంది. జింక చంచలత్వమునాకు ప్రతీక. చంచలమయిన మనస్సును నియంత్రించుట అలవరచుకొమ్మని దాని అర్ధం. 
  7. పుర్రె : శివుని తలలో ఒక పుర్రె కనిపిస్తుంది. ఈ పుర్రె లయమునకు ప్రతీక 
  8. గంగ : నటరాజ సిగలోని గంగ కరుణకు ప్రతీక 
  9. నెలవంక : నటరాజ సిగలోని నెలవంక కాలమునకు ప్రతీక 
  10. భుజంగం : నటరాజు తలమీద ఉన్న పాము సహస్రార చక్రమును చేరుకొన్న కుండలిని శక్తి కి ప్రతీక
  11. మూడవ కన్ను : ఇది శివుని సర్వజ్ఞతకు ప్రతీక 
  12. మకర కుండలము: నటరాజ కుడి చెవికి మకర కుండలములు ఉంటాయి. ఇది పురుషత్వానికి ప్రతీక 
  13. తాటంకము: నటరాజు ఎడమ చెవికి తాటంకములు ఉంటాయి. ఇది స్త్రీత్వానికి ప్రతీక. 
  14.  పుఱ్ఱెల మాల: నటరాజు మెడలోని పుర్రెల మాల అనేక సృష్టి లయములకు ప్రతీకలు. 
  15. భస్మం : భస్మము స్వచ్ఛతకు ప్రతీక. ఈ వస్తువయినా అగ్నిలో పునీతమయితే మిగిలేది భస్మమే. అలాగే మానవుని జీవనానంతరం మిగిలేది కూడా భస్మమే. కనుక ఈ లోకములలోని ఆకర్షణలు చూసి దేవుని మరచిపోవద్దు అని హెచ్చరిక ఈ భస్మ దారుణం. 
  16. రుద్రాక్ష : ఈ రుద్రాక్షలు తన భక్తులు చేసిన పాపములు చూసి జాలితో దయతో శివుడు కార్చిన కన్నీరు అని చెప్తారు. కనుక రుద్రాక్షలు నటరాజు జాలి కి ప్రతీక 
  17. ఉపవీతం : నటరాజ స్వామి ఉపవీతంలో 96 పోగులు (దారపు వరుసలు) ఉంటాయట. ఇవి 96 తత్వములకు ప్రతీకలు అని చెప్తారు. ఇవి నటరాజు ధరించుట వలన వానికి అన్నింటికి తానే  అధిపతి అని అర్ధం. 
  18. పాము : నటరాజుని చుట్టుకుని ఉన్న పాము విశ్వశక్తి కి ప్రతీక 
  19. పులి చర్మం : పులి అహంకారమునకు, కామమునకు ప్రతీక. ఆ పులి చర్మమును ధరించుట వలన మన అహంకారమును, కామమును అదుపులో ఉంచగలను అని చెప్పుట. 


5, మార్చి 2019, మంగళవారం

త్రిశూలం

మనం ఇంతకు ముందు శివుని ఆహార్యం గురించి చెప్పుకున్నాం కదా! అక్కడ త్రిశూలం గురించి కొంచెం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ త్రిశూలం  గురించి మరికొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!

త్రిశూలం  అంటే మూడు శూలములు కలిగినది అని అర్ధం. ఈ త్రిశూలము
    • త్రి గుణములు - సత్వ, రజః తమో గుణములకు 
    • త్రికాలములు - భూత భవిష్యత్ వర్తమాన కాలములకు  
    • త్రిస్థితులకు - జాగృత్, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులకు 
    • త్రితాపములను - ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనే మూడు తాపములకు 
    • త్రి కార్యములకు - సృష్టి, స్థితి, లయము 
    •  ధర్మ, అర్ధ , కామములు 
శివుడు ఆది దేవుడు కనుక తన వద్ద ఉన్న శూలము ద్వారా మనలోని ఇన్ని చెడు గుణములను ఒకేసారి నియంత్రిOచ గలడు. వీనిని నియంత్రించటం ద్వారా తాను మాయకు అధిపతి అని మనకు తెలుస్తుంది. 
అయితే మరి ఉన్న మూడు శూలము లలో ఒకటి (మధ్యలోనిది) పొడవు కొంచం ఎక్కువగా ఉంటుంది కదా మరి అది ఎందుకు?
ఈ త్రిశూలం  మన మానవ దేహం లోని నాడీ వ్యవస్థను సూచిస్తుంది. అతి ముఖ్యమయిన ఇడా, పింగళ,  సుషుమ్న నాడులను ఇది సూచిస్తుంది. మన దేహంలో ఇదా పింగళ నాడులు భృకుటి మధ్యభాగం వరకు వస్తాయి (ఆజ్ఞా చక్రం వరకు మాత్రమే), కానీ సుషుమ్నా నాడి పైన ఉన్న 7 వ చక్రం (సహస్త్రార చక్రం) వరకూ వెళ్తుంది.

4, మార్చి 2019, సోమవారం

నటరాజు ఆరాధన - పంచ సభలు

పరమ శివుని అనేక రూపములలో అతి ముఖ్యమయినది నటరాజ రూపం. ఈ రూపం శివుని పంచ కృత్యములను సూచిస్తుంది. దేవాలయములలో నటరాజు ఆరాధన జరిగే ప్రదేశములను సభలు అంటారు. తమిళనాడు లోని వివిధ దేవాలయములలో ని అనేక సభలలో అతి ముఖ్యమయినవి పంచ సభలు. అవి

  1. కనక సభ - చిదంబరం 
  2. రజత సభ - మధురై 
  3. రత్న సభ - తిరువళంగడు
  4. తామ్రసభ -  తిరునెల్వేలి 
  5. చిత్రసభ - కుట్రాళం 
ఇవి కాక చెప్పుకోదగిన మరికొన్ని సభలు 
  1. అద్రి సభ - హిమాలయములు 
  2. ఆది చిత్ సభ - తిరువేంకాడు 
  3. పెరూర్ కనకసభ - పెరూర్ 

3, మార్చి 2019, ఆదివారం

శివుని అష్టమూర్తులు

 శివుని అష్టమూర్తి తత్వముల గురించి మన పెద్దలు అనేక రకములుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాని గురించి అవి మనం మన కళ్ళతో దర్శించుకోవటానికి  వీలుగా ఎక్కడ వెలిశాయో చెప్పుకుందాం. ఇంతకూ ముందు మనం శివుని పంచభూత లింగముల గురించి చెప్పు కున్నాం కదా ఇప్పుడు వానితో పాటు మిగిలిన మూడు లింగముల గురించి కూడా చెప్పు కుందాం.
శివుని అష్టమూర్తులు  సర్వప్రాణకోటి యొక్క సృష్టి, స్థితి మరియు లయములకు మూలమై ఉన్నాయి. అవి :

  1. శర్వ : భూ రూపము : శివుడు భూమి తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం భూరూపమున ఉన్న శివుని కంచి (తమిళ నాడు) లో ఏకామ్రేశ్వరునిగా దర్శించ వచ్చు 
  2. భవ : జల రూపము . శివుడు జలమే తనరూపముగా కలిగి ఉన్నాడు. మనం జలరూపమున ఉన్న శివుని జలగండేశ్వరము/ జంబుకేశ్వరం  (తమిళనాడు) లో జలగండేశ్వరునిగా దర్శించ వచ్చు. 
  3. రుద్ర : అగ్ని రూపము. శివుడు అగ్నిని తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం అగ్ని రూపమయిన శివుడ్ని అరుణాచలం(తమిళనాడు) లో అరుణాచలేశ్వరుని గా దర్శించవచ్చు 
  4. ఉగ్ర: వాయు రూపము . శివుడు వాయువే తన రూపముగా కలిగి ఉన్నాడు. మనం వాయురూపంలో ఉన్న శివుని శ్రీ కాళహస్తి (ఆంధ్రప్రదేశ్) లో శ్రీ కాళహస్తీశ్వరునిగా దర్శించవచ్చు. 
  5. భీమ : ఆకాశ రూపం . శివుడు ఆకాశమే తన రూపంగా కలిగి ఉన్నాడు. మనం ఆకాశ రూపంలో ఉన్న శివుని చిదంబరం (తమిళనాడు)లో చిదంబరేశ్వరుని గా దర్శించవచ్చు. 
  6. పశుపతి : క్షేత్రజ్ఞ రూపం. అంటే ప్రతి జీవిలో ఉండే జీవాత్మరూపం. మనం ఈ క్షేత్రజ్ఞుడయిన రూపమును  ఖాట్మండు (నేపాల్)లో పశుపతినాధ్ గా దర్శించవచ్చు. 
  7. ఈశాన : సూర్య రూపం. సూర్యుడు స్వయంగా సూర్యునిగా ఉన్నాడు. మనం ఈ సూర్య రూపంలోని శివుని కోణార్క్ (ఒరిస్సా) లో సూర్య లింగునిగా దర్శించవచ్చు. 
  8. మహాదేవ : సోమ రూపం. శివుడు చంద్ర రూపంలో ఉన్నాడు. మనం సోమరూపంలో శివుని చట్టగావ్ (పశ్చిమ బెంగాల్)లో సోమనాథుని గా దర్శించవచ్చు. 
శివుడు సర్వ ప్రాణులయందు సర్వదా ఉంటాడు అనటానికి, ప్రతిజీవి పరమాత్మ రూపం అని చెప్పటానికి ఈ ఎనిమిది రూపములలో ఉన్న శివుడే తార్కాణం. ఎందుకంటే ఈ ఎనిమిది కాకుండా మరొక రూపం/ వస్తువు/ స్థితి ఈ సమస్త సృష్టి లో మరొకటి లేదు. 
ఓం నమః శివాయ 

9, జనవరి 2019, బుధవారం

శ్రీ శివ మహా పురాణం- శ్లోకముల సంఖ్య

మనం ఇంతకు ముందు పురాణములు 18 అని చెప్పుకున్నాం కదా! వానిలో నాలుగవది అయిన శ్రీ శివ మహాపురాణంను ముందుగా స్వయంగా మహాదేవుడే చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆ పురాణము 12 సంహితలుగా చెప్పబడినది. అవి, వానిలోని శ్లోకముల సంఖ్య చుద్దాం!
  1. విద్వేశ్వర సంహిత – 10,000
  2. రుద్ర సంహిత – 8,000
  3. వినాయక సంహిత – 8,000
  4. ఉమా సంహిత – 8,000
  5. మాతృ సంహిత -8,000
  6. ఏకాదశ రుద్ర సంహిత – 13,000
  7. కైలాస సంహిత – 6,000
  8. శతరుద్ర సంహిత - 3,000
  9. కోటి రుద్ర సంహిత – 9,000
  10. సహస్త్ర కోటి రుద్ర సంహిత – 12,000
  11. వాయవీయ సంహిత – 4,000
  12. ధర్మ సంహిత – 12,000


అనగా మొత్తం 1,00,000 ఒక లక్ష శ్లోకములు ఉండేవి. తరువాతి కాలంలో పురాణములు రచించునప్పుడు వేదవ్యాసుడు శివపురాణమును 7 సంహితలుగా 24,000 శ్లోకములతో రచించాడని చెప్తారు. 
అవి 
  1. విద్వేశ్వర సంహిత
  2. రుద్ర సంహిత
  3. శతరుద్ర సంహిత
  4. కోటి రుద్ర సంహిత
  5. ఉమా సంహిత
  6. కైలాస సంహిత
  7. వాయవీయ సంహిత

5, జనవరి 2019, శనివారం

శివ లీలలు

ఈ అనంత విశ్వంలో భగవంతుని అనేక రూపములలో మనం ఆరాధిస్తూ ఉంటాము. దేవాధిదేవుడయిన మహాదేవుని  మనం అరూప రూపిగా పూజించటానికి మన పెద్దలు ఎన్నో రూపములు ప్రతిపాదించారు. వానిలో శివుని లీలలుగా 23 రూపములను వర్ణించారు. ఆ 23 శివ లీలలు
  1. సోమస్కంద మూర్తి
  2. కల్యణ సుందర మూర్తి
  3. నటరాజ మూర్తి
  4. వీరభద్ర మూర్తి
  5. శరభ సాళువ మూర్తి
  6. బిక్షాటన మూర్తి
  7. కామారి
  8. ఏకపాదుడు
  9. సుఖావహ మూర్తి
  10. దక్షిణా మూర్తి
  11. విషాపహరణ మూర్తి
  12. కంకాళ మూర్తి
  13. అజారి మూర్తి
  14. హరిహర మూర్తి
  15. త్రిపురాసుర సంహార మూర్తి
  16. లింగోధ్భవ మూర్తి
  17. గణేశానుగ్రహ మూర్తి
  18. చండేశానుగ్రహ మూర్తి
  19. చక్రప్రధాన మూర్తి
  20. కిరాత మూర్తి
  21. అర్ధ నారీశ్వర మూర్తి
  22. వృషభారూఢ మూర్తి
  23. కాలారి

11, ఆగస్టు 2018, శనివారం

పంచకృత్యములు

భగవానుడు ముఖ్యం గా చేసే పనులు ఐదు. వానిని పంచకృత్యములు అంటారు. అవి

  1. సృష్టి : సకల చరాచర జీవుల వృద్ధి ని సృష్టి అంటారు
  2. స్థితి : సృష్టించిన జీవరాశి మనుగడ క్రమశిక్షణ న్యాయాన్యాయ క్రమాక్రమ విచక్షణ భారమును వహించుటను స్థితి అంటారు 
  3. సంహారం : స్థూలరూపంలో ఉన్న  సూక్ష్మీకరించటాన్ని సంహారం అంటారు 
  4.  తిరోభావం : సూక్ష్మీకరించబడిన దానిని తిరిగి స్థూల రూపముగా సృష్టించి వరకూ కాపాడటాన్ని తిరోభావం అంటారు 
  5. అనుగ్రహం : పై నాలుగు స్థితులలో పరిభ్రమించుచున్న జీవుడిని తిరిగి పరమాత్మలో కలుపుకోవటాన్ని అనుగ్రహం అంటారు