భర్తృహరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భర్తృహరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మార్చి 2022, గురువారం

విద్వత్పద్ధతి - 1

 మనం ఇంతకుముందు భర్తృహరి సుభాషితములలో మూర్ఖ పద్దతి గురించి చెప్పుకున్నాం! ఇప్పటి నుండి విద్వత్పద్ధతి గురించి తెలుసుకుందాం!

శాస్త్రోపస్కృతశాబ్ధసుందరగిరః శిష్యప్రదేయాగమా

విఖ్యాతాః కవయో వసంతి విషయే యస్య ప్రభోర్నిర్ధనాః

తజ్జాడ్యం వసుధాధిపస్య సుధియ స్త్యర్ధం వినాపీశ్వరాః

కుత్స్యాః స్యుః కుపరీక్షకైర్న మణయో యైరర్ఘతః పాతితాః

అర్ధం:

శాస్త్ర గిరం = శాస్త్రములచే, ఉపస్కృత = సంస్కరింప బడిన, శబ్ధ = శబ్ధములచే, సుందర= అందమయిన, గిరః = వాక్కులు గలవారు, శిష్య = శిష్యులకు, ప్రదేయ= ఈయదగిన, చెప్ప గలిగిన, నేర్పగలిగిన, ఆగమాః = శాస్త్రములు కలవారు, విఖ్యాతాః = ప్రసిధ్ధులు నగు, కవయః = పండితులు, నిర్ధనాః= ధన హీనులై, యస్య = ఏ, ప్రభోః = రాజు యొక్క, విషయే = దేశమునందు, వసన్తి = ఉంటారో, తత్= అది, వసుధాధిపస్య= రాజు యొక్క, జాడ్యం= మౌఢ్యము, సుధియస్తు= బుధిమంతులన్ననో, అర్ధం= ధనము, వినాపి=  లేకయే, ఈశ్వరాః = సమర్ధులు, మణయః = రత్నములు, యైః= ఏ, కుపరీక్షకైః = పరీక్ష చేయడం తెలియక, అర్ఘతః = అర్హమయిన వెల, పాతితాః = తక్కువ చెప్పినా, తే= వారు, కుత్స్యాః = తగ్గిన విలువ, మణయః= రత్నములు, న= కావు 

తాత్పర్యంః

వ్యాకరణాదిశాస్త్ర పఠనముచేతనిర్ధుష్టముగను మనోహరముగాపలుకుతూ విధ్యార్ధులకు శాస్త్రంబుల బొధించుచు సుప్రసిధ్ధులయిన పండితులు ఏ రాజు దగ్గర అయినా ధనవిహీనులయి ఉంటే అది ఆ ప్రభువు/ రాజు తెలివి తక్కువ తనమును మాత్రమే తెలుపుతుంది. ఒక రత్నముల గురించి జ్ఞానములేని వర్తకుడు అమూల్య రత్నమునకు తక్కువ వెల చెప్పినందువలన ఆ రత్నమునకు ఉన్న విలువ తగ్గిపోదు కదా!

ఈ శ్లోకమునకు తెలుగు పద్యం

సకలకళా విభూషితులు శబ్ధవిదుల్ నయతత్వబోధకుల్

ప్రకటకవీంద్రు లేనృపతి పజ్జను నిర్ధనులై చరింతు రా

వికృతపుజాడ్య మాదొరది విత్తము లేకయ వారు పూజ్యులం

ధకజనదూషితంబులు ఘనంబులు గావె యంమూల్యరత్నముల్

26, ఫిబ్రవరి 2022, శనివారం

మూర్ఖుని సంతోష పెట్టడం కుదురుతుందా!

 మనం ఇంతకు  ముందు భర్తృహరి సుభాషితాలలో మూర్ఖపద్ధతి గురించి, మూర్ఖుని మనస్సు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మరొక శ్లోకం చూద్దాం!

లభేత సికతాసు తైలామపి యత్నతః పీడయన్

పిబేచ్చ మృగతృష్ణి కాసు సలిలం పిపాసార్ధితః

కదా చిదపి పర్యటన్ శశవిషాణమాసాదయే

న్నతు ప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తమారాధయేత్


అర్ధం ః  యత్నతః = ప్రయత్నమువలన, సిక తాసుఅపి= ఇసుక నుండి కూడా, తైలం= నూనెను, లభేత = పొందవచ్చును, పిపాస = దాహం వలన, అర్ధితః = నీటిని కోరుకునేవానికి, మృగతృష్ణికాసు = ఎండమావులలో, సలిలం = నీటిని, పిబేత్= త్రాగవచ్చును, పర్యటన్= బాగా తిరిగి తిరిగి, కదా చిదపి= ఒకానొక సమయంలో, శశ = కుందేలు, విషాణం = కొమ్ము, ఆసాదయేత్= పొందవచ్చు, ప్రతినివిష్ట = మొండిపట్టు పట్టిన, మూర్ఖ జన = ముర్ఖుల, చిత్తం=మనస్సును, ఆరాధయేత్= మెప్పించడం, న = కుదరదు. 

తాత్పర్యంః

ప్రయత్నంచేసి ఇసుక నుండి కూడా చమురు/ నూనెను తీయ్యవచ్చు, బాగా దాహంగా ఉన్నప్పుడు ఎండమావిలోని నీటిని త్రాగ వచ్చు, ప్రపంచం మొత్తం తిరిగి తిరిగి కుందేటికొమ్మును కూడా సాధింపవచ్చు కానీ మూర్ఖుని మనస్సును ఎవ్వరూ సమాధాన పరచలేరు.

 ఇదే శ్లోకమునకు తెలుగు అనువాదం 

తెలుగు అనువాదం

తివిరి ఇనుమున దైలంబు దీయవచ్చు

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు

దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు

జేరి మూర్ఖులమనస్సు రంజింప రాదు

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

మూర్ఖుని మూర్ఖత్వానికి మందు

మనం ఇంతకు ముందు మూర్ఖ పద్దతి అనే శీర్షిక పై కొన్ని శ్లోకములు చెప్పుకున్నాం! ఇప్పుడు మనం ఆ ముర్ఖుని మూర్ఖత్వమునకు మందు అనేది ఉన్నదా లేదా అనే విషయం చూద్దాం!

సంస్కృత శ్లోకం

శక్యో వారయితుం జలేన హుతభుక్ఛత్రేణ సూర్యాతపో

నాగేంద్రో నిశితాఙ్కు శేన సముదో దణ్డేన గౌర్గర్దభః,

వ్యాధిర్భేషజసఙ్గ హైశ్చ వివిధైర్మన్త్రప్రయోగైర్విషం

సర్వస్యౌషధమస్తి శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్త్యౌషధం

అర్ధంః 

శక్యః = భరించగలిగిన, సూర్య తపః = సూర్యుని ఎండ, చత్రేణ = గొడుగుతో, హుతభుక్ = నిప్పు, జలేన = నీటిచేత, సమదః = బాగా మదంతో ఉన్న, నాగేంద్ర = ఏనుగు, నిశిత = వాడియగు,  అంకుశేన = అంకుశము చేత, గౌః = ఎద్దు, గార్ధభః = గాడిద, దండేన = కర్రతో, వారయితుం = వారించుట, శక్యః =  వీలగును, వ్యాధిః= రోగము, భేషజ = మందులను, సంగ్రహ = తీసుకొనుట, చ= వలన, విషం = విషము, వివిధైః = అనేక రకములయిన, మంత్ర = మంత్రముల, ప్రయోగైః = ప్రయోగముల వలన, సర్వస్వ= అన్నింటికీ, శాస్త్ర= శాస్త్రములలో,  విహితం= విధించబడిన, ఔషదం= మందు, అస్తి= కలదు, మూర్ఖస్య= మొండి వానికి, నాస్తి= లేదు.

అదే శ్లోకమునకు తెలుగు పధ్యంః

జలముల నగ్ని చత్రమున జండమయూఖుని దండతాడనం

బుల వృషగర్ధభంబులను బొల్పగుమత్తకరీంద్రమున్ సృణిం

జెలగెడురోగ మౌషధముచే విషముం దగు మంత్రయుక్తిని

మ్ముల దగ జక్కజేయు నగు మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే


తాత్పర్యంః

అగ్నికి జలము, ఎండకు గొడుగు, మదగజంబు నకు అంకుశము, ఎద్దు గాడిద మొదలయిన జంతువులకు కర్ర, రోగమునకు రకరకములయిన మందులు, సర్ప విషమునకు చాలా రకములయిన మంత్రములు,  అనేక శాస్త్రములలో నివారణముగా చెప్పబడినవి కానీ మూర్ఖుని యొక్క మూర్ఖత్వమును పోగొట్టగలిగిన ఔషదం ఏ శాస్త్రములోనూ చెప్పలేదు.

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నీచుల మనఃస్తత్వం

మనం ఇంతకు ముందు  భర్తృహరి సుభాషితాలలో కొన్ని చెప్పుకున్నాం! ఇప్పుడు మూర్ఖ పద్దతి లో మూర్ఖుడు తన వద్ద ఉన్న నీచమయిన దానిని చూసి తన పక్కన ఉన్న గొప్పవానిని ఎలా నిరాకరిస్తాడో చూద్దాం!

సంస్కృత శ్లోకం

క్రిమికులచితం లాలాక్లిన్నం విగన్థి జుగుప్సితం

నిరుపమరస ప్రీత్యా ఖాద న్ఖరాస్థినిరామిపం

సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య నశఙ్కతే

నహి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహఫల్గుతాం

అర్ధంః

శ్వా = కుక్క, క్రిమి= పురుగుల, కుల= గుంపుచే, చితం= నిండిన, లాలా= లాలాజలంతో, క్లిన్నం = తడిచినది, నిండినది, విగంధి= చెడ్డవాసన కలది, జుగుప్సితం = అసహ్యం కలిగించునది, నిరామిషం= మాంసము లేనిది, ఖర= గాడిద, అస్థి = ఎముక, నిరుపమ= సమానమయినది ఏదీ లేని , రస= రుచి,  ప్రీత్యా= ఇష్టంతో, ఖాదత్= కొరుకుతూ, పార్శ్వస్థం= పక్కనే ఉన్న, సుర= దేవతల, పతిం= నాయకుడు, అపి = అయినను, విలోక్య = చూసినా, న శంకతే= సిగ్గు పడదు, క్షుద్రః = నీచమయిన, జంతుః= ప్రాణి, ప్రతిగ్రహ= తీసుకొన్న, ఫల్గుతాం= తక్కువ తనమును, న గణయతి హి = అస్సలు లెఖ్ఖ చేయదు కదా!

ఈ సంస్కృత శ్లోకమునకు చక్కని తెలుగు పద్యం

క్రిమిసముదాయసంకులము గేవల నింద్యము పూతిగంధ హే 

యమును నిరామిషంబును ఖ రాంగభవం బగునెమ్ము గుక్క దా 

నమలుచు జెంత నున్న సురనాధుని గన్గొని సిగ్గు జెందద 

ల్ప మని నిజస్వభావము దలంపదు నీచపు బ్రాణి యెయ్యెడన్ 

తాత్పర్యంః

కుక్క పురుగులు కలిగిన, నోటినుండి కారు లాలా జలంతో తడిసిన, కంపుకొట్టే, అసహ్యము కలిగించే, మాంసము లేని గాడిద ఎముకను చాలా ఇష్టముగా కొరుకుతూ , తన పక్కనే సాక్షాత్తు ఆ దేవేంద్రుడే వచ్చి నిలిచినా, అతనిని చూడడు, సిగ్గు పడదు. నీచమయిన ప్రాణులు తమకు దొరికిన వస్తువులు నిజంగా నీచమయినవా, గొప్పవా? అని అస్సలు లేఖ్ఖ చేయవు కదా!  

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

ఉన్నతులు దిగజారడం మొదలయితే....

 ఒక్కసారి పతనం అవ్వడం మొదలయితే అది ఎక్కడివరకు వెళుతుందో చెప్పే శ్లోకం. ఈ శ్లోకం మన ప్రవచన కర్తలు  చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు మనం సంస్కృత శ్లోకాన్ని, దానికి చెందిన తెలుగు అనువాద పద్యమును చూద్దాం!

సంస్కృత శ్లోకం

శిరశ్శార్వం స్వర్గాత్పశుపతిశిరస్తః క్షితిధరం

మహీధృదుత్తుఙ్గాదవనియవనేశ్చాపి జలధిమ్

అధో గఙ్గా నేయం పదముపగతా స్తోక మధవా

వివేకభ్రష్టానాం భవతి వినిపాతః సతముఖః

అర్ధంః 

సా ఇయం గంగా= ఎంతో ప్రముఖ్యత కలిగిన గంగా నది, స్వర్గాత్= స్వర్గము నుండి, శార్వం = శివుని, శిరః= శిరస్సు, పశుపతి శిరస్తః =శివుని శిరస్సు నుండి, క్షితిధరం = హిమాలయ పర్వతమును, ఉత్తుంగాత్= ఎత్తయిన, మహిధ్రాత్= ఆ కొండ నుండి, అవనిం= భూమిని, అవనేః చ అపి, భూమి నుండియు, జలధిం= సముద్రమును,అధః = క్రింద, పాతాళమునకు, స్తోకం = కొంచెం, పదం = చోటును, ఉపగతా = పొందినది, అధవా = అలా కాక. వివేక భ్రష్టానాం= తెలివి మాలిన వారికి, శతముఖః= నూఱుత్రోవలుగల, వినిపాతః = అధోగతి, భవతి= కలుగుతున్నది.


అదే శ్లోకమునకు తెలుగు పధ్యంః

ఆకాశంబుననుండి శంభునిశిరం బందుండి శీతాద్రి సు

శ్లోకంబైనహిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య

స్తోకాంభోధి బయోధినుండి పవనాం ధోలోకముం జేరె గం

గా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్టసంపాతముల్


తాత్పర్యంః

గంగానది మొదట ఆకాశము నుండి ఈశ్వరుని తలపైనికి, అక్కడి నుండి హిమాచల పర్వతము మీదికి, ఆ పర్వతము మీది నుండి భూమి మీదకు, అక్కడి నుండి సముద్రములోనికి, అక్కడి నుండి పాతాళమునకు వచ్చినది. గొప్ప స్థితిలో నుండి జారిన వారికి అనేక రకములయిన కష్టములు కలుగుతాయి.


6, ఫిబ్రవరి 2022, ఆదివారం

నిజమయిన జ్ఞానం

మనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తామో, మనకు ఏమీ తెలియనప్పుడు అంతా తెలిసినట్లు ఎలా ప్రవర్తిస్తామో, వివరించి చెప్పే చక్కని సంస్కృత శ్లోకం, దానికి తగిన తెలుగు పద్యం ఇప్పుడు చూద్దాం! 

సంస్కృత శ్లోకం

యదా కించిత్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం

తధా సర్వజ్ఞోస్మీత్యభవ దవలిప్తం మమ మనః

యదా కించిత్కించితిద్భుధజనసకాశాదవగతం

తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః

అర్ధంః

అహం = నేను, యదా= ఎప్పుడు, కొంచిద్ జ్ఞ= తక్కువ జ్ఞానం కలిగిన వాడు, గజఏవ= ఏనుగు వలే, మదఅంధ= గర్వము వల్ల కళ్ళు మూసుకుని పోయిన వాడు, సమభావం = ఉంటినో, తధా= అప్పుడు, సర్వజ్ఞ= అన్నీ తెలిసిన వాడు, అస్మిఇతి = అయితిని, మమ = నా యొక్క, మనః= మనస్సు, అవలిప్తం= గర్విం, అభవత్= కలిగినది, యదా= ఎప్పుడు, కించిత్ కించిత్ = కొంచెం కొంచెం, బుధ జన= పండితుల, సకాశాత్= దగ్గరి నుండి, అవగతం = తెలిసిన తదా=అప్పుడు, మూర్ఖ = మూర్ఖుడిని, అస్మిఇతి= అయ్యాను, జ్వర= జ్వరము, ఇవ = వలే, మే = నా, మదః= గర్వము, వ్యపగతః= పోయినది

ఈ సంస్కృత శ్లోకమునకు చక్కని తెలుగు పద్యం

తెలివి యొకింత లేనియెడదృప్తుడ నై కరిభంగి సర్వమున్

దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి యిప్పుడు

జ్జ్వలమతు లైనపండితుల సన్నిధినించుక భోధశాలి నై

తెలియనివాడనై మొలగితిం గతమయ్యె నీతాంతగర్వమున్

తాత్పర్యంః

నేను కొద్దిగా జ్ఞానం ఉన్నప్పుడు, మనస్సులో గర్వం కలిగి, కళ్ళు మూసుకుని పోయి, గజం వలే ఉన్నాను, తరువాత పండితుల సహచర్యం వల్ల, కొద్ది కొద్దిగా జ్ఞానం కలిగిన తరువాత, నిజంగా నేను ఎంత మూర్ఖుడినో తెలిసింది.  నా మనస్సులోని గర్వం ఒక జ్వరం లా విడిపోయింది. 

3, ఫిబ్రవరి 2022, గురువారం

మూర్ఖుడిని మాటలతో మార్చడం వీలవుతుందా!

మనం ఇంతకు  ముందు భర్తృహరి సుభాషితాలలో మూర్ఖపద్ధతి గురించి, మూర్ఖుని మనస్సు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మరొక శ్లోకం చూద్దాం!

వ్యాళం బాలమృణాళితన్తుభింసౌ రోద్ధుం సముజ్జృమ్భ తే

భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమప్రాంతేన నన్నవ్యాతి

మాధుర్యం మధుబింధునా రచయితుం క్షారాంభుధే రిహతే

మూర్ఖాన్యః ప్రతినేతుమిచ్ఛతి బలాత్సుక్తైః సుధాస్యందిభిః

అర్ధం ః  వ్యాళం = మదపుటేనుగును, బాలమృణాలతంతుభిః =లేత తామర తూటిలోని దారములతో,రోద్ధుం =కట్టుటకు, సముజ్జృంభతే = ప్రయత్నించును,భేత్తుం = పగులగొట్టుట/ కోయుట,వజ్ర మణిం= రత్నములలో శ్రేష్టమయిన వజ్రమును, శిరీష కుసుమ = దిరిసెనపువ్వు యొక్క, ప్రాంతేన = అంచుతో, సన్నహ్యతి = పూనుకొనుట,మాధుర్యం = తియ్యదనం,మధు = తేనె, బింధునా= చుక్కతో,  రచయితుం = చేయుటకు,క్షారాంబుధేః =ఉప్పు సముద్రమునకు,  ఈహతే = ప్రయత్నిస్తాడో, మూర్ఖాన్= మూర్ఖులను, బలాత్= బలవంతంగా. ప్రతినేతుం = మార్చాలని, ఇచ్ఛతి = అనుకుంటాడో, అసౌ= అతడు,  యః = ఎవడు, సుధాస్యందిభి = తీయ్యని, సూక్తిభిః = మంచి మాటల చేత, 

తాత్పర్యంః

మదపుటేనుగులను తామరతూటిదారముతో బందించాలని అనుకునే వాడు, దిరిసెనపువ్వుకొన చేత వజ్రమును కోయాలని అనుకునే వాడు, సముద్రంలోగల ఉప్పు నీటిని తియ్యాగా మార్చాలని అనుకుని దానిలో ఒక్క తేనెచుక్కను వేసే వాడు, మూర్ఖుని మనస్సును మంచి మాటలతో మార్చాలని అనుకునే వాడు అందరూ సమానం. 


 ఇదే శ్లోకమునకు తెలుగు అనువాదం 

తెలుగు అనువాదం

కరిరాజు బిసతంతుసంతతులచే గట్టన్ విజృంభించువా

డురువజ్రంబు శిరీషపుష్పములచే నూహించు భేదింపదీ

పురచింపన్ లవణాబ్ధిన్ మధుకణంబుం జిందు యత్నించు ని

ద్ధరణిన్ మూర్ఖులు దెల్ప నెవ్వడు సుధాధారనుకారోక్తులన్

19, జనవరి 2022, బుధవారం

మూర్ఖుని మనస్సు

 మనం ఇంతకు  ముందు భర్తృహరి సుభాషితాలలో మూర్ఖపద్ధతి అనే ఘట్టంలో ఒక శ్లోకం  చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మరొకటి చూద్దాం!

 ప్రసహ్య మణిముద్ధరేన్మకరవక్త్రదంష్ట్రాన్తరా  

త్సముద్రమపి సంతరేత్పృచలదూర్మిమాలాకుల౯మ్

భుజ మపి కోపితం శిరసి పుష్పవద్ధారయే

న్నతు ప్రతినివిష్టమూర్ఖ జనచిత్తమారాధయేత్

అర్ధం ః  

ప్రసహ్య = బలవంతంగా; మణిం =మణులను ; ఉద్ధరేత్ = తీసుకోవచ్చు;  మకర = మొసలి; వక్త్ర = నోటిలోని ; దంష్ట్రా = కోరల ; అంతరాత్ = మధ్యనుండి ; సముద్ర= సముద్రమును; మపి =అయినను; సంతరేత్ =దాటవచ్చు ; ప్రచలత్ = వేగంగా కదులుతున్న ; ఊర్మి = అలల ; మాలా = వరుసలు, ఆకులం = భయంకరమయిన  ;  భుజ మపి = పాములనయినా; కోపితం = బుసలు కొట్టే ;  శిరసి = తలపైన; పుష్పవత్ = పూవు వలే; ధారయేత్ = ధరించవచ్చు ; ప్రతినివిష్ట = మొండిగా ఉన్న; మూర్ఖజన = మూర్ఖుని; చిత్తం = మనస్సును; ఆరాధయేత్ = మార్చటం ; న = కుదరదు , వీలుకాదు. 

తాత్పర్యం:

మొసలి నోటిలోని పదునయిన కోరల మధ్యనుండి విలువయిన రత్నమును కష్టపడి బయటకు తీయ్యవచ్చు, భయంకరమయిన అలలు కలిగిన సముద్రమును దాటవచ్చు, కోపంతో బుసలుకొడుతున్న పాములను పువ్వులవలె తలపైన ధరించవచ్చు కానీ మొండిపట్టుపట్టిన మూర్ఖుని మనస్సు మార్చటం అస్సలు జరుగదు. 

ఇదే శ్లోకమునకు తెలుగు పద్యం చూద్దామా!

మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలించ వచ్చు బా

యక చలదూర్మికానికర మైనమహోదధి దాట వచ్చు మ

స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింప వచ్చు మ

చ్చిక ఘటియించి ముర్ఖజనచిత్తము దెల్ప నసాధ్య మేరికిన్



5, జనవరి 2022, బుధవారం

తెలిసిన వానికి చెప్పవచ్చు...

తెలిసిన వానికి చెప్పవచ్చు... తెలియని వానికి చెప్పవచ్చు కానీ తెలిసీ తెలియనివానికి చెప్పటం కష్టం  అని మన పెద్దలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా! ఇంతకీ ఆ మాటకు, ఆ సామెతకు మూలం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. 

ఈ విషయం  గురించి భర్తృహరి తన సుభాషితాలలో మూర్ఖ పద్దతి అనే ఘట్టం లో చెప్పాడు. ఆ శ్లోకం మీకోసం 

అజ్ఞ:సుఖమారాధ్యస్సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ:

జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి 

అర్ధం: 

అజ్ఞ: = తెలియనివానికి ; సుఖ = సుఖంగా,సులువుగా;  ఆరాధ్యః =సేవించవచ్చు/ బోదించ వచ్చు; విశేషజ్ఞ:= విషయము తెలిసిన వానికి; సుఖతరం= చాలా తేలికగా; ఆరాద్యతే= సేవింపవచ్చు, బోదించ వచ్చు; జ్ఞాన = తెలివి/విషయ పరిజ్ఞానం, లవ = కొంచెం కలిగి, దుర్విదగ్ధం= గర్వం కలిగిన ; నరం = నరునికి;  బ్రహ్మాపి = బ్రహ్మదేవుడయినా ;న రంజయతి = సమాధాన పరచలేడు. 

తాత్పర్యం: అసలు విషయ పరిజ్ఞానం లేని వానికి సులువుగా బోదించ వచ్చు, విషయము తెలిసిన వానికి చాలా తేలికగా చెప్పవచ్చు, కానీ కొంచెం విషయ పరిజ్ఞానం కలిగి మొత్తం తెలుసు అనుకునే గర్వం కలిగిన మనిషికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమి చెప్పలేడు.  

ఇదే విషయాన్ని మనం ఇప్పుడు చక్కని తెలుగు పద్యంలో చూద్దామా!

తెలియనిమనుజుని సుఖముఁగ 

దెలుపం దగు సుఖతరముగ  దెలుపఁగ వచ్చున్ 

దెలిసినవానిం  దెలిసియు 

దెలియని నరుఁ దెల్ప బ్రహ్మదేవుని వశమే 

5, జూన్ 2016, ఆదివారం

జీవన చిత్రం - ప్రయత్నం

జీవన చిత్రం - సార్ధకం గురించి చెప్పారు బాగానే ఉంది. అయితే అవన్నీ ఇప్పటి నుండే ఎందుకు? చక్కగా విశ్రాంత సమయం (రిటైర్మెంట్ తరువాత) చూసుకోవచ్చు కదా! అనుకోకండి. మనలాంటి మేధావులు ముందుముందు వస్తారనే కాబోలు భర్తృహరి తన వైరాగ్య శతకంలో ఇలా చెప్పారు.

యావత్స్వస్థ మిదం శరీర మరుజం యావజ్జరా దూరతో 
యావచ్చేన్ద్రియ శక్తిరప్రతిహతా యావత్క్షయో నాయుషః !!
ఆత్మ శ్రేయసి తావదేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్ 
సందీప్తే భవనే తు కూపఖననం ప్రత్యుద్యమః కీదృశః !! 
                                              -- భర్తృహరి - వైరాగ్య శతకం - 75

భావం : శరీరంలోనికి రోగములు రాకమునుపే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ముసలితనము రాకమునుపే, ఇంద్రియ పటుత్వము కలిగి ఉన్నప్పుడే, ఆయుషు క్షీణించక ముందే బుద్ధి మంతుడు తన ఆత్మ శ్రేయస్సు కొరకు ప్రయత్నములు చేసుకోవాలి. అలాకాకుండా అన్నీ చేజారిపోయిన తరువాత ప్రయత్నించుట ఎలా ఉంటుందంటే ఇల్లు అగ్నికి కాలిపోతున్నప్పుడు, నీటిని సంపాదించటం కోసం బావిని తవ్వటం మొదలు పెట్టినట్లు ఉంటుంది.

కాబట్టి ఇలా మారే ప్రయత్నం మనం ఇప్పటి నుండే మొదలు పెట్టవచ్చు.