మత్స్య పురాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మత్స్య పురాణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2019, గురువారం

సుకాలినులు

సుకాలినులు అనే పితృ దేవతలు మూర్తగణములు.  వీరు ద్యులోకం పైన నక్షత్రకాంతిలో ప్రకాశించు జ్యోతిర్భాసి అనే లోకంలో నివసిస్తారు. వీరి తండ్రి గారు వశిష్ఠుడు. వీరిని శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులు పూజిస్తారు. వీరి మానస పుత్రి పేరు గౌ:



23, జూన్ 2019, ఆదివారం

హవిష్మంతులు

హవిష్మంతులు అనే పేరుగల పితృగణము మూర్తగణము. వీరి తండ్రి అంగీర: ప్రజాపతి. వీరు నివసించు లోకము సూర్యమండలములో గల మరీచి గర్భములు, అంటే లోపలవైపునకు కూడా కిరణములు కలవి అని అర్ధము కలిగిన లోకములు. వీరిని శ్రాద్ధములు జరిపించు క్షత్రియులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు యశోద. 
ఆమె సూర్యవంశమునకు చెందిన అంశుమంతుడు అనే రాజునూ వివాహం చేసుకున్నది. వారికి జన్మించిన పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు భగీరధుడు. సాక్షాత్తు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చినది ఇతనే. 



15, జూన్ 2019, శనివారం

వైరాజులు

పితృదేవతలలో ఆమూర్తి గణములలో మొదటి వారు వైరాజులు. వారి తండ్రి పేరు  విరాజుడు. వీరు నివసించు లోకము ద్యు లోకము. వీరిని మానవ దేవతా భేదం లేకుండా అందరూ  ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు మేన దేవి.ఈమె ఒకానొక శాపం కారణంగా భూలోకమునకు రావలసి వచ్చి, హిమవంతుడిని వివాహం చేసుకున్నది. ఆ తరువాత ఆమె పార్వతిదేవికి  తల్లి అయినది. 

13, జూన్ 2019, గురువారం

పితృ దేవతలు - సత్యవతి

ఇంతకు  ముందు మనం పితృ దేవతలు , వారి పుత్రిక అమావస్య గా ఎందుకు పిలవ బడుతుంది అని తెలుసుకున్నాం కదా !
ఆ విషయం  తెలుసుకున్నప్పుడు ఆమెకు పితృదేవతలు ఇచ్చిన శాపం గురించి కూడా తెలుసుకున్నాం! ఆమెను భూలోకంలో మానవజన్మ నెత్తమని వారి శాపం.  వారి శాపమును విన్న అమావస్య అత్యంత బాధకు, పశ్చాతాపమునకు లోనయ్యి ఆ శాపమునకు కలుగు ఉపశమనమును తెలుపమని కోరినది. భూత భవిష్య వర్తమాన కాలములను తెలుసుకొనగలిగిన ఆ పితృ దేవతలు ఆమెకు జరుగబోయే విషయములను చక్కగా వివరించారు.

ఆమె 28వ ద్వాపరయుగములో ఒక దివ్య పురుషునకు జన్మనివ్వవలసి ఉన్నది. అతను మాత్రమే తరువాత వచ్చు అనేక అల్పబుద్ధి, అల్ప ఆయుష్షు కల్గిన మానవులను కాపాడే విధంగా వేదములను విభాగం చేయగలడు. అయితే అతని జననం వలన ఆమె కన్యత్వం చెడదు. ఆ తరువాత ఆమె సముద్ర అంశతో జన్మించిన శంతనుడు అనే ఒక మహారాజును వివాహం చేసుకుంటుంది.
తెలిసింది కదా ఆమె ఎవరో! ఆమే మత్స్య గంధి, యోజన గంధి  అని పిలువ బడే సత్యవతి. 

11, జూన్ 2019, మంగళవారం

పితృ దేవతలకు అమావస్య తిధి ఎందుకు ఇష్టమంటే ...!

మనం ఇంతకు ముందు పితృదేవతలు 7 గణములని వారి పేర్లు చెప్పుకున్నాం కదా! వారిలో అగ్నిష్వాత్తులు అనే పితృదేవతలకు ఆచ్చోదా అనే మానస పుత్రిక ఉన్నది. ఆమె ఒక వెయ్యి దివ్య సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన పితరులు సంతుష్టులై ఆమెను వరం కోరుకొమ్మని అడిగారు. అయితే వచ్చిన ఆ పితృదేవతలలో మావసుడు అనే వానిని ఆమె వరించింది. ఆమె చేసిన ఈ ధర్మ దూరమయిన పనికి ఆ పితృ దేవతలు  ఆమెను భూలోకములో జన్మించమని శపించారు.
అయితే ఆ మావసుడు ఆమెను పుత్రికా దృష్టితో చూసినందువలన ఆమె మావాస్య కాలేదు. అంటే ఆమె అమావాస్య అయినది. ఆమె చేసిన తపస్సును పితృదేవతలు మెచ్చారు కనుక అమావస్య తిధి రోజు పితరులకు అర్పించినది ఏదయినా అక్షయము అవుతుంది.