30, మార్చి 2022, బుధవారం

నల దమయంతుల వివాహం అందరికి సంతోషకారకం అయ్యిందా?

మనం ఇంతకు ముందు దమయంతి నల మహారాజుల వివాహం గురించి,  ఆ వివాహానికి దేవతలు రావడం, వారిని పరిక్షించి,వారికి వరములను ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత వారి  జీవితంలో సంభవించిన మార్పులను గురించి ఇప్పుడు చూద్దాం! 

ఇంద్రాది దేవతలు స్వయంవరం అయిన తరువాత ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా వారికి ద్వాపర, కలి యుగములు భౌతిక దేహముతో పురుషుల వలే ఎదురు వచ్చారు. వారిని చుసిన దేవతలు వారిని ఆపి ఎక్కడకు బయలుదేరారు అని అడుగగా వారు దమయంతి స్వయంవరం లో పాల్గొనడానికి వెళ్తున్నామని చెప్పారు. వారిద్దరిలో కూడా కాళీ అత్యంత ఉత్సాహంగా ఉండడాన్ని గమనించిన దేవతలు వారికి ఆ స్వయంవరం పూర్తి అయినది అని చెప్పారు. ఆ మాటలు విన్న ఆ ఇద్దరు యుగ పురుషులు నిరాశ చెందారు. కానీ దేవతలు అంతటితో ఆగకుండా ఆ దమయంతి నలుని తప్ప దేవతలను కూడా వివాహం చేసుకోనని చెప్పిందని, దానికి ప్రముఖ మయిన కారణం నలుని ధర్మ పరాయణత అని చెప్పిన మాటలు వారు చెప్పారు. 

ఆయా మాటలను విన్న  కలి  కి ఆవేశం వచ్చింది.నలునిలో ఉన్న ఏ ధర్మదక్షతను ఆమె అతనిని వరించిందో ఆ ధర్మమునకు నలుని దూరం చేస్తాను అని కలి ప్రతిజ్ఞ చేసాడు. 

అలా కాళీ చేసిన ప్రతిజ్ఞ కు ద్వాపరుడు కూడా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. 

మరి వారు నలుని నిజంగా ధర్మ బ్రష్టుని చేశారా? లేదా? చేస్తే ఎలా చేయ గలిగారు? దాని వలన నల దమయంతిల జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అని తరువాతి టపా లలో చూద్దాం!

16, మార్చి 2022, బుధవారం

విదుర నీతి - 13

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు అంతే కాకుండా పండితులకు ఉండే ముఖ్య లక్షణముల గురించి తెలుసుకుందాం! 


సంస్కృత శ్లోకం:

నాప్రాప్యమభివాంచంతి నష్టం నేచ్ఛన్తి శోచితుం

ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

పోయిన దానికిదాదల పోయడశక్యార్ధములకుబోడాపదలన్

బాయడు ధైర్యముదీనుల రోయడుతత్వజ్ఞుడగునరుండు మహీశా!

భావంః పండితుడు తను పొందలేక పోయినదాని గురించి దుఃఖించడు, తనకు సాధించడానికి అసాధ్యమయిన లక్ష్యములను సాధించాలని కోరుకొనడు, తన లక్ష్యములను సాధించే క్రమంలో ఎదురయిన సమస్యలను చూసి ధైర్యమును కోల్పోడు, అంతే కాకుండా తన ముందు ఎవరయినా ధైర్యమును కోల్పోయిన వారిని అనాదరించడు. 

15, మార్చి 2022, మంగళవారం

నలుడు, దమయంతిల వివాహం

మనం ఇంతకుముందు దమయంతి స్వయంవరమునకు దేవతలు వచ్చారని, వారు నలుని దమయంతి వద్దకు రాయభారానికి పంపారని, ఆ రాయబారాన్ని తీసుకుని నలుడు దమయంతి దగ్గరకు వెళ్ళడం గురించి చెప్పుకున్నాం!

నలుడు దమయంతి సమాధానాన్ని దేవతలకు చెప్పాడా? వారు స్వయంవరమునకు ఎలా వచ్చారు?ఆ తరువాత స్వయంవరం ఎలా జరిగింది?  అని ఇప్పుడు తెలుసుకుందాం!

దమయంతి సమాధానమును నలుడు దిక్పాలకులయిన దేవతలకు తెలియజేసాడు. దమయంతి సమాధానమును విన్న దేవతలు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు, కానీ వారు దమయంతి స్వయం వరమునకు తప్పకుండా రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దిక్పాలకులు నలుగురు (ఇంద్ర,వరుణ,అగ్ని మరియు యమధర్మరాజు) ఆ స్వయంవరమునకు నలుని రూపంలో వచ్చారు.

ఆ స్వయంవరమండపం లో అన్ని రాజ్యముల నుండి రాజులు వచ్చారు. వారిలో కొందరు కేవలం ఆమెను చూడడానికి మాత్రమే వచ్చారు. దమయంతి తన చేతిలో వరమాలతో ఆ మండపం లోనికి వచ్చింది. ఆఅమె పక్కన ఉన్న చెలికత్తెలు ఆమెకు ఒకొక్క రాజు గొప్పతనమును చెబుతూ వస్తున్నారు. అలా వస్తున్న వారికి ఒక దగ్గర ఐదుగురు నల మహారాజులు కనిపించారు. అప్పుడు చెలికత్తెలకు ఏమి చెప్పాలో అర్ధంకాలేదు. దమయంతికి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉంది. ఆమెకు అక్కడ ఉన్న ఐదుగురిలో ఒక్కడు నలుడు ఆని మిగిలిన వారు దేవతలు అని తెలుసు కనుక ఆమె వారిని మనస్సులోనే ప్రార్ధించడం మొదలుపెట్టింది. వారిలో మానవుడయిన నలుడు ఎవరో తెలుసుకొనగలిగే ఉపాయమును చెప్పమని కోరుకున్నది. ఆమె దృడసంకల్పానికి సంతోషించిన దేవతలు నిజమయిన నలుని పాదములు భూమిని తాకుతూ ఉంటాయని ఆమెకు స్పురించింది. ఆమె అక్కడ ఉన్న ఐదుగురు నలమహారాజులను గమనించింది. ఆ ఐదుగురిలో కేవలం ఒక్కరి పాదములు మాత్రమే నేలను తాకుతూ ఉన్నాయి. మిగిలిన నలుగురి పాదములు భూమిని తాకకుండా ఉన్నయి. అప్పుడు దమయంతి తన వరమాలను నలుని మెడలో వేసింది. 

వారి వివాహాన్ని చూసి సంతోషించిన ఇంద్రుడు, నల మహారాజు చేసే ప్రతి యజ్ఞమునకు స్వయంగా వచ్చి హవిర్భాగమును స్వీకరిస్తానని, అగ్నిదేవుడు నలుని కోరికపై అతను ఎక్కడ కావాలంటే అక్కడకు వస్తానని, వరుణుడు కూడా నలుని కోరికపై ఎక్కడికి అయినా వస్తానని, యమధర్మరాజు నలుని మనస్సు ఎల్లవేళలా ధర్మం పైననే నిలచేలా చేస్తానని వరములు ఇచ్చారు. 

14, మార్చి 2022, సోమవారం

అష్ట వినాయకులు

 మనం ఇంతకు ముందు ఏకాదశ రుద్రుల గురించి,  నవ బ్రహ్మల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం స్వయంభువులుగా అవతరించిన అష్ట వినాయకుల గురించి తెలుసుకుందాం!

వీని గురించి స్వయంగా వేద వ్యాసుడే ఒక శ్లోకంలో చెప్పాడు. ఆ శ్లోకం ఇప్పుడు మనం చూద్దాం!

స్వస్తిశ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం

బల్లాళం మురులం వినాయక మిదం చింతామణీ దేవరం

లేన్యాద్రిం గిరిజాత్మకం సురవరం విఘ్నేశ్వరం ఓఝురం

గ్రామే రంజన సంస్థితో గణపతిః కుర్యాత్ సదా మంగళం

  1. మయూరేశ్వరుడు
  2. సిద్ధి వినాయకుడు
  3. బల్లాళేశ్వరుడు
  4. వరద వినాయకుడు
  5. చింతామణి గణపతి
  6. గిరిజా పుత్రుడు
  7. విఘ్నేశ్వరుడు
  8. మహాగణపతి

13, మార్చి 2022, ఆదివారం

దశగ్రీవుడు రావణుడు ఎలా అయ్యాడు?

 మనం ఇంతకుముందు మనం దశగ్రీవునికి నంది ఇచ్చిన శాపం గురించి తెలుసుకున్నాం కదా! ఆ తరువాత ఏమి జరిగింది? దశగ్రీవునికి రావణ అనేపేరు ఎలా వచ్చింది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం!

నంది శాపం తరువాత దశగ్రీవుడు తన పుష్పక విమానమును ఆపిన ఆ పరమేశ్వరుని కోసం చూశాడు. కానీ నంది దశగ్రీవుని వెళ్ళనివ్వలేదు. అప్పుడు వారి మధ్య చిన్న యుధ్ధం జరిగింది. ఆ సందర్భంలో దశగ్రీవుని అహం, గర్వం మరింతగా పెరిగి, విచక్షణ కోల్పోయాడు. ఏ శిఖరం మీద అయితే పరమేశ్వరుడు ఉన్నాడని నంది చెప్పాడో ఆ శిఖర మూలమును, కొండనే ఎత్తాలని ప్రయత్నం చేసాడు. దానికోసం అతను తన పది తలల, ఇరవై చేతుల బలములను ఒడ్డాడు. అప్పుడు, ఆ కైలాస శిఖరం కొద్దిగా కంపించింది. ఆ కంపనమునకు పార్వతీదేవి తన భర్త చేతిని కొంచెం గట్టిగా పొదివి పట్టుకుంది. ఆమె భయమును పోగొట్టాలంటే ఆ కంపనను ఆపాలన్న ఉద్దేశంతో తన కాలి బొటనవేలుని కొద్దిగా నొక్కి ఉంచాడు. 

పైనుండి వచ్చిన ఆ ప్రతిఘటనను అతని శక్తి తట్టుకోలేక అతను ఆ కొండకింద ఇరుక్కుపోయాడు. ఆ సమ్దర్భంలో అతను చాలా పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఆ అరుపులకు ముల్లోకములు అల్లాడిపోయాయి. ఆ శబ్ధానికి దేవేంద్రుని దేవలోకం కూడా కంపించింది. ఆ సందర్భంలో దశగ్రీవుడు బ్రహ్మదేవుని సహాయం కోరాడు. కానీ ఆ సమయంలో అతనిని పరమేశ్వరుడు తప్ప ఎవ్వరూ కాపాడలేరని తెలుసుకుని, అతనినే ప్రార్ధించడం, స్తుతించడం మొదలుపెట్టాడు. 

అతని గర్వం ఆ సందర్భాన్ని బట్టి కొంతవరకు తగ్గింది. అతను ఎంతో పెద్దగా అరుస్తూనే స్తుతించడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడచిన తరువాత, శివుడు సంతోషించి తన పట్టును సడలించాడు. అప్పుడు దశగ్రీవుడు తన చేతులను, కాళ్ళను ఆ పర్వతం క్రిందినుండి తీసుకుని, లేచి నిలబడ్డాడు. 

అతనిని చూసి భోళాశంకరుడు అయిన పరమేశ్వరుడు  దశగ్రీవునికి వరం ఇవ్వాలని అనుకున్నాడు. అంతేకాక అతని అరుపుల వలన అన్నిలోకములు అదిరిపోయాయి, భయమునకు గురి అయ్యాయి కనుక అతనికి "రావణ" అనే పేరు ఇచ్చాడు. 

తరువాత రావణుడు అతనికి పరమేశ్వరుడు ఇస్తానన్న వరమును గుర్తు చేస్తూ, అతనికి ఇంతకుముందే బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ప్రసాదించాడు కనుక తనకు అమరత్వమును గురించిన వరము అవసరములేదని, అయితే ఇంతకు ముందు తపస్సు కారణంగా, ఇప్పుడు కైలాస పర్వతమును ఎత్తేకారణంగా అతని ఆయుష్షు తగ్గిపోయినది కనుక అతని ఆయుష్షును తిరిగి ఇవ్వమని, అంతేకాకుండా ఆతనికి ఒక దివ్య ఆయుధం ఇవ్వవలసినదిగా కోరుకున్నాడు. అతను కోరుకున్న వరములను ఇచ్చిన పరమేశ్వరుడు అతనికి చంద్రహాసము అనే ఒక దివ్య ఖడ్గమును ఇచ్చాడు. ఆ ఖడ్గమును భక్తితో పూజించమని, ఒకవేళ దానికి అవమానం జరిగితే అప్పుడు ఆ ఖడ్గం అతని వద్దకు తిరిగి చేరుతుంది అని చెప్పాడు. ఆ షరతునకు అగీకరించిన రావణుడు పరమేశ్వరుని వరములను స్వీకరించి తిరిగి పుష్పక విమానం ఎక్కి తన లంకకు వెళ్ళిపోయాడు. 

ఇక్కడ విషయం మనం చూస్తే, రావణునికి అతనికి అమరత్వం ఉన్నది అని గట్టి నమ్మకం లేదు. కారణం అతనికి అమరత్వం ఉన్నది  అని నమ్మకం ఉంటే అతను తన తరిగిపోయిన ఆయుష్షు గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు కదా! కానీ అతను అతని తరిగిపోయిన ఆయుష్షుని తనకు ఇవ్వమని కోరుకున్నాడు. అతని వివేకం పూర్తిగా పోయింది. అతని ముర్ఖత్వం, ఆవేశం, దురుసుతనం, అతను కోరుకున్నది చేయాలనుకునే పట్టుదల అతనికి పెరిగిపోయింది. అతని ఆలోచనలు మరింత క్రూరంగా మారిపోయాయి. 

దశగ్రీవుడు రావణునిగా మారడం అతని పతనమునకు నాంది అని చెప్పవచ్చు. 

11, మార్చి 2022, శుక్రవారం

విదుర నీతి - 12

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు అంతే కాకుండా పండితులకు ఉండే ముఖ్య లక్షణముల గురించి తెలుసుకుందాం! 

సంస్కృత శ్లోకం:

క్షిప్రం విజానాతి ఛిరంశ్రుణోతి, విజ్ఞాయ చార్ధం భజతేన కామాత్

నా సంపృష్ణో వ్యౌపయుంక్తే పరార్ధే, తత్ప్రజ్ఞానం ప్రధమం పండితస్య 

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

వినుటగురూక్త వాక్యమును వేగముజెందక సావధానత్

వినియదిమానసంబున జపించుటపిమ్మట తత్పదార్ధముం

గనుటయుదానగార్యమనఘంబుగజేయుట పృష్టుడయ్యుదా

మునవచియింపకుండుటివి ముఖ్యగుణంబులు కౌరవేశ్వరా!


భావం:

ఏ విషయమును అయినాసరే సులభంగా అర్ధం చేసుకునే గుణం, ఎంతసేపయినా ఎదుటి వారు చెప్తున్న విషయాలను శ్రద్ధగా వినే గుణం, కావాలనుకున్న దానిని కేవలం కోరికతో మాత్రమే కాకుండా ఉచితానుచితములు అలోచించి పొందాలని అనుకునే గుణం, ఇతరుల గురించిన విషయములు అవసరము లేనిదే అడుగని గుణం అనేవి పండితులకు ఉండే ముఖ్య గుణములు.

8, మార్చి 2022, మంగళవారం

దశగ్రీవుని మరణానికి ఒక కారణం నంది శాపమా?

మనం ఇంతకుముందు దశగ్రీవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం! అతని వివాహం, అతని జననం, పక్కవారి ప్రభావం వలన అతను తన విచక్షణా శక్తిని కోల్పొతున్న సందర్భాలగురించి, తెలుసుకున్నాం! కానీ  దశగ్రీవునికి నంది శాపం ఎందుకు ఇచ్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం!

తన అన్న కుబేరుని ఓడించిన తరువాత  దశగ్రీవుడు పుష్పక విమానం సొంతం చేసుకుని గర్వంతో విర్రవీగ సాగాడు. అలా ఒకసారి హిమాలయ పర్వతముల మీదుగా వెళ్తూఉండగా అతని విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ముందుకు వెళ్ళలేదు. అలా విమానం ఆగిపోవడనికి కారణం ఏమిటో అర్ధంకాలేదు. అప్పుడు అక్కడికి శివుని భక్తుడు, అనుచరుడు అయిన నంది వచ్చాడు. 

ఆ విమానం అలా అగిపోవడానికి కారణం వారు ఉన్న ప్రాంతం అని, ఆ ప్రాంతంలో పరమేశ్వరుడు పార్వతీ దేవితో సంచారం చేస్తుంటాడు కనుక అక్కడి నుండి ఎవ్వరూ వెళ్ళకూడదు కనుక తన మార్గమును మార్చుకొమ్మని చెప్పాడు. అప్పటికే గర్వం తలకెక్కిన  దశగ్రీవుడు నంది చెప్పిన మాటలను విని, నందిని, అతని సగం మనిషి మరోసగం ఎద్దు రూపమును చూసి ఆ ఎద్దులా ఉన్న ముఖాన్ని చూసి, కోతిలా ఉన్నది అని హేళన చేసాడు. అంతే కాకుండా పరమేశ్వరుడు అనే పేరు అతను ఇంతకు ముందు తన అన్న కుబేరుని వద్ద విని ఉండడం వల్ల అన్నగారి మీద కోపం పరమేశ్వరుని పైకిమారింది, అందువలన అతను కోపంగా ఆ పరమేశ్వరుడు ఎవరు? అని అమర్యాదగా మాట్లాడాడు. 

అతని మాటలకు కోపగించిన నంది అతనిని శపించాడు. అతని శాపం ప్రకారం  దశగ్రీవుడు, అతని జాతి, కోతుల వలన పరాభవం పాలయ్యి, ఆ కోతులే  దశగ్రీవుని మరణానికి కారణం అవుతారు. అతని శాపమును విన్న  దశగ్రీవునికి మరింత నవ్వువచ్చింది. దానికి కారణం అతనికి ఉన్న బ్రహ్మవరం. కానీ అతను తను కోరుకున్నవరంలో అతను మానవులను, కోతులనుండి రక్షణ కోరుకొనలేదు అనే విషయం మరచిపోయాడు.