వంశవృక్షం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వంశవృక్షం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, అక్టోబర్ 2014, సోమవారం

మరీచి - కళ

మరీచి బ్రహ్మ పుత్రుడు, నవ బ్రహ్మలలో ఒకడు. కళ దేవహుతి, కర్దమ ప్రజాపతుల పుత్రిక. వీరికి పుత్రుడు కశ్యపుడు, పుత్రిక పౌర్ణమి.
ఈ పౌర్ణమి అనే పుత్రిక మరుజన్మలో గంగాదేవిగా జన్మించినది.
కశ్యపుడు ఈ సమస్త సృష్టికి మూల కారణం అయినాడు. ఇతను 13 మంది దక్షుని పుత్రికలను వివాహం చేసుకున్నారు. 

17, అక్టోబర్ 2014, శుక్రవారం

నిమి - జనకవంశం

నిమి ఇక్ష్వాకు పుత్రుడు. సూర్యవంశస్థుడు. ఒకనాడు నిమికి సత్రయాగం ప్రారంభించవలెను అనే కోరిక పుట్టినది. తమ కులగురువైన వసిష్ఠ మహర్షి వద్దకు వెళ్లి యాగం తనతో చేయించమని అడిగాడు. కానీ అప్పటికే వసిష్ఠమహర్షి ఇంద్రునిచే ఒక యాగం చేయిస్తాను అని ఒప్పుకున్నాడు కనుక దేవలోకమునకు వెళ్లి ఇంద్రునిచే యాగం పూర్తీ చేసి తిరిగి వచ్చిన తరువాత సత్రయాగం చేస్తాను అని చెప్పాడు.
కానీ మానవజీవితం అల్పం అని తెలుసు కనుక నిమి తన సమ్కలపమును విరమించుకోకుండా , మరికొందరు ఋత్విక్కులను సమకూర్చుకుని తన యాగము మొదలుపెట్టాడు.
ఇంద్రుని యాగామునకు వెళ్ళిన వసిష్ఠుడు తన శిష్యుడు తలపెట్టిన సత్రయాగామును తలచుకుని ఇంద్రయాగం అయిన వెంటనే అతి వేగంగా వెనుదిరిగి వచ్చాడు. అప్పటికే నిమి మరికొందరు ఋత్విక్కులతో యాగం మొదలుపెట్టుట చూసి, నిమి తనను అవమానించాడు అని భావించాడు. తిన్నగా నిమిని కలుద్దామని అతని వద్దకు వెళ్ళబోగా ద్వారపాలకులు అడ్డుకున్నారు. అసలే కోపంగా ఉన్న వసిష్ఠుడు మరింత కోపించి నిమి మరణించుగాక అని శపించాడు. ఐతే అసలు కారణం విచారించక ఒక గురువయ్యుండి కూడా తన కోపం మీద తనకే నియంత్రణ లేక  అతను  చేసిన పనికి నిమి కూడా అతని గురువయిన వసిష్ఠుని మరణించమని శపించారు
కాలాంతరంలో వసిష్ఠుడు తిరిగి మిత్రావరుణు వలన అప్సరస ఐన ఉర్వసికి జన్మించాడు
ఐతే వసిష్ఠుని శాపంవలన నిమికూడా శరీరం వదిలాడు. ఐతే మొదలుపెట్టిన సత్రయాగం మధ్యలో ఆపుట సరి అయినది కాదు కనుక నిమి దేహమును అనేక రసాయనములతో పూతపూసి పాడవకుండా జాగ్రత్తచేశారు. సత్రయాగం పూర్తి  చేసారు. యాగం చివరి భాగంలో దేవతలు సంతోషించి వరములను ఇచ్చుటకు సంసిద్ధులవగా   ఋత్విక్కులు నిమిని బ్రతికించమని కోరారు. దేవతలు కూడా అతనిని బ్రతికించుటకు సిద్ధపడారు. కానీ నిమి తిరిగి తన దేహమును పొందుటకు అంగీకరించలేదు.    
నిరంతరం మోహం, అహంకారం, సుఖం, దుఃఖం అనే గుణములకు లోనవుతూ అశాశ్వతమైన దేహం నాకు తీసుకొనుట ఇష్టం లేదు  అని చెప్తున్నా నిమిని చూసి, దేవతలు ఋత్విక్కుల కోరిక కాదనలేనిది, అలాగే నీ కోరిక కూడా. అందరి కోరికలు తీరే విధంగా సర్వప్రాణులు కన్నులు ముసితెరచే ప్రక్రియగా నీవి జీవించెదవు గాక ని దేవతలు నిమికి వరమును ఇచ్చారు
ఐతే ఇప్పుడు నిమియొక్క రాజ్యభారమును వహించుటకు రాజులేడు. ఒక రాజ్యం రాజులేకుండా ఉండకూడదు కనుక వారు భద్రపరచిన నిమి దేహమును మధించగా ఒక పుత్రుడు జన్మించెను
  1. ప్ర్రాణములేని దేహంనుండి జన్మించాడు కనుక అతనిని వైదేహుడు అన్నారు
  2. మధించుటచేత జన్మించాడు కనుక అతనిని మిధులుడు అనికూడా పిలిచారు. ఇతనిచే నిర్మించబడిన నగరమే మిధిలా నగరం
  3. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించాడు కనుక జనకుడు అన్నారు 

విధంగా సూర్యవంశం నుండి జనకవంశం ప్రారంభం ఐనది

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

నాభాగుడు

నాభాగుడు నభగుని పుత్రుడు. సూర్య వంశమునకు చెందినవాడు.
ఇతను మెతకగా ఉండుట చూసి, ఆ అవకాశమును వినియోగించుకుంటూ అతని సోదరులు అతనికి ధనమును ఇవ్వకుండా ఉండిరి. తనకు తన భాగమును ఇప్పించ వలసినదిగా అన్నలను కోరగా, అప్పుడు అన్నలు తమ తండ్రి అయిన నభగుడు చెప్పినట్లయితే అతనికి అతని వాటా ఇస్తాం అని చెప్పారు. అప్పుడు నాభాగుడు తండ్రివద్దకు వెళ్లి, ఈ వృత్తాంతం చెప్పి, ఏమి చేయవలసినది అని తండ్రిని అడిగాడు.
అప్పుడు నభగుడు,  ఆ సమయంలోఅత్యంత జ్ఞానులయిన అంగిరసులు సత్రయాగం చేస్తూ ఉన్నారని, ఆ యాగంలో వారికి ఆ యాగం చేసే 6వ రోజున విస్వేదేవతలకు చేసే సూక్తులు జ్ఞాపకమునకు రావు కనుక నాభాగుని అక్కడ వెళ్లి వారికి ఆ సూక్తులను గుర్తు చేయమని చెప్పాడు. అలా గుర్తు చేసినందువలన బ్రహ్మజ్ఞాని అని లోకం నాభాగుని కీర్తిస్తుంది అని,అలా చేయుట వలన ఆ యాగం చివర మిగిలిన ధనమును నాభాగునకు ఇస్తారు అని కూడా చెప్పి నాభాగుడిని అక్కడకు పంపించాడు.
నాభాగుడు తండ్రికి నమస్కరించి ఆ యాగామునకు వెళ్లి తన తండ్రి చెపిన విధంగా అంగిరసులకు వారు మరచిపోయిన సూక్తులను గుర్తు చేసాడు.అప్పుడు  ఆ అంగిరసులు ఆ యాగంలో మిగిలిన ధనమును అతనికి ఇచ్చాం అని చెప్పి వారు స్వర్గమునకు వెళ్ళిపోయారు. అతనికి అలా లభించిన ఆ ధనమును తీసుకొనుటకు నాభాగుడు వెళుతుండగా, ఒక నల్లని సుందరమైన ఆకారం కలిగిన ఒక యువకుడు ఆ ధనమును తన  చేసుకొనెను.
అప్పుడు నాభాగుడు తనకు అంగిరసులు ఆ ధనమును ఇచ్చినారు కనుక ఆ ధనమును తిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు అతను ఒకవేళ నీ తండ్రి అయిన నభగుడు ఈ ధనమును నీకు ఇవ్వమని చెప్పినట్లయితే ఇస్తాను కనుక నీవు వెళ్లి నీ తండ్రిని అడిగిరా! అని చెప్పి పంపెను.
నాభాగుడు నభగుని వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా, నభగుడు జరిగిన విషయమును తన మనోనేత్రంతో చూసి ఆ యాగం చేసిన బ్రాహ్మణులు ఆ యాగంలో మిగిలిన భాగమును మహాదేవుడయిన శివునకు ఇస్తాం అని సంకల్పించారు కనుక ఆ భాగం శివునకు మాత్రమే చెందుతుంది అని తీర్పు చెప్పి నాబాగుని పంపించాడు.
తిరిగి వచ్చిన నాభాగుడు తన తండ్రి చెప్పిన విషయమును యధాతధంగా చెప్పి, ఆ భాగం మీద తనకు ఏవిధమైన హక్కులేదని చెప్పాడు.
నాభాగుని సత్య సంధతకు సంతోషించిన శివుడు ఆ యజ్ఞ భాగమును నాభాగునకు ఇచ్చి, అతనికి సనాతనమైన బ్రహ్మజ్ఞానమును ఉపదేశించి  వెనుతిరిగి వెళ్ళాడు. కాలాంతరంలో నాబాగునకు అంబరీషుడు జన్మించాడు.
వ్యాసమహర్షి నాబాగుని ఈ చరిత్రకు ఫలశృతి కూడా చెప్పారు.
ఎవరైతే శ్రద్దగా ఈ నాభాగుని వృత్తాంతం ప్రతిరోజూ చదువుతారో/ వింటారో/ పారాయణం చేస్తారో వారు జ్ఞానమును పొందుతారు, మరణానంతరం ముక్తిని పొందుతారు.

నా ఆలోచన:
మన పూర్వులు ఇటువంటి కధలను చాలా చెప్పారు. కొన్ని కధలకు ఫలశృతి కూడా చెప్పారు. అయితే  ఆ ఫల శృతి  ఆ కధను మరలా మరలా చదివేలా చేయాలి అని చెప్పి ఉన్నారు. అలా ఎందుకు? మరి ఈ కధకు ఈ ఫలశృతి ఎందుకు చెప్పారు?

  1. నాభాగుడు తన సోదరులు తన సొమ్మును బలవంతముగా తీసుకున్నపుడు ఏమి ఎదురు చెప్పలేదు, పైగా వెళ్లి వారిని మెల్లిగా అడిగాడు. మనం సహజంగా మన సంపదను ఎవరైనా తీసుకున్తరేమో అనే అనుమానం వస్తేనే వారి మీద గొడవకు దిగుతాం. 
  2. నాభాగుని అతని సోదరులు తండ్రిని అడిగి రమ్మనగానే, తన ఆస్తి మీరు తీసుకుని నన్ను తండ్రిని అడుగమంటారేమిటి అని విసుగును ప్రదర్శించలేదు. 
  3. తీరా తండ్రి వద్దకు వెళ్లి అడిగితే  అన్నలకు చెప్పి నీ ఆస్తి నీకు ఇప్పిస్తాను అని చెప్పకుండా, యాగమునకు వెళ్లి దానం తేసుకో అని చెప్పాడు. మరి ఒక తండ్రిగా అది తప్పుకాదా! ఒకసారి ఆలోచించండి, అన్యాయం చేసిన వారు, పొందినవారు కూడా తన పుత్రులే. కానీ కొందరు అన్యాయ మార్గంలో ఉన్నపుడు వారి తప్పును అలా ఒకేసారి చూపిస్తే వారు మరింత అన్యాయులుగా మరే అవకాశం ఉంటుంది. కనుక అన్యాయమునకు గురి అయిన నాభాగుని అతని విద్యాను ఉపయోగించి అతని ధనమును స్వయంగా సంపాదించుకునే మార్గం చెప్పి, కేవలం ధనమే కాకుండా బ్రహ్మజ్ఞాని అనే బిరుదు కూడా పొందగలవు అని చెప్పి పంపాడు.  
  4. మరి అంగిరసులు నాభాగునకు ఇచ్చిన అదే భాగమును ఋత్విక్కులు శివునకు ఎందుకు ఇచ్చారు? ఆ భాగమును ఎవరికైనా ఇవ్వటానికి ఎవరికి అధికారం ఉంటుంది? మనం ఒక బ్రాహ్మణుని యాగామునకు పిలిచి ఆ యాగమునకు కావలసినవి అన్నీ  సమకూర్చి వారికి అప్పగిస్తాం. అంటే ఆక్షణం నుండి ఆ వస్తు,ధనముల మీద ఆ బ్రాహ్మణులకే అధికారం ఉంటుంది. కనుక ఆ భాగమును దానం చేసే అధికారంకూడా ఋత్విక్కులకే ఉంటుంది. 
  5. శివుడు ఈ భాగం నాదే నీకు చెందదు అని స్వయంగా చెప్పకుండా నభగుని అడిగిరమ్మని ఎందుకు చెప్పాడు? ఒక కొడుకు తప్పు చేసే సమయం అని తెలిసినప్పుడు అతనిని సరిదిద్దే మొదటి అవసరం, భాద్యత తండ్రికి ఉండాలి. పైగా అక్కడ వచ్చే ధనమును తెచ్చుకోమని సలహా ఇచ్చిన వాడు నభగుడే. కనుక నభగుడు జరిగిన సంగతి తెలుసుకుని నాభాగునకు చెప్తేనే అది బాగుంటుంది. 
  6. అసలు ఏమిటి ఈ కధ? మనం మన మనస్సునందు ఈవిధమైన దురాలోచనలు లేకుండా, పెద్దలు చెప్పిన పనిని చేస్తూ ఉంటే మనకు చెందవలసిన సొమ్ము, పేరు, ప్రతిష్టలు మనను చేరి తీరుతాయి. ఒక్కసారి దానం మీది ఆశతో నాభాగుడు అబద్దం చెప్తే పరమశివుడు  అతనికి ఆ ధనమును తిరిగి ఇచ్చే అవకాశం ఉండేది కాదు కదా!
  7. మరి ఆ ఫలశృతి? ఈ కధను ప్రతిరోజూ చదవటం/ వినటం అంటే ప్రతిరోజూ గుర్తు చేసుకోవటం. అంటే మన మనస్సులలో ఈ కద నిలచిపోతుంది. ఒకవేళ మనకు ఎవరితో అయినా గొడవ పడవలసిన సందర్భం ఎదురయినప్పుడు మన మనస్సు ఆ గొడవ పడకుండా ఆపుతుంది. అప్పుడు మన మనస్సు మన ఆదీనంలో ఉండి విచక్షణా శక్తి ని కోల్పోకుండా ఉంటుంది. మరి అదేకదా జ్ఞానం అంటే. 
  8. జీవితాంతం మనం ఈ కధను స్మరిస్తూ ఉంటే జీవితంలో మనం చేసే తప్పులు గణనీయంగా తగ్గుతాయి కనుక మోక్షం కూడా లభించవచ్చు. 

29, సెప్టెంబర్ 2014, సోమవారం

పృషద్ధ్రుడు

పృషద్ధ్రుడు వైవస్వత మనువు యొక్క పుత్రుడు. అంటే సూర్య వంశస్థుడు.
విద్యాభ్యాసం చేస్తున్న సమయలో ఒకరోజు పృషద్ధ్రుడు ఆవుల మందను తీసుకుని అడవులకు వెళ్ళగా, పెద్ద వర్షం ప్రారంభం అయినది. అప్పుడు అతను ఆ ఆవులను అన్నింటిని ఒకచోటికి చేర్చి వాటిని అన్ని వైపుల నుండి కాపాడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక పులి ఆ మందలో ఉన్న ఆవులపై దాడి చేసినది. ఐతే విపరీతమైన చీకటిగా ఉండుటవలన అతనికి ఆ ఆవుల మంద మధ్యలో పులి ఎక్కడ ఉన్నదో తెలియలేదు. కానీ సాహసవంతుడై తన కత్తిని తీసి తను పులిగా భావిస్తున్న జంతువును మెడమీద ఒక్క దెబ్బ వేసాడు. అయినా పులి గాండ్రింపు వినిపిస్తూనే ఉండుట విని రెండవసారి తన కత్తిని బలంగా ప్రయోగించాడు. ఈసారి ఆ జంతువు తల త్రెగి ప్రక్కన పడినది.
వర్షం తగ్గగానే తను  నరికిన తల ఒక ఆవుది  అని తెలుసుకుని తమ కుల గురువయిన వసిష్టుని వద్దకు వెళ్లి జరిగినది చెప్పాడు. గోహత్యా పాపం అత్యంత ఘోరమైనది కనుక పృషద్ధ్రుడు క్షత్రీయత్వమునకు అనర్హుడని, చండాలునిగా ఉండమని శపించాడు. 
అలా శాపం పొందిన పృషద్ధ్రుడు గురువుగారి అజ్ఞ తీసుకుని అరణ్యములకు వెళ్ళాడు. అక్కడ అన్ని జీవులయందు సమదృష్టి కలిగి, పిచ్చి వాని వలే  ఈ విధమైన కోరికలు లేకుండా, ఏది దొరికితే అది తిని కాలం గడిపి చివరకు అరణ్యములో పుట్టిన దావానలం లో చిక్కుకుని తన ప్రాణములను వదిలాడు. 

20, సెప్టెంబర్ 2014, శనివారం

అధర్మం వంశవృక్షం

ఇంతకు ముందు ధర్ముని భార్యల గురించి వారి సంతానమును గురించి చెప్పుకున్నాం కదా! మరి అధర్మం సంగతి? అది ఈ రోజు చెప్పుకుందాం! భాగవతం లో మరొక విచిత్రమైన విషయం చెప్పారు. ఈ అధర్మ వంశం గురించి కల్కి పురాణంలో కూడా చెప్పారు. 
అధర్ముడు స్వయంగా బ్రహ్మ కు పుత్రునిగా జన్మించాడు.
అధర్మునకు భార్య అబద్దం. వీరి సంతానం దంబం(ఇప్పుడు దబాయించుట అంటున్నాం!) అనే పుత్రుడు, మాయ అనే పుత్రిక.
పుత్రికను నిరృతి (అసలు సత్యం అంటే తెలియని వాడు) చేపట్టాడు. వారికి లోభుడు, నికృతి (తిరస్కారం) జన్మించారు.
లోభుడు, నికృతి వివాహం చేసుకోగా వారికి క్రోధము, హింస జన్మించారు.
క్రోధం, హింస వివాహం చేసుకొనగా వారికి కలి, నింద జన్మించారు.
కలి, నింద  వివాహం చేసుకోగా వారికి భయము. మృత్యువు జన్మించారు
భయం, మృతువు వివాహం చేసుకోగా వారికి యాతన మరియు నరకము పుట్టిరి.

నా ఆలోచన:
ఇక్కడ పెద్దగా విశ్లేషించ వలసిన పని లేదు కదా! అంతా చక్కగా చెప్పారు.
మనిషిలోనికి ఎప్పుడయితే అధర్మం ప్రవేశిస్తుందో అప్పుడు అబద్దం బయలుదేరుతుంది. అవి రెండూ రాగానే ఎదుటివానికి మాయమాటలు చెప్పుట, వారిని దబాయించుట చేస్తాం! అప్పుడు వానితో పాటుగా ఎదుటి వారు చెప్పే విషయాలను తిరస్కరిస్తూ ఉంటాం. లోభం కూడా ప్రారంభం అవుతుంది.
దాని ఫలితంగా క్రోధం మనస్సులో స్థానం సంపాదించుకుంటుంది. ఆ క్రోధం హింసను ప్రోత్సహిస్తుంది. దానిద్వారా ఇతరులను నిందించాలన్న ఆలోచన మొదలవుతుంది. అక్కడి నుండి నన్ను ఎవరైనా చంపేస్తారేమో అనే భయం మొదలవుతుంది. దానిని మించిన నరకము. యాతన ఉండవు కదా!

పైన చెప్పినవి అన్నీ  మనలోని విషయములే తప్ప అధర్ముడు అనే ఒక వ్యక్తికి అబద్దం అనే భార్య అని చదువుకుంటే అది పై విషయాన్ని అన్వయించుకునే విషయంలో మనకు ఎంతో జుగుప్సాకరంగా ఉంటుంది. పూర్వికులకు ఒక కధలా చెప్పటం అలవాటు కనుక మనకు అర్ధం అవటానికి ఇలా ఆ భావనల మధ్య అనుభందాలను చూపాలని చేసిన చిన్న ప్రయత్నం అని నా అభిప్రాయం.