5, జనవరి 2022, బుధవారం

తెలిసిన వానికి చెప్పవచ్చు...

తెలిసిన వానికి చెప్పవచ్చు... తెలియని వానికి చెప్పవచ్చు కానీ తెలిసీ తెలియనివానికి చెప్పటం కష్టం  అని మన పెద్దలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా! ఇంతకీ ఆ మాటకు, ఆ సామెతకు మూలం ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. 

ఈ విషయం  గురించి భర్తృహరి తన సుభాషితాలలో మూర్ఖ పద్దతి అనే ఘట్టం లో చెప్పాడు. ఆ శ్లోకం మీకోసం 

అజ్ఞ:సుఖమారాధ్యస్సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ:

జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి 

అర్ధం: 

అజ్ఞ: = తెలియనివానికి ; సుఖ = సుఖంగా,సులువుగా;  ఆరాధ్యః =సేవించవచ్చు/ బోదించ వచ్చు; విశేషజ్ఞ:= విషయము తెలిసిన వానికి; సుఖతరం= చాలా తేలికగా; ఆరాద్యతే= సేవింపవచ్చు, బోదించ వచ్చు; జ్ఞాన = తెలివి/విషయ పరిజ్ఞానం, లవ = కొంచెం కలిగి, దుర్విదగ్ధం= గర్వం కలిగిన ; నరం = నరునికి;  బ్రహ్మాపి = బ్రహ్మదేవుడయినా ;న రంజయతి = సమాధాన పరచలేడు. 

తాత్పర్యం: అసలు విషయ పరిజ్ఞానం లేని వానికి సులువుగా బోదించ వచ్చు, విషయము తెలిసిన వానికి చాలా తేలికగా చెప్పవచ్చు, కానీ కొంచెం విషయ పరిజ్ఞానం కలిగి మొత్తం తెలుసు అనుకునే గర్వం కలిగిన మనిషికి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు కూడా ఏమి చెప్పలేడు.  

ఇదే విషయాన్ని మనం ఇప్పుడు చక్కని తెలుగు పద్యంలో చూద్దామా!

తెలియనిమనుజుని సుఖముఁగ 

దెలుపం దగు సుఖతరముగ  దెలుపఁగ వచ్చున్ 

దెలిసినవానిం  దెలిసియు 

దెలియని నరుఁ దెల్ప బ్రహ్మదేవుని వశమే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి