26, మే 2020, మంగళవారం

సుమిత్ర, కైక విష్ణు అంశలకు తల్లులు ఎలా కా గలిగారు?

మనం ఇంతకు ముందు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎందుకు పుట్టాడు అని  చెప్పుకున్నాం  కదా! అయితే ఇంతకూ ముందు చెప్పినట్లు కొన్ని కధలలో అవి చెప్పిన గ్రంధం/పురాణం ను బట్టి ఆ సంఘటనలలో కొంత మేరకు మార్పులు ఉంటాయి.
ఒక జన్మలో ఆ కశ్యపుడు, అదితి లు శ్రీరాముని తన కుమారునిగా పొందుటకు దశరధునిగా మరియు కౌసల్య గా జన్మించారు. ఆ సమయంలో రామునితో పాటుగా శ్రీమహావిష్ణు అంశలు అయిన ఆదిశేషువు, శంఖ , చక్రములు కూడా లక్ష్మణ భరత శత్రుజ్ఞులుగా జన్మించారు. వీరికి తండ్రి దశరధ మహారాజు కాగా లక్ష్మణ, శత్రుజ్ఞులకు తల్లి సుమిత్ర, భరతుని కి తల్లి కైకేయి.
ఇంతకూ ముందు మనం చెప్పుకున్నట్లు శ్రీ మహావిష్ణువును పుత్రునిగా పొందుటకు కశ్యపుడు, అదితి తమ ముందు జన్మలో తపస్సు చేశారు. మరి సుమిత్ర, కైకేయి ఏమి చేశారు? వారికి శంఖం - భరతునిగా, ఆదిశేషుడు - లక్ష్మణుడిగా, చక్రం - శత్రుజ్ఞుడుగా ఎలా జన్మించారు? దానికి కారణం ఏమి అయ్యి ఉంటుంది?

మనం ఇంతకూ ముందు అసూయ గురించి, మదం మరియు క్రోధం గురించి చెప్పుకున్నప్పుడు కశ్యపుని భార్యలు అయిన వినత, కద్రువల మధ్య మాత్సర్యం గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం కదా!
కశ్యపునికి దక్షుడు తన 13 మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేసాడు. ఆ 13 మందిలో అదితి, వినత కద్రువ కూడా ఉన్నారు. ఐతే కశ్యప ప్రజాపతి తన భార్యలందరికి సమానమయిన సమయమును కేటాయిస్తూ, ఎవరి సమయమునకు వారి వద్ద ఉండేలా ప్రణాళిక ప్రకారం నడచుకునేవాడు.
అయితే ఒకసారి కశ్యపుడు వినత దగ్గర ఉండగా, కద్రువ కోపంగా వచ్చింది. ఆ సమయంలో కశ్యపుడు కద్రువ వద్ద ఉండాల్సింది. ఆ కోపం మొత్తం వినత మీద తీర్చుకోవటానికి కద్రువ వినతకు శాపం ఇచ్చింది. ఆమె శాపం ప్రకారం వినత గర్భంలో సర్పము, మంట జన్మించాలి. అయితే ఆ శాపం విన్న వినతకు కూడా కోపం వచ్చింది, ఆ కోపంలో కద్రువకు అత్యంత అపకీర్తికలగాలని శపించింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన తమ అక్క, కశ్యపుని మొదటి భార్య అయిన అదితి వారిని వారించ ప్రయత్నించగా తన కోపం ఇంకా చల్లారని కద్రువ తన భర్త అయినా కశ్యపుడు, వినత మరియు అదితి కూడా మానవ జన్మ ఎత్తవలసినది అని శపించింది.
అయితే ఆ కోపములు శాంతించిన తరువాత వినత కద్రువతు తమ తప్పు తెలుసుకుని, ఆ జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది శ్రీమహా విష్ణువు గురించి అద్భుతమయిన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహా విష్ణువు, వారు మానవ జన్మ ఎత్తిన సమయంలో తానూ స్వయంగా వివిధ రూపములలో వారికి పుత్రునిగా జన్మిస్తాను అని వరం ఇచ్చారు. ఆ వరం ప్రకారమే కౌసల్య (అదితి) కి రాముని(విష్ణువు)గా, సుమిత్ర (వినత) కు లక్ష్మణుడు (సర్పం-ఆదిశేషుడు), శత్రుఘ్నుడు (అగ్ని-చక్రం - సుదర్శనం) గా, కైక (కద్రువ) కు భరతుని (శంఖం) గా జన్మించాడు.  కైక, రాముని వనవారం పంపుట వలన తనకు అనంత కాలంవరకు  తరగని అపకీర్తి ప్రాప్తించింది. 

23, మే 2020, శనివారం

రామ, హనుమల తొలి పరిచయం! హనుమంతుని వేషం!

రామాయణంలో కథను మలుపు తిప్పే ఘట్టములలో ముఖ్యమయినది హనుమంతుడు శ్రీరాముని కలుసుకునే ఘట్టం. 
రాముని, లక్ష్మణుడిని కలుసుకునే సమయమునకు హనుమంతుడు సుగ్రీవుని వద్ద మంత్రిగా ఉన్నాడు. ఆ సమయమునకు సుగ్రీవుడు తన రాజ్యమును కోల్పోయి, తన సొంత అన్నగారయిన వాలితో శత్రుత్వం వలన ప్రాణ భయంతో ప్రపంచం మొత్తం తిరిగి, చివరకు వాలి రాకుండా ఉండగలిగిన ప్రాంతం ఋష్యమూకం అని తెలుసుకుని ఆ పర్వతం మీద నివాసం ఉంటున్నాడు. ఆ సమయమునకు అతనితో హనుమంతుడు, జాంబవంతుడు మొదలయిన ముఖ్యులు ఉన్నారు. 
ఆ సమయంలో ఋష్యమూక పర్వత ప్రాంతంలో కొత్తగా కనిపించిన, ముని వేషదారులయిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవునికి వాలి తనకోసం వారిని పంపించాడేమో అన్న భయం కలిగింది. ఆ భయమును తననుండి దూరం చేయవలసినదిగా తన మంత్రి అయినా హనుమంతుని కోరాడు. దానికోసం హనుమంతుడు ఆ ఇద్దరు ముని వేషదారుల పూర్వాపరముల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఆ విధమయిన విషయములు తెలుసుకోవాలంటే ముందు ఆ ఇద్దరికీ  ప్రశ్నలు అడుగుతున్నా వారి మీద నమ్మకం కలగాలి . ఒక వేళ ఆ వచ్చినవారు వాలి తరపున వచ్చి ఉంటే వారిని అక్కడే నిలువరించే సాహసం కలవాడు హనుమంతుడు కనుక సుగ్రీవుడు హనుమంతుడిని ఆ పనికోసం పురమాయించాడు.  
ఇప్పుడు సమస్య హనుమంతుడు ఏ వేషంలో వారి ముందుకు వెళ్ళాలి అని!
అనేక రామాయణములలో ఈ ఘట్టం లో హనుమంతుడు 
  1. భిక్షకుని/ సన్యాసి వేషం  అని  చెప్తారు.  
  2. వటువు / బ్రహ్మచారి వేషం అని చెప్తారు. 
మరి ఇంతకూ హనుమంతుడు ఈ వేషంలో వెళ్ళాడు?
  1. భిక్షకుని/ సన్యాసి వేషం ః ఒకవేళ హనుమంతుడు సన్యాసి వేషంలో వెళ్ళినట్లయితే, కథప్రకారం హనుమంతుడు ఆ సోదరుల వద్దకు చేరగానే వారికి నమస్కరించాడు. ఒక భిక్షకుడు / సన్యాసి గృహస్తుకు నమస్కారం చేయడు. హనుమంతుడు భిక్షకుని/ సన్యాసి వేషం లో కనుక అలా చేస్తే రామ లక్ష్మణులకు ముందుగా అతని మీద అనుమానం కలుగుతుంది. తరువాతి ఘట్టములు మన ఊహకు అందని విధం గ ఉండేవి. సుగ్రీవ రాముల మైత్రి ప్రారంభం కూడా అనుమానాస్పదంగానే ఉండేది కదా! 
  2. వటువు / బ్రహ్మచారి వేషం: ఈ వేషం అయితే ఎవరికీ అయినా నమస్కారం చేయవచ్చు. అంటే కాకుండా ఇతను ఆ ఇద్దరినీ ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనే సంకల్పంతో వచ్చాడు కనుక వటువు వేషం అయితే అతను ఈని ప్రశ్నలు అడిగినా వటువుకు కలిగిన సహజసిద్దమయిన జిజ్ఞాస వలన అడుగుతున్నాడు అని అనుకోవటానికి ఆస్కారం దొరుకుతుంది. 
కనుక హనుమంతుడు తొలిసారిగా రామలక్ష్మణులను కలసినప్పుడు ఆటను బ్రహ్మచారి వేషంలో కలిసాడు. 







22, మే 2020, శుక్రవారం

చిలుక - ఉపకారం

మానవుని జీవితంలో ఒకరికి ఉపకారం చేయటం, మరొకరి సహాయం తీసుకోవటం చాలా సహజం. అయితే మనం ఒకరి వద్ద సహాయం తీసుకుంటే వారి పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పారు. ఆ కదా ఇప్పుడు మనం చూద్దాం!
ఒకానొక సమయంలో కాశీ దేశంలో ఒక వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు ఒకసారి వేటకు వెళ్లి ఒక జింకను వెంబడించాడు. ఆ జింకకు గురిపెట్టి ఒక విషపూరితమయిన బాణమును వదిలాడు. ఆ జింక ఆ బాణం నుండి తప్పించుకుని పారిపోయింది. ఆ బాణం తిన్నగా వెళ్లి ఒక పెద్ద చెట్టుకు తగిలింది. చాలా పువ్వులతో, కాయలతో అద్భుతంగా ఉన్న ఆ చెట్టు ఒక్కసారిగా ఆ బాణమునకు ఉన్న విషం కారణంగా నిర్జీవం అయిపోయింది. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక కాపురం ఉండేది.
ఆ చెట్టు నిర్జీవంగా మారినా, ఆ చిలుకకు ఇప్పుడు ఏ సహాయం చేసే స్థితిలో లేకపోయినా, ఆ చిలుక ఆ చెట్టు తొర్రలోనే నివసిస్తూ ఉంది. ఎండ,  చలి,వర్షం వంటి ఏ పరిస్థితి లోనూ ఆ చిలుక ఆ చెట్టును వదిలిపోలేదు. కారణం ఆ చెట్టు ఇంతకు  ముందు ఆ చిలుకకు ఆశ్రయం కలిగించుట వలన కలిగిన గౌరవ మర్యాదలు. ఏమి జరిగినా తనకు ఎంతో సహాయం చేసిన ఆ చెట్టును వదిలి పోకూడదు అని ఆ చిలుక దృఢసంకల్పం గురించి ఇంద్రునికి తెలిసింది. ఆ చిలుకను పరీక్షిద్దామని ఇంద్రుడు మానవ రూపంలో ఆ చిలుక దగ్గరకు వచ్చాడు.
ఆ చిలుకను చూసి ఇంద్రుడు "ఓ చిలుకా, ఈ అడవిలో ఎన్నో పుష్పించిన, ఫలములు ఉన్న చెట్లు ఉండగా నీవు ఈ ఎండిపోయిన చెట్టు తొర్రలో ఎందుకు ఉంటున్నావు ?" అని అడిగాడు.
ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా ! మనకు సహాయం చేసిన వారిని అంటిపెట్టుకుని ఉండుట మన ధర్మం కదా! ఈ వృక్షం ఫలములతో పుష్పములతో ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చింది, ఇప్పుడు దీనికి ఆ శక్తి లేదు, ఆశ్రయం ఇచ్చినప్పుడు తీసుకుని, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం మనకు సహాయం చేసిన వారిని వదలి వెళ్ళిపోతే కృతఘ్నత అవుతుంది కదా!"అని సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న దేవేంద్రుడు, నేను మారువేషంలో వచ్చినా ఈ చిలుక నన్ను గుర్తుపట్టింది అంటే అది దీని పూర్వజన్మ శుభఫలముల వలెనే కనుక తానూ ఆ చిలుకకు సహాయం చేయాలి అని కున్నాడు.
అప్పుడు ఆ చిలుకతో "ఓ చిలుకా! నీవు చెప్పిన ధర్మమునకు నేను ఏంటో సంతోషించాను, నీకు ఏదయినా వరం ఇవ్వాలి అనుకుంటున్నాను నీకు ఏమి కావాలో కోరుకో" అన్నాడు. ఆ మాటలు విన్న చిలుక "ఓ దేవేంద్రా! ఈ వృక్షమునకు తిరిగి పూర్వ స్థితి కలిగించు అని చెప్పింది"
 ఆ మాటలు విన్న దేవేంద్రుడు అత్యంత సంతోషించి ఆ చెట్టు మీద అమృతం చల్లి , ఇంతకూ ముందు ఉన్న వైభవం కంటే ఇంకా ఎక్కువ వైభవమును కలుగజేసాడు.
మనం మనకు సహాయం చేసిన వారికి కష్టం కలిగిన పరిస్థితిలో వారికి తిరిగి మన సహాయమును అందించాలి 

21, మే 2020, గురువారం

ఋచీకుడు - పరశురాముడు - విశ్వామిత్రుడు

ఋచీకుడు నవబ్రహ్మలలో  ఒకరయిన భృగు మహర్షి యొక్క కుమారుడు. ఇతను తన తండ్రి వలెనే  అత్యంత తపస్సంపన్నుడు. ఆ తపస్సులో నిమగ్నమయ్యి ఉండుట వలన ఆటను వివాహం చేసుకోకుండానే వృద్దాప్యమును పొందాడు. అయితే ఒకసారి అతను సత్యవతి అనే రాజకుమారిని చూసి, వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఆమె వివరములు కనుక్కున్నాడు. ఆమె జహ్నుని కులంలోని కుశనాభుని కుమారుడయిన గాధి పుత్రిక. కనుక ముందుగా తన తండ్రి అయినా భృగువు అనుమతి తీసుకుని, మహారాజు అయిన గాధి వద్దకు వెళ్ళి రాకుమార్తెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు. ఆ ప్రతిపాదన రాజుకు ఇష్టం కాలేదు.  ముసలివాడయిన ఒక ఋషికి తన కుమార్తెను ఇవ్వటం గాధికి ఇష్టంలేదు. ఆ విషయం తిన్నగా చెబితే ఆ మహర్షి శపిస్తాడేమో అని భయం. అందుకే అతి కష్టసాధ్యమయిన ఒక కోరిక కోరాలి అని తలచి, కన్యాశుల్కం / ఓలి కింద తనకు శరీరం మొత్తం తెల్లగా ఉండి, కేవలం ఒక్క చెవిమాత్రమే నల్లగా ఉండే వెయ్యి గుఱ్ఱములు ఇస్తే ఆమెను వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు.

ఆ మాటలు విన్న  ఋచీకుడు వరుణదేవుని ప్రార్ధించాడు. ఆ ప్రార్థనలకు మెచ్చి వరుణుడు ఋచీకుడు ఎక్కడ కావాలంటే అక్కడే ఆ అశ్వములు వస్తాయి అని చెప్పాడు. ఆ తరువాత ఋచీకుడు గంగానది ఉత్తరపు ఒడ్డున ఆ గుఱ్ఱములు రావాలి అని సంకల్పం చేసాడు. అలా వచ్చిన గుఱ్ఱములను తీసుకుని గాధి కి ఇచ్చి, అతను రాకుమారి సత్యవతిని వివాహం చేసుకున్నాడు.
వీరి వివాహమయిన కొంతకాలానికి ఋచీకునికి సంతానేచ్ఛ కలిగింది. ఆ మాట తన భార్యకి చెప్పగా, ఆ సత్యవతి తన తండ్రికి వంశోద్ధారకుడు లేదు కనుక తనతో పాటు తన తల్లి కోసం కూడా పుత్ర సంతానం కలిగేలా చూడామణి ప్రార్ధించింది. ఆ ప్రార్ధన విన్న ఋచీకుడు ఒక బ్రాహ్మణత్వం కలిగిన ప్రసాదమును, ఒక క్షత్రియత్వం కలిగిన ప్రసాదమును ఇచ్చి బ్రాహ్మణ ప్రసాదమును సత్యవతి ని స్వీకరించమని, క్షత్రీయ ప్రసాదమును ఆమె తల్లిని స్వీకరించమని , ఆ తరువాత వారు ఋతుస్నాతలు అయినా సమయంలో సత్యవతిని మేడిచెట్టును, ఆమె తల్లిని రావి చెట్టును కౌగలించుకోమని చెప్పాడు.
ఆ సమయం వచ్చినప్పుడు సత్యవతి , ఆమె తల్లి ఇద్దరూ తమతమ ప్రసాదమును, వారు కౌగలించుకోవలసిన చెట్టును తారుమారు చేశారు. ఆ విషయం గమనించిన ఋచీకుడు సత్యవతి వద్దకు వచ్చి బ్రాహ్మణుడయిన తనకు క్షత్రియ అంశతో, గాధి మహారాజుకు బ్రాహ్మణ అంశతో ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సత్యవతి బాధపడి, తనకు సద్బ్రాహ్మణుడు కుమారునిగా ప్రసాదించమని అడిగింది. అప్పుడు ఋచీకుడు తన తపో శక్తిని ప్రయోగించి, తమకు ఒక బ్రాహ్మణుడే కుమారునిగా పుట్టేలా, మనుమడు మాత్రం క్షత్రీయ లక్షణములతో పుట్టేలాగా మార్చాడు. ఆ విధంగా ఋచీకుడు, సత్యవంతులకు పుట్టిన పుత్రుడు జమదగ్ని, వారి మనుమడు క్షత్రియ లక్షణములు కలిగిన పరశురాముడు.
మహారాజు గాధికి బ్రాహ్మణ లక్షణములతో జన్మించిన వాడు విశ్వామిత్రుడు.

20, మే 2020, బుధవారం

సుందోపసుందులు

పూర్వం దైత్య వంశంలో నికుంభుడు అనే దైత్యునకు సుందుడు, ఉపసుందుడు  అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారిద్దరూ అత్యంత స్నేహభావంతో పెరిగి పెద్దవారయ్యారు. ఏ పని చేసినా కలిసే చేసేవారు. ఒకసారి ఇద్దరూ  కలిసి అనేక సంవత్సరములు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. వారిని ఇంద్రుడు అనేక రకములుగా పరీక్షించినా వారు తపస్సును మానలేదు. ఇక తప్పని పరిస్థితిలో బ్రహ్మదేవుడు వారు ముందు ప్రత్యక్షం అయ్యి వరమును కోరుకొమ్మని అడిగాడు.
అందరు దైత్యులు లాగానే మరణం లేని వరం కోరుకున్నాడు. కానీ ఆ వరం ఇవ్వటం సాధ్యంకాదు అని బ్రహ్మదేవుడు చెప్పిన తరువాత, వారు ఒక విచిత్రమయిన కోరిక కోరారు.
వారు కోరిన వరం , వారు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగేలాగా,అన్ని మంత్రములు, మాయలు వారి వశంలో ఉండేలాగా, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగలిగేలాగా, వారిని యుద్ధ రంగంలో ఎవరూ ఓడించకుండా, ఒకవేళ వారిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడి యుద్ధం చేసుకుంటే మాత్రమే చనిపోయేలాగా వారు వరం కోరుకున్నారు.
బ్రహ్మదేవుడు తధాస్తు అని దీవించి వారికి ఆ వరములు ఇచ్చాడు.
వర గర్వితులయిన దైత్యులు అన్ని లోకముల మీద దండెత్తి వానిని స్వాధీన పరుచుకోవటం మొదలు పెట్టారు. వీరి ఆగడాలు సహించలేని దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, బ్రహ్మదేవుడు అలోచించి, విశ్వకర్మను పిలిపించాడు. విశ్వకర్మ చేత తిలోత్తమ అనే అప్సరసను సృజింపజేసి ఆమె ను ఆ దైత్యుల వద్దకు పంపారు.
ఆ సుందోపసుందులు ఆమెను చూసి మోహించి, తనకు మాత్రమే సొంతం, తనకు మాత్రమే సొంతం అని గొడవ పడి, వారిలో వారే  యుద్ధం చేసుకుని , చివరకు మరణించారు.  

19, మే 2020, మంగళవారం

పినాకం - శివుని విల్లు

శివుని ధనస్సును పినాకం అంటారు. దాని వల్లనే శివునికి పినాక పాణి అని పేరు వచ్చింది. అయితే ఆ పినాకమును ఎవరు తయారుచేసారు ? దానిని శివునకు ఎవరు ఇచ్చారు? దీనికి సమాధానం స్వయంగా శివుడే పార్వతికి చెప్పిన ఘట్టం మనకు మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కనిపిస్తుంది.
మనం ఇంతకూ ముందు కల్పములు మరియు యుగములు గురించి చెప్పుకున్నాం కదా! వాని లోని మొదటి కల్పంలోని మొదటి కృతయుగంలో కణ్వుడు అనే మహర్షి మహానిష్ఠ కలిగి అత్యంత కఠినమయిన తపస్సు చేసాడు. ఆటను తపస్సులో లీనమయ్యి ఉండగా, అతని శరీరంమీద పెద్ద పుట్టలు ఏర్పడ్డాయి. పుట్టమీద ఒక వెదురు మొక్క జన్మించినది. ఆ వెదురు మొక్క సహజంగా కాక అతని తపస్సు వలె అత్యంత గొప్పగా పెరిగింది. దాని పొడవు, వెడల్పు చాలా ఎక్కువగా పెరిగాయి. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు వరములను ఇచ్చాడు.
 ఆ వెదురుని బ్రహ్మదేవుడు తనతో తీసుకుని వెళ్ళాడు. దానిని విశ్వకర్మకు ఇచ్చి రెండు విల్లులు చేయమన్నాడు. అలా తయారయిన విల్లులే శివుని చేతిలో ఉండే పినాకం, ఇంకా శ్రీ మహా విష్ణువు చేతిలో ఉండే శారఙము. ఆ రెండు ధనస్సులే కాక మిగిలిన చిన్న ముక్కతో మరొక విల్లును తయారుచేసాడు విశ్వకర్మ. ఆ మూడవ ధనస్సే అర్జునుని చేతికి వచ్చి చేరిన గాండీవము.

18, మే 2020, సోమవారం

విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?

మనం ఇంతకుముందు హనుమంతుడు శివుని అంశ ,వాయువు పుత్రుడు ఎలా అయ్యాడు అని చెప్పుకున్నాం! దానితో పాటు దశరధుని పుత్రకామేష్టి ఫలమయిన పాయసం కారణంగా హనుమానితుడు జన్మించాడు అనే విషయం కూడా చెప్పుకున్నాం!  మరి అసలు హనుమంతుని జన్మకు సార్ధకత అతని దాస్యభక్తి అని మనకు అందరికి తెలుసు కదా! మరి విష్ణుమూర్తికి దాస్యం చేయటానికే శివుడు హనుమంతునిగా పుట్టాడా?
మన పురాణములలో ఒక కథాప్రకారం అవును అనే చెప్పుకోవాలి మరి. ఆ కధ ఏమిటో చూద్దామా!

పుర్వకాలంలో గార్దభనిస్వనుడు అనే ఒక పరమశివ భక్తుడు ఉండేవాడు. అయితే ఎల్లప్పుడూ శ్రీహరిని ద్వేషిస్తూ ఉండేవాడు. శివునికి భక్తుడు అవ్వటం వలన శివునికొరకు  అత్యంత ఘోరమయిన తపస్సు చేసి తనకు జాగ్రత్తు, సుషుప్తి మరియు స్వప్నావస్థలలో ఎవ్వరి చేత మరణం రాకుండా వరం సంపాదించాడు. ఆ వర గర్వంతో  విష్ణుభక్తులను హింసించటం మొదలుపెట్టాడు.    అలాగే  దేవతలను కూడా హింసించాడు. అతని బాధలు పడలేక దేవతలు, మునులు బ్రహ్మదగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ వారిని తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు. వారి బాధలని ఆలకించిన శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి, ఆ రాక్షసుడిని చంపి, అందరికి శాంతిని కలిగిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట విన్న శివుడు విష్ణువు వద్దకు వచ్చి, అతను గార్దభనిస్వనుని కి ఇచ్చిన వరముల గురించి చెప్పి, అతనిని నిర్జించుట అసాధ్యం అని చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీహరి నవ్వి పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు కదా! అలాగే గార్దభనిస్వనుడు కూడా మరణిస్తాడు అని చెప్పారు. శ్రీ హరి చెప్తున్న ఆ మాటలు విన్న శివునికి కుతూహలము పెరిగి, ఒకవేళ శ్రీ మహావిష్ణువు కనుక ఆ గార్దభనిస్వనుడిని సంహరించినట్లయితే తాను స్వయంగా శ్రీమహా విష్ణువుకు దాస్యం చేస్తాను అని పలికారు.
శివుని మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వారు.
తరువాత అతను విశ్వమోహన సౌందర్యవతియైన జగన్మోహిని రూపందాల్చి ఆ గార్దభనిస్వనుడు నివసించే అంతఃపురం దగ్గరకు వెళ్లి మధురస్వరంతో సామవేద గానం ప్రారంభించారు. ఆ అద్భుత గానమునకు ఆకర్షితుడయ్యి గార్దభనిస్వనుడు అంతఃపురంనుండి బయటకు వచ్చి ఆ జగజన్మోహిని సౌందర్యం చుసి మోహితుడయ్యి  ఆమె ఎవరు? ఎక్కడినుండి వచ్చింది? మొదలయినవి వివరములు అడిగాడు. తరువాత అతని గురించి గొప్పలు చెప్పుకున్నాడు, అలా చెప్పుకుని ఆమెను తనని వివాహం చేసుకోమంటూ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనను వినిన మోహిని,  ఆమెను నాట్యగానములలో  ఓడించితే అలాగే చేద్దాం అని అతనికి సవాలు చేసింది. ఆ సవాలని స్వీకరించిన అతను అలా  నాట్యం చేస్తున్న మోహినిని చూసి మైమరిచిపోసాగాడు. ఆ అదును చూసుకుని మోహిని అతనికి సురాపానమును చేతికి అందించింది. ఆమెమీద వ్యామోహం తో ఉన్న గార్దభనిస్వనుడు దానిని  తాగి జాగ్రదావస్థ కాక స్వప్నావస్తా కాక ఉన్న సమయంలో జగన్మోహిని రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు వృకనారాయణావతారం ధరించి గార్దభనిస్వనుడిని తన వాడి అయిన గోళ్ళతో చంపివేసాడు.

ఆ విషయం తెలుసుకున్న శివుడు శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి తాను దాస్యమును స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాను అని తెలుపగా దానికి శ్రీమహావిష్ణువు ఆ దాస్యమునకు సరిఅయిన సమయం అప్పుడు కాదని, ద్వాపర యుగంలో  తాను శ్రీరామావతార సమయంలో ఆ ముచ్చట తీర్చుకుందాం అని చెప్పారు.
తరువాత శ్రీహరి తన రామావతారమును గురించి, ఆ సమయంలో అతనికి శివుని అవసరం గురించి ఇలా చెప్పారు.
రామావతారంలో నా శక్తి అయిన లక్ష్మి అపహరించబడినప్పుడు, నేను నా అవతార కార్యమును పూర్తిగావించుటకు నాకు తోడుగా ఓ మహాదేవా! తమరు ఆదిశక్తి సహితముగా నా అంశను కూడా పొంది , ఆ కార్యమును సాధించుటకు నాకు నవ్యశక్తి ని ప్రసాదించి, నన్ను పరిపూర్ణునిగా చేయండి. 

17, మే 2020, ఆదివారం

సువర్చల అప్సరస

ఒకసారి బ్రహ్మలోకంలో అప్సరసలు నాట్యం చేస్తున్న సమయంలో, సువర్చల అనే ఒక అప్సరస సరిగా నాట్యం చేయలేదు. దానికి కోపగించిన బ్రహ్మదేవుడు ఆమెకు గ్రద్ద కమ్మని శాపం ఇచ్చారు. తాను చేసిన తప్పుకు చింతించిన సువర్చల తనకు శాప విమోచనం కలిగే మార్గం చెప్పమని కోరుకున్నది. ఆ ప్రార్ధన విన్న బ్రహ్మదేవుడు శాంతించి, ద్వాపరయుగంలో దశరధ మహారాజు పుత్రకామేష్టి చేసినప్పుడు, ఫలంగా దొరికిన పాయసము ను తాకగానే ఆమెకు శాప విమోచనం దొరుకుతుంది అని చెప్పారు. ఆ రోజునుండి ఆమె గ్రద్దగా మారి విమోచనం కలిగే రోజు కోసం ఎదురుచూస్తూ ఉంది. 
దశరధుని పుత్రకామేష్టి జరిగినప్పుడు ఆమె కైకేయి పాయసం పాత్ర తీసుకుని వెళ్లింది.  ఆమెకు శాప విమోచనం జరిగింది. 

హనుమంతుడు- దశరధుని పుత్రకామేష్టి

మనం ఇంతకు ముందు హనుమంతుడు శివుని అంశ , వాయుపుత్రుడు ఒకేసారి ఎలా అయ్యాడు అని తెలుసుకున్నాం కదా! అలాగే హనుమంతుని జన్మకు సంబందించిన మరొక విచిత్ర మయిన విషయం ఇప్పుడు తెలుసుకుందాం! ఈ విచిత్రమయిన సంఘటన ఆనందరామాయణం లో చెప్పారు. మూల వాల్మీకి రామాయణంలో ఈ ఘట్టం చెప్పలేదు.

దశరథమహారాజు తనకు పుత్రులు కలగాలని, తన భార్యలతో కలిసి ఋష్యశృంగుని అద్వర్యం లో పుత్రకామేష్టి చేశారు. ఆ యాగంలో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యి దశరధుని చేతికి ఒక కలశమును అందించారు. ఆ కలశంలో ఉన్న పాయసమును దశరధుడు తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచాడు. అప్పుడు దశరధుని మూడవ భార్య అయినా కైక చేతిలోని పాయసం నిండిన పాత్రను ఒక గద్ద తన ముక్కుతో పట్టుకుని వేగంగా వెళ్లి పోయింది. ఆ హఠాత్ సంఘటనతో దిగులు చెందిన కైకకు దశరధుని మిగిలిన భార్యలు అయినా సుమిత్ర, కౌసల్య తమతమ పాయసమునందలి కొంత కొంత భాగములు ఇచ్చారు.
అలా ఆ పాయసపాత్రను పట్టుకుని వేగంగా పైకి ఎగిరిన గ్రద్ద ఆ పాయసము తనను తాకగానే ఒక అప్సరసగా మారి వెళ్లి పోయింది. అలా అప్సరసగా మారిన గ్రద్ద వదిలేసిన ఆ పాయసపాత్రను
వాయుదేవుడు అంజనాద్రి పై పుత్రుని కొరకు పరమ శివుని ప్రార్ధిస్తున్న అంజనాదేవి వొడిలో పడేవిధంగా చేసాడు. పరమేశ్వర ప్రసాదంగా భావించి అంజనాదేవి దానిని స్వీకరించి, ఏకాదశమ రుద్రుని అంశగా శ్రీ హనుమంతునికి జన్మను ఇచ్చింది.



16, మే 2020, శనివారం

తిలోత్తమ

మనకు పురాణములలో అనేక సందర్భాలలో అప్సరసల ప్రస్తావన వస్తుంది. ఇంతకు ముందు మనం 31 మంది అప్సరసల పేర్లు చెప్పుకున్నాం కదా!   వారిలో ఒకరు తిలోత్తమ.
ఇప్పుడు ఆ తిలోత్తమ జన్మకు కారణం తెలుసుకుందాం!

ఈ సంఘటనను మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చెప్పారు.  ఆ ఘట్టం ప్రకారం తిలోత్తమను సృష్టించిన వాడు విశ్వకర్మ. పుర్వం సుందుడు, ఉపసుందుడు అనే రాక్షసులు, బ్రాహామా వర గర్వితులయ్యి సకల లోకములను భాదించుతూ ఉండగా, వారిని సంహరించాలంటే ఉన్న ఒకే ఒక మార్గం వారిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి, యుద్ధం చేసి చనిపోవటం మాత్రమే మార్గం అని గ్రహించి, ఇద్దరు వీరుల మధ్య కలహం మొదలు అవ్వాలి అంటే దానికి కారణం ధనం లేదా మగువ మాత్రమే అయ్యి ఉండాలి అని భావించారు. వారికి ఇంతకూ మునుపే అనేకములయిన ధనరాశులు ఉన్నాయి కనుకకేవలం స్త్రీ మాత్రమే ఆ కార్యమును సాధించగలడు అని భావించి, ఆ కార్యమునకు సరిపోయే విధంగా ఒక అద్భుతమయిన సౌందయము కల అప్సరసను సృష్టించవలసినది గా బ్రహ్మ విశ్వకర్మను కోరాడు.
అటువంటి అద్భుతమయిన స్త్రీని తయారు చేయటానికి విశ్వకర్మ సకల సృష్టి లోని అమూల్యములు, అద్భుతములు అయిన అందములను చిన్న నువ్వుల పరిమాణంలో పేర్చి, అత్యంత సుందరమయిన స్త్రీని మలిచాడు. దానికి ప్రాణం పోసాడు. అలా ఉద్భవించిన స్త్రీకి తిలోత్తమ అనే పేరు పెట్టారు. 

15, మే 2020, శుక్రవారం

అఙాతవాసం - పాండవుల పేర్లు

మహాభారతం లోని ముఖ్య మయిన ఘట్టములలో ఒకటి పాండవుల వనవాసం, వారి అఙాతవాసం. మరి పాండవులు వారి అఙాతవాసంను విరాటరాజు కొలువులో గడిపారు. మరి అక్కడ వారు ఏ పేర్లతో, ఏమి పని చేస్తూ గడిపారు? ఇప్పుడు తెలుసుకుందాం!

ధర్మరాజు - కంకుభట్టు అనే పేరుతో రాజా ఆస్థానంలోని ప్రవేశించాడు. రాజు కు మానసిక ఉల్లాసం కలిగించే శాస్త్ర చర్చలు చేయటం, స్నేహపూర్వకమయిన జూదం ఆడటం అతను చేస్తూ ఉంటాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు  జయుడు.
భీముడు- వలలుడు అనే పేరుతో ఒక వంటవానిగా విరాట రాజు వద్ద చేరాడు. ఇతని వంట అద్భుతం.  వంట మాత్రమే కాక మల్ల విద్య కౌశలం కూడా ప్రదర్శించే వాడు.  అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయంతుడు.
అర్జునుడు- బృహన్నల అంటే పేడి వానిగా విరాటుని ఆశ్రయించాడు. ఇతను స్వర్గంలో ఉన్న సమయంలో ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇలా వాడుకున్నాడు. అంతే కాక స్వర్గంలో ఉన్న సమయంలో నేర్చుకున్న సంగీత, నృత్య శాస్త్రములను అంతఃపురంలోని కన్యలకు నేర్పించేవాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయుడు.
నకులుడు - దామగ్రంథి అనే పేరుతో అశ్వశిక్షకుడుగా అక్కడ చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు విజయత్సేనుడు
సహదేవుడు - తంత్రీపాలుడు అనే పేరు తో గోసంరక్షకుడుగా చేరాడు. అయితే కేవలం పాండవులకు, ద్రౌపదికి మాత్రమే తెలిసేలా వీరు పెట్టుకున్న ఇంకొక పేరు జయద్బలుడు.
ద్రౌపది -  మాలిని అనే పేరుతో విరాటుని అంతఃపురంలో అతని రాణి సుధేష్ణ వద్ద సైరంద్రి గా ఉన్నది. అయితే పాండవులకు మరొక పేరూరు ఉన్నట్లు, వారు ద్రౌపదికి మరో పేరు సంకేతనామం గా పెట్టుకొనలేదు.  

14, మే 2020, గురువారం

ధర్మరాజు -- 16 కళలు

మనకు ఉన్న ముఖ్యమయిన గ్రంధాలు రెండు. రామాయణం, మహాభారతం. రామాయణం సూర్య వంశంలో జన్మించిన రాముని యొక్క చరితము. కానీ మహాభారతంలో చంద్ర వంశం గురించి చెప్పినా, ఏ ఒక్కరి గురించి మాత్రమే చెప్పిన కధ కాదు. కానీ ఈ కధలో ప్రధానుడు, ఇప్పటి మన భాషలో "హీరో" గా పిలువటానికి అర్హత  గలిగిన వాడు పాండవుల లో పెద్దవాడు అయిన ధర్మరాజు.
ఇంతకు  ముందు మనం రాముని గురించి  పదహారు కళల (లక్షణాల )గురించి చెప్పుకున్నాం కదా! అలాగే ధర్మ రాజు ని చంద్రునిలా  పదహారు కళలు కలిగిన వానిగా చెప్పిన సందర్భం మహాభారతం లో ఒకచోట కనిపిస్తుంది . అది విరాట పర్వం మొదటి భాగంలో, వారు విరాటుని కొలువులో పనిచేయవలసి ఉంటుంది  అని నిర్ణయించుకున్న తరువాత తన తమ్ములు ధర్మరాజు గురించి చెప్పిన సందర్భంలో ఈ పద్యం చెప్తారు.

సీ : మహనీయ మూర్తియు, మానవైభవమును, 
సౌకుమార్యంబును,సరసతయును  
మార్దవంబు, బ్రభుత్వ మహిమయు, నపగత 
కల్మషత్వంబును, గౌరవంబు 
శాంతియు, దాంతియు, జాగంబు, భోగంబు 
గారుణ్యమును, సత్యసారతయును 
ధర్మమయ క్రియా తత్పరత్వంబును 
గీర్తి, ధనార్జన క్రీడానంబు 

ఆ : గలిగి జనుల నేల గాని, యెన్నందును 
నొరులఁ గొల్చి తిరుగ వెరవు లేని 
యట్టి నీవు విరటు నెట్టి చందంబున 
ననుచరించు వాడ వధిప ! చెపుమ !

భావం : ఓ ధర్మరాజా! నీకు చక్కని రూపం, అభిమాన వైభవం, సౌకుమార్యం, సరసత, మృదుత్వం,ప్రాభవం, నిష్కల్మషత్వం, గౌరవం, శాంతి, దాంతి,  త్యాగం, భోగం, దయ , సత్యం, ధార్మిక క్రియాశీలత, కీర్తి , ధనము అనేవి నీకు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఇతరులను సేవించే నేర్పు నీకు లేదు, (ఇప్పటివరకు అటువంటి అవసరం నీకు రాలేదు), అటువంటి నీవు సామాన్యుడు అయిన విరాటుని ఎలా సేవించగలవు? చెప్పు!

13, మే 2020, బుధవారం

మన్మదావస్థలు

అలంకార శాస్త్రములను అనుసరించి మన్మదావస్థలు దశ విధములు. వాని గురించి చెప్పే శ్లోకం చూద్దామా !
చక్షుఃప్రీతిః ప్రధమం చింతాసంఘస్తతో ధ  సంకల్పః
నిద్రాచ్ఛేదస్తనుతా విషయనివృత్తి స్త్రపానాశః
ఉన్మాదో మూర్ఛా మృతిరిత్యతే స్మరదశా దశైవ న్యుః

భావం ః కనులతో చూచుట వలన చక్షుప్రీతి, ఆలోచనలలో కలిసినట్లు ఉహించుకొనుట, కలవాలి అనే సంకల్పం, నిద్ర లేకుండా జాగారం, శరీరం కృశించుట, ఆరాటం, సిగ్గును కూడా మరచి ప్రవర్తించుట, ఉన్మాదం, మూర్ఛ మరియు చివరికి చనిపోవుట అనే ఈ పది లక్షణములను మన్మదావస్థలుగా ప్రబంధములలో నిర్వచించారు. 

11, మే 2020, సోమవారం

సాక్షులు

మనం ఏదయినా న్యాయసంబంధమయిన విషయములు చర్చించవలసి వస్తే, ఆ సమయంలో ముఖ్యంగా పరిగణలోనికి తీసుకునేది సాక్ష్యుల వాంగ్మూలములు. మరి మన శాస్త్రములలో చెప్పిన సాక్ష్యములు ఎన్ని రకములు  ఏమిటి? ఇప్పుడు చూద్దామా!

మన శాస్త్రములు చెప్పినదాని ప్రకారం సాక్ష్యములు పదకొండు రకములు.  ఈ పదకొండు రకముల సాక్షులను తిరిగి రెండు రకములుగా విభజించారు. 

కృతసాక్ష్యులు : ముందుగానే నిర్ణయించబడిన సాక్ష్యులు. వీరు ఐదు రకములు. 
  • లిఖితుడు
  • స్మారితుడు
  • యదృచ్చాభిజ్ఞుడు
  • గూడుడు 
  • ఉత్తరుడు 
అకృతసాక్ష్యులు: ముందుగా నిర్ణయించ బడని సాక్ష్యులు. వీరు ఆరుగురు 

  • గ్రామస్థులు 
  • ప్రాడ్వివాక 
  • లేఖకసభ్యులు 
  • రాజు 
  • కార్యాధికారి 
  • వాదిచే పంపబడిన వాడు

7, మే 2020, గురువారం

వసిష్టుడు- పుత్రశోకం

మానవుని జీవితంలో అత్యంత బాధాకరమయినవి అష్ట కష్టములు అని చెప్పుకున్నాం కదా! అయితే వాతన్నేంటిని మించిన అత్యంత భాదాకరామయిన విషయం తన సొంత బిడ్డలను పోగొట్టుకోవటం. ఒక బిడ్డను పోగొట్టుకుంటేనే అంత కష్టం అయితే, వందమంది కొడుకులను ఒకేరోజు పోగొట్టుకుంటే?? ఆ బాధ ఎంత వర్ణనాతీతమో కదా!!!
ఇంతకీ ఇంతటి కష్టం ఎవరికీ వచ్చింది? ఆ భాదను వారు ఎలా భరించారు? ఆ బాధనుండి ఎలా బయట పడ్డారు? ఈ విషయాలు ఇప్పుడు మనం చూద్దాం!

వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ల మధ్య స్పర్ధలు పెరుగుతున్న సమయంలో శాపవశాత్తూ రాక్షసుడిగా మారిన కల్మాషపాదుడు వశిష్ఠుని పుత్రులు శక్తి మొదలయిన వారు అయిన వందమందిని ఒకే రోజు చంపేశాడు. దానికి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు ఏం  చేసాడు?
తన తపో బలం ఏంటో ఉన్నా , ఆ కల్మాషపాదుడిని శపించలేదు, తన పుత్రులను బ్రతికించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. విధిని తప్పించుకొనుట సాధ్యం కాదు అని అనుకున్నాడు. కానీ తన పుత్రులు మరణించిన భాధను భరించలేక ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు మొత్తంగా ఐదు సార్లు ఆ ప్రయత్నం చేసాడు. ఎంత మహర్షి అయినా, బ్రహ్మర్షి అయినా పుత్ర వియోగ బాధ ను భరించుట కటం కదా!

మరి ఇంతకీ అతను ఆ బాధనుండి ఎలా బయట పడ్డాడో తెలుసా? అతను  అత్యంత బాధాకరమయిన స్థితి లో ఉన్న వశిష్ఠుడు తన ఆశ్రమములో గర్భంతో ఉన్న శక్తి భార్య అయిన తన కోడలిని చూసాడు. ఆమె పేరు అదృశ్యంతి. ఆమె గర్భంలో ఉన్న శిశువు వేదములు చదవటం అతనికి వినిపించింది. ఆ కడుపులోని బిడ్డ స్వరం చక్కని శక్తి మహర్షి స్వరంలా వినిపించ సాగింది. ఆ బిడ్డ కడుపులో ఉండగా శక్తి ఉచ్చరించే వేదములను  ఆ బిడ్డ విన్నాడు. ఇప్పుడు అదే వేదములను చక్కని స్వరంతో ఉచ్చరిస్తున్నాడు. ఆ చక్కని స్వరం విన్న వశిష్ఠుని మనస్సు  ఊరట చెందింది.

అత్యంత బాధ కలిగినప్పుడు సామాన్య మానవుని నుండి మహర్షి, బ్రహ్మర్షులయినా ఒకేరకంగా ఆలోచిస్తారు. కానీ ఆ బాధను మరచిపోయే మార్గం తెలుసుకుని, ఆ కారణంకోసం తన జీవితాలను అంకితం చేస్తే వారు అత్యంత శక్తివంతులు అవుతారు.








6, మే 2020, బుధవారం

లంక- స్వర్ణలంక

 ఇంతకు ముందు ఎన్నిసార్లు మనం లంక  గురించి చెప్పుకున్న అది స్వర్ణ లంక  అని చెప్పుకున్నాం కదా! ఇంతకీ అది స్వర్ణ లంక ఎందుకు అయ్యింది? ఆ లంక త్రికూటాచల పర్వతంలో ఉన్నది అని చెప్తారు కదా! ఇంతకీ ఆ త్రికూటాచల పర్వతం ఏమిటి?

దీని గురించి ఆనంద రామాయణంలో సారకాండ - చతుర్దాశ్వాసం లో చెప్పారు.

మనం ఇంతకు  ముందు టపా లలో మహాభారతములోని ఆదిపర్వంలో గరుడుడు - ఆకలి  గురించి చెప్పుకున్నాం కదా!
ఆనంద రామాయణం ప్రకారం ఇలాంటి సందర్భం గురించి చెప్పారు కానీ అది  గజేంద్ర మోక్షం తరువాత  జరిగిన సంఘటన వలే చెప్పారు.
శ్రీ హరి గజేంద్రమునకు ముక్తిని ప్రసాదించిన తరువాత వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ గరుడుడు తిరిగి ఆ గజేంద్రమోక్షం జరిగిన ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఉన్న ఏనుగు (ఆనంద రామాయణం ప్రకారం ఏనుగు కు అక్కడే మోక్షం ప్రాప్తించింది ) మరియు మొసలి కళేబరములు ఆరగించటానికి గరుడుడు తిరిగి వచ్చాడు. అతను వచ్చే సమయమునకు అక్కడ ఒక గ్రద్ద ఉంది దాని పేరు భృభంగం. గరుడుడు దానిని కూడా చంపి ఆ గ్రద్దను ఒక కాలితో, ఏనుగు మరియు మొసలిని మరొక కాలితో పట్టుకుని పైకి ఎగిరాడు. కూర్చొని తినటానికి మంచి స్థానం కోసం చూస్తుండగా, ఒక బంగారమును స్రవించే జంబూ వృక్షం యొక్క కొమ్మపై కూర్చునే ప్రయత్నం చేసాడు. కానీ ఆ కొమ్మ విరిగింది. అలా విరిగిన కొమ్మకు వాలఖిల్యులు ఉన్నారు, కనుక ముక్కుతో ఆ కొమ్మను పట్టుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియక గంధమాధన పర్వతం మీద ఉన్న తన తండ్రి కశ్యపుని దగ్గరకు వెళ్ళి, వాలఖిల్యులను అక్కడ విడచి,  తనకు ఎవ్వరు నివశించని ఒక ప్రదేశం గురించి చెప్పమని అడిగాడు. దానికి సమాధానంగా తన తండ్రి కశ్యపుడు వంద యోజనముల సముద్రమునకు అవతల ఒక లంక ఉన్నది అని  అక్కడ ఎవ్వరూ  నివాసం ఉండరు కనుక అక్కడకు వెళ్లి  తినవచ్చును అని చెప్పాడు.   ఆ లంకకు చేరుకున్న గరుడుడు మూడు జంతువులను అక్కడే తిన్నాడు. అలా తిన్న సమయంలో ఆ మూడు జంతువుల ఎముకలు మూడు కొండలుగా ఏర్పడ్డాయి. ఆ మూడు కొండలను త్రికూటములు అంటారు. అంతే  కాకుండా అతను తీసుకు వచ్చిన  జంబూ వృక్ష కొమ్మను కూడా అక్కడే వదిలాడు. కనుక ఆ కొమ్మ నుండి స్రవించిన స్వర్ణం అక్కడ ఉన్న మూడు కొండలలో చేరి అవి గట్టిపడి, అత్యంత దృఢమయిన త్రికూటములుగా ఏర్పడ్డాయి. అప్పటి నుండి ఆ లంకను స్వర్ణ లంక / త్రికూటాచలం అని అంటారు.
కాల క్రమం లో ఈ లంకను రాక్షసులు , తరువాత ధనాధిపతి కుబేరుడు, ఆతరువాత రావణుడు స్వాధీనం చేసుకున్నారు.

5, మే 2020, మంగళవారం

షట్చక్రవర్తులు

మన పురాణములలో అత్యంత ముఖ్యమయిన రాజులు, చక్రవర్తులు ఆరుగురు ఉన్నారు అని చెప్తారు. ఆ ఆరుగురిని గురించి చెప్పే శ్లోకం కింద మీకోసం!

హరిశ్చంద్రో నలోరాజా పురుకుత్సః పురూరవాః
సగరః కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తిన ః

హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు మరియు కార్తవీర్యార్జునుడు అనే ఈ ఆరుగురిని కలిపి షట్చక్రవర్తులు అంటారు.


4, మే 2020, సోమవారం

గరుడుడు-- ఆకలి

గరుడుడు తన తల్లిని దాస్యం నుండి విముక్తురాలిని చేయుటకు బయలుదేరాడు. తన తల్లి ఆశీర్వాదం తర్వాత తన తండ్రి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. తల్లి చెప్పిన నిషాదులని తినిన తర్వాత కూడా అతని ఆకలి తీరలేదు కనుక తినుటకు ఏమయినా దొరుకుతుందా అని ఆటను తండ్రిని ఆడిగాడు. అప్పుడు కశ్యపుడు విభావసుడు - సుప్రతీకుడు అనే అన్నదమ్ముల గురించి, వారు ఈ జన్మలో ఏనుగు, తాబేలు గా పుట్టుట గురించి చెప్పి వానిని తినమని చెప్పాడు. అవి ఉండే చోటు గురించి తెలుసుకుని గరుడుడు అక్కడికి వెళ్లి ఆ రెండింటిని తన రెండు కళ్ళతో పట్టుకుని అత్యంత  వేగంగా పైకి ఎగిరాడు.
ఎక్కడయినా కూర్చుని తినాలని ఒక స్థలం కోసం వెతుకుతూ  అలంబం అనే శిఖరం ఉన్న క్షేత్రానికి చేరుకున్నాడు. ఆ క్షేత్రం లో రోహిణము అనే వృక్షం అతనికి ఆతిధ్యం ఇవ్వటానికి సిద్ధపడి తన అతిపెద్ద కొమ్మను అతని కోసం చూపింది. దాని మీద గరుడుడు కూర్చోగానే ఆ కొమ్మ విరిగింది. అలా విరిగిన ఆ కొమ్మకు వాలఖిల్యులు ఉండుట గమనించిన గరుడుడు ఆ కొమ్మను తన ముక్కుతో పట్టుకున్నాడు. అలా రెండు కాళ్లతో ఏనుగు,  తాబేలు మరియు ముక్కుతో ఆ విరిగిన కొమ్మను తీసుకుని తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాడు. కశ్యప ప్రజాపతి గరుడుని నోటిలో ఉన్న కొమ్మను దానికి వేళ్ళాడుతున్న వాలఖిల్యులను చూసి వారికి నమస్కరించగా వారు వారి తపస్సును కొనసాగించుటకు  హిమాలయాలకు వెళ్లిపోయారు.
ఆ తరువాత గరుడుడు తనకు లభించిన ఆహారం తినుటకు వీలుగా ఒక స్థలం చూపమని అడుగగాదానికి కశ్యపుడు తాని నివసిస్తున్న గంధమాదన పర్వతానికి లక్ష ఆమడల దూరంలో నిష్పురుషం అనే కొండ ఉన్నది అని , అక్కడ ఎవరూ ఉండరు కనుక అక్కడకు వెళ్లి తినమని చెప్పాడు. అక్కడకు వెళ్లి గరుడుడు తన ఆకలి తీర్చుకున్నాడు. అక్కడి నుండి అమృతమును తీసుకు రావటానికి స్వర్గానికి బయలుదేరాడు. 

3, మే 2020, ఆదివారం

హనుమంతుడు-పుష్పక విమానము- పార్వతి

లంకలో సీతాదేవిని వెతుకుటకు వచ్చిన హానానుమంతుడు ఎంత జాగ్రత్తగా వెతుకుతున్నాడో ఇంతకు ముందు ఒక చక్కని పద్యంలో చూశాం కదా!

అలా వెదుకుతున్న హనుమంతుడు లంక  అంతా కలియదిరిగి, సీత జాడ తెలియక వెదుకుతూ రావణుని పుష్పక విమానం వద్దకు వచ్చి ఆ విమానపు సౌందర్యానికి, కాంతికి తనను  తాను మరచి అలాగే నిలుచుండి  పోయాడు.
అప్పుడు అతనిని తిరిగి కార్యోన్ముఖుడ్ని చేయటానికి సాక్షాత్తు పార్వతీదేవి చిన్న పాప రూపంలో వచ్చింది అని మల్లెమాల రామాయణం లో కవి వర్ణించారు.
చిన్న పాపగా వచ్చిన పార్వతీదేవి అలాగే బొమ్మలా నిలబడిన హనుమంతుని విచిత్రంగా చూసి అతని కన్నులలోకి ఉఫు  అని ఊదినది. వెంటనే తేరుకుని హనుమంతుడు తన తప్పును వెంటనే  గ్రహించి క్షమాపణ అడిగాడు. దానికి బాల రూపంలో ఉన్న పార్వతి, ఎవరయినా ఇంత సౌందర్యము కల్గిన ఈ పుష్పక విమానమును చూసి తమను తాము మరిచిపోవుట సహజం అని చెప్పి ఆ పుష్పక విమానం కథను చెప్పటం మొదలుపెట్టింది.
ముందుగా బ్రహ్మదేవుని కొరకు విశ్వకర్మ చేసాడు. దాని తరువాత అత్యంత తపస్సు చేసిన ధనాధిపతి అయిన కుబేరుడు  దీనికి అధిపతి అయ్యాడు. ఆ తరువాత యుద్ధంలో కుబేరుడిని ఓడించిన రావణుడు దీనిని స్వాధీనం చేసుకున్నాడు అని ఆ పుష్పక విమానం కథను చక్కగా హనుమంతునకు సాక్షాత్తు పార్వతి దేవి చెప్పింది.  అలా పార్వతి చెప్పిన మాటలు విని హనుమంతుడు ఆమెకు నమస్కారం చేసి, సీతని వెదకుటకు ఆ పుష్పక విమానంలోకి ప్రవేశించారు. 

2, మే 2020, శనివారం

వాలఖిల్యులు

బ్రహ్మాండ పురాణం మరియు భాగవతం ప్రకారం వాలఖిల్యులు నవబ్రహ్మలలో ఒకరయిన క్రతువు పుత్రులు. క్రతువు దేవహుతి, కర్ధముల పుత్రిక అయిన క్రియను వివాహం చేసుకున్నారు. ఈ క్రతువు మరియు క్రియలకు కలిగిన సంతానమే 60,000 మంది వాలఖిల్యులు.
వీరు బొటన వేలు పరిమాణంలో ఉండి నిరంతరం తపస్సులో ఉంటారు. వారి తపస్సు అత్యంత కఠినమయినది. వారు చెట్టు కొమ్మలకు తలక్రిందులుగా వ్రేళ్ళాడుతూ తపస్సు చేస్తారు.
వీరు తపస్యులు అయిన కారణంగా కశ్యప ప్రజాపతి పుత్రుల కోసం పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు వీరిని ఆహ్వానించారు. ఆ ఇష్టి కి వెళ్లే వారు అందరూ  మోయగలిగినంత చెరువు (యాగం లో ఉపయోగించుటకు వీలు అయిన వస్తువులు, కర్రపుల్లలు వంటివి) తీసుకు రావటం పరిపాటి కనుక వీరు తాము మోయగలిగిన గడ్డి పరకలు తీసుకు వచ్చారు.
వారిని చూసి ఆ సమయంలో అక్కడ ఉన్న ఇంద్రుడు వెక్కిరింతగా నవ్వాడు. అలా నవ్విన ఇంద్రుని చుసిన వాలఖిల్యులు అత్యంత బలవంతుడు, అనితర సాధ్యుడు ఈ ఇంద్రుని కంటే వంద రెట్లు బలం కలిగిన వాడు అయిన మరో ఇంద్రుడు ఈ యాగ ఫలముగా పుట్టుగాక అని అన్నారు. అంటే వారి కోపము కూడా ఇతరులకు (ఇక్కడ కశ్యపునకు) మేలు చేసింది. ఇలా వాలఖిల్యులు చెప్పటం విన్న ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. ఆ మాటలు విన్న కశ్యపుడు ఇది వరకు బ్రహ్మచే నియమించబడిన ఇంద్రుని కాదనుట సరి కాదు అని, తనకు కలగబోయే సంతానం పక్షి గా, ఆ పక్షులలో ఇంద్రునిగా ఉంటుంది అని వాలఖిల్యులను కోరాడు. దానికి అత్యంత దయగలిగిన వాలఖిల్యులు  ఒప్పుకున్నారు.
ఆ పుత్ర కామేష్టి కారణం గా కశ్యపునకు గరుడుడు జన్మించాడు. ఆ గరుడునకు పక్ష్మీంద్రుడు అనే పేరు కూడా ఉన్నది.
తరువాతి కాలంలో తన తల్లి దాస్య విముక్తి కోసం ప్రయత్నిస్తున్న గరుడుడు ఆకలి తీర్చుకోవటం కోసం తండ్రి ఆదేశం మేరకు గజమును, తాబేలును తినటానికి ప్రయత్నం చేసినప్పుడు విరిగిన రోహిణము అనే వృక్ష కొమ్మకు తల క్రిందులుగా వ్రేళ్ళాడుతూ తప్పస్సు చేసిన వారు వీరే.  

1, మే 2020, శుక్రవారం

తెలుగు మధురమయిన పద్యం - 2

రామాయణములో అత్యంత ముఖ్యమయినది, ఎంతో ప్రాముఖ్యం కలిగినది సుందరకాండ. ఆ సుందర కాండ ముఖ్య ఉద్దేశ్యం హనుమంతుడు సీతాదేవిని లంకలో వెతుకుట. ఆ ఘట్టమును అనేక కవులు అనేక రకములుగా వర్ణించారు. అటువంటి వర్ణనలలో ఉన్న ఒక సీస పద్యం మల్లెమాల రామాయణం లోనిది మీకోసం!
ఈ పద్యమునకు సందర్భం : హనుమంతుడు లంకలో సీతాదేవి కోసం ఎంత ఏకాగ్రతగా, మిగిలినవారికి తన ఉనికి తెలియకుండా ఉండేలా ఎంత జాగ్రత్తగా మసలుకుంటూ వెతుకుతున్నాడో చెప్తున్న సందర్భం

కడునేర్పు తో పాలు కాజేయ వంటింట 
మెల్లగా తారాడు పిల్లివోలె 
కటిక చీకటివేళ కలవారి గృహములో 
దూరి యన్వేషించు దొంగవోలె 
బొక్కలోపల గూడ నెక్క డేమున్నదో 
నక్కి గాలించు నక్కవోలె 
అతినిగూఢ మ్మైన ఆత్మతత్వమ్మును 
తనలోన వెదకెడు తపసివోలె 

ఇంత మంచి అచ్చ తెలుగు పద్యమునకు విడిగా భావం చెప్పటం అవసరం లేదు కదా!

30, ఏప్రిల్ 2020, గురువారం

విభావసుడు - సుప్రతీకుడు

మనకు పురాణములలో, ఇతిహాసములలో మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి చాలా విపులంగా చర్చించాయి.
రామాయణంలో సోదరుల మధ్య నమ్మకం, ప్రేమ ఎలా ఉంటాయో చూపించారు, అలాగే  భారతంలో దాయాదుల మధ్య గొడవలు మొదలయితే అవి ఎంతవరకు వెళతాయో కూడా చెప్పారు. అటువంటి మరోకథ మహాభారతంలో ఉంది.  ఇద్దరు అన్నదమ్ములు అస్తి  కోసం గొడవపడుతూ ఆ గొడవను తరువాతి జన్మలో కూడా కొనసాగించారు.  మరి ఆ కధ ఎమిటో చూద్దామా!
విభావసుడు - సుప్రతీకుడు  అని ఇద్దరు అన్నదమ్ములు. వారికి పెద్దలనుండి చాలా ఆస్తి సంక్రమించింది.  తమ్ముడయిన సుప్రతీకుడు అన్నగారిదగ్గరకు వెళ్లి  ఆస్తి ని ధర్మంగా పంచమని కోరాడు. దానికి విభావసుడు అంగీకరించలేదు. ఇలా వారి గొడవ పెరిగి పెద్దది అయ్యి, విభావసుడు సుప్రతీకుని ఏనుగుగా జన్మించమని, సుప్రతీకుడు విభావసుని తాబేలువు కమ్మని ఒకరికి ఒకరు శాపం ఇచ్చుకున్నారు.
అలా శాపం ఇచ్చుకున్న కారణంగా కొంతకాలానికి ఇద్దరు ప్రాణములు విడచి ఆ శాపముల ప్రకారం ఒకరు ఏనుగు గాను మరొకరు తాబేలు గాను జన్మించి, పూర్వజన్మ లోని శతృత్వం కారణంగా జంతు జన్మలో కూడా ఆ శతృత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ గొడవ కొన్ని వేల యేండ్లవరకు సాగింది.
మరి ఇంతకీ వీరి గొడవ ఎలా తీరింది? వీరి గొడవ తీరలేదు, వారు ఇద్దరూ  గరుడునికి  ఆహారం అయ్యారు. ఆ విషయం మరో టపాలో!!

 

29, ఏప్రిల్ 2020, బుధవారం

హనుమంతుడు - తొమ్మిది అవతారములు

హనుమంతునికి ముఖ్యముగా తొమ్మిది అవతారాలు ఉన్నాయి అని చెప్తారు. దీనిని గురించి పరాశర సంహిత లో ప్రస్తావించారు.

ఆద్య: ప్రసన్న హనుమాన్ ద్వితీయో వీరమారుతిః
తృతీయో వింశతిభుజః చతుర్దః పంచ వక్త్రకః
పంచమో ష్టాదశ భుజః శరణ్యస్సర్వ దేహినాం
సువర్చలాపతి షష్ఠః సప్తమస్తు చతుర్భుజ ః
అష్టమః కధితశ్శ్రీమాన్ ద్వాత్రింశద్భుజమండలః
నవమో వానరాకార ఇత్యేవం నవరూపధృక్

భావం:: ప్రసన్న హనుమదవతారం, వీరాంజనేయ అవతారం, వింశతి (ఇరవై భుజములు కలిగిన ) భుజాంజనేయావతారము, పంచముఖాంజనేయావతారము, అష్టాదశ భుజాంజనేయావతారము (పద్దెనిమిది భుజముల), సువర్చలాహనుమావతారం, చతుర్భుజాంజనేయావతారం(నాలుగు భుజములు), ద్వాత్రింశత్ భుజాంజనేయావతారం  (ముప్పది రెండు భుజముల), వానరాంజనేయావతారము. 

28, ఏప్రిల్ 2020, మంగళవారం

వినత- గరుడుడు

మనం ఇంతకు ముందు వినత కద్రువల గురించి వారి అసూయ, మదము- క్రోధము గురించి చెప్పుకున్నాం కదా!!
ఆ తరువాతి కధ ఇప్పుడు చూద్దాం!

మరునాడు వినత కద్రువలు వెళ్లి ఆ అశ్వాన్ని చూసారు. ముందే అనుకున్న ప్రకారం కద్రువ కొంచెం దూరం నుండి ఆ గుర్రాన్ని చూసే ఏర్పాటు చేసింది. కర్కోటకుడు వెళ్లి ఆ గుర్రం తోకను పట్టుకుని ఉన్నాడు. అలా ఆ గుర్రాన్ని దూరంగా చూస్తున్న వారికి దాని తోకలో కొంతభాగం నల్లగా కనిపించింది. అంటే వారి షరతు ప్రకారం వినత కద్రువకు దాస్యం చేయాలి .

అప్పటి నుండి వినత కద్రువకు దాసీ గా ఉండిపోయియింది. కొంతకాలానికి వినతకు మిగిలిన రెండవ గుడ్డు లోనుండి గరుడుడు జన్మించాడు. అతను కూడా ఒక దాసీ పుత్రునిగా కద్రువకు, ఆమె పుత్రులకు సేవలు చేస్తూ ఉన్నాడు. అతను పక్షి కనుక తన రెక్కల మీద కద్రువ పిల్లలయిన పాములను ఎక్కించుకుని గాలిలోకి తీసుకెళ్లి విహారం చేయించేవాడు. అలా ఉండగా ఒకసారి  గరుడుడు ఆ పాములను అత్యంత ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు. అలా ఎత్తుగా సూర్యునికి దగ్గరగా వెళ్ళటం వలన గరుడుని రెక్కల మీద ఉన్న పాములు ఆ వేడిని తట్టుకోలేక తమ పట్టుజారి కిందకి పడిపోయాయి. తన పుత్రుల దీనావస్థ చూసిన కద్రువ ఇంద్రుని ప్రార్ధించి వర్షం కురిపించి, వారిని కాపాడుకున్నది. జరిగిన దానికి గరుడుని నిందించినది.

తరువాత గరుడుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ఈ దాస్యం చేయటానికి గల కారణం తెలుసుకున్నాడు. ఆ పాముల వద్దకు వెళ్లి తనను, తన తల్లిని దాస్యము నుండి విముక్తి కలిగించటానికి ఏమి చేయాలి అని అడిగాడు. దానికి వారు అతనిని స్వర్గం నుండి అమృతమును  తెచ్చి ఇవ్వమని అడిగారు.

తనతల్లి అనుమతితో అమృతమును తెచ్చి వారికి ఇవ్వటానికి బయలుదేరాడు. తాను ఆ ఘనకార్యం సాధించే ముందు తన ఆకలి తీరే మార్గం చెప్పమని అడిగాడు. అప్పుడు ఆమె సముద్రంలో ఉన్న కిరాతులను తినమని చెప్పింది. అవి తిని అతను తన తండ్రి కశ్యపుని దగ్గరకు ఆశీర్వాదము పొందటానికి బయలుదేరాడు. 

27, ఏప్రిల్ 2020, సోమవారం

వైశాఖం - విశిష్టత

స్కంద పురాణములో ప్రతి సంవత్సరము లో వచ్చే పన్నెండు నెలలో ఏ నెలలు ముఖ్యమయినవి అని, ఆ యానెలలలో ఏమి చేయాలి అని చెప్పారు.

తతో మాసా విశిష్ట్యోక్తాః కార్తీకోమాఘఏవచా 
మాధవ స్తేషు వైశాఖం మాసానాముత్తమం వ్యధాత్ 

భావం : అన్ని మాసములలో విశిష్టమయిన మాసములుగా కార్తీకం, మాగము మరియు మాధవం అని పిలువబడే వైశాఖం ముఖ్యమయినవి.

మరి అంత  విశిష్ట కలిగిన ఈ వైశాఖ మాసంలో ఏమి చేస్తే మానవునకు మంచి జరుగుతుంది? మానవునికి మంచి జరుగుతుంది అని చెప్పటంలో మన పెద్దల దృష్టి ఎలా ఉంటుంది అని ఇక్కడ మనం చూడవచ్చు. మనకి మంచి జరగాలి అంటే మనం ఈ సమాజానికి ఎం చేయగలం అని అర్ధం. ఎండలు ఎక్కువగా ఉండే ఈ వైశాఖ మాసంలో ఏమి చెయ్యాలో కింద శ్లోకంలో చెప్పారు.

మార్గే ధ్వగానాంయోమర్త్యః ప్రపాదానంతకరోతిహి
సంకోటికులముద్ధృత్య విష్ణులోకే మహీయతే

భావం: అనేక మంది నడిచే మార్గమద్యములో ఒక చలివేంద్రము ఏర్పరచి వైశాఖమాసములో ఎవరయితే బాటసారులకు మంచినీటిని అందిస్తూ ఉంటారో అటువంటి సత్పురుషునకు, అతనితో పాటు అతని వంశమునందు జన్మించిన తరువాతి అనేక తరముల వారికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది. 

26, ఏప్రిల్ 2020, ఆదివారం

తెలుగు మధురమయిన పద్యం-1

కవి హృదయం, అతను చెప్పబోయే విషయముల మీద అత్యంత నిమగ్నమై, ఆ విషయమును అద్భుతంగా చెప్పే ప్రయత్నంలో ఉంటుంది.
అటువంటి ఒక మధురమయిన తెలుగు పద్యం ఇప్పుడు ఒకటి చూద్దామా!
ఈ పద్యం కవిరాజ శిఖామణి నన్నెచోడుడు రచించిన కుమారసంభవం లోనిది.

హరి వికచామలాంబుజసహస్రము పూన్చి మృగాంకునం దవి 
న్ఫురిత మలాసితాబ్జమని పుచ్చగ జాచిన చేయి చూచి చం 
దురు డది రాహు సావి వెఱ దుప్పల దూలగ జారుచున్న న 
య్యిరువుర జూచి నవ్వు పరమేశ్వరు డీవుత మా కభీష్టముల్

భావం: విష్ణువు చక్కగా వికసించిన, కొంచెము కూడా మురికి లేకుండా శుభ్రపరచి వేయి తామర పువ్వులతో శివుని శిరస్సు పైన పూజించు చుండగ, ఆ శివుని తలపైన ఉన్న చంద్రుడ్ని చూసి,
ఆ చంద్రుని కూడా ఒక కమలం అనుకుని, ఆ కమలంలో ఎదో మచ్చ కనిపించుటతో ఆ పువ్వు మలినమైంది అని అనుకుని, ఆ ఆపువ్వును అక్కడ నుండి తన చేతితో  తీయబోగా
తనవైపు వచ్చుచున్న నల్లని చేతిని చూచిన చంద్రుడు ఆ చేతిని రాహువుగా భావించి తన నిజస్థానము నుండి కిందకు జారాడు. అలా చంద్రుడు కదలటం చుసిన విష్ణువు కూడా తన చేతిని వెనుకకు తీసాడు. అలా జారుచున్న విష్ణువు, చంద్రులను చూసి నవ్వుతున్న పరమేశ్వరుడు మాకు గల కోరికలను తీర్చును గాక.

విశ్లేషణ: ఈ పద్యంలో విశేషం ఏంటంటే విష్ణువు ఇంకా చంద్రుడు ఇద్దరు శివునికి సన్నిహితమయినవారే. అయితే కవి ఇక్కడ ఊహించిన విధానం చాలా హృద్యంగా ఉంది. పూజకు సిద్ధం చేసిన పువ్వులు ఎంతో శుభ్రంగానే  ఉన్నాయి.  ఆ పువ్వుల మధ్యలో ఉన్న చంద్రుడు కూడా ఒక పువ్వులాగే కనిపించాడు. అయితే చంద్రునిలో సహజంగా ఉన్న మచ్చల కారణంగా అది మురికిగా ఉన్న పువ్వు అని విష్ణువు భావించాడు. ఆ మలినమయిన పువ్వు ని తీయాలనే ఉద్దేశం తో దానిని తీయటానికి తన చేయి చాచాడు. అయితే అలా తన వద్దకు వస్తున్న  విష్ణుమూర్తి చేతిని చూసి అది రాహువు అనుకున్నాడు. దానికి కారణం విష్ణుమూర్తి  నలుపుగా  ఉంటాడు కనుక అతని చెయ్యి కూడా నల్లగా ఉంటుంది. రాహువు ఛాయాగ్రహం. కనుక విష్ణుమూర్తి చేతిని రాహువుగా ఊహించారు.
ఇక్కడ అద్భుతం ఏంటి అంటే విష్ణువు, చంద్రుడు ఇద్దరూ కూడా లేని విషయమును ఉహించుకుని దాని గురించి భయపడ్డారు. అటువంటి అపోహలను పోగొట్టాలంటే అవి ఊహలు అని తెలిసిన వాళ్ళ వాల్ల మాత్రమే అవుతుంది. ఇక్కడ వారి ఇద్దరి అపోహలను పోగొట్ట గలిగిన వాడు శివుడు. కనుక ఆ పరమ శివుడు మన కోరికలను తీర్చగలడు ఆని ఆతనిని మన కవి  ప్రార్ధిస్తున్నాడు.




  

25, ఏప్రిల్ 2020, శనివారం

పురుషుడు - అష్టపురములు

మనం సహజంగా పురుష శబ్దాన్ని మగవారి కోసం వాడతాము. కానీ మన పూర్వీకుల కధనం ప్రాకారం పురుష అనే శబ్దానికి అర్ధం అష్టపురములను ఆధారము చేసుకుని జీవనం సాగించేవారు అని అర్ధం. మరి ఇంతకీ ఆ అష్టపురములు అంటే ఏమిటి?

జ్ఞానేంద్రియాణి ఖలు పంచ తథాపరాణి కర్మేంద్రియాణి మనః ఆది చతుష్టయం చ
ప్రాణాదిపంచకమధో వియదాదికం చ కామశ్చ కర్మచ తమః పున రష్టధాపూః


భావం ః  జ్ఞానేంద్రి యాలు (ఐదు), కర్మేంద్రియాలు (ఐదు), అంతః కారణములు (నాలుగు, అవి మనస్సు ,బుద్ధి, చిత్తము మరియు అహంకారము), ప్రాణాలు (ఐదు), పంచభూతములు, కామము, కర్మ మరియు అజ్ఞానము ఈ ఎనిమిది ని కలిపి అష్టపురములు అంటారు.

24, ఏప్రిల్ 2020, శుక్రవారం

పంచ క్లేశములు

మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆ అషట కష్టములకు మాత్రమే కాక అసలు మానవుని బాధలకు కారణమయిన ఐదు కిలేసముల గురించి చెప్పుకుందాం. ఆ పంచ క్లేశములు

  1. అవిద్యాక్లేశము : తన నిజ స్వరరూపమును గుర్తించకుండా తాని ఒక జీవుడు అని అనుకోవటం అవిద్య క్లేశము
  2. అభినవ క్లేశము : సంసారమును, దానిని పట్టుకుని ఉండే మనస్సును అంటి పెట్టుకొనుట/ వదలకుండా ఉండుట అభినవ క్లేశము 
  3. అస్థిగత క్లేశము : విషయములలో అత్యంత నిమగ్నుడు అయ్యి గర్వించుట అస్థిగత క్లేశము
  4. రాగ క్లేశము : ధనము మొదలగు వానిలో మిక్కిలి కోరిక కలిగి ఉండుట రాగ క్లేశము
  5. ద్వేషక్లేశము : మన పనుల కోసం పక్కవారిని ఆశ్రయించి వారి వలన సహాయం పొందుతూ తిరిగి వారి పైననే ద్వేషము కలిగి ఉండుట ద్వేష క్లేశము 

22, ఏప్రిల్ 2020, బుధవారం

అష్టభోగములు

మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం!మరి ఇప్పుడు అష్టభోగములు అంటే ఏమిటో చెప్పుకుందామా! ఆ అష్టభోగముల గురించి చెప్పే శ్లోకం

దాసో భృత్యస్సుతో బంధుర్వస్తు వాహన మేవచ
ధనధాన్యసమృద్ధిశ్చాప్యష్టభోగాః ప్రకీర్తితాః 


భావం:: దాసులు, భృత్యులు, కుమారులు, బంధువులు, కావలసిన సకల వస్తువులు, వాహనములు, సరిపోయినంత ధనము, ధాన్యము కలిగి ఉండటాన్ని అష్టభోగములు కలిగి ఉండుట అని చెప్తారు.

దాసులు అంటే ధనమును తీసుకుని సేవలు చేసేవారు, భృత్యులు అంటే మనమీది గౌరవముతోలేదా అభిమానంతో మన కోసం పనులు చేసేవారు, పున్నామ నరకము నుండి తప్పించేవాడు కనుక కుమారుడు, ఏదయినా అవసరమునకు ఆడుకోవటానికి బంధువులు, వస్తువులు, వాహనములు, మనం తినటానికి దానం చేయటానికి వీలుగా ధనము ధాన్యము ఇన్ని ఉన్నవానికి ఇంకా ఏమి కావాలి? కనుకనే ఇవి అన్ని కలిపి అష్టభోగములు అంటారు.

20, ఏప్రిల్ 2020, సోమవారం

అజ్ఞాన భూమిక

అజ్ఞాన భూమిక అంటే మనలో అజ్ఞానము స్థిరముగా ఉండటానికి కారణములు అని అర్ధము.  ఆ అజ్ఞాన భూమికలు ఏడు ఉన్నాయి. వీని గురించి  శ్రీసీతారామాంజనేయ సంవాదం అనే గ్రంధంలో చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం!!


  1. బీజాగ్రము:: నామ రూప రహిత,  అఖండ  పరిపూర్ణ స్చచిదానంద పరబ్రహ్మమందు జగత్తు ని సృషించాలి అనే ఆలోచన  బీజాగ్రము
  2. జాగ్రము::  ఆ ఆలోచన కలుగుటకు ముందులేని బేధము/ మార్ఫు చిన్నగా మొదలయ్యి అది ప్రపంచముగా మార్ఫు  చెందుట జాగ్రము
  3. మహాజాగ్రము:: ప్రపంచము లో  వచ్చిన అనేకములయిన మార్పులకు అనుగుణముగా మారుట మహాజాగ్రము
  4. జాగ్రత్స్వప్నము:: జాగ్రదవస్థ లో కనిపించని వానిని ఉహించి, మనస్సులో దానిని గురించి ధ్యానము చేయుట జాగ్రత్స్వప్నము. (పగటి కలలు)
  5. స్వప్నము:: జాగ్రదవస్థలో లేనప్పుడు కల్పితమయిన రూపములు చూచుట ఆజాగ్రమందు కల్పిత స్వరూపములు చూచుట స్వప్నము
  6. స్వప్నజాగ్రము:: ఇంతకు  ముందు జరిగినదానిని మరల మరలా గుర్తుకు తెచ్చుకోవటం స్వప్నజాగ్రము
  7. సుషుప్తి:: ఆత్మ ప్రతిబింబముగా అనిపిస్తున్న జగత్తుకు సంబందించిన విషయములలో మునుగుట సుషుప్తి




18, ఏప్రిల్ 2020, శనివారం

సర్పవరం- శ్రీనాధుడు

మనం ఇంతకు ముందు సర్పవరం లోని భావనారాయణ దేవాలయం గురించి, అక్కడ ఉన్న నారద కుండం, ముక్తి కుండం గురించి  చెప్పుకున్నాం కదా! అదే సర్పవరం లోని భావనారాయణుని గురించి చెప్తూ ఆ ఉరి గురించి మహాకవిసార్వభౌముడు శ్రీనాధుడు తన భీమఖండం లో ఏమని వర్ణించారో చూద్దామా !!

శ్రీ సుదర్శన శంఖ చిహ్నాంకితముగాక యెప్పుడు మిన్నకయున్న యిల్లు లేదు
బహులోర్ధ్వపుండ్ర సంపదలేక వృధయైన ఫాలలేఖల తోడి ప్రజయు లేదు
వైష్ణవోత్తమ భాగవతసాత్త్వికుల గోష్ఠి వెలియైనవాటికా వేది లేదు
నాలీనేక్షణుడు భావనారాయణ స్వామి దప్పించి పరదైవతంబు లేదు

భావం :  సర్పవరంలో శ్రీ మహావిష్ణు సంబంధమయిన శంఖం చక్రం గుర్తులు లేని ఇల్లు లేదు, చక్కగా పెద్దవిగా ఊర్ధ్వపుండ్రములు (నిలువు బొట్టు) చక్కగా పెట్టుకోకుండా వృథాగా ఉన్న నుదిటితో ఉన్న ప్రజలు లేరు, మంచి మంచి వైష్ణవ భాగవతోత్తముల గోష్ఠి జరుగని అరుగు లేదు, భావనారాయణుడు తప్ప మరో దైవము లేడు.







16, ఏప్రిల్ 2020, గురువారం

యమధర్మ రాజు - విదురుడు?

మనం ఇంతకు ముందు మహాభారతంలోని అనేక వ్యక్తులు ఏ ఏ అంశలతో జన్మించారో చెప్పుకున్నాం కదా! ఆ క్రమం లో యమధర్మ రాజు అంశతో  విదురుడు జన్మించాడు అని చెప్పాం  కదా! అలా యమలోక పాలకుడు అయిన యముడు మానవునిగా, అందులోనూ రాజ్యాధికారం లేని విధంగా ఒక శూద్రునిగా ఎందుకు జన్మించాడు? అని ఇప్పుడు తెలుసుకుందాం!
    ఈ సంఘటనకు మూలం మాండవ్యుడు అనే ఒక మహర్షి. ఈ కధ మనకు మహాభారతంలోని ఆదిపర్వం లో కనిపిస్తుంది.

మాండవ్యుడు అనే మహర్షి ఒంటరిగా అనేక తీర్ధయాత్రలు చేస్తూ చివరకు ఒక నగరముదగ్గరలో ఒక ఆశ్రమము నిర్మించుకుని మౌనదీక్షలో కాలం గడుపుతూ రెండుచేతులూ పైకి ఎత్తి తప్పస్సు చేసుకుంటున్న సమయంలో, ఆ నగరంలో దొంగతనం చేసిన ఇద్దరు దొంగలు, వారిని తరుముకుంటూ వచ్చిన రక్షకభటులు ఆ ఆశ్రమంలోనికి వచ్చారు. ఎవరికీ కనిపించకుండా దొంగలు దాక్కున్నారు. ఆ వచ్చిన రక్షకభటులు తపస్సులో ఉన్న మహర్షిని దింగల గురించి అడిగారు. కానీ మౌనదీక్షలో ఉన్న మహర్షి సమాధానం చెప్పకపోవడంతో వారే ఆశ్రమం లోనికి వెళ్లి దొంగలను పట్టుకుని, ఆ దొంగలకు ఆశ్రయం ఇచ్చారు అన్న నేరంతో మహర్షిని కూడా రాజు వద్దకు తీసుకువెళ్లారు. రాజుగారు దొంగలకు సరిఅయిన శిక్ష విధించి, వారిని కాపాడటానికి ప్రయత్నించారు అనే నేరమునకు గాను మహర్షికి శూలదండన విధించారు. అంటే ఒక పదునయిన శూలం మీద కూర్చోబెట్టారు.
అలా శిక్షను అనుభవిస్తున్న సమయంలో అతని వద్దకు కొందరు మహర్షులు పక్షులరూపంలో వచ్చి ఇలా మాండవ్య మహర్షికి ఇలా జరగటానికి కారణం ఏమిటి అని అడుగగా, మాండవ్యముని చేసిన కర్మలకు ఫలితాలు అవే వస్తాయి అని సమాధానం చెప్పారు. ఆ మాటలు విన్న కొందరు రక్షక భటులు రాజుగారికి సమాచారం ఇవ్వగా రాజుగారు మాండవ్య మహర్షి వద్దకు వచ్చి క్షమాపణ అడిగి ఆ శూలదండన శిక్షను రద్దు చేశారు. కానీ అప్పటికే శూలం పూర్తిగా గొంతువరకు దిగబడి ఉంది. కనుక ఆ శూలంను బయటకు తెచ్చే ప్రయత్నం మానేసి ఆ శూలంను అతని శరీరంలోనే విరిచేసారు. తరువాత కొంతకాలానికి మాండవ్య మహర్షి చనిపోయారు.
 అతను అప్పుడు యముడిని కలిసి, ఇంత భయంకరమయిన శిక్ష అతనికి లభించటానికి కారణం అడిగారు. అప్పుడు యముడు మాండవ్యమహర్షి చిన్నతనంలో తూనీగలతో ఆడుతూ వాటికి కష్టం కలిగించుట వలన ఈ శిక్ష లభించింది అని చెప్పారు. కానీ చిన్నతనంలో తెలిసి తెలియక చేసిన చిన్న తప్పుకోసం ఇంట పెద్ద శిక్ష వేయటం అధర్మం, ధర్మారాజుగా పిలువబడే యముడే ఇటువంటి తప్పు చేయుట వల్ల మాండవ్యమహర్షి అతనిని శపించారు.
ఆ శాపమే ధర్మ జ్ఞానం కలిగి ఉండి అందరికీ ధర్మమును భోదించుట, ఉత్తమ వీర్య సంజాతుడు అయినా రాజ్యార్హత లేదు.  మళ్ళీ మళ్లీ ఇతని ధర్మబోధ విన్న తర్వాత కూడా ధృతరాష్ట్రుడు సన్మార్గంలోకి రాలేదు. 

13, ఏప్రిల్ 2020, సోమవారం

మహాభారతం - అంశలు

మహాభారతం గురించి ఇంతకు ముందు మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆ మహాభారతంలో ఉన్న అనేకమంది వ్యక్తులు ఎవరు ఎవరి అంశలో  పుట్టారో ఇప్పుడు చూద్దాం!

శ్రీ మహావిష్ణువు - శ్రీకృష్ణుడు
ఆదిశేషుడు - బలరాముడు
లక్ష్మి - రుక్మిణి
సనత్కుమారుడు - ప్రద్యుమ్నుడు
అప్సరసలు - 16 వేల మంది శ్రీకృష్ణుని అంతఃపుర స్త్రీలు
ప్రభాసుడు (ఎనిమిదవ మనువు) - దేవవ్రతుడు (భీష్ముడు)
దేవగురువు (బృహస్పతి) - ద్రోణుడు
కామము + క్రోధము - అశ్వద్ధామ
ఏకాదశ రుద్రులు - కృపుడు
సూర్యుడు - కర్ణుడు
ద్వాపరం - శకుని
అరిష్టా పుత్రుడయిన హంసుడు (గంధర్వ) - ధృతరాష్ట్రుడు
మతి  - గాంధారి
కలి - దుర్యోధనుడు
హిరణ్య కశిపుడు - శిశుపాలుడు
సంహ్లాదుడు - శల్యుడు
అనుహ్లాదుండు - దృష్టకేతుడు
శిబి - దుమ్రసేనుడు
భాష్కలుడు - భగదత్తుడు
విప్రచిత్తి - జరాసంధుడు
స్వర్భాను - ఉగ్రసేనుడు
జంబుండు - విశోకుడు
అశ్వపతి - కృతవర్మ
వృషపర్వుడు - దీర్ఘ ప్రజ్ఞుడు
అజరుడు - మల్లుడు
అశ్వగ్రీవుడు - రోచమానుడు
సూక్ష్ముడు - బృహద్రధుడు
దుహుడు - సేనాబిందుడు
ఏక చక్రుడు - ప్రతివింద్యుడు
విరుపాక్షుడు - చిత్రవర్మ
హరుడు - సుబాహు
ఆహరుడు - బాహ్లికుడు
చంద్రవక్త్రుడు - ముంజకేశుడు
నికుంభుడు - దేవాపి
శరభుడు - సోమదత్తుడు
చంద్రుడు - చంద్రవర్మ
అర్కుడు - ఋషికుడు
మయూరుడు - విశ్వుండు
సుపర్ణుడు  - క్రోధకీర్తి
రాహువు - క్రోధుడు
చంద్రహంత - శునకుడు
అశ్వుడు - అశోకుడు
భద్రహస్తుడు - నందుడు
దీర్ఘజిహ్వుడు - కాశీరాజు
చంద్రవినాశనుడు - జానకి
బలీనుడు - పౌండ్ర
వృత్రుడు - మణిమంతుడు
కాలనేమి - కంసుడు
గుహ్యకుడు - శిఖండి
మరుత్గణము - పాండురాజు
మరుత్తులు - ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు
మాండవ్య ముని శాపం వలన యమ ధర్మరాజు - విదురుడు
సిద్ధి - కుంతి
బుద్ధి - మాద్రి
యముడు - ధర్మరాజు
వాయువు - భీముడు
ఇంద్రుడు - అర్జునుడు
అశ్వినీ దేవతలు - నకుల సహదేవులు
స్వర్గ లక్ష్మి - ద్రౌపది
అగ్ని - దృష్టద్యుమ్నుడు 

11, ఏప్రిల్ 2020, శనివారం

అనగనగానే ఎందుకు?

మొన్న ఆ మధ్య ఒక మిత్రుడు ఈ ప్రశ్న వేసాడు. మన తెలుగు కధలు అన్నీ  అనగనగా అనే ఎందుకు మొదలవుతాయి అని?
నాకు కూడా ముందుగా తెలియలేదు కానీ ఆలోచిస్తే ఒక సమాధానం దొరికింది. ఈ సమాధానం మీకుకూడా సమంజసంగా ఉంటుందేమో చూద్దామా!

ఈ మధ్య సినిమాలు, సీరియళ్లు చూస్తున్నప్పుడు వానికి ముందు "DISCLAIMER" అని ఒకటి వేస్తున్నారు కదా! అంటే ఈ సినిమాలోని పాత్రలు కేవలం కల్పితం ఎవరినీ  ఉద్దేశించినవి కావు అని, అలాగే మన అనగనగా కూడా ఒక "DISCLAIMER" అని నా ఉద్దేశం. 

అంటే ఈ కధ నేను చెప్పటంలేదు, నాతో ఎవరో అన్నారు, వారితో ఇంకెవరో అన్నారు, ఇలా అందరూ  అనగనగా ఆ కధ నేను మీకు చెప్తున్నాను అని అయ్యి ఉంటుంది అని నా భావన. 

ఒకవేళ మీకు ఎలా కాకుండా ఇంక  ఏమయినా సమాధానం తెలిస్తే దయచేసి చెప్పగలరు!

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

గతకాలము మేలు వచ్ఛుకాలము కంటెన్

 ఈ మాట మనకు సహజంగా పెద్దల నోట వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల కంటే ఇంతకూ ముందు ఉన్న మారోజులే బాగుండేవి అని చెప్పే సందర్భంలో ఈ పద్య పాదమును వాడుతూ ఉంటారు. అయితే ఈ పద్య పాదం ఎక్కడిది?

ఈ పద్యపాదం నన్నయ ఆంధ్రీకరించిన మహా భారతంలోని ఆది పర్వంలోనిది. ఆది పర్వం పంచమాశ్వాసం లో 159వ  ఆ పద్యం మీకోసం 


మతిఁ దలఁపఁగ సంసారం 
బతి చంచల మెండమావులట్టుల సంప 
త్ప్రతతు లతిక్షణి కంబులు 
గతకాలము మేలు వచ్ఛుకాలము కంటెన్ 

ఈ పద్యము సాక్షాతూ వ్యాసుడు తన తల్లి సత్యవతి తో మాట్లాడుతున్న సందర్భం లోనిది. ఆమెను ఇక వానప్రస్థము స్వీకరించమని చెప్తున్న సందర్భంలోనిది. కానీ ఈ పద్య భావం మనకు అన్ని సందర్భాలలోనూ అన్వయించుకోవటానికి అనువుగా ఉంటుంది. 

భావం:  మనస్సులో అలోచించి చూస్తే ఈ సంసారం ఎండమావుల వలే చాలా చంచలమైనది. సంపదలు ఎంతో కాలం నిలువవు. కావున రాబోయే రోజులకంటే ఎల్లప్పుడూ గడచిన రోజులే మేలు. 

1, ఏప్రిల్ 2020, బుధవారం

లంక ఎవరిది?

రామాయణం  ప్రకారం లంకాధిపతి రావణుడు. అతని కంటే ముందు అది ధనాధీశుడు అయిన కుబేరుని ఆధీనంలో ఉండేది. అయితే లంక రక్షా జాతికి సంబందించినది అని కూడా చెప్తారు. మరి ఇంతకీ లంక అని పిలువబడే సువర్ణలంక ఎవరిది?

ఈ ప్రశ్న కు సమాధానం మనకు రామాయణంలోని ఉత్తరకాండ లో దొరుకుతుంది.
ఈ నగరాన్ని సువర్ణ మయంగా నిర్మించిన వాడు దేవతల శిల్పి విశ్వకర్మ. త్రికూటా చల పర్వతం మీద ఇటువంటి ఒక నగరమును నిర్మించమని కోరినవాడు స్వయానా ఇంద్రుడు. కాలాంతరమున ఇంద్రుడు ఆ విషయమును మరచిపోయాడు.
తరువాతి కాలంలో దేవతలమీద యుద్ధం జయించిన తరువాత రాక్షసులయిన మాల్యవంతుడు, మాలి , సుమాలి లు తమ కోసం నివాసయోగ్యమయిన స్థలమును చూపించమని విశ్వకర్మను అడుగగా వారికి త్రికూటాచల శిఖరాలపై నిర్మించిన లంకను అతను చూపించాడు. ఆ తరువాతి కాలంలో విష్ణు భయం చేత రాక్షసులు లంకను వదలి పాతాళం లో దాక్కున్నారు.  అలా లంక తిరిగి అనాధ అయ్యింది.
తరువాత కొంత కాలానికి విశ్రవసుడు తన పుత్రుడయిన  వైశ్రవునకు  ఆ లంకను నివాస భూమిగా నియమించాడు. అలా ఆ లంక కొంతకాలం యక్షులకు నిలయం అయ్యింది.
ఆ తరువాత అదే విశ్రవసుని పుత్రుడయిన దశకంఠుడు దానిని స్వాధీనం చేసుకున్నాడు. అలా మరలా లంక రాక్షసుల నిలయం అయ్యింది.  

31, మార్చి 2020, మంగళవారం

పులస్త్యుడు - విశ్రవసుడు

మనం ఇంతకు ముందు ఒక పురాణమునకు మరొక పురాణమునకు భేదములు ఉండటానికి కారణం అవి జరిగిన కల్పములే కారణం అని చెప్పుకున్నాం కదా!
ఇప్పుడు అటువంటిదే మరొక సంఘటన గురించి తెలుసుకుందాం!
భాగవతం ప్రకారం నవబ్రహ్మలలో ఒకరయిన పులస్త్యుని భార్య హవిర్భువు అని, ఆమె స్వయంగా కర్దమ ప్రజాపతి మరియు దేవహూతి లకు కలిగిన తొమ్మిది మంది కుమార్తె లలో ఒకటి అని చెప్పుకున్నాం!

కానీ వాల్మీకి రచించిన రామాయణం ప్రకారం పులస్త్యుని భార్య తృణబిందుని పుత్రిక.
రామాయణం ప్రకారం:
పులస్త్యుడు మేరు పర్వత ప్రాంతంలో తృణబిందు అనే ఆశ్రమ సమీపంలో నివసిస్తూ, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ ఆశ్రమ సమీపంలో ఉన్న వనంలో ఎప్పుడూ వసంతకాలంలా ఉండేది. ఆ ప్రకృతిని ఆస్వాదించటానికి వచ్చినవారు అక్కడ చేసే కోలాహలమునకు ఇతని తపస్సు భంగం అవుతూ ఉండేది. అలా కొంతకాలం భరించిన అతనికి సహనం నశించి ఆ స్థలమునకు వచ్చి ఎవరయినా అతని కంట పడితే ఆ స్త్రీ గర్భం ధరిస్తుంది అని శపించాడు. ఇతని శాపము తెలియని తృణబిందుని కుమార్తె ఒకసారి అలా వనంలో విహరిస్తూ ఇతని కంట పడింది. అప్పటి నుండి ఆమె శరీరంలో గర్భసూచనలు కనిపించసాగాయి.
ఈ విషయం తెలుసుకున్న తృణబిందు తన కుమార్తెను తీసుకుని పులస్త్యుని వద్దకు వచ్చి, తన కుమార్తెను అతనికి దానం చేసాడు. అలా గర్భం దాల్చిన ఆమెను పులస్త్యుడు వివాహం చేసుకున్నాడు.  గర్భం దాల్చిన ఆమె ఆ ఆశ్రమ వాతావరణంలో కాలం గడుపుతూ, వారు చదివే శాస్త్రములు వేదములు వింటూ ఉన్నది కనుక ఆ పుట్టిన బిడ్డకు విశ్రవసుడు అని పేరు పెట్టారు.
ఈ విశ్రవసుడు కూడా తన తండ్రికి వలెనే అత్యంత నిష్టా గరిష్టుడు. ఇతని ధర్మాచరణమును గురించి తెలుసుకొనిన భరద్వాజుడు తన కుమార్తెను ఈ విశ్రవసునకు ఇచ్చి వివాహం చేశారు. తరువాత వీరికి ఒక పుత్ర సంతానం కలుగగా ఆ బాలునికి వీరు వైశ్రవణుడు అని పేరు పెట్టారు. అతనే కాలాంతరంలో ధనాధిపతి కుబేరుడు గా మనకు సుపరిచితుడు. 

29, మార్చి 2020, ఆదివారం

భారతమును మహాభారతం అని ఎందుకు పిలుస్తారు?

 మనకు 18 పురాణములు, 18 ఉప పురాణములు ఉన్నాయి. వానిలో దేనికి "మహా" అనే సంబోధన మనకు కనిపించదు. కానీ ఒక ఇతిహాసముగా చెప్పబడుతున్న భారతమునకు ఈ విధమయిన సంబోధన కనిపిస్తుంది. మరి ఆ భారతము మహా  భారతం అవటానికి కారణం ఏమి  అయ్యి ఉంటుంది?
దీనికి సమాధానం మనకు మహాభారత తత్వకథనం లో దొరుకుతుంది.

ఏకత శ్చతురో వేదా భారతం చైత దేకత:
పురాకిల సురై స్సర్వై స్సమేత్య తులయా ధృతం

చతుర్భ్య స్సరహాస్యేభ్యో వేదోభ్యో హ్యధికం యదా
తదాప్రభృతి లోకేస్మిన్ మహాభారత ముచ్యతే

మహత్త్వేచ గురుత్వేచ ధ్రియమణం యతో ధికం
మహత్త్వా ద్భారవ త్త్వా చ్చ మహా భారత ముచ్యతే

భావం :  దేవతలు నాలుగు వేదములను భారతమును పరిశీలించి ఏది వీనిలో ఉన్నతమయినది అని నిర్ణయించవలసి వచ్చి  నప్పుడు, 108 ఉపనిషత్తులు కలిగిన వేదముల కంటే అర్ధము, గుణముల వివరణము, శబ్దముల ఆధిక్యము అన్ని కలిగిన ఈ భారతమే గొప్పది అని నిర్ణయించారు. అందువల్లనే భారతమును మహాభారతం అని సంబోధించుట పరిపాటి అయినది.  

28, మార్చి 2020, శనివారం

నవ శక్తులు

శక్తులను గురించి చెప్తున్నప్పుడు మన పెద్దలు తొమ్మిది శక్తుల గురించి చెప్తారు.
ఆ తొమ్మిది శక్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం!!

  1. ఇచ్ఛాశక్తి 
  2. క్రియాశక్తి 
  3. ఉత్సాహశక్తి 
  4. ప్రభుత్వశక్తి 
  5. మంత్రశక్తి 
  6. సత్వశక్తి 
  7. రజశ్శక్తి
  8. తమోశక్తి 
  9. జ్ఞానశక్తి 




26, మార్చి 2020, గురువారం

శ్రీ మహ విష్ణువు బట్టలు పసుపు (పీతాంబరములు) గా ఎందుకు ఉంటాయి?

ఏదయినా విషయములు చెప్పే సమయంలో కవి ఎంతో సృజనాత్మకంగా, ఇంతకూ ముందు చెప్పినవారి కంటే భిన్నంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అలాగే పైన మనం చెప్పుకున్న ఆ ప్రశ్నకు సమాధానం వికటకవి గా పేరు పొందిన తెనాలి రామకృష్ణుడు తను రచించిన పాండురంగమహత్యం లో చాలా చక్కగా చెప్పాడు.

అభినవాయాతి తనపుత్రు నజుని గాంచి
సంతసంబున నాభివేశంత జలజ
ముబ్బి వెలిగ్రాయు పుప్పొడి యొరపు నెరపు
హళది పుట్టంబు కటిసీమ నలదువాని

భావం : అప్పుడే వచ్చిన తన పుత్రుడు అయిన బ్రహ్మ ను చూసి, విష్ణుమూర్తి నాభిలోని కమలం ఉబ్బితబ్బిబ్బు అయినదట. అలా తబ్బిబ్బు అవుతున్నప్పుడు ఆ కమలంలోని పుప్పొడి రేణువులు బయటకు చింది శ్రీ మహావిష్ణువు పంచె మొత్తం పడినవట.

బ్రహ్మదేవుడు  విష్ణు నాభి కమలంలో నుండి జన్మించాడు. కనుక పుత్రుని చుసిన సమయంలో జనకులకు అనందం కలుగుట సహజం. అలా ఆనందంలో ఉన్న సమయంలో చేతిలోవి జారిపోవుట సహజం. కానీ ఆలా జరుగుట వలన శ్రీ మహావిష్ణువు పంచె పసుపుగా మారింది అని చెప్పటం కవి హృదయం.  అందునా వికటకవి కనుక ముందే ఉన్నదానికి ఇలా ఒక కారణం చెప్తున్నాడు. అలంకార శాస్త్రంలో దీనిని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. 

24, మార్చి 2020, మంగళవారం

కవి

ఈ మధ్య కాలంలో కలం పట్టిన ప్రతివాడు కవిని అని చెప్పుకుంటున్నాడు. కానీ మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం కవులు ఎన్ని రకాలు? ఆ విభజన ఏ విధంగా చేయవచ్చును అని తెలుసుకుందామా?
కవులను ఈ కింద చెప్పిన శ్లోకం ప్రకారం మూడు  రకాలుగా విభజించ వచ్చు



శాస్త్రకవిః కావ్యే రససంపదం విచ్చినత్తి
కావ్యకవిః శాస్త్రే తర్కకర్కశమప్యర్ధముక్తి
 వైచిత్ర్యేణ శ్లధయతి, ఉభయ కవి స్తూభయోరపి

వరీయాన్యదుభయత్ర పరంప్రవీణఃస్యాత్

పైన చెప్పిన శ్లోకం ప్రకారం కవులు మూడు రకములు.  వారు
శాస్త్ర కవి
కావ్య కవి
ఉభయ కవి


శాస్త్ర కవి : కావ్యములో రససంపదను చక్కగా వివరించగలవాడు
కావ్య కవి: శాస్త్రములలోని తర్కముల కి సంబందించిన కర్కశత్వమును విదిలి మ్రుదువుగ చెప్తారు
ఉభయ కవి: పైన చెప్పిన ఇద్దరు కవుల లక్షణములని కలిగి ఉంటారు 

4, ఆగస్టు 2019, ఆదివారం

నవగ్రహములు - మండలముల ఆకారములు

మనకు తొమ్మిది గ్రహములు ఉన్నాయి. ఆ నవ గ్రహములకు సంబందించిన నవరత్నముల గురించి ఇంతకు ముందు మనం  చెప్పుకున్నాం కదా ! ఇప్పుడు వాని మండలముల గురించి తెలుసుకుందాం! ఆ మండలములు  వివిధములయిన ఆకారములు కలిగి ఉంటాయి. ఆ ఆకారముల గురించి అగ్ని పురాణములో చాలా వివరించారు. అవి

  1. సూర్యుడు - గుండ్రనిది 
  2. చంద్రుడు - చతురస్ర ఆకారం 
  3. అంగారకుడు - త్రికోణము 
  4. బుధుడు - బాణాకారము 
  5. గురుడు - దీర్ఘ చతురస్రము 
  6. శుక్రుడు - పంచకోణము 
  7. శని - ధనురాకారం 
  8. రాహువు - చేట ఆకారం 
  9. కేతువు - జెండా ఆకారం 






7, జులై 2019, ఆదివారం

నవ రత్నములు - నవ గ్రహములు

మన శాస్త్రముల ప్రకారం మానవుని జీవత గమనము మొత్తం నవగ్రహముల గమనముపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ నవగ్రములకు ప్రతీకగా మన పెద్దలు నవరత్నములు చెప్పారు. ఆ గ్రహములకు సంబంధించిన ఆయా రత్నములు ధరించితే ఆయా గ్రహముల శాంతి దృష్టి కలుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఏయే గ్రహములకు ఏ రత్నములు చెప్పారో చూద్దాం!


  1. సూర్యుడు - పద్మరాగం (కెంపు)
  2. చంద్రుడు - ముత్యము 
  3. అంగారకుడు - పగడము 
  4. బుధుడు - పచ్చ 
  5. గురుడు - పుష్యరాగం 
  6. శుక్రుడు - వజ్రము 
  7. శని - నీలము 
  8. రాహువు - గోమేధికము 
  9. కేతువు - వైడూర్యము  



27, జూన్ 2019, గురువారం

సుకాలినులు

సుకాలినులు అనే పితృ దేవతలు మూర్తగణములు.  వీరు ద్యులోకం పైన నక్షత్రకాంతిలో ప్రకాశించు జ్యోతిర్భాసి అనే లోకంలో నివసిస్తారు. వీరి తండ్రి గారు వశిష్ఠుడు. వీరిని శ్రాద్ధకాలంలో బ్రాహ్మణులు పూజిస్తారు. వీరి మానస పుత్రి పేరు గౌ:



25, జూన్ 2019, మంగళవారం

ఆజ్యపులు

ఆజ్యపులు అనే పితృగణములు మూర్తగణములు . వీరు పులహుని పుత్రులు కొందరు, కర్దమ ప్రజాపతి పుత్రులు కొందరు. వీరు నివసించు లోకము సర్వ కామనాలు చక్కగా తీర్చే కామదుఘాము అనే లోకము. వీరిని శ్రాధ సమయములో వైస్యులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు విరజ. ఈమె నహుషునికి భార్య, మహారాజు యయాతి కి తల్లి. 



23, జూన్ 2019, ఆదివారం

హవిష్మంతులు

హవిష్మంతులు అనే పేరుగల పితృగణము మూర్తగణము. వీరి తండ్రి అంగీర: ప్రజాపతి. వీరు నివసించు లోకము సూర్యమండలములో గల మరీచి గర్భములు, అంటే లోపలవైపునకు కూడా కిరణములు కలవి అని అర్ధము కలిగిన లోకములు. వీరిని శ్రాద్ధములు జరిపించు క్షత్రియులు పూజిస్తారు. వీరి మానస పుత్రిక పేరు యశోద. 
ఆమె సూర్యవంశమునకు చెందిన అంశుమంతుడు అనే రాజునూ వివాహం చేసుకున్నది. వారికి జన్మించిన పుత్రుడు దిలీపుడు. దిలీపుని పుత్రుడు భగీరధుడు. సాక్షాత్తు ఆకాశగంగను భూమి మీదకు తెచ్చినది ఇతనే. 



21, జూన్ 2019, శుక్రవారం

సోమపులు

మనం ఇంతకు ముందు 7గురు పితృ దేవతల పేర్లు వారిలో ఆమూర్తగణముల గురించి తెలుసుకున్నాం కదా! ఇపుడు మూర్త గణముల గురించి తెలుసుకుందాం! వారిలో మొదటి గణము  సోమపులు.
వీరు స్వధాకారము నుండి జన్మించారు. వీరు బ్రహ్మ లోకములోని మానసములు అనే లోకములో నివసిస్తారు. వీరు అనంతమయిన యోగ సిద్ధి చేత బ్రహ్మత్వము పొందారు. వీరి పుత్రిక పేరు నర్మద, ఈమె సకల జలములకు ప్రతీక.
ఈ సోమపులు సకల పితృదేవతల కు ప్రతీకలు కనుకనే శ్రాద్ధము చేసే తప్పుడు స్వధాకారం చెప్తారు మరియు జలముల దగ్గర తర్పణములు చేస్తారు. 



19, జూన్ 2019, బుధవారం

బర్హిషదులు

ఈ పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి పులస్త్యుడు.వీరు నివసించు లోకము  ధ్యు లోకంలోనే కాంతివంతములయిన మరికొన్ని లోకములు, విభ్రాజములు. 
వీరిని అసుర, దానవ , గంధర్వ, అప్సరస యక్షులు, ధ్యు లోకములోని దేవతలు అందరూ  ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు పీవరి. ఆమె యోగులకే యోగిని అనే చెప్తారు. 



17, జూన్ 2019, సోమవారం

అగ్నిష్వాత్తులు

అగ్నిష్వాత్తులు అనే పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి మరీచి, వీరు నివసించు లోకము  సోమ పధము. వీరు అగ్నియందు అనేకములయిన హవిస్సులు వేసి యజ్ఞములు చేశారు కనుక వీరికి ఈ పేరు వచ్చింది. వీరిని సకల దేవతలు ఆరాధిస్తారు.
వీరి పుత్రిక పేరు : ఆచ్చోదా, అమావాస్య 



15, జూన్ 2019, శనివారం

వైరాజులు

పితృదేవతలలో ఆమూర్తి గణములలో మొదటి వారు వైరాజులు. వారి తండ్రి పేరు  విరాజుడు. వీరు నివసించు లోకము ద్యు లోకము. వీరిని మానవ దేవతా భేదం లేకుండా అందరూ  ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు మేన దేవి.ఈమె ఒకానొక శాపం కారణంగా భూలోకమునకు రావలసి వచ్చి, హిమవంతుడిని వివాహం చేసుకున్నది. ఆ తరువాత ఆమె పార్వతిదేవికి  తల్లి అయినది. 

13, జూన్ 2019, గురువారం

పితృ దేవతలు - సత్యవతి

ఇంతకు  ముందు మనం పితృ దేవతలు , వారి పుత్రిక అమావస్య గా ఎందుకు పిలవ బడుతుంది అని తెలుసుకున్నాం కదా !
ఆ విషయం  తెలుసుకున్నప్పుడు ఆమెకు పితృదేవతలు ఇచ్చిన శాపం గురించి కూడా తెలుసుకున్నాం! ఆమెను భూలోకంలో మానవజన్మ నెత్తమని వారి శాపం.  వారి శాపమును విన్న అమావస్య అత్యంత బాధకు, పశ్చాతాపమునకు లోనయ్యి ఆ శాపమునకు కలుగు ఉపశమనమును తెలుపమని కోరినది. భూత భవిష్య వర్తమాన కాలములను తెలుసుకొనగలిగిన ఆ పితృ దేవతలు ఆమెకు జరుగబోయే విషయములను చక్కగా వివరించారు.

ఆమె 28వ ద్వాపరయుగములో ఒక దివ్య పురుషునకు జన్మనివ్వవలసి ఉన్నది. అతను మాత్రమే తరువాత వచ్చు అనేక అల్పబుద్ధి, అల్ప ఆయుష్షు కల్గిన మానవులను కాపాడే విధంగా వేదములను విభాగం చేయగలడు. అయితే అతని జననం వలన ఆమె కన్యత్వం చెడదు. ఆ తరువాత ఆమె సముద్ర అంశతో జన్మించిన శంతనుడు అనే ఒక మహారాజును వివాహం చేసుకుంటుంది.
తెలిసింది కదా ఆమె ఎవరో! ఆమే మత్స్య గంధి, యోజన గంధి  అని పిలువ బడే సత్యవతి. 

11, జూన్ 2019, మంగళవారం

పితృ దేవతలకు అమావస్య తిధి ఎందుకు ఇష్టమంటే ...!

మనం ఇంతకు ముందు పితృదేవతలు 7 గణములని వారి పేర్లు చెప్పుకున్నాం కదా! వారిలో అగ్నిష్వాత్తులు అనే పితృదేవతలకు ఆచ్చోదా అనే మానస పుత్రిక ఉన్నది. ఆమె ఒక వెయ్యి దివ్య సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన పితరులు సంతుష్టులై ఆమెను వరం కోరుకొమ్మని అడిగారు. అయితే వచ్చిన ఆ పితృదేవతలలో మావసుడు అనే వానిని ఆమె వరించింది. ఆమె చేసిన ఈ ధర్మ దూరమయిన పనికి ఆ పితృ దేవతలు  ఆమెను భూలోకములో జన్మించమని శపించారు.
అయితే ఆ మావసుడు ఆమెను పుత్రికా దృష్టితో చూసినందువలన ఆమె మావాస్య కాలేదు. అంటే ఆమె అమావాస్య అయినది. ఆమె చేసిన తపస్సును పితృదేవతలు మెచ్చారు కనుక అమావస్య తిధి రోజు పితరులకు అర్పించినది ఏదయినా అక్షయము అవుతుంది.

9, జూన్ 2019, ఆదివారం

పితరులు

శ్రాద్ధము మొదలయిన కర్మలలో మనకు తరచుగా వినిపించే పేరు పితృదేవతలు. అయితే వారు ఎవరు? దీనికి సమాధానము హరివంశములో చెప్పారు.

అమూర్తానాంచ ముర్తానాం పితౄణం దీప్తతేజసం
నమష్యామి సదాతేషాం ధ్యాయినాం యోగ చక్షుషా !

దీనికి అర్ధం : రూపము కలిగిన వారును, రూపము లేనివారూ, అత్యంత ప్రకాశవంతమయిన తేజస్సు కలిగినవారు, యోగ శక్తి సంపన్నమయిన కన్నులతో, ధ్యానము ద్వారా అన్ని విషయములగురించి తెలుసుకోగలిగినవారు , అటువంటి యోగ చక్షువులు కలిగినవారి చే ధ్యానింప బడే వారు అయిన పితృ దేవతలకు సదా నమస్కరింతును.

అంటేఅనేక గణములుగా ఉన్న పితరులతో కొందరికి రూపములు ఉన్నాయి మరి కొందరికి లేవు. మొత్తం పితర గణములు 7. వానిలో

అమూర్త గణములు : రూపములు లేని వారు
  1. వైరాజులు 
  2. అగ్నిష్వా త్తులు 
  3. బర్హిషదులు 
మూర్త గణములు : రూపములు ఉన్నవారు 

9, మే 2019, గురువారం

రామాయణం - ఒక భక్తుని జీవితం

మనం ఇంతకూ ముందు రామాయణం గురించి అనేక విషయములు చెప్పుకున్నాం! రామాయణంలోని వివిధ సంఘటనలను మానవుని దేహంలోని ఏడు  చక్రములతో ఎలా పోల్చారో,  రామాయణమునకు ఉన్న ఆధ్యాత్మిక అర్ధం ఏమిటో, రామాయణమును కల్పవృక్షం, వేదం  మరియు గాయత్రీ మంత్రములతో ఎలా పోల్చాలో చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మహా రామ భక్తుడు అయిన తులసీదాసు రామాయణంలోని ఏడు కాండలను ఒక భక్తుని జీవితంలో రామభక్తిలో చేరుకునే అనేక సోపానములతో పోల్చారు. అవి ఏంటో చూద్దామా!


  1. బాల కాండ - సుఖ సంపాదన సోపానం 
  2. అయోధ్య కాండ - ప్రేమవైరాగ్య సంపాదన సోపానం 
  3. అరణ్య కాండ - విమల వైరాగ్య సంపాదన సోపానం 
  4. కిష్కింద కాండ - విశుద్ధ సంతోష సంపాదన సోపానం 
  5. సుందర కాండ - జ్ఞాన సంపాదన సోపానం 
  6. యుద్ధ కాండ - విజ్ఞాన సంపాదన సోపానం 
  7. ఉత్తర కాండ - అవిరళ హరిభక్త సంపాదన సోపానం 

6, మే 2019, సోమవారం

రామాయణం - 7 చక్రములు

మనం ఇంతకు ముందు మనం రామాయణం దానిలోని ఆధ్యాత్మిక అర్ధం గురించి చెప్పుకున్నాం కదా! ఆ రామాయణం మానవునిలో ప్రాణశక్తిని మేల్కొలిపి 7 చక్రములను జాగృతం చేసి పరమాత్ముని చేరుకొనే మార్గంలో కలిగే అనేకములయిన అనుభవాలను చెప్తుంది అని పెద్దల వాక్కు. అయితే రామాయణంలో ఏ సంఘటనలు ఆయా చక్రములను సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం!


  1. మూలాధారం: రామాయణంలో శివధనుర్బంగం జరిగిన సంఘటన ను మూలాధారంగా చెప్తారు. స్థిరత్వమును చేకూర్చే ఈ చక్రమును శ్రీరాముని కళ్యాణముతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  2. స్వాధిష్టానం: రామాయణంలో కైక అడిగిన రెండు వరముల కారణంగా శ్రీరాముడు వనవాసమునకు వెళ్లే సంఘటనను స్వాధిష్టాన చక్రం గా చెప్తారు. భావావేశములకు మూలమయిన ఈ చక్రమును విపరీతమయిన భావావేశము నిండిన ఈ సంఘటనతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  3. మణిపుర: వనవాసమునకు వెళ్లిన సీతారాములకు దివ్యమయిన ఆభరణములు పరమ పతివ్రత అయిన అనసూయాదేవి ఇవ్వటం అనే సంఘటనను మణిపుర చక్రంగా చెప్తాము. ఈ ఆభరణములు తరువాతి కధలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తాయి. అటువంటి దివ్య మణిమయములయిన ఆభరణములు సీతాదేవికి సంక్రమించే సంఘటనను మణిపుర చక్రంతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  4. అనాహతం: వనవాసం సజావుగా ఆనందముగా సాగుతున్న సమయములో శూర్పణఖ ప్రవేశించుటను అనాహత చక్రంతో పోల్చారు. సరిగ్గా రామాయణంలో అసురవధ ఈ ఘట్టంతరువాతనే ముఖ్యంగా జరుగుతుంది కనుక అడ్డంకులు తొలగించు అనాహత చక్రం తో ఈ సంఘటనను పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
  5. విశుద్ధి: సీతా వియోగం వలన పరితపిస్తున్న శ్రీరాముడు  పరమ శుద్ధ భక్తురాలయిన శబరిని కలిసిన సంఘటనను ఈ విశుద్ధి చక్రంతో పోల్చారు. 
  6. ఆజ్ఞా: రామాయణంలో సుగ్రీవుని ఆజ్ఞతో సీతాదేవిని వానరులు వెతుకుటకు బయలుదేరు సంఘటనను ఆజ్ఞా చక్రం మొదలుగా పోల్చారు. అయితే సహజంగా ఈ చక్రం వరకు చేరిన ప్రాణమునకు దివ్య దర్శనం జరుగుతుంది. మరి రామాయణంలో జరిగిన ఆ క్షణకాల దివ్య దర్శనం ఎం అయ్యి ఉంటుంది?  దీనికి సమాధానంగా మన పెద్దలు కిష్కిందకాండలో సీతను వెతుకుతూ వెళ్లిన హనుమంతుడు మొదలగు వారికి కలిగిన ఒక అనుభవాన్ని చెప్తారు. సూర్యప్రభాదేవి . అనుకోకుండా ఒక కొండా గుహలో బందీలయిన వానర వీరులను సూర్యప్రభాదేవి ఒక్క క్షణకాలంలో సముద్ర తీరమునకు చేర్చుతుంది. 
  7. సహస్త్రారం: ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది అని చెప్పుకున్నాం కదా! రామాయణంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టమును ఈ చక్రముతో పోల్చారు. 

3, మే 2019, శుక్రవారం

మానవుని దేహంలో 7 చక్రములు

మానవుని దేహంలో 7 చక్రములు ఉంటాయి. ఆ చక్రములను జాగృతం చేస్తే మానవుని మేధస్సు నిరుపమానంగా వృద్ధి చెందుతుంది. మరి ఆ చక్రములు ఏవో చెప్పుకుందాం!


  1. మూలాధారం : పేరు లో చెప్పినట్లు ఏది మూలమునకు ఆధారంగా ఉంటుంది. మానవుని దేహములో ఈ చక్రం వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. ఈ చక్రంలో భూ తత్త్వం ఉంటుంది.  సహజంగా ఈ చక్రము ఎరుపు రంగు కలిగి నాలుగు పత్రములు కల్గిన చక్రంగా చెప్తారు. ఈ చక్రం మానవుని దేహంలో స్థిరత్వమును కలిగిస్తుంది 
  2. స్వాధిష్టానం: ఈ పేరుకు అర్ధం స్వ - అధిష్టానం. మానవుని శరీరంలో ఈ చక్రం పొత్తికడుపు భాగం లో ఉంటుంది. ఈ చక్రం జలతత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం నారింజరంగు కలిగిన ఆరు పత్రములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో భావావేశములు మరియు కోరికల కు నియంత్రిస్తుంటుంది. 
  3. మణిపుర: దీనికి అర్ధం మణుల పురము అని. మానవుని దేహంలో ఈ చక్రం బొడ్డు భాగంలో ఉంటుంది. ఈ చక్రం అగ్నితత్వం కలిగి ఉంటుంది. సహజంగా ఈ చక్రం ఎరుపు రంగులో త్రికోణంగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో ఆహారము జీర్ణ క్రియను నియంత్రిస్తుంది.  
  4. అనాహతం: ఈ పేరుకు అర్ధం అనా- హతం, అడ్డంకులు లేనిది. మానవుని దేహంలో ఈ చక్రం హృదయస్థానంలో ఉంటుంది. ఇది వాయు తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం ఆకుపచ్చ రంగులో మధ్య షట్కోణం దానిచుట్టూ 12 కమల దళములు కలిగి ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట వలన తమపర భేదం లేని అవ్యాజమైన ప్రేమ మూర్తులు గ ఉంటారు. 
  5. విశుద్ధి: ఈ పేరుకు అర్ధం పరిశుభ్రం చేయునది అని. మానవుని దేహంలో ఈ చక్రం కంఠ భాగంలో ఉంటుంది. ఈ చక్రం ఆకాశ తత్త్వం కలిగి ఉంటుంది. ఈ చక్రం నీలం రంగు కలిగి తలక్రిందులుగా ఉన్న త్రిభుజం దానిచుట్టూ 16 వంకాయరంగు దళములు కలిగిన పద్మముగా ఉంటుంది. ఈ చక్రం మానవుని దేహంలో జాగృతం అవుట  వలన నిస్సందేహంగా నిజములను చెప్పగలుగుతారు. వారి మనోభావాలను సూటిగా చెప్పగలుగుతారు. 
  6. ఆజ్ఞా: ఈ పేరుకు అర్ధం స్వాధికారత. మానవుని దేహంలో ఈ చక్రం కనుబొమల మధ్య ఉంటుంది. ఈ చక్రానికి ఏవిధమయిన తత్త్వం ఉండదు. ఈ చక్రం పారదర్శికం గా ఉన్న కమలం దానిలో రెండు తెలుపు దళములతో ఉంటుంది. ఈ చక్రం జాగృతం అవుట వలన  మానవునికి తనగురించి తనకు పూర్తిగా తెలుస్తుంది, భౌతిక విషయములకు మించి అనేక విషయముల జ్ఞానం కలుగుతుంది. 
  7. సహస్త్రారం: ఈ పేరుకు అర్ధం వేయి దళముల పద్మం. మానవుని దేహంలో ఈ చక్రం మాడు పైభాగం లో ఉంటుంది. ఈ చక్రము ఏ విధమయిన భౌతిక ధాతువుల తత్వమూ కలిగి ఉండదు. ఈ చక్రం వేయిదళముల పద్మం, ఈ పద్మం చుట్టూ లేత గులాబీరంగు కంటి ఉంటుంది. ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది. 

30, ఏప్రిల్ 2019, మంగళవారం

పాండవులు - ఇంద్రుడు

 మహాభరతం లో ఎన్ని సార్లు ఎంతమంది సమాధానాలు చెప్పినా మల్లి మల్లి అందరు అడిగే ప్రశ్న ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండుట ధర్మమేనా?
ఈ ప్రశ్నకు మహాభారతంలో అనేక సందర్భములలో అనేక వృత్తాంతములతో ఇది ధర్మమే అని చెప్పారు. ఆ వృత్తాంతములు చెప్పే ముందు అసలు పంచ పాండవులు ఎవరు? ద్రౌపది ఎవరు అని ముందుగా చూద్దాం!

ద్రౌపది - స్వర్గ లక్ష్మి
ధర్మరాజు - యమధర్మ రాజు అంశ
భీముడు - వాయుదేవుని అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశ

ఇలా పాండవులు వివిధ దేవతల అంశాలుగా చెప్పబడినా , వారిలో నుండి బయటకు వచ్చిన ఆయా అంశలు కూడా ఇంద్రుని అంశలే అని ద్రౌపది కల్యాణ సమయంలో స్వయంగా వ్యాసుడు ద్రుపదునికి చెప్పాడు.
ఇదే కథను మార్కండేయ పురాణంలో మరోవిధంగా చెప్పారు. ఆ కదా ప్రకారం :

ఇంద్రుడు దేవతల రాజు. అత్యంత ధర్మవంతునిగా ఉండవలసిన భాద్యత అతనిది. కానీ ఆ విధంగా చేయవలసిన అనేక సందర్భములలో కొన్నిసార్లు అధర్మం చేయవలసి వచ్చింది. అలా అధర్మం చేసినప్పుడు అతనిలోని కొంత శక్తి కోల్పోతూ వచ్చాడు. అయితే అతను కోల్పోయిన ఆ శక్తి ఆయా సందర్భములలో అతనిని ఉద్దరించటానికి సహాయం చేసిన దేవతలకు ఆ  శక్తి అంశలుగా చేరాయి. మరి ఇంద్రుడు ఏ పనులు చేసాడు, ఆలా  చేసినప్పుడు  అంశ ఏ దేవతలను చేరిందో తెలుసుకుందాం!

అహల్యా వృత్తాంతం : గౌతమ ముని శాపం తర్వాత అత్యంత జుగుప్సాకరంగా మారిన అతని శరీరమును తిరిగి పూర్వ రూపం వచ్చేలా ప్రయత్నించిన వారు దేవా వైద్యులయిన  అశ్విని దేవతలు. కనుక ఇంద్రుడు ఆ సమయంలో కోల్పోయిన శక్తి ఈ సందర్భంలో అశ్వినీ దేవతలకు సంక్రమించింది.  

వృత్రాసుర వధ : వృత్రాసురుని వధ తరువాత అతనికి బ్రహ్మహత్యాపాతకం సంక్రమించింది. 
ఆ బ్రహ్మహత్యాపాతకమును కొంత తాను తీసుకున్న వాయుదేవునికి కొంత ఇంద్రతేజస్సు సంక్రమించింది. 

త్రిశిరుని వధ : త్రిశిరుడు అనే రాక్షసుని సంహరించిన తరువాత ఆ పాపంలో కొంత పాపం తాను తీసుకుని ఇంద్రునికి సహాయం చేసిన యమునిలో ఇంద్ర అంశ కొంత వచ్చి చేరింది. 

కనుక కుంతీ దేవి, మాద్రిదేవి వివిధదేవతలను ఉపాసించి పుత్రులను కోరినప్పుడు ఆయా దేవతలు వారివద్ద ఉన్న ఇంద్రుని అంశలను వారికి పుత్రులుగా ఇచ్చారు కనుక 

ధర్మరాజు - యమధర్మ రాజు అంశ గా వచ్చిన ఇంద్ర అంశ
భీముడు - వాయుదేవుని అంశగా  వచ్చిన ఇంద్ర అంశ
అర్జునుడు - ఇంద్రుని అంశ
నకుల,సహదేవులు - అశ్వినీ కుమారుల అంశగా వచ్చిన ఇంద్ర అంశ

కనుక అందరు పాండవులు కూడా ఇంద్రుని అంశలే. మరి ఇంద్రుని రాజ్యలక్ష్మి అయిన స్వర్గ లక్ష్మి  పాండవుల పట్ట మహిషి అయిన ద్రౌపది గా వచ్చినది.   

27, ఏప్రిల్ 2019, శనివారం

వాల్మీకి - ఒక ఆలోచన

ఇది వరకు మనం ఆధ్యాత్మరామాయణం లో శివుడి పార్వతితో చెప్పిన ఒక శ్లోకమును ఆధారముగా చేసుకుని వాల్మీకి ప్రచేతసుల కుమారుడు అని చెప్పుకున్నాం కదా! మరి మనకు తెలిసిన కథ సంగతి ఏమిటి? ఆ విషయం తెలుసుకునే ముందు అసలు మనకు తెలిసిన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం!

అనగనగా ఒక బోయవాడు. వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. వేట దొరకనప్పుడు దారి కాచి బాటసారులను దోచుకుని ధనం సంపాదించేవాడు. ఒకరోజు నారద మునిని అలానే బెదిరించగా తాను చేస్తున్నది పాపం కనుక ఆ పాపంలో వాని కుటుంభం సభ్యులు పాలు పంచుకుంటారేమో అడుగ మని చెప్పగా, బోయవాడు వెళ్లి అందరిని అడుగగా ఎవ్వరూ ఆ పాప భారమును స్వీకరించుటకు సుముఖంగా ఉండకపోవుట చూసి వైరాగ్యము కల్గిన బోయవాడు నారదుని కాళ్లపై పడగా , నారదుడు అతనికి "రామ" మంత్రం ఉపదేశించారు.  ఆ మంత్రము నోరుతిరుగక పోవుట వలన నారదుడు బోయవానికి "మర" అని పలుకమని తరుణోపాయము చెప్పారు. ఆ తారక మంత్రములో నిమగ్నుడయిన అతని చుట్టూ పుట్టలు పట్టాయి. కొన్ని రోజుల తరువాత ఆ పుట్టలోనుండి బయటకు చచ్చాడు కనుక అతనిని వాల్మీకి అని సంభోదించారు.

అయితే ఈ కథలోని కొన్ని భాగాలు కొంచెం ఆలోచిస్తే ప్రక్షిప్తాలేమో అనే అనుమానం తప్పకుండా వస్తుంది.

  1. ఈ కథ జరిగిన కాలం: రామాయణం ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ రచన రాముడు భూమిమీద నడయాడుతున్న కాలంలోనే జరిగింది, అనగా సుమారుగా త్రేతా యుగ చివరి సమయం . అంటే అతను తపస్సు చేసిన కాలం అంతకంటే ముందు అనగా ద్వాపర మధ్య లేక మొదటి భాగం.  మరి ఆ కాలంలో దారి దోపిడీ లు జరిగేవా? కొంచెం అనుమానమే కదా!
  2. కుటుంబ సభ్యులు పాప భారం తీసుకోము అని చెప్పటం: ఆ యుగములలో ఎవరి ధర్మం వారికి ప్రాణప్రదం. ఆ కాలం లో భర్త పాపములో భాగము తీసుకోను అని చెప్పే సందర్భం ఉండే అవకాశం ఉంటుందా?
  3. మంత్రం: మన సనాతన ధర్మములో ఉన్న అనేక మంత్రముల కంటే అతి చిన్నదయిన, సరళమయిన మంత్రం "రామ", ఈ మంత్రం నోరుతిరుగాక పోవటం, "మర" అనేది నోరు తిరగటం ఎంతవరకు నిజమై ఉండవచ్చు?
కనుక వాల్మీకి బోయవాడు అని చెప్పే విషయం కంటే వాల్మీకి ప్రచేతసుల కుమారుడు అని నమ్మటానికి కొంత అవకాశములు ఎక్కువగా ఉన్నాయి అని నా అభిప్రాయం!

25, ఏప్రిల్ 2019, గురువారం

ప్రచేతసులు - వాల్మీకి

ఇది వరకు మనం రామాయణం - వేదం అని ఎలా చెప్పవచ్చు? అనే దాని గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అదే శ్లోకంలో ఒక విచిత్రమయిన విషయాన్ని గురించి చెప్పుకుందాం!
వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే 
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!

ఈ శ్లోకము ఆధ్యాత్మరామాయణం లోనిది. ఈవిధంగా సాక్షాత్తు శివుడు పార్వతికి చెప్పాడు. ఈ శ్లోకములో రామాయణము వేదమని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నది వాల్మీకి గురించి. ఈ శ్లోకంలో శివుడు వాల్మీకి ని ప్రాచేసా అని సంబోధించారు. అంటే వాల్మీకి ని ప్రచేతసుని కుమారునిగా చెప్పారు. అది ఎలా సాధ్యం?

మనకందరికి తెలిసిన కథ ప్రకారం వాల్మీకి ఒక బోయవాడు. దారి దోపిడీ దొంగ. మరి ఆటను ప్రచేతసుల  కుమారునిగా శివుడు ఎందుకు చెప్పారు?

ప్రాచిన బర్హి గారి 10 మంది కుమారులను కలిపి ప్రచేతసులు అంటారు. వారు 10 మందికి ఒకరే భార్య. ఆమె పేరు మారిష. వీరి సంతానములలో మనకు బాగా తెలిసిన వారు దక్షుడు. వారికీ కల్గిన పడవ సంతానమే వాల్మీకి అని చెప్తారు. 

మరి వాల్మీకి బోయవాడు కాదా? అనే ప్రశ్నకు సమాధానం తరువాతి టపాలో చూద్దాం! 


22, ఏప్రిల్ 2019, సోమవారం

ఇతిహాసము - నిర్వచనము

మనం ఇంతకు ముందు పురాణముల నిర్వచనం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఇతిహాసమునకు నిర్వచనము తెలుసుకుందాం!

ఇతిహాసము : అంటే ఇది ఈవిధముగా జరిగినది అని అర్ధము. దీనిని విపులంగా శ్లోకరూపంలో ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం!

ధర్మార్ధ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితం 
పూర్వ వృత్త కధా యుక్త ఇతిహాసం ప్రచక్ష్యసే!

దీని భావం: ఇదివరకు జరిగిన అనేక సంఘటనలను కధా రూపంలో  ధర్మార్ధ కామ మోక్షములను అన్వయించుచూ చెప్పేదే ఇతిహాసం.

14, ఏప్రిల్ 2019, ఆదివారం

రామాయణము - ఆధ్యాత్మిక అర్ధము

రామాయణము లోని  కధ చిన్నపిల్లలకు కూడా చాల బాగా తెలుసు. ఈ కధలోని విశిష్టత పట్టే, కొట్టే , తెచ్చే అను మూడు మాటలలో చెప్పవచ్చు. ఆలా కాకుండా సవిస్తారంగా వర్ణించవచ్చు. సర్వదా ఒక మానవుడు ఏ మార్గంలో చరించాలో చెప్పేది రామాయణం. ఇప్పుడు ఆ కథను మనం క్లుప్తంగా చెప్పుకుందాం! ఆ తర్వాత ఆ కధలో దాగిఉంది అని మన పెద్దలు చెప్పిన ఆధ్యాత్మిక కోణం గురించి తెలుసు కుందాం!
కథ : రాముడు సీత దంపతులు. పదితలలు ఉన్న రావణాసురుడు ఆమెను అపహరించి, సముద్రం అవతల లంకలో దాచివుంచాడు. అప్పుడు రాముడు హనుమంతుని సహాయంతో సీత లంకలో ఉన్నదని గుర్తించి రావణుని సంహరించి సీతను తిరిగి తెచ్చుకున్నాడు.

ఆధ్యాత్మిక అర్ధము: అర్ధము తెలుసుకోవటానికి ముందు ఇంకా కొన్ని విషయములు చూద్దాం!

రాముడు - పరబ్రహ్మ
సీత - జీవాత్మ / జీవరూపిణి
దశకంఠుడు, రావణుడు - దశ ఇంద్రియములు
సముద్రం - సంసారం
లంక - దేహం
హనుమంతుడు - గురువు

పరబ్రహ్మ నుండి జీవాత్మను దశ ఇంద్రియములు దూరం చేస్తాయి. పరబ్రహ్మ కు జీవాత్మకు మధ్య సాగరమే సంసారం మరియు దేహమనే లంకలో జీవాత్మ బంధించ బడింది. జీవాత్మ పరమాత్మను చేరుకోవాలంటే గురువు ప్రమేయం తప్పనిసరిగా అవసరం. 

8, ఏప్రిల్ 2019, సోమవారం

రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న

రాముడు ఈ పేరు వింటే ఒక విధమయిన మానసిక శాంతి లభిస్తుంది కదా! పూర్వకాలంలో నవజాత శిశువులకు పేరు పెట్టవలసిన సందర్భంలో పెద్దలు వారి జాతకమునకు, వారి వ్యవహారమునకు, భవిష్యత్తులో వారు చేయబోయే కార్యములను ముందే సూచిస్తూ పేర్లు పెట్టేవారట. ఒకవేళ వారు పెద్దఅయిన తరువాత ఈ పేరుకు మించి వారు ఘనమైన పనులు చేస్తే వారికి అసలుపేరు కంటే వ్యవహార నామమే ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కుతుంది.

ఉదాహరణకు రావణాసురుని పేరు చూడండి. పుట్టినప్పుడు పెద్దలు ఇతనికి అనేక కళలలో ప్రావీణ్యం ఉంటుంది. అత్యంత మేధాసంపన్నుడు, ఇతను ఒక్కడే పది మంది పుత్రులకు సరిపడు తెలివితేటలు కలవాడు అని "దశగ్రీవుడు" అని పెట్టారు. తీరా ఇతను పెద్ద అయిన తరువాత కైలాసపర్వతం ఎత్తినప్పుడు కలిగిన భాద వలన పెద్దగ రొద పెట్టి, శివుని చేత "రావణా" అని పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఎవరిని ఐనా మీకు దశగ్రీవుడు తెలుసా అని అడగండి. గ్రీకు వీరుని తమ్ముడా అని మిమ్మల్నే అడుగుతారు.

అలాగే రామాయణంలో దశరధునికి పుట్టిన నలుగురు పుత్రులకు పేర్లు పెట్టే సమయంలో వారు అన్ని చూసి, వారికి సార్ధక నామదేయములు పెట్టారు. అవి రామ, భారత, లక్ష్మణ, శత్రుఘ్న. ఇంతకీ వారికి ఆ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే కింది పద్యం చూడండి.

గీ.  రాముడయ్యెను భువనాభి రాముడగుట
      లక్ష్మణుండయ్యె శౌర్యాదిలక్ష్మికతన
     భరము దీర్చెడివాడౌట భరతుడయ్యె
     దునుమువాడౌట రిపుల శత్రుఘ్నుడయ్యె

ఈ పద్యం శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రిగారు చెప్పిన "శ్రీమదాంధ్ర పద్మ పురాణం" లో పాతాళ ఖండంలో, పూర్వకల్ప రామాయణం లో చెప్పబడినది. 

6, ఏప్రిల్ 2019, శనివారం

భరతుడు వంటి సోదరుడు ....

భరతుడు, రామాయణం లోని అనేక వ్యక్తుల చేత అనుమానించబడిన వాడు. దశరధుడు, గుహుడు చివరకు తన సోదరుడయిన లక్ష్మణుడు కూడా అతనిని అనుమానించారు. అటువాని భరతుని గురించి శ్రీ రాముడు ఏమన్నాడో తెలుసా!
న సర్వే భ్రాతర స్తాత భవంతి భారతోపమాః 
 అంటే భరతుని వంటి సోదరుడు ఎవరికయినాను లభించుట దుర్లభము అని అర్ధము.  మరి శ్రీ రామునితో అంత చక్కగా తనగురించి చెప్పించుకున్న భరతుడు ఎలాంటి వాడు? నిజంగా శ్రీ రామునితో అటువంటి పొగడ్తలకు అర్హుడా?

అర్హుడే అని వాల్మీకి రామాయణం చెప్తుంది. దానికి కారణం అతని హృదయంలోగల భాతృ భక్తి. దానికి ఈ కింద శ్లోకమే తార్కాణం.

అభిషేక్ష్యతి రామతు రాజా యజ్ఞంను యజ్ఞంను యక్ష్యతే!
ఇత్యహం కృత సంకల్పో హృష్టో యాత్రా మాయాశిషం!!
తదిదం హ్యన్యధా భూతం వ్యవదీర్ణం మనోరమ !!!

     నేను ఏంతో సంతోషంగా తాతగారి ఇంటికి వెళ్ళాను. నేను అటు వెళ్ళగానే తండ్రిగారి అన్నగారయిన శ్రీరాముని రాజుగా ప్రకటించి, పట్టాభిషేకం చేసి ఆ తరువాత యాగాన్ని కూడా జరిపించి ఉంటారని అనుకున్న.  ఈ శ్లోకమునకు ఉన్న అర్థమును చూసి మన పెద్దలు భరతుని వ్యక్తిత్వమును చాలా చక్కగా విశ్లేషించారు. భరతుడు ఈ విధంగా అనుకున్నాడు అంటే, అతను శ్రీరామ పట్టాభిషేకం అతని పరోక్షంలో జరగాలని అనుకున్నాడు. అలా ఎందుకు అనుకోని ఉండవచ్చు? 2 కారణములు 
  1. భరతునికి రాజ్యకాంక్ష ఉండి శ్రీరామునికి పట్టాభిషేకం అవుతుంటే చూడలేక !
  2. భరతునికి దశరధుడు తన తల్లి కైకేయికి వివాహం జరిగిన సమయంలో ఆమె తండ్రికి ఇచ్చిన మాట తెలిసి. 
ఈ రెండు సందర్భాలలో మొదటిది అసలు సంభవమే కాదు, ఒకవేళ తాను శ్రీరామ పట్టాభిషేకం చూడలేక అమ్మమ్మగారి ఇంట్లో ఉండగా పట్టాభిషేకం జరిగి పోవాలి అని కోరుకుంటే, అతను తిరిగి వచ్చాక రాజ్యం అకంటకంగా తన పరం అవుతున్నప్పుడు మరలా రామునికోసం అడవులలోనికి పరుగులు పెట్టాడు కదా!
అంటే దీనిని బట్టి మన పెద్దలు ఎలా విశ్లేషించారంటే భరతునికి దశరధుడు తనతల్లికి ఇచ్చిన 2 వరముల గురించి తెలిసిన తెలియక పోయినా, తన తాతగారికి దశరధుడు ఇచ్చిన వాగ్దానం బాగా తెలుసు.  దశరధుని రాముని పైన గల ప్రేమ, రామునికి గ రాజ్య పరిపాలనా దక్షత , రాజ్యంలో ప్రజల కు రాముని పై గల ప్రేమ అన్ని తెలుసు. కనుక రాజ్యమును పరిపాలించే అవకాశం తనకు ఉంది తెలిసినా తన అన్నగారికి పట్టాభిషేకం జరగాలి అని కోరుకున్నాడు. మరి అటువంటి భరతుని గురించి రాముడు ఆలా చెప్పటం చాలా సబబే కదా!

4, ఏప్రిల్ 2019, గురువారం

సీతా రామ వియోగం

శ్రీరామ పట్టాభిషేకం తరువాత జరిగిన సంఘటనల క్రమాన్ని వివరించేది ఉత్తర కాండ. ఆ ఉత్తర కాండ లో ముఖ్యమయిన ఘట్టం సీతా రామ వియోగం. అయితే ఈ సీత రామ వియోగానికి గల కారణాన్ని అనేక పురాణములలో, అనేక కవులు రచించిన రామాయణములలో అనేక రకములుగా చెప్పారు. ఇప్పుడు వాని గురించి తెలుసు కుందాం. 
  1. వాల్మీకి రామాయణం: మనం అన్నింటికన్నా ముందు ముఖ్యంగా చెప్పుకోవలసినది వాల్మీకి రామాయణం గురించే. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో శ్రీరాముడు రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అని వేగులను అడిగినప్పుడు ప్రజల ఆంతర్యములో దానవుడు చెరబత్తిన స్త్రీ తమకు రాణిగా ఉండుట వారికి అంగీకారం కాదు అని అనుకుంటున్నారు అని మాత్రమే వేగులు చెప్పారు. ఆ విషయం విన్న శ్రీరాముడు రాజ్యంలోని ప్రజలకు సీత ఆమోదయోగ్యంగా లేదు కనుక సీతను పరిత్యజించాడు. 
  2. పద్మ పురాణం : పద్మ పురాణం లో ఈ సంఘటన  ఇప్పుడు మనమందరము చెప్పుకుంటున్న రాజకుని నింద  వలన జరిగినది అని చెప్పబడింది. అయితే ఆ రజకుడు కూడా అలా చేయటానికి కారణంగా ఒక కథను చెప్తారు. ఆ కథను ఇక్కడ చదవండి.  
  3. ఆధ్యాత్మ రామాయణం: ఈ రామాయణంలో సీత రాముడు ఏమి చేసినా చక్కాగా ముందే మాట్లాడుకుని వారు అనుకొనిన విధముగా చేస్తారు అని ప్రతిపాదించారు. సీతాపరిత్యాగ విషయముకూడా అంతే. వారు ఏకాంతములో ఉండగా సీతాదేవి దేవతలు తనను ముందుగా వైకుంఠమునకు రమ్మని కోరుతున్నారని చెప్పగా, శ్రీ రాముడు తనకు ముందుగానే ఈ విషయములు అన్ని తెలుసు కనుక దానికి సంబందించిన ప్రణాళిక సిద్దము చేసుకున్నాను అన్ని చెప్పారట. ఆ ప్రణాళిక ప్రకారమే లోక నింద మిషగా సీతను పరిత్యజించి, ఆమె ముని ఆశ్రమములో కుమారులను కనిన తరువాత లోకమునకు తన పాతివ్రత్యమును నిరూపించుకొను మిషతో భూగర్భమునకు తిరిగి చేరుకొనినది. అక్కడి నుండి వైకుంఠమునకు చేరినది. 

2, ఏప్రిల్ 2019, మంగళవారం

రామాయణం - వేదం

రామాయణం సాక్షాత్తు  వేదం అని చెప్తారు.

వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే 
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!

పరమాత్మ వేదవేద్యుడు. అంటే పరమాత్మ కేవలం వేదముల ద్వారానే తెలియదగినవాడు. అలాగే వేదములు కేవలం పరమాత్మగురించి మాత్రమే చెప్తాయి. కానీ ఒకసారి పరమాత్మ హఠాత్తుగా తన నామ,రూప, స్థానములను మార్చుకుని దశరథాత్మజుడు అయ్యాడట. అతని రూప, నామ , స్థానములు తెలియని వేదం సతమతమయ్యి అతని కోసం వెతికినదట. ఎక్కడ వెతకాలి తెలియక కవి మరియు ఋషి అయిన వాల్మీకి దగ్గరకు వచ్చిందట. అయితే పరమాత్మ రామునిగా ఉన్న విషయం తెలిసిన వాల్మీకి వేదము యొక్క రూపమును ఒక కావ్యముగా  మార్చినాడట.