30, ఏప్రిల్ 2020, గురువారం

విభావసుడు - సుప్రతీకుడు

మనకు పురాణములలో, ఇతిహాసములలో మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి చాలా విపులంగా చర్చించాయి.
రామాయణంలో సోదరుల మధ్య నమ్మకం, ప్రేమ ఎలా ఉంటాయో చూపించారు, అలాగే  భారతంలో దాయాదుల మధ్య గొడవలు మొదలయితే అవి ఎంతవరకు వెళతాయో కూడా చెప్పారు. అటువంటి మరోకథ మహాభారతంలో ఉంది.  ఇద్దరు అన్నదమ్ములు అస్తి  కోసం గొడవపడుతూ ఆ గొడవను తరువాతి జన్మలో కూడా కొనసాగించారు.  మరి ఆ కధ ఎమిటో చూద్దామా!
విభావసుడు - సుప్రతీకుడు  అని ఇద్దరు అన్నదమ్ములు. వారికి పెద్దలనుండి చాలా ఆస్తి సంక్రమించింది.  తమ్ముడయిన సుప్రతీకుడు అన్నగారిదగ్గరకు వెళ్లి  ఆస్తి ని ధర్మంగా పంచమని కోరాడు. దానికి విభావసుడు అంగీకరించలేదు. ఇలా వారి గొడవ పెరిగి పెద్దది అయ్యి, విభావసుడు సుప్రతీకుని ఏనుగుగా జన్మించమని, సుప్రతీకుడు విభావసుని తాబేలువు కమ్మని ఒకరికి ఒకరు శాపం ఇచ్చుకున్నారు.
అలా శాపం ఇచ్చుకున్న కారణంగా కొంతకాలానికి ఇద్దరు ప్రాణములు విడచి ఆ శాపముల ప్రకారం ఒకరు ఏనుగు గాను మరొకరు తాబేలు గాను జన్మించి, పూర్వజన్మ లోని శతృత్వం కారణంగా జంతు జన్మలో కూడా ఆ శతృత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ గొడవ కొన్ని వేల యేండ్లవరకు సాగింది.
మరి ఇంతకీ వీరి గొడవ ఎలా తీరింది? వీరి గొడవ తీరలేదు, వారు ఇద్దరూ  గరుడునికి  ఆహారం అయ్యారు. ఆ విషయం మరో టపాలో!!

 

29, ఏప్రిల్ 2020, బుధవారం

హనుమంతుడు - తొమ్మిది అవతారములు

హనుమంతునికి ముఖ్యముగా తొమ్మిది అవతారాలు ఉన్నాయి అని చెప్తారు. దీనిని గురించి పరాశర సంహిత లో ప్రస్తావించారు.

ఆద్య: ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతిభుజః చతుర్దః పంచ వక్త్రకః
పంచమో ష్టాదశ భుజః శరణ్యస్సర్వ దేహినాం
సువర్చలాపతి షష్ఠః సప్తమస్తు చతుర్భుజ ః
అష్టమః కధితశ్శ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండలః
నవమో వానరాకార ఇత్యేవం నవరూపధృక్

భావం:: ప్రసన్న హనుమదవతారం, వీరాంజనేయ అవతారం, వింశతి (ఇరవై భుజములు కలిగిన ) భుజాంజనేయావతారము, పంచముఖాంజనేయావతారము, అష్టాదశ భుజాంజనేయావతారము (పద్దెనిమిది భుజముల), సువర్చలాహనుమావతారం, చతుర్భుజాంజనేయావతారం(నాలుగు భుజములు), ద్వాత్రింశత్ భుజాంజనేయావతారం  (ముప్పది రెండు భుజముల), వానరాంజనేయావతారము. 

28, ఏప్రిల్ 2020, మంగళవారం

వినత- గరుడుడు

మనం ఇంతకు ముందు వినత కద్రువల గురించి వారి అసూయ, మదము- క్రోధము గురించి చెప్పుకున్నాం కదా!!
ఆ తరువాతి కధ ఇప్పుడు చూద్దాం!

మరునాడు వినత కద్రువలు వెళ్లి ఆ అశ్వాన్ని చూసారు. ముందే అనుకున్న ప్రకారం కద్రువ కొంచెం దూరం నుండి ఆ గుర్రాన్ని చూసే ఏర్పాటు చేసింది. కర్కోటకుడు వెళ్లి ఆ గుర్రం తోకను పట్టుకుని ఉన్నాడు. అలా ఆ గుర్రాన్ని దూరంగా చూస్తున్న వారికి దాని తోకలో కొంతభాగం నల్లగా కనిపించింది. అంటే వారి షరతు ప్రకారం వినత కద్రువకు దాస్యం చేయాలి .

అప్పటి నుండి వినత కద్రువకు దాసీ గా ఉండిపోయియింది. కొంతకాలానికి వినతకు మిగిలిన రెండవ గుడ్డు లోనుండి గరుడుడు జన్మించాడు. అతను కూడా ఒక దాసీ పుత్రునిగా కద్రువకు, ఆమె పుత్రులకు సేవలు చేస్తూ ఉన్నాడు. అతను పక్షి కనుక తన రెక్కల మీద కద్రువ పిల్లలయిన పాములను ఎక్కించుకుని గాలిలోకి తీసుకెళ్లి విహారం చేయించేవాడు. అలా ఉండగా ఒకసారి  గరుడుడు ఆ పాములను అత్యంత ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు. అలా ఎత్తుగా సూర్యునికి దగ్గరగా వెళ్ళటం వలన గరుడుని రెక్కల మీద ఉన్న పాములు ఆ వేడిని తట్టుకోలేక తమ పట్టుజారి కిందకి పడిపోయాయి. తన పుత్రుల దీనావస్థ చూసిన కద్రువ ఇంద్రుని ప్రార్ధించి వర్షం కురిపించి, వారిని కాపాడుకున్నది. జరిగిన దానికి గరుడుని నిందించినది.

తరువాత గరుడుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ఈ దాస్యం చేయటానికి గల కారణం తెలుసుకున్నాడు. ఆ పాముల వద్దకు వెళ్లి తనను, తన తల్లిని దాస్యము నుండి విముక్తి కలిగించటానికి ఏమి చేయాలి అని అడిగాడు. దానికి వారు అతనిని స్వర్గం నుండి అమృతమును  తెచ్చి ఇవ్వమని అడిగారు.

తనతల్లి అనుమతితో అమృతమును తెచ్చి వారికి ఇవ్వటానికి బయలుదేరాడు. తాను ఆ ఘనకార్యం సాధించే ముందు తన ఆకలి తీరే మార్గం చెప్పమని అడిగాడు. అప్పుడు ఆమె సముద్రంలో ఉన్న కిరాతులను తినమని చెప్పింది. అవి తిని అతను తన తండ్రి కశ్యపుని దగ్గరకు ఆశీర్వాదము పొందటానికి బయలుదేరాడు. 

27, ఏప్రిల్ 2020, సోమవారం

వైశాఖం - విశిష్టత

స్కంద పురాణములో ప్రతి సంవత్సరము లో వచ్చే పన్నెండు నెలలో ఏ నెలలు ముఖ్యమయినవి అని, ఆ యానెలలలో ఏమి చేయాలి అని చెప్పారు.

తతో మాసా విశిష్ట్యోక్తాః కార్తీకోమాఘఏవచా 
మాధవ స్తేషు వైశాఖం మాసానాముత్తమం వ్యధాత్ 

భావం : అన్ని మాసములలో విశిష్టమయిన మాసములుగా కార్తీకం, మాగము మరియు మాధవం అని పిలువబడే వైశాఖం ముఖ్యమయినవి.

మరి అంత  విశిష్ట కలిగిన ఈ వైశాఖ మాసంలో ఏమి చేస్తే మానవునకు మంచి జరుగుతుంది? మానవునికి మంచి జరుగుతుంది అని చెప్పటంలో మన పెద్దల దృష్టి ఎలా ఉంటుంది అని ఇక్కడ మనం చూడవచ్చు. మనకి మంచి జరగాలి అంటే మనం ఈ సమాజానికి ఎం చేయగలం అని అర్ధం. ఎండలు ఎక్కువగా ఉండే ఈ వైశాఖ మాసంలో ఏమి చెయ్యాలో కింద శ్లోకంలో చెప్పారు.

మార్గే ధ్వగానాంయోమర్త్యః ప్రపాదానంతకరోతిహి
సంకోటికులముద్ధృత్య విష్ణులోకే మహీయతే

భావం: అనేక మంది నడిచే మార్గమద్యములో ఒక చలివేంద్రము ఏర్పరచి వైశాఖమాసములో ఎవరయితే బాటసారులకు మంచినీటిని అందిస్తూ ఉంటారో అటువంటి సత్పురుషునకు, అతనితో పాటు అతని వంశమునందు జన్మించిన తరువాతి అనేక తరముల వారికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది. 

26, ఏప్రిల్ 2020, ఆదివారం

తెలుగు మధురమయిన పద్యం-1

కవి హృదయం, అతను చెప్పబోయే విషయముల మీద అత్యంత నిమగ్నమై, ఆ విషయమును అద్భుతంగా చెప్పే ప్రయత్నంలో ఉంటుంది.
అటువంటి ఒక మధురమయిన తెలుగు పద్యం ఇప్పుడు ఒకటి చూద్దామా!
ఈ పద్యం కవిరాజ శిఖామణి నన్నెచోడుడు రచించిన కుమారసంభవం లోనిది.

హరి వికచామలాంబుజసహస్రము పూన్చి మృగాంకునం దవి 
న్ఫురిత మలాసితాబ్జమని పుచ్చగ జాచిన చేయి చూచి చం 
దురు డది రాహు సావి వెఱ దుప్పల దూలగ జారుచున్న న 
య్యిరువుర జూచి నవ్వు పరమేశ్వరు డీవుత మా కభీష్టముల్

భావం: విష్ణువు చక్కగా వికసించిన, కొంచెము కూడా మురికి లేకుండా శుభ్రపరచి వేయి తామర పువ్వులతో శివుని శిరస్సు పైన పూజించు చుండగ, ఆ శివుని తలపైన ఉన్న చంద్రుడ్ని చూసి,
ఆ చంద్రుని కూడా ఒక కమలం అనుకుని, ఆ కమలంలో ఎదో మచ్చ కనిపించుటతో ఆ పువ్వు మలినమైంది అని అనుకుని, ఆ ఆపువ్వును అక్కడ నుండి తన చేతితో  తీయబోగా
తనవైపు వచ్చుచున్న నల్లని చేతిని చూచిన చంద్రుడు ఆ చేతిని రాహువుగా భావించి తన నిజస్థానము నుండి కిందకు జారాడు. అలా చంద్రుడు కదలటం చుసిన విష్ణువు కూడా తన చేతిని వెనుకకు తీసాడు. అలా జారుచున్న విష్ణువు, చంద్రులను చూసి నవ్వుతున్న పరమేశ్వరుడు మాకు గల కోరికలను తీర్చును గాక.

విశ్లేషణ: ఈ పద్యంలో విశేషం ఏంటంటే విష్ణువు ఇంకా చంద్రుడు ఇద్దరు శివునికి సన్నిహితమయినవారే. అయితే కవి ఇక్కడ ఊహించిన విధానం చాలా హృద్యంగా ఉంది. పూజకు సిద్ధం చేసిన పువ్వులు ఎంతో శుభ్రంగానే  ఉన్నాయి.  ఆ పువ్వుల మధ్యలో ఉన్న చంద్రుడు కూడా ఒక పువ్వులాగే కనిపించాడు. అయితే చంద్రునిలో సహజంగా ఉన్న మచ్చల కారణంగా అది మురికిగా ఉన్న పువ్వు అని విష్ణువు భావించాడు. ఆ మలినమయిన పువ్వు ని తీయాలనే ఉద్దేశం తో దానిని తీయటానికి తన చేయి చాచాడు. అయితే అలా తన వద్దకు వస్తున్న  విష్ణుమూర్తి చేతిని చూసి అది రాహువు అనుకున్నాడు. దానికి కారణం విష్ణుమూర్తి  నలుపుగా  ఉంటాడు కనుక అతని చెయ్యి కూడా నల్లగా ఉంటుంది. రాహువు ఛాయాగ్రహం. కనుక విష్ణుమూర్తి చేతిని రాహువుగా ఊహించారు.
ఇక్కడ అద్భుతం ఏంటి అంటే విష్ణువు, చంద్రుడు ఇద్దరూ కూడా లేని విషయమును ఉహించుకుని దాని గురించి భయపడ్డారు. అటువంటి అపోహలను పోగొట్టాలంటే అవి ఊహలు అని తెలిసిన వాళ్ళ వాల్ల మాత్రమే అవుతుంది. ఇక్కడ వారి ఇద్దరి అపోహలను పోగొట్ట గలిగిన వాడు శివుడు. కనుక ఆ పరమ శివుడు మన కోరికలను తీర్చగలడు ఆని ఆతనిని మన కవి  ప్రార్ధిస్తున్నాడు.




  

25, ఏప్రిల్ 2020, శనివారం

పురుషుడు - అష్టపురములు

మనం సహజంగా పురుష శబ్దాన్ని మగవారి కోసం వాడతాము. కానీ మన పూర్వీకుల కధనం ప్రాకారం పురుష అనే శబ్దానికి అర్ధం అష్టపురములను ఆధారము చేసుకుని జీవనం సాగించేవారు అని అర్ధం. మరి ఇంతకీ ఆ అష్టపురములు అంటే ఏమిటి?

జ్ఞానేంద్రియాణి ఖలు పంచ తథాపరాణి కర్మేంద్రియాణి మనః ఆది చతుష్టయం చ
ప్రాణాదిపంచకమధో వియదాదికం చ కామశ్చ కర్మచ తమః పున రష్టధాపూః


భావం ః  జ్ఞానేంద్రి యాలు (ఐదు), కర్మేంద్రియాలు (ఐదు), అంతః కారణములు (నాలుగు, అవి మనస్సు ,బుద్ధి, చిత్తము మరియు అహంకారము), ప్రాణాలు (ఐదు), పంచభూతములు, కామము, కర్మ మరియు అజ్ఞానము ఈ ఎనిమిది ని కలిపి అష్టపురములు అంటారు.

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

పంచ క్లేశములు

మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆ అషట కష్టములకు మాత్రమే కాక అసలు మానవుని బాధలకు కారణమయిన ఐదు కిలేసముల గురించి చెప్పుకుందాం. ఆ పంచ క్లేశములు

  1. అవిద్యాక్లేశము : తన నిజ స్వరరూపమును గుర్తించకుండా తాని ఒక జీవుడు అని అనుకోవటం అవిద్య క్లేశము
  2. అభినవ క్లేశము : సంసారమును, దానిని పట్టుకుని ఉండే మనస్సును అంటి పెట్టుకొనుట/ వదలకుండా ఉండుట అభినవ క్లేశము 
  3. అస్థిగత క్లేశము : విషయములలో అత్యంత నిమగ్నుడు అయ్యి గర్వించుట అస్థిగత క్లేశము
  4. రాగ క్లేశము : ధనము మొదలగు వానిలో మిక్కిలి కోరిక కలిగి ఉండుట రాగ క్లేశము
  5. ద్వేషక్లేశము : మన పనుల కోసం పక్కవారిని ఆశ్రయించి వారి వలన సహాయం పొందుతూ తిరిగి వారి పైననే ద్వేషము కలిగి ఉండుట ద్వేష క్లేశము 

22, ఏప్రిల్ 2020, బుధవారం

అష్టభోగములు

మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం!మరి ఇప్పుడు అష్టభోగములు అంటే ఏమిటో చెప్పుకుందామా! ఆ అష్టభోగముల గురించి చెప్పే శ్లోకం

దాసో భృత్యస్సుతో బంధుర్వస్తు వాహన మేవచ
ధనధాన్యసమృద్ధిశ్చాప్యష్టభోగాః ప్రకీర్తితాః 


భావం:: దాసులు, భృత్యులు, కుమారులు, బంధువులు, కావలసిన సకల వస్తువులు, వాహనములు, సరిపోయినంత ధనము, ధాన్యము కలిగి ఉండటాన్ని అష్టభోగములు కలిగి ఉండుట అని చెప్తారు.

దాసులు అంటే ధనమును తీసుకుని సేవలు చేసేవారు, భృత్యులు అంటే మనమీది గౌరవముతోలేదా అభిమానంతో మన కోసం పనులు చేసేవారు, పున్నామ నరకము నుండి తప్పించేవాడు కనుక కుమారుడు, ఏదయినా అవసరమునకు ఆడుకోవటానికి బంధువులు, వస్తువులు, వాహనములు, మనం తినటానికి దానం చేయటానికి వీలుగా ధనము ధాన్యము ఇన్ని ఉన్నవానికి ఇంకా ఏమి కావాలి? కనుకనే ఇవి అన్ని కలిపి అష్టభోగములు అంటారు.

