26, ఏప్రిల్ 2020, ఆదివారం

తెలుగు మధురమయిన పద్యం-1

కవి హృదయం, అతను చెప్పబోయే విషయముల మీద అత్యంత నిమగ్నమై, ఆ విషయమును అద్భుతంగా చెప్పే ప్రయత్నంలో ఉంటుంది.
అటువంటి ఒక మధురమయిన తెలుగు పద్యం ఇప్పుడు ఒకటి చూద్దామా!
ఈ పద్యం కవిరాజ శిఖామణి నన్నెచోడుడు రచించిన కుమారసంభవం లోనిది.

హరి వికచామలాంబుజసహస్రము పూన్చి మృగాంకునం దవి 
న్ఫురిత మలాసితాబ్జమని పుచ్చగ జాచిన చేయి చూచి చం 
దురు డది రాహు సావి వెఱ దుప్పల దూలగ జారుచున్న న 
య్యిరువుర జూచి నవ్వు పరమేశ్వరు డీవుత మా కభీష్టముల్

భావం: విష్ణువు చక్కగా వికసించిన, కొంచెము కూడా మురికి లేకుండా శుభ్రపరచి వేయి తామర పువ్వులతో శివుని శిరస్సు పైన పూజించు చుండగ, ఆ శివుని తలపైన ఉన్న చంద్రుడ్ని చూసి,
ఆ చంద్రుని కూడా ఒక కమలం అనుకుని, ఆ కమలంలో ఎదో మచ్చ కనిపించుటతో ఆ పువ్వు మలినమైంది అని అనుకుని, ఆ ఆపువ్వును అక్కడ నుండి తన చేతితో  తీయబోగా
తనవైపు వచ్చుచున్న నల్లని చేతిని చూచిన చంద్రుడు ఆ చేతిని రాహువుగా భావించి తన నిజస్థానము నుండి కిందకు జారాడు. అలా చంద్రుడు కదలటం చుసిన విష్ణువు కూడా తన చేతిని వెనుకకు తీసాడు. అలా జారుచున్న విష్ణువు, చంద్రులను చూసి నవ్వుతున్న పరమేశ్వరుడు మాకు గల కోరికలను తీర్చును గాక.

విశ్లేషణ: ఈ పద్యంలో విశేషం ఏంటంటే విష్ణువు ఇంకా చంద్రుడు ఇద్దరు శివునికి సన్నిహితమయినవారే. అయితే కవి ఇక్కడ ఊహించిన విధానం చాలా హృద్యంగా ఉంది. పూజకు సిద్ధం చేసిన పువ్వులు ఎంతో శుభ్రంగానే  ఉన్నాయి.  ఆ పువ్వుల మధ్యలో ఉన్న చంద్రుడు కూడా ఒక పువ్వులాగే కనిపించాడు. అయితే చంద్రునిలో సహజంగా ఉన్న మచ్చల కారణంగా అది మురికిగా ఉన్న పువ్వు అని విష్ణువు భావించాడు. ఆ మలినమయిన పువ్వు ని తీయాలనే ఉద్దేశం తో దానిని తీయటానికి తన చేయి చాచాడు. అయితే అలా తన వద్దకు వస్తున్న  విష్ణుమూర్తి చేతిని చూసి అది రాహువు అనుకున్నాడు. దానికి కారణం విష్ణుమూర్తి  నలుపుగా  ఉంటాడు కనుక అతని చెయ్యి కూడా నల్లగా ఉంటుంది. రాహువు ఛాయాగ్రహం. కనుక విష్ణుమూర్తి చేతిని రాహువుగా ఊహించారు.
ఇక్కడ అద్భుతం ఏంటి అంటే విష్ణువు, చంద్రుడు ఇద్దరూ కూడా లేని విషయమును ఉహించుకుని దాని గురించి భయపడ్డారు. అటువంటి అపోహలను పోగొట్టాలంటే అవి ఊహలు అని తెలిసిన వాళ్ళ వాల్ల మాత్రమే అవుతుంది. ఇక్కడ వారి ఇద్దరి అపోహలను పోగొట్ట గలిగిన వాడు శివుడు. కనుక ఆ పరమ శివుడు మన కోరికలను తీర్చగలడు ఆని ఆతనిని మన కవి  ప్రార్ధిస్తున్నాడు.




  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి