శివ లీలలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివ లీలలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మే 2020, సోమవారం

విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?

మనం ఇంతకుముందు హనుమంతుడు శివుని అంశ ,వాయువు పుత్రుడు ఎలా అయ్యాడు అని చెప్పుకున్నాం! దానితో పాటు దశరధుని పుత్రకామేష్టి ఫలమయిన పాయసం కారణంగా హనుమానితుడు జన్మించాడు అనే విషయం కూడా చెప్పుకున్నాం!  మరి అసలు హనుమంతుని జన్మకు సార్ధకత అతని దాస్యభక్తి అని మనకు అందరికి తెలుసు కదా! మరి విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?
మన పురాణములలో ఒక కథాప్రకారం అవును అనే చెప్పుకోవాలి మరి. ఆ కధ ఏమిటో చూద్దామా!

పుర్వకాలంలో గార్దభనిస్వనుడు అనే ఒక పరమశివ భక్తుడు ఉండేవాడు. అయితే ఎల్లప్పుడూ శ్రీహరిని ద్వేషిస్తూ ఉండేవాడు. శివునికి భక్తుడు అవ్వటం వలన శివునికొరకు  అత్యంత ఘోరమయిన తపస్సు చేసి తనకు జాగ్రత్తు, సుషుప్తి మరియు స్వప్నావస్థలలో ఎవ్వరి చేత మరణం రాకుండా వరం సంపాదించాడు. ఆ వర గర్వంతో  విష్ణుభక్తులను హింసించటం మొదలుపెట్టాడు.    అలాగే  దేవతలను కూడా హింసించాడు. అతని బాధలు పడలేక దేవతలు, మునులు బ్రహ్మదగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ వారిని తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. వారి బాధలని ఆలకించిన శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి, ఆ రాక్షసుడిని చంపి, అందరికి శాంతిని కలిగిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట విన్న శివుడు విష్ణువు వద్దకు వచ్చి, అతను గార్దభనిస్వనుని కి ఇచ్చిన వరముల గురించి చెప్పి, అతనిని నిర్జించుట అసాధ్యం అని చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీహరి నవ్వి పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు కదా! అలాగే గార్దభనిస్వనుడు కూడా మరణిస్తాడు అని చెప్పారు. శ్రీ హరి చెప్తున్న ఆ మాటలు విన్న శివునికి కుతూహలము పెరిగి, ఒకవేళ శ్రీ మహావిష్ణువు కనుక ఆ గార్దభనిస్వనుడిని సంహరించినట్లయితే తాను స్వయంగా శ్రీమహా విష్ణువుకు దాస్యం చేస్తాను అని పలికారు.
శివుని మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వారు.
తరువాత అతను విశ్వమోహన సౌందర్యవతియైన జగన్మోహిని రూపందాల్చి ఆ గార్దభనిస్వనుడు నివసించే అంతఃపురం దగ్గరకు వెళ్లి మధురస్వరంతో సామవేద గానం ప్రారంభించారు. ఆ అద్భుత గానమునకు ఆకర్షితుడయ్యి గార్దభనిస్వనుడు అంతఃపురంనుండి బయటకు వచ్చి ఆ జగజన్మోహిని సౌందర్యం చుసి మోహితుడయ్యి  ఆమె ఎవరు? ఎక్కడినుండి వచ్చింది? మొదలయినవి వివరములు అడిగాడు. తరువాత అతని గురించి గొప్పలు చెప్పుకున్నాడు, అలా చెప్పుకుని ఆమెను తనని వివాహం చేసుకోమంటూ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనను వినిన మోహిని,  ఆమెను నాట్యగానములలో  ఓడించితే అలాగే చేద్దాం అని అతనికి సవాలు చేసింది. ఆ సవాలని స్వీకరించిన అతను అలా  నాట్యం చేస్తున్న మోహినిని చూసి మైమరిచిపోసాగాడు. ఆ అదును చూసుకుని మోహిని అతనికి సురాపానమును చేతికి అందించింది. ఆమెమీద వ్యామోహం తో ఉన్న గార్దభనిస్వనుడు దానిని  తాగి జాగ్రదావస్థ కాక స్వప్నావస్తా కాక ఉన్న సమయంలో జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు వృకనారాయణావతారం ధరించి గార్దభనిస్వనుడిని తన వాడి అయిన గోళ్ళతో చంపివేసాడు.

ఆ విషయం తెలుసుకున్న శివుడు శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి తాను దాస్యమును స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాను అని తెలుపగా దానికి శ్రీమహావిష్ణువు ఆ దాస్యమునకు సరిఅయిన సమయం అప్పుడు కాదని, ద్వాపర యుగంలో  తాను శ్రీరామావతార సమయంలో ఆ ముచ్చట తీర్చుకుందాం అని చెప్పారు.
తరువాత శ్రీహరి తన రామావతారమును గురించి, ఆ సమయంలో అతనికి శివుని అవసరం గురించి ఇలా చెప్పారు.
రామావతారంలో నా శక్తి అయిన లక్ష్మి అపహరించబడినప్పుడు, నేను నా అవతార కార్యమును పూర్తిగావించుటకు నాకు తోడుగా ఓ మహాదేవా! తమరు ఆదిశక్తి సహితముగా నా అంశను కూడా పొంది , ఆ కార్యమును సాధించుటకు నాకు నవ్యశక్తి ని ప్రసాదించి, నన్ను పరిపూర్ణునిగా చేయండి. 

7, మార్చి 2019, గురువారం

నటరాజ మూర్తి - ఆహార్యం

నటరాజ మూర్తి శివునికి గల అనేక రూపములలో ఒకటి అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా! అలాగే శివుని రూపం ఆహార్యం గురించి, వినాయకుని ఆహార్యం గురించి  దానిలో దాగి ఉన్న రూపాత్మకత గురించి కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాం! ఇప్పుడు నటరాజ రూపం ఆహార్యం గురించి చెప్పు కుందాం.
ఇది నటరాజ స్వామి రూపం. ఇప్పుడు మనం ఈ రూపం, దీనిలోని విశేషములు గురించి తెలుసు కుందాం.

నటరాజ స్వరూపం పంచ కృత్యాత్మకం. ఇది శివుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది.

  1. అపస్మారక పురుష : నటరాజు పాదముల కింద ఉన్న మానవుని రూపం అపస్మారక పురుషునిది. అపస్మారక స్థితిని నియంత్రణలో ఉంచితేనే జ్ఞానము ప్రకాశిస్తుంది అని దాని భావం 
  2. ఢమరు : పైన ఉన్న ఒక చేతిలో ఢమరు ఉంది. శివ రూప విశ్లేషణ లో మనం ఢమరు గురించి చెప్పు కున్నాం. ఇది నిరంతర జ్ఞాన ప్రవాహమునకు ప్రతీక 
  3. నిప్పు : పైన ఉన్న రెండవ చేతిలో నిప్పు ఉంది. ఈ నిప్పు లయమునకు ప్రతీక. అంతే కాకుండా మండపము వలే తన చుట్టూ అగ్ని కీలలు ఉంటాయి. ఇవి ప్రకృతి నటరాజ నాట్యమును సరిగా ప్రతిబింబిస్తాయి. 
  4. కింద ఉన్న ఎడమ చేయి పైకి లేచిన తన పాదమును చూపిస్తూ ఉంటుంది. తన పాదములను ఆశ్రయించమని దాని అర్ధం. 
  5. అభయ ముద్ర : క్రింద ఉన్న కుడి చేయి అభయ ముద్రలో ఉంటుంది. తన పాదములను ఆశ్రయించిన వారికి తన రక్ష సర్వదా ఉంటుంది అని ఈ అభయం. 
  6. జింక: కొన్ని చోట్ల నటరాజు చేతిలో జింక పిల్ల ఉంటుంది. జింక చంచలత్వమునాకు ప్రతీక. చంచలమయిన మనస్సును నియంత్రించుట అలవరచుకొమ్మని దాని అర్ధం. 
  7. పుర్రె : శివుని తలలో ఒక పుర్రె కనిపిస్తుంది. ఈ పుర్రె లయమునకు ప్రతీక 
  8. గంగ : నటరాజ సిగలోని గంగ కరుణకు ప్రతీక 
  9. నెలవంక : నటరాజ సిగలోని నెలవంక కాలమునకు ప్రతీక 
  10. భుజంగం : నటరాజు తలమీద ఉన్న పాము సహస్రార చక్రమును చేరుకొన్న కుండలిని శక్తి కి ప్రతీక
  11. మూడవ కన్ను : ఇది శివుని సర్వజ్ఞతకు ప్రతీక 
  12. మకర కుండలము: నటరాజ కుడి చెవికి మకర కుండలములు ఉంటాయి. ఇది పురుషత్వానికి ప్రతీక 
  13. తాటంకము: నటరాజు ఎడమ చెవికి తాటంకములు ఉంటాయి. ఇది స్త్రీత్వానికి ప్రతీక. 
  14.  పుఱ్ఱెల మాల: నటరాజు మెడలోని పుర్రెల మాల అనేక సృష్టి లయములకు ప్రతీకలు. 
  15. భస్మం : భస్మము స్వచ్ఛతకు ప్రతీక. ఈ వస్తువయినా అగ్నిలో పునీతమయితే మిగిలేది భస్మమే. అలాగే మానవుని జీవనానంతరం మిగిలేది కూడా భస్మమే. కనుక ఈ లోకములలోని ఆకర్షణలు చూసి దేవుని మరచిపోవద్దు అని హెచ్చరిక ఈ భస్మ దారుణం. 
  16. రుద్రాక్ష : ఈ రుద్రాక్షలు తన భక్తులు చేసిన పాపములు చూసి జాలితో దయతో శివుడు కార్చిన కన్నీరు అని చెప్తారు. కనుక రుద్రాక్షలు నటరాజు జాలి కి ప్రతీక 
  17. ఉపవీతం : నటరాజ స్వామి ఉపవీతంలో 96 పోగులు (దారపు వరుసలు) ఉంటాయట. ఇవి 96 తత్వములకు ప్రతీకలు అని చెప్తారు. ఇవి నటరాజు ధరించుట వలన వానికి అన్నింటికి తానే  అధిపతి అని అర్ధం. 
  18. పాము : నటరాజుని చుట్టుకుని ఉన్న పాము విశ్వశక్తి కి ప్రతీక 
  19. పులి చర్మం : పులి అహంకారమునకు, కామమునకు ప్రతీక. ఆ పులి చర్మమును ధరించుట వలన మన అహంకారమును, కామమును అదుపులో ఉంచగలను అని చెప్పుట. 


4, మార్చి 2019, సోమవారం

నటరాజు ఆరాధన - పంచ సభలు

పరమ శివుని అనేక రూపములలో అతి ముఖ్యమయినది నటరాజ రూపం. ఈ రూపం శివుని పంచ కృత్యములను సూచిస్తుంది. దేవాలయములలో నటరాజు ఆరాధన జరిగే ప్రదేశములను సభలు అంటారు. తమిళనాడు లోని వివిధ దేవాలయములలో ని అనేక సభలలో అతి ముఖ్యమయినవి పంచ సభలు. అవి

  1. కనక సభ - చిదంబరం 
  2. రజత సభ - మధురై 
  3. రత్న సభ - తిరువళంగడు
  4. తామ్రసభ -  తిరునెల్వేలి 
  5. చిత్రసభ - కుట్రాళం 
ఇవి కాక చెప్పుకోదగిన మరికొన్ని సభలు 
  1. అద్రి సభ - హిమాలయములు 
  2. ఆది చిత్ సభ - తిరువేంకాడు 
  3. పెరూర్ కనకసభ - పెరూర్ 

5, జనవరి 2019, శనివారం

శివ లీలలు

ఈ అనంత విశ్వంలో భగవంతుని అనేక రూపములలో మనం ఆరాధిస్తూ ఉంటాము. దేవాధిదేవుడయిన మహాదేవుని  మనం అరూప రూపిగా పూజించటానికి మన పెద్దలు ఎన్నో రూపములు ప్రతిపాదించారు. వానిలో శివుని లీలలుగా 23 రూపములను వర్ణించారు. ఆ 23 శివ లీలలు
  1. సోమస్కంద మూర్తి
  2. కల్యణ సుందర మూర్తి
  3. నటరాజ మూర్తి
  4. వీరభద్ర మూర్తి
  5. శరభ సాళువ మూర్తి
  6. బిక్షాటన మూర్తి
  7. కామారి
  8. ఏకపాదుడు
  9. సుఖావహ మూర్తి
  10. దక్షిణా మూర్తి
  11. విషాపహరణ మూర్తి
  12. కంకాళ మూర్తి
  13. అజారి మూర్తి
  14. హరిహర మూర్తి
  15. త్రిపురాసుర సంహార మూర్తి
  16. లింగోధ్భవ మూర్తి
  17. గణేశానుగ్రహ మూర్తి
  18. చండేశానుగ్రహ మూర్తి
  19. చక్రప్రధాన మూర్తి
  20. కిరాత మూర్తి
  21. అర్ధ నారీశ్వర మూర్తి
  22. వృషభారూఢ మూర్తి
  23. కాలారి