20, ఏప్రిల్ 2020, సోమవారం

అజ్ఞాన భూమిక

అజ్ఞాన భూమిక అంటే మనలో అజ్ఞానము స్థిరముగా ఉండటానికి కారణములు అని అర్ధము.  ఆ అజ్ఞాన భూమికలు ఏడు ఉన్నాయి. వీని గురించి  శ్రీసీతారామాంజనేయ సంవాదం అనే గ్రంధంలో చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం!!


  1. బీజాగ్రము:: నామ రూప రహిత,  అఖండ  పరిపూర్ణ స్చచిదానంద పరబ్రహ్మమందు జగత్తు ని సృషించాలి అనే ఆలోచన  బీజాగ్రము
  2. జాగ్రము::  ఆ ఆలోచన కలుగుటకు ముందులేని బేధము/ మార్ఫు చిన్నగా మొదలయ్యి అది ప్రపంచముగా మార్ఫు  చెందుట జాగ్రము
  3. మహాజాగ్రము:: ప్రపంచము లో  వచ్చిన అనేకములయిన మార్పులకు అనుగుణముగా మారుట మహాజాగ్రము
  4. జాగ్రత్స్వప్నము:: జాగ్రదవస్థ లో కనిపించని వానిని ఉహించి, మనస్సులో దానిని గురించి ధ్యానము చేయుట జాగ్రత్స్వప్నము. (పగటి కలలు)
  5. స్వప్నము:: జాగ్రదవస్థలో లేనప్పుడు కల్పితమయిన రూపములు చూచుట ఆజాగ్రమందు కల్పిత స్వరూపములు చూచుట స్వప్నము
  6. స్వప్నజాగ్రము:: ఇంతకు  ముందు జరిగినదానిని మరల మరలా గుర్తుకు తెచ్చుకోవటం స్వప్నజాగ్రము
  7. సుషుప్తి:: ఆత్మ ప్రతిబింబముగా అనిపిస్తున్న జగత్తుకు సంబందించిన విషయములలో మునుగుట సుషుప్తి




18, ఏప్రిల్ 2020, శనివారం

సర్పవరం- శ్రీనాధుడు

మనం ఇంతకు ముందు సర్పవరం లోని భావనారాయణ దేవాలయం గురించి, అక్కడ ఉన్న నారద కుండం, ముక్తి కుండం గురించి  చెప్పుకున్నాం కదా! అదే సర్పవరం లోని భావనారాయణుని గురించి చెప్తూ ఆ ఉరి గురించి మహాకవిసార్వభౌముడు శ్రీనాధుడు తన భీమఖండం లో ఏమని వర్ణించారో చూద్దామా !!

శ్రీ సుదర్శన శంఖ చిహ్నాంకితముగాక యెప్పుడు మిన్నకయున్న యిల్లు లేదు
బహులోర్ధ్వపుండ్ర సంపదలేక వృధయైన ఫాలలేఖల తోడి ప్రజయు లేదు
వైష్ణవోత్తమ భాగవతసాత్త్వికుల గోష్ఠి వెలియైనవాటికా వేది లేదు
నాలీనేక్షణుడు భావనారాయణ స్వామి దప్పించి పరదైవతంబు లేదు

భావం :  సర్పవరంలో శ్రీ మహావిష్ణు సంబంధమయిన శంఖం చక్రం గుర్తులు లేని ఇల్లు లేదు, చక్కగా పెద్దవిగా ఊర్ధ్వపుండ్రములు (నిలువు బొట్టు) చక్కగా పెట్టుకోకుండా వృథాగా ఉన్న నుదిటితో ఉన్న ప్రజలు లేరు, మంచి మంచి వైష్ణవ భాగవతోత్తముల గోష్ఠి జరుగని అరుగు లేదు, భావనారాయణుడు తప్ప మరో దైవము లేడు.







16, ఏప్రిల్ 2020, గురువారం

యమధర్మ రాజు - విదురుడు?

మనం ఇంతకు ముందు మహాభారతంలోని అనేక వ్యక్తులు ఏ ఏ అంశలతో జన్మించారో చెప్పుకున్నాం కదా! ఆ క్రమం లో యమధర్మ రాజు అంశతో  విదురుడు జన్మించాడు అని చెప్పాం  కదా! అలా యమలోక పాలకుడు అయిన యముడు మానవునిగా, అందులోనూ రాజ్యాధికారం లేని విధంగా ఒక శూద్రునిగా ఎందుకు జన్మించాడు? అని ఇప్పుడు తెలుసుకుందాం!
    ఈ సంఘటనకు మూలం మాండవ్యుడు అనే ఒక మహర్షి. ఈ కధ మనకు మహాభారతంలోని ఆదిపర్వం లో కనిపిస్తుంది.

మాండవ్యుడు అనే మహర్షి ఒంటరిగా అనేక తీర్ధయాత్రలు చేస్తూ చివరకు ఒక నగరముదగ్గరలో ఒక ఆశ్రమము నిర్మించుకుని మౌనదీక్షలో కాలం గడుపుతూ రెండుచేతులూ పైకి ఎత్తి తప్పస్సు చేసుకుంటున్న సమయంలో, ఆ నగరంలో దొంగతనం చేసిన ఇద్దరు దొంగలు, వారిని తరుముకుంటూ వచ్చిన రక్షకభటులు ఆ ఆశ్రమంలోనికి వచ్చారు. ఎవరికీ కనిపించకుండా దొంగలు దాక్కున్నారు. ఆ వచ్చిన రక్షకభటులు తపస్సులో ఉన్న మహర్షిని దింగల గురించి అడిగారు. కానీ మౌనదీక్షలో ఉన్న మహర్షి సమాధానం చెప్పకపోవడంతో వారే ఆశ్రమం లోనికి వెళ్లి దొంగలను పట్టుకుని, ఆ దొంగలకు ఆశ్రయం ఇచ్చారు అన్న నేరంతో మహర్షిని కూడా రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజుగారు దొంగలకు సరిఅయిన శిక్ష విధించి, వారిని కాపాడటానికి ప్రయత్నించారు అనే నేరమునకు గాను మహర్షికి శూలదండన విధించారు. అంటే ఒక పదునయిన శూలం మీద కూర్చోబెట్టారు.
అలా శిక్షను అనుభవిస్తున్న సమయంలో అతని వద్దకు కొందరు మహర్షులు పక్షులరూపంలో వచ్చి ఇలా మాండవ్య మహర్షికి ఇలా జరగటానికి కారణం ఏమిటి అని అడుగగా, మాండవ్యముని చేసిన కర్మలకు ఫలితాలు అవే వస్తాయి అని సమాధానం చెప్పారు. ఆ మాటలు విన్న కొందరు రక్షక భటులు రాజుగారికి సమాచారం ఇవ్వగా రాజుగారు మాండవ్య మహర్షి వద్దకు వచ్చి క్షమాపణ అడిగి ఆ శూలదండన శిక్షను రద్దు చేశారు. కానీ అప్పటికే శూలం పూర్తిగా గొంతువరకు దిగబడి ఉంది. కనుక ఆ శూలంను బయటకు తెచ్చే ప్రయత్నం మానేసి ఆ శూలంను అతని శరీరంలోనే విరిచేసారు. తరువాత కొంతకాలానికి మాండవ్య మహర్షి చనిపోయారు.
 అతను అప్పుడు యముడిని కలిసి, ఇంత భయంకరమయిన శిక్ష అతనికి లభించటానికి కారణం అడిగారు. అప్పుడు యముడు మాండవ్యమహర్షి చిన్నతనంలో తూనీగలతో ఆడుతూ వాటికి కష్టం కలిగించుట వలన ఈ శిక్ష లభించింది అని చెప్పారు. కానీ చిన్నతనంలో తెలిసి తెలియక చేసిన చిన్న తప్పుకోసం ఇంట పెద్ద శిక్ష వేయటం అధర్మం, ధర్మారాజుగా పిలువబడే యముడే ఇటువంటి తప్పు చేయుట వల్ల మాండవ్యమహర్షి అతనిని శపించారు.
ఆ శాపమే ధర్మ జ్ఞానం కలిగి ఉండి అందరికీ ధర్మమును భోదించుట, ఉత్తమ వీర్య సంజాతుడు అయినా రాజ్యార్హత లేదు.  మళ్ళీ మళ్లీ ఇతని ధర్మబోధ విన్న తర్వాత కూడా ధృతరాష్ట్రుడు సన్మార్గంలోకి రాలేదు. 

13, ఏప్రిల్ 2020, సోమవారం

మహాభారతం - అంశలు

మహాభారతం గురించి ఇంతకు ముందు మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆ మహాభారతంలో ఉన్న అనేకమంది వ్యక్తులు ఎవరు ఎవరి అంశలో  పుట్టారో ఇప్పుడు చూద్దాం!

