ఇతిహాసాలలోని కొన్నిముఖ్యఘట్టాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇతిహాసాలలోని కొన్నిముఖ్యఘట్టాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మే 2020, సోమవారం

గరుడుడు-- ఆకలి

గరుడుడు తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చేయుటకు బయలుదేరాడు. తన తల్లి ఆశీర్వాదం తర్వాత తన తండ్రి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. తల్లి చెప్పిన నిషాదులని తినిన తర్వాత కూడా అతని ఆకలి తీరలేదు కనుక తినుటకు ఏమయినా దొరుకుతుందా అని ఆటను తండ్రిని ఆడిగాడు. అప్పుడు కశ్యపుడు విభావసుడు - సుప్రతీకుడు అనే అన్నదమ్ముల గురించి, వారు ఈ జన్మలో ఏనుగు, తాబేలు గా పుట్టుట గురించి చెప్పి వానిని తినమని చెప్పాడు. అవి ఉండే చోటు గురించి తెలుసుకుని గరుడుడు అక్కడికి వెళ్లి ఆ రెండింటిని తన రెండు కళ్ళతో పట్టుకుని అత్యంత  వేగంగా పైకి ఎగిరాడు.
ఎక్కడయినా కూర్చుని తినాలని ఒక స్థలం కోసం వెతుకుతూ  అలంబం అనే శిఖరం ఉన్న క్షేత్రానికి చేరుకున్నాడు. ఆ క్షేత్రం లో రోహిణము అనే వృక్షం అతనికి ఆతిధ్యం ఇవ్వటానికి సిద్ధపడి తన అతిపెద్ద కొమ్మను అతని కోసం చూపింది. దాని మీద గరుడుడు కూర్చోగానే ఆ కొమ్మ విరిగింది. అలా విరిగిన ఆ కొమ్మకు వాలఖిల్యులు ఉండుట గమనించిన గరుడుడు ఆ కొమ్మను తన ముక్కుతో పట్టుకున్నాడు. అలా రెండు కాళ్లతో ఏనుగు,  తాబేలు మరియు ముక్కుతో ఆ విరిగిన కొమ్మను తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడు. కశ్యప ప్రజాపతి గరుడుని నోటిలో ఉన్న కొమ్మను దానికి వేళ్ళాడుతున్న వాలఖిల్యులను చూసి వారికి నమస్కరించగా వారు వారి తపస్సును కొనసాగించుటకు  హిమాలయాలకు వెళ్లిపోయారు.
ఆ తరువాత గరుడుడు తనకు లభించిన ఆహారం తినుటకు వీలుగా ఒక స్థలం చూపమని అడుగగాదానికి కశ్యపుడు తాని నివసిస్తున్న గంధమాదన పర్వతానికి లక్ష ఆమడల దూరంలో నిష్పురుషం అనే కొండ ఉన్నది అని , అక్కడ ఎవరూ ఉండరు కనుక అక్కడకు వెళ్లి తినమని చెప్పాడు. అక్కడకు వెళ్లి గరుడుడు తన ఆకలి తీర్చుకున్నాడు. అక్కడి నుండి అమృతమును తీసుకు రావటానికి స్వర్గానికి బయలుదేరాడు. 

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఉత్తానపాదుడు

స్వయంభుమనువునకు శతరూప యందు జన్మించిన పుత్రుడు ఉత్తానపాదుడు(పాదములు ఎత్తిన వాడు, సర్వ సిద్దంగా ఉన్నవాడు).
ఉతానపాదునకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. వారి ఇరువురి యందు ఇద్దరు పుత్రులు కలిగారు. పెద్ద భార్య అయిన సునీతికి దృవుడు పెద్దవాడు, రెండవ భార్య కుమారుడు ఉత్తముడు చిన్నవాడు. ఉత్తనపాదునకు తన రెండవ భార్య అంటే ఉన్న అమితమైన ప్రేమ కారణంగా అతను సర్వదా మొదటి భార్య అయిన సునీతిని నిరాదరిస్తూ వచ్చాడు. ఆమె పుత్రుడయిన కారణంగా దృవునికి కూడా తండ్రి ప్రేమ దొరకలేదు.
ఒకనాడు ఉత్తానపాదుడు తన విశ్రామ సమయంలో చిన్న భార్య కుమారుడయిన ఉత్తముడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తూ ఉండగా, తండ్రి ప్రేమను పొందాలన్న కోరికతో బాలుడయిన దృవుడు తండ్రి వద్దకు పరుగెత్తాడు. ఐతే తన చిన్న భార్య చూస్తున్నది అని భావించిన ఉత్తానపాదుడు దృవుని దగ్గరకు తీసుకోలేదు. అది సురుచి అహంకారమును పెంచినది. ఆమె చిన్న పిల్లవానితో ఏమి మాట్లాడుతున్నదో కూడా తెలియని భావోద్వేగములకు లోనయినది.
"నీ తండ్రి ఒడిలో కూర్చోటానికి వచ్చావా? నీకు ఆ అర్హత లేదు, ఒకవేళ ఉన్నట్లయితే నీవు నా కడుపున నా పుత్రునిగా జన్మించేవానివి. ఇప్పుడయినా మార్గం ఒకటి ఉన్నది. నీవు ఆ మహావిష్ణువుని ప్రార్ధించి, అతని వరములను పొంది నా గర్భంలో జన్మించు, అప్పుడు తప్పకుండా నీ తండ్రి ఒడిలో కూర్చునే అధికారం పొందగలవు"

సురుచి అంటున్న ఈ మాటలను విన్న తరువాత కూడా ఉత్తానపాదుడు ఏమి మాట్లాడలేదు. తన పుత్రుడిని అతని భార్య అవమానిస్తూ మాట్లాడినా, ఆ పిల్లవానికి ఆమె చెప్తున్న విషయం అర్ధంకాదు అని తెలిసినా, ఆమె అతని ప్రేమ వలెనే ఆమె ఇంతగా అతిశయించినది అని తెలిసినా ఆమెను ఏమీ  అనలేదు.
సవతి తల్లి అనిన మాటలు, ఆ మాటలు వింటూ కూడా బదులు చెప్పని తన తండ్రి వలన అవమానంగా భావించి, తన తల్లి అయిన సునీతి ఆ తరువాత నారదుని ఉపదేశం మీద అడవులకు వెళ్లి తపస్సు చేయసాగాడు.
అప్పుడు ఉత్తానపాదునికి అతని తప్పు తెలిసివచ్చినది. అడవుల పాలయిన తన పుత్రుని కోసం ఎదురు చూడసాగాడు. తపస్సు ముగించుకుని రాజ్యమునకు తిరిగి వచ్చిన దృవునకు రాజ్యాభిషేకం చేసాడు. 

11, సెప్టెంబర్ 2014, గురువారం

స్త్రీ వనము

మన పురాణములలో ఒక విచిత్రమైన వనం (తోట) గురించి చెప్పారు. అది స్త్రీవనం. ఆ వనంలోకి స్త్రీలు మాత్రమే  అడుగుపెట్టగలరు. ఒకవేళ పురుషులు ఎవరైనా అడుగుపెడితే వారు కూడా స్త్రీలు అయిపోతారు. ఎందుకు?

ఒక రోజు శివ పార్వతులు ఒక వనంలో క్రీడించుచుండగా, ఆ విష్యం తెలియని జ్ఞానవంతులైన, దిగంబరులయిన మునులు శివ దర్శనార్ధమై వచ్చారు. అప్పుడు ఆ సమయంలో దిగంబరులయిన మునులను చూసిన పార్వతీదేవి కించిత్ సిగ్గుపడి పక్కకు వెళ్ళినది. శివపార్వతుల ఏకాంతమును భంగం చేసాం అనే అపరాధ భావనతో ఆ మునులు అక్కడి నుండి నరనారాయణులు నిరంతరం తప్పస్సులో మునిగి ఉండే బదరికి వెళ్ళిపోయారు.
కానీ తమ ఏకాంతమునకు  ఇటువంటి ఒక విఘ్నం ఇకమీదట కలుగ కూడదనే పార్వతి మనోసంకల్పం తెలుసుకున్న మహాదేవుడు ఒక నిర్ణయం చేసాడు. ఆనాటి నుండి ఎవరైతే ఆ వనంలో అడుగు పెడతారో వారు స్త్రీలుగా మారిపోతారు.

ఎందుకు ?
ఎందుకంటే ఆ రోజు వచ్చినది దిగంబరులయిన మునులు. వారికి శరీర సంబందమైన ఏ విధమైన విషయంలోనూ ఆసక్తి ఉండదు. అటువంటి వారిని ఆ వనం లోనికి రావద్దు  అని చెప్పలేరు. అలాగని వారికి శరీరం గురించిన సిగ్గు వంటి భావనను ధరించమని భోదించలేరు. దీనికి మధ్యే మార్గం సహజంగా సిగ్గుతో ఉండే స్త్రీలయితే బాగుంటుంది అని. ఒకవేళ ఇటువంటి మునులు మరలా అక్కడకు వస్తే అక్కడ ప్రవేశించగానే స్త్రీలుగా మారిపోతారు. అప్పుడు స్త్రీకి సహజమైన సిగ్గు కారణంగా వారు వస్త్రములను ధరిస్తారు.


9, సెప్టెంబర్ 2014, మంగళవారం

బలరాముడు చేసిన తప్పు

బలరాముడు అవతార పురుషుడు. స్వయంగా ఆదిశేషుని అవతారం. మరి అటువంటి అవతార పురుషుడు ఎలాంటి తప్పు చేసాడు? మరి దాని నుండి ఎలా బయట పడగలిగాడు?
బలరాముడు కురుక్షేత్ర యుద్ధం సమయంలో తీర్ధయాత్రలకు వెళ్ళాడు.  తనతో పాటు 10,000ల మంది ఉత్తమ బ్రాహ్మణులను వెంట తీసుకుని వెళ్ళాడు. అలా అన్ని తీర్ధములు తిరిగి వస్తూ నైమిశారణ్యం వైపుకు వెళ్లారు. అలా వెళుతూ ఉండగా దారిలో, ఎవరో ఒకరు ఎదురుపడి బలరామునకు కొంత కల్లును ఇచ్చారు. బలరాముడు ఆ కల్లును స్వీకరించారు. నైమిశారణ్యమునకు చేరేసరికి, అక్కడ రోమహర్షనుడు బ్రహ్మ స్థానం లో కూర్చుని పురాణములను అనేక మంది ఋషులకు, మునులకు చెప్తూ ఉన్నాడు. బలరాముడు అక్కడకు వచ్చుట చూసి, పురాణములను వింటూ ఉన్న మునులు, ఋషులు వారికి ఎదురు వెళ్లి వారికి అతిధి మర్యాదలు చేసారు. ఒక్క రోమహర్షణుడు తప్ప మిగిలిన అందరూ తమను గౌరవించుట చుసిన బలరాముని ఆలోచనల మీద ఇంతకు ముందు తీసుకున్న కల్లు  ప్రభావం చేసినది. ఆపలేని కోపంతో రోమహర్షణుడు తనను అవమానించాడని, అతనిని తన నాగలితో బ్రహ్మ స్థానంనుండి క్రిందికి లాగి వేసి, తన రోకలితో అతని తలపై ఒక్క దెబ్బ వేసాడు. మరుక్షణం రోమహర్షణుడు మరణించాడు. అప్పుడు కల్లు ప్రభావం తగ్గటం వల్ల బలరామునికి తను చేసిన తప్పు తెలిసినది. 
అప్పటి వరకు చంద్రుని కాంతి వలే తెల్లగా ప్రకాశించే తెల్లని దేహం కలిగిన బలరాముని దేహం ఆ బ్రహ్మహత్య కారణంగా,. ఒక్కసారిగా అత్యంత నల్లగా మారిపొయినది. అప్పుడు తనకు కలిగిన బ్రహ్మహత్యా పాపమునుండి విముక్తి ఎలా కలుగుతుంది అని అక్కడ ఉన్న ఋషులను, మునులను అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు చనిపోయిన రోమహర్షుని బ్రతికించమని కోరారు. కాని తాను చంపిన వ్యక్తిని మరలా బ్రతికించుట సాధ్యం కాదు. కాని తన ఆత్మబలం చేత అతనికి శాశ్వతంగా బ్రహ్మలోకం ఇప్పించగలను, అతని ఆయుష్షు ను మేధా శక్తి  నీ  అతని కుమారునకు సంక్రమించేలా చేయగలను  అని బలరాముడు రోమహర్షునకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించాడు. మరి ఇక పురాణములు చెప్పే భాద్యతను రోమహర్షుని కుమారుడైన సూతమహామునికి అప్పగించారు. 
ఈ కార్యములు చేయుట వల శరీరం మొత్తం నల్లగా మారిన బలరాముని శరీరం లో కొంత బాగం మాత్రమే (కేవలం నుదురు భాగం) తెల్లాగా మారినది. అంటే తను చేసిన పాపమునకు ఇంకా పారిహారం కాలేదు అని తెలుసుకుని ఇంకా ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు ఋషులు తమను పల్వలుని బారినుండి కాపాడమని కోరారు. 
బలరాముడు పల్వలుని సంహరించిన తరువాత తాని శరీరం తలవరకూ తెల్లగా మారినది. మరి మిగిలిన శరీర నలుపు ఏవిధంగా పోగొట్టుకోగలను అని అడుగగా, ఋషులు అతనిని తీర్ధయాత్రలు చేయమని చెప్పారు. 
అలా అనేక తీర్ధములు తిరిగి కొంచెం కొంచెం తన శరీరం లోని నలుపును పోగొట్టుకుంటూ చివరకు రామేశ్వరంలో పూర్తిగా తన బ్రహ్మ హత్యా దోషమును పోగొట్టు కున్నాడు. 
అప్పుడు బలరాముడు తీర్ధయాత్రలు చేసే వారు నియమ నిష్టలతో చేయాలి అని నియమం చేసాడు. 

4, సెప్టెంబర్ 2014, గురువారం

ప్రవరాఖ్యుడు

ప్రవరాఖ్యుడు బ్రాహ్మణుడు. సర్వసద్గుణ వంతుడు. అందంలో ఆశ్వినిదేవతల తో సమానమైన వాడు. తల్లితండ్రులకు సేవచేయటంలో ఉత్తముడు. భార్యాబిడ్డలకు ప్రేమానురాగాములు పంచుటలో మేటి. నిరంతరం అతిధులకు ఆతిధ్యం ఇస్తూ, వారి ప్రయాణ విషయముల గురించి, వారు దర్శించిన స్థలముల గురించి వివరములు తెలుసుకొనుట అతని దినచర్యగా ఉన్నది. ఇలా చిన్నప్పటినుండి తన స్వగ్రామము వదలి వెళ్ళని ప్రవరాఖ్యునికి అనేక దేశములను చూసిన వారి అనుభవములను విని విని తనకు కూడా ఇతర ప్రదేశములను చూడాలన్న కోరిక కలిగినది.
ఒకనాడు రాత్రివేళ వారి ఇంటికి ఒక యువఅతిధి వచ్చాడు. అతనికి ఆతిధ్యం ఇస్తున్న వేళ ఆ అతిధి చూసివచ్చిన ప్రదేశముల గురించి ప్రవరాఖ్యునకు చెప్తూ ఉన్నాడు. అనేక దేశములు, వివిధ వింతలు, విశేషాలు, అధ్బుతములు ఎన్నో మరెన్నో. అన్నీ  వింటున్న ప్రవరాఖ్యునకు ఈ అతిధి అన్ని ప్రదేశములు ఏవిధంగా సంచరించాడో అర్ధంకాలేదు. ఆటను చూస్తే యువకుడు, అన్ని ప్రదేశములు తిరిగి రావాలంటే అతని వయస్సు సరిపోదు. మరి ఎలా ఇతను అన్ని ప్రదేశములను చుట్టి రాగలిగాడు? అదే సందేహం ఆ అతిధిని అత్యంత ఉత్య్సుకతతో అడిగాడు.
దానికి ఆ యువ సిద్ధుడు తనకు అనేక దివ్య ఔషదముల గురించి, దివ్య లేపనముల గురించి తెలుసనీ, తనవద్ద ఒక దివ్యమైన పాదలేపనము ఉన్నది అని ఆ లేపనము పాదములకు పెట్టుకుని అనేక యోజనముల దూరం కేవలం ఒక్క పూటలో వెళ్ళ వచ్చు అని చెప్పారు. ఆ మాటలు విన్న ప్రవరాఖ్యుడు తనకు ఆ లేపనము ఇస్తే తనకు సర్వదా కల ఇతరదేశములను దర్శించాలన్న కోరికను తీర్చుకోగలను అని అడిగాడు. ఆ సిద్ధుడు ప్రవరాఖ్యునకు కొంత లేపనమును ఇచ్చాడు. తనకు లభించిన ఈ అవకాశమును ఉపయోగించ దలచుకున్నాడు.
ఉదయాన్నే నిత్యకృత్యములను పూర్తిచేసుకుని ఆ లేపనమును తన పాదములకు వ్రాసుకుని ప్రవరాఖ్యుడు హిమాలయప్రాంతమునకు చేరుకున్నాడు.  
ఆ హిమాలయప్రాంత అందములను చూస్తూ, వాటిని గమనిస్తూ అటూ ఇటూ ఆ హిమపర్వతం మీద పరుగులు తీస్తూ, తన పాదములకు ఉన్న లేపనం మంచులో కరిగిపోతుండగా గమనించలేక పోయాడు. మధ్యాహ్న సమయం అవ్వటం గమనించి తిరిగి తన ఇంటికి చేరుకోవాలి అనే కోరికతో, వేగంగా నడవటానికి ప్రయత్నించగా అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు తన పాదలేపనము లేకపోవుట గమనించి, పరి పరి విధములా భాదపడ్డాడు. తనను తానూ నిందించుకున్నాడు.
ఆ సమయంలో ప్రక్కనే ఎవరో గానం చేస్తున్న సవ్వడి వినిపించినది. అక్కడ ఎవరైనా ఉంటే తను తన స్వగృహమునకు వెళ్ళేందుకు సహాయం చేస్తారు అని సంతోషించాడు.
అక్కడకు వెళ్లి చూడగా అక్కడ ఒక గంధర్వ కాంత ఉన్నది. ఆమె, వరూధిని, ప్రవరాఖ్యుని చూసిన మరుక్షణం అతనిని మోహించినది. కాని ఇంటికి వెళ్ళాలన్న తొందరలో ఉన్న ప్రవరాఖ్యుడు ఆమెను తన ఇంటికి వెళ్ళే మార్గం చెప్పమని అడిగాడు. దానికి ఆమె అతనిని తాను వలచానని, వారిరువురూ ఈ హిమాలయములలో సుఖంగా జీవనం సాగించవచ్చును  అని ప్రతిపాదించినది.
ఆ ప్రస్తావన నచ్చని ప్రవరాఖ్యుడు ఆమెకు నచాచేప్పాలని ప్రయత్నించాడు. కానీ  ఆమె వినే పరిస్థితిలో లేదని తెలుసుకుని, తాను నిత్యం పూజించే గార్హపత్యాగ్నిని ప్రార్ధించి తనను తన గృహమునకు చేర్చమని వేడుకున్నాడు.
అప్పుడు గార్హపత్యాగ్ని ప్రవరాఖ్యుని తన గృహమునకు చేర్చాడు.
ఈ సంఘటన వల్ల ఒక మనువు, స్వారోచిషుని జననమునకు బీజం పడినది.  

3, సెప్టెంబర్ 2014, బుధవారం

కళావతి

 కళావతి, ఈమె గురించి మనకు ఎక్కువ తెలియదు. ఈమె కూడా శకుంతల వలే తల్లి తండ్రులవల్ల అరణ్యం లో విడువ బడినది. ఐతే ఎందుకు? ఆమె గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?

పూర్వకాలంలో పర అనే పేరుకలిగిన ఒక బ్రహ్మర్షి ఉండేవాడు. అతను చిన్నపటినుండి బ్రహ్మచార దీక్షలో ఉన్నాడు. అతను సర్వగుణ సంపన్నుడు. వేదములు,వేదాంగములు అవుపాసన పట్టినవాడు. చైత్రమాసం, కోకిలలు కూయుచున్న వేళ అతను ఉన్న ఆ ప్రదేశానికి పుంజికస్థల అనే ఒక అప్సరస వచ్చినది. ఆమెను చూడగానే పర బ్రహ్మర్షి మనసు మన్మధ తాపమునకు లోనయినది. వారి సంగమము వల్ల వారికి ఒక పుత్రిక జన్మించినది. పుత్రిక జన్మించగానే వారికి కలిగిన మోహపు తెరలు విడిపోయాయి. అప్సరస తన స్వస్థానానికి వెళ్ళిపోయినది, బ్రహ్మర్షి కూడా తన తపస్సు కొరకు ఆ పసిపిల్లను అడవిలో వదిలి వెళ్లి పోయాడు. అడవిలో అనేక క్రూరమృగముల మధ్య ఆ బాలిక కేవలం చంద్రుని అమృత ధారలను పానం చేస్తూ పెరిగినది. కనుకనే ఆమెను కళావతి అని పిలిచారు. ఎవరో ఒక మహాత్ముడు ఆమెను చేరదీసి పెంచాడు.
ఆమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైన అలీన అనే ఒక అందమైన, దేవతలకు విరుద్ధంగా ఉండే ఒక గంధర్వుడు ఆమెను వివాహంచేసుకుంటాను అని ఆమె తండ్రి వద్దకు వచ్చి అడిగాడు. ఐతే ఆ తండ్రి ఆమెను ఆ గంధర్వునికి ఇవ్వటానికి ఇష్టపడలేదు.  తన ప్రస్తావనను నిరాకరించిన ఆమె తండ్రి మీద ఆ గంధర్వునికి విపరీతమైన కోపంవచ్చినది. వెంటనే గంధర్వుడు ఆమె తండ్రిని సంహరించాడు.
తన తండ్రి మరణానికి తానే కారణం అని భావించిన కళావతి ఆత్మహత్యా ప్రయత్నం చేసినది. ఆ సమయంలో ఆమెను ఒక దివ్య శక్తి అడ్డుకున్నది. ఆమే భవుని భార్య సతీదేవి. సతీదేవి కళావతిని అనునయించినది, ఆమెకు భవిష్యత్తు గురించి చెప్పినది.
"ఓ ప్రియ కళావతి! నీవు ఎంతో సుందరమైన దానివి. నీకు ఈ భూలోకంలో అత్యంత ఉత్తమమైన భవిష్యత్తు ఉన్నది. మునుముందు నీవు స్వరోచి అనే ఒక ఉత్తముని వివాహం చేసుకోవలసి ఉన్నది. అతనే స్వారోచిషుడు అనే మనువునకు తండ్రి కాగలిగిన వాడు. అతనికి నీ నుండి ఎంతో సహాయం జ్ఞాన రూపంలో అందవలసి ఉన్నది. లోక రక్షణార్ధమై నీవు ఈ పని చేయవలసి ఉన్నది కనుక స్వయంగా జ్ఞాన స్వరూపుడైన శివుని అర్ధంగిని, సతీ దేవిని అయిన నేను నీకు స్వయంగా పద్మిని విద్యను బోధిస్తాను. ఈ విద్య ద్వారా సర్వదేవతలు ఉన్నత గతిని పొందుతున్నారు." అని పద్మిని విద్యను కళావతికి భోదించినది.
కాలాంతరంలో కళావతి, విభావరి తో కలిసి మనోరమ అనే ఒక గంధర్వకాంతకు చెలికత్తెగా ఉన్నారు. వారు ముగ్గురూ స్వరోచిని వివాహంచేసుకున్నారు.
మనకు గల మనువులలో రెండొవవాడు ఐన స్వారోచిష మనువు,  జననమునకు కావలసిన సర్వగుణములు అతనికి చేరేలా రంగం సిద్ధం అయినది. 

27, ఆగస్టు 2014, బుధవారం

వినాయక ఆవిర్భావం

వినాయక జననం గురించి అనేక పురాణములలో అనేక విధములుగా చెప్పబడినది.

లింగపురాణం :
రాక్షసులు సర్వత్రా మహాదేవుని గురించి తపస్సు చేసి అమితమైన బల, పరాక్రమములను పొంది, సర్వదేవతలను కష్టముల పాలుచేయసాగారు. వారి భాదలు తట్టుకోలేక ఆ దేవతాగణములు దేవదేవుని వారి కష్టములను తొలగించే ఉపాయం చెప్పమని ప్రార్ధించారు. అప్పుడు మహాదేవుడు తన మనోబలంచేత వినాయకుని సృష్టించి ఆ రాక్షసులకు అన్ని రకముల విఘ్నములు కలిగించేవిధంగా ఆజ్ఞ ఇచ్చి పంపారు.

సుప్రభేదాగమము :
ఈ ఆగమము ప్రకారం, పార్వతీ పరమేశ్వరులు ఒకసారి హిమాలయములో విహరిస్తూ ఉండగా, వారికి సృష్టికార్యములో నిమగ్నమైన ఒక గజద్వయం కనిపించినది. ఆ దృశ్యమును చూసిన పార్వతీదేవి సిగ్గుతో పరమశివుని  చూసినది, ఆమె ఆంతర్యమును గ్రహించిన శివుడు, పార్వతీదేవి కూడా గజరూపం ధరించారు. అప్పుడు వారి ఆనందమునకు ప్రతిగా గజముఖం కలిగిన వినాయకుడు జన్మించాడు.

శివ పురాణం: 
ఇక మనం సర్వదా వినాయక చవితి రోజు అనుసంధానం చేసే వినాయక సంభవ కధ శివపురాణంలోనిది. 

విష్ణుదేవుని ద్వారపాలకులు ఒకసారి శివపార్వతుల దర్శనార్ధం కైలాసానికి వచ్చారు. దేవిని దర్శించుకునే సమయంలో వారు పార్వతీదేవికి ఒక విజ్ఞాపన చేసారు. 
" దేవీ! పార్వతీమాతా! మహాదేవునకు నంది, భ్రుంగి వంటి ద్వారపాలకులు ఉన్నారు. జగన్మాతవైన నీకు కనీసం ఒక్కరైనా ఉండాలికదా, అలా ఉండుట ఎంతయినా అవసరం" అని చెప్పారు. 
వారి మాటలు విన్న పార్వతీ దేవి చిరునవ్వుతో ఆ కార్యం త్వరలోనే నెరవేరుతుంది అని వారికి చెప్పినది. 

గజాసురుని కోరికమీద, అతని పొట్టలో నివాసముంటున్న మహాదేవుని, శ్రీహరి ఒక గంగిరెద్దులవాని రూపంలో వెళ్లి తీసుకువస్తున్నాడని తెలిసిన పార్వతీదేవి అమిత సంతోషాన్ని పొందినది. మహాదేవుడు తిరిగి వచ్చేలోపు ఆమె సర్వాంగసుందరంగా ఎదురు వెళ్ళాలి అని భావించినది. ఆమె నలుగుపెట్టుకున్న పిండిని ముద్దగా చేసి సంతోషంతో ఆ ముద్దకు ఒక బాలుని ఆకారం ఇచ్చినది. ఆ మూర్తిని చుసిన ఆమె లో మాతృత్వపు భావన కలిగినది. వెంటనే ఆ మూర్తికి ప్రాణం పోసినది. ఆ బాలునికి వినాయకుడు అని పేరు పెట్టినది. ఆ బాలుని ద్వారపాలకునిగా ఉంచి ఎవరినీ లోనికి రానివ్వవద్దని చెప్పి స్నానాధికములు చేయుటకు లోపలకు వెళ్ళినది.
అప్పుడు ఎంతో కాలం తరువాత కైలాసానికి వచ్చిన శివుడు ఉమను చూడాలన్న కోరికతో ఆతృతగా వచ్చాడు. కాని శివుడే తన తండ్రి అని తెలియని వినాయకుడు అతనిని అడ్డగించాడు. వారి మధ్య వాదోపవాదములు జరిగిన తరువాత శివుడు స్వయంగా తన త్రిశూలంతో ఆ బాలుని కంఠమును ఉత్తరింఛి లోనికి ప్రవేశించారు.
ఎంతో కాలంతరువాట తనపతిదేవుని చుసిన పార్వతి ఎంతో సంతోషించినది. కొంతసమయం తరువాత వారి మాటలలో ద్వారపాలకునిగా ఉన్న బాలుని ప్రస్తావన వచ్చినది. శివుడు తానూ బాలుని శిరచ్చేదంచేసిన విధంవిన్న పార్వతీదేవి శోకితురాలయినది.
అప్పుడు మహాదేవుడు తన గణములను ఉత్తరాదిశగా తలను ఉంచి పడుకుని కనిపించిన మొదటి ప్రాణి యొక్క శిరస్సును తెమ్మని ఆదేశించారు. అన్ని గణములు వెళ్లి వెతుకగా వారికి ఒక ఏనుగు కనిపించినది. వారు ఆ ఏనుగు యొక్క తలను తెచ్చి శివునకు ఇచ్చారు. అప్పుడు మహాదేవుడు ఆ బాలునకు ఏనుగు తలను ఉంచి బ్రతికించారు. అప్పటినుండి వినాయకునకు గజముఖుడు అని నామాంతరం వచ్చినది.

కాని ఇక్కడ మనకు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి.

  1. శివునికి ఒక బాలుడిని శిరచ్చేదం చేసి సంహరించేంత కోపం ఉంటుందా?
  2. సర్వాంతర్యామి ఐన మహాదేవునికి తన పుత్రుని గురించి తెలియదా? 
  3. ఒక ఏనుగు తల నిర్ధక్షిణ్యం గా ఒక చిన్న బాలునకు ఎందుకు అమర్చవలసి వచ్చినది?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చుడండి. 

25, ఆగస్టు 2014, సోమవారం

వినాయకుడు - మహాభారతం

మహాభారతం మనకుగల అన్ని పురాణములలో, ఇతిహాసములలో అతి పెద్దదయిన గ్రంధము. మహాభారతములో ఒక లక్ష శ్లోకములు ఉన్నాయి. మహాభారతమును రచించినది వేదవ్యాసుడు అని మనకు తెలుసు. ఐతే అతను స్వయంగా ఘంటం పట్టుకుని వ్రాయలేదు. మరి ఎవరు రాసారు? ఎందుకు?
మహాభారత కధ వ్యాసుడు మహాభారత యుద్ధం జరిగిన తరువాత కొంతకాలానికి రాసాడు. వేదవ్యాసుడు మహాభారతంలో అనేక సందర్భములలో కనిపిస్తాడు. కనుక ఆ సంఘటనలు జరిగినప్పుడు అవి వ్యాసునికి బాగా తెలేసే అవకాశం ఉన్నది.  ఆయన స్వయంగా వేదవ్యాసుడు. కాని జరిగిన సంఘటనలను యధాతధంగా ఒక దృశ్యకావ్యంగా రూపొందించాలంటే ఎంతో శ్రమతో కూడిన విషయం. కనుక అతనికి ఎవరైనా అనుచరుని (లేఖకుని) సహాయంతో రచన ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలో ఒకనాడు బ్రహ్మదేవుని దర్శన భాగ్యం కలిగినది.
అప్పుడు వ్యాసభగవానుడు తనమనస్సులోని భావనను చెప్పి తాను చెప్పినది చెప్పినట్లు రాయగలిగిన లేఖకుని గురించి సలహా ఇవ్వమని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు
" వ్యాసా! నీవు తలపెట్టిన ఈ బృహత్ కార్యమునకు విఘ్ననాయకుడైన గణపతి సరిఅయినవాడు. వెళ్లి అతనిని అర్ధించు." అని చెప్పారు. ఆ ప్రస్తావన విన్న వేదవ్యాసుడు అమిత అనందం పొందాడు.
వెంటనే కైలాసానికి వెళ్లి వినాయకునికి తన ప్రతిపాదన వివరించాడు. వినాయకునికి మహాభారత కధను వ్రాయుట సమ్మతమే అని చెప్పారు కాని ఒక షరతు విధించారు.
"ఒకసారి చెప్పటం మొదలుపెడితే, రాయటానికి ఒకసారి కదిలిన తన ఘంటం ఆగకూడదు, ఒకవేళ అలా ఆగినట్లయితే, తానూ ఇంక ఆ రచనకు సహాయం చేయడు."
ఆ షరతు విని వ్యాసుడు అంగీకరించాడు, మరో ప్రతిషరత్తు విధించాడు.
"తానూ చెప్పిన ప్రతి వాక్యాన్ని వినాయకుడు అర్ధంచేసుకున్న తరువాతనే రాయాలి."
ఆ షరతు విన్న విధ్యాదిపతి గణపతి ఆనందంగా ఒప్పుకున్నాడు.
పరశురామునితో జరిగిన యుద్ధంలో  విరిగిన తన దంతమును ఘంటముగా ధరించాడు. మహాభారత ఇతిహాసం వ్రాయటం మొదలుపెట్టారు. ఐతే వ్యాసభగవానునికి తరువాత చెప్పవలసిన శ్లోకం/ఘట్టం/సంఘటన గురించి కించిత్ ఆలోచించవలసి వచ్చినా సమయం తీసుకునే అవకాశం లేదు కనుక తనకు అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు క్లిష్టమైన ఒక శ్లోకం చెప్పేవాడు. గణపతి ఆ శ్లోకం అర్ధంచేసుకుని రాసేలోపు తాను తరువాతి కధను మనసులోనే సిద్ధంచేసుకునే వాడు. అలా చెప్పిన క్లిష్టమైన శ్లోకములను గ్రంధులు అంటారు. మహాభారం మొత్తం మీద ఇటువంటి గ్రంధులు 8800 ఉన్నాయి. అంటే అన్ని సార్లు వ్యాసునికి ఆలోచించవలసిన అవసరం వచ్చింది, వినాయకునికి చెప్పినది ఒక్కక్షణం అలోచించవలసిన అవసరం వచ్చినది.