9, మే 2019, గురువారం

రామాయణం - ఒక భక్తుని జీవితం

మనం ఇంతకూ ముందు రామాయణం గురించి అనేక విషయములు చెప్పుకున్నాం! రామాయణంలోని వివిధ సంఘటనలను మానవుని దేహంలోని ఏడు  చక్రములతో ఎలా పోల్చారో,  రామాయణమునకు ఉన్న ఆధ్యాత్మిక అర్ధం ఏమిటో, రామాయణమును కల్పవృక్షం, వేదం  మరియు గాయత్రీ మంత్రములతో ఎలా పోల్చాలో చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మహా రామ భక్తుడు అయిన తులసీదాసు రామాయణంలోని ఏడు కాండలను ఒక భక్తుని జీవితంలో రామభక్తిలో చేరుకునే అనేక సోపానములతో పోల్చారు. అవి ఏంటో చూద్దామా!


  1. బాల కాండ - సుఖ సంపాదన సోపానం 
  2. అయోధ్య కాండ - ప్రేమవైరాగ్య సంపాదన సోపానం 
  3. అరణ్య కాండ - విమల వైరాగ్య సంపాదన సోపానం 
  4. కిష్కింద కాండ - విశుద్ధ సంతోష సంపాదన సోపానం 
  5. సుందర కాండ - జ్ఞాన సంపాదన సోపానం 
  6. యుద్ధ కాండ - విజ్ఞాన సంపాదన సోపానం 
  7. ఉత్తర కాండ - అవిరళ హరిభక్త సంపాదన సోపానం 

6, మే 2019, సోమవారం

రామాయణం - 7 చక్రములు

మనం ఇంతకు ముందు మనం రామాయణం దానిలోని ఆధ్యాత్మిక అర్ధం గురించి చెప్పుకున్నాం కదా! ఆ రామాయణం మానవునిలో ప్రాణశక్తిని మేల్కొలిపి 7 చక్రములను జాగృతం చేసి పరమాత్ముని చేరుకొనే మార్గంలో కలిగే అనేకములయిన అనుభవాలను చెప్తుంది అని పెద్దల వాక్కు. అయితే రామాయణంలో ఏ సంఘటనలు ఆయా చక్రములను సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం!


  1. మూలాధారం: రామాయణంలో శివధనుర్బంగం జరిగిన సంఘటన ను మూలాధారంగా చెప్తారు. స్థిరత్వమును చేకూర్చే ఈ చక్రమును శ్రీరాముని కళ్యాణముతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  2. స్వాధిష్టానం: రామాయణంలో కైక అడిగిన రెండు వరముల కారణంగా శ్రీరాముడు వనవాసమునకు వెళ్లే సంఘటనను స్వాధిష్టాన చక్రం గా చెప్తారు. భావావేశములకు మూలమయిన ఈ చక్రమును విపరీతమయిన భావావేశము నిండిన ఈ సంఘటనతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  3. మణిపుర: వనవాసమునకు వెళ్లిన సీతారాములకు దివ్యమయిన ఆభరణములు పరమ పతివ్రత అయిన అనసూయాదేవి ఇవ్వటం అనే సంఘటనను మణిపుర చక్రంగా చెప్తాము. ఈ ఆభరణములు తరువాతి కధలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తాయి. అటువంటి దివ్య మణిమయములయిన ఆభరణములు సీతాదేవికి సంక్రమించే సంఘటనను మణిపుర చక్రంతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  4. అనాహతం: వనవాసం సజావుగా ఆనందముగా సాగుతున్న సమయములో శూర్పణఖ ప్రవేశించుటను అనాహత చక్రంతో పోల్చారు. సరిగ్గా రామాయణంలో అసురవధ ఈ ఘట్టంతరువాతనే ముఖ్యంగా జరుగుతుంది కనుక అడ్డంకులు తొలగించు అనాహత చక్రం తో ఈ సంఘటనను పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  5. విశుద్ధి: సీతా వియోగం వలన పరితపిస్తున్న శ్రీరాముడు  పరమ శుద్ధ భక్తురాలయిన శబరిని కలిసిన సంఘటనను ఈ విశుద్ధి చక్రంతో పోల్చారు. 
  6. ఆజ్ఞా: రామాయణంలో సుగ్రీవుని ఆజ్ఞతో సీతాదేవిని వానరులు వెతుకుటకు బయలుదేరు సంఘటనను ఆజ్ఞా చక్రం మొదలుగా పోల్చారు. అయితే సహజంగా ఈ చక్రం వరకు చేరిన ప్రాణమునకు దివ్య దర్శనం జరుగుతుంది. మరి రామాయణంలో జరిగిన ఆ క్షణకాల దివ్య దర్శనం ఎం అయ్యి ఉంటుంది?  దీనికి సమాధానంగా మన పెద్దలు కిష్కిందకాండలో సీతను వెతుకుతూ వెళ్లిన హనుమంతుడు మొదలగు వారికి కలిగిన ఒక అనుభవాన్ని చెప్తారు. సూర్యప్రభాదేవి . అనుకోకుండా ఒక కొండా గుహలో బందీలయిన వానర వీరులను సూర్యప్రభాదేవి ఒక్క క్షణకాలంలో సముద్ర తీరమునకు చేర్చుతుంది. 
  7. సహస్త్రారం: ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది అని చెప్పుకున్నాం కదా! రామాయణంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టమును ఈ చక్రముతో పోల్చారు. 

3, మే 2019, శుక్రవారం

మానవుని దేహంలో 7 చక్రములు

మానవుని దేహంలో 7 చక్రములు ఉంటాయి. ఆ చక్రములను జాగృతం చేస్తే మానవుని మేధస్సు నిరుపమానంగా వృద్ధి చెందుతుంది. మరి ఆ చక్రములు ఏవో చెప్పుకుందాం!


  1. మూలాధారం : పేరు లో చెప్పినట్లు ఏది మూలమునకు ఆధారంగా ఉంటుంది. మానవుని దేహములో ఈ చక్రం వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. ఈ చక్రంలో భూ తత్త్వం ఉంటుంది.  సహజంగా ఈ చక్రము ఎరుపు రంగు కలిగి నాలుగు పత్రములు కల్గిన చక్రంగా చెప్తారు. ఈ చక్రం మానవుని దేహంలో స్థిరత్వమును కలిగిస్తుంది 
  2. స్వాధిష్టానం: ఈ పేరుకు అర్ధం స్వ - అధిష్టానం. మానవుని శరీరంలో ఈ చక్రం పొత్తికడుపు భాగం లో ఉంటుంది. ఈ చక్రం జలతత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం నారింజరంగు కలిగిన ఆరు పత్రములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో భావావేశములు మరియు కోరికల కు నియంత్రిస్తుంటుంది. 
  3. మణిపుర: దీనికి అర్ధం మణుల పురము అని. మానవుని దేహంలో ఈ చక్రం బొడ్డు భాగంలో ఉంటుంది. ఈ చక్రం అగ్నితత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం ఎరుపు రంగులో త్రికోణంగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో ఆహారము జీర్ణ క్రియను నియంత్రిస్తుంది.  
  4. అనాహతం: ఈ పేరుకు అర్ధం అనా- హతం, అడ్డంకులు లేనిది. మానవుని దేహంలో ఈ చక్రం హృదయస్థానంలో ఉంటుంది. ఇది వాయు తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం ఆకుపచ్చ రంగులో మధ్య షట్కోణం దానిచుట్టూ 12 కమల దళములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట వలన తమపర భేదం లేని అవ్యాజమైన ప్రేమ మూర్తులు గ ఉంటారు. 
  5. విశుద్ధి: ఈ పేరుకు అర్ధం పరిశుభ్రం చేయునది అని. మానవుని దేహంలో ఈ చక్రం కంఠ భాగంలో ఉంటుంది. ఈ చక్రం ఆకాశ తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం నీలం రంగు కలిగి తలక్రిందులుగా ఉన్న త్రిభుజం దానిచుట్టూ 16 వంకాయరంగు దళములు కలిగిన పద్మముగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట  వలన నిస్సందేహంగా నిజములను చెప్పగలుగుతారు. వారి మనోభావాలను సూటిగా చెప్పగలుగుతారు. 
  6. ఆజ్ఞా: ఈ పేరుకు అర్ధం స్వాధికారత. మానవుని దేహంలో ఈ చక్రం కనుబొమల మధ్య ఉంటుంది. ఈ చక్రానికి ఏవిధమయిన తత్త్వం ఉండదు. ఈ చక్రం పారదర్శికం గా ఉన్న కమలం దానిలో రెండు తెలుపు దళములతో ఉంటుంది. ఈ చక్రం జాగృతం అవుట వలన  మానవునికి తనగురించి తనకు పూర్తిగా తెలుస్తుంది, భౌతిక విషయములకు మించి అనేక విషయముల జ్ఞానం కలుగుతుంది. 
  7. సహస్త్రారం: ఈ పేరుకు అర్ధం వేయి దళముల పద్మం. మానవుని దేహంలో ఈ చక్రం మాడు పైభాగం లో ఉంటుంది. ఈ చక్రము ఏ విధమయిన భౌతిక ధాతువుల తత్వమూ కలిగి ఉండదు. ఈ చక్రం వేయిదళముల పద్మం, ఈ పద్మం చుట్టూ లేత గులాబీరంగు కంటి ఉంటుంది. ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది.