చాణక్య నీతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చాణక్య నీతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జనవరి 2022, గురువారం

మన బంధువులు ఎవరు?

 మానవుడు సమాజిక జీవి. తనచుట్టూ ఎప్పుడూ తన స్నేహితులు, సన్నిహితులు ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. అయితే అలా తన చుట్టూ ఉన్నవారు నిజంగా తన బంధువులేనా? లేక వారి వారి అవసరాల కోసం తన చుట్టూ చేరుతున్నారా అన్న విషయం ఎవరికీ వారు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మరి మన బంధువులు నిజంగా ఎవరు అని మనకు ఎలా తెలుస్తుంది?

ఆ విషయాన్ని  చాణక్య నీతిలో  ఈ క్రింది శ్లోకం ద్వారా నేర్చుకుందాం!

ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రుసంకటే

రాజద్వారే శ్మశానే చ యస్తిష్టతి స బాంధవః

అర్ధంః ఆతురే = రోగము; వ్యసనే= దుఃఖము; ప్రాప్తే = కలిగినప్పుడు; దుర్భిక్షే = కరువు కలిగినప్పుడు, శత్రు = శత్రువులవల్ల; సంకటే= భయం కలిగినప్పుడు; రాజద్వారే = రాజసభలో, శ్మశానే = శ్మశానంలో;  యః = ఎవడు;  సః = వాడే; తిష్టతి = అం డగా ఉంటాడో; బాందవః= నిజమయిన బంధువు

భావం ః మనకు అనారోగ్యం కలిగినప్పుడు, భరించలేని దుఃఖంలో మనం మునిగి ఉన్నప్పుడు, మనవద్ద జీవనానికి సరిపోను ధనము / ఉపాధి కూడా లేనప్పుడు, మనలను గొప్ప శత్రువులు ముట్టడించినప్పుడు రాజాస్థానంలో నయినా చివరకు శ్మశానంలో అయినా ఎవరయితే ఎల్లప్పుడూ మనలను విడువకుండా మన వెంట మనకు ధైర్యాన్ని ఇస్తూ నిలిచి ఉంటారో వారే మనకు నిజమయిన బంధువులు. 

3, జులై 2016, ఆదివారం

మ్లేచ్చుడు నిర్వచనం

మనం ఇంతకు ముందు బ్రాహ్మణుడు, వైశ్యుల మరియు శూద్రుల నిర్వచనం తెలుసుకున్నాం కదా!ఇప్పుడు మరి మ్లేచ్ఛుని నిర్వచనం చాణక్యుని ప్రకారం ఏవిధంగా ఉందో చూద్దాం !
వాపీ కూప తడాగానామారామ సురవేశ్మనామ్
ఉచ్ఛేదనే నిరాశంకః స పిప్రో మ్లేచ్ఛ ఉచ్యతే!!
భావం : దిగుడు బావులు,బావులు, చెరువులు,ఉద్యానవనములు, దేవాలయములు మొదలగు వానిని నిశ్శంకోచముగా నాశనము చేయు వాడు (పుట్టుకతో) బ్రాహ్మణుడయిననూ వానిని మ్లేచ్ఛుడు అని చెప్పవలెను.

వివరణ :

పదిమందికి ఉపయోగపడు వానిని నాశనంచేయుటవలన ఎవరికి ఏ ఉపయోగమూ ఉండదు. కానీ కొందరు అలా చేయుటకు వెనుకాడరు. వారిని మ్లేచ్ఛులు అని పిలవవచ్చును అని పెద్దల మాట. 

1, జులై 2016, శుక్రవారం

శూద్రుడు నిర్వచనం

చాణాక్య నీతి ప్రకారం  మనం ఇంతకు ముందు బ్రాహ్మణ, వైశ్యుల నిర్వచనములు తెలుసుకున్నాం కదా! ఇప్పుడు శూద్రుని నిర్వచనం ఏ విధంగా ఉన్నదో చూద్దాం .
లాక్షాదితైలనీలానాం కుసుమ్భ మధు సర్పిషామ్
విక్రేతా మద్యమాంసానాం స విప్రః శూద్ర ఉచ్యతే !!

భావం  :  లక్క, నూనె వంటి నల్లని రంగు కలిగిన వస్తువులు, కుంకుమ, తేనె వంటి ఎర్రని రంగు గల వస్తువులు, మధ్యం,మాంసం మొదలగు వాటిని అమ్మేవారిని (పుట్టుకతో) బ్రాహ్మణులయినా, వారిని శూద్రులుగా పిలువ వలెను. 

25, జూన్ 2016, శనివారం

వైశ్యుడు- నిర్వచనం

మనం ఇంతకు ముందు బ్రాహ్మణుని గురించి శాస్త్రములు ఏమి చెప్పయో, ఎవరిని మనం బ్రాహ్మణులు అని పిలవాలో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఎవరిని వైశ్యులు అని చెప్తున్నారో చూద్దాం!
చాణక్యుని నీతిలో వీరిని ఈ విధంగా నిర్వచించారు
లౌకికే కర్మణి రతః పశూనాం పరిపాలకః
వాణిజ్యకృషి కర్తాయః స విప్రో వైశ్య ఉచ్యతే!!

భావం:  ఎవరైతే సాంసారికమైన పనులయందు ప్రీతి కలిగి ఉంటారో, పశువుల పాలన చేస్తూ ఉంటారో, వ్యాపారము, వ్యవసాయము చేస్తూ ఉంటారో అటువంటి వాడు బ్రాహ్మణుడయినా, వైశ్యుడని చెప్ప బడుతున్నడు. 

9, జూన్ 2016, గురువారం

బ్రాహ్మణుడు

హిందూమత  గ్రంధములన్నింటిలో ముఖ్యంగా చెప్పే విషయములను చూసుకుంటే వానిలో గోపూజ, బ్రాహ్మణ పూజ ముఖ్యం అని చెప్తారు. దీనిని పట్టుకుని కొందరు శాస్త్రములు సమసమాజమునకు అవరోధములు, ఒక జాతి వారిని గౌరవించి, మరొక జాతిని తక్కువ చేసి చెప్తున్నారు అని తప్పుగా అనుకుంటున్నాం! ఈ వ్యవస్థ ఏర్పడ్డప్పుడు వంశమును బట్టి వర్ణం ఏర్పడలేదు. అంటే ఒక బ్రాహ్మణుని కొడుకు బ్రాహ్మణుడు కావలసిన అవసరం లేదు. అలాగే మిగతా వర్ణములు కూడా. ఈ వర్ణములు వారు చేసే పనిని బట్టి నిర్ణయించారు. ఆ వర్ణములకు నిర్వచనములను స్పష్టంగా చెప్పారు.

బ్రాహ్మణుడు: నిర్వచనం 

బ్రాహ్మణుని గురించి చాణక్యుడు ఈవిధంగా చెప్పారు.

ఏకాహారేణ సంతుష్టః షడ్ కర్మనిరతః సదా !
ఋతుకాలాభిగామీ చ స విప్రో ద్విజ ఉచ్యతే !!

భావం : రోజుకు ఒక్కసారి భోజనం చేసి సంతోషంగా ఉండేవాడు, ఆరు కర్మలను నియమముగా చేసేవాడు, కేవలం సంతానంకోసము మాత్రమే వివాహం చేసుకునే వాడిని బ్రాహ్మణుడు అంటారు.
ఆరోజులలో అలా చెప్పారు మరి. ఇంతకీ బ్రాహ్మణుడు నియమముగా చేయవలసిన ఆ ఆరు కర్మలు ఏమిటి? వీని గురించి మనుస్మృతి లో చెప్పారు.
 అధ్యాపన మధ్యాయనం యజనం యాజనం తదా!
దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణా నామకల్పయత్ !!
                                                                               మనుస్మృతి : 1-88
భావం : చదువుట, చదివించుట, యజ్ఞములు చేయుట, చేయించుట, దానము చేయుట, ఇతరుల దానమును గ్రహించుట అనే ఆరు కర్మలు చేసిన వాడే బ్రాహ్మణుడు. 
గ్రంధకాలంలో వర్ణ వ్యవస్థ అలా ఉండేది. కనుక ఆ సమయంలో బ్రాహ్మణుడు, అంటే పైన చెప్పిన అన్ని పనులు నియమం తప్పక చేసేవాడికి అంత ప్రాముఖ్యం ఇవ్వటం తప్పు కాదు అనేది నా భావన. ఈరోజులలో ఉన్న కొందరు అధర్మమార్గంలో నడుస్తున్న బ్రాహ్మణులను చూసి ఇటువంటి వారికి శాస్త్రం అంత  గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదు కదా అని అనుకోవచ్చు. అయితే ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. శాస్త్రములలో చెప్పిన బ్రాహ్మణులు తన బ్రాహ్మణత్వమును కష్టపడి, ప్రయత్నించి సాధించారు. వారికి అది జన్మతః లభించలేదు. ఇప్పటికీ కొందరు నిజంగా పైవిధంగా జీవిస్తున్న బ్రాహ్మణులకు మనం అంత గౌరవం ఇచ్చి తీరాలి అనేది నా భావన. 

7, జూన్ 2016, మంగళవారం

పశువు - మనిషి

పరమ శివుని పశుపతిగా చెప్పినప్పుడు మానవులను పశువులుగా చెప్తారు. అందరూ మానవులకు పశువులకు గల భేదం ఏమిటి అని ఆలోచిస్తారు తప్ప వారి మధ్య ఒకేలా ఉండే గుణములు ఏవి అని ఎందుకు చూడరు? కొందరు చూస్తారు కదా! చాణక్యుని మాటలలో మనిషికి పశువుకు భేదంలేని విషయములు నాలుగు. అవి

ఆహార నిద్రా భయ మైదునాని, సమాని చైతాని నృణాం పశూనాం!
జ్ఞానం న రాణామధికో విశేషో, జ్ఞానేన హీనాః పశుభిః సమానాః !!  
   
భావం : ఆహారం, నిద్ర, భయం మరియు మైధునం అనే నాలుగు మానవులకు పశువులకు సమానం. కానీ మానవులకు విశేషమైన మరో లక్షణం జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానమును వదలేసిన మనిషి కూడా పశువుతో సమానమే!

3, జూన్ 2016, శుక్రవారం

జీవన చిత్రం - సార్ధకం

జీవన చిత్రం లో ఉన్న విచిత్రమైన సందర్బమును మునుపు చెప్పుకున్నాం కదా! మరి దానికి పరిష్కారం ? ఆత్మను ఉద్దరించుకునే పద్దతి? తపస్సులు వంటి పెద్దపెద్ద పనులు మనం ఈకాలంలో ఎలాగూ చేయలేము. కనుక మనకు తగిన విధంగా చక్కని, సులువైన ఉపాయం చెప్పారు మన పెద్దలు.

కురు పుణ్య మహోరాత్రం స్మర నిత్యం మహేశ్వరం !
త్యజ దుర్జన సంసర్గం భజ సాదు సమాగమమ్ !!

భావం :  రాత్రింబవళ్ళు పుణ్య కర్మలు చేయాలి, పరమేశ్వరుని నిత్యం స్మరించాలి. దుష్ట సాంగత్యం విడవాలి. సజ్జనుల వెంట ఉండాలి. 

అబ్బా ఎంత చక్కగా చెప్పారో! అసలు మనకు సమయం ఉండక పోవటం కదా సమస్య! ఇప్పుడు పుణ్యకార్యములు ఎక్కడ చేయాలి? అది కూడా రాత్రింబవళ్ళంట! సరిపోయింది. రెండోది, నిత్యం దేవుని స్మరించాలంట. పూజలు, పునస్కారములు చేసే సమయం ఉంటే ఇన్ని తిప్పలు ఎందుకు? మూడవది, దుష్టులకు దూరంగా ఉండాలి. సరే! మన చుట్టూ ఉన్నవారిలో 99 మంది అలాంటి వారే మరి ఇప్పుడేమిటి చేయటం? సజ్జనులు, కలియుగం లో ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకేం తెలుసు?

పుణ్యకార్యములు అంటే అవి కేవలం దేవాలయంలో మాత్రమే చేసేవి, మన ఉద్యోగాలు వ్యాపారాలు మానుకుని చేసేవి అని అర్ధంకాదు. తోటి మనిషికి మనం చేయగలిగిన సాయం చేయటం. మనం పని చేసే చోట మన వలన మరొకరికి ఇబ్బంది కలుగ కుండా చూసుకోవటం, వీలయితే ఇబ్బందులలో ఉన్నవారికి సాయం చేయటం. అది ఎవరైనా కావచ్చు. ఇంట్లో వంటచేసే సమయంలో మీ భార్యకు సహాయం చేయటం దగ్గరి నుండి, ఆఫీసులో మీ సహోద్యోగి వరకు ఎవరికైనా మీరు సహాయం చేయవచ్చు. దానికి పెద్ద సమయం పట్టాడు కదా!
నిత్యం దేవుని స్మరించటం! దీనికోసం గంటల తరబడి దేవుని గదిలో ఉండవలసిన అవసరం లేదు.  మనస్సులో తలచుకుంటూ ఉంటే చాలు.
ఈ రోజులలో మంచివారు చెడ్డవారు అని ఎవరిని వేరు చేసి చూడలేము. కనుక మన చుట్టూ ఉన్నవారిలో ఉన్న మంచి గుణములు చూసి, మనం వారి నుండి ఏమి నేర్చుకోగలమో నేర్చుకుని, వారి చెడు గుణములు/ అలవాట్లు మానుకోమని/ మార్చుకోమని చెప్పి , అవసరమయితే ఆ విషయంలో వారికి సాయం చేయగలగాలి.



1, జూన్ 2016, బుధవారం

జీవన చిత్రం

మానవుడు  ఈ లోకంలో పుట్టిన దగ్గరనుండి ఎన్నో పనులు చేస్తాడు, మరొకరితో చేయిస్తాడు. కానీ కొన్ని విషయములు మరచిపోతాడు.  వాని గురించి చాణక్యుడు ఏమి చెప్పాడంటే

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయన్తీ,
 రోమాశ్చ శత్రవ ఇవ ప్రహరన్తి గాత్రం !
ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివామ్బో,
లోకో న చాత్మహిత మాచరతీతి చిత్రం!!

భావం :  పెద్దపులివలె వృద్దాప్యం తరుముకు వస్తుంది, రోగములు శత్రువు వలే శరీరమును ఆక్రమిస్తాయి. పగిలిన కుండ నుండి నీరు నిరంతరం బయటకు పోయినట్లుగా మానవును ఆయుషు క్షీణిస్తుంది. అయినా కూడా మానవుడు తన ఆత్మకు మేలు చేకుర్చుకొనుటకు ప్రయత్నం చేయడు. ఇదేమి చిత్రమో!!

నిజమే కదా! ఈ రోజులలో ప్రతిఒక్కరు తమ తమ పనులలో హడావిడిగా ఉంటున్నారు. ప్రక్కవారిగురించి పట్టించుకోవటం మానేసి, తమను తాము పట్టించుకునే సమయం కూడా ఉండటంలేదు. పెద్దలను చూద్దామా అంటే, భగవత్ ధ్యానం చేయండి అని ఎవరైనా చెప్తే "అప్పుడే నాకు ముసలి తనం వచ్చింది అని చెప్తున్నావేమిటి " అంటూ సాగదీస్తారు. ఒకరోజు గడచింది అంటే మనకు ఉన్న సమయంలో ఒక విలువైన ఘట్టం ముగిసినట్లే కదా! అయినా దానిని మనం పట్టించుకోం.

ధర్మ, అర్ధ, కామ, మోక్షములు అనే నాలుగు పురుషార్ధములలో ఈ రోజు ప్రతిఒక్కరు అర్ధం వెనుక పరిగెడుతున్నారు. దానికి ముందు ఉన్న ధర్మం ఎవరికీ పట్టటం లేదు. తరువాత కామం వంతు. మోక్షం గురించి ఆలోచించే తీరికే లేదు. ఇంకా ఎన్ని జన్మలు పరుగెత్తినా అర్ధ, కామములు పరుగెత్తిస్తూనే ఉంటాయి తప్ప కనీసం విరామం కూడా ఇవ్వవు. అదే అర్ధమును ధర్మముతో, కామమును మోక్షముతో ముడి వేస్తే కదా ఆత్మకు ఉద్దరణ.
సులువుగా ఆత్మకు ఉద్దరణ కలిగే మార్గంకూడా మన పెద్దలు అనేక సందర్భములలో చెప్పే ఉంచారు. అవి మరో టపా లో చూద్దాం!  

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఎక్కడ నుండి ఏం తీసుకోవచ్చు!

విషాదప్యమృతం గ్రాహ్యమమేధ్యాదపి కాంచనం
నీచాదప్యుత్తమా విధ్యా స్త్రీ రత్నం దుష్కులాదపి!!

భావం : విషం నుండి అమృతాన్ని, మలినముల నుండి బంగారాన్ని, నీచుని వద్ద నుండి విధ్యను, తన కంటే తక్కువ కులములో ఉన్నా స్త్రీ రత్నమును స్వీకరించ వచ్చును.

వివరణ: విషమును అలాగే స్వీకరిస్తే అనారోగ్యం కలుగు తుంది. అలా కాకుండా దానిని చేయవలసిన విధంగా శుద్ధి చేస్తే అది ప్రాణములను నిలబెట్టే అమృతం అవుతుంది. మురికిగా ఉన్నప్పుడు అత్యంత విలువైన బంగారాన్ని కూడా మనం గుర్తించలేము. దానిని గుర్తించి, మురికిని తొలగించే నిపుణత ఉన్నప్పుడు మనకు బంగారము లభిస్తుంది. నీచుడు (తనకంటే చిన్నవాడు) చేసే పనులలోనుండి కూడా ఉత్తమ విధ్యను నెర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే దానికి కూడా కొంత నిపుణత అవసరం. స్త్రీ రత్నం తనకన్నా తక్కువ కులంలో జన్మించినా కూడా ఆమెను వరించ వచ్చును.  

29, మార్చి 2016, మంగళవారం

తండ్రి - కొడుకు

ఈ రోజులలో ఒక తండ్రి తన కొడుకుతో ఏ వయస్సులో ఎలా  ఉండాలో చెప్తారు కదా! దానికి మూలమయిన సంస్కృత శ్లోకం ఏదో చూద్దామా!
ఈ శ్లోకం చాణక్య నీతి దర్పణంలో ఉన్నది.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్ 
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్ర వదాచరేత్ 
ఈ శ్లోకమునకు అర్ధం: కొడుకునకు ఐదు సంవత్సరములు వచ్చేవరకు లాలించాలి. గారాబం చేయాలి. ఐదు నుండి పది సంవత్సరముల వరకు  మంచి చెడులు నేర్పేందుకు దండించాలి. పదహారు సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత మిత్రునిగా చూడాలి.


23, మార్చి 2016, బుధవారం

విద్యార్ధి -

మానవుడు నిరంతర విద్యార్ధి. సర్వదా తమ చుట్టూ జరిగే అనేక సంఘటనలనుండి ఎంతోకొంత నేర్చుకుంటూనే ఉంటాడు. అయితే వానిని అతను ఎంతవరకు అనుభవంలోనికి తీసుకుని, పాటించగలడు అనేది అతని మానసిక పరిపక్వతపై ఆధార పడి ఉంటుంది.
అయితే ఒక విద్యార్ధి తను విద్యను అభ్యసించే సమయంలో ఏ విషయములపై శ్రద్ధ చూపకుండా ఉండాలో, వేనిని పూర్తిగా వదలి వేయాలో చాణక్యుడు తన చాణక్య నీతి దర్పణంలో చెప్పారు. ఆ శ్లోకం 
కామం క్రోధం తధా లోభం స్వాదం శృంగారకౌతుకే !
అతి నిద్రాతి సేవే చ విద్యార్దీ హ్యష్ట వర్జయేత్!!
పైన చెప్పిన శ్లోకములో విద్యార్ధి ఎనిమిది విషయములకు దూరంగా ఉండాలని చెప్పారు. అవి 
  1.  శరీరమును సుఖముగా ఉంచు ప్రయత్నములు (మెత్తని పరుపులు, ఆసనములు), 
  2. విపరీతమయిన కోపము, 
  3. కొంచెంకూడా కష్టపడకుండా విద్యను కానీ మరేదయినా పొందాలనే లోభము, 
  4. మంచి రుచికరమయిన ఆహారం నందు అభిలాష,
  5. అలంకరించుకోవటం, 
  6. అతి నిద్ర 
  7. మరొకరిని అతిగా సేవించుట, 
  8. మరొకరిని అవసరం ఉన్నా లేకున్నా పొగడుట అనే ఈ ఎనిమిది గుణములను విద్యార్ధి వదలిపెట్టాలి. 
 

21, మార్చి 2016, సోమవారం

దండన

మన విద్యా వ్యవస్థలో అత్యంత కీలకమైనది దండన. ఇతర దేశములలో ఈ దండన పద్దతి కేవలం సౌమ్యంగా ఉంటుంది. కానీ మన దేశంలో ఈ దండన కొంచెం గంభీరంగానే ఉంటుంది.
అలా ఉండటానికి గల అవసరం చాణక్యుడు తన చాణక్య నీతి దర్పణం లో చెప్పాడు.
లాలనాథ్ బహవో దోషా స్తాడనాత్ బహవో గుణాః 
తస్మాత్పుత్రం చ శిష్యంచ తాడయేన్న తులాలయేత్ !
పైన చెప్పిన శ్లోకంలో భావం ఈ విధంగా ఉంది.
గారాబం (లాలన) చేయుట వలన అనేకములయిన దోషములు పెరుగుతాయి. అదే దండించుట వలన అనేకములయిన సుగుణములు వృధి కలుగుతుంది. అందువలన శిష్యులను, పిల్లలను అవసరమైన మేర దండించాలి.