14, ఆగస్టు 2026, శుక్రవారం

స్వరొచిష మను సంభవం లో గణేశ ప్రార్ధన

గ్రంధములను ముందుగా గణపతిని ప్రార్ధించి తరువాత విషయము లోనికి వెళ్లడం అనేది ఒక  సాంప్రదాయం. 

అటువంటి అనేక గ్రంధములలోనుండి అనేక గణేశ ప్రార్ధనలను మనం తెలుసుకుందాం !

ఈ రోజు మన తెలుసుకుంటున్న ఈ పద్యం అల్లసాని పెద్దన రచించిన స్వరోచిషమనుసంభవం లోనుండి తీసుకున్నాం!



అంకము జేరి శైలతనయాస్తనదుగ్ధము లానువేళ బా 

 ల్యాంకవిచేష్ట దొండమున నవ్వలి చన్గబళింప బోయి యా 

వంక గుచంబు గాన కహి వల్లభహారము గాంచి వే మృణా 

ళాంకుర శంక నంటెడు గ జాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ !


అర్ధము: 

అంకమున్ = ఒడిలో ; చేరి = కూర్చుని ; శైలతనయ = హిమాలయ పర్వత పుత్రి, పార్వతీ దేవి ; స్తనదుగ్ధములు= చనుబాలు; ఆనువేళ = త్రాగే సమయంలో ; బాల్యంక = బాల్యం వల్ల కలిగే ; విచేష్టన్ = ఆట లాగ ; తొండమున్ = తొండముతో ; అవ్వలి = అటుపక్క ఉన్న ; చన్ = చను భాగాన్ని ; కబళించ బోయి = పట్టుకోవాలని ప్రయత్నించగా ; ఆ వంకన్ = అటు ప్రక్కన ; కుచంబున్ = స్తనమును ; కానక = అందుకోలేక , కనిపించక ; అహివల్లభ = సర్పరాజు ను ; హారమున్ = హారముగా; కాంచి = చూసి ; వే = వేగంగా; మృణాళ= తామర ; అంకుర = లేత కాడలు ; అంటెడు = పట్టుకునే ; గజాస్యునిన్ = గజముఖము కలిగిన వినాయకుని ; అభీష్ట = కోరికలు ; సిద్ధికిన్ = తీరునట్లుగా ; కొల్తున్ = సేవించెదను.


తాత్పర్యం:
 వినాయకుడు పార్వతీ దేవి ఒడిలో కూర్చుని, ఒక చన్ను నుండి పాలు త్రాగుతూ , చిన్నపిల్లలకు ఉండే చాపల్యముతో రెండవ స్తనమును పట్టుకోవడానికి తన తొండముతో ప్రయత్నించగా, అర్ధనారీశ్వర తత్వము వల్ల అటుపక్క సగ దేహము శివుని రూపములో ఉన్న కారణంగా వినాయకుని తొండము నాకు మరొక స్థానము బదులుగా శివుని మెడలోని నాగాభరణం దొరకగా,  గజముల సహజ లక్షణమయిన తూడులను పట్టుకొనుటకు ప్రయత్నించుచున్న ఆ గణపతిని కోరికలు తీర్చుకొనుటకు ప్రార్ధించెదను .

4, జులై 2026, శనివారం

తుమ్ము వచ్చి నప్పుడు చదవవలసిన శ్లోకం

 తుమ్ము వచ్చి నప్పుడు చదవవలసిన శ్లోకం 

ఓంకార పంజరశుకీ ముపనిషదుద్యాన కేళికలకంఠీం 

ఆగమనవిపినమయూరీ మార్యా మంతర్విభావయే గౌరీమ్ 

22, ఆగస్టు 2025, శుక్రవారం

సూర్య ప్రార్ధన - కుమార సంభవం

ఈరోజు మనం కుమార సంభవం లో చెప్పిన సూర్య ప్రార్ధన చుద్దాం!

                అనుపమ దివ్యమూర్తి యను నమ్తియకాదు భవాష్టమూర్తులం

                దును పరమూర్తి దాన, ప్రభతోడ జగజ్జన రాజి కెల్ల నిం

                దనయము దాన దృష్టి యను నంతియకాదు త్రిలోచనాదిలో

                   చనమును దానయైన రవి చారు నిజ ప్రభ మాకు నీవుతన్

ఆర్ధముః 

అనుపమ దివ్యమూర్తి = సాటి లేని అమానుష మైన ఆకారము గల, అనినంతియకాదు =  అనినంత మాత్రమే కాదు భవ= శివుని అష్ట=ఎనిమిది మూర్తులందు=మూర్తులలో, తాను=తనే, పర= గొప్ప, మూర్తి=మూర్తి, ప్రభ= కాంతి, తోడన్=తో, జగత్=లోకమునందలి,  జనరాజి= జనుల యొక్క సమూహం, ఎల్ల= అందరికి, ఇందున్= ఇందులో, అనయమున్= ఎల్లప్పుడు  దాన= తన,  దృష్టి= చూపు, యను నంతియకాదు త్రిలోచన= మూడు కన్నులలో,ఆది= మొదటి, లోచనము= కన్ను, యైన=  అయిన, రవి= సూర్యుడు,  చారు= అందమైన,  నిజ ప్రభ = తనదైన మెరుగును  మాకు= మాకు, నీవుతన్= ఇచ్చు గాక.

తాత్పర్యంః నిరుపమానం, అమానుషమయిన ఆకరము గల వాడనునంతమాత్రమే కాదు, శివుని ఎనిమిది మూర్తులలోను దానే శ్రేష్టమైన మూర్తి, తన వెలుగుతో లోకమునందలి ప్రాణికోటి కంతకును దానే యెల్లప్పుడును దృష్టి యనునంత మాత్రమే కాదు. ముక్కంటియైన శివునకు గల మూడుకన్నులలో మొదటి కన్నయిన సూర్యుడు మాకుతనదైన వెలుగును ఇచ్చును గాక!

18, ఆగస్టు 2025, సోమవారం

32 బ్రహ్మగారి గుణములు- లింగ పురాణం

సృష్టికర్త బ్రహ్మగారికి 32 గుణములు శివుని రూపమైన ఈశానుని ద్వారా, ఆదిశక్తి అనే మూలప్రకృతి ద్వారా సంక్రమించాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం!

  1. చిత్తవృత్తి నిరోధం
  2. సాంఖ్యయోగం
  3. తపస్సు
  4. విద్య
  5. విధి
  6. క్రియ
  7. ఋతం (చక్కని సంభాషణ)
  8. సత్యం
  9. దయ
  10. బ్రహ్మం
  11. అహింస
  12. సన్మతి (సత్+ మతి= మంచి బుధి)
  13. క్షమ (ఓర్పు)
  14. ధ్యానం
  15. ధ్యేయం
  16. దమం (ఇంద్రియ నిగ్రహం)
  17. శాంతి
  18. విద్య (తెలుసుకోవలసినవి తెలుసుకొనుట)
  19. అవిద్య (అవసరం లేనివి వదులుకొనుట)
  20. మతి
  21. ధృతి
  22. కాంతి
  23. నీతి
  24. ప్రధ
  25. మేధ
  26. లజ్జ
  27. దృష్టి (దివ్యజ్ఞానం)
  28. సరస్వతి
  29. తుష్టి (తృప్తి)
  30. పుష్టి (ఇంద్రియ పాటవం)
  31. క్రియ (వేద విహితమైన క్రియ)
  32. ప్రసాదం (మనస్సు ప్రశాంతంగా ఉండడం)















21, మే 2025, బుధవారం

నవదుర్గలు - మహిళా మణులు

మనకు పురాణాలలో నవదుర్గలు అని తొమ్మిది మంది దుర్గల అవతారాలు గురించి చెప్తారు.  అయితే ఈ తొమ్మిది మంది నవదుర్గలు నిత్యజీవితంలో స్త్రీ మూర్తికి అత్యంత సన్నిహితంగా ఉంటారు అంటే ఆ నవదుర్గలు  దైనందిని జీవితంలో మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ మూర్తికి వారి వారి నిగూఢమైన శక్తికి ప్రతిరూపాలన్నమాట. 

 ఈ తొమ్మిది మంది నవదుర్గలు అలాగే ఆ తొమ్మిది మందిని నవదుర్గలతో  పాటుగా ప్రతి నిత్యం జీవితంలో ఉన్న శ్రీమూర్తులకు ఉన్న సంబంధం  ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఈ రోజు బ్లాగులో మనం నేర్చుకుందాం!

నవదుర్గలకు సంబంధించిన స్పష్టమైన శ్లోకం ఈ కింద ఇచ్చాను చూడండి. 


ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ 

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్ధకం 

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ 

సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ 

నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా   ప్రకీర్తితాః  

ఉకక్తాన్యేత్యాని నామాని బ్రాహ్మణైవ మహాత్మనా 






మొట్టమొదటి అవతారం నవదుర్గలలో శైలపుత్రి




స్త్రీ జన్మించిన  తర్వాత తన మొట్టమొదటి గుర్తింపు తన తండ్రి  అందువల్ల ఈ నవదుర్గలలో మొట్టమొదటి అవతారం శైలపుత్రి అంటే తనను తాను తన తండ్రి పేరుతో పరిచయం చేసుకుంటుందన్నమాట, శైలపుత్రి అంటే  హిమవంతుని పుత్రిక అంటే తను తన తండ్రికి కుమార్తెగా మాత్రమే తన గుర్తింపును పొందుతూ ఉంటుంది దానివల్ల ఇక్కడ అమ్మవారికి  పులి లాంటి వాహనాలు లేవు. అమ్మవారి తల పై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం



రెండవ  అవతారం బ్రహ్మచారిణి 

ఈ ప్రాయంలో అమ్మవారు విద్యార్థిగా అభివర్ణించుకుంటుంది అంటే విద్యను అభ్యసించడానికి కావలసిన అన్ని అర్హతలు తను పొందటానికి సిద్ధంగా ఉన్నాను అని రూపంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ రూపం లో అమ్మవారికి వాహనమే ఉండదు. కేవలం తాను ఒక కమండలం జపమాల పట్టుకుని శుద్ధ సత్వగుణంతో విరాజిల్లుతూ ఉంటుంది. 




మూడవ  అవతారం చంద్రఘంట 





ఈ అవతారంలో అమ్మవారు తన గృహస్థధర్మమును స్వీకరించి తన భర్త కు సంబందించిన అభూషణం అయిన చంద్రుడిని తన తలపైన ధరిస్తుంది. ఈమెకు 10 చేతులు ఉంటాయి, అంటే తనకు భాద్యతలు పెరిగాయి అని, వానిని తాను అద్భుతంగా ఎంతో  చక్కగా నిర్వర్తిస్తుంది అని అర్ధం. 

నాలుగవ  అవతారం కూష్మాండ 

ఈ అవతారంలో అమ్మవారు కేవలం 8 చేతులతో దర్శనం ఇస్తారు అంటే కొంచెం భాద్యతలు తగ్గి నాయి అని. డ్డానికి కారణం ఆమె 
కూష్మాండ , తన కడుపులో ప్రపంచమును మోస్తున్నది అని అర్ధం. 



 

ఐదవ  అవతారం స్కందమాత 

ఈ అవతారంలో అమ్మవారు తన తల్లి భాద్యతలను చక్కగా నిర్వహిస్తున్నట్లుగా మనం చూడవచ్చు . ఈ అవతారంలో అమ్మవారి ఒడిలో షణ్ముఖములతో స్కందుడు అంటే కుమారస్వామి కూర్చునిఉండడం మనకు కనిపిస్తుంది. 




ఆరవ  అవతారం కాత్యాయిని 

ఈమె  మనలోని అనేక యుద్ధములలో గెలవడానికి ప్రతీక. యుద్ధం అంటే ఇష్టములకు, బాధ్యతలకు మరియు తనలోపలి అలజడులకు అన్నింటికి ప్రతీక అయినా అనేకానేక సంఘర్షణలను చిరునవ్వుతో,తన పుట్టింటి వారు నేర్పిన గుణగణములతో నేర్పుగా గెలువగలిగినది. 


ఏడవ  అవతారం కాళరాత్రి 

ఈ అవతారంలో అమ్మవారు నీలి వర్ణంలో ఉంటారు. తనలోని అనేక సంఘర్షణలను తట్టుకుంటూ తనను తాను మార్చుకుంటూ ఉన్న సందర్భంలో ప్రతి తల్లి కాళరాత్రిగానే మనకు కనిపిస్తుంది. 



ఎనిమిదవ  అవతారం మహాగౌరి 

ఈ అవతారంలో అమ్మవారు తనను తాను గెలిచి, తనలోపలి, బయటి శత్రువులను గెలిచి ప్రశాంతంగా ఉండే మధ్యవయస్సు కలిగిన స్త్రీ మూర్తిలా మనం చూడవచ్చు. 



తొమ్మిదవ  అవతారం సిద్ధిదాత్రి 


ఈ స్థితిలో అమ్మవారు అడిగిన వరములను, సిద్ధులను ప్రసాదించే సిద్ధిదాత్రి గా మనకు దర్శనం ఇస్తారు అంటే మన నిజ జీవితంలో మన కాళ్ళ ఎదుట కనిపించే మన అమ్మమ్మ నానమ్మ మరియు ఇతర పెద్ద వయసు ఉన్న స్త్రీమూర్తులను మనం ఈ విధంగా చూడవచ్చు . వారు వారి జీవితంలో నేర్చుకున్న అనేకానేక పాఠాల నుండి మనకు అనేక సలహాలు ఇస్తూ ఉంటారు. 

ఈ విధంగా మనం మన నిజజీవితంలో అమ్మవారి నవదుర్గా రూపాలను దర్శించ వచ్చు. 
ఈ బ్లాగు కు సంబందించిన youtube వీడియో ఇక్కడ చూడవచ్చు. 

29, మే 2023, సోమవారం

భాస్కర శతకం -2

మన తెలుగు సామెతలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అని నానుడి కదా ! మరి ఇంతకూ ఆ మాట ఎక్కడనుండి తీసుకున్నారో చూద్దామా!

అక్కర పాటు వచ్చుఁ సమయంబున జుట్టములొక్కరొక్కరి 

న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమేసుమీ 

యొక్కట నీటిలో మెరక నోడలబండ్లును బండ్లనోడలున్ 

దక్కకవచ్చుఁచుండుట నిదానముగా దెలంప భాస్కరా!

అర్ధం: భాస్కరా = ఓ సూర్యాదేవా !, అక్కర = తగిన, పాటు = అవసరము, వచ్చుఁ = వచ్చిన , సమయంబునన్ = సమయంలో, చుట్టములు = బంధువులు, ఒక్కరొకరి = ఒకరు మరొకరి , మక్కువన్ = ఇష్టంగా , ఉద్ధరించుట = కాపాడుట , చూడగా = ఆలోచిస్తే , మైత్రికి = స్నేహమయునకు , యుక్తము= సరియైనది , =అవును, సుమీ = సుమా! ఒక్కటన్ = ఒకవేళ , నీటిలో = నీటిలోపల , ఓడలన్ = పడవలమీద , బండ్లును = బండ్లు , మెరకన్ = భూమిమీద , బండ్లన్ = బండ్ల మీద , ఓడలున్ = పడవలు , తక్కక = ఆగకుండా , వచ్చుఁచుండుట = రావడం, తలంపన్ = ఆలోచించగా , నిదానం= నిదర్శనము, కాదె= కదా !

తాత్పర్యం : ఈ ప్రపంచంలో చుట్టములు, బంధువులు ఒకరికి అవసరమయినప్పుడు మరొకరు చక్కగా సహాయం చేసుకుంటారు అది ఎంత సహజం అంటే నీటిపైన ఉన్నప్పుడు బండ్లు పడవలమీద , భూమిమీద ఉన్నప్పుడు అవే పడవలు బండ్లమీద ప్రయాణం చేస్తాయి కదా!






28, మే 2023, ఆదివారం

భాస్కర శతకము - 1

తెలుగులో అనేక నీతి శతకములు ఉన్నాయి. వానిలో మనం ఈ టపాలో భాస్కర శతకము లోని ఒక పధ్యము నెర్చుకుందాం!

శ్రీగలభాగ్యశాలి గడు జేరగవత్తురు తారుదారె దూ

రాగమున ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వను

ద్యోగముచేసి రత్ననిల యుండనికాదె సమస్తవాహినుల్

సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురు మూర్తిభాస్కరా

అర్ధంః మునిసన్నుత = మునిలచే మన్ననలు పొందే, మత్ = నాకు, గురుమూర్తి = గురురూపుడు అయినట్టి, భాస్కరా = ఓ సూర్య భగవానుడా! దూర = దూరము నుండి, ఆగమన= వచ్చుట వలన కలిగిన, ప్రయాసమునన్ = శ్రమకు, ఓర్చియున్= భరించి, నిల్వన్= నిలుచుటకు, ఉద్యోగము = ప్రయత్నము , చేసి , తారుదారె= తమకుతమే, అదటన్ = అనురాగంతో, శ్రీ = సంపదలు, గల =కలిగిన, భాగ్యశాలి = అదృష్టవంతుని, కడు= చాలా/ ఎక్కువగా, చేరగవత్తురు = దగ్గరకు చేరుతారు. సమస్త = సకలమైన, వాహినుల్ = నదులు, సాగరున్= సముద్రమును, రత్న= రత్నముల కోసం,  ఎల్లన్ = సమీపించునది

తాత్పర్యం : ఎక్కడెక్కడో పుట్టిన అనేక నదులు రత్నములు కలిగి ఉన్నాడు అనే ఆశతో సముద్రమును చేరినట్లు ప్రజలుకూడా అనేక వ్యయ ప్రయాశలకు ఓర్చుకుని తమంతట తామే ధనవంతుల ఇంటికి వస్తూ ఉంటారు.






29, ఆగస్టు 2022, సోమవారం

శ్రీనాధుని చే చెప్ప బడిన గణేశ ప్రార్ధన

 శ్రీనాధుడు రచించిన భీమఖండం లో గణపతిని స్తుతిస్తూ చెప్పిన పద్యం చాలా బాగుంది.

ఏనికమోముతార్పెలుక నెక్కినరావుతురాజు సౌరసే

నానియనుంగుబెద్దన వినాయకదేవుడు కర్ణతాళఝం

ఝానిలతాడనంబున నిరంతరమున్ బ్రబలాంతరాయసం

తానమహాఘనాఘన కదంబములన్ విదళించు గావుతన్


తాత్పర్యం: ఏనుగు ముఖం కలిగి, తన వాహనము ఎలుకను ఎక్కిన కుమారస్వామికి స్వయాన పెద్ద అన్న అయిన వినాయకుడు, తన పెద్ద పెద్ద చెవులను విసురుతూ ఎల్లప్పుడూ అత్యంత దట్టంగా అలుముకుంటున్న విఘ్నములు అనే కారు మబ్బులను చెల్లా చెదురుగా పోగొట్టును గాక. 






30, మార్చి 2022, బుధవారం

నల దమయంతుల వివాహం అందరికి సంతోషకారకం అయ్యిందా?

మనం ఇంతకు ముందు దమయంతి నల మహారాజుల వివాహం గురించి,  ఆ వివాహానికి దేవతలు రావడం, వారిని పరిక్షించి,వారికి వరములను ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత వారి  జీవితంలో సంభవించిన మార్పులను గురించి ఇప్పుడు చూద్దాం! 

ఇంద్రాది దేవతలు స్వయంవరం అయిన తరువాత ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా వారికి ద్వాపర, కలి యుగములు భౌతిక దేహముతో పురుషుల వలే ఎదురు వచ్చారు. వారిని చుసిన దేవతలు వారిని ఆపి ఎక్కడకు బయలుదేరారు అని అడుగగా వారు దమయంతి స్వయంవరం లో పాల్గొనడానికి వెళ్తున్నామని చెప్పారు. వారిద్దరిలో కూడా కాళీ అత్యంత ఉత్సాహంగా ఉండడాన్ని గమనించిన దేవతలు వారికి ఆ స్వయంవరం పూర్తి అయినది అని చెప్పారు. ఆ మాటలు విన్న ఆ ఇద్దరు యుగ పురుషులు నిరాశ చెందారు. కానీ దేవతలు అంతటితో ఆగకుండా ఆ దమయంతి నలుని తప్ప దేవతలను కూడా వివాహం చేసుకోనని చెప్పిందని, దానికి ప్రముఖ మయిన కారణం నలుని ధర్మ పరాయణత అని చెప్పిన మాటలు వారు చెప్పారు. 

ఆయా మాటలను విన్న  కలి  కి ఆవేశం వచ్చింది.నలునిలో ఉన్న ఏ ధర్మదక్షతను ఆమె అతనిని వరించిందో ఆ ధర్మమునకు నలుని దూరం చేస్తాను అని కలి ప్రతిజ్ఞ చేసాడు. 

అలా కాళీ చేసిన ప్రతిజ్ఞ కు ద్వాపరుడు కూడా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. 

మరి వారు నలుని నిజంగా ధర్మ బ్రష్టుని చేశారా? లేదా? చేస్తే ఎలా చేయ గలిగారు? దాని వలన నల దమయంతిల జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అని తరువాతి టపా లలో చూద్దాం!

16, మార్చి 2022, బుధవారం

విదుర నీతి - 13

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు అంతే కాకుండా పండితులకు ఉండే ముఖ్య లక్షణముల గురించి తెలుసుకుందాం! 


సంస్కృత శ్లోకం:

నాప్రాప్యమభివాంచంతి నష్టం నేచ్ఛన్తి శోచితుం

ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

పోయిన దానికిదాదల పోయడశక్యార్ధములకుబోడాపదలన్

బాయడు ధైర్యముదీనుల రోయడుతత్వజ్ఞుడగునరుండు మహీశా!

భావంః పండితుడు తను పొందలేక పోయినదాని గురించి దుఃఖించడు, తనకు సాధించడానికి అసాధ్యమయిన లక్ష్యములను సాధించాలని కోరుకొనడు, తన లక్ష్యములను సాధించే క్రమంలో ఎదురయిన సమస్యలను చూసి ధైర్యమును కోల్పోడు, అంతే కాకుండా తన ముందు ఎవరయినా ధైర్యమును కోల్పోయిన వారిని అనాదరించడు. 

15, మార్చి 2022, మంగళవారం

నలుడు, దమయంతిల వివాహం

మనం ఇంతకుముందు దమయంతి స్వయంవరమునకు దేవతలు వచ్చారని, వారు నలుని దమయంతి వద్దకు రాయభారానికి పంపారని, ఆ రాయబారాన్ని తీసుకుని నలుడు దమయంతి దగ్గరకు వెళ్ళడం గురించి చెప్పుకున్నాం!

నలుడు దమయంతి సమాధానాన్ని దేవతలకు చెప్పాడా? వారు స్వయంవరమునకు ఎలా వచ్చారు?ఆ తరువాత స్వయంవరం ఎలా జరిగింది?  అని ఇప్పుడు తెలుసుకుందాం!

దమయంతి సమాధానమును నలుడు దిక్పాలకులయిన దేవతలకు తెలియజేసాడు. దమయంతి సమాధానమును విన్న దేవతలు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు, కానీ వారు దమయంతి స్వయం వరమునకు తప్పకుండా రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దిక్పాలకులు నలుగురు (ఇంద్ర,వరుణ,అగ్ని మరియు యమధర్మరాజు) ఆ స్వయంవరమునకు నలుని రూపంలో వచ్చారు.

ఆ స్వయంవరమండపం లో అన్ని రాజ్యముల నుండి రాజులు వచ్చారు. వారిలో కొందరు కేవలం ఆమెను చూడడానికి మాత్రమే వచ్చారు. దమయంతి తన చేతిలో వరమాలతో ఆ మండపం లోనికి వచ్చింది. ఆఅమె పక్కన ఉన్న చెలికత్తెలు ఆమెకు ఒకొక్క రాజు గొప్పతనమును చెబుతూ వస్తున్నారు. అలా వస్తున్న వారికి ఒక దగ్గర ఐదుగురు నల మహారాజులు కనిపించారు. అప్పుడు చెలికత్తెలకు ఏమి చెప్పాలో అర్ధంకాలేదు. దమయంతికి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉంది. ఆమెకు అక్కడ ఉన్న ఐదుగురిలో ఒక్కడు నలుడు ఆని మిగిలిన వారు దేవతలు అని తెలుసు కనుక ఆమె వారిని మనస్సులోనే ప్రార్ధించడం మొదలుపెట్టింది. వారిలో మానవుడయిన నలుడు ఎవరో తెలుసుకొనగలిగే ఉపాయమును చెప్పమని కోరుకున్నది. ఆమె దృడసంకల్పానికి సంతోషించిన దేవతలు నిజమయిన నలుని పాదములు భూమిని తాకుతూ ఉంటాయని ఆమెకు స్పురించింది. ఆమె అక్కడ ఉన్న ఐదుగురు నలమహారాజులను గమనించింది. ఆ ఐదుగురిలో కేవలం ఒక్కరి పాదములు మాత్రమే నేలను తాకుతూ ఉన్నాయి. మిగిలిన నలుగురి పాదములు భూమిని తాకకుండా ఉన్నయి. అప్పుడు దమయంతి తన వరమాలను నలుని మెడలో వేసింది. 

వారి వివాహాన్ని చూసి సంతోషించిన ఇంద్రుడు, నల మహారాజు చేసే ప్రతి యజ్ఞమునకు స్వయంగా వచ్చి హవిర్భాగమును స్వీకరిస్తానని, అగ్నిదేవుడు నలుని కోరికపై అతను ఎక్కడ కావాలంటే అక్కడకు వస్తానని, వరుణుడు కూడా నలుని కోరికపై ఎక్కడికి అయినా వస్తానని, యమధర్మరాజు నలుని మనస్సు ఎల్లవేళలా ధర్మం పైననే నిలచేలా చేస్తానని వరములు ఇచ్చారు. 

14, మార్చి 2022, సోమవారం

అష్ట వినాయకులు

 మనం ఇంతకు ముందు ఏకాదశ రుద్రుల గురించి,  నవ బ్రహ్మల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం స్వయంభువులుగా అవతరించిన అష్ట వినాయకుల గురించి తెలుసుకుందాం!

వీని గురించి స్వయంగా వేద వ్యాసుడే ఒక శ్లోకంలో చెప్పాడు. ఆ శ్లోకం ఇప్పుడు మనం చూద్దాం!

స్వస్తిశ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం

బల్లాళం మురులం వినాయక మిదం చింతామణీ దేవరం

లేన్యాద్రిం గిరిజాత్మకం సురవరం విఘ్నేశ్వరం ఓఝురం

గ్రామే రంజన సంస్థితో గణపతిః కుర్యాత్ సదా మంగళం

  1. మయూరేశ్వరుడు
  2. సిద్ధి వినాయకుడు
  3. బల్లాళేశ్వరుడు
  4. వరద వినాయకుడు
  5. చింతామణి గణపతి
  6. గిరిజా పుత్రుడు
  7. విఘ్నేశ్వరుడు
  8. మహాగణపతి

13, మార్చి 2022, ఆదివారం

దశగ్రీవుడు రావణుడు ఎలా అయ్యాడు?

 మనం ఇంతకుముందు మనం దశగ్రీవునికి నంది ఇచ్చిన శాపం గురించి తెలుసుకున్నాం కదా! ఆ తరువాత ఏమి జరిగింది? దశగ్రీవునికి రావణ అనేపేరు ఎలా వచ్చింది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం!

నంది శాపం తరువాత దశగ్రీవుడు తన పుష్పక విమానమును ఆపిన ఆ పరమేశ్వరుని కోసం చూశాడు. కానీ నంది దశగ్రీవుని వెళ్ళనివ్వలేదు. అప్పుడు వారి మధ్య చిన్న యుధ్ధం జరిగింది. ఆ సందర్భంలో దశగ్రీవుని అహం, గర్వం మరింతగా పెరిగి, విచక్షణ కోల్పోయాడు. ఏ శిఖరం మీద అయితే పరమేశ్వరుడు ఉన్నాడని నంది చెప్పాడో ఆ శిఖర మూలమును, కొండనే ఎత్తాలని ప్రయత్నం చేసాడు. దానికోసం అతను తన పది తలల, ఇరవై చేతుల బలములను ఒడ్డాడు. అప్పుడు, ఆ కైలాస శిఖరం కొద్దిగా కంపించింది. ఆ కంపనమునకు పార్వతీదేవి తన భర్త చేతిని కొంచెం గట్టిగా పొదివి పట్టుకుంది. ఆమె భయమును పోగొట్టాలంటే ఆ కంపనను ఆపాలన్న ఉద్దేశంతో తన కాలి బొటనవేలుని కొద్దిగా నొక్కి ఉంచాడు. 

పైనుండి వచ్చిన ఆ ప్రతిఘటనను అతని శక్తి తట్టుకోలేక అతను ఆ కొండకింద ఇరుక్కుపోయాడు. ఆ సమ్దర్భంలో అతను చాలా పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఆ అరుపులకు ముల్లోకములు అల్లాడిపోయాయి. ఆ శబ్ధానికి దేవేంద్రుని దేవలోకం కూడా కంపించింది. ఆ సందర్భంలో దశగ్రీవుడు బ్రహ్మదేవుని సహాయం కోరాడు. కానీ ఆ సమయంలో అతనిని పరమేశ్వరుడు తప్ప ఎవ్వరూ కాపాడలేరని తెలుసుకుని, అతనినే ప్రార్ధించడం, స్తుతించడం మొదలుపెట్టాడు. 

అతని గర్వం ఆ సందర్భాన్ని బట్టి కొంతవరకు తగ్గింది. అతను ఎంతో పెద్దగా అరుస్తూనే స్తుతించడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడచిన తరువాత, శివుడు సంతోషించి తన పట్టును సడలించాడు. అప్పుడు దశగ్రీవుడు తన చేతులను, కాళ్ళను ఆ పర్వతం క్రిందినుండి తీసుకుని, లేచి నిలబడ్డాడు. 

అతనిని చూసి భోళాశంకరుడు అయిన పరమేశ్వరుడు  దశగ్రీవునికి వరం ఇవ్వాలని అనుకున్నాడు. అంతేకాక అతని అరుపుల వలన అన్నిలోకములు అదిరిపోయాయి, భయమునకు గురి అయ్యాయి కనుక అతనికి "రావణ" అనే పేరు ఇచ్చాడు. 

తరువాత రావణుడు అతనికి పరమేశ్వరుడు ఇస్తానన్న వరమును గుర్తు చేస్తూ, అతనికి ఇంతకుముందే బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ప్రసాదించాడు కనుక తనకు అమరత్వమును గురించిన వరము అవసరములేదని, అయితే ఇంతకు ముందు తపస్సు కారణంగా, ఇప్పుడు కైలాస పర్వతమును ఎత్తేకారణంగా అతని ఆయుష్షు తగ్గిపోయినది కనుక అతని ఆయుష్షును తిరిగి ఇవ్వమని, అంతేకాకుండా ఆతనికి ఒక దివ్య ఆయుధం ఇవ్వవలసినదిగా కోరుకున్నాడు. అతను కోరుకున్న వరములను ఇచ్చిన పరమేశ్వరుడు అతనికి చంద్రహాసము అనే ఒక దివ్య ఖడ్గమును ఇచ్చాడు. ఆ ఖడ్గమును భక్తితో పూజించమని, ఒకవేళ దానికి అవమానం జరిగితే అప్పుడు ఆ ఖడ్గం అతని వద్దకు తిరిగి చేరుతుంది అని చెప్పాడు. ఆ షరతునకు అగీకరించిన రావణుడు పరమేశ్వరుని వరములను స్వీకరించి తిరిగి పుష్పక విమానం ఎక్కి తన లంకకు వెళ్ళిపోయాడు. 

ఇక్కడ విషయం మనం చూస్తే, రావణునికి అతనికి అమరత్వం ఉన్నది అని గట్టి నమ్మకం లేదు. కారణం అతనికి అమరత్వం ఉన్నది  అని నమ్మకం ఉంటే అతను తన తరిగిపోయిన ఆయుష్షు గురించి మాట్లాడవలసిన అవసరమే లేదు కదా! కానీ అతను అతని తరిగిపోయిన ఆయుష్షుని తనకు ఇవ్వమని కోరుకున్నాడు. అతని వివేకం పూర్తిగా పోయింది. అతని ముర్ఖత్వం, ఆవేశం, దురుసుతనం, అతను కోరుకున్నది చేయాలనుకునే పట్టుదల అతనికి పెరిగిపోయింది. అతని ఆలోచనలు మరింత క్రూరంగా మారిపోయాయి. 

దశగ్రీవుడు రావణునిగా మారడం అతని పతనమునకు నాంది అని చెప్పవచ్చు. 

11, మార్చి 2022, శుక్రవారం

విదుర నీతి - 12

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు అంతే కాకుండా పండితులకు ఉండే ముఖ్య లక్షణముల గురించి తెలుసుకుందాం! 

సంస్కృత శ్లోకం:

క్షిప్రం విజానాతి ఛిరంశ్రుణోతి, విజ్ఞాయ చార్ధం భజతేన కామాత్

నా సంపృష్ణో వ్యౌపయుంక్తే పరార్ధే, తత్ప్రజ్ఞానం ప్రధమం పండితస్య 

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

వినుటగురూక్త వాక్యమును వేగముజెందక సావధానత్

వినియదిమానసