మన ఋషులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మన ఋషులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, సెప్టెంబర్ 2014, సోమవారం

శుకమహర్షి జననం

శుక మహర్షి వేద వ్యాసుని పుత్రుడు.  శుక మహర్షి విచిత్రమైన ఆకారం కలవాడు. తల వరకు చిలుక, శరీరం మానవ దేహం.
శుక మహర్షి కూడా వేద వ్యాసుని వలే పుట్టుకతోనే పరమ జ్ఞాని. ఐతే తండ్రిని మించిన తనయుడు. మరి అటువంటి వాని పుట్టుకకు కారణం ఏమిటి?
సరస్వతి నది ఒడ్డున నివసిస్తున్న సమయంలో వ్యాసమహాముని కావ్యములను, పురాణములను రచిస్తూ ఉండేవారు. అలా ఉన్న సమయంలో వారు ఒక పిచుకల జంటను చూస్తూ ఉండేవారు. కొంత కాలమునకు ఆ పిచ్చుకలకు ఒక చిన్న పిచ్చుక జన్మించినది. ఆ చిన్ని పిచ్చుకకు వారు చూపించే ప్రేమను గమనిస్తూ ఉండేవారు వ్యాస భగవానులు. అలా ఆ పిచ్చుకలను చూసినప్పుదంతా తనకు ఒక పుత్రుడు లేడే  అనే భాద కలుగుతూ ఉండేది.
ఒకనాడు అరణిని మంధిస్తూ ఈ విధమైన క్షేత్రం లేకుండా పుత్రోదయం ఏ విధంగా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా వారి దృష్టి అటుగా వెళుతున్న ఘృతాచి అనే అప్సరస పై పడినది. పుత్రుని పొందాలన్న కోరికతో ఉన్న ఆయన శరీరం వీర్యమును స్కలించినది. ఐతే వ్యాస మహాముని తనను చూస్తూ ఉండగా అతని శరీరంలో కలుగుతున్న మార్పుని గమనించిన ఘృతాచి వ్యాసమహాముని తనను శపిస్తాడేమో అన్న భయంతో ఆమె చిలుకగా మారి ఎగిరిపోసాగినది.
అంటే వ్యాస భగవానునికి వీర్యస్కలనం అయిన  సమయమునకు అతని మనసును కదిలించిన క్షేత్రం చిలుకగా మారినది. కనుక ఆ సమయంలో జన్మించిన పుత్రునికి చిలుక రూపం రావలసి ఉన్నది. మానవుని రూపంలో ఉన్న వ్యాసుని రూపంకూడా రావలసి ఉన్నది కనుక శుకుని రూపం తలవరకూ చిలుక, మిగిలిన శరీరం మానవ ఆకృతిలో ఉంటాయి.



25, ఆగస్టు 2014, సోమవారం

త్రిశంకు

 త్రిశంకుడు

ఇతనికి ఒక ప్రత్యేకమైన స్వర్గలోకం ఉంది. దానిని త్రిశంకుస్వర్గం అంటారు. కాని ఈయన ఆ స్వర్గం లో తలక్రిందులుగా ఉంటారు. ఈయన సశరీరం గా ఎలా స్వర్గం లో ఉన్నాడు? ఈయనకోసం ప్రత్యేకమైన స్వర్గాన్ని ఎవరు సృష్టించారు? ఎందుకు? తలక్రిందులుగా ఎందుకు ఉంటారు?

ఇక్ష్వాకు వంశం లో పృధు మహారాజు పుత్రుడు త్రిశంకుడు అనే రాజు ఉండేవారు. వారి వంశం లో అందరి మంచిని ప్రజలు శ్లాఘించుట  చూసిన త్రిశంఖునకు తన పుర్వీకుల కంటే  మరేదయినా విశిష్టమైన పనిని చేసి అమితమైన కీర్తి గడించాలి అని కోరిక కలిగింది. ఎంతగానో ఆలోచించిన మీదట ఇప్పటివరకు ఎవరూ శరీరం తో స్వర్గానికి వెళ్ళలేదు కనుక తను వెళితే బాగుంటుంది అని నిర్ణయానికి వచ్చాడు.

వెంటనే తమ కుల గురువైన వశిష్టునికి తన కోరిక చెప్పాడు. అది విని ఆశ్చర్య పోయిన వశిష్టుడు ఎంత గొప్ప మహారాజైనా కానీ, ఎంత గొప్ప యజ్ఞ యాగాలు చేసినా కానీ శరీరం తో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. పంచ భూతములతో నిర్మితమైన ఈ శరీరo కొంత కాలానికి పడిపోవాల్సిందే. అది పడిపోయిన తరువాతే శరీరం లోని జీవుడు స్వర్గం లోకి ప్రవేశిస్తాడు. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళటం అనేది జరగదు అని ఖచ్చితంగా చెప్పాడు వశిష్టుడు. కుల గురువు వశిష్టుని మాటలకు సంతృప్తి చెందని  త్రిశంకుడు నూరుగురు గురుపుత్రుల వద్దకు వెళ్లి తన కోరికను వివరించాడు. ఐతే తమతండ్రి జరగదు అని చెప్పిన పనిని తాము ఎంత మాత్రమూ చేయము అని చెప్పారు. పైగా అన్ని శాస్త్రములు తెలిసిన తమ తండ్రి ఒక పని జరగదు అని చెప్తే అది ఎన్నటికీ  జరుగదు కనుక తాను  ఆ ఆలోచనను మానుకోవలసినది అని కూడా సూచిoచారు.
అయినా కూడా తన ఆలోచన మార్చుకోని  త్రిశంకుడు తాను మరొక గురువును ఆశ్రయిస్తాను అన్నాడు. ఆ మాటలకు ఆగ్రహించిన నూరుగురు గురుపుత్రులు ముక్తకంఠంతో ఆ  త్రిశంకుడు చేయతలచిన గురుద్రోహానికి అతనిని చండాలుడవు కమ్మని శపించారు.
 మరునాటి ఉదయం నిద్రలేచే సమయానికి  త్రిశంకుని ముఖంలో కాంతి పోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్ని ఇనుము ఆభరణాలు అయ్యాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరు భయపడి పారిపోయారు. ఆ రూపంతో అలాతిరుగుతూ చివరికి  త్రిశంకుడు విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. 

అప్పటికి విశ్వామిత్రుడు వశిష్టుని మీద కోపంతో తప్పస్సు చేస్తూ రాజర్షి అయ్యారు. అప్పటికే తన దనుర్విధ్య వశిష్టుని మీద పనిచెయ్యదు అని కుడా తెలుసుకున్నారు కాబట్టి ఎలా వశిష్టుని మీద పై చేయి సాధించాలా అని ఆలోచిస్తున్న విశ్వామిత్రునికి  త్రిశంకుడు ఒక మార్గం గా కనిపించాడు. వసిష్టుడు చేయను అన్న పనిని విశ్వామిత్రుడు చేస్తే ఆది వశిష్టుని ఓటమే అవుతుందని ఆలోచించాడు. అందుకే  త్రిశంకుని కోరిక తాను తీరుస్తాను అని చెప్పాడు,
అప్పుడు విశ్వామిత్రుడు తన పుత్రులను, శిష్యులను పిలిచి వారందరిని ఈ సమస్త బ్రహ్మాండం తిరిగి వశిష్టుడు చేయలేని పనిని విశ్వామిత్రుడు చేస్తున్నాడు అని అందరికి చెప్పి అందరిని ఆహ్వానించమని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా రాను అన్నా, ఈ పనిని తప్పు పట్టినా వారి వివరాలు తనకు చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు.
 ఆహ్వానం అందుకున్న అందరూ విశ్వామిత్రుడికి భయపడి వచ్చారు. ఆ తరువాత విశ్వామిత్రుని పుత్రులు వచ్చి వశిష్టుని పుత్రులు, మరొక బ్రాహ్మణుడు మహోదయుడు ఈ యజ్ఞానికి రాము అన్నారు అని చెప్పారు. వారు ఏమి కారణం చెప్పారని అడుగగా ఆ బ్రాహ్మణుడు "ఒక క్షత్రియుడు ఒక చండాలుని కోసం యజ్ఞం చేస్తుంటే దేవతలు ఎలా వచ్చి తమ తమ హవిస్సులను తీసుకుంటారు? అది జరిగే పని కాదు కనుక అక్కడకు వచ్చి మా సమయం ఎందుకు వృధా చేసుకోవాలి?" అని అన్నాడు అని చెప్పారు.

దానికి కోపించిన విశ్వామిత్రుడు వశిష్టుని నూరుగురు పుత్రులు ఇప్పుడే భస్మరాసులై పడిపోయి నరకానికి వెళ్లి తరువాత 700 జన్మల పాటు నరమాంస భక్షకులుగా,  ఆ తరువాత కొన్ని జన్మల పాటు ముష్టికులు అనే పేరుతొ పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారు, ఆ బ్రాహ్మణుడు మహోదయుడు సర్వలోకాలలొ జనాల చే ద్వేషింపబడే నిషాదుడై జీవిస్తాడు అని శపించాడు. 
అప్పుడు యాగం మొదలు పెట్టాడు. విశ్వామిత్రుడు యాగాగ్ని లో హవిస్సులు ఇస్తున్నాడు, కానీ వానిని తీసుకోవటానికి దేవతలు రావటం లేదు. ఇది చుసిన విశ్వామిత్రునికి కోపం వచింది. అహంకారం విజృంభించింది. తన తపోబలం తోనే  త్రిశంకుడిని స్వర్గానికి పంపాలని అనుకుని సంకల్పించాడు. అనన్య సామాన్య మైన అతని తపోబలం వల్ల  త్రిశంకుడు స్వర్గలోకం దిశగా ప్రయాణమయ్యాడు. ఈ విషయం దేవేంద్రడికి తెలిసి ఆయన  త్రిశంకునితో "  త్రిశంకుడా! నువ్వు గురు శాపానికి గురి అయ్యావు. నీకు స్వర్గలోక ప్రవేశం లేదు" అని తలక్రిందులుగా క్రిందికి పో అన్నాడు. అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసివెయ్యబడ్డ ఆ  త్రిశంకుడు క్రిందకి  పడిపోతూ తనను రక్షిoచమని విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు.
మరింత ఆగ్రహించిన విశ్వామిత్రుడు త్రిశంకుడిని ఆకాశం లో నిలిపాడు, త్రిశంకునకు స్వర్గం లో స్థానం లేదు అని కిందకు నెట్టేశారు కనుక తన మిగలిన మిగిలిన తపశక్తి తో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృస్టించాడు. సప్తర్షులని సృస్టించాడు. ఇక దేవతలను దేవాధిపతి  ఇంద్రుడిని సృష్టించే ప్రయత్నం లో ఉండగా దేవతలందరు వచ్చారు.

మహానుభావా! శాంతించు. ఎంత తపహ్శక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృస్తిస్తావా! మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవ్వరినీ స్వర్గానికి పంపాలేము, పైగా ఈ త్రిశంకుడు గురుశాపo పొందినవాడు కనుక స్వర్గ ప్రవేశం లేదు. కానీ మీరు మీ తపశక్తి ని ధారపోసినతపహ్శక్తిని ధారపోసి సృస్టించిన ఈ నక్షత్రమండలం జ్యోతిష్య చక్రానికి ఆవల వైపున ఉంటుంది. అందులో త్రిశంకుడు ఇప్పుడు ఉన్నట్లుగానే తలకిందకు, కాళ్ళు పైకి ఉంది సేవింపబడుతూ ఉంటాడు అని వరం ఇచ్చారు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు.

19, ఆగస్టు 2014, మంగళవారం

అత్రి,అనసూయ- సంతానం


అత్రి మహాముని ధర్మ పత్ని అనసూయ. వారిది ఆదర్శ దాంపత్యం. అత్రి మహామునికి సంతానం కావని కోరిక కలిగినది. సంతానం కోసం జగత్తుని నిండిన పరమాత్మ గురించి తపస్సు చేసాడు. అతని పరిక్షించదలచిన త్రిమూర్తులు అతని ముందు ప్రత్యక్షమై తమలో ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగారు. సర్వం తెలిసిన అత్రి మహర్షి పరమాత్మ గురించి అని సమాధానం చెప్పాడు. అతని జ్ఞానానికి సంతోషించిన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఏమి వరం కావాలి అని అడుగగా వారి అంశలతో తనకు పుత్రులు కావాలని కోరాడు. త్రిమూర్తులు తధాస్తు అని వెళ్లిపోయారు.

కొంతకాలానికి అనసూయకు ముగ్గురు పుత్రులు జన్మించారు.
వారు

  1. చంద్రుడు - బ్రహ్మ అంశ 
  2. దత్తాత్రేయుడు - విష్ణు భగవానుని అంశ 
  3. దుర్వాసుడు - మహాదేవుని అంశ 
బ్రహ్మాండ పురాణం ప్రకారం వీరు మనం ఇప్పుడు ఉన్న వైవస్వత మన్వంతరంలో నే 10 వ మహాయుగం, త్రేతాయుగకాలంలో సంభవించారు. 

18, ఆగస్టు 2014, సోమవారం

28 మంది వ్యాసులు

మనం ప్రస్తుతం ఉన్నది వైవస్వత మన్వంతరం. అందులో 28వ మహాయుగం. ప్రతి మహాయుగంలో వ్యాస భగవానుడు ద్వాపరయుగాంత సమయం లో వేదములను విభాగం చేస్తాడు. ఇప్పటి వరకు జరిగిన 28 మహాయుగములలొ 28 మంది వ్యాసులు జన్మించారు. 
వారు 

  1. స్వయంభు 
  2. ప్రజాపతి 
  3. ఉషన 
  4. బృహస్పతి 
  5. సవిత 
  6. మృత్యు 
  7. ఇంద్ర 
  8. వసిష్ఠ 
  9. సారస్వత 
  10. త్రిధామ 
  11. త్రివ్రిష 
  12. భరద్వాజ 
  13. అంతరిక్ష 
  14. వప్రి 
  15. త్రయారుణ 
  16. ధనుంజయ 
  17. కృతంజయ 
  18. రినజయ 
  19. భరద్వాజ 
  20. గౌతమ 
  21. హర్యాత్మ 
  22. వేణ 
  23. త్రిణవింధు 
  24. రిక్ష 
  25. శక్త్రి 
  26. పరసర 
  27. జాతుకర్ణ 
  28. కృష్ణ ద్వైపాయన 
మనం ఉన్న ఈ మహాయుగంలో వేద విభాగం చేసిన కృష్ణ ద్వైపాయనుడు నాలుగు వేదములను తన నలుగురు శిష్యులకు చెప్పి వాటిని ప్రచారం చేసాడు. ఆ వేద విభాగాన్ని ప్రచారం చేసిన శిష్యులు 
  • ఋగ్వేదం - పైల మహర్షి 
  • యజుర్వేదం - వైశంపాయన 
  • సామవేదం - జైమిని 
  • అధర్వణ వేదం - సుమంతుడు 
  • పురాణములు - రోమహర్షనుడు 
  • భాగవతం - శుక మహర్షి 

20, జులై 2014, ఆదివారం

విశ్వామిత్రుడు - బ్రహ్మర్షి


విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు. మహారాజయిన గాధి కి కుమారుడైన విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యాపాలన చేశాడు. ఒకసారి  ఆయన గొప్పదైన తన  సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్టమహర్షి ఆశ్రమం లోకి వెళ్లారు. ఆ ఆశ్రమంలోఅనేక వేల మంది శిష్యులు ఉన్నారు. ఆ ఆశ్రమం పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో శోభాయమానంగా ఉంది.అంత పరమ పవిత్రమైన ఆశ్రమం లోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిచి వెళ్లారు. కుశలప్రశ్నలు గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్న తరువాత విశ్వామిత్రుడు తానూ బయలుదేరుటకు అనుమతి ఇవ్వవలసినదిగా వశిష్టమహర్షిని కోరారు. అప్పుడు వశిష్టుడు అతిధిగా వచ్చిన విశ్వామిత్రుడు తమ  ఆతిధ్యం తీసుకోవాలి అన్నాడు. ఐతే విశ్వామిత్రుడు తానూ ఒక్కడినే రాలేదు, తనతో తన సైన్యం వచ్చింది కనుక వారు అంతా  అక్కలిగా ఉన్నప్పుడు తానూ భుజిoచలేను అని చెప్పాడు. అది విన్న వసిష్టుడు వారి సైన్యం ఎంతున్నా వారికి తానూ ఆతిధ్యం ఇవ్వగలను అని సర్వ సైన్యమును పిలచి నీటి ఏర్పాట్లు చేసారు.
అప్పుడు వశిష్ట మహర్షి నందినిని పిలిచి, "ఓ! నందిని, మన ఆశ్రమం లోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజు, వారి సైన్యం వచ్చారు. కనుక నువ్వువారికి ఉత్తమమైన భోజనం ఏర్పాట్లు చెయవలసినది . ఎవరికి ఏది కావాలో,  ఎవరికి ఏది ఇష్టమో అది ఏర్పాటు చెయగలవు" అనిచెప్పారు. ఆ నందిని ఎవరెవరు మనసులో ఏమీ ఏమి కావాలి అనుకుంటున్నారో గ్రహించి, చెరుకు కర్రలు, తేనే, పానీయములు, అన్నపు రాశులు, కూరలు, పాచ్చళ్లు, పులుసులు, పళ్లరసాలు, పాలు, తాంబూలాలు మొదలైన సర్వo సిద్ధం చేసింది.   ఆ భోజనాన్ని సైనికులందరు భుజించారు.
ఒక గోవు ఉత్తర క్షణంలో ఇన్‌న్టమందికి సరిపడా భోజనాన్ని సృస్టించింది అనే సరికి, విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ నందినిని తన స్వంతం చేసుకోవాలి అనే కోరిక పెరిగింది. అప్పుడాయన వశిష్ట మహర్షి తో,ఒక లక్ష ఆవులకు ప్రతిగా నందినిని ఇవ్వమని అడుగగా వశిష్టుడు అంగీకరించలేదు. కోపించిన విశ్వామిత్రుడు " రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే, ఈ నందిని కూడా రత్నమే. నా సొత్తు రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు. అందుకే ఇప్పుడు నేను ఈ రత్నాన్ని తీసుకెళ్తున్నాను" అని అన్నాడు.
నాయనా విశ్వామిత్రా! ఈ ఆవు ని నీవు వెలకడుతున్నావు, ఒక రత్నముగా దాచుకోవాలి అనుకుంటున్నావు. కానీ ఈ ఆవు మాకు ఆశ్రమo లో దేవతారాధనకి, పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది. నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమo లోని యజ్ఞాలు, విధ్యాభ్యాసం సమస్తమూ ఈ నందిని మీద ఆధారపడి ఉంది. కాబట్టి, నేను ఈ గోవుని నీకు ఇవ్వాలేనని వశిష్ట మహర్షి అన్నారు. ఈ సారి విశ్వామిత్రుడు ఎంతో ధనాశచూపాడు. అయినా వసిష్టుడు అంగీకరించలేదు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు, కోపం తలకు ఎక్కినవాడయ్యి, నేను రాజును నాకు ఒకరు ఇవ్వటం ఏమిటి నేను ఆమిన తీసుకోగలను అని నందిని  మెడలో తాడు కట్టి, సైనికులకిచ్చి  తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటే, ఆ నందిని భాదపడి,  నిశ్శబ్దంగా ఉన్నవశిష్టుని అడిగింది. "ఓ వశిష్టమహర్షి! నన్ను నీవు ఎందుకు వద్దనుకుంటున్నావు!నన్ను ఇతనితో ఎందుకు పంపిస్తున్నావు?"
అప్పుడు వశిష్టుడు, "నందిని!నేను నిన్ను వదల లేదు ఆ విశ్వామిత్రుడే నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నాడు. నేను బ్రహ్మనుడను, అతను రాజు. నేను అతనిని ఎదిరించి నిన్ను దక్కించుకోలేను. నీవు నిన్ను రక్షిoచుకోగలిగితే రక్షిo చుకో!"
అప్పుడు నందిని సూర్య ప్రకాశం తో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లావులని, యోని నుండి యావనులని, గోమయం పడే స్థానం నుంచి సాకులు, రోమకూపాల నుండి హారీతులు మరియు కిరాతకులని సృస్టించింది. వీరందరు కలిసి విశ్వామిత్రుని  సైన్యాన్ని సమూలంగా నాశనం చేసారు.
తన రధం నుండి కిందకు దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడు అయ్యాడు. ఆ ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృస్టించింది. తన సైన్యం ఎందుకు పనికి రాకుండా చనిపోయారు. కనుక రాచరికం కన్నా తపః శక్తి చాలా గొప్పది. ఈ వశిష్టుడిని నేను గెలవాలి అంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదం లోని సమస్త అస్త్రశాస్త్రాలు తెలియాలి అనుకోని, ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, రాజ్యపాలన చెయ్యమని చెప్పి, తాను తపస్సు చేసుకోవటానికి హిమాలయ పర్వతాలకి వెళ్లాడు. 
హిమాలయ పర్వతాలమీద మహాదేవుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడిని ఏగురు ఉపదేశం లేకుండానే ధనుర్వేదం ప్రసాదించమని కోరాడు.  శివుడు తధాస్తు అన్నాడు. ఇప్పుడు వచ్చిన అస్త్రశస్త్రములను చూసుకుని ఆత్మవిశ్వాసంతో రధమెక్కి వశిష్టుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. అనుకోని ఈ పరిణామాలు ఏమిటో తెలియని ఆ ఆశ్రమం లోని శిష్యులు, జంతువులు ఒక్కసారిగా ఆక్రందనలు చేసారు. క్షణాలలో ఆశ్రమ వాతావరణం మారిపోయింది. ఆశ్రమంలో వశిష్టుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని  ప్రయోగించాడు.  వశిష్టుడు తన బ్రహ్మాదండం పట్టుకుని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మాదందాన్ని అలా పట్టుకుని ఉంటే ఆ ఆగ్నేయాస్త్రo చల్లారిపోయి ఆ బ్రహ్మాదండం లోకి వెళ్లిపోయింది.

అప్పుడు విశ్వామిత్రుడు ఒకేసారి వారూణాస్ట్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, గాంధర్వాస్త్రం,
బ్రహ్మపాశం, కాలపాశం, వారూణాపాశం, పిణాకాస్త్రం, క్రౌంచాస్త్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశులం, కపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, పెద్ద పెద్ద గధలు మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్టుడి మీద వేశాడు. కానీ ఆయన వేసినవన్ని వశిష్టుడి బ్రహ్మాదండం లోకి వెళ్ళిపోయాయి.

ఇక తనదగ్గర ఉన్న ఒకేఒక్క అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు. అప్పటిదాకా ఎంతోమంది గొప్పవాల్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశ్శబ్దంగావశిష్టుని బ్రహ్మాదండం లోకి వెళ్లిపోయింది.

వశిష్టుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను. కాబట్టి నేను బ్రహ్మర్షిని అవుతానని విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్లాడు. 

అక్కడ ఆయన తన పెద్ద భార్య తో 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పాంధుడు, మధుశ్యంధుడు, ధృదనేత్రూడు, మహారధుడు అని నలుగురు కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాజర్షి విశ్వామిత్ర అని పిలిచారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షి అయ్యాను, ఇంకా బ్రహ్మర్షి ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు.

విశ్వామిత్రుడు రాజర్షిగా ఉన్నప్పుడే త్రిశంకుడికి ప్రత్యేకమైన స్వర్గాన్ని నిర్మించాడు. 

బ్రహ్మర్షి గా మారటానికి ఇంకా ఘోరమైన తపస్సు చేయదలచి పశ్చిమ దిక్కునకు వెళ్లి తపస్సు చెయ్యటం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడు అనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్లిపోయాడు. అశ్వo  దొరకకపోతే తనకి మంచి జరుగదని మహర్షులు చెప్పారు. కానీ, అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని న్యాయంగా తీసుకువస్తే యాగాన్ని పూర్తి చెయ్యవచ్చు అన్నారు. 
ఒక మనిషిని తీసుకురావటం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భరుగూతూంగమనే ఒక పర్వత శిఖరం మీద, రుచీకుడు అనే ఒక ఋషి, భార్యా పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా యాగాస్వాం అపహరణకి గురైనందున నాకు ఒక యాగపశువు కావాలి. మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. 

అప్పుడా రుచీకుడు ఇలా అన్నాడు," పెద్ద కొడుకు ధర్మాసంతానం, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుంది కావున నేను వారిని ఇవ్వలేను. అప్పుడు మధ్య కొడుకైన శునఃశెవుడు అంబరీషుడితో వస్తానన్నాడు.

రాజు బ్రతికి ఉంటే రాజ్యం బాగుంటుంది. రాజు బ్రతికి ఉండాలంటే, యాగం పూర్తవ్వాలి. యాగం పూర్తి చెయ్యటానికి తన కొడుకుని పంపాడు ఆ రుచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవులని దానంగా ఇక్చాడు. శునఃశెవుడిని తీసుకువెళ్తున్న అంబరీషుడు కొంత దూరం ప్రయాణించాక, విశ్రాంతి తీసుకుందాం అని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశెవుడు చూసాడు. 

వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి తాను విశ్వామిత్రుని కి మేనల్లుడను అని చెప్పి, జరిగిన సంగతి అoతా చెప్పి తనకు తప్పస్సు చేసి స్వర్గానికి వెళ్ళాలి అని ఉందని చెప్పాడు. అది విన్న విశ్వామిత్రుడు తన కొడుకులను పిలచి వారిలో ఒకరిని యాగ పశువుగా వెళ్ళమని చెప్పాడు. కాని అతని పుత్రులు దానికి నిరాకరించటం తో కోపించిన విశ్వామిత్రుడు వారిని కూడా వశిష్టుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళ లాగా కుక్క మాంసం తింటూ బ్రతకండని శపించాడు.

అప్పుడాయన శునఃశెవుడి కి రెండు మన్త్రములని చెప్పి అతనికి యూపస్తంభానికి కట్టినప్పుడు జపించమనీ, అల జపించుటవల్ల బలి ఇవ్వకుండానే యాగఫలం లభిస్తుంది కనుక అతనిని వధిoచరు అని చెప్పాడు. శునఃశెవుడు అంబరీషుని వెంట వెళ్ళిపోయాడు. అప్పుడు తాను  మరలా  తన తపఃశక్తి ని తన కుమారులను శపించుటకు దుర్వినియోగం చేశాను అని తెలుసుకుని ఇంకా ఎవరితో మాట్లాడకూడదు అని నిర్ణయించుకుని మళ్లీ తపస్సు చెయ్యటం ప్రారంభించాడు.
ఒకనాడు స్నాన నిమిత్తమై  పుష్కర క్షేత్రానికి వెళ్ళగా అప్పుడు అక్కడ స్నానం చేస్తున్న మేనక ను చూసి ఆమె సౌందర్యానికి  ముగ్ధుడైనాడు.
ఆమెను ఒప్పించి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి ఆమెతో కాలం మరచిపోయాడు. కొంతకాలం తరువాత మళ్లీ తానూ తప్పస్సు మొదలుపెట్టిన విషయం గుర్తు వచ్చింది. తన తపస్సుని భంగం చేయటానికి దేవతలు ఈమెను పంపి ఉంటారు అని కోపం వచ్చినా అందులో ఆమె తప్పు ఏమిఉంటుంది అని భావించి ఈసారి ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యటం ప్రారంభించాడు.

ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోర తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై మహర్షి వి అయ్యావు విశ్వామిత్రా అనిన్ చెప్పారు. కాని ఈ మాట విన్న విశ్వామిత్రుడికి ఏవిధమైన బాధ కానీ సంతోషం కానీ కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికీ మహర్షిని అయ్యాను. ఇక బ్రహ్మర్శిని ఎప్పుడో అవుతానో అని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రీయాలని గెలిచానా అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, లేదు అని సమాధానం చెప్పారు.

ఇంతకాలం తపస్సు చేసిన కారణంగా విశ్వామిత్రుని పగ వశిష్టుడి మీద నుంచి తన ఇంద్రీయాల మీదకి వెళ్ళింది. తాను అనవసరంగా వశిష్టుడి మీద క్రోధాన్ని పెంచుకోవటానికి, మేనకతో కామానికి లొంగటానికి తన ఇంద్రీయాలే కారణమని గ్రహించాడు.మళ్లీ తపస్సు చెయ్యటం ప్రారంభించాడు. ఈ సారి పంచాగ్నుల మద్య తపస్సు చేశాడు. . విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. 
మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే, ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది.  అయితే ఇదంతా ఇంద్రుడు తన తపస్సును భంగం చేయటానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో రంభను పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శాపించాడు.తరువాత కొంతసేపటికీ  మళ్లీ క్రోధానికి లోనైయ్యాడని గ్రహించి రంభ అడగకుండానే, ఒకనాడు ఒక బ్రహ్మాణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు. 

విశ్వామిత్రుడు ఈసారి తూర్పుకు వెళ్లి కుంభకం(యోగా లో ఒక క్రియ) ద్వారా తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసాడు. శరీరం లో బలం క్షీణించింది. కనుక దానిని నిలబెట్టుకోవటానికి ఒక్క ముద్ద ఏదైనా తినాలి అని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఆకలిగా ఉంది కనుక ఏమైనా పెట్టమని అడిగాడు. వచ్చిన వాడు ఇంద్రుడు అని విశ్వామిత్రుడికి అర్ధం అయ్యింది. కానీ, ఈ సారి ఆయన ఇంద్రీయాలకి లొంగలేదు. ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్లీ కుంభకం లోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా తపోధూమo సమస్త లోకాలని కప్పేసింది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, "ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను. నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతాలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను. నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయుష్మంతుడవై జీవిస్తావు" అన్నారు. 

అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మ, "నేను బ్రహ్మర్షి అయిన మాట నిజమైతే, నాకు ఓంకారము, వశత్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు.అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షి అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసానో, ఆ వశిష్టుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మసరే అన్నారు.

అప్పుడు దేవతలు వశిష్టుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి, బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్టుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు. ఏ  వశిష్టుడి మీద కోపం తో ప్రారంభించాడో, ఆ వశిష్టుడి కాళ్ళు కడగటంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. 

13, జులై 2014, ఆదివారం

వాల్మీకి రామాయణం రచన, కారణం

రామాయణం రచించటానికి ముందు,

అసలు వాల్మీకి ఏమి కోరుకున్నారు? రామాయణం ఆయన ఎలా రాయగలిగారు? రాముని చరిత్ర వాల్మీకికి ఎవరు చెప్పారు? ఎందుకు?

లోకంలో మంచి గురువు దొరకటం అదృష్టం. కాని ఆ గురువు యొక్క విశిష్టత గొప్ప శిష్యుని వల్ల మాత్రమే గుర్తింపబడుతుంది.
అగ్నిశర్మ వాల్మికిగా మారి తపస్సు చేస్తూ ఉన్న సమయం లో ఒక రోజు నారద ముని వారి ఆశ్రమానికి వచ్చాడు. నారద మునిని చుసిన  వాల్మీకి మహర్షి వారికి సపర్యలు చేసి తన మనస్సు లో తిరుగుతున్న ప్రశ్నను ఆయన ముందు ఉంచారు.

మహానుభావా! ఈ కాలం లో నేను నా మాంసనేత్రం తో చూడగలిగేలా 16 సుగుణములు ఉన్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారా?
  1. గుణవంతుడు 
  2. వీర్యవంతుడు
  3. ధర్మాత్ముడు 
  4. కృతజ్ఞుడు 
  5. సత్య వాక్య పరిపాలకుడు 
  6. సత్చరిత్ర 
  7. దృడసంకల్పం కలవాడు 
  8. సత్ప్రవర్తన 
  9. అన్ని జీవుల పట్ల సమదృష్టి కలవాడు 
  10. సర్వాంగ సుందరుడు 
  11. ధైర్య వంతుడు 
  12. కోపాన్ని గెలిచిన వాడు 
  13. అపార కంతి  కలవాడు 
  14. అసూయ లేనివాడు 
  15. కోపం నటించగల వాడు
  16. విధ్యావంతుడు 
ఆ ఆతురతతో, తెలుసుకో వలసిన విషయం గురించి వాల్మీకి లో ఉన్న ఉద్వేగం  గమనించి, నారదుడు రామాయణ రచనాసమయం ఆసన్నమైంది అని భావించి 100 శ్లోకములతో కూడిన సంక్షేప రామాయణాన్ని (దాన్నే మనం మాలా మంత్రం అని కూడా అంటాం)చెప్పాడు. 

 ఆ 100 శ్లోకాలని మననం చేసి చేసి వాల్మీకి రామాయణం రచన చేసారు. 

9, జులై 2014, బుధవారం

ఋష్యశృంగుడు

ఋష్యశృంగుడు 

పూర్వకాలంలో విభండక మహర్షి చాలా కాలం తపస్సు చేసాడు. ఒక రోజు స్నానం చేయటానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా, అక్కడ అటుగా వెళ్తున్న ఉర్వశిని చూసేసరికి ఆయనకు వీర్య స్కలనం జరిగి, ఆ వీర్యం సరోవరం లో పడింది. ఆ వీర్యాన్ని అప్పుడే దాహం తీర్చుకోవటానికి అక్కడకి వచ్చిన ఒక జింక త్రాగిoది. ఆ జింక గర్భం దాల్చి కొంతకాలానికి శిరస్సు మీద ఒక కొమ్ము ఉన్న పిల్లవాడికి జన్మనిచ్చింది.  అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి, అతనికి ఋష్యశృంగుడు  అని పేరు పెట్టారు. ఆ విభండక మహర్షి, ఋష్యశృంగునికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞ యాగాదులు అన్ని చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడు పుట్టినప్పటి నుండి ఆ అరణ్యంలో లోకం తెలియకుండా పెరిగాడు. ఆయనకి అసలు ఈ సృష్టి లో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియదు. ఎప్పుడూ ఆ ఆశ్రమములోనే తండ్రి పక్కనే ఉండి నిత్యనుస్టానమును  ఆచరిస్తూ ఉండేవాడు. 

అదే కాలం లో అంగారాజ్యాన్నిరోమపాదుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఐతే ఒకసారి రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. తన ప్రజల వెతలు చూసిన  రాజు దీనికి నివారణోపాయాన్ని తెలుపమని కొందరు మహర్షులను సంప్రదించగా వారు ఋష్యశృంగుడు వారి రాజ్యం లో అడుగు పెడితే తప్పక వర్షాలు కురుస్తాయి అని చెప్పారు. 
వెంటనే రోమపాదుడు తన మంత్రులని పిలిచి విషయం చెప్తే, ఋష్యశృంగుడిని తీసుకురావటం వీలు కాదు,  ఏవిధమైన కోరికలు లేని వాడు, అసలు ప్రపంచం అని ఒకటి ఉన్నది అని కూడా తెలియని వాడు  రాజ్యానికి ఎందుకు వస్తాడు? కానీ మంత్రులు మేధో సంపన్నులు కనుక తప్పు మార్గం అని తెలిసి కూడా ఒక సలహా ఇచ్చారు. ఋష్యశృంగునికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి, కాకపొతే ఇప్పటివరకు అతనికి లోకం తెలియదు, కనుకనే విషయసుఖాల గురించి కూడా తెలియదు. ఋష్యశృంగునికి అవి కొంచెం రుచి చూపిస్తే తమ రాజ్యం లోకి రప్పించవచ్చు అని. 

అప్పుడు రాజు కొంతమంది అందంగా అలంకరించుకున్నవేశ్యలని అడవికి పంపించాడు. వారు విభండక మహర్షి ఆశ్రమం లో లేని సమయం లో ఆ ఆశ్రమానికి కొంతదూరం లో ఆటపాటలు ప్రారంభించారు. వీరి ఆహ్లాదకరమైన మాటలు పాటలు విన్నఋష్యశృంగుడు వారి వద్దకు వెళ్లి ఇప్పటి వరకు చూడని వారు ఇక్కడ ఎందుకు ఉన్నారో తెలియక వారిని అడిగారు. "ఓ మహానుభావులారా! మీరు ఏ ఆశ్రమం నుండి వచ్చారు? ఇక్కడ అమీ చేస్తున్నారు? మా ఆశ్రమానికి వచ్చి మా ఆతిధ్యం స్వీకరించండి"

ఆ ప్రశ్నకు ఆ వేశ్యలు సమాధానం చెప్తూ వారి ఆశ్రమం కొoత దూరo లో ఉంది అని, మరొక సారి వచ్చినప్పుడు ఋష్యశృంగుడి ఆశ్రమాన్ని దర్సిస్తము అని వారి ఆటపాటలతో అప్పటికి అతనిని అలరించారు. కొంతసేపటి తరువాత విభండక మహర్షి ఆశ్రమానికి వచ్చేస్తారేమో అని భయం తో ఆ వేశ్యలు వెనుకకు బయలుదేరబోతు ఋష్యశృంగుడిని ఒకసారి కౌగలించుకుని వెళ్లారు. అప్పటి వరకు స్త్రీలు, వారి స్పర్స తెలియని ఋష్యశృంగునికి ఆ సంఘటన ఒక వింత అనుభూతిని కలిగించింది. మరలా వారు ఎప్పుడు వస్తారో అన్న ఆలోచన కూడా కలిగింది.
మరొక రోజు వారు రాగానే ఋష్యశృంగుడు వారిని తమ ఆశ్రమానికి ఆహ్వనించాడు. వారు వస్తూ తమవెంట కొన్ని తినుబండారాలు తెచ్చి, అవి వారి ఆశ్రమం లోని ఫలములు అని చెప్పి ఋష్యశృంగునికి ఇచ్చారు. కొంత సమయం తరువాత వారు తెరిగి వెళుతూ మరోసారి వారు వచ్చినప్పుడు ఋష్యశృంగుడు తమతో తమ ఆశ్రమానికి రావాలి అని ఆహ్వానించి వెళ్ళిపోయారు.
 ఈసారి వారు వచ్చినప్పుడు ఋష్యశృంగుడు వారి వెంట బయలుదేరాడు. ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగుపెట్టిన మరుక్షణం బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, వారి అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంత ని ఇచ్చివివాహం జరిపించారు.

తరువాత కొంతకాలానికి ఈ ఋష్యశృంగుడే దశరధుని చేత పుత్రకామేష్టి  జరిపించాడు.

మన ఈ కాలం లో శంకరాచార్యుడు సంపూర్ణ భారతదేశ యాత్ర చేస్తున్న సమయం లో ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడే ఈనాటి శ్రుంగగిరి పీఠం స్థాపించారు.  

6, జులై 2014, ఆదివారం

వేదవ్యాస జననం

మనం ప్రస్తుతం ఉన్న వైవస్వత మన్వంతరంలో 28 వ మహాయుగంలో మనకొరకు వేదవిభాగం చేసిన వేదవ్యాసుడు పరాశర మహర్షి కుమారుడు అయిన కృష్ణ ద్వైపాయనుడు (ఈ వైవస్వత మన్వంతరం లో వచ్చిన 28వ వ్యాసుడు). వ్యాసుడు నారాయణ స్వరూపంగా చెప్పబడతాడు. అతని జననం దాగి ఉన్న రహస్యములతో కూడినది. దానిని గురించి ఇక్కడ మనం చెప్పుకుందాం.

సంభవం:
మస్త్యగంధి దాశరాజుకుమార్తెగా పెరుగుతూ ఉంది. ఆమెనే సత్యవతి అని కూడ అంటారు. ఆమె యుక్త వయస్సు కు వచ్చాక తన తండ్రికి సాయంగా తాను ఆ యమునా నది మీద పడవ నడుపుతూ ఉంది. ఒక రోజు శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షి తీర్ధయాత్రల నిమిత్తమై యమునను దాటవలసి వచ్చింది. అప్పుడు అతనికి ఈ మస్త్యగంధి పడవ కనిపించగా దానిలో ఎక్కాడు. పడవ నదిలో కొంత దూరం వెళ్ళాక పరాశర మహర్షి కి మస్త్యగంధి పై కామవాంఛ  కలిగింది. అది ఆమెతో ప్రస్తావించగా దానికి ఆమె ఇందరి మహానుభావుల మద్య ఇంత జ్ఞానులయిన మీరు ఇలా ఎలా ప్రవర్తించగలరు? అని అడిగింది. దానికి సమాధానం గా పరాశర మహర్షి ఒక మాయాతిమిరాన్ని(దట్టమైన మంచు పొరను) తాము ఉన్న పడవ చుట్టూ సృష్టించాడు.
పరాశర మహర్షితో సంగమిస్తే తన కన్యత్వం భంగం అవుతుంది, తిరిగి తన తండ్రివద్దకు ఎలా వెళ్ళాలి? అని అడిగింది
తనతో సంగమించిన తరువాత కూడా ఆమె కన్యత్వం చెడదు అని చెప్పి ఏమైనా మరోవరం కోరుకో మని చెప్పాడు.
ఆమె తన శరీరం నుండి వస్తున్న ఈ మస్త్యగంధం తనకు నచ్చలేదు కనుక దానిని దూరం చేయమని కోరింది.
దానికి పరాశర మహర్షి ఈ చేపల వాసన పోవటమే కాదు ఇక మీద ఆమె శరీరం నుండి గంధపు వాసన ఒక యోజనం దూరం వరకు వ్యాపిస్తుంది, దాని వల్లనే ఆమెను ఇక మీద అందరూ యోజన గంధి అని పిలుస్తారు అని వరం ఇచ్చాడు.
అప్పుడు వారి కలయిక లో సధ్యగర్భం లో అప్పటికి అప్పుడే వ్యాసుడు జన్మించాడు. వ్యాసుడు సుర్యసమాన తేజస్సు కలిగి, సర్వ వేద జ్ఞానo తో పుట్టాడు. పుట్టిన వ్యాసుడు తన తల్లితో తానూ తపస్సుకు వెళ్తున్నాను అని, తన తల్లి ఎప్పుడు తనను పిలిస్తే అప్పుడు తాను తప్పక వస్తాను అని మాట ఇచ్చి తన తల్లి అనుమతి తో తపస్సు కు వెళ్ళాడు.
వ్యాసుడు చిన్నప్పుడే ఆ యమునా నది ద్వీపం లో వదిలి వేయబడుటవల్ల అతనిని ద్వైపాయనుడు అని, శరీరం నల్లగా ఉండుటవల్ల కృష్ణద్వైపాయనుడు అని అన్నారు.

ఈ ఘట్టాన్ని చదువుతున్న మనకు ఇక్కడ  కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి.

1. పరాశర మహర్షి కి ఒక చేపల వాసన కల స్త్రీ మీద కామవాంఛ ఎందుకు కలిగింది?
2. తన ఇంద్రియాలను నిగ్రహించుకో లేని పరాశరుడు ఋషి అని ఎలా చెప్పారు?
3. ఆమె అడిగిన అన్ని వరాలు ఇచ్చి మరీ ఆమెతో ఎందుకు సంభోగించాడు?

సామాజిక వివరణ: 
ఈనాటి మన శాస్త్రముల ప్రకారం కుడా తల్లి తండ్రుల జన్యువులు, సంగమ సమయం లో వారి మనసులలో కలిగిన భావాలు పుట్టబోయే పిల్లల ప్రవర్తనకు సోపానాలు వేస్తాయి. (అందుకే ఎప్పటికి గర్భవతి కావాలనుకున్న, ఐన స్త్రీని మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రదేశాలను, బొమ్మలను చుస్తూ ఉండమని చెప్తాం)

కాబట్టి వ్యాసుడు వంటి ఒక గొప్ప ఆద్యాత్మిక వేత్త జన్మించాలి అంటే అంతే తేజస్సు కలిగిన ఒక మహర్షియొక్క సంగమం ఒక అద్వితీయమైన స్త్రీ తో సహజం గా మనస్సు చలించి జరగాలి. అప్పుడే ఆ తల్లి తండ్రులలోని మంచి గుణములు, జ్ఞానము ఆ పుట్టబోయే బిడ్డకు కలుగుతుంది.
పరాశర మహర్షి మహాజ్ఞాని, మహా తపస్సంపన్నుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించి తెలిసిన వాడు. కాబట్టి పరాశర మహర్షి సత్యవతిని ని చూసినప్పుడు, వారికి ఒక లోకోత్తరమైన సంతానం కలుగ వలసిన సమయం ఇదే అని తెలిసి ఉండాలి.
మస్త్యగంధి,  ఉపరిచర వసువు తన భార్య ఐన గిరిక (ఒక నది, పర్వతముల కుమార్తె) ను తలుచుకొనుట వల్ల స్కలనం అయిన వీర్యం తో శాపగ్రస్తమైన అప్సరస ఐన అద్రిక కు జన్మించింది.
వీరిద్దరూ వ్యాస జననానికి కలిసి తీరాలి.
కాబట్టి మస్త్యగంధి ని చుసిన పరాశరునికి కామవాంఛ కలిగింది.

తనకు పేరు తీసుకు వచ్చే పుత్రుడిని ఇచ్చే స్త్రీ కి ఆ పురుషుడు సంతోషం గా ఏమి అడిగినా ఇస్తాడు. కాబట్టి సత్యవతి అడిగిన అన్ని కోరికలు పరాశర మహర్షి తీర్చాడు. పైగా ముందు ముందు ఆమె కురు వంశానికి చేరవలసినది, శంతనుడిని వివాహం చెసుకో వలసినది కనుక ఆమె మస్త్యగంధిగా ఉండకూడదు. కాబట్టి ఆమెను యోజనగంధి ని చేసాడు.


ఆద్యాత్మిక వివరణ:
  • సత్యవతి: సత్యస్వరూపుడైన భగవంతుని గురించి తెలుసుకో తలచిన సాధకురాలు/ సాధకుడు  
  • దాశరాజు:ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు కలిపి పది. సంస్కృతం లో దశ, వాటి అధిపతి రాజు కలిపి దాశరాజు 
  • పరాశరుడు: పరమాత్మ చే విడువబడిన శరం, సద్గురువు. 
  • యమునా నది పై పడవ: యమునా నది నీరు తమో గుణానికి, పడవ  దాన్ని దాటాలి అనే ఆలోచనకి గుర్తు. 
  • పరాశరునికి సత్యవతి పై సంగమ వాంఛ : ఒక సద్గురువు, ఒక సాధకుడిని అనుగ్రహించి జ్ఞాన భోద  చేయాలి అనుకోవటం. 
  • సత్యవతి చుట్టూ అందరూ  ఉన్నారు అని చెప్పటం: గురువు గారు భోధనలు విని ఈ లోకం లో ఉన్నఆకర్షణలు ఉండగా మీ జ్ఞానోపదేశం ఎలా నిలబడుతుంది అని అడుగుట. 
  • మాయా తిమిరం: ఈ లోకం లోని ఆకర్షణలు సాధకునికి అడ్డు రాకుండా గురువు చేసే జ్ఞానబోధ 
  • కన్యత్వం పోతే తండ్రి వద్దకు ఎలా వెళ్ళను: గురువు గారు , తమరు వైరాగ్యబోధ చేస్తారు. మరి నేను నా గృహ సంబంధం ఐన దశ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అన్ని భాద్యతలు వదిలి వేయాలా?
  • కన్యత్వం పోకుండా బిడ్డను కనుట: విషయ సాంగత్యం చెడకుండానే గురువు సాధకునకు జ్ఞానోపదేశం చేయగలరు, సాధకుడు పొందగలడు. 
  • మస్త్యగంధం పోయి సుగంధం: సాధకుడి గతజన్మ దుర్వాసనలు నశింపచేసి కొత్త సుగుణాలని ఆవిష్కరింప చేయుట 
  • సధ్యగర్భం: గురువు చేస్తున్న భోదల వాల్ల అప్పటికి అప్పుడే జ్ఞానం పొందుట 
  • వ్యాసుడు తల్లి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అనుట: గురు బోధ తో వచ్చిన జ్ఞానం సాధకునకు మనసులో నిలిచి పోవాలంటే ఆ విషయాన్ని మననం చెస్తూనే ఉండాలి. మననం చేసినప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. 

17, జూన్ 2014, మంగళవారం

మన ఋషులు

మన ఋషులు, మనకు విజ్ఞానాన్ని అందించిన మహానుభవులు. ఈనాటి మన వ్యావహారిక భాషలో చెప్పాలి అంటే వాళ్ళు మన భారతీయ విజ్ఞాన సంపదను ఒక చోట ప్రోది చేసి పెట్టిన ఆ కాలపు శాస్త్రవేత్తలు. ఈ శీర్శిక లో వారి గురించే చెప్పే చిన్న ప్రయత్నం  చేస్తున్నాను . ఎమైనా తప్పులు ఉంటే దయచేసి తెలియ చేయగలరు సరిదిద్దుకుంటాను

  1.  వేద వ్యాసుడు 
  2.  పరాశరుడు 
  3. రుష్యశ్రుంగుడు 
  4. వాల్మీకి 
  5. విశ్వామిత్రుడు 
  6. వసిస్టుడు
  7. శుకమహర్షి
  8. సనక, సనందనాదులు
  9. నారదుడు
  10. నారాయణ మహర్షి
  11. కపిల మహాముని