16, ఏప్రిల్ 2020, గురువారం

యమధర్మ రాజు - విదురుడు?

మనం ఇంతకు ముందు మహాభారతంలోని అనేక వ్యక్తులు ఏ ఏ అంశలతో జన్మించారో చెప్పుకున్నాం కదా! ఆ క్రమం లో యమధర్మ రాజు అంశతో  విదురుడు జన్మించాడు అని చెప్పాం  కదా! అలా యమలోక పాలకుడు అయిన యముడు మానవునిగా, అందులోనూ రాజ్యాధికారం లేని విధంగా ఒక శూద్రునిగా ఎందుకు జన్మించాడు? అని ఇప్పుడు తెలుసుకుందాం!
    ఈ సంఘటనకు మూలం మాండవ్యుడు అనే ఒక మహర్షి. ఈ కధ మనకు మహాభారతంలోని ఆదిపర్వం లో కనిపిస్తుంది.

మాండవ్యుడు అనే మహర్షి ఒంటరిగా అనేక తీర్ధయాత్రలు చేస్తూ చివరకు ఒక నగరముదగ్గరలో ఒక ఆశ్రమము నిర్మించుకుని మౌనదీక్షలో కాలం గడుపుతూ రెండుచేతులూ పైకి ఎత్తి తప్పస్సు చేసుకుంటున్న సమయంలో, ఆ నగరంలో దొంగతనం చేసిన ఇద్దరు దొంగలు, వారిని తరుముకుంటూ వచ్చిన రక్షకభటులు ఆ ఆశ్రమంలోనికి వచ్చారు. ఎవరికీ కనిపించకుండా దొంగలు దాక్కున్నారు. ఆ వచ్చిన రక్షకభటులు తపస్సులో ఉన్న మహర్షిని దింగల గురించి అడిగారు. కానీ మౌనదీక్షలో ఉన్న మహర్షి సమాధానం చెప్పకపోవడంతో వారే ఆశ్రమం లోనికి వెళ్లి దొంగలను పట్టుకుని, ఆ దొంగలకు ఆశ్రయం ఇచ్చారు అన్న నేరంతో మహర్షిని కూడా రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజుగారు దొంగలకు సరిఅయిన శిక్ష విధించి, వారిని కాపాడటానికి ప్రయత్నించారు అనే నేరమునకు గాను మహర్షికి శూలదండన విధించారు. అంటే ఒక పదునయిన శూలం మీద కూర్చోబెట్టారు.
అలా శిక్షను అనుభవిస్తున్న సమయంలో అతని వద్దకు కొందరు మహర్షులు పక్షులరూపంలో వచ్చి ఇలా మాండవ్య మహర్షికి ఇలా జరగటానికి కారణం ఏమిటి అని అడుగగా, మాండవ్యముని చేసిన కర్మలకు ఫలితాలు అవే వస్తాయి అని సమాధానం చెప్పారు. ఆ మాటలు విన్న కొందరు రక్షక భటులు రాజుగారికి సమాచారం ఇవ్వగా రాజుగారు మాండవ్య మహర్షి వద్దకు వచ్చి క్షమాపణ అడిగి ఆ శూలదండన శిక్షను రద్దు చేశారు. కానీ అప్పటికే శూలం పూర్తిగా గొంతువరకు దిగబడి ఉంది. కనుక ఆ శూలంను బయటకు తెచ్చే ప్రయత్నం మానేసి ఆ శూలంను అతని శరీరంలోనే విరిచేసారు. తరువాత కొంతకాలానికి మాండవ్య మహర్షి చనిపోయారు.
 అతను అప్పుడు యముడిని కలిసి, ఇంత భయంకరమయిన శిక్ష అతనికి లభించటానికి కారణం అడిగారు. అప్పుడు యముడు మాండవ్యమహర్షి చిన్నతనంలో తూనీగలతో ఆడుతూ వాటికి కష్టం కలిగించుట వలన ఈ శిక్ష లభించింది అని చెప్పారు. కానీ చిన్నతనంలో తెలిసి తెలియక చేసిన చిన్న తప్పుకోసం ఇంట పెద్ద శిక్ష వేయటం అధర్మం, ధర్మారాజుగా పిలువబడే యముడే ఇటువంటి తప్పు చేయుట వల్ల మాండవ్యమహర్షి అతనిని శపించారు.
ఆ శాపమే ధర్మ జ్ఞానం కలిగి ఉండి అందరికీ ధర్మమును భోదించుట, ఉత్తమ వీర్య సంజాతుడు అయినా రాజ్యార్హత లేదు.  మళ్ళీ మళ్లీ ఇతని ధర్మబోధ విన్న తర్వాత కూడా ధృతరాష్ట్రుడు సన్మార్గంలోకి రాలేదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి