31, మార్చి 2020, మంగళవారం

పులస్త్యుడు - విశ్రవసుడు

మనం ఇంతకు ముందు ఒక పురాణమునకు మరొక పురాణమునకు భేదములు ఉండటానికి కారణం అవి జరిగిన కల్పములే కారణం అని చెప్పుకున్నాం కదా!
ఇప్పుడు అటువంటిదే మరొక సంఘటన గురించి తెలుసుకుందాం!
భాగవతం ప్రకారం నవబ్రహ్మలలో ఒకరయిన పులస్త్యుని భార్య హవిర్భువు అని, ఆమె స్వయంగా కర్దమ ప్రజాపతి మరియు దేవహూతి లకు కలిగిన తొమ్మిది మంది కుమార్తె లలో ఒకటి అని చెప్పుకున్నాం!

కానీ వాల్మీకి రచించిన రామాయణం ప్రకారం పులస్త్యుని భార్య తృణబిందుని పుత్రిక.
రామాయణం ప్రకారం:
పులస్త్యుడు మేరు పర్వత ప్రాంతంలో తృణబిందు అనే ఆశ్రమ సమీపంలో నివసిస్తూ, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఆశ్రమ సమీపంలో ఉన్న వనంలో ఎప్పుడూ వసంతకాలంలా ఉండేది. ఆ ప్రకృతిని ఆస్వాదించటానికి వచ్చినవారు అక్కడ చేసే కోలాహలమునకు ఇతని తపస్సు భంగం అవుతూ ఉండేది. అలా కొంతకాలం భరించిన అతనికి సహనం నశించి ఆ స్థలమునకు వచ్చి ఎవరయినా అతని కంట పడితే ఆ స్త్రీ గర్భం ధరిస్తుంది అని శపించాడు. ఇతని శాపము తెలియని తృణబిందుని కుమార్తె ఒకసారి అలా వనంలో విహరిస్తూ ఇతని కంట పడింది. అప్పటి నుండి ఆమె శరీరంలో గర్భసూచనలు కనిపించసాగాయి.
ఈ విషయం తెలుసుకున్న తృణబిందు తన కుమార్తెను తీసుకుని పులస్త్యుని వద్దకు వచ్చి, తన కుమార్తెను అతనికి దానం చేసాడు. అలా గర్భం దాల్చిన ఆమెను పులస్త్యుడు వివాహం చేసుకున్నాడు.  గర్భం దాల్చిన ఆమె ఆ ఆశ్రమ వాతావరణంలో కాలం గడుపుతూ, వారు చదివే శాస్త్రములు వేదములు వింటూ ఉన్నది కనుక ఆ పుట్టిన బిడ్డకు విశ్రవసుడు అని పేరు పెట్టారు.
ఈ విశ్రవసుడు కూడా తన తండ్రికి వలెనే అత్యంత నిష్టా గరిష్టుడు. ఇతని ధర్మాచరణమును గురించి తెలుసుకొనిన భరద్వాజుడు తన కుమార్తెను ఈ విశ్రవసునకు ఇచ్చి వివాహం చేశారు. తరువాత వీరికి ఒక పుత్ర సంతానం కలుగగా ఆ బాలునికి వీరు వైశ్రవణుడు అని పేరు పెట్టారు. అతనే కాలాంతరంలో ధనాధిపతి కుబేరుడు గా మనకు సుపరిచితుడు. 

29, మార్చి 2020, ఆదివారం

భారతమును మహాభారతం అని ఎందుకు పిలుస్తారు?

 మనకు 18 పురాణములు, 18 ఉప పురాణములు ఉన్నాయి. వానిలో దేనికి "మహా" అనే సంబోధన మనకు కనిపించదు. కానీ ఒక ఇతిహాసముగా చెప్పబడుతున్న భారతమునకు ఈ విధమయిన సంబోధన కనిపిస్తుంది. మరి ఆ భారతము మహా  భారతం అవటానికి కారణం ఏమి  అయ్యి ఉంటుంది?
దీనికి సమాధానం మనకు మహాభారత తత్వకథనం లో దొరుకుతుంది.

ఏకత శ్చతురో వేదా భారతం చైత దేకత:
పురాకిల సురై స్సర్వై స్సమేత్య తులయా ధృతం

చతుర్భ్య స్సరహాస్యేభ్యో వేదోభ్యో హ్యధికం యదా
తదాప్రభృతి లోకేస్మిన్ మహాభారత ముచ్యతే

మహత్త్వేచ గురుత్వేచ ధ్రియమణం యతో ధికం
మహత్త్వా ద్భారవ త్త్వా చ్చ మహా భారత ముచ్యతే

భావం :  దేవతలు నాలుగు వేదములను భారతమును పరిశీలించి ఏది వీనిలో ఉన్నతమయినది అని నిర్ణయించవలసి వచ్చి  నప్పుడు, 108 ఉపనిషత్తులు కలిగిన వేదముల కంటే అర్ధము, గుణముల వివరణము, శబ్దముల ఆధిక్యము అన్ని కలిగిన ఈ భారతమే గొప్పది అని నిర్ణయించారు. అందువల్లనే భారతమును మహాభారతం అని సంబోధించుట పరిపాటి అయినది.  

28, మార్చి 2020, శనివారం

నవ శక్తులు

శక్తులను గురించి చెప్తున్నప్పుడు మన పెద్దలు తొమ్మిది శక్తుల గురించి చెప్తారు.
ఆ తొమ్మిది శక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం!!

  1. ఇచ్ఛాశక్తి 
  2. క్రియాశక్తి 
  3. ఉత్సాహశక్తి 
  4. ప్రభుత్వశక్తి 
  5. మంత్రశక్తి 
  6. సత్వశక్తి 
  7. రజశ్శక్తి
  8. తమోశక్తి 
  9. జ్ఞానశక్తి 




26, మార్చి 2020, గురువారం

శ్రీ మహ విష్ణువు బట్టలు పసుపు (పీతాంబరములు) గా ఎందుకు ఉంటాయి?

ఏదయినా విషయములు చెప్పే సమయంలో కవి ఎంతో సృజనాత్మకంగా, ఇంతకూ ముందు చెప్పినవారి కంటే భిన్నంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అలాగే పైన మనం చెప్పుకున్న ఆ ప్రశ్నకు సమాధానం వికటకవి గా పేరు పొందిన తెనాలి రామకృష్ణుడు తను రచించిన పాండురంగమహత్యం లో చాలా చక్కగా చెప్పాడు.

అభినవాయాతి తనపుత్రు నజుని గాంచి
సంతసంబున నాభివేశంత జలజ
ముబ్బి వెలిగ్రాయు పుప్పొడి యొరపు నెరపు
హళది పుట్టంబు కటిసీమ నలదువాని

భావం : అప్పుడే వచ్చిన తన పుత్రుడు అయిన బ్రహ్మ ను చూసి, విష్ణుమూర్తి నాభిలోని కమలం ఉబ్బితబ్బిబ్బు అయినదట. అలా తబ్బిబ్బు అవుతున్నప్పుడు ఆ కమలంలోని పుప్పొడి రేణువులు బయటకు చింది శ్రీ మహావిష్ణువు పంచె మొత్తం పడినవట.

బ్రహ్మదేవుడు  విష్ణు నాభి కమలంలో నుండి జన్మించాడు. కనుక పుత్రుని చుసిన సమయంలో జనకులకు అనందం కలుగుట సహజం. అలా ఆనందంలో ఉన్న సమయంలో చేతిలోవి జారిపోవుట సహజం. కానీ ఆలా జరుగుట వలన శ్రీ మహావిష్ణువు పంచె పసుపుగా మారింది అని చెప్పటం కవి హృదయం.  అందునా వికటకవి కనుక ముందే ఉన్నదానికి ఇలా ఒక కారణం చెప్తున్నాడు. అలంకార శాస్త్రంలో దీనిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. 

24, మార్చి 2020, మంగళవారం

కవి

ఈ మధ్య కాలంలో కలం పట్టిన ప్రతివాడు కవిని అని చెప్పుకుంటున్నాడు. కానీ మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం కవులు ఎన్ని రకాలు? ఆ విభజన ఏ విధంగా చేయవచ్చును అని తెలుసుకుందామా?
కవులను ఈ కింద చెప్పిన శ్లోకం ప్రకారం మూడు  రకాలుగా విభజించ వచ్చు



శాస్త్రకవిః కావ్యే రససంపదం విచ్చినత్తి
కావ్యకవిః శాస్త్రే తర్కకర్కశమప్యర్ధముక్తి
 వైచిత్ర్యేణ శ్లధయతి, ఉభయ కవి స్తూభయోరపి

వరీయాన్యదుభయత్ర పరంప్రవీణఃస్యాత్

పైన చెప్పిన శ్లోకం ప్రకారం కవులు మూడు రకములు.  వారు
శాస్త్ర కవి
కావ్య కవి
ఉభయ కవి


శాస్త్ర కవి : కావ్యములో రససంపదను చక్కగా వివరించగలవాడు
కావ్య కవి: శాస్త్రములలోని తర్కముల కి సంబందించిన కర్కశత్వమును విదిలి మ్రుదువుగ చెప్తారు
ఉభయ కవి: పైన చెప్పిన ఇద్దరు కవుల లక్షణములని కలిగి ఉంటారు