31, డిసెంబర్ 2015, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

కొందరు ఒక విచిత్రమైన వాదన వాదించుకోవటం  నేను విన్నాను. జనవరి ఒకటవ తేదిన నూతన సంవత్సరం జరుపుకుంటున్నారు కదా! మరి మన సంప్రదాయాలు వదిలేసినట్లేనా? అని. ఈ వాదన నాకు విచిత్రంగా అనిపించింది.
ప్రపంచం మొత్తం ఈ రోజున కొత్త సంవత్సరం వచ్చింది అని సంబర పడుతుంటే, కొందరు ఇలా! వాళ్ళ వాదనలో కొంతవరకు కాదనలేని నిజాలు ఉన్నా, ఖండించవలసిన విషయం కూడా ఉంది మరి. మనం ఒక విషయం చెప్పినప్పుడు విని మనముందు అంగీకరించి, పక్కకు వెళ్లి మనలను చూసి నవ్వుకునే వాళ్ళు ఈరోజుల్లో చాలా ఎక్కువ. వారి విషయం పక్కన పెడదాం.
అసలు విషయానికి వస్తే, మన కొత్త సంవత్సరం అదేనండి మన పండుగ "ఉగాది" నాటికి వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి, మరియు ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కనుక మన పండుగ గొప్ప. కనుక అది జరుపుకుందాం. అని  అనుకుంటే మంచిదే. మీరు చాల చక్కగానే ఆలోచించారు. మీరు అక్కడితో ఆగితే సాహబాష్!
కానీ ఈ ఆలోచనకి  పైత్యాన్ని జోడించి, కొంచెం రెక్కలు తొడిగి జనవరి ఒకటవ తారీకున పండగ చేసుకునే వారందరినీ అవహేళన చేస్తూ ఉండకండి.
అలాంటి వారు ఒక్క విషయం గుర్తు ఉంచుకోండి. మీరు ప్రతిరోజూ చేసే ప్రతి పనికి ఆ రోజు తారీకు వేస్తారు కదా! మరి అది కూడా ఆంగ్లసంవత్సర మానం ప్రకారం వేస్తున్నారు. అంతే కానీ మన తిధివారములు వ్రాయటం లేదు. మరి అప్పుడు మీరు కూడా ఇప్పుడు తమరు వెలివేసిన ఆంగ్ల సంవత్సర మానం పాటించక తప్పటం లేదు కదా!
ప్రపంచంలో ఒక్కో ప్రదేశంలో ఒక్కో సమయం ఉంటుంది. అది ఆయా స్థలములను బట్టి మారుతుంది. ప్రపంచం మొత్తం ఒప్పుకుంటున్న ఈ తేదీలను మీరు కాదనలేరు. కాదని మీరు ఒక్కరు తిధి, వార ములను ప్రామాణికంగా పాటించలేరు. ఒక వేళ పాటించినా అది మీకు తప్ప వేరెవరికీ అర్ధంకాదు.  మరి అందరు సంతోషంగా ఉంటున్న ఈ సమయంలో, మీరు పాలు పంచుకోగలిగితే మంచిదే, అలా కాని సమయంలో ఎదుటివారి సంతోషాని చూసి మనం కూడా సంతోషిద్దాం.

సరే ఈ క్రొత్త సంవత్సరం మనందరిలో మరింత మంచితనం నింపాలి, మనం కన్న కలలు నిజం చేసుకునే మార్గం చూపాలి, కొందరికి అయిన మనం కొంత సహాయం చేయగలగాలి, మన జీవితాలలో మరింత మధుర జ్ఞాపకాలు మిగలాలి, మనతో పాటు మన మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, పరిచయస్తులు, పరిచయంలేనివారు అందరూ సకల సంతోషాలతో ఉండాలి. అందరికీ ఈ ఆంగ్ల సంవత్సరాది మంచి ప్రారంభంకావాలి.   


మన పాత మిత్రుడు 2015 మనకు మిగిల్చిన జ్ఞాపకాలు, అనుభవాలు ఒక్కసారి తలచుకుందాం. ఏమైనా తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. 2015 కు వీడ్కోలు పలుకుదాం. అందరం సంతోషంగా నూతన సంవత్సరం - 2016 కి స్వాగతం పలుకుదాం. 

మీ 
దీపిక 

పరీక్ష - ఫలితం

శివ శర్మ వరుసగా తన నలుగురు పుత్రులయిన యజ్ఞశర్మ, వేదశర్మ, ధర్మశర్మ మరియు విష్ణుశర్మ లను పరీక్షించి, వారు తమ తమ పితృభక్తిని నిరుపించుకున్న తరువాత, అమితానందం పొందాడు.
తన పుత్రులను పిలచి " ఓ కుమారులార! మీ పితృభక్తి కి నేను ఎంతో  సంతోషించాను. మీకు ఏదయినా వరం ఇస్తాను కోరుకొనండి" అని అడిగాడు.
అప్పుడు ఆ పుత్రులు " తండ్రీ మీరు మాయందు దయఉంచి మా తల్లిని తిరిగి బ్రతికించండి అని ప్రార్ధించారు". వారు అలా అడుగగానే ఆ తండ్రి ఒక చిరునవ్వు నవ్వాడు, వెంటనే జ్యేష్ట పుత్రునిచే వధింపబడిన ఆమె వెంటనే నడచి వచ్చి, తన భర్త పాదములకు నమస్కరించినది. తన పుత్రులను చూసి " ఓ కుమారులార! ఒక స్త్రీకి తన పుత్రులు ధర్మ మార్గంలో నడచుటకంటే పెద్దదయిన బహుమానం ఉంటుందా! సత్ బ్రాహ్మణ కులంలో జన్మించాను, ఉత్తముడయిన భర్తను పొందాను, నా గర్భం నుండి మీవంటి పరమ ఉత్తములను పొందాను. నా జన్మ ధన్యం కదా! " అని పలికినది. వెంటనే ఆమె పుత్రులు ఆమెకు ప్రణామములు చేసారు.
వీరిని మరలా వరం కోరుకొనమని శివశర్మ అడుగగా, అప్పుడు వారు విష్ణుదామము కావలెను అని కోరారు. అప్పుడు శివశర్మ తధాస్తు అని పలుకగానే, శ్రీమహావిష్ణువు తన పరివారంతో, రధంలో ప్రత్యక్షం అయ్యాడు. "శివశర్మ, నీ నలుగురు పుత్రులు పితృభక్తి లో వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. నీవు వారికి విష్ణులోకమును అనుగ్రహించావు. నీవు నాకు భక్తునువి అవ్వటం వలన నేను నీకు స్వాదీనుడను. కావున నీవు నీ భార్యా బిడ్డలతో కలసి నా ధామమునకు విచ్చేయుము" అని పలికెను.
ఆ మాటలు విని శివశర్మ " ఓ విష్ణుమూర్తి! ఇప్పటికి నా నలుగురు పుత్రులను నీ ధామమునకు తీసుకొని వెళ్ళు. నేను నా భార్య మరియు ఐదవ పుత్రునితో ఇంకొంత కాలం భూలోకం లో ఉండి తరువాత తమరిని చేరుకొనెదను" అని చెప్పెను. అప్పుడు శ్రీమహావిష్ణువు శివ శర్మ నలుగురు పుత్రులను ఇంద్రనీలమణి సామానమయిన కాంతి కలవారుగా, శంఖచక్రగధా ధరులుగా, దివ్యాలంకరణ భూషితులుగా చేసి గోలోకమునకు తీసుకొని వెళ్ళిరి.

30, డిసెంబర్ 2015, బుధవారం

విష్ణుశర్మ

శివశర్మ తన ముగ్గురు పుత్రులను వరుసగా పరీక్షించిన తరువాత తన నాలుగవ పుత్రుడయిన విష్ణుశర్మ ను పిలిచాడు.
శివ శర్మ విష్ణు శర్మతో ఇలా అన్నాడు " పుత్రా! ఈ స్త్రీ ని నేను ఇప్పుడే గ్రహించాను. ఈమె యవ్వనంలో ఉన్నది. నాకు శరీరంలో వృద్ధాప్యపు చాయలు ఉన్నాయి. కనుక వానిని నేను పోగొట్టు కొనేందుకు వీలుగా, నాకు నీవు అమృతం తెచ్చి ఇవ్వు " అని కోరెను.
తండ్రి కోరిక ప్రాకారం అమృతం తెచ్చే కోరికతో విష్ణుశర్మ స్వర్గానికి బయలుదేరాడు. విష్ణు శర్మ స్వర్గమునకు వస్తున్నాడు అని తెలుసుకొన్న ఇంద్రుడు ఆతనిని దారిలో ఆపాలన్న ఆలోచనతో మేనకను అతనిని ఆపే పని కై నియమించాడు.
ఆ మేనక విష్ణుశర్మ వచ్చే దారిలో ఒక ఉద్యానవనంలో ఉయ్యాలలూగుతూ పాటలు పాడుతూ ఆతనిని ఆకర్షించే ప్రయత్నం చేసినది. ఆమె పాటలు వినీ, వినని వానివలె, ఆమెను చూసీ చూడని వానివలే విష్ణుశర్మ ముందుకు సాగిపోసాగాడు. ఐనా మేనక ఆతని వెనుకనే వచ్చి ఆతనితో మాటలు కలిపినది. ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు వెళుతున్నావు అంటూ! కానీ విశ్నుషరం ఆమె అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పి, ఆగకుండా వెళ్ళటం చూసి,మేనక తన సహజ స్వభావం తో ఆతనిని నిలువరించే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నములు గ్రహించిన విష్ణుశర్మ " ఓ మేనకా! నేను శివశర్మ పుత్రుడను. ఇట్టి మాయలకు లొంగే వానను కాదు. నీ ప్రయత్నములు నావద్ద చేయకు" అని మెత్తగా మందలించి, తన దారిన తను వెళుతూ ఉన్నాడు.
మేనక తన ప్రయత్నంలో వెనుతిరిగినది అని తెలుసుకున్న ఇంద్రుడు సింహం, పులి వంటి క్రూర జంతువులను సృష్టించి విష్ణుశర్మ మీదకు ప్రయోగించాడు. అవి కూడా విష్ణుశర్మను నిలువరించలేక పోవటంతో ఈ సారి ఇంద్రుడు రాక్షస గణములను సృష్టించి అతనిమీదకు ప్రయోగించాడు. అన్నింటిని తన పితృభక్తి వలన ఎదుర్కొన్న విష్ణుశర్మ ఈసారి ఇంద్రుడు బాణ వర్షం కురిపించుతచే కోపగించాడు. "నేను మా తండ్రి ఆజ్ఞ మేరకు అమృతం తీసుకు రావటానికి వస్తుంటే, ఇంద్రుడు నిర్ధాక్షిణ్యం గా నా మీదకు యుద్ధానికి కాలుదువ్వు తున్నాడు కనుక ఇతనిని ఈ ఇంద్రపదవి నుండి తప్పించి మరొకరిని ఇంద్రుడుని చేస్తాను" అని కన్నులు ఎర్రవిగా అయి ఉన్న విష్ణుశర్మను చూసి భయపడిన ఇంద్రుడు "ఓ బ్రాహ్మణోత్తమ! నేను నీకు సకల దేవతలతో కలసి నమస్కరిస్తున్నాను! నీకు కావలసిన వరం కోరుకొనుము ఇచ్చెదను" అని అన్నాడు. వెంటనే తనకోపమును తన వసంలోనికి తెచుకున్న విష్ణుశర్మ "ఓ ఇంద్రా!నేను మా తండ్రిగారి ఆజ్ఞ మేరకు అమృత కలశం కోసం వచ్చాను. నీవు నాకు వరం ఇస్తాను అన్నావు కనుక, ఆ అమృత కలశంతో పాటుగా నాకు అచంచలమైన పితృభక్తిని ఇవ్వు" అని కోరెను.
ఇంద్రుడు అలాగే అని అమృత కలశమును విష్ణుశర్మకు ఇచ్చెను. ఆ కలశంతో  విష్ణుశర్మ తండ్రిని సమీపించి జరిగినది చెప్పి, ఆ కలశమును  తండ్రికి సమర్పించెను.
ఈ విధంగా నాలుగవ పుత్రుదయినా విష్ణు శర్మ పరీక్ష ముగిసినది. 

29, డిసెంబర్ 2015, మంగళవారం

తృతీయ కుమార - పరీక్ష

శివశర్మ తనవద్దకు తన రెండవకుమారుడయిన వేదశర్మ  తలతో వచ్చిన స్త్రీ ని చూసి, ఆమె చెప్పిన వృత్తాంతం అంతా విన్నాడు. ఈ వృత్తాంతం అంతా విన్న మిగిలిన పుత్రులు వేదశర్మ చేసిన త్యాగం గురించి ఆశ్చర్యపోయారు.
అప్పుడు శివశర్మ తన మూడవ పుత్రుడయిన ధర్మశర్మను పిలిచి, వేదశర్మను బ్రతికించమని కోరాడు.
తండ్రి మాటలు విన్న ధర్మశర్మ తక్షణం కన్నులు మూసుకుని, తండ్రి ఆదేశించిన విధంగా, యమధర్మరాజును ప్రార్ధించాడు.
అతని ప్రార్ధనను మన్నించి సమవర్తి ఆతనిముందు ప్రత్యక్షం అయ్యాడు. ఆతను కోరిన కోరిక ఏదయినా తీరుస్తాను అని చెప్పాడు. ఆమాటలు విన్న ధర్మశర్మ "ఓ యమధర్మరాజా! మీరు నా భక్తిని మెచ్చినట్లయితే, ఈనా సోదరుని వెంటనే బ్రతికించండి అని కోరెను. " ఆతని కోరిక విన్న యమధర్మ రాజు, మీ పితృభక్తి ఆతనికి ఆయుషు పోయగలదు అని చెప్పి అదృశ్యం అయ్యాడు.
అప్పుడు వేదశర్మ నిద్రలోనుండి మేలుకొన్న విధంగా, లేచి నిలుచున్నాడు. తనతండ్రిని, ఆ స్త్రీని చూసి, వారికి పాదాభి వందనం చేసాడు. ఈ విధంగా శివ శర్మ తన మూడవ కుమారుని పితృభక్తిని పరీక్షించాడు. 

28, డిసెంబర్ 2015, సోమవారం

ద్వీతీయ పుత్ర - పరీక్ష

శివశర్మ జ్యేష్ట పుత్రుని పరీక్ష ముగిసిన వెంటనే, ద్వీతీయ పుత్రుడయిన వేదశర్మని పిలిపించెను. అతనితో  "పుత్రా ! నేను నిత్య కర్మలయందు కొంచెం కూడా ఆలస్యం చేయక ఉందును. ఈ నాడు మీ తల్లి లేదు. నిత్య కర్మలు చేయుటకు నేను ధర్మపత్నితో ఉండుట అవసరం, మరియూ నాకు ఇంకనూ సంపూర్ణ వైరాగ్యం కలుగలేదు. నేను ఇప్పుడే ఒక చంద్ర వదనను ఆ విధిలో వెళుతుండగా చూసాను. ఆమెను తెచ్చి నాకు పత్నిగా చేయుము." అని చెప్పెను. తమ తండ్రి చెప్పిన మాటలు విన్న వేదశర్మ ఒక్క క్షణంలో వీదిలోనికి వచ్చి తండ్రి చెప్పిన ఆ స్త్రీని కనుగొని అంజలి ఘటించి "తల్లీ ! మా తండ్రిగారు తమరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు, కావున తమరు నాతో దయచేసి వారిని వివాహం చేసుకొనండి." అని చెప్పెను.
ఆ స్త్రీ వేదశర్మతో " నేను కన్యను, ఒక ముసలివానిని ఎందుకు వివాహం చేసుకోవాలి? వృధ శరీరం అనేకములయిన వ్యాధులకు ఆలవాలం. నేను నీ తండ్రిని వివాహం చేసుకోను, కానీ నిన్ను చేసుకుంటాను." అని చెప్పినది.
ఆమె మాటలు విని వేదశర్మ " అమ్మా! క్షమించాలి. మీరు నా తండ్రి మనస్సు గెలిచిన వారు. మీరు వారిని వరించిన సర్వ జగమ్ములు మీకు వశంలో ఉండేటట్లు చేయగలవాడను. నేను పలికిన ఒక్క మాటకూడా ఏనాడు తప్పదు." అని తలవంచి మరలా నమస్కరించెను.
ఆమాటలు విన్న ఆ స్త్రీ " ఓ బ్రాహ్మణోత్తమా! నిజంగా మీకు అంత శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడే నాకు సమస్త దేవతలను చూపించుము. అప్పుడు మీ మాటలు నేను నమ్ముతాను. " అని పలికినది.
ఆమె అలా అడుగ గానే వేదశర్మ మనస్సులో ధ్యానం చేసాడు. ఆటను అలా ధ్యానం చేయగానే సకల దేవతలు వచ్చి వారిరువురికీ దర్శనం ఇచ్చి, ఆతనిని వరం కోరుకొనమని అడుగగా, వేదశర్మ " సకల దేవతలారా మీరు నాయెడల ప్రసన్నులయిన నాకు అవిచ్చిన్న మయిన పితృభక్తి ని ప్రసాదించండి" అని కోరెను. అప్పుడు ఆ దేవతలు ఆ తనిని అట్లే దీవించి అంతర్ధానం చెందారు.  
ఆతని పితృభక్తి ని చూచి ఆమె, " ఓ బ్రాహ్మణోత్తమ! నీకు గల పితృభక్తి అమోఘం. నీవు నన్ను నీ మాతృ స్థానంలో ఉంచాలని అనుకున్నందుకు సంతోషం. కానీ మరి నీ మాతృభక్తికి పరిక్ష ఇవ్వవా ?" అని అడిగినది.
ఆ మాటలు విని అనందం పొందిన వేదశర్మ ఆమె ఏ పరీక్ష పెట్టినా  తాను ఎదుర్కోనగాలను అని చెప్పగా, ఆమె అతనిని తన చేతులతో, స్వయంగా తలను నరుక్కొని ఆమె చేతికి ఇవ్వమని కోరినది.
మరుక్షణం వేదశర్మ పరమ సంతోషంతో తన తలను తన చేతులతో నరికి ఆమె చేతికి అందించెను.
ఆతని తలను చేతితో పట్టుకుని ఆ స్త్రీ శివశర్మ ఇంటికి వెళ్లి జరిగిన వృత్తాంతం అంటా వివరించెను.      

26, డిసెంబర్ 2015, శనివారం

జ్యేష్ట పుత్ర-పరీక్ష

శివ శర్మ ఒక రోజు తన పెద్ద కుమారుని పరీక్షించాలని అనుకున్నాడు.
జబ్బుతో భాదపడుతున్న తన భార్యను చూచి, జ్యేష్ట పుత్రుడయిన యజ్ఞశర్మను పిలిచెను. అతనితో శివశర్మ,  "చూడు! మీతల్లి ఈ విపరీతమయిన ఈ జ్వరముతో అనేక విధములుగా వేదన అనుభవిస్తున్నది. ఏవిధంగా ఆలోచించినా ఈమె వ్యాధికి మందు తెలియటంలేదు. ఆమె ఈ విధంగా భాదను అనుభవించుట కంటే ఆమెకు మనం మరణమును ప్రసాదించుట మేలు. కనుక నా జ్యేష్ట పుత్రుడవయిన నీవు, నీ స్వహస్తములతో ఒక ఖడ్గం తెచ్చి, దాని ద్వారా నీ తల్లిని వదించుము. ఆ పిదప ఆమె శరీరమును ఖండ ఖండములుగా త్రుంచి, నలు దిక్కులా పడవేయుము. అలా చేస్తేనే ఆమెకు గల ఈ విచిత్ర జ్వరం నివృత్తి అవుతుంది." అని చెప్పెను.
తన తండ్రి చెప్పిన మాటలు విన్న యజ్ఞశర్మ "తమరి అజ్ఞ" అని పలికి, అక్షరాల తండ్రి చెప్పిన విధంగా, చేసి తిరిగి వచ్చి తన తండ్రికి నమస్కారం చేసెను. కేవలం ఆతని మనస్సు నందు తన తండ్రి చెప్పిన మాటను నిస్సందేహంగా పూర్తి చేయవలెనను సంకల్పం తప్ప మరొకటి లేదు. అతనికి కనీసం ఇది తమ తండ్రి తనకు పెడుతున్న పరీక్ష అనికూడా తెలియదు.
జ్యేష్ట పుత్రుడు తన తండ్రి చెప్పిన విధంగా చేసి, తన పితృభక్తి ని నిరూపించుకున్నాడు. 

25, డిసెంబర్ 2015, శుక్రవారం

పితృ భక్తి

పితృ భక్తి, ఈ పదం ఈ రోజుల్లో మనం వినటానికి చదువుకోవటానికి మాత్రమే వాడుతున్నాం. కానీ పితృభక్తి అనే మాటకు విస్తృత ప్రాముఖ్యం ఇస్తూ మన కు గల 18 పురాణాలలో "హరేరేవ హృదయం పద్మ సంజ్ఞకం" అని అనిపించుకున్న పద్మ పురాణం లో భుమిఖండంలో అనేక అధ్యాయములలో చెప్పబడి ఉన్నది.
ఒకానొక సమయంలో శివశర్మ అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ద్వారకలో నివాసం ఉండేవాడు. అతనికి ఐదుగురు పుత్రులు ఉన్నారు. వారి పేర్లు

  1. యజ్ఞశర్మ 
  2. వేదశర్మ 
  3. ధర్మశర్మ 
  4. విష్ణు శర్మ 
  5. సోమశర్మ 
ఈ ఐదుగురు తమ తండ్రి వలెనే వేద విధ్యలలో నిష్ణాతులు. అంతే కాకుండా పితృభక్తి పరాయణులు. 

ఇలా కొంతకాలం గడిచినది. అప్పుడు శివశర్మ తమ పుత్రుల పితృభక్తికి పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. అందుకు అనుగుణంగా తన అనుకూలవతి, ఐదుగురు పుత్రుల తల్లి అయిన తన భార్యకు ఒక విచిత్రమైన జ్వరం వచ్చేలా చేసాడు. అప్పుడు ఒక్కొక్క పుత్రునికి ఒక్కో విచిత్రమైన పరీక్ష. పెట్టటం  ప్రారంభించాడు 

24, డిసెంబర్ 2015, గురువారం

పీనాసి మొగుడు

ఒక భార్య భర్తలు వేసవి కాలంలో ఎవరినో హాస్పిటల్లో కలుద్దామని బయలుదేరారు. కలిసి కొంచెం సేపు మాట్లాడి ఇంటికి బయలుదేరారు.
భార్య : ఏమండి! ఇందాక కూడా నడిపించారు. దాదాపు 20 min. నేను నడవలేను.
భర్త : అదికాదోయ్! నడిస్తే సరదాగా ఉంటుంది. ఆటో ఎక్కితే 50 రూపాయలు ఖర్చు ఎందుకు. అదిగో అక్కడి వరకు          నడిస్తే మనం ఎక్కాల్సిన bus వస్తుంది.
భార్య : సరే! నాకు దాహంగా ఉంది. juice తాగుదామా!
భర్త : సరే! కొంచెం ముందుకు వెళితే అక్కడ షాప్ ఉంది అక్కడ తాగుదాం లే. నడువు.

Juice shop దగ్గరలో
భర్త : juice చల్లగా ఉండదు కదా! cool drink ఐతే ఈ ఎండలో చల్లగా బాగుంటుంది. అదిగో ఇంకొంచెం ముందు షాప్ ఉంది అక్కడ తాగుదాం.
భార్య : (అయిష్టంగా) సరే

Cool drink shop దగ్గరలో
భర్త : ఐన ఈ మధ్య newsలో ఈ cool drinks లో ఏవో విష పదార్ధాలు కలుపుతున్నారు అని రాస్తున్నారు కదా! అమ్మో వద్దు మనం తాగవద్దు. అదిగో అక్కడ చూడు Bus stand దగ్గర  చెరుకు రసం అది తాగుదాం నడు.
భార్య : ...
చెరకురసం బండి దగ్గర
భర్త : వీళ్ళు ఈ చెరుకును రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఇక్కడ పిండుతారు. వాడు ఏనీళ్ళు వాడాడో ఏమో!
        ఐనా నువ్వు handbag తీసుకొస్తావ్ కదా, దానిలో ఒక్క water bottle పెట్టుకోవచ్చు కదా! అదిగో మనం                   ఎక్కాల్సిన బస్సు వచ్చింది. నీకు కావలసిన జ్యూస్ నువ్వే ఇంట్లో చెయ్. ఇద్దరం తాగుదాం!
భార్య : (మనసులో)ఇంత  పీనాసి మొగుడు నాకు ఎక్కడ దాపురించాడో!

మీకు ఏమి అనిపిస్తుంది? పాపం ఆ భార్య ఏమి అనుకుంటుందో మీరు చెప్పగలరా! 

పురాణాత్మక విష్ణు స్వరూప కధనము

మనం ఇంతకుముందు 18 పురాణములు, వానిలోగల శ్లోకముల సంఖ్య గురించి చెప్పుకున్నాం. ఐతే పద్మ పురాణం ప్రకారం ఈ 18 పురాణములు శ్రీహరి యొక్క అంగములుగా చెప్పబడి ఉన్నాయి.
మీకోసం సంస్కృత పద్మపురాణమందలి శ్లోకములు, మరియు దానిని తెలుగులో అనువదించిన శ్రీ చిదంబర శాస్త్రి వారి శ్రీమదాంధ్ర పద్మపురాణం నందలి పద్యములు అందిస్తున్నాను!

సంస్కృతం:

బ్రాహ్మం మూర్ధా హరేరేవ హృదయం పద్మ సంజ్ఞకం 
వైష్ణవం దక్షిణో బాహుః వాయుర్వామో మహేశితుః 
ఊరూ భాగవతం ప్రోక్తం నాభి స్యాన్నారదీయకం 
మార్కండేయంచ దక్షాంఘ్రీః వామోహ్యగ్నేయ ముచ్యతే 
భవిష్యం దక్షిణో జానుర్విష్ణో రేవ మహాత్మనః 
బ్రహ్మ వైవర్త సంజ్ఞంత వామోజాను రుదా హృతః 
వైంగ్యంతు గుల్ఫకం దక్షం వారాహం వామ గుల్ఫకం 
స్కాందం పురాణం లోమాని త్వగస్య వామనం స్మృతం 
కౌర్మం పృష్టి సమాఖ్యాతం మత్స్యమేదః ప్రకీర్తతే 
మజ్జాతు గారుడం ప్రోక్తం బ్రహ్మాండ మస్తి గీయతే 
ఏవమేవా భవద్విష్ణుః పురాణా విమావో హరిః 
సంస్కృత పద్మ పురాణం : 1-62-67


తెలుగు 

తెలుగు లోనికి దీనిని అనువదించినప్పుడు ఈ వివరణకు శీర్షిక "పురాణాత్మక విష్ణు స్వరూప కధనము" అని ఇవ్వబడినది. 

సీ . పాద్మము హృదయంబు బ్రాహ్మము మూర్ధంబు 
                       మజ్జ గారుడము వామనము త్వచము 
      భాగవతం దొదల్  బ్రహ్మాండమస్థులు 
                       మాత్స్యము మెదడు కౌర్మంబు వెన్ను 
      లైంగ వారాహముల్ దక్షిణవామ గు 
                      ల్ఫంబులు నారదీయము నాభి 
      రోమముల్ స్కాందము వామ దక్షిణ భుజ 
                      ద్వందంబు శైవంబు వైష్ణవంబు 
గీ . వామపాద మాగ్నేయంబు వామజాను తలము  బ్రహ్మ వైవర్తంబు దక్షిణోరు 
      పర్వము భవిష్య మపసవ్య భావమొంది నట్టి పదము మార్కండేయ మచ్యుతునకు 

    శ్రీమద్ ఆంధ్రపద్మ పురాణం : ఆదిఖండం : 828

23, డిసెంబర్ 2015, బుధవారం

18 పురాణములు

మనకు 18 పురాణములు ఉన్నాయి. ఆ పురాణములు వానిలో గల శ్లోకముల సంఖ్య:
  1. బ్రహ్మ పురాణము - 10,000
  2. పద్మ  పురాణము - 55,000
  3. విష్ణు  పురాణము - 23000
  4. శివ/వాయు  పురాణము -24000
  5. వామన  పురాణము - 10,000
  6. మార్కండేయ  పురాణము - 9,000
  7. వరాహ  పురాణము - 24000
  8. అగ్ని  పురాణము - 15,400
  9. కూర్మ  పురాణము - 17,000
  10. భాగవత  పురాణము - 18000
  11. లింగ  పురాణము - 11,000
  12. నారద  పురాణము -25,000
  13. స్కంద  పురాణము - 81,000
  14. గరుడ  పురాణము - 19,000
  15. మత్స్య పురాణము - 14,000
  16.  బ్రహ్మ వైవర్త పురాణము - 18,000
  17. భవిష్య  పురాణము -14,500
  18. బ్రహ్మాండ  పురాణము - 12,000
ఈ శ్లోకముల సంఖ్యను ఒక్కొక పురాణంలో ఒక్కో విధంగా చెప్పారు. 

ప్రపంచంలోని మొట్టమొదటి అద్దముల దేవాలయం part 2

మనం ప్రపంచంలోని మొట్టమొదటి అద్దముల దేవాలయం గురించి  మాట్లాడుకుంటున్నాం కదా! ఆ దేవాలయానికి అంత ప్రత్యేకత తెచ్చినవారు ఎవరు? ఆ దేవాలయం ఎక్కడ ఉన్నది అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఆ దేవాలయ దర్శనం చేసోద్దమా!
ఈ దేవాలయం గోపురం నుండి మన కన్నులకు పండుగ మొదలవుతుంది. ఈ క్రింది ఫోటో ఆ గోపురం లోని ఒక భాగం. 
source: Internet
గోపురం తరువాతి వంతు ముఖద్వారానిది. అది ఒక అధ్బుతం.

గడపదాటి లోపలి వెళ్ళగానే ద్వజస్థంభం కాంతులీనుతూ దర్శనం ఇస్తుంది. ఈ ధ్వజస్తంభానికి క్రింద భాగం లో వినాయకుని ముఖం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Source : internet
ధ్వజ స్థంభం వెనుకగా మన చూపులను ఆకట్టుకునే మరొక కళాఖండం ఒకటి ఉంది. మానవుని అనేక స్థాయిలు. అవును. మానవ జీవితంలో వచ్చే 11 దశలు శిల్పాలుగా మలచి ఉన్నాయి.

ఇక అమ్మవారి గర్భగుడి ద్వారానికి ఇరువైపులా నృత్య గణపతి అందంగా దర్సనం ఇస్తారు. అంతే  కాకుండా ఆ ద్వారానికి పైన ఉన్న అమ్మవారి ముఖం మనలను మంత్రం ముగ్ధులను చేస్తుంది.

ఈ ఆలయంలో ఉపఆలయములు కూడా ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ఉప ఆలయాలలో వెంకటేశ్వర స్వామి, కాళిక, గణేశ, కుమారస్వామి, శివులకు కూడా నిత్య పూజలు జరుగుతాయి. ఈ ఉపఆలయములే కాకుండా 10 పాలరాతి విగ్రహములు ఉన్నాయి. అవి జీసస్, షిరిడి సాయి, పుట్టపర్తి సాయి, రామకృష్ణ పరమ హంస, రాఘవేంద్ర స్వామి, గౌతమ బుద్ధ, గురునానక్ మొదలయిన దైవ అవధూతలకు సంబందించినవి. వీరే కాకుండా ఈ యుగపు మానవతా మూర్తి మదర్ థెరిస్సా.  వీరి  విగ్రహాలు ఒక్కొక్కటి 120 cm పరిమాణంలో ఉన్నాయి. తెలియని వారికి కూడా తేలిక అర్ధం అయ్యే విధంగా వారి వారి విగ్రహాల క్రింద వారి పేర్లు వివరాలు పొందు పరచారు. మత మరస్యానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరమా!



ఇవే కాకుండా త్రిమూర్తుల విగ్రహాలు చూడటానికి నిజంగా రెండుకళ్ళు సరిపోవు.








ఐతే ఇక్కడి ఉపాలయం లోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ లింగాన్ని ఆత్మలింగం అని పిలుస్తారు. ఆ లింగం యొక్క పీఠం కమలం ఆకారంలో ఉంటుంది. అక్కడకు వచ్చిన భక్తులు స్వయంగా తాము తెచ్చిన రోజ్ వాటర్తో అభిషేకం కుడా చేయవచ్చు. లింగ దర్శనం అయిన తరువాత ఆ శివాలయపు  ప్రత్యెక ఆకర్షణ రుద్రాక్షలు పొదిగిన గర్భాలయం. అమ్మవారికి అలంకారం ఇష్టం కనుక 3,00,000 ల అద్దముల తో  దేవాలయమును అలంకరించాము, కానీ శివునికి ఇంతకు మించి ఏదయినా చేయాలి అని అనుకున్నారేమో మన సినతంబి, 3,00,000 ల రుద్రాక్షలని నేపాల్ నుండి తెప్పించి, ఒక్కొక్క రుధ్రక్షా  మంత్రపూరితంగా ఆ గోడలో పొదిగారు. ఆ రుద్రాక్షలు  పై ఫోటో లో శివలింగం వెనుక భాగంలో నల్లగా కనిపిస్తున్న గోడను పరిశీలిస్తే కనిపిస్తాయి.
ఈ దేవాలయం లో ఒకేసారి 1500 మంది కూర్చోన వచ్చు. అంత విశాలంగా ఉంటుంది. ఐతే ఈ దేవాలయ అద్దములు అంతగా మెరిసిపోవటానికి కారణం ఆ దేవాలయంలో వారు అమర్చిన చండ్లియర్స్, మరియు వానిని నిరంతరం శుభ్రంగా ఉంచే శ్రామికులు. మీరు జీవితంలో ఎప్పుడయినా మలేషియా వెళ్ళే ఆలోచన ఉంటే తప్పని సరిగా ఈ దేవాలయ దర్శనం చేసుకోండి.
ఇన్ని విషయాలు చెప్పి ఒక్క విషయం చెప్పక పొతే నా వ్రాత అసంపూర్ణం అని నా అభిప్రాయం. దేశం కాని దేశంలో, మన దేవాలయానికి ఇంత  అపూర్వ ఖ్యాతి నందించిన శ్రీ  సినతంబి గారు నిజంగా ధన్యులు. వారి భక్తి ఈ దేవాలయం అణువణువునా ప్రతిభింబిస్తుంది.
ఈ దేవాలయం అందాలను ఈ క్రింది లింక్ లలో వీడియో ద్వారా చూడండి.

  1.  https://www.youtube.com/watch?v=KWPnZ7QbOvY
  2. https://www.youtube.com/watch?v=Ei3Zo_tVgQo
  3. https://www.youtube.com/watch?v=bn3pFJ_bo0w

19, డిసెంబర్ 2015, శనివారం

ప్రపంచంలో మొట్ట మొదటి అద్దముల (హిందూ) దేవాలయం

ఈ రోజులలో సహజంగా దేవాలయములకు వెళ్ళేది ఆడవాళ్లే. ఆడవాళ్ళ బలహీనత అద్దం. ఈ రెండింటిని ఒకే చోట చేరిస్తే, అద్దములతో ఒక దేవాలయం నిర్మించి, అక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటే, అక్కడికి మీరు కూడా వెళ్ళవచ్చు అని చెప్తే ఇక ఆడవాళ్ళ ఆనందం అపరిమితం కదా! మరీ అంత ఆనంద పడకండి. ఆ దేవాలయం మనకు అందుబాటులో లేదు, మలేషియాలో ఉన్నది. కొంత నిరుత్సాహం కలిగినా మన దేవాలయమునకు దొరికిన అత్యంత అపూర్వమైన ఖ్యాతి గురించి తెలుసుకోవటం మంచిదే కదా!
ఈ దేవాలయం మలేషియా లోని జోహోర్ రాష్ట్రంలో ఉన్నది. ఈ రాష్ట్రం సింగపూర్ కి అతి దగ్గరలో ఉంటుంది.
ఈ దేవాలయంలో దేవత పేరు ఆరుల్మిగు శ్రీ రాజకాళీ అమ్మ. 1922 లో నిర్మించబడిన ఈ దేవాలయం ఆ ప్రదేశంలో ఉన్న చాలా పాత దేవాలయం. తరువాత 1996 లో పునరుద్ధరణకు లోనయింది. ఈ దేవాలయమునకు ఇంత విశిష్టత చేకూర్చిన ఆ వ్యక్తి పేరు "సిన్నతంభి శివసామి". వీరు ఒకప్పుడు బాంగ్కాక్ (Bangkok) వెళ్లారట. అక్కడ ఒక దేవాలయం గోపురం మీది ఒక అద్దం ఎంతో దూరంలో రోడ్ పై కార్ లో వస్తున్న సిన్నతంబి శివసామి వారి కళ్ళలోకి తళ్ళుక్కు మని ప్రతిబింబించిందట. అది ఏమిటో తెలుసుకోవాలని వారు ఎంతో ప్రయాసపడి చివరకు అది ఒక దేవాలయం పైన అమర్చిఉన్న చిన్న అద్దం అని తెలుసుకున్నారట. అంతే అప్పుడే వారి కి ఒక అపూర్వమైన ఆలోచన వచ్చింది. ఒక చిన్న అద్దంముక్క ఎక్కడో ఉన్న రోడ్ మీదకి ప్రతిబింబిస్తే, ఒక దేవాలయం మొత్తం అద్దాలతో అలంకరిస్తే? అంతే వెంటనే మలేషియా తిరిగి వచ్చారు. ఇక తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. ఒకటికాదు రెండుకాదు 3,00,000 ముక్కల అద్దాలు. ఎరుపు, ఆకుపచ్చ, నీలి, పసుపు, ఉదా మరియు తెలుపు రంగుల అద్దపు ముక్కలతో అధ్బుతంగా కన్నులు చెదిరేలా తయారయ్యింది. అంతే కాకుండా ఈ దేవాలయం మొత్తం శీతలీకరణం చేయబడినది. (airconditioned). ఈ దేవాలయం 2009 లో సర్వాంగ సుందరంగా భక్తులకు అందుబాటులోకి వచ్చినది.
My husband with my princess

ఈ దేవాలయ ఘనత ఏమంటే ప్రపంచంలో మొట్టమొదటి అద్దాల దేవాలయం ఇదే. అంతే కాదు 2010 లో మలేషియా బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించింది.

ఎలా చేరుకోవచ్చు?
ఒకవేళ మీరు మలేషియాలో ఉన్నట్లయితే ఫ్లైట్, రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇంకా ఈ రాష్ట్రం సింగపూర్ కు దగ్గరగా ఉండటం వలన సింగపూర్ నుండి కూడా రోడ్డు మార్గం ద్వారా చేరుకొనవచ్చు. ఒకసారి ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాక ఏదయినా క్యాబ్ లో ఈ దేవాలయమునకు చేరుకోవచ్చు. ఐతే అక్కడి క్యాబ్ డ్రైవర్స్ ని GLASS TEMPLE అని అడగాలి. ఐతే మీరు ముందు అక్కడకు చేరుకోగానే ఆ సిటీ మ్యాప్ ఒకటి చేతులో ఉంచుకోవటం మంచిది. ఒకవేళ డ్రైవర్ కి దారి తెలియక పొతే మీరు గైడ్ చేయవచ్చు. అంతే కాదు మీరు వెళ్లేముందు దేవాలయం సమయాలు చూసుకుని వెళ్ళటం మంచిది.

ఇది కేవలం ఆ దేవాలయ ముఖచిత్రం మాత్రమే. ఆ దేవాలయం లోపలికి వెళితే కన్నులు చెదిరిపోయే ఆ సౌందర్యం స్వయంగా అనుభవించాల్సిందే. మరి ఆ వివరాలతో తరువాతి పోస్ట్ చేస్తాను. అప్పటివరకు... తెలుగే మాట్లాడదాం.