శ్రీకృష్ణ లీలలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీకృష్ణ లీలలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, అక్టోబర్ 2014, బుధవారం

నలకూబర, మణిగ్రీవులు- నారద శాపం

నలకూబర, మణిగ్రీవులు మహాదేవుని మిత్రుడయిన కుబేరుని పుత్రులు. వారి తండ్రికి కలిగిన ధనం వలన, తమతండ్రి మహాదేవుని మిత్రుడు అనే భావం వలన వారికి గర్వం అతిశయించినది. ఒకనాటి సమయమందు వారిద్దరూ తమ తమ ప్రియురాళ్ళతో కలిసి, గంగానదిలో వివస్త్రులై  జల క్రీడలు ఆడుతూ తమను తాము మరచిపోయారు. అటువంటి సమయంలో నారద మహర్షి అటు వైపుగా రావటం చూసిన స్త్రీలు వెంటనే సిగ్గుతోవెళ్లి తక్షణం బట్టలు ధరించి చేతులు జోడించి, నారదునకు నమస్కారం చేసారు.
కానీ మధ్యంమత్తు కారణంగా నలకూబర, మణిగ్రీవులు తమ శరీరము మీద స్పృహ లేకుండా ఉన్నారు. తమ శరీరం వివస్త్రంగా ఉన్నది అనే విషయంకూడా మరచి నారదునికి అలాగే నమస్కరించారు. అప్పుడు నారదుడు వారిని 100 దివ్య సంవత్సరముల పాటు భూలోకంలో మద్ది వృక్షములుగా ఉండమని శపించారు.
source: internet
అప్పుడు వారు తమ తప్పును గ్రహించి శాప విమోచనం చెప్పమని కోరగా బాల కృష్ణుని పాదముల స్పర్శ ఏనాడు వీరికి కలుగుతుందో నాడు వీరి నిజరూపం తిరిగి పొందగలరు అని, కారణంగా సర్వలోకములయందు మిక్కిలి కీర్తి గడించగలరు. అని చెప్పి నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

విశ్లేషణ:
యౌవ్వనం, ధన సంపత్తిః ప్రభుత్వం అవివేకితా 
ఏకైకమాప్యనర్దాయ, కిము యత్ర చతుష్టయం
ఇది కాదంబరిలోని ఒక ముఖ్యమైన శ్లోకం. దీని అర్ధం 
యౌవ్వనం, ధనం, అధికారం మరియు మూర్ఖత్వం నాలిగింటిలో ఒక్కటి ఉన్ననూ అత్యంత అనర్ధం కలుగుతుంది, కానీ నాలుగూ ఉన్నట్లయితే ఇక ఏమి చెప్పాలి అని
ఇక్కడ నలకూబర, మణిగ్రీవులకు పైన చెప్పిన నాలుగునకు తోడు తాగిన మధిర, ప్రక్కన మగువ కూడా ఉన్నారు. అందుకని వారికి ఏమి చేస్తున్నామో కూడా తెలియలేదు
 ఇక్కడ వ్యాస భగవానుని రచనా విశిష్టత గురించి చెప్పుకోవాలి. నారదుడు సమయమునకు అక్కడకు ఎందుకు వచ్చాడు అనే దానికి "యదృచ్ఛయా" అని వాడారు. అంటే దైవ ఘటన చేత ప్రేరేపించబడిన వాడు అని వైదికమైన అర్ధం చెప్తారు
నలకూబర, మణిగ్రీవులు తనను అవమానించారు అనే దానికంటే వారికి హితమును తెలియచెప్పాలి అని నారద మునీంద్రుడు భావించాడు. కనుక వ్యాసులవారు సమయమందు "అనుగ్రహార్థాయ శాపం దాస్యన్న్ ఇదం జగౌ" అని చెప్పారు. అంటే వారిమీది అనుగ్రహం వలన వారికి శాపం ఇచ్చారు కానీ కోపంతో కాదు. ఈ సందర్భంలో పోతన భాగవతంలో మరింత అందంగా చెప్పారు. మనం ప్రాస్తుతం వాడుతున్న పదజాలం చక్కగా మొదట ప్రయోగించినది పోతనగారే అని ఈ పద్యం చదివిన తరువాత మనకు అనిపించక మానదు. 

కలవాని సుతులమనుచు 
గలకంఠులతోడగూడి కానరు పరులం 
గలలొనైనను వీరికి 
గల క్రోవ్వడగించి బుధులగలపుట యొప్పున్. 
కనుక వారికి గల క్రొవ్వును(పొగరు/అతిశయించిన గర్వం) తీసేసి/ తొలగించి వారిని మంచివారిలో కలుపుట అవసరం అని భావించి శపించారు. కనుకనే బాలకృష్ణుని పాద స్పర్శ కలుగగానే  సర్వలోకములందు కీర్తి కలవారు అవుతారు అని చెప్పారు. 

11, జులై 2014, శుక్రవారం

శ్రీకృష్ణుడిని కొడుకుగా లాలించగలగటానికి నoద యశోదలు ఏమి పుణ్యం చేసారు?

శ్రీకృష్ణుడిని కొడుకుగా లాలించగలగటానికి నoద యశోదలు ఏమి పుణ్యం చేసారు?

అష్ట వసువులలో ప్రధానుడు ద్రోణుడు, అతని భార్య ధర.

 శ్రీమన్నారాయణుడు భూలొకంలో అవతరిoచబోతున్నాడు కనుక సర్వ దేవతలు, ఋషులు భూమిపై  పుట్టాలి అని బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు అందరు దేవతలు సరే అని చెప్పి వెళ్ళిపోయారు కానీ ద్రోణుడు, ధర మాత్రం ఇంకా అక్కేడే ఉన్నారు. వారిని చుసిన బ్రహ్మ దేవుడు ఏమి మీకోరిక అని అడుగగా వారు ఆ పరమాత్మను తమ బిడ్డగా సేవిస్తూ అతని అన్ని బల్యోపచారాలను ఆనుభవిస్తూ ఆ పరంధాముని పై అమిత భక్తీ కలిగి తమ అన్ని జన్మల దుర్గతులనూ పోగొట్టుకోవాలని అనుకుంటున్నాం అని చెప్పారు. వారి మాటలు విన్న బ్రహ్మ వారి మాటలలోని ఆర్ద్రత చూసి అలాగే అని చెప్పారు.  ఆ ద్రోణుడు నందునిగా, అతని భార్య ధర యశోదగా జన్మించారు.

ఐతే వీరు ఆ పరమాత్మను తమకు జన్మించాలీ అని కోరలేదు, కేవలం అతని బాలోపచారాలను చేయాలి అని కోరుకున్నారు కనుక దేవకీ వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు నంద వ్రజానికి వచ్చి నంద యశోదలకు పుత్రునిగా పెరిగాడు. 

5, జులై 2014, శనివారం

శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవులకే ఎందుకు జన్మించాడు?

దేవకి, వసుదేవుడు మూడు  జన్మలు ఆ శ్రీహరిని పుత్రుని గా పొందారు.

వారు పృశ్ని,సుతప ప్రజాపతి గా జన్మించినప్పుడు వారి వివాహం అయిన కొద్ది కాలానికే తపస్సు మొదలు పెట్టారు. 4 యుగాల పాటు తీక్షణమైన తపస్సు చేసారు. వారికి శ్రీహరి ప్రత్యక్షo ఐనప్పుడు వారు శ్రీహరి వంటి బిడ్డ తమకు కావాలని కోరారు. శ్రీహరి అలాగే అన్నారు. కాని తనవంటి వాడు ఇంకొకడు లేడు కనుక తానే స్వయంగా వారికి జన్మించాడు.

మొదటి జన్మలో శ్రీహరి వారి కి జన్మించారు. ఆ జన్మలో అతనిని పృశ్నిగర్భుడు అన్నారు.

రెండవ జన్మలో కశ్యప ప్రజాపతి, అదితి లకు ఉపేంద్రుని గా జన్మించాడు. అతనినే మనం వామనుని గా చెప్తున్నాం.
మూడవ జన్మ లో దేవకి, వసుదేవుడు లకు శ్రీ కృష్ణుడి గా జన్మించారు.

ఐతే జన్మించి నప్పుడు 3 జన్మలలో తను నిజరూపం తోనే జన్మించారు. పీతాంబరం, శంఖ, చక్ర , గధ, పద్మములతో జన్మించారు. వారు తమకు జన్మించమని కోరారు కనుక తానూ జన్మించారు. కానీ  తన బల్యోపచారాలను వారు కోరలేదు  కనుక వామన అవతారం లో వెంటనే వడుగు వయస్సు కలవానిగా మారిపోయారు. ఇక శ్రీ కృష్ణ అవతారం లో నందుని ఇంటికి చేరారు. 

17, జూన్ 2014, మంగళవారం

శ్రీకృష్ణ లీలలు

తెలుగు వారిలో శ్రీకృష్ణ లీలలు గురించి కనీసం ఒక్క సారి కూడా వినని వారు ఉంటారంటే నమ్మలేని విషయమే.

ఆ చిన్ని కృష్ణుని లీలలు, వాని వెనుక ఉన్న తత్వాన్ని ఆవిష్కరించే చిన్న ప్రయత్నానికి ఆ కృష్ణుని కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను.


  1. అవతార కారణం (శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవులకే ఎందుకు జన్మించాడు?)
  2. యమునా నది దాటటం 
  3. మహామాయ 
  4. పూతన సంహారం 
  5. శకటాసురభంజనం 
  6. త్రుణావర్తుడు 
  7. దామోదర లీల 
  8. అఘాసురుడు 
  9. కౌమార, పౌగండ లీల 
  10. పాలు వెన్న దొంగిలించుట 
  11. కాళియ మర్దనం 
  12. గోవింద పట్టాభిషేకం
  13. రాసలీల