రామాయణం ఉత్తర రామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామాయణం ఉత్తర రామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

పుష్పక విమానం రావణునికి ఎలా లభించింది?

 మనం ఇంతకుముందు దశగ్రీవుడు అత్యంత బలశాలి, సకల శాస్త్రముల జ్ఞానము కలిగి ఉండి కూడ  తన చుట్టూ ఉన్నవారి మాటలు విని తన వివేకాన్ని పూర్తిగా కోల్పోతున్న విధానాన్నిచూసాం! ఇంతకు ముందు భాగంలో మనం దశగ్రీవుని అరాచకాలను గురించి విన్న కుబేరుడు తన తమ్ముని ధర్మమార్గంలోనికి మార్చడానికి ఒక ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం గురించి, దానికి దశగ్రీవుడు ఎలా స్పందించాడు అని తెలుసుకుందాం!

కుబేరుడు తన తమ్ముని అధర్మ ప్రవృత్తి గురించి తెలుసుకుని, అతనిని మంచి మార్గంలోనికి మార్చడనికి ఒక ప్రయత్నం చేయడనికి ఒక దూతను పంపాడు.  ఆ దూత దశగ్రీవుని వద్దకు వచ్చి, కుబేరుడు అతనికి చెప్పమన్న అన్ని విషయములను చెప్పాడు. కానీ ముందే అధర్మ మార్గంలో ఉన్న దశగ్రీవునికి ఆ మాటలు రుచించలేదు. అంతేకాక ఆ మాటలలో కుబేరుడు తాను పరమశివునకు మిత్రుడని చెప్పడం అతని అహానికి పెద్ద శరాఘాతంగా అనిపించింది. కుబేరుడు తనను హెచ్చరిస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దానివలన అతను తన ఆధిపత్యాన్ని చూపించడానికి, కుబేరుని దూతను హతమార్చాడు. అంతేకాక అతను స్వయంగా కుబేరుని పై యుధ్ధాన్ని ప్రకటించాడు. 

అలకాపురి చుట్టూ తన రాక్షససేనను మొహరింపజేసాడు. ఆ సేనను చూసిన యక్షులు కూడా తమ యుధ్ధాన్ని ప్రారంభించారు. యుధ్దం హొరాహోరీగా సాగింది. అనేక మంది యక్షులు తమ ప్రాణాలను కోల్పోయారు.  ధర్మ యుధ్దం చేస్తున్న కుబేరుడు రాక్షస సేనలను తమపురినుండి తరమ సాగాడు. తమ అపజయాన్ని పసిగట్టిన దశగ్రీవుడు మాయా యుధ్ధాన్ని ప్రారంభించాడు. ఆ మాయా యుధ్ధంలో కుబేరుడిని దశగ్రీవుడు ఒడించాడు. అతని దగ్గరి నుండి పుష్పకవిమానమును లాక్కున్నాడు. అప్పటినుండి ఆ పుష్పక విమానం అతని వద్దనే ఉంది. 

6, జనవరి 2022, గురువారం

చెప్పుడు మాటలు విన్న దశకంఠుడు

 మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది, దశగ్రీవుడు నిజంగా అంత చెడ్డవాడా,  కైకసి కుమారులు  పొందిన వరముల గురించి తెలుసుకున్నాం కదా! 

వారు పొందిన వరముల గురించి తెలుసుకున్న వారి తాతగారు అయిన సుమాలి, అతని మంత్రులు మారీచుడు, ప్రహస్తుడు మొదలగు వారితో కలిసి వారి వద్దకు వచ్చాడు. తాము సాధించలేనిది తమ వంశంలో వారు సాధించినందుకు ఎంతో సంతోషించారు. వారి స్వార్థం తిరిగి రెక్కలు తొడిగింది. చెప్పిన మాటలను చక్కగా వినే దశగ్రీవుని తన మాటలతో రెచ్చగొట్టారు. 
లంక వారిదే కనుక, ప్రస్తుతానికి అక్కడ నివసిస్తున్న తన అన్నగారు అయిన వైశ్రవణుని అక్కడినుండి తరిమేయాలి అని, ఆ లంకను వారు సొంతం చేసుకోవాలని కోరారు. అంతే కాక అతనికి లభించిన 
పుష్పకం అనే విమానం యొక్క గొప్పదనం గురించి తెలుసుకుని దానిని కూడా సొంతం చేసుకోవాలని కోరారు. 
కానీ వారి మాటలు దశగ్రీవుడు అంగీకరించలేదు. 
వారు సమయానుసారంగా దశగ్రీవునికి ఆ మాటలు చెప్తూనే ఉన్నారు. ఆ మాటలు వినగా వినగా చివరకు దశగ్రీవునకు ఆ మాటలు రుచించసాగాయి. అప్పుడు అతను వైశ్రవణుని వద్దకు ఒక దూతని పంపాడు. ఆ దూత చేత ఆ లంకా నగరం తమది కనుక తమకు అప్పగించమని రాయబారం పంపాడు. 
తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆ లంకానగరాన్ని వదలి వెళ్ళటం ఇష్టం లేకున్నా, దశకంఠుని మూర్ఖత్వాన్ని గురించి తెలుసు కనుక, తన తండ్రి విశ్రవసువు సలహా మరియు సూచనల మేరకు వైశ్రవణుడు ఆ లంకను వదలి,పుష్పక విమానంతో పాటు కైలాసపర్వత ప్రాంతమునకు వెళ్లి అక్కడ తిరిగి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.