భాగవతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భాగవతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఫిబ్రవరి 2022, సోమవారం

అయోధ్య - సరయు నది పుట్టుక

 సుర్యుని పుత్రుడయిన 14 మంది మనువులలో ఒకరు అయిన వైవస్వత మనువు అతని భార్య శ్రధ్ధాదేవిలకు సంతానం కలుగుట కోసం వసిష్టమహర్షి చేత యజ్ఞం  చేయించారు అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం! ఆ యజ్ఞం జరుగక ముందు కధనం ఇప్పుడు చూద్దాం!

వైవస్వత మనువు తన భార్యతో కలసి అయోధ్యా అనే నగరమునకు నిర్మించారు. వారు యజ్ఞము చేయుటద్వారా సంతానమును పొందాలని అనుకుని గురు వసిష్టుని ఆశ్రయించారు. కానీ పురాణముల ప్రాకారం ఒక యజ్ఞము చేసినందు వలన అత్యంత ఫలితము పొందాలంటే ఆ క్రతువు నీటి దగ్గర జరగాలి. అయోధ్యా నగరం దగ్గరలో ఏవిధమయిన నీటి వనరులు లేవు కనుక  యజ్ఞము చేయాలని అనుకుంటే ముందుగా అయోధ్యా నగరమునకు నీటి వనరులను సమకూర్చవలసిన అవసరం ఉంది. కనుక వసిష్టుడు వైవస్వతునకు తన కర్తవ్యం భోదించాడు. అప్పుడు వైవస్వతుడు తన శరముతో మానససరోవరమునుండి ఒక నదిని బయలుదేరదీశాడు. ఆ నది అయోధ్య పక్కనుండి వెళ్ళేలా ఎర్పాటు చేసాడు. 

ఆ నది పుట్టుక శరం వలన కలిగింది కనుక ఆ నదికి శరయు నది అనీ, మానస సరోవరము నుండి పుట్టినది కనుక ఆ నదికి సరయు నది అనే పేర్లు వచ్చాయి. ఆ నది ఒడ్డున వారు యజ్ఞము చేసి సంతానమును పొందారు.

27, జనవరి 2022, గురువారం

చ్యవన మహర్షి - అశ్వినీదేవతలు

మనం ఇంతకు ముందు చ్యవన మహర్షి గురించి, అతని వివాహం సుకన్యతో జరగటం గురించి, సుకన్యకు అశ్వినీ దేవతలు ఇచ్చిన వరం గురించి తెలుసుకున్నాం కదా! 
మరి వారు సుకన్య కోరికను మన్నించారా లేదా తెలుసుకుందాం!
సుకన్య మాటలు  విన్న అశ్వినీదేవతలు ముసలివాడయిన చ్యవన మహర్షిని తీసుకుని దగ్గరలోని కొలనులో మునిగారు. కొంతసేపటికి ఆ కొలనులోనుండి  అత్యంత సుందరమయిన, ఒకేరూపం కలిగిన ముగ్గురు యువకులు బయటకు వచ్చారు. వారిలో ఇద్దరు అశ్వినీ దేవతలుగాను, ఒకరు తన భర్త చ్యవనుని గాను సుకన్య గ్రహించింది. ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని వారించమని వారు కోరగా, ఆమె తన భర్తనే తిరిగి వరించింది. 
 సహాయమునకు ప్రతిఫలంగా చ్యవన మహర్షి, యజ్ఞములలో దేవతలకు లభించే సురాపానం సేవించే అర్హతను వారికి కలుగజేస్తాను అని మాట ఇచ్చాడు. 
ఇప్పటి వరకు అశ్విని కుమారులను మనం అశ్వినీదేవతలు అని చెప్పుకున్నాం కదా! మరి వారికి దేవతలతో సమానంగా యజ్ఞములలో సురాపానం అర్హత ఎందుకు లేదు? వారి కి అలా అర్హతలేకుండా పోవటానికి వారు చేసారు? తరువాతి టపాలలో నేర్చుకుందాం. 

24, జనవరి 2022, సోమవారం

చ్యవన మహర్షి - సుకన్య

 మనం ఇంతకుముందు భృగుపుత్రుడయిన చ్యవన మహర్షి గురించి,  అతను శర్యాతి పుత్రిక సుకన్యను వివాహం చేసుకున్న సందర్భాన్ని  కదా! ఇప్పుడు ఆ తరువాత జరిగిన సంగతులు తెలుసుకుందాం!

అత్యంత కోప స్వభావం కలిగిన  చ్యవనుని రాజపుత్రిక సుకన్య వివాహం చేసుకున్న తరువాత,  మారిపోయింది. ఎంతో ఓర్పుతో,  సహనంతో ఆమె పర్ణశాలలో జీవనం సాగించింది. భర్త అనురాగమును పొందింది. అలా కొంతకాలం గడచిపోయింది. 

ఒకరోజు చ్యవన మహర్షి ఆశ్రమం దగ్గరకు అశ్వినీ దేవతలు వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమె ఎవరు అని అడిగారు. ఆమె  పుత్రికను అని,చ్యవన మహర్షి భార్యను అని చెప్పింది. ఆమె మాటలు విన్న అశ్వినీదేవతలు అంతముసలి వానితో జీవనం సాగించటం ఎందుకు? ఆమె సౌందర్యానికి తగినట్లుగా మంచి యౌవ్వనం కలిగిన వీరుని వరించుకొమ్మని,కావాలంటే వారే అతనిని తీసుకుని వచ్చి ఆమెకు అతనితో వివాహం చేస్తామని చెప్పారు. 

 వారి మాటలు విన్న సుకన్య, తాను చ్యవన మహర్షితో ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పి, వారిని వారించి తన భర్త దగ్గరకు వెళ్లి జరిగిన సంగతి అంతా విన్న చ్యవన మహర్షి ఆమెను వెళ్ళి ఆ అశ్వినీ దేవతలను వరం కోరుకొమ్మని సలహా ఇచ్చారు. భర్త కోరిక మేరకు తిరిగి ఆ అశ్వినీ దేవతలా వద్దకు వెళ్లి ఆమె భర్తనే (చ్యవన మహర్షినే) యవ్వనం కలిగినా వానిగా చేయమని కోరుకుంది. 

ఆమె కోరిక తీరిందా? అశ్వినీ దేవతలు నిజంగా ఆమెకు సహాయ చేయగలిగారా? తిరిగి ఏమి పొందారు అని తరువాతి టపాలలో చూద్దాం!

22, జనవరి 2022, శనివారం

చ్యవన మహర్షి

చ్యవన మహర్షి భృగుమహర్షి కుమారుడు. ఇతని ప్రస్తావన మనకు భాగవతం మరియు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. 
శర్యాతి అనే మహారాజు ఒకసారి తనసైన్యంతో, కుటుంబంతో వనములలోనికి మహర్షుల సేవకోసం వెళ్లారు. కొన్ని రోజుల తరువాత వారి సైన్యంలోనివారికి మలమూత్రస్థంభన జరిగింది. సైన్యం మొత్తం బాధింపబడటం చుసిన శర్యాతికి అలా జరగటానికి కారణం తెలియలేదు. 
అప్పుడు అతని కుమార్తె సుకన్య అంతకు ముందు రోజు జరిగిన సంగతి చెప్పింది. 
ముందురోజు ఆమె తన స్నేహితురాళ్లతో కలసి వనవిహారమునకు వెళ్ళింది. అప్ప్పుడు ఒక చెట్టు మొదట్లో ఒక పెద్ద పుట్ట కనిపించింది. ఆ పుట్టాను దగ్గరగా చూడాలన్న కుతూహలంతో సుకన్య అక్కడికి వెళ్ళింది. ఆ పుట్టలో నుండి ఆమెకు రెండు చిన్న మెరుపులు కనిపించాయి. మిణుగురు పురుగులేమో అనుకుని, అవునోకాదో చూడాలనుకుని ఒక కర్రపుల్లతో వానిని పొడిచింది. అయితే ఆ పోటుకు అక్కడినుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తాన్ని చూసి భయపడిన సుకన్య తిరిగి వచ్చేసింది. 
ఇప్పుడు తమ సైన్యం పడుతున్న బాధలను చూసి తన తండ్రికి విషయం చెప్పింది. ఈ విషయం విన్న శర్యాతి తిరిగి వనంలో తన కుమార్తె చెప్పిన ప్రదేశమునకు వెళ్లి  జరిగిందో తెలుసుకుని బాధపడ్డాడు. 
తన కూతురు పొడిచిన ఆ రెండు మిణుగురులు చ్యవన మహర్షి కన్నులు. ఆ మహర్షికి బాధను కలిగించిన కారణంగానే వారి సైన్యమునకు కష్టములు వచ్చాయి అని తెలుసుకుని, చ్యవన మహర్షిని క్షమాపణ కోరుకున్నాడు శర్యాతి. 
జరిగిన తప్పుకు ప్రాయఃచిత్తంగా తన కుమర్తె సుకన్యను అతనికి ఇచ్చి వివాహం చేసాడు. 
ఆ తరువాత సుకన్య జీవితం ఎలా ఉంది, ఏం జరిగింది అని తరువాతి టపాలో చూద్దాం!

9, జనవరి 2022, ఆదివారం

నాగ్నజితి వివాహం

శ్రీ కృష్ణుని భార్యల గురించి మనం ఇంతకుముందు టపాలలో తెలుసుకున్నాం! వారిలో రుక్మిణి శ్రీకృష్ణుని ప్రేమించి, శిశుపాలుని వివాహం చేసుకోవలసిన సమయంలో శ్రీకృష్ణునికి లేఖరాసి, అతనిని వివాహం చేసుకుంది. సత్యభామ, జాంబవతి లను శ్రీకృష్ణుడు శమంతక మణి గురించిన విషయంలో వారిని వివాహం చేసుకున్నాడు. ఆ కథను మనం వినాయకచవితి కధలో చదువుకున్నాం! మిగిలిన వారిలో నాగ్నజితి ని శ్రీకృష్ణుడు ఎలా వివాహం చేసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం!
  కోసల దేశమునకు మహారాజు నాగ్నజిత్తు. అతని కుమార్తె నాగ్నజితికి వివాహం చేయటానికి నిర్ణయించుకుని, ఆ స్వయంవరం లో నాగ్నజితిని గెలుచుకోవాటానికి  ఏడు మదించిన ఎద్దులను సమకూర్చాడు. ఆ ఏడింటిని ఓడించిన వీరునికి తన కుమార్తెను ఇచ్చివివాహం చేస్తాను అని ప్రకటించాడు. కానీ నాగ్నజితి తన మనస్సులో శ్రీహరిని వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆప్ ఇషయం తెలుసుకున్న శ్రీ కృష్ణుడు అక్కడకు చేరుకున్నాడు. 
శ్రీకృష్ణుని కి ఎదురువెళ్ళి లోపలికి తీసుకువచ్చిన నాగ్నజిత్తు అతనికి సకల మర్యాదలు చేసాడు. అతని ఆతిధ్యమునకు సంతోషించిన శ్రీకృష్ణుడు అతని కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యమని కోరగా, నాగ్నజిత్తు అప్పటికే అతను ప్రకటించిన స్వయంవర షరతులను ప్రస్తావించాడు. 
అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఏడు ఎద్దులను ఓడించి, నాగ్నజితి ని వైభవంగా వివాహంచేసుకున్నాడు. ఆమెను తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఇంతకుముందు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుని ఆ స్వయంవరంలో ఓడిపోయినవారు అందరూ శ్రీకృష్ణునిమీద యుద్దానికి వచ్చారు. నాగ్నజితి కోసం శ్రీకృష్ణుడు వారందరిని ఓడించి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు.  

8, జనవరి 2022, శనివారం

శ్రీ కృష్ణుని ఎనిమిది మంది భార్యలు

శ్రీ కృష్ణునికి ఎనిమిది మంది భార్యలు. వారి పేర్లు ఇప్పుడు చూద్దాం!  

భాగవత పురాణం ప్రకారం 

  1. రుక్మిణి 
  2. సత్యభామ 
  3. జాంబవతి 
  4. కాళింది 
  5. మిత్రవింద 
  6. నాగ్నజితి 
  7. భద్ర 
  8. లక్షణ 

27, మే 2020, బుధవారం

కశ్యపుడు - కుటుంబం

కశ్యపుని గురించి మనం ఇంతకు  ముందు చాలా సార్లు చెప్పుకున్నాం! నవ బ్రహ్మ లలో ఒకడయిన దక్షుడు తన 13 మంది కుమార్తెలనుకశ్యపునికి ఇచ్చి వివాహం చేసాడు అని కూడా తెలుసుకున్నాం కదా! ఈ 13 మంది దక్షుని కుమార్తెల గురించి అనేక పురాణములలో అనేక రకములుగా చెప్పారు. ఇప్పుడు మనం మహాభారతంలో మరియు భాగవతంలో ఏమి చెప్పారో చూద్దాం!
ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశి కశ్యపుని వంశంలోనివే అని చెప్తారు. అటువంటి విచిత్రమయిన కుటుంబం గురించి తప్పకుండా తెలసుకోవాలి కదా!

 కశ్యపుని భార్యలుగా చెప్పబడిన 13 దక్ష పుత్రికలు, వారివలన కశ్యపునికి కలిగిన సంతానం ఇప్పుడు చూద్దాం!

 మహాభారతం ప్రకారం:
  1. అదితి          : ఆదిత్యులు 
  2. దితి              : దైత్యులు
  3. దనువు         : దానవులు 
  4. కాల              : వినాశనుడు, క్రోధుడు మొదలగు 8 మంది 
  5. అనాయువు : విక్షర, బాల, వీర, వృత్రులు 
  6. సింహిక        : రాహువు 
  7. ముని           : భీమసేనాదులయిన గంధర్వులు 16 మంది 
  8. కపిల           : అమృతం గోగణం, బ్రాహ్మణులు, అప్సరసలు 
  9. వినత          : గరుడ, అనూరుడు 
  10. క్రోధ             : క్రోధవశగణములు 
  11. ప్రాద్ధ           : సిద్దులు 
  12. క్రూర          : సుచంద్రాదులు 
  13. కద్రువ        : నాగులు 

భాగవతం ప్రకారం:
  1. అదితి          : ఆదిత్యులు 
  2. దితి              : దైత్యులు
  3. కాష్ట
  4. దనువు         : దానవులు 
  5. అరిష్ట           : గంధర్వులు 
  6. తామ్ర           : డేగ, గ్రద్ద 
  7. క్రోధవశ        : సర్పములు 
  8. సురస          : యాతుధానులు అనే ఒక రకం పిశాచములు 
  9. సురభి          : సురభులు 
  10. ముని            : అప్సరసలు 
  11. తిమి             : తిమింగలములు మొదలగు జలచరములు 
  12. ఇల              : చెట్లు 
  13. సరమ          : గిట్టలు చీలి ఉండే జంతువులు  

అయితే విచిత్రంగా భాగవతంలో తారక్ష్యుడు అనే వానికి భార్యలుగా వినత, కద్రువలను చెప్పారు. ఈ  వినత, కద్రువలను మహాభారతంలో కశ్యపుని భార్యలుగా చెప్పారు. 

2, మే 2020, శనివారం

వాలఖిల్యులు

బ్రహ్మాండ పురాణం మరియు భాగవతం ప్రకారం వాలఖిల్యులు నవబ్రహ్మలలో ఒకరయిన క్రతువు పుత్రులు. క్రతువు దేవహుతి, కర్ధముల పుత్రిక అయిన క్రియను వివాహం చేసుకున్నారు. ఈ క్రతువు మరియు క్రియలకు కలిగిన సంతానమే 60,000 మంది వాలఖిల్యులు.
వీరు బొటన వేలు పరిమాణంలో ఉండి నిరంతరం తపస్సులో ఉంటారు. వారి తపస్సు అత్యంత కఠినమయినది. వారు చెట్టు కొమ్మలకు తలక్రిందులుగా వ్రేళ్ళాడుతూ తపస్సు చేస్తారు.
వీరు తపస్యులు అయిన కారణంగా కశ్యప ప్రజాపతి పుత్రుల కోసం పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు వీరిని ఆహ్వానించారు. ఆ ఇష్టి కి వెళ్లే వారు అందరూ  మోయగలిగినంత చెరువు (యాగం లో ఉపయోగించుటకు వీలు అయిన వస్తువులు, కర్రపుల్లలు వంటివి) తీసుకు రావటం పరిపాటి కనుక వీరు తాము మోయగలిగిన గడ్డి పరకలు తీసుకు వచ్చారు.
వారిని చూసి ఆ సమయంలో అక్కడ ఉన్న ఇంద్రుడు వెక్కిరింతగా నవ్వాడు. అలా నవ్విన ఇంద్రుని చుసిన వాలఖిల్యులు అత్యంత బలవంతుడు, అనితర సాధ్యుడు ఈ ఇంద్రుని కంటే వంద రెట్లు బలం కలిగిన వాడు అయిన మరో ఇంద్రుడు ఈ యాగ ఫలముగా పుట్టుగాక అని అన్నారు. అంటే వారి కోపము కూడా ఇతరులకు (ఇక్కడ కశ్యపునకు) మేలు చేసింది. ఇలా వాలఖిల్యులు చెప్పటం విన్న ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. ఆ మాటలు విన్న కశ్యపుడు ఇది వరకు బ్రహ్మచే నియమించబడిన ఇంద్రుని కాదనుట సరి కాదు అని, తనకు కలగబోయే సంతానం పక్షి గా, ఆ పక్షులలో ఇంద్రునిగా ఉంటుంది అని వాలఖిల్యులను కోరాడు. దానికి అత్యంత దయగలిగిన వాలఖిల్యులు  ఒప్పుకున్నారు.
ఆ పుత్ర కామేష్టి కారణం గా కశ్యపునకు గరుడుడు జన్మించాడు. ఆ గరుడునకు పక్ష్మీంద్రుడు అనే పేరు కూడా ఉన్నది.
తరువాతి కాలంలో తన తల్లి దాస్య విముక్తి కోసం ప్రయత్నిస్తున్న గరుడుడు ఆకలి తీర్చుకోవటం కోసం తండ్రి ఆదేశం మేరకు గజమును, తాబేలును తినటానికి ప్రయత్నం చేసినప్పుడు విరిగిన రోహిణము అనే వృక్ష కొమ్మకు తల క్రిందులుగా వ్రేళ్ళాడుతూ తప్పస్సు చేసిన వారు వీరే.  

18, మార్చి 2017, శనివారం

శ్రీ మహావిష్ణుని 21 అవతారములు

మనలను ఎవరైనా శ్రీ మహావిష్ణుని అవతారములు ఎన్ని అని అడిగితే మనం ఠక్కున 10 అని చెప్తాము కదా! కానీ హైందవ ధర్మం ప్రకారం భగవానుడు సృష్టిలోని ప్రతి చరాచరములలో నిండి ఉన్నాడు. కానీ ఆ విష్ణు భగవానుని లీలలు చెప్ప బడిన శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీమహావిష్ణువు ఇప్పటివరకు ధరించిన అవతారములలో ముఖ్యమయినవి 21.  21 ముఖ్యమయిన అవతారములు ధరించి భూమిమీదకు వచ్చారు. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దామా!

  1.  సనత్కుమారుడు 
  2. వరాహ 
  3. నారదుడు 
  4. నర నారాయణులు (ఇద్దరు)
  5. కపిల మహర్షి 
  6. దత్తాత్రేయుడు 
  7. యజ్ఞుడు 
  8. ఋషభ దేవుడు 
  9. పృధు మహారాజు 
  10. మత్స్యం 
  11. ధన్వOతరి 
  12. కూర్మం 
  13. మోహిని 
  14. నృసింహ 
  15. వామన 
  16. పరశురామ 
  17. వ్యాస మహర్షి 
  18. శ్రీరామ 
  19. శ్రీ కృష్ణ 
  20. బుద్ధ 
  21. కల్కి 
వీరి గురించి వివరంగా తరువాతి టపా లలో తెలుసు కుందాం!

16, నవంబర్ 2014, ఆదివారం

భృగువు - ఖ్యాతి

భృగువు నవ బ్రహ్మలలో ఒకడు ఇతని భార్య ఖ్యాతి, దేవహుతి, కర్దమ ప్రజాపతిల పుత్రిక. వీరికి ఒక కుమార్తె  ఉన్నది. ఆమే భార్గవి.  ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారు. వారు
  1. దాత 
  2. విధాత 
పుత్రులు ఇద్దరూ మేరు పర్వత పుత్రికలను వివాహం చేసుకున్నారు. 
  1. దాత భార్య యాయతి: వీరి పుత్రుడు మృకండుడు, మృకండుని పుత్రుడే మార్కండేయుడు 
  2. విధాత భార్య నియతి: వీరి పుత్రుడు మహర్షి వేదశిరుడు
భృగు మహర్షి కి ఉశన అనే మరో భార్య యందు ఉశనసుడు (శుక్రుడు) జన్మించాడు.  

31, అక్టోబర్ 2014, శుక్రవారం

పులహుడు- గతి

పులహుడు నవబ్రహ్మలలో ఒకడు. ఇతని భార్య గతి. ఈమె కర్ధమప్రజాపతి, దేవహుతి ల పుత్రిక. వీరికి ముగ్గురు మగ పిల్లలు కలిగారు. వారు
  1. కర్మశ్రేష్టుడు 
  2. వరీయాంసుడు 
  3. సహిష్ణుడు 

పులస్త్యుడు - హవిర్భవు

పులస్త్యుడు నవబ్రహ్మలలో ఒకడు. ఇతని భార్య హవిర్భవు. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహుతిల పుత్రిక.
వీరికి ఇద్దరు పుత్రులు ఉన్నారు.

  1. అగస్త్యుడు: ఇతను అమితమైన తపఃసంపన్నుడు. మరొక జన్మలో ఇతనే జఠరాగ్ని గా జన్మించాడని చెప్తారు. 
  2. విశ్రవసుడు: ఇతను కూడా తపః సంపన్నుడే. ఇతనికి ఇలబిల అనే భార్య యందు కుబేరుడు కలిగాడు. మరొక భార్య అయిన కైకసి యందు  
  • రావణుడు 
  • కుంభకర్ణుడు 
  • విభీషణుడు 
జన్మించారు. 




30, అక్టోబర్ 2014, గురువారం

శ్రద్ధ - అంగీరసుడు

అంగిరసుడు నవ బ్రహ్మలలో ఒకడు. ఇతనికి శ్రద్ధ అనే దేవహుతి కర్దమ ప్రజాపతుల పుత్రికన్ను ఇచ్చి వివాహం చేసారు. వీరిద్దరికీ నలుగురు అత్యంత సౌందర్యవంతులైన పుత్రికలు కలిగారు.
వారు

  1. సినీవాలి : పూర్తి అమావాస్య కాకుండా ఆనాటి ఉదయం తూర్పున చంద్రరేఖ కనిపించే అమావాస్య. 
  2. కుహూ : పూర్తి అమావాస్య అయి, అంతకు ముందు ఉదయం కూడా చంద్రరేఖ కనిపించని అమావాస్య
  3. రాక :సంపూర్ణ కళలు కలిగిన చంద్రుడు ఉండే పౌర్ణమి 
  4. అనుమతి : పౌర్ణమి అయి ఉండి కూడా ఒక కళ తక్కువ ఉన్న చంద్రుడు ఉండే పౌర్ణమి. 
తరువాతి కాలంలో పుత్రుని కొరకు తపస్సు చేయగా వారికి ఇద్దరు పుత్రులు కలిగారు. వారు 
  1. ఉచధ్యుడు : సర్వశక్తి వంతుడు 
  2. బృహస్పతి : దేవ గురువు 

29, అక్టోబర్ 2014, బుధవారం

నలకూబర, మణిగ్రీవులు- నారద శాపం

నలకూబర, మణిగ్రీవులు మహాదేవుని మిత్రుడయిన కుబేరుని పుత్రులు. వారి తండ్రికి కలిగిన ధనం వలన, తమతండ్రి మహాదేవుని మిత్రుడు అనే భావం వలన వారికి గర్వం అతిశయించినది. ఒకనాటి సమయమందు వారిద్దరూ తమ తమ ప్రియురాళ్ళతో కలిసి, గంగానదిలో వివస్త్రులై  జల క్రీడలు ఆడుతూ తమను తాము మరచిపోయారు. అటువంటి సమయంలో నారద మహర్షి అటు వైపుగా రావటం చూసిన స్త్రీలు వెంటనే సిగ్గుతోవెళ్లి తక్షణం బట్టలు ధరించి చేతులు జోడించి, నారదునకు నమస్కారం చేసారు.
కానీ మధ్యంమత్తు కారణంగా నలకూబర, మణిగ్రీవులు తమ శరీరము మీద స్పృహ లేకుండా ఉన్నారు. తమ శరీరం వివస్త్రంగా ఉన్నది అనే విషయంకూడా మరచి నారదునికి అలాగే నమస్కరించారు. అప్పుడు నారదుడు వారిని 100 దివ్య సంవత్సరముల పాటు భూలోకంలో మద్ది వృక్షములుగా ఉండమని శపించారు.
source: internet
అప్పుడు వారు తమ తప్పును గ్రహించి శాప విమోచనం చెప్పమని కోరగా బాల కృష్ణుని పాదముల స్పర్శ ఏనాడు వీరికి కలుగుతుందో నాడు వీరి నిజరూపం తిరిగి పొందగలరు అని, కారణంగా సర్వలోకములయందు మిక్కిలి కీర్తి గడించగలరు. అని చెప్పి నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

విశ్లేషణ:
యౌవ్వనం, ధన సంపత్తిః ప్రభుత్వం అవివేకితా 
ఏకైకమాప్యనర్దాయ, కిము యత్ర చతుష్టయం
ఇది కాదంబరిలోని ఒక ముఖ్యమైన శ్లోకం. దీని అర్ధం 
యౌవ్వనం, ధనం, అధికారం మరియు మూర్ఖత్వం నాలిగింటిలో ఒక్కటి ఉన్ననూ అత్యంత అనర్ధం కలుగుతుంది, కానీ నాలుగూ ఉన్నట్లయితే ఇక ఏమి చెప్పాలి అని
ఇక్కడ నలకూబర, మణిగ్రీవులకు పైన చెప్పిన నాలుగునకు తోడు తాగిన మధిర, ప్రక్కన మగువ కూడా ఉన్నారు. అందుకని వారికి ఏమి చేస్తున్నామో కూడా తెలియలేదు
 ఇక్కడ వ్యాస భగవానుని రచనా విశిష్టత గురించి చెప్పుకోవాలి. నారదుడు సమయమునకు అక్కడకు ఎందుకు వచ్చాడు అనే దానికి "యదృచ్ఛయా" అని వాడారు. అంటే దైవ ఘటన చేత ప్రేరేపించబడిన వాడు అని వైదికమైన అర్ధం చెప్తారు
నలకూబర, మణిగ్రీవులు తనను అవమానించారు అనే దానికంటే వారికి హితమును తెలియచెప్పాలి అని నారద మునీంద్రుడు భావించాడు. కనుక వ్యాసులవారు సమయమందు "అనుగ్రహార్థాయ శాపం దాస్యన్న్ ఇదం జగౌ" అని చెప్పారు. అంటే వారిమీది అనుగ్రహం వలన వారికి శాపం ఇచ్చారు కానీ కోపంతో కాదు. ఈ సందర్భంలో పోతన భాగవతంలో మరింత అందంగా చెప్పారు. మనం ప్రాస్తుతం వాడుతున్న పదజాలం చక్కగా మొదట ప్రయోగించినది పోతనగారే అని ఈ పద్యం చదివిన తరువాత మనకు అనిపించక మానదు. 

కలవాని సుతులమనుచు 
గలకంఠులతోడగూడి కానరు పరులం 
గలలొనైనను వీరికి 
గల క్రోవ్వడగించి బుధులగలపుట యొప్పున్. 
కనుక వారికి గల క్రొవ్వును(పొగరు/అతిశయించిన గర్వం) తీసేసి/ తొలగించి వారిని మంచివారిలో కలుపుట అవసరం అని భావించి శపించారు. కనుకనే బాలకృష్ణుని పాద స్పర్శ కలుగగానే  సర్వలోకములందు కీర్తి కలవారు అవుతారు అని చెప్పారు. 

27, అక్టోబర్ 2014, సోమవారం

మరీచి - కళ

మరీచి బ్రహ్మ పుత్రుడు, నవ బ్రహ్మలలో ఒకడు. కళ దేవహుతి, కర్దమ ప్రజాపతుల పుత్రిక. వీరికి పుత్రుడు కశ్యపుడు, పుత్రిక పౌర్ణమి.
ఈ పౌర్ణమి అనే పుత్రిక మరుజన్మలో గంగాదేవిగా జన్మించినది.
కశ్యపుడు ఈ సమస్త సృష్టికి మూల కారణం అయినాడు. ఇతను 13 మంది దక్షుని పుత్రికలను వివాహం చేసుకున్నారు. 

26, అక్టోబర్ 2014, ఆదివారం

నవబ్రహ్మలు

నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులను తన శరీరం నుండి సృష్టించాడు. వారు
  1. బ్రొటన వేలి నుండి దక్షుడు 
  2. ఊరువులు (తొడలు) నుండి నారదుడు 
  3. నాభి నుండి పులహుడు 
  4. చెవుల నుండి పులస్త్యుడు  
  5. చర్మం నుండి భృగువు 
  6. చేతి నుండి క్రతువు 
  7. ముక్కు నుండి అంగిరసుడు 
  8. ప్ర్రాణం నుండి వసిష్ఠుడు 
  9. మనస్సు నుండి మరీచి 
  10. కన్నుల నుండి అత్రి 
ఈ పది మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి అగుట వలన తన సృష్టి కార్యంలో ప్రత్యక్షంగా తోడ్పడక పోయినందువలన, అతనిని తప్పించి మిగిలిన 9 మందిని నవబ్రహ్మలు అని అంటారు. వీరు 9 మంది దేవహుతి, కర్ధముల 9 మంది పుత్రికలను  వివాహం చేసుకుని బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో సహాయం చేసారు. 

ఏకాదశ నీలలోహిత రుద్రులు - భార్యలు - స్థానములు

బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలుపెట్టి, మొట్ట మొదట నలుగురు పుత్రులను సృష్టించాడు.

  1. సనకుడు 
  2. సననందనుడు 
  3. సనత్కుమారుడు 
  4. సనత్ సుజాతుడు 
వారిని సృష్టి కార్యం సహాయం చేయమని చెప్పగా, వారు ఆ కార్యం చేయుటకు తమ అనంగీకారం తెలుపగా, బ్రహ్మదేవునికి కోపం వచ్చినది. కానీ తనకు గల శక్తితో ఆ కోపమును నియంత్రించుకొనెను. కానీ ఆ కోపం బ్రహ్మదేవుని నొసటి భాగం నుండి ఒక పుత్రుని రూపంలో బయటకు వచ్చాడు. క్రోధం కారణం గా జన్మించుట చేత, అతను నల్లగా ఉన్నాడు. పుట్టీ పుట్టగానే, ఏడ్చుట మొదలు పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అయిన బ్రహ్మదేవుడు అడుగగా, తన పేరు ఏంటి? తను ఎక్కడ ఉండాలి? అని అడిగాడు. పుట్టుకతోనే ఏడ్చాడు కనుక అతనికి రుద్రుడు అని పేరు పెట్టారు. నలుపు ఎరుపు కలిగిన రూపం కలిగి ఉన్నాడు కనుక నీలలోహితుడు అని అన్నారు. 
  1. మన్యువు - ధీర - చంద్రుడు 
  2. మనువు - వృత్తి - సూర్యుడు 
  3. మహాకాలుడు - అశన - అగ్ని 
  4. మహశ్చివుడు - ఉమ - వాయువు 
  5. ఋతధ్వజుడు - నియతి - జలము 
  6. ఉరురేతుడు - సర్పి - ఆకాశము 
  7. భవుడు - ఇల - భూమి 
  8. కాలుడు - అంబిక - ప్రాణములు 
  9. వామదేవుడు - ఇరావతి - తపస్సు 
  10. ధృతవ్రతుడు - సుధ - హృదయం 
  11. నీలలోహితుడు - దీక్ష - ఇంద్రియములు 
తనకి పేర్లు, భార్యలు, నివాస స్థానములు నిర్ణయించిన మీదట, సృష్టి కార్యం చేయమని చెప్పగా, నీలలోహితుడు అలాగే చేసాడు. కానీ అతని వలన కలిగిన సంతానం తమోగుణం కలిగిన వారు అయినారు కనుక ఈ సృష్టికి విపత్తు ఏర్పడినది. అప్పుడు మరలా బ్ర్హమదేవుడు వారిని తపస్సు చేయమని అడిగారు. వారు అలాగే అని తపస్సు చేసారు. 

కర్దమ ప్రజాపతి - దేవహుతి

కర్దమ ప్రజాపతి కృతయుగంలో జన్మించారు. ఒకనాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ మహర్షిని తన సృష్టి కార్యంలో సహాయం చేయవలసినది అని అడిగారు. అప్పుడు కర్దమ ఋషి సరస్వతి నదీతీరంలో తపస్సు మొదలు పెట్టారు. అలా 10000 సంవత్సరముల పాటు తపస్సు చేసిన తరువాత ఒకరోజు శ్రీమహావిష్ణువు అతనికి దర్శనం  ఇచ్చారు. ఆ ఆనందంలో కర్దమ ఋషి  అనేక విధములుగా విష్ణుని పూజించి, కీర్తించి, అప్పుడు బ్రహ్మ తనముందు ఉంచిన భాద్యతను నిర్వర్తించుటకు ఒక అనుకూలవతి అయిన కన్య ఎక్కడ ఉంటుందో చెప్పవలసినది అని కోరారు.
అతని సేవలకు , తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ  కన్య స్వాయంభువ మనువు కు జన్మించిన దేవహుతి అని చెప్పి, మరునాటి సమయంలో వారే స్వయంగా కర్ధముని వద్దకు వచ్చి కన్యాదానం చేస్తారు అని చెప్పారు.
మరునాటి సమయంలో స్వాయంభువ మనువు తన భార్య, పుత్రికలతో కలసి కొంతసైన్యం తోడు రాగా కర్ధముని ఆశ్రమమునకు వచ్చారు. తన ఆశ్రమమునకు వచ్చిన అతిధులకు కర్దముడు అతిధి మర్యాదలు చేసి, వారి రాజ్యంగురించిన కుశల ప్రశ్నలు అడిగినమీదట స్వాయంభువ మనువు తను వచ్చిన కార్యం చెప్పారు. గుణ,శీల,జ్ఞాన వంతురాలయిన తన కుమార్తె దేవహుతికోరకు తను వరునికోసం వెతుకుతున్నందున, ఆమె ఒకసారి నారదముని వలన కర్ధముని గురించి విని ఉండుట చేత ఆమె కర్ధముని మనస్సునందే వరించిన కారణంగా, ఆమెను కర్ధమునికి ఇచ్చి వివాహం చేయాలి అనే సంకల్పంతో తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చారు అని.
ఆ మాటలు విన్న కర్దముడు అత్యంత లావణ్య రాశి అయిన దేవహుతిని వివాహం చేసుకొనుటకు తనకు సమ్మతమే కానీ ఒక షరతు ఉన్నది అని చెప్పాడు.
ఆమెకు ఎప్పటివరకు సంతానం కలుగకుండా ఉంటుందో అప్పటివరకు మాత్రమే ఆటను గృహస్థుగా ఉంటానని, పుత్రుడు కలిగిన మీదట అతను వానప్రస్థమునకు వెళ్ళేందుకు అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను అని.
స్వయంభువమనువు తన భార్య శతరూప వలన తన కుమార్తె దేవహుతి అభిప్రాయం తెలుసుకుని, సంతోషించి, వారికి శాస్త్రబద్దంగా వివాహం చేసారు.
అప్పటి నుండి  పరమశాంతంగా, వినమ్రతతో భక్తితో దేవహుతి భర్త సేవచేస్తూ ఉంది.  కొంతకాలము తరువాత చిక్కిపోయిన దేవహుతిని చూసి, ఆమె చేసిన ఈ తపస్సు ఆమె తనఃమనస్సులను పరిశుద్ధం చేసుకొన్నది. కనుక ఆమెకు సకల సౌక్యములను అనుభావింప చేయవలసిన సమయం ఆసన్నమైనది అని భావించి, అతని అద్వితీయమైన తపఃశక్తి వల్ల అనేక అనన్య సామాన్యమైన సౌక్యములతో కూడిన ఒక విమానమును సృష్టించి, ఆమెతో సంతోషంగా కాలం గడుపసాగాడు. కొంతకాలమునకు దేవహుతికి 9 మంది పుత్రికలు కలిగారు.
మరికొంతకాలం తరువాత కర్దముడు వానప్రస్తామునకు వెళ్ళబోతున్నాడు అని తెలుసుకుని, దేవహుతి అతని పాదములకు నమస్కరించి తమకు ఇంకా పుత్రుడు కలుగలేదు కనుక అతనిని అప్పుడే వెళ్ళుటకు ఆమె అభ్యంతరం తెలిపినది.
ఆ మాటలు విన్న కర్దముడు శ్రీ మహావిష్ణువును మనస్సు నందు తలచుకుని చిన్న చిరునవ్వు మొహంపై తొణికిసలాడగ, ఆమెను అనునయిస్తూ, ఆమె ఇప్పుడు గర్భవతి అని, ఆ భగవంతుడే స్వయంగా తమ పుత్రునిగా జన్మించబోతున్నారని, అతని దయవలననే దేవహుతికి సంఖ్యాయోగం వినగలుగుతుంది, ఆమె తరించ గలదు అని చెప్పి,  కర్దముడు వానప్రస్థమునకు వెళ్లి పోయారు.
కొంతకాలమునకు దేవహుతి కపిలునికి జన్మను ఇచ్చినది.
వారికి గల 9 మంది పుత్రికలను 9 మంది బ్రహ్మలకు ఇచ్చి వివాహం చేశారు. కుమార్తెలు, అల్లుడుల పేర్లు

  1. కళ - మరీచి  
  2. అనసూయ - అత్రి 
  3. ఊర్జ - వసిష్టుడు 
  4. శ్రద్ధ  - అంగిరసుడు 
  5. హవిర్భవు - పులస్త్యుడు 
  6. గతి - పులహుడు 
  7. క్రియ - క్రతువు 
  8. ఖ్యాతి - భృగువు 
  9. చిత్తి  - అదర్వుడు 

17, అక్టోబర్ 2014, శుక్రవారం

నిమి - జనకవంశం

నిమి ఇక్ష్వాకు పుత్రుడు. సూర్యవంశస్థుడు. ఒకనాడు నిమికి సత్రయాగం ప్రారంభించవలెను అనే కోరిక పుట్టినది. తమ కులగురువైన వసిష్ఠ మహర్షి వద్దకు వెళ్లి యాగం తనతో చేయించమని అడిగాడు. కానీ అప్పటికే వసిష్ఠమహర్షి ఇంద్రునిచే ఒక యాగం చేయిస్తాను అని ఒప్పుకున్నాడు కనుక దేవలోకమునకు వెళ్లి ఇంద్రునిచే యాగం పూర్తీ చేసి తిరిగి వచ్చిన తరువాత సత్రయాగం చేస్తాను అని చెప్పాడు.
కానీ మానవజీవితం అల్పం అని తెలుసు కనుక నిమి తన సమ్కలపమును విరమించుకోకుండా , మరికొందరు ఋత్విక్కులను సమకూర్చుకుని తన యాగము మొదలుపెట్టాడు.
ఇంద్రుని యాగామునకు వెళ్ళిన వసిష్ఠుడు తన శిష్యుడు తలపెట్టిన సత్రయాగామును తలచుకుని ఇంద్రయాగం అయిన వెంటనే అతి వేగంగా వెనుదిరిగి వచ్చాడు. అప్పటికే నిమి మరికొందరు ఋత్విక్కులతో యాగం మొదలుపెట్టుట చూసి, నిమి తనను అవమానించాడు అని భావించాడు. తిన్నగా నిమిని కలుద్దామని అతని వద్దకు వెళ్ళబోగా ద్వారపాలకులు అడ్డుకున్నారు. అసలే కోపంగా ఉన్న వసిష్ఠుడు మరింత కోపించి నిమి మరణించుగాక అని శపించాడు. ఐతే అసలు కారణం విచారించక ఒక గురువయ్యుండి కూడా తన కోపం మీద తనకే నియంత్రణ లేక  అతను  చేసిన పనికి నిమి కూడా అతని గురువయిన వసిష్ఠుని మరణించమని శపించారు
కాలాంతరంలో వసిష్ఠుడు తిరిగి మిత్రావరుణు వలన అప్సరస ఐన ఉర్వసికి జన్మించాడు
ఐతే వసిష్ఠుని శాపంవలన నిమికూడా శరీరం వదిలాడు. ఐతే మొదలుపెట్టిన సత్రయాగం మధ్యలో ఆపుట సరి అయినది కాదు కనుక నిమి దేహమును అనేక రసాయనములతో పూతపూసి పాడవకుండా జాగ్రత్తచేశారు. సత్రయాగం పూర్తి  చేసారు. యాగం చివరి భాగంలో దేవతలు సంతోషించి వరములను ఇచ్చుటకు సంసిద్ధులవగా   ఋత్విక్కులు నిమిని బ్రతికించమని కోరారు. దేవతలు కూడా అతనిని బ్రతికించుటకు సిద్ధపడారు. కానీ నిమి తిరిగి తన దేహమును పొందుటకు అంగీకరించలేదు.    
నిరంతరం మోహం, అహంకారం, సుఖం, దుఃఖం అనే గుణములకు లోనవుతూ అశాశ్వతమైన దేహం నాకు తీసుకొనుట ఇష్టం లేదు  అని చెప్తున్నా నిమిని చూసి, దేవతలు ఋత్విక్కుల కోరిక కాదనలేనిది, అలాగే నీ కోరిక కూడా. అందరి కోరికలు తీరే విధంగా సర్వప్రాణులు కన్నులు ముసితెరచే ప్రక్రియగా నీవి జీవించెదవు గాక ని దేవతలు నిమికి వరమును ఇచ్చారు
ఐతే ఇప్పుడు నిమియొక్క రాజ్యభారమును వహించుటకు రాజులేడు. ఒక రాజ్యం రాజులేకుండా ఉండకూడదు కనుక వారు భద్రపరచిన నిమి దేహమును మధించగా ఒక పుత్రుడు జన్మించెను
  1. ప్ర్రాణములేని దేహంనుండి జన్మించాడు కనుక అతనిని వైదేహుడు అన్నారు
  2. మధించుటచేత జన్మించాడు కనుక అతనిని మిధులుడు అనికూడా పిలిచారు. ఇతనిచే నిర్మించబడిన నగరమే మిధిలా నగరం
  3. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించాడు కనుక జనకుడు అన్నారు 

విధంగా సూర్యవంశం నుండి జనకవంశం ప్రారంభం ఐనది

16, అక్టోబర్ 2014, గురువారం

సౌభరి మహర్షి

ఈ మహర్షి పూర్వ వృత్తాంతం మనకు తెలియదు. కానీ ఇతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో చెప్పబడినది.
సౌభరి మహర్షి 12 సంవత్సరములపాటు నీటి అడుగున ఉండి తపస్సు చేసాడు. ఒక సమయంలో అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపఫై పడినది. ఆ క్షణంలో అతనికి సంసారంపై ఆకాంక్ష కలిగినది. ఆ ఆలోచన కలిగినదే తడవుగా అతను ఆ నీటిలోనుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఆ రాజ్యమును సూర్య వంశస్థుడయిన మాంధాత అనే రాజు పరిపాలిస్తున్నాడు. కనుక సౌభరి మహర్షి తిన్నగా రాజువద్దకు వెళ్లి తనకు వివాహం చేసుకోవాలను అనే కోరిక కలిగినది కనుక అతనికి ఒక కన్యను  ఇమ్మని అడిగాడు.
మంధాతకు 50 మంది పుత్రికలు ఉన్నారు. వారిలో ఎవరినీ ఇవ్వను అని చెప్పటం ఇష్టం లేక, శుష్కించిన శరీరం కలిగిన ఈ సౌభరి మహర్షిని తన పుత్రికలు వరించరు అని నమ్మకంతో, తన పుత్రికలలో ఎవరైనా తమరిని వరించినట్లయితే వారిని ఇచ్చి వివాహం చేస్తాను  అని సౌభారికి మాంధాత చెప్పాడు. మాంధాత మనస్సులోని ఆలోచనను గమనించిన సౌభరి మహర్షి తన శరీరమును యౌవ్వనప్రాయముతో అలంకరించుకుని అంతఃపురమునకు వెళ్ళాడు. అతనిని చుసిన మాంధాతయొక్క 50 మంది పుత్రికలూ అతనిని వరించారు.
అతని తపః శక్తి తో వారంతా అత్యంత అనుకులమయిన భవనములు, భోగములు సమకూర్చుకున్నారు. ఎంతో వైభవమైన వస్త్రములు, తినుబండారములు, ఉద్యానవనములు ఏర్పరచుకుని సుఖంగా ఉన్నారు.
కొంతకాలం తరువాత సౌభరి మహర్షికి ఏకాంతంలో అతని ఈ పరిస్థితికి రాకముందు తానూ ఎంత నిష్టగా తపస్సు చేసేవాడో గుర్తుకు వచ్చినది. ఒక్కనాడు, ఒక్కసారి సంసారమందు ఉన్న ఒక చేపల కుటుంబమును చుసిన తను ఇంతకాలం 50 మంది భార్యలతో, 5000 మంది బిడ్డలతో కాలక్షేపం చేయుట తప్పు అనిపించినది. కనుక వానప్రస్థఆశ్రమము స్వీకరించి అరన్యమునకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు.
తరువాత అతని భార్యలు కూడా అతని వెనుక అరణ్యములకు వెళ్ళిపోయారు.