భీమఖండం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భీమఖండం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2022, సోమవారం

శ్రీనాధుని చే చెప్ప బడిన గణేశ ప్రార్ధన

 శ్రీనాధుడు రచించిన భీమఖండం లో గణపతిని స్తుతిస్తూ చెప్పిన పద్యం చాలా బాగుంది.

ఏనికమోముతార్పెలుక నెక్కినరావుతురాజు సౌరసే

నానియనుంగుబెద్దన వినాయకదేవుడు కర్ణతాళఝం

ఝానిలతాడనంబున నిరంతరమున్ బ్రబలాంతరాయసం

తానమహాఘనాఘన కదంబములన్ విదళించు గావుతన్


తాత్పర్యం: ఏనుగు ముఖం కలిగి, తన వాహనము ఎలుకను ఎక్కిన కుమారస్వామికి స్వయాన పెద్ద అన్న అయిన వినాయకుడు, తన పెద్ద పెద్ద చెవులను విసురుతూ ఎల్లప్పుడూ అత్యంత దట్టంగా అలుముకుంటున్న విఘ్నములు అనే కారు మబ్బులను చెల్లా చెదురుగా పోగొట్టును గాక. 






18, ఏప్రిల్ 2020, శనివారం

సర్పవరం- శ్రీనాధుడు

మనం ఇంతకు ముందు సర్పవరం లోని భావనారాయణ దేవాలయం గురించి, అక్కడ ఉన్న నారద కుండం, ముక్తి కుండం గురించి  చెప్పుకున్నాం కదా! అదే సర్పవరం లోని భావనారాయణుని గురించి చెప్తూ ఆ ఉరి గురించి మహాకవిసార్వభౌముడు శ్రీనాధుడు తన భీమఖండం లో ఏమని వర్ణించారో చూద్దామా !!

శ్రీ సుదర్శన శంఖ చిహ్నాంకితముగాక యెప్పుడు మిన్నకయున్న యిల్లు లేదు
బహులోర్ధ్వపుండ్ర సంపదలేక వృధయైన ఫాలలేఖల తోడి ప్రజయు లేదు
వైష్ణవోత్తమ భాగవతసాత్త్వికుల గోష్ఠి వెలియైనవాటికా వేది లేదు
నాలీనేక్షణుడు భావనారాయణ స్వామి దప్పించి పరదైవతంబు లేదు

భావం :  సర్పవరంలో శ్రీ మహావిష్ణు సంబంధమయిన శంఖం చక్రం గుర్తులు లేని ఇల్లు లేదు, చక్కగా పెద్దవిగా ఊర్ధ్వపుండ్రములు (నిలువు బొట్టు) చక్కగా పెట్టుకోకుండా వృథాగా ఉన్న నుదిటితో ఉన్న ప్రజలు లేరు, మంచి మంచి వైష్ణవ భాగవతోత్తముల గోష్ఠి జరుగని అరుగు లేదు, భావనారాయణుడు తప్ప మరో దైవము లేడు.