పద్మ పురాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పద్మ పురాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఫిబ్రవరి 2022, బుధవారం

చ్యవన మహర్షి - నామకరణం

మనం ఇంతకుముందు చ్యవన మహర్షి సుకన్యను ఎలా వివాహం చేసుకున్నారు అని, అతనికి తిరిగి యవ్వనం ఎలా వఛింది అని తెలుసుకున్నాం కదా! ఇంతకీ ఈ చ్యవన మహర్షి ఎవరు? ఎవరి పుత్రుడు? అతనికి ఆపేరు ఎందుకు పెట్టారు అని ఇప్పుడు తెలుసు కుందాం!

పూర్వకాలంలో భృగువు అనే మమర్షి ఉండేవాడు. అతను అనేక యజ్ఞములు, యాగములు చేస్తూ ఉండేవాడు. ఆ యాగములను ఆపాలని దమనుడు అనే దైత్యుడు అనుకున్నాడు. ఒకరోజు సాయంకాల సమయం లో భృగువు అడవిలోనికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆశ్రమంలో కేవలం అతని గర్భవతి అయిన భార్య మాత్రమే ఉన్నది. ఆశ్రమం  లో ఎవ్వరూ కనిపించక ఆ దమనుడు ఋషి, అతని భార్య ఎక్కడ ఉన్నారు అని గద్దించి అడుగగా, భయపడిన ఆగ్నిదేవుడు అతనికి గర్భవతి అయిన ఋషిపత్ని ఉన్న వైపును తన జ్వాలలతో చూపాడు. అప్పుడు దమనుడు అ ఋషిపత్ని జుట్టు పట్టుకుని బయటకు లాక్కొని వచ్చాడు. 

అలా బయటకు లాగుకొని వస్తున్న సమయంలో ఆఅ మె గర్భం నుండి శిశువు బయటకు వచ్చాడు. అతను వచ్చీ రాగానే ఆ ప్రదేశమంతా ప్రకాశం నిండిపోయింది. ఆ బాలుడు తన తల్లిని బయటకు లాగుతున్న దమనుని కోపంగా చూడగానే అతను అక్కడికక్కడే భస్మం అయి పోయాడు. 

ఆ బాలుడు గర్భం నుండి చ్యుతుడు అయిన కారణంగా అతనికి చ్యవనుడు అని పేరు పెట్టారు.

8, ఏప్రిల్ 2019, సోమవారం

రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న

రాముడు ఈ పేరు వింటే ఒక విధమయిన మానసిక శాంతి లభిస్తుంది కదా! పూర్వకాలంలో నవజాత శిశువులకు పేరు పెట్టవలసిన సందర్భంలో పెద్దలు వారి జాతకమునకు, వారి వ్యవహారమునకు, భవిష్యత్తులో వారు చేయబోయే కార్యములను ముందే సూచిస్తూ పేర్లు పెట్టేవారట. ఒకవేళ వారు పెద్దఅయిన తరువాత ఈ పేరుకు మించి వారు ఘనమైన పనులు చేస్తే వారికి అసలుపేరు కంటే వ్యవహార నామమే ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కుతుంది.

ఉదాహరణకు రావణాసురుని పేరు చూడండి. పుట్టినప్పుడు పెద్దలు ఇతనికి అనేక కళలలో ప్రావీణ్యం ఉంటుంది. అత్యంత మేధాసంపన్నుడు, ఇతను ఒక్కడే పది మంది పుత్రులకు సరిపడు తెలివితేటలు కలవాడు అని "దశగ్రీవుడు" అని పెట్టారు. తీరా ఇతను పెద్ద అయిన తరువాత కైలాసపర్వతం ఎత్తినప్పుడు కలిగిన భాద వలన పెద్దగ రొద పెట్టి, శివుని చేత "రావణా" అని పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఎవరిని ఐనా మీకు దశగ్రీవుడు తెలుసా అని అడగండి. గ్రీకు వీరుని తమ్ముడా అని మిమ్మల్నే అడుగుతారు.

అలాగే రామాయణంలో దశరధునికి పుట్టిన నలుగురు పుత్రులకు పేర్లు పెట్టే సమయంలో వారు అన్ని చూసి, వారికి సార్ధక నామదేయములు పెట్టారు. అవి రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న. ఇంతకీ వారికి ఆ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే కింది పద్యం చూడండి.

గీ.  రాముడయ్యెను భువనాభి రాముడగుట
      లక్ష్మణుండయ్యె శౌర్యాదిలక్ష్మికతన
     భరము దీర్చెడివాడౌట భరతుడయ్యె
     దునుమువాడౌట రిపుల శత్రుఘ్నుడయ్యె

ఈ పద్యం శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రిగారు చెప్పిన "శ్రీమదాంధ్ర పద్మ పురాణం" లో పాతాళ ఖండంలో, పూర్వకల్ప రామాయణం లో చెప్పబడినది. 

27, మార్చి 2019, బుధవారం

సీత - చిలుక శాపం

రామాయణములో ఉన్న అనేక ఘట్టములలో శ్రీరాముడుకి  ఇప్పటికి అపకీర్తిని తెచ్చి పెడుతున్న ఘట్టం సీతాపరి త్యాగం. కేవలం ఒక చాకలివాని మాటలకు శ్రీరాముడు సీతను పరిత్యజించాడు అని చెప్పుకుంటాం. అయితే ఇలా చాకలివాని ప్రస్తావన మూల రామాయణం అంటే వాల్మీకి రామాయణంలో లేదు. ఆ ప్రస్తావన పద్మపురాణంలో ఉంది. ఆ చాకలి వాడు ఆలా చేయటానికి కారణం కూడా పద్మ పురాణం పాతాళ కండములో వివరించారు.
ఆ కధ ప్రకారం 
సీతా దేవి తన చిన్నతనంలో ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా ఒక చెట్టు మీద జంటగా ఆనందముగా ఉన్న చిలుకల జంటను చూసింది. అప్పటికే ఆ చిలుకలు సీతను చూసి ఆనందముగా, ఈ సీతను శ్రీరాముడు వివాహం చేసుకుంటాడు, గొప్ప రాజుగా కీర్తిని గడిస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సీత ఆ చిలుకలను పట్టించి పంజరంలో ఉంచి వారు ఇంతకు ముందు మాట్లాడుకుంటున్న విషయమములను గురించి విస్తారముగా చెప్పమని కోరుకున్నది.
ఆ మాటలు విన్న చిలుకలు తాము ఇంతకు ముందు వాల్మీకి ఆశ్రమములో ఉన్నప్పుడు ఆ మహర్షి రామాయణమును రచించారని, ఆ సమయములో వారు శ్రీ రాముడు భువిలో అవతరిస్తారని, మిథిలా రాజ పుత్రిక సీతను వివాహం చేసుకుంటారని, అనితరసాధ్యమయిన పనులు చేసి కీర్తిని గడిస్తారని, తమ రాజ్యమును సుభిక్షంగా పరిపాలిస్తారని చెప్పాయి. ఆ మాటలు విన్న సీత సంతోషించి ఆ జంటలోని మగ పక్షిని పంజరములోనుండి విడుదల చేసింది. కానీ గర్భవతి అయిన ఆడ చిలుకను పంజరంలోనే ఉంచింది. ఆడ చిలుక తనను తన భర్త వద్దకు పంపమని అర్ధించినా ఆమె బాల్య చాపల్యము వలన ఆ చిలుక ప్రసవించిన తరువాత మాత్రమే  బయటకు పంపుతాను అని చెప్పెను. తన భర్త వద్దకు వెళ్లలేకపోయిన బాధతో సీతకూడా గర్భవతిగా ఉన్నప్పుడు పతివియోగ బాధను అనుభవించగలదని శపించి ఆ అడా చిలుక మరణించెను. తన ప్రియమయిన భార్య అలా శపించటం వినిన మగ చిలుక ఆ శాపాన్ని నిజం చేయటానికి తన చిలుక శరీరమును గంగలో మునిగి పరిత్యజించి, అయోధ్యలో చాకలివానిగా జన్మించినది.

6, జనవరి 2016, బుధవారం

ప్రహ్లాదుని పూర్వజన్మ

శివశర్మ తన నలుగురు పుత్రులు విష్ణులోకమునకు వెళ్ళిన తరువాత మిగిలిన ఐదవ పుత్రుడు, సోమశర్మను పిలచి, అతని చేతికి నాలుగవ కుమారుడు తెచ్చి ఇచ్చిన అమృత కలశమును ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పి, తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరి వెళ్ళెను.
ఇలా దాదాపుగా పది సంవత్సరములు శివశర్మ తన భార్యతో కలసి అన్ని తీర్ధములు తిరిగి, తమ ఇంటికి చేరుకొనే సమయమునకు శివశర్మతపోబలంతో, అతనికి అతని భార్యకి కూడా కుష్టు రోగం వచ్చేలా చేసాడు. ఆ కుష్టు రోగంతో భాదపడుతూ ఇంటికి తిరిగి వచ్చిన తల్లితండ్రులను చూసిన సోమశర్మ అత్యంత విస్మయం చెందాడు.
"ఓ తండ్రీ! తమరు నిత్యం అత్యంత నియమ నిష్టలతో ఉంటారు. అటువంటి కలుశారహితులయిన మీకు ఇట్టి అవస్థ ఏ పాపమువలన కలిగినదో ? దయచేసి చెప్పండి" అని నీరు నిండిన కన్నులతో అడిగెను. సోమశర్మ మాటలు విన్న శివశర్మ "మీము పూర్వ జన్మములలో ఏదో పాపం చేసే ఉంటాం దాని నివ్రుట్టికోరకు ఇప్పుడు ఈ విధంగా శిక్ష అనుభవించ వలసి వచ్చినది. పూర్వం చేసిన కర్మములకు ఫలములు తప్పక అనుభవించవలసినదే కదా! నీవు మాగురించి మా పాపముల గురించి విచారించక, నీవు పితృభక్తి తత్పరుడవు కనుక ఈ శరీరములను వేడి నీటితో కడిగి రక్షించుము" అని బదులు ఇచ్చెను.
సోమశర్మ తనతల్లితండ్రులకు చేయవలసిన సేవలు చేస్తూ, వారి పుండ్లను శుభ్రం చేస్తూ, వారికి విధిగా స్నానం చేయిస్తూ, మధురమయిన భోజనములను పెడుతూ తన నిత్య కృత్యములను చేస్తూ ఉన్నాడు. ఐతే శివశర్మ, అతని భార్య వారి సరీరములకు కలిగిన భాదల వలన తమ కుమారుడు తమకు సరిగా సేవలు చేయటంలేదని, అతనిని తిడుతూ, ఒక్కొక్కచో కొడుతూ ఉన్నారు. అయినా సోమశర్మ భయభక్తులు కలిగి తల్లితండ్రులకు సేవలు చేస్తూనే ఉన్నాడు. ఇలా కొంతకాలం గడచినా తరువాత, శివశర్మ ఇక తన ఐదవ పుత్రునికి విడుదల ఇవ్వాలి అని నిశ్చయించుకున్నాడు. తను తన భార్యతో కలసి తీర్ధయాత్రలకు వెళ్లేముందు సోమశర్మకు ఇచ్చిన అమృత కలశమును దొంగిలించాడు. ఇక ఏమి తెలియనివానివలే సోమశర్మను పిలచి " పుత్రా సోమశర్మ! మీము ఇంతకు  మునుపటి జన్మలలో చేసిన పాపములకు ఇప్పటివరకు మేము అనుభవించిన శారీరిక క్లేశం  సరిపోతుంది కనుక మేము ఇక ఈ భాద నుండి విముక్తి పొంద దలచాం కనుక నేను నీకు ఇంతకుమునుపు ఇచ్చిన అమృతకలశమును తెచ్చి ఇవ్వుము. " అని అడిగెను.
తండ్రి కోరిక మేరకు అమృతం ఇవ్వటానికి చూడగా, సోమశర్మకు అమృత కలశం కనిపించలేదు. ఈ విషయం తన తండ్రికి తెలిసినచో భాదపడతాడని తలచి, తన తపఃశక్తితో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని మరొక అమృత కలశం సంపాదించి తెచ్చి తన తండ్రికి ఇచ్చెను. తన పుత్రుని పితృభక్తి ని చూసి అమితానందం పొందిన శివశర్మ తన భార్యతోకుడా తన నిజ రూపం పొందిరి. అప్పుడు శివశర్మ సోమశర్మతో "ఓ పుత్రా! నీ భక్తి కి మేము అత్యంత ప్రసన్నులం అయ్యాము. నీవు ఇంకొంతకాలం ఈ భూమి పై ఉండవలసి ఉన్నది కనుక నీవు నిత్యం ధర్మాచరణలో ఉండుము. నీకు ఉన్నత పదవులు సిద్దించగలవు" అని ఆశీర్వదించి వారు విష్ణులోకమునకు చేరుకున్నారు.
సోమశర్మ తపస్సుచేసుకుంటూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడచినది. సోమశర్మకు అంతిమ ఘడియలు సమీపించగానే అతనికి తనకు దగ్గరలో ఎవరివో రాక్షస గర్జనలు, కోలాహలములు వినిపించినవి. ఆ శబ్దములు వింటూ, రాక్షసుల గురించి ఆలోచిస్తూ తుదిశ్వాస విడిచాడు.
తుదిశ్వాస విడచే సమయంలో ఎవరు ఏవిషయం గురించి ఆలోచిస్తారో మరు జన్మలో వారు అలా జన్మిస్తారు. కనుక సోమశర్మ రాక్షసయోనిలో జన్మించాడు. కానీ పూర్వజన్మలో చేసుకున్న అమితమయిన పుణ్యం కారణంగా అతనికి విష్ణు భక్తి ప్రాప్తించినది. అతనే విష్ణుభక్తులలో అగ్రగణ్యుడుగా చెప్పుకునే "ప్రహ్లాదుడు".
ఇది ప్రహ్లాదుని పూర్వజన్మ వృత్తాంతం. 

31, డిసెంబర్ 2015, గురువారం

పరీక్ష - ఫలితం

శివ శర్మ వరుసగా తన నలుగురు పుత్రులయిన యజ్ఞశర్మ, వేదశర్మ, ధర్మశర్మ మరియు విష్ణుశర్మ లను పరీక్షించి, వారు తమ తమ పితృభక్తిని నిరుపించుకున్న తరువాత, అమితానందం పొందాడు.
తన పుత్రులను పిలచి " ఓ కుమారులార! మీ పితృభక్తి కి నేను ఎంతో  సంతోషించాను. మీకు ఏదయినా వరం ఇస్తాను కోరుకొనండి" అని అడిగాడు.
అప్పుడు ఆ పుత్రులు " తండ్రీ మీరు మాయందు దయఉంచి మా తల్లిని తిరిగి బ్రతికించండి అని ప్రార్ధించారు". వారు అలా అడుగగానే ఆ తండ్రి ఒక చిరునవ్వు నవ్వాడు, వెంటనే జ్యేష్ట పుత్రునిచే వధింపబడిన ఆమె వెంటనే నడచి వచ్చి, తన భర్త పాదములకు నమస్కరించినది. తన పుత్రులను చూసి " ఓ కుమారులార! ఒక స్త్రీకి తన పుత్రులు ధర్మ మార్గంలో నడచుటకంటే పెద్దదయిన బహుమానం ఉంటుందా! సత్ బ్రాహ్మణ కులంలో జన్మించాను, ఉత్తముడయిన భర్తను పొందాను, నా గర్భం నుండి మీవంటి పరమ ఉత్తములను పొందాను. నా జన్మ ధన్యం కదా! " అని పలికినది. వెంటనే ఆమె పుత్రులు ఆమెకు ప్రణామములు చేసారు.
వీరిని మరలా వరం కోరుకొనమని శివశర్మ అడుగగా, అప్పుడు వారు విష్ణుదామము కావలెను అని కోరారు. అప్పుడు శివశర్మ తధాస్తు అని పలుకగానే, శ్రీమహావిష్ణువు తన పరివారంతో, రధంలో ప్రత్యక్షం అయ్యాడు. "శివశర్మ, నీ నలుగురు పుత్రులు పితృభక్తి లో వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు. నీవు వారికి విష్ణులోకమును అనుగ్రహించావు. నీవు నాకు భక్తునువి అవ్వటం వలన నేను నీకు స్వాదీనుడను. కావున నీవు నీ భార్యా బిడ్డలతో కలసి నా ధామమునకు విచ్చేయుము" అని పలికెను.
ఆ మాటలు విని శివశర్మ " ఓ విష్ణుమూర్తి! ఇప్పటికి నా నలుగురు పుత్రులను నీ ధామమునకు తీసుకొని వెళ్ళు. నేను నా భార్య మరియు ఐదవ పుత్రునితో ఇంకొంత కాలం భూలోకం లో ఉండి తరువాత తమరిని చేరుకొనెదను" అని చెప్పెను. అప్పుడు శ్రీమహావిష్ణువు శివ శర్మ నలుగురు పుత్రులను ఇంద్రనీలమణి సామానమయిన కాంతి కలవారుగా, శంఖచక్రగధా ధరులుగా, దివ్యాలంకరణ భూషితులుగా చేసి గోలోకమునకు తీసుకొని వెళ్ళిరి.

30, డిసెంబర్ 2015, బుధవారం

విష్ణుశర్మ

శివశర్మ తన ముగ్గురు పుత్రులను వరుసగా పరీక్షించిన తరువాత తన నాలుగవ పుత్రుడయిన విష్ణుశర్మ ను పిలిచాడు.
శివ శర్మ విష్ణు శర్మతో ఇలా అన్నాడు " పుత్రా! ఈ స్త్రీ ని నేను ఇప్పుడే గ్రహించాను. ఈమె యవ్వనంలో ఉన్నది. నాకు శరీరంలో వృద్ధాప్యపు చాయలు ఉన్నాయి. కనుక వానిని నేను పోగొట్టు కొనేందుకు వీలుగా, నాకు నీవు అమృతం తెచ్చి ఇవ్వు " అని కోరెను.
తండ్రి కోరిక ప్రాకారం అమృతం తెచ్చే కోరికతో విష్ణుశర్మ స్వర్గానికి బయలుదేరాడు. విష్ణు శర్మ స్వర్గమునకు వస్తున్నాడు అని తెలుసుకొన్న ఇంద్రుడు ఆతనిని దారిలో ఆపాలన్న ఆలోచనతో మేనకను అతనిని ఆపే పని కై నియమించాడు.
ఆ మేనక విష్ణుశర్మ వచ్చే దారిలో ఒక ఉద్యానవనంలో ఉయ్యాలలూగుతూ పాటలు పాడుతూ ఆతనిని ఆకర్షించే ప్రయత్నం చేసినది. ఆమె పాటలు వినీ, వినని వానివలె, ఆమెను చూసీ చూడని వానివలే విష్ణుశర్మ ముందుకు సాగిపోసాగాడు. ఐనా మేనక ఆతని వెనుకనే వచ్చి ఆతనితో మాటలు కలిపినది. ఎక్కడికి వెళుతున్నావు? ఎందుకు వెళుతున్నావు అంటూ! కానీ విశ్నుషరం ఆమె అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పి, ఆగకుండా వెళ్ళటం చూసి,మేనక తన సహజ స్వభావం తో ఆతనిని నిలువరించే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నములు గ్రహించిన విష్ణుశర్మ " ఓ మేనకా! నేను శివశర్మ పుత్రుడను. ఇట్టి మాయలకు లొంగే వానను కాదు. నీ ప్రయత్నములు నావద్ద చేయకు" అని మెత్తగా మందలించి, తన దారిన తను వెళుతూ ఉన్నాడు.
మేనక తన ప్రయత్నంలో వెనుతిరిగినది అని తెలుసుకున్న ఇంద్రుడు సింహం, పులి వంటి క్రూర జంతువులను సృష్టించి విష్ణుశర్మ మీదకు ప్రయోగించాడు. అవి కూడా విష్ణుశర్మను నిలువరించలేక పోవటంతో ఈ సారి ఇంద్రుడు రాక్షస గణములను సృష్టించి అతనిమీదకు ప్రయోగించాడు. అన్నింటిని తన పితృభక్తి వలన ఎదుర్కొన్న విష్ణుశర్మ ఈసారి ఇంద్రుడు బాణ వర్షం కురిపించుతచే కోపగించాడు. "నేను మా తండ్రి ఆజ్ఞ మేరకు అమృతం తీసుకు రావటానికి వస్తుంటే, ఇంద్రుడు నిర్ధాక్షిణ్యం గా నా మీదకు యుద్ధానికి కాలుదువ్వు తున్నాడు కనుక ఇతనిని ఈ ఇంద్రపదవి నుండి తప్పించి మరొకరిని ఇంద్రుడుని చేస్తాను" అని కన్నులు ఎర్రవిగా అయి ఉన్న విష్ణుశర్మను చూసి భయపడిన ఇంద్రుడు "ఓ బ్రాహ్మణోత్తమ! నేను నీకు సకల దేవతలతో కలసి నమస్కరిస్తున్నాను! నీకు కావలసిన వరం కోరుకొనుము ఇచ్చెదను" అని అన్నాడు. వెంటనే తనకోపమును తన వసంలోనికి తెచుకున్న విష్ణుశర్మ "ఓ ఇంద్రా!నేను మా తండ్రిగారి ఆజ్ఞ మేరకు అమృత కలశం కోసం వచ్చాను. నీవు నాకు వరం ఇస్తాను అన్నావు కనుక, ఆ అమృత కలశంతో పాటుగా నాకు అచంచలమైన పితృభక్తిని ఇవ్వు" అని కోరెను.
ఇంద్రుడు అలాగే అని అమృత కలశమును విష్ణుశర్మకు ఇచ్చెను. ఆ కలశంతో  విష్ణుశర్మ తండ్రిని సమీపించి జరిగినది చెప్పి, ఆ కలశమును  తండ్రికి సమర్పించెను.
ఈ విధంగా నాలుగవ పుత్రుదయినా విష్ణు శర్మ పరీక్ష ముగిసినది. 

29, డిసెంబర్ 2015, మంగళవారం

తృతీయ కుమార - పరీక్ష

శివశర్మ తనవద్దకు తన రెండవకుమారుడయిన వేదశర్మ  తలతో వచ్చిన స్త్రీ ని చూసి, ఆమె చెప్పిన వృత్తాంతం అంతా విన్నాడు. ఈ వృత్తాంతం అంతా విన్న మిగిలిన పుత్రులు వేదశర్మ చేసిన త్యాగం గురించి ఆశ్చర్యపోయారు.
అప్పుడు శివశర్మ తన మూడవ పుత్రుడయిన ధర్మశర్మను పిలిచి, వేదశర్మను బ్రతికించమని కోరాడు.
తండ్రి మాటలు విన్న ధర్మశర్మ తక్షణం కన్నులు మూసుకుని, తండ్రి ఆదేశించిన విధంగా, యమధర్మరాజును ప్రార్ధించాడు.
అతని ప్రార్ధనను మన్నించి సమవర్తి ఆతనిముందు ప్రత్యక్షం అయ్యాడు. ఆతను కోరిన కోరిక ఏదయినా తీరుస్తాను అని చెప్పాడు. ఆమాటలు విన్న ధర్మశర్మ "ఓ యమధర్మరాజా! మీరు నా భక్తిని మెచ్చినట్లయితే, ఈనా సోదరుని వెంటనే బ్రతికించండి అని కోరెను. " ఆతని కోరిక విన్న యమధర్మ రాజు, మీ పితృభక్తి ఆతనికి ఆయుషు పోయగలదు అని చెప్పి అదృశ్యం అయ్యాడు.
అప్పుడు వేదశర్మ నిద్రలోనుండి మేలుకొన్న విధంగా, లేచి నిలుచున్నాడు. తనతండ్రిని, ఆ స్త్రీని చూసి, వారికి పాదాభి వందనం చేసాడు. ఈ విధంగా శివ శర్మ తన మూడవ కుమారుని పితృభక్తిని పరీక్షించాడు. 

28, డిసెంబర్ 2015, సోమవారం

ద్వీతీయ పుత్ర - పరీక్ష

శివశర్మ జ్యేష్ట పుత్రుని పరీక్ష ముగిసిన వెంటనే, ద్వీతీయ పుత్రుడయిన వేదశర్మని పిలిపించెను. అతనితో  "పుత్రా ! నేను నిత్య కర్మలయందు కొంచెం కూడా ఆలస్యం చేయక ఉందును. ఈ నాడు మీ తల్లి లేదు. నిత్య కర్మలు చేయుటకు నేను ధర్మపత్నితో ఉండుట అవసరం, మరియూ నాకు ఇంకనూ సంపూర్ణ వైరాగ్యం కలుగలేదు. నేను ఇప్పుడే ఒక చంద్ర వదనను ఆ విధిలో వెళుతుండగా చూసాను. ఆమెను తెచ్చి నాకు పత్నిగా చేయుము." అని చెప్పెను. తమ తండ్రి చెప్పిన మాటలు విన్న వేదశర్మ ఒక్క క్షణంలో వీదిలోనికి వచ్చి తండ్రి చెప్పిన ఆ స్త్రీని కనుగొని అంజలి ఘటించి "తల్లీ ! మా తండ్రిగారు తమరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు, కావున తమరు నాతో దయచేసి వారిని వివాహం చేసుకొనండి." అని చెప్పెను.
ఆ స్త్రీ వేదశర్మతో " నేను కన్యను, ఒక ముసలివానిని ఎందుకు వివాహం చేసుకోవాలి? వృధ శరీరం అనేకములయిన వ్యాధులకు ఆలవాలం. నేను నీ తండ్రిని వివాహం చేసుకోను, కానీ నిన్ను చేసుకుంటాను." అని చెప్పినది.
ఆమె మాటలు విని వేదశర్మ " అమ్మా! క్షమించాలి. మీరు నా తండ్రి మనస్సు గెలిచిన వారు. మీరు వారిని వరించిన సర్వ జగమ్ములు మీకు వశంలో ఉండేటట్లు చేయగలవాడను. నేను పలికిన ఒక్క మాటకూడా ఏనాడు తప్పదు." అని తలవంచి మరలా నమస్కరించెను.
ఆమాటలు విన్న ఆ స్త్రీ " ఓ బ్రాహ్మణోత్తమా! నిజంగా మీకు అంత శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడే నాకు సమస్త దేవతలను చూపించుము. అప్పుడు మీ మాటలు నేను నమ్ముతాను. " అని పలికినది.
ఆమె అలా అడుగ గానే వేదశర్మ మనస్సులో ధ్యానం చేసాడు. ఆటను అలా ధ్యానం చేయగానే సకల దేవతలు వచ్చి వారిరువురికీ దర్శనం ఇచ్చి, ఆతనిని వరం కోరుకొనమని అడుగగా, వేదశర్మ " సకల దేవతలారా మీరు నాయెడల ప్రసన్నులయిన నాకు అవిచ్చిన్న మయిన పితృభక్తి ని ప్రసాదించండి" అని కోరెను. అప్పుడు ఆ దేవతలు ఆ తనిని అట్లే దీవించి అంతర్ధానం చెందారు.  
ఆతని పితృభక్తి ని చూచి ఆమె, " ఓ బ్రాహ్మణోత్తమ! నీకు గల పితృభక్తి అమోఘం. నీవు నన్ను నీ మాతృ స్థానంలో ఉంచాలని అనుకున్నందుకు సంతోషం. కానీ మరి నీ మాతృభక్తికి పరిక్ష ఇవ్వవా ?" అని అడిగినది.
ఆ మాటలు విని అనందం పొందిన వేదశర్మ ఆమె ఏ పరీక్ష పెట్టినా  తాను ఎదుర్కోనగాలను అని చెప్పగా, ఆమె అతనిని తన చేతులతో, స్వయంగా తలను నరుక్కొని ఆమె చేతికి ఇవ్వమని కోరినది.
మరుక్షణం వేదశర్మ పరమ సంతోషంతో తన తలను తన చేతులతో నరికి ఆమె చేతికి అందించెను.
ఆతని తలను చేతితో పట్టుకుని ఆ స్త్రీ శివశర్మ ఇంటికి వెళ్లి జరిగిన వృత్తాంతం అంటా వివరించెను.      

26, డిసెంబర్ 2015, శనివారం

జ్యేష్ట పుత్ర-పరీక్ష

శివ శర్మ ఒక రోజు తన పెద్ద కుమారుని పరీక్షించాలని అనుకున్నాడు.
జబ్బుతో భాదపడుతున్న తన భార్యను చూచి, జ్యేష్ట పుత్రుడయిన యజ్ఞశర్మను పిలిచెను. అతనితో శివశర్మ,  "చూడు! మీతల్లి ఈ విపరీతమయిన ఈ జ్వరముతో అనేక విధములుగా వేదన అనుభవిస్తున్నది. ఏవిధంగా ఆలోచించినా ఈమె వ్యాధికి మందు తెలియటంలేదు. ఆమె ఈ విధంగా భాదను అనుభవించుట కంటే ఆమెకు మనం మరణమును ప్రసాదించుట మేలు. కనుక నా జ్యేష్ట పుత్రుడవయిన నీవు, నీ స్వహస్తములతో ఒక ఖడ్గం తెచ్చి, దాని ద్వారా నీ తల్లిని వదించుము. ఆ పిదప ఆమె శరీరమును ఖండ ఖండములుగా త్రుంచి, నలు దిక్కులా పడవేయుము. అలా చేస్తేనే ఆమెకు గల ఈ విచిత్ర జ్వరం నివృత్తి అవుతుంది." అని చెప్పెను.
తన తండ్రి చెప్పిన మాటలు విన్న యజ్ఞశర్మ "తమరి అజ్ఞ" అని పలికి, అక్షరాల తండ్రి చెప్పిన విధంగా, చేసి తిరిగి వచ్చి తన తండ్రికి నమస్కారం చేసెను. కేవలం ఆతని మనస్సు నందు తన తండ్రి చెప్పిన మాటను నిస్సందేహంగా పూర్తి చేయవలెనను సంకల్పం తప్ప మరొకటి లేదు. అతనికి కనీసం ఇది తమ తండ్రి తనకు పెడుతున్న పరీక్ష అనికూడా తెలియదు.
జ్యేష్ట పుత్రుడు తన తండ్రి చెప్పిన విధంగా చేసి, తన పితృభక్తి ని నిరూపించుకున్నాడు. 

25, డిసెంబర్ 2015, శుక్రవారం

పితృ భక్తి

పితృ భక్తి, ఈ పదం ఈ రోజుల్లో మనం వినటానికి చదువుకోవటానికి మాత్రమే వాడుతున్నాం. కానీ పితృభక్తి అనే మాటకు విస్తృత ప్రాముఖ్యం ఇస్తూ మన కు గల 18 పురాణాలలో "హరేరేవ హృదయం పద్మ సంజ్ఞకం" అని అనిపించుకున్న పద్మ పురాణం లో భుమిఖండంలో అనేక అధ్యాయములలో చెప్పబడి ఉన్నది.
ఒకానొక సమయంలో శివశర్మ అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ద్వారకలో నివాసం ఉండేవాడు. అతనికి ఐదుగురు పుత్రులు ఉన్నారు. వారి పేర్లు

  1. యజ్ఞశర్మ 
  2. వేదశర్మ 
  3. ధర్మశర్మ 
  4. విష్ణు శర్మ 
  5. సోమశర్మ 
ఈ ఐదుగురు తమ తండ్రి వలెనే వేద విధ్యలలో నిష్ణాతులు. అంతే కాకుండా పితృభక్తి పరాయణులు. 

ఇలా కొంతకాలం గడిచినది. అప్పుడు శివశర్మ తమ పుత్రుల పితృభక్తికి పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. అందుకు అనుగుణంగా తన అనుకూలవతి, ఐదుగురు పుత్రుల తల్లి అయిన తన భార్యకు ఒక విచిత్రమైన జ్వరం వచ్చేలా చేసాడు. అప్పుడు ఒక్కొక్క పుత్రునికి ఒక్కో విచిత్రమైన పరీక్ష. పెట్టటం  ప్రారంభించాడు