వివస్వంతుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వివస్వంతుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

సూర్యుడు సంధ్యాదేవి కలయిక - అశ్వినీ దేవతలు

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి, ఆ నిజం తెలుసుకున్న సూర్యుడు తన ప్రభావాని తగ్గించుకుని తన భార్య వద్దకు బయలుదేరాడు అని, సూర్యుని నుండి తొలగించిన ప్రకాశాన్ని ఉపాయోగించి దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు అనేకా రకములయిన ఆయుధాలను తయారు చేసాడు అని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు సూర్యుడు సంధ్యాదేవి వద్దకు ఎలా వెళ్ళాడు? అప్పుడు ఏమి జరిగింది అని తెలుసుకుందాం!

తన భార్య ఎక్కడ ఉన్నదో ముందే తెలుసుకున్న సూర్యుడు తన ప్రకాశాన్ని తగ్గించుకున్న తరువాత ఆమె వద్దకు ఉత్తరకురుదేశమునకు బయలుదేరాడు. ఆమె ఆడగుర్రం రూపంలో ఉన్నది కనుక అతనుకూడా మగ గుర్రం రూపాన్ని ధరించి అమె వద్దకు వెళ్ళాడు. అలా తన వద్దకు వచ్చిన భర్తతో అమె ఇద్దరు కుమారులను (కవల పిల్లలు) కన్నది. అయితే వారు గుర్రం రూపంలో ఉండగా వారికి సంతానం కలిగింది కనుక ఆ ఇద్దరిని అశ్వినులు అని పిలిచారు. వారే దేవవైద్యులుగా ప్రసిద్ది పొందారు. ఆ తరువాత సూర్యునికి, సంధ్యాదేవికి రేవతుడు అని ఒక కుమారుడు జన్మించాడు. అతను సకల శస్త్రాస్త్రకోవిదుడు. 

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

దేవశిల్పి - దేవతల ఆయుధాలు

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, యమునికి చాయాదేవి ఇచ్చిన శాపం గురించి, ఆ శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి, ఆ నిజం తెలుసుకున్న సూర్యుడు తన ప్రభావాని తగ్గించుకుని తన భార్య వద్దకు బయలుదేరాడు అని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

సూర్యుని నుండి తొలగించిన ప్రకాశాన్ని దేవశిల్పి విశ్వకర్మ కొన్ని విచిత్రమయిన శక్తివంతములయిన ఆయుధాలను, వాహనాలను తయారు చేయడానికి ఉపయోగించాడు. అలా తయారుచేయబడిన వస్తువులు

  1.  విష్ణుమూర్తి సుదర్శన చక్రం, 
  2. పరమశివుని త్రిశూలం, 
  3. కుమారస్వామి శక్తి ఆయుధం,
  4. యముని దండం
  5.  వసువులకు శంఖములు,
  6. అగ్నికి రధము,
  7.  కుబేరునికి పుష్పకము మరియు కొందరు దేవతల ఆయుధములు తయారుచేసెను. 
అంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రం, పరమశివుని త్రిశూలం కూడా సూర్యుని తగ్గించబడిన ప్రకాశంనుండి తయారు చేశారంటే సుదర్శన చక్రం, త్రిశూలంకి ఉన్న శక్తి అపరిమితం కాదా! మన పురాణాల ప్రకారం సుదర్శన చక్రం, త్రిశూలల శక్తి అపరిమితం, వానిని కేవలం విష్ణుమూర్తి , పరమశివులు మాత్రమే సంధించగలరు. మరి ఇక్కడ మనం నేర్చుకున్నదానికి, నిజానికి ఉన్నతేడాను ఎలా అర్ధం చేసుకోవాలి? తరువాతి టపాలలో చూద్దాం!

7, ఫిబ్రవరి 2022, సోమవారం

సంధ్య- ఛాయ- సూర్యుడు- విశ్వకర్మ

  మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, యమునికి చాయాదేవి ఇచ్చిన శాపం గురించి, ఆ శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తన భార్య పిల్లలమీద వివక్ష చూపడానికి కారణం తెలుసుకోవడానికి సూర్యుడు తిన్నగా ఛాయాదేవి వద్దకు వెళ్ళి ఆమె పిల్లల మధ్య అలా ఎందుకు వివక్ష చూపుతోందో అని అడిగాడు. ఆమె సూర్యునికి సరి అయిన సమాధానం చెప్పలేక పోవాడాన్ని గమనించిన సూర్యునికి అమె పై అమితమైన కోపం వచ్చింది. అప్పుడు అతను ఆమెను శపిస్తానని అన్నాడు. సూర్యుని మాటలకు భయపడి, ఆమె సంధ్యాదేవికి ఇచ్చిన మాట ప్రకారం ప్రాణ సంకట సమయంలో నిజమును చెప్పవచ్చు అని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు తన ప్రాణములకు సంకటం ఉన్నది అని గమనించి ఆమె నిజాన్ని అతనికి తాను సంధ్యాదేవిని కానని, ఆమె తయారు చేసిన ఒక ఛాయను మాత్రమే అని, సంధ్యాదేవి చాలాకాలం క్రితమే తనను అక్కడ ఉంచి వెళ్ళిందనీ, సావర్ణి, శనైశ్చరుడు తన పిల్లలు అని చెప్పింది.  

ఛాయాదేవి చెప్పిన  విషయాలను విన్న సూర్యుడు సంధ్యాదేవి ఇంకా పుట్టింట్లోనే ఉన్నది అనే ఆలోచన వల్ల మామగారయిన దేవశిల్పి విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. సూర్యుడు చెప్పిన విషయాలను విన్నవిశ్వకర్మ, కొంతకాలం క్రితం  తన కుమార్తె తన వద్దకు వచ్చిందనీ,  వచ్చినప్పుడు ఆమె సుర్యుని వేడిని తాను భరించలేక పోతున్నందున అలా వచ్చినట్లు చెప్పిందని, ఆమెకు నచ్చజెప్పి ఆమెను తిరిగి పంపానని, ఆమె అప్పుడే తన వద్ద నుండి తిరిగి వెళ్ళి పోయిందని చెప్పాడు. అప్పుడు ఆమెకు ప్రియం కలిగించేలా సూర్యునికి అతని వేడిని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తానని  దేవశిల్పి విశ్వకర్మ చెప్పాడు. మామగారు చెప్పిన మాటలు విన్న సూర్యుడు  అతను చెప్పిన మాట ప్రకారం  ఒక భ్రమియంత్రంలో ప్రవేశించి అతని ప్రకాశమును 16వ వంతునకు తగ్గించుకున్నాడు.

ఆ తరువాత సూర్యుడు స్వయంగా తన దివ్య దృష్టి ద్వారా తన భార్య సంధ్యాదేవి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని, ఆమె  వద్దకు వెళ్ళాడు. 

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

యముని శాప పరిష్కారం

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ  గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తల్లితో శపించబడిన యముడు, తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా వివరించాడు. యముడు చెప్పిన మాటలు విన్న వివస్వంతుడు / సూర్యుడు ఆలోచించాడు.  యమునికి సంధ్యాదేవి ఇచ్చిన శాపమును తప్పించే అవకాశం లేనందువలన సూర్యుడు ఆతనికి మధ్యేమార్గంగా ఒక వరం ఇచ్చాడు. అతని తల్లి ఇచ్చిన శాప కారాణంగా యముని కాలు  భూమిపై పడాలి, దానికి సూర్యుడు యముని కాలులోని మాంసమును క్రిములు తీసుకుని భూమిపైకి వెళతాయి అని, అలా జరగడం వలన అతని కాలులోని మాంసం భూమి పైకి వెళ్ళిన కారణంగా యమునికి పుర్తిగా శాప విమొచనం కూడా కలుగుతుంది అని చెప్పాడు. ఆ పరిష్కారం విన్న యముడు తన అవేశమును తగ్గించుకుని వెళ్ళిపోయాడు. 

ఒక తల్లి తన బిడ్డలందరినీ సమానంగా చూస్తుంది. కానీ తన భార్య ముందు పుట్టిన పిల్లలు, తరువాత పుట్టిన పిల్లల మధ్య భేదం ఎందుకు చూపుతోందో అర్ధం కాలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవడనికి  సూర్యుడు తన భార్య వద్దకు బయలుదేరాడు. 

మరి తరువాత ఏం జరిగింది? నిజం బయటపడిందా, లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

30, జనవరి 2022, ఆదివారం

ఛాయాదేవి సవతి ప్రేమ

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు సంధ్యాదేవి వెళ్ళి పోయిన తరువాత ఛాయ ఏమి చేసింది? ఇప్పుడు తెలుసుకుందాం!

సంధ్యాదేవి వెళ్ళిన తరువాత ఛాయ పూర్తిగా సంధ్యాదేవిలానే ప్రవర్తించ సాగింది. వివస్వంతునికి ఆమె సంధ్యాదేవికాదు అన్న అనుమానమే రాలేదు. వారికి ఇద్దరు పుత్రులు జన్మించారు. వారు సావర్ణి, శనైశ్చరుడు. 

సావర్ణి ః వైవస్వత మనువు తరువాత వచ్చే మనువు సావర్ణి మనువు. 

శనైశ్చరుడుః సర్వప్రాణుల కర్మ ఫలదాత

అప్పటి వరకూ సంధ్యాదేవివలెనే ప్రవర్తించిన ఛాయాదేవి, తనకు సంతానం కలిగిన తరువాత తన పిల్లలను ప్రేమగా చూసుకుంటూ సంధ్యాదేవి పిల్లలను వివక్షతతో చూడసాగింది. 

ఆ వివక్షతను కొంతవరకూ భరించిన యముడు, కొంతకాలమునకు భరించలేక ఆమెను నిలదీశాడు. అలా నిలదీస్తున్న సమయంలో అతను కోపమునకు వశుడయ్యి తన కాలును ఆమె పైకి ఎత్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఛాయాదేవి యముని కాలు భూమిపై పడాలని శపించింది. 

అలా సవతిప్రేమను చూపిన ఛాయాదేవిని వివస్వంతుడు ఏమి చేశాడు? ఆమె సంధ్యాదేవి కాదు అని తెలుసుకున్నారా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

26, జనవరి 2022, బుధవారం

సంధ్యాదేవి - ఛాయ

 మనం ఇంతకు ముందు కశ్యపుడు  - కుటుంబం గురించి తెలుసుకున్నాం కదా! వారిలో అదితి పుత్రులు ఆదిత్యులు అని చెప్పుకున్నాం కదా! ఆ ద్వాదశ ఆదిత్యుల గురించి కూడ చెప్పుకున్నాం. ఇప్పుడు వారిలో వివస్వంతుని గురించి చెప్పుకుందాం!

వివస్వంతుడు దేవశిల్పి విశ్వకర్మ పుత్రిక అయిన సంధ్యాదేవిని వివాహం చేసుకున్నడు. సంధ్యాదేవికి వివస్వంతుని మీద అనురాగం ఉన్నా అతని వేడిని తట్టుకోలేక పోయేది. వారికి కొంతకాలమునకు సంతానం కలిగింది. వారు వైవస్వత మనువు , ధర్మరాజయిన యముడు మరియు యమున కవల పిల్లలు. 

అప్పటికీ ఆమె సూర్యుని వేడిని తట్టుకోలేక తన నీడ నుండి అచ్చం తనలాగే ఉండే ఛాయను తయారు చేసి తనలాగే అక్కడ ఉంటూ, తన భర్తను పిల్లలను చూసుకుంటూ ఉండమని, తను సంధ్యాదేవి కాదు అనే విషయం ఎవరికీ తెలియకుండా ప్రవర్తించమని చెప్పింది. ఆ మాటలు విన్న ఛాయ తన ప్రాణములకు హాని జరుగదు అన్న నమ్మకం ఉన్నంత కాలం ఆ విషయం ఎవరికి చెప్పనని మాట ఇచ్చింది. సంధ్యాదేవి నిశ్చింతగా తన పుట్టింటికి వెళ్ళింది. 

అలా అనుకోకుండా పుట్టింటికి వచ్చిన సంధ్యాదేవిని చూసి అమె తండ్రి కారణం అడిగాడు. ఆమె విషయం చెప్పింది. అతను ఆమెను సముదాయించి తిరిగి పంపించాలి అనుకున్నాడు. ఆమె ఎలాగూ తనవంటి ఛాయను ఆమె తయారు చేసింది కనుక ఆమె తిరిగి వెళ్ళాలి అనుకోలేదు. కనుక ఆమె తన తండ్రికి తన ఇంటికి వెళుతున్నానని చెప్పి, ఉత్తర కురుదేశమునకు వెళ్ళింది. ఆమె తన సొంత రూపంలో ఉంటే ఎవరయినా గమనిస్తారని ఆమె ఒక ఆడ గుర్రం రూపంలో తపస్సు చేస్తూ ఉంది. 

తరువాత ఏమి జరిగిందో తరువాతి టాపాలలో చూద్దాం!