హనుమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హనుమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మే 2020, శనివారం

రామ, హనుమల తొలి పరిచయం! హనుమంతుని వేషం!

రామాయణంలో కథను మలుపు తిప్పే ఘట్టములలో ముఖ్యమయినది హనుమంతుడు శ్రీరాముని కలుసుకునే ఘట్టం. 
రాముని, లక్ష్మణుడిని కలుసుకునే సమయమునకు హనుమంతుడు సుగ్రీవుని వద్ద మంత్రిగా ఉన్నాడు. ఆ సమయమునకు సుగ్రీవుడు తన రాజ్యమును కోల్పోయి, తన సొంత అన్నగారయిన వాలితో శత్రుత్వం వలన ప్రాణ భయంతో ప్రపంచం మొత్తం తిరిగి, చివరకు వాలి రాకుండా ఉండగలిగిన ప్రాంతం ఋష్యమూకం అని తెలుసుకుని ఆ పర్వతం మీద నివాసం ఉంటున్నాడు. ఆ సమయమునకు అతనితో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన ముఖ్యులు ఉన్నారు. 
ఆ సమయంలో ఋష్యమూక పర్వత ప్రాంతంలో కొత్తగా కనిపించిన, ముని వేషదారులయిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవునికి వాలి తనకోసం వారిని పంపించాడేమో అన్న భయం కలిగింది. ఆ భయమును తననుండి దూరం చేయవలసినదిగా తన మంత్రి అయినా హనుమంతుని కోరాడు. దానికోసం హనుమంతుడు ఆ ఇద్దరు ముని వేషదారుల పూర్వాపరముల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆ విధమయిన విషయములు తెలుసుకోవాలంటే ముందు ఆ ఇద్దరికీ  ప్రశ్నలు అడుగుతున్నా వారి మీద నమ్మకం కలగాలి . ఒక వేళ ఆ వచ్చినవారు వాలి తరపున వచ్చి ఉంటే వారిని అక్కడే నిలువరించే సాహసం కలవాడు హనుమంతుడు కనుక సుగ్రీవుడు హనుమంతుడిని ఆ పనికోసం పురమాయించాడు.  
ఇప్పుడు సమస్య హనుమంతుడు ఏ వేషంలో వారి ముందుకు వెళ్ళాలి అని!
అనేక రామాయణములలో ఈ ఘట్టం లో హనుమంతుడు 
  1. భిక్షకుని/ సన్యాసి వేషం  అని  చెప్తారు.  
  2. వటువు / బ్రహ్మచారి వేషం అని చెప్తారు. 
మరి ఇంతకూ హనుమంతుడు ఈ వేషంలో వెళ్ళాడు?
  1. భిక్షకుని/ సన్యాసి వేషం ః ఒకవేళ హనుమంతుడు సన్యాసి వేషంలో వెళ్ళినట్లయితే, కథప్రకారం హనుమంతుడు ఆ సోదరుల వద్దకు చేరగానే వారికి నమస్కరించాడు. ఒక భిక్షకుడు / సన్యాసి గృహస్తుకు నమస్కారం చేయడు. హనుమంతుడు భిక్షకుని/ సన్యాసి వేషం లో కనుక అలా చేస్తే రామ లక్ష్మణులకు ముందుగా అతని మీద అనుమానం కలుగుతుంది. తరువాతి ఘట్టములు మన ఊహకు అందని విధం గ ఉండేవి. సుగ్రీవ రాముల మైత్రి ప్రారంభం కూడా అనుమానాస్పదంగానే ఉండేది కదా! 
  2. వటువు / బ్రహ్మచారి వేషం: ఈ వేషం అయితే ఎవరికీ అయినా నమస్కారం చేయవచ్చు. అంటే కాకుండా ఇతను ఆ ఇద్దరినీ ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనే సంకల్పంతో వచ్చాడు కనుక వటువు వేషం అయితే అతను ఈని ప్రశ్నలు అడిగినా వటువుకు కలిగిన సహజసిద్దమయిన జిజ్ఞాస వలన అడుగుతున్నాడు అని అనుకోవటానికి ఆస్కారం దొరుకుతుంది. 
కనుక హనుమంతుడు తొలిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు ఆటను బ్రహ్మచారి వేషంలో కలిసాడు. 







18, మే 2020, సోమవారం

విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?

మనం ఇంతకుముందు హనుమంతుడు శివుని అంశ ,వాయువు పుత్రుడు ఎలా అయ్యాడు అని చెప్పుకున్నాం! దానితో పాటు దశరధుని పుత్రకామేష్టి ఫలమయిన పాయసం కారణంగా హనుమానితుడు జన్మించాడు అనే విషయం కూడా చెప్పుకున్నాం!  మరి అసలు హనుమంతుని జన్మకు సార్ధకత అతని దాస్యభక్తి అని మనకు అందరికి తెలుసు కదా! మరి విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?
మన పురాణములలో ఒక కథాప్రకారం అవును అనే చెప్పుకోవాలి మరి. ఆ కధ ఏమిటో చూద్దామా!

పుర్వకాలంలో గార్దభనిస్వనుడు అనే ఒక పరమశివ భక్తుడు ఉండేవాడు. అయితే ఎల్లప్పుడూ శ్రీహరిని ద్వేషిస్తూ ఉండేవాడు. శివునికి భక్తుడు అవ్వటం వలన శివునికొరకు  అత్యంత ఘోరమయిన తపస్సు చేసి తనకు జాగ్రత్తు, సుషుప్తి మరియు స్వప్నావస్థలలో ఎవ్వరి చేత మరణం రాకుండా వరం సంపాదించాడు. ఆ వర గర్వంతో  విష్ణుభక్తులను హింసించటం మొదలుపెట్టాడు.    అలాగే  దేవతలను కూడా హింసించాడు. అతని బాధలు పడలేక దేవతలు, మునులు బ్రహ్మదగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ వారిని తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. వారి బాధలని ఆలకించిన శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి, ఆ రాక్షసుడిని చంపి, అందరికి శాంతిని కలిగిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట విన్న శివుడు విష్ణువు వద్దకు వచ్చి, అతను గార్దభనిస్వనుని కి ఇచ్చిన వరముల గురించి చెప్పి, అతనిని నిర్జించుట అసాధ్యం అని చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీహరి నవ్వి పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు కదా! అలాగే గార్దభనిస్వనుడు కూడా మరణిస్తాడు అని చెప్పారు. శ్రీ హరి చెప్తున్న ఆ మాటలు విన్న శివునికి కుతూహలము పెరిగి, ఒకవేళ శ్రీ మహావిష్ణువు కనుక ఆ గార్దభనిస్వనుడిని సంహరించినట్లయితే తాను స్వయంగా శ్రీమహా విష్ణువుకు దాస్యం చేస్తాను అని పలికారు.
శివుని మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వారు.
తరువాత అతను విశ్వమోహన సౌందర్యవతియైన జగన్మోహిని రూపందాల్చి ఆ గార్దభనిస్వనుడు నివసించే అంతఃపురం దగ్గరకు వెళ్లి మధురస్వరంతో సామవేద గానం ప్రారంభించారు. ఆ అద్భుత గానమునకు ఆకర్షితుడయ్యి గార్దభనిస్వనుడు అంతఃపురంనుండి బయటకు వచ్చి ఆ జగజన్మోహిని సౌందర్యం చుసి మోహితుడయ్యి  ఆమె ఎవరు? ఎక్కడినుండి వచ్చింది? మొదలయినవి వివరములు అడిగాడు. తరువాత అతని గురించి గొప్పలు చెప్పుకున్నాడు, అలా చెప్పుకుని ఆమెను తనని వివాహం చేసుకోమంటూ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనను వినిన మోహిని,  ఆమెను నాట్యగానములలో  ఓడించితే అలాగే చేద్దాం అని అతనికి సవాలు చేసింది. ఆ సవాలని స్వీకరించిన అతను అలా  నాట్యం చేస్తున్న మోహినిని చూసి మైమరిచిపోసాగాడు. ఆ అదును చూసుకుని మోహిని అతనికి సురాపానమును చేతికి అందించింది. ఆమెమీద వ్యామోహం తో ఉన్న గార్దభనిస్వనుడు దానిని  తాగి జాగ్రదావస్థ కాక స్వప్నావస్తా కాక ఉన్న సమయంలో జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు వృకనారాయణావతారం ధరించి గార్దభనిస్వనుడిని తన వాడి అయిన గోళ్ళతో చంపివేసాడు.

ఆ విషయం తెలుసుకున్న శివుడు శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి తాను దాస్యమును స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాను అని తెలుపగా దానికి శ్రీమహావిష్ణువు ఆ దాస్యమునకు సరిఅయిన సమయం అప్పుడు కాదని, ద్వాపర యుగంలో  తాను శ్రీరామావతార సమయంలో ఆ ముచ్చట తీర్చుకుందాం అని చెప్పారు.
తరువాత శ్రీహరి తన రామావతారమును గురించి, ఆ సమయంలో అతనికి శివుని అవసరం గురించి ఇలా చెప్పారు.
రామావతారంలో నా శక్తి అయిన లక్ష్మి అపహరించబడినప్పుడు, నేను నా అవతార కార్యమును పూర్తిగావించుటకు నాకు తోడుగా ఓ మహాదేవా! తమరు ఆదిశక్తి సహితముగా నా అంశను కూడా పొంది , ఆ కార్యమును సాధించుటకు నాకు నవ్యశక్తి ని ప్రసాదించి, నన్ను పరిపూర్ణునిగా చేయండి. 

17, మే 2020, ఆదివారం

హనుమంతుడు- దశరధుని పుత్రకామేష్టి

మనం ఇంతకు ముందు హనుమంతుడు శివుని అంశ , వాయుపుత్రుడు ఒకేసారి ఎలా అయ్యాడు అని తెలుసుకున్నాం కదా! అలాగే హనుమంతుని జన్మకు సంబందించిన మరొక విచిత్ర మయిన విషయం ఇప్పుడు తెలుసుకుందాం! ఈ విచిత్రమయిన సంఘటన ఆనందరామాయణం లో చెప్పారు. మూల వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టం చెప్పలేదు.

దశరథమహారాజు తనకు పుత్రులు కలగాలని, తన భార్యలతో కలిసి ఋష్యశృంగుని అద్వర్యం లో పుత్రకామేష్టి చేశారు. ఆ యాగంలో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యి దశరధుని చేతికి ఒక కలశమును అందించారు. ఆ కలశంలో ఉన్న పాయసమును దశరధుడు తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచాడు. అప్పుడు దశరధుని మూడవ భార్య అయినా కైక చేతిలోని పాయసం నిండిన పాత్రను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని వేగంగా వెళ్లి పోయింది. ఆ హఠాత్ సంఘటనతో దిగులు చెందిన కైకకు దశరధుని మిగిలిన భార్యలు అయినా సుమిత్ర, కౌసల్య తమతమ పాయసమునందలి కొంత కొంత భాగములు ఇచ్చారు.
అలా ఆ పాయసపాత్రను పట్టుకుని వేగంగా పైకి ఎగిరిన గ్రద్ద ఆ పాయసము తనను తాకగానే ఒక అప్సరసగా మారి వెళ్లి పోయింది. అలా అప్సరసగా మారిన గ్రద్ద వదిలేసిన ఆ పాయసపాత్రను
వాయుదేవుడు అంజనాద్రి పై పుత్రుని కొరకు పరమ శివుని ప్రార్ధిస్తున్న అంజనాదేవి వొడిలో పడేవిధంగా చేసాడు. పరమేశ్వర ప్రసాదంగా భావించి అంజనాదేవి దానిని స్వీకరించి, ఏకాదశమ రుద్రుని అంశగా శ్రీ హనుమంతునికి జన్మను ఇచ్చింది.



29, ఏప్రిల్ 2020, బుధవారం

హనుమంతుడు - తొమ్మిది అవతారములు

హనుమంతునికి ముఖ్యముగా తొమ్మిది అవతారాలు ఉన్నాయి అని చెప్తారు. దీనిని గురించి పరాశర సంహిత లో ప్రస్తావించారు.

ఆద్య: ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతిభుజః చతుర్దః పంచ వక్త్రకః
పంచమో ష్టాదశ భుజః శరణ్యస్సర్వ దేహినాం
సువర్చలాపతి షష్ఠః సప్తమస్తు చతుర్భుజ ః
అష్టమః కధితశ్శ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండలః
నవమో వానరాకార ఇత్యేవం నవరూపధృక్

భావం:: ప్రసన్న హనుమదవతారం, వీరాంజనేయ అవతారం, వింశతి (ఇరవై భుజములు కలిగిన ) భుజాంజనేయావతారము, పంచముఖాంజనేయావతారము, అష్టాదశ భుజాంజనేయావతారము (పద్దెనిమిది భుజముల), సువర్చలాహనుమావతారం, చతుర్భుజాంజనేయావతారం(నాలుగు భుజములు), ద్వాత్రింశత్ భుజాంజనేయావతారం  (ముప్పది రెండు భుజముల), వానరాంజనేయావతారము. 

31, జనవరి 2015, శనివారం

తెనాలి లో హనుమత్ చాలీసా పారాయణ మహాయజ్ఞం


 తెనాలి లో హనుమత్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఈనాటి (31 జనవరి 2015) ఉదయం బుర్రిపాలెం రోడ్డులో గల శ్రీ జానకి రామ హనుమత్ ప్రాంగణం లో అత్యంత భక్తీ శ్రద్ధలతో మొదలు పెట్టారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతులు శ్రీశ్రీగణపతి సచ్చిదానంద స్వామిజి అధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత మనోహరంగా కొనసాగుతూ ఉన్నది.
సహజంగా జరిగే హనుమత్ చాలీసా పారాయణకు భిన్నంగా ఇక్కడ ఒక్కసారి 40 శ్లోకముల చాలీసా చదవటం పూర్తి అవ్వగానే 1 లేదా 2 నిముషముల సమయం ఆగి, శ్రీ రామ నామం 4 సార్లు పలికి మరలా చాలీసా పారాయణం మొదలు పెడుతున్నారు. 111000 మంది భక్తులు ఈ చాలీసా చేస్తారు అని అంచనా మారి ఇప్పటివరకు సుమారుగా 125000 మంది పారాయణం చేస్తున్నారు.
అనేకమంది వాలెంటీర్లు స్వచ్చందంగా అక్కడకు చేరిన భక్తులకు కావలసిన సదుపాయములను చూస్తున్నారు. ఈ కార్యక్రమమునకు అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు కుడా విచ్చేశారు.
తెనాలి లో ఈరోజు వ్యాపారస్తులు స్వచందంగా తమ వ్యాపారములను ఆపేసి. వారు కూడా ఈ మహాయజ్ఞం లో పాలుపంచుకుంటున్నారు. తెనాలి తో అనేక మైన భద్రతా ఏర్పాట్లు చేసారు. ట్రాఫిక్ ను కూడా నియంత్రిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అత్యంత మనోహరంగా, ఈవిధమైన అవంచనియమైన సంఘటనలు లేకుండా సాగుతోంది.
మన హిందూ సంప్రదాయమును ఒక తాటిపైకి తీసుకు వచ్చే ఇటువంటి అనేకమైన కార్యక్రమములు నా తెనాలిలో మరిన్ని జరగాలని కోరుకుంటూ

మీ
దీపిక