అరణ్య పర్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అరణ్య పర్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మార్చి 2022, బుధవారం

నల దమయంతుల వివాహం అందరికి సంతోషకారకం అయ్యిందా?

మనం ఇంతకు ముందు దమయంతి నల మహారాజుల వివాహం గురించి,  ఆ వివాహానికి దేవతలు రావడం, వారిని పరిక్షించి,వారికి వరములను ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత వారి  జీవితంలో సంభవించిన మార్పులను గురించి ఇప్పుడు చూద్దాం! 

ఇంద్రాది దేవతలు స్వయంవరం అయిన తరువాత ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా వారికి ద్వాపర, కలి యుగములు భౌతిక దేహముతో పురుషుల వలే ఎదురు వచ్చారు. వారిని చుసిన దేవతలు వారిని ఆపి ఎక్కడకు బయలుదేరారు అని అడుగగా వారు దమయంతి స్వయంవరం లో పాల్గొనడానికి వెళ్తున్నామని చెప్పారు. వారిద్దరిలో కూడా కాళీ అత్యంత ఉత్సాహంగా ఉండడాన్ని గమనించిన దేవతలు వారికి ఆ స్వయంవరం పూర్తి అయినది అని చెప్పారు. ఆ మాటలు విన్న ఆ ఇద్దరు యుగ పురుషులు నిరాశ చెందారు. కానీ దేవతలు అంతటితో ఆగకుండా ఆ దమయంతి నలుని తప్ప దేవతలను కూడా వివాహం చేసుకోనని చెప్పిందని, దానికి ప్రముఖ మయిన కారణం నలుని ధర్మ పరాయణత అని చెప్పిన మాటలు వారు చెప్పారు. 

ఆయా మాటలను విన్న  కలి  కి ఆవేశం వచ్చింది.నలునిలో ఉన్న ఏ ధర్మదక్షతను ఆమె అతనిని వరించిందో ఆ ధర్మమునకు నలుని దూరం చేస్తాను అని కలి ప్రతిజ్ఞ చేసాడు. 

అలా కాళీ చేసిన ప్రతిజ్ఞ కు ద్వాపరుడు కూడా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. 

మరి వారు నలుని నిజంగా ధర్మ బ్రష్టుని చేశారా? లేదా? చేస్తే ఎలా చేయ గలిగారు? దాని వలన నల దమయంతిల జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అని తరువాతి టపా లలో చూద్దాం!

15, మార్చి 2022, మంగళవారం

నలుడు, దమయంతిల వివాహం

మనం ఇంతకుముందు దమయంతి స్వయంవరమునకు దేవతలు వచ్చారని, వారు నలుని దమయంతి వద్దకు రాయభారానికి పంపారని, ఆ రాయబారాన్ని తీసుకుని నలుడు దమయంతి దగ్గరకు వెళ్ళడం గురించి చెప్పుకున్నాం!

నలుడు దమయంతి సమాధానాన్ని దేవతలకు చెప్పాడా? వారు స్వయంవరమునకు ఎలా వచ్చారు?ఆ తరువాత స్వయంవరం ఎలా జరిగింది?  అని ఇప్పుడు తెలుసుకుందాం!

దమయంతి సమాధానమును నలుడు దిక్పాలకులయిన దేవతలకు తెలియజేసాడు. దమయంతి సమాధానమును విన్న దేవతలు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు, కానీ వారు దమయంతి స్వయం వరమునకు తప్పకుండా రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దిక్పాలకులు నలుగురు (ఇంద్ర,వరుణ,అగ్ని మరియు యమధర్మరాజు) ఆ స్వయంవరమునకు నలుని రూపంలో వచ్చారు.

ఆ స్వయంవరమండపం లో అన్ని రాజ్యముల నుండి రాజులు వచ్చారు. వారిలో కొందరు కేవలం ఆమెను చూడడానికి మాత్రమే వచ్చారు. దమయంతి తన చేతిలో వరమాలతో ఆ మండపం లోనికి వచ్చింది. ఆఅమె పక్కన ఉన్న చెలికత్తెలు ఆమెకు ఒకొక్క రాజు గొప్పతనమును చెబుతూ వస్తున్నారు. అలా వస్తున్న వారికి ఒక దగ్గర ఐదుగురు నల మహారాజులు కనిపించారు. అప్పుడు చెలికత్తెలకు ఏమి చెప్పాలో అర్ధంకాలేదు. దమయంతికి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉంది. ఆమెకు అక్కడ ఉన్న ఐదుగురిలో ఒక్కడు నలుడు ఆని మిగిలిన వారు దేవతలు అని తెలుసు కనుక ఆమె వారిని మనస్సులోనే ప్రార్ధించడం మొదలుపెట్టింది. వారిలో మానవుడయిన నలుడు ఎవరో తెలుసుకొనగలిగే ఉపాయమును చెప్పమని కోరుకున్నది. ఆమె దృడసంకల్పానికి సంతోషించిన దేవతలు నిజమయిన నలుని పాదములు భూమిని తాకుతూ ఉంటాయని ఆమెకు స్పురించింది. ఆమె అక్కడ ఉన్న ఐదుగురు నలమహారాజులను గమనించింది. ఆ ఐదుగురిలో కేవలం ఒక్కరి పాదములు మాత్రమే నేలను తాకుతూ ఉన్నాయి. మిగిలిన నలుగురి పాదములు భూమిని తాకకుండా ఉన్నయి. అప్పుడు దమయంతి తన వరమాలను నలుని మెడలో వేసింది. 

వారి వివాహాన్ని చూసి సంతోషించిన ఇంద్రుడు, నల మహారాజు చేసే ప్రతి యజ్ఞమునకు స్వయంగా వచ్చి హవిర్భాగమును స్వీకరిస్తానని, అగ్నిదేవుడు నలుని కోరికపై అతను ఎక్కడ కావాలంటే అక్కడకు వస్తానని, వరుణుడు కూడా నలుని కోరికపై ఎక్కడికి అయినా వస్తానని, యమధర్మరాజు నలుని మనస్సు ఎల్లవేళలా ధర్మం పైననే నిలచేలా చేస్తానని వరములు ఇచ్చారు. 

4, మార్చి 2022, శుక్రవారం

దమయంతి స్వయంవరం ఎలా సాధ్యం?

మనం ఇంతకుముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావం నుండి తప్పించ గలిగిన శ్లోకం గురించి,  నలుని గురించి, దమయంతి గురించి,  స్వయంవరానికి బయలు దేరిన నలునికి దేవతలు ఎదురయినప్పుడు నలుడు వారికి ముందుగానే మాట ఇవ్వడం గురించి, నలుడు వెళ్ళి దమయంతిని కలిసి, దేవతల తరపున దూతగా వచ్చిన విషయము గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు దమయంతిదేవి నిర్ణయం గురించి తెలుసుకుందాం!

నలుని మాటలను విన్న దమయంతి అత్యంత ఆవేదన చెందింది. తాను ఎంతగానో ప్రేమించే నలుడు తన వద్దకు ఇటువంటి ప్రస్థావన తీసుకురావడం ఆమెకు అత్యంత బాధ కలిగించింది. ఆమె నలునితో తాను అతనినే వరించానని, హంస రాయభారం పంపి, ఇప్పుడు ఈ విధంగా మరొకరిని వివాహం చేసుకొమ్మని చెప్పడం భావ్యం కాదు అని,  స్త్రీ కి ఉండే సహజ బేలతనం కారణంగా ఆమె కన్నీరు పెట్టుకుంది. అతనినే తన భర్తగా 

 నలుని దౌత్యము విఫలం కాకుండా ఏ మార్గంలో తను నలుని వివాహం చేసుకోవాలో నిర్ణయించికుంది. ఆమె కధనం ప్రకారం ఒక దూత తను చెప్ప వలసిన విషయము చెప్పడం మాత్రమే అతని భాద్యత. నలుడు దూతగా తన భాద్యత పూర్తి చేసాడు. అతని మాటలను పూర్తిగా పాటించ వలసిన అవసరం దమయంతికిలేదు. కనుక ఆమె స్వయంవరంలో నలుడిని మాత్రమే వరిస్తాను అని చెప్పింది. 

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

నల దమయంతి ల పరిచయం

మనం ఇంతకుముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావం నుండి తప్పించ గలిగిన శ్లోకం గురించి,   నలుని గురించి, దమయంతి గురించి,  స్వయంవరానికి బయలు దేరిన నలునికి దేవతలు ఎదురయినప్పుడు నలుడు వారికి ముందుగానే మాట ఇవ్వడం గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు ఆ సంక్లిష్ట పరిస్థితి నుండి ఎలా బయట పడ్డాడో చూద్దాం!
    ఇంద్రాది దేవతల మాటలు విన్న నలుడు ఆశ్చర్యమునకు గురి అయ్యాడు. తాను కూడా అదే స్వయంవరమునకు బయలుదేరానని చెప్పాడు. అలా ఒకే స్వయంవరమునకు వెళ్తున్న తనతో ఆ రాకుమారి వద్దకు దేవతలను వివాహం చేసుకోవాలని ప్రస్థావన తీసుకుని దౌత్యం చేయడం సమంజసం గా ఉండదు అని తన భావన దేవతలకు వివరించాడు. 
కానీ ఇంద్రాదిదేవతలు అతనిని పరీక్షించడానికే అక్కడికి వచ్చారు కనుక వారు నలుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాడానికే నిర్భందించారు. ధర్మనిరతుడయిన నలుడు దమయంతి దగ్గరకు దేవతల తరపున దూతగా వెళ్ళాల్సిన పరిస్థితి తప్పలేదు. 
అప్పుడు నలునికి మరొక సందేహం కలిగింది. దమయంతి ఒక రాకుమార్తె. ఆమె స్వయంవరమును కూడా ప్రకటించిన ఈ సందర్భంలో ఆమె మందిరంలో కాపలా కొరకు భటులు నిరంతరం ఉంటారు వారిని ఏమార్చి ఆమెవద్దకు ఎలా చేరుకోవాలి? అని. ఆ సమస్యకు దేవతలే ఉపాయం అందించారు. అతను విదేహ రాజ్యములోని దమయంతి రాజ భవనము/ అంతఃపురం ప్రవేశించే సమయంలో అతనిని దేవతల కృపవలన ఎవ్వరూ అడ్డుకొనరు అని దేవతలు వరం ఇచ్చారు. 
ఆ వర ప్రభావం కారణంగా నలుడు సులభంగా దమయంతీదేవి అంతఃపురాన్ని చేరుకున్నాడు. ఆ అంతఃపుర శోభను చూస్తూ ముందుకు నడిచాడు. అతను దమయంతిని చూశాడు. ఆమె అతనిని చూసి ఆశ్చర్యపోయింది. తన అంతఃపురంలోనికి రావడానికి ఎంత ధైర్యం? నలుని రూపలావణ్యముల గురించి ఇంతకు ముందు విని ఉండుట వలన, ఆమె అతని రూపమును చూసి భటులను పిలవకుండా మాట్లాడడం మొదలు పెట్టింది.
అతనికి ఇంతకు ముందు హంస వివరించిన దాని కంటే దమయంతి అతనికి అత్యంత సుందరంగా కనిపించింది.  అతను తనను తాను అమెకు పరిచయం చేసుకున్నాడు. అతను అక్కడికి వచ్చిన కారణం కూడా ఆమెకు వివరించాడు. 
ఇప్పుడు ధర్మసంకటంలో దమయంతి పడింది. ఆమె తాను కోరుకున్న నలుని వివాహం చేసుకుంటే, అతను సరిగా దూత పని చేయలేదన్న అపకీర్తి వస్తుంది, అలాగని ఆమె దేవతలలో ఒకరిని వివాహం చేసుకోలేదు.
మరి ఆమె స్వయంవరం ఎలా జరిగింది? ఆమె నలునికి ఏమి సమాధానం చెప్పి పంపింది? నలుడు దేవతలకు ప్రియంగా దూత కార్యమును చేసినట్లుగా ఎలా అనుకోవాలి? తరువాతి టపాలలో చుద్దాం!

23, ఫిబ్రవరి 2022, బుధవారం

ఇంద్రాది దేవతలు నలునికి వేసిన ముందరికాళ్ళ బంధం!

మనం ఇంతకు ముందు నలుని గురించి, దమయంతి గురించి, వారి మద్యన జరిగిన హంస రాయభారం గురించి తెలుసుకున్నాం కదా! ఆ తరువాత భీమసేనుడు తన కుమార్తె దమయంతికి స్వయంవరం ప్రకటించారని కూడా చెప్పుకున్నాం!

స్వయంవరానికి భీముడు సకల రాజ్యములకు చెందిన రాజులను అహ్వానించాడు. అందరు రాజులు ఆ స్వయంవరానికి వచ్చేసారు. 

ఆ సమయంలోనే నారదుడు ఆ దమయంతి స్వయంవర వార్తను తీసుకుని స్వర్గమునకు వెళ్ళాడు. దమయంతి సౌందర్యమును, గుణవర్ణనము విన్న తరువాత దేవేంద్రునితో కలిసి అందరు దిక్పాలకులు ఆ స్వయంవరమును చూడడానికి బయలుదేరారు. వారికి నారదుని వలన దమయంతికి సరి అయిన వరుడు నలుడు అని తెలుసుకున్నారు. వారు నలుని ధర్మనిరతిని పరిక్షించాలని అనుకున్నారు. 

వారు స్వయంవరానికి వెళ్తున్న నలునికి ఎదురు వచ్చారు. వారు నలుని చూసి తమను తాము పరిచయం చేసుకోకుండానే తమకు నలునివల్ల ఒక సహాయం కావాలని, నలుడు వారి తరపున దూతగా వెళ్ళాలని కోరుకున్నారు. వారు ఎవరో తెలుసుకోకుండానే వారికి సహాయం  చేస్తాను అని, దూతగా వారి అభీష్టం నెరవేరుస్తాను అని మాట ఇచ్చేసాడు. 

అప్పుడు దేవతలు నలునితో ఇంద్రుడు, తాను ఇంద్రుడననీ, తనతో ఉన్న వారు దిక్పాలకులనీ, వారు దమయంతీదేవి స్వయంవరమునకు వచ్చామనీ, కనుక నలుడు వారి తరపున ఆమె వద్దకు వెళ్ళి, వారి గొప్పతనములను, బిరుదులను, వారి వారి శౌర్య ప్రతాపాలను వివరించి చెప్తే ఆమె వారిలో ఎవరినైనా వివాహం చేసుకొనుటకు అవకాశం దొరుకుతుంది కనుక నలుడిని అలా దౌత్యం జరుపమని కోరుకున్నాడు. 

తాను ప్రేమించి, వివాహం చేసుకోవాలని అనుకున్న అమ్మాయి వద్దకు మరొకరి గురించి దౌత్యం చేయడానికి నలుడు ఒప్పుకున్నాడా? అలా ఒప్పుకోకుండా మాట తప్పాడా? తరువాతి టపాలలో చుద్దాం!

19, ఫిబ్రవరి 2022, శనివారం

దమయంతి -- హంస

మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన,  నలునికి హంస దొరకడం గురించి, ఆ హంస దమయంతికి అతని గురించి చెప్తాను అని చెప్పడం గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు దమయంతి గురించి తెలుసుకుందాం!
విదర్భరాజు భీముడు, అతని భార్య కు సంతానం లేదు. వారు దమనుడు అనే మహర్షికి అనేక సపర్యలు, సేవలు చేసి అతని అనుగ్రహాన్ని సంపాదించారు. అప్పుడు వారికి దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కుమారులు, దమయంతి అని ఒక కుమార్తె కలిగారు. ఆమె అపురూప సౌందర్యవతి, గుణశీలి. ఎలావేళలా ఆమెను కనిపెట్టుకుని ఉండడానికి అమె చుట్టూ అనేకమంది పరిచారికలు ఉండేవారు. వారు నలుని గురించి అనేక విషయములు చెప్తూ ఉండేవారు. వారి వద్ద నుండి నలుని ప్రసంశలు విన్న దమయంతి మనస్సులో నలునిపై ప్రేమ చిగురించింది. 
ఆ సమయంలోనే నలుని దగ్గరి నుండి వచ్చిన హంసల గుంపు ఆమె ఉన్న ఉద్యానవనమునకు వచ్చింది. ఆ హం స ల గుంపును చూసిన ఆమె చెలికత్తెలు వానిని పట్టుకోవాలని ప్రయత్నించసాగారు. అక్కడ జరుగుతున్న కోలాహలం వల్ల హంసలు అటూ ఇటూ పరుగులు పెడుతూ వారికి దొరకకుండా తప్పించుకోసాగాయి. కానీ నలునితో మాట్లాడిన హంస తనకు తానుగా వచ్చి దామయంతీదేవి కి దొరికిపోయింది. అంతేకాక ఆ హంస నలుని ప్రస్తావన తెచ్చి, ఈ భూమండలంమొత్తం మీద ఆమెకు భర్త కాగలిగిన సుందరుడు, రాఅజ కుమారుడూ కేవలం నలుడు మాత్రమే అని అనేక విధములుగా చెప్పింది. ముందే నలుని గురించి ఆలోచనలలో ఉన్న దమయంతికి ఇప్పుడు హంస కూడా అలాగే చెప్పడమ్ వల్ల ఆమె మరింతగా అతని ఆలోచనలలో మునిగిపోయింది. ఆమె చెలికత్తెల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆమె తండ్రి భీముడు ఆమెకు స్వయంవరాని ఏర్పాటు చేసాడు. 
మరి ఆమె తనకు నచ్చిన వరుడిని స్వయంవరంలో వరించిందా? ఆ స్వయంవరం ఎంత విచిత్రంగా జరిగింది? అనే విషయాలు తరువాతి టపాలలో చుద్దాం!

10, ఫిబ్రవరి 2022, గురువారం

నలుడు -- హంస

 మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన చూశాం! మరి ఆ నలుడు ఎవరు? అతనికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉన్నది? అని ఇప్పుడు తెలుసుకుందాం!

నిషాద రాజ్యమునకు రాజు వీరసేనుడు. అతని కుమారుడు నలుడు. నలునికి విదర్భ రాజ పుత్రిక అయిన దమయంతి గురించి అనేక విషయములు తెలుస్తూ ఉండుటవలన ఆమె అంటే అతనికి ప్రేమ కలిగింది. 
ఒకరోజు నలుడు తన ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అతనికి ఆకాశంలో తిరుగుతున్న హంసల గుంపు కనిపించింది. వానిని వెంబడిస్తూ వెళ్ళిన అతను ఒక హంసను పట్టుకున్నాడు. మిగిలిన హంసలు అక్కడి నుండి ఎగిరి పోయాయి కానీ ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. 
నలునికి పట్టుబడిన హంస అతని మనస్సులో ఉన్న దమయంతి పై ప్రేమను గమనించి, నలుడు ఇప్పుడు తనను వదిలితే తను వెళ్ళి దమయంతికి అతని గురించి గొప్పగా చెప్తానని మాట ఇచ్చింది. దమయంతి పేరు విన్న నలునికి తిరిగి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేకుండానే ఆ హంసను వదలి పెట్టాడు. ఆ తరువాత ఆ హంస నిజంగా దమయంతి దగ్గరకు వెళ్ళిందా లేదా? వెళితే ఏమి చెప్పింది? దమయంతికి నలుని పైన ప్రేమ కలిగిందా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

28, జనవరి 2022, శుక్రవారం

కలికాల ప్రభావాన్ని తప్పించుకునే మార్గం

 మనం ఇంతకు ముందు కలి ప్రభావం, కలికాలంలో మానవుని లక్షణముల గురించి తెలుసుకున్నాం కదా!

ఇప్పుడు ఆ కలి ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఒక సులభమయిన మార్గం గురించి చెప్పుకుందాం!

ఈ మార్గన్ని స్వయంగా వ్యాసభగవానుడే మహాభారతంలో అరణ్యపర్వంలో చెప్పాడు. మనం ఇప్పుడు వ్యాసుడు చెప్పిన సంస్కృత శ్లోకం, దాని కవిత్రయ భారతంలోని తెలుగు అనువాదం కూడా చెప్పుకుందాం!

శ్లోః 

కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ

ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం

 తెలుగు అనువాదంః

కర్కోటకుని, దమయంతి, బుణ్యమూర్తియైన నలుని

ఋజు చరిత్రుడైన ఋతుపర్ణు గీర్తింప గలిభయంబు లెల్ల గ్రాగు నధిప

భావంః కర్కోటకుడు అనే పాము, భార్యాభర్తలయిన నల దమయంతుల గురించి, రఘువంశజుడయి మంచి ప్రవర్తన కలిగిన ఋతుపర్ణుడు అనే రాజుని నిరంతరం తలుచుకొనుట వలన కలి వలన కలిగే భయములు అన్నీ తొలగుతాయి. 

విశ్లేషణ

ఈ శ్లోకమును వ్యాసుడు నలదమయంతుల కధకు ఫలశ్రుతిగా చెప్పాడు. వీరి కధ అనేక మలుపులతో ఆసక్తి దాయకంగా ఉంటుంది. ఎంతో అన్యోన్య దాంపత్యమునకు ఉదాహరణగా నలదమయంతులు, వారు విడిపోయిన సమయంలో దమయంతి చూపిన మనోధైర్యం, నలుడు తాను  దూరమయితే తన భార్య పుట్టింటికి వెళ్ళి సంతోషిస్తుంది అనే త్యాగం, తనకు ఉపకారం చేసిన వ్యక్తికి అపకారం రూపంలో ఉపకారం చేసిన కర్కోటకుడు, తాను ఒక రాజు అయ్యి ఉండీ తన వద్ద పనిచేసే ఒక వ్యక్తికి ఎలా మర్యాద ఇవ్వలి, ఒక విషయం వారి వద్ద నేర్చుకున్నప్పుడు వారికి తిరిగి ప్రత్యుపకారం ఎలా చేయాలి అని ఋతుపర్ణుని వద్ద మనం నేర్చుకోవలసిన పాఠములు. ఈ విషయములు అన్నీ మనం అర్ధం చేసుకోగలిగినప్పుడు, కలి అనే విషప్రభావం నుండి మనం బయట పడగలుగుతాము.

ఈ పాఠములు మనం రాబోయే టపాలలో తప్పకుండా నేర్చుకుందాం!