శ్రీ మహావిష్ణువు - శ్రీకృష్ణుడు
ఆదిశేషుడు - బలరాముడు
లక్ష్మి - రుక్మిణి
సనత్కుమారుడు - ప్రద్యుమ్నుడు
అప్సరసలు - 16 వేల మంది శ్రీకృష్ణుని అంతఃపుర స్త్రీలు
ప్రభాసుడు (ఎనిమిదవ మనువు) - దేవవ్రతుడు (భీష్ముడు)
దేవగురువు (బృహస్పతి) - ద్రోణుడు
కామము + క్రోధము - అశ్వద్ధామ
ఏకాదశ రుద్రులు - కృపుడు
సూర్యుడు - కర్ణుడు
ద్వాపరం - శకుని
అరిష్టా పుత్రుడయిన హంసుడు (గంధర్వ) - ధృతరాష్ట్రుడు
మతి  - గాంధారి
కలి - దుర్యోధనుడు
హిరణ్య కశిపుడు - శిశుపాలుడు
సంహ్లాదుడు - శల్యుడు
అనుహ్లాదుండు - దృష్టకేతుడు
శిబి - దుమ్రసేనుడు
భాష్కలుడు - భగదత్తుడు
విప్రచిత్తి - జరాసంధుడు
స్వర్భాను - ఉగ్రసేనుడు
జంబుండు - విశోకుడు
అశ్వపతి - కృతవర్మ
వృషపర్వుడు - దీర్ఘ ప్రజ్ఞుడు
అజరుడు - మల్లుడు
అశ్వగ్రీవుడు - రోచమానుడు
సూక్ష్ముడు - బృహద్రధుడు
దుహుడు - సేనాబిందుడు
ఏక చక్రుడు - ప్రతివింద్యుడు
విరుపాక్షుడు - చిత్రవర్మ
హరుడు - సుబాహు
ఆహరుడు - బాహ్లికుడు
చంద్రవక్త్రుడు - ముంజకేశుడు
నికుంభుడు - దేవాపి
శరభుడు - సోమదత్తుడు
చంద్రుడు - చంద్రవర్మ
అర్కుడు - ఋషికుడు
మయూరుడు - విశ్వుండు
సుపర్ణుడు  - క్రోధకీర్తి
రాహువు - క్రోధుడు
చంద్రహంత - శునకుడు
అశ్వుడు - అశోకుడు
భద్రహస్తుడు - నందుడు
దీర్ఘజిహ్వుడు - కాశీరాజు
చంద్రవినాశనుడు - జానకి
బలీనుడు - పౌండ్ర
వృత్రుడు - మణిమంతుడు
కాలనేమి - కంసుడు
గుహ్యకుడు - శిఖండి
మరుత్గణము - పాండురాజు
మరుత్తులు - ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు
మాండవ్య ముని శాపం వలన యమ ధర్మరాజు - విదురుడు
సిద్ధి - కుంతి
బుద్ధి - మాద్రి
యముడు - ధర్మరాజు
వాయువు - భీముడు
ఇంద్రుడు - అర్జునుడు
అశ్వినీ దేవతలు - నకుల సహదేవులు
స్వర్గ లక్ష్మి - ద్రౌపది
అగ్ని - దృష్టద్యుమ్నుడు 

11, ఏప్రిల్ 2020, శనివారం

అనగనగానే ఎందుకు?

మొన్న ఆ మధ్య ఒక మిత్రుడు ఈ ప్రశ్న వేసాడు. మన తెలుగు కధలు అన్నీ  అనగనగా అనే ఎందుకు మొదలవుతాయి అని?
నాకు కూడా ముందుగా తెలియలేదు కానీ ఆలోచిస్తే ఒక సమాధానం దొరికింది. ఈ సమాధానం మీకుకూడా సమంజసంగా ఉంటుందేమో చూద్దామా!

ఈ మధ్య సినిమాలు, సీరియళ్లు చూస్తున్నప్పుడు వానికి ముందు "DISCLAIMER" అని ఒకటి వేస్తున్నారు కదా! అంటే ఈ సినిమాలోని పాత్రలు కేవలం కల్పితం ఎవరినీ  ఉద్దేశించినవి కావు అని, అలాగే మన అనగనగా కూడా ఒక "DISCLAIMER" అని నా ఉద్దేశం. 

అంటే ఈ కధ నేను చెప్పటంలేదు, నాతో ఎవరో అన్నారు, వారితో ఇంకెవరో అన్నారు, ఇలా అందరూ  అనగనగా ఆ కధ నేను మీకు చెప్తున్నాను అని అయ్యి ఉంటుంది అని నా భావన. 

ఒకవేళ మీకు ఎలా కాకుండా ఇంక  ఏమయినా సమాధానం తెలిస్తే దయచేసి చెప్పగలరు!

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

గతకాలము మేలు వచ్ఛుకాలము కంటెన్

 ఈ మాట మనకు సహజంగా పెద్దల నోట వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల కంటే ఇంతకూ ముందు ఉన్న మారోజులే బాగుండేవి అని చెప్పే సందర్భంలో ఈ పద్య పాదమును వాడుతూ ఉంటారు. అయితే ఈ పద్య పాదం ఎక్కడిది?

ఈ పద్యపాదం నన్నయ ఆంధ్రీకరించిన మహా భారతంలోని ఆది పర్వంలోనిది. ఆది పర్వం పంచమాశ్వాసం లో 159వ  ఆ పద్యం మీకోసం 


మతిఁ దలఁపఁగ సంసారం 
బతి చంచల మెండమావులట్టుల సంప 
త్ప్రతతు లతిక్షణి కంబులు 
గతకాలము మేలు వచ్ఛుకాలము కంటెన్ 

ఈ పద్యము సాక్షాతూ వ్యాసుడు తన తల్లి సత్యవతి తో మాట్లాడుతున్న సందర్భం లోనిది. ఆమెను ఇక వానప్రస్థము స్వీకరించమని చెప్తున్న సందర్భంలోనిది. కానీ ఈ పద్య భావం మనకు అన్ని సందర్భాలలోనూ అన్వయించుకోవటానికి అనువుగా ఉంటుంది. 

భావం:  మనస్సులో అలోచించి చూస్తే ఈ సంసారం ఎండమావుల వలే చాలా చంచలమైనది. సంపదలు ఎంతో కాలం నిలువవు. కావున రాబోయే రోజులకంటే ఎల్లప్పుడూ గడచిన రోజులే మేలు. 

1, ఏప్రిల్ 2020, బుధవారం

లంక ఎవరిది?

రామాయణం  ప్రకారం లంకాధిపతి రావణుడు. అతని కంటే ముందు అది ధనాధీశుడు అయిన కుబేరుని ఆధీనంలో ఉండేది. అయితే లంక రక్షా జాతికి సంబందించినది అని కూడా చెప్తారు. మరి ఇంతకీ లంక అని పిలువబడే సువర్ణలంక ఎవరిది?

ఈ ప్రశ్న కు సమాధానం మనకు రామాయణంలోని ఉత్తరకాండ లో దొరుకుతుంది.
ఈ నగరాన్ని సువర్ణ మయంగా నిర్మించిన వాడు దేవతల శిల్పి విశ్వకర్మ. త్రికూటా చల పర్వతం మీద ఇటువంటి ఒక నగరమును నిర్మించమని కోరినవాడు స్వయానా ఇంద్రుడు. కాలాంతరమున ఇంద్రుడు ఆ విషయమును మరచిపోయాడు.
తరువాతి కాలంలో దేవతలమీద యుద్ధం జయించిన తరువాత రాక్షసులయిన మాల్యవంతుడు, మాలి , సుమాలి లు తమ కోసం నివాసయోగ్యమయిన స్థలమును చూపించమని విశ్వకర్మను అడుగగా వారికి త్రికూటాచల శిఖరాలపై నిర్మించిన లంకను అతను చూపించాడు. ఆ తరువాతి కాలంలో విష్ణు భయం చేత రాక్షసులు లంకను వదలి పాతాళం లో దాక్కున్నారు.  అలా లంక తిరిగి అనాధ అయ్యింది.
తరువాత కొంత కాలానికి విశ్రవసుడు తన పుత్రుడయిన  వైశ్రవునకు  ఆ లంకను నివాస భూమిగా నియమించాడు. అలా ఆ లంక కొంతకాలం యక్షులకు నిలయం అయ్యింది.
ఆ తరువాత అదే విశ్రవసుని పుత్రుడయిన దశకంఠుడు దానిని స్వాధీనం చేసుకున్నాడు. అలా మరలా లంక రాక్షసుల నిలయం అయ్యింది.