9, జనవరి 2022, ఆదివారం

నాగ్నజితి వివాహం

శ్రీ కృష్ణుని భార్యల గురించి మనం ఇంతకుముందు టపాలలో తెలుసుకున్నాం! వారిలో రుక్మిణి శ్రీకృష్ణుని ప్రేమించి, శిశుపాలుని వివాహం చేసుకోవలసిన సమయంలో శ్రీకృష్ణునికి లేఖరాసి, అతనిని వివాహం చేసుకుంది. సత్యభామ, జాంబవతి లను శ్రీకృష్ణుడు శమంతక మణి గురించిన విషయంలో వారిని వివాహం చేసుకున్నాడు. ఆ కథను మనం వినాయకచవితి కధలో చదువుకున్నాం! మిగిలిన వారిలో నాగ్నజితి ని శ్రీకృష్ణుడు ఎలా వివాహం చేసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం!
  కోసల దేశమునకు మహారాజు నాగ్నజిత్తు. అతని కుమార్తె నాగ్నజితికి వివాహం చేయటానికి నిర్ణయించుకుని, ఆ స్వయంవరం లో నాగ్నజితిని గెలుచుకోవాటానికి  ఏడు మదించిన ఎద్దులను సమకూర్చాడు. ఆ ఏడింటిని ఓడించిన వీరునికి తన కుమార్తెను ఇచ్చివివాహం చేస్తాను అని ప్రకటించాడు. కానీ నాగ్నజితి తన మనస్సులో శ్రీహరిని వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆప్ ఇషయం తెలుసుకున్న శ్రీ కృష్ణుడు అక్కడకు చేరుకున్నాడు. 
శ్రీకృష్ణుని కి ఎదురువెళ్ళి లోపలికి తీసుకువచ్చిన నాగ్నజిత్తు అతనికి సకల మర్యాదలు చేసాడు. అతని ఆతిధ్యమునకు సంతోషించిన శ్రీకృష్ణుడు అతని కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యమని కోరగా, నాగ్నజిత్తు అప్పటికే అతను ప్రకటించిన స్వయంవర షరతులను ప్రస్తావించాడు. 
అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఏడు ఎద్దులను ఓడించి, నాగ్నజితి ని వైభవంగా వివాహంచేసుకున్నాడు. ఆమెను తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో ఇంతకుముందు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుని ఆ స్వయంవరంలో ఓడిపోయినవారు అందరూ శ్రీకృష్ణునిమీద యుద్దానికి వచ్చారు. నాగ్నజితి కోసం శ్రీకృష్ణుడు వారందరిని ఓడించి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి