19, జనవరి 2022, బుధవారం

మూర్ఖుని మనస్సు

 మనం ఇంతకు  ముందు భర్తృహరి సుభాషితాలలో మూర్ఖపద్ధతి అనే ఘట్టంలో ఒక శ్లోకం  చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మరొకటి చూద్దాం!

 ప్రసహ్య మణిముద్ధరేన్మకరవక్త్రదంష్ట్రాన్తరా  

త్సముద్రమపి సంతరేత్పృచలదూర్మిమాలాకుల౯మ్

భుజ మపి కోపితం శిరసి పుష్పవద్ధారయే

న్నతు ప్రతినివిష్టమూర్ఖ జనచిత్తమారాధయేత్

అర్ధం ః  

ప్రసహ్య = బలవంతంగా; మణిం =మణులను ; ఉద్ధరేత్ = తీసుకోవచ్చు;  మకర = మొసలి; వక్త్ర = నోటిలోని ; దంష్ట్రా = కోరల ; అంతరాత్ = మధ్యనుండి ; సముద్ర= సముద్రమును; మపి =అయినను; సంతరేత్ =దాటవచ్చు ; ప్రచలత్ = వేగంగా కదులుతున్న ; ఊర్మి = అలల ; మాలా = వరుసలు, ఆకులం = భయంకరమయిన  ;  భుజ మపి = పాములనయినా; కోపితం = బుసలు కొట్టే ;  శిరసి = తలపైన; పుష్పవత్ = పూవు వలే; ధారయేత్ = ధరించవచ్చు ; ప్రతినివిష్ట = మొండిగా ఉన్న; మూర్ఖజన = మూర్ఖుని; చిత్తం = మనస్సును; ఆరాధయేత్ = మార్చటం ; న = కుదరదు , వీలుకాదు. 

తాత్పర్యం:

మొసలి నోటిలోని పదునయిన కోరల మధ్యనుండి విలువయిన రత్నమును కష్టపడి బయటకు తీయ్యవచ్చు, భయంకరమయిన అలలు కలిగిన సముద్రమును దాటవచ్చు, కోపంతో బుసలుకొడుతున్న పాములను పువ్వులవలె తలపైన ధరించవచ్చు కానీ మొండిపట్టుపట్టిన మూర్ఖుని మనస్సు మార్చటం అస్సలు జరుగదు. 

ఇదే శ్లోకమునకు తెలుగు పద్యం చూద్దామా!

మకరముఖాంతరస్థ మగు మానికమున్ బెకలించ వచ్చు బా

యక చలదూర్మికానికర మైనమహోదధి దాట వచ్చు మ

స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింప వచ్చు మ

చ్చిక ఘటియించి ముర్ఖజనచిత్తము దెల్ప నసాధ్య మేరికిన్



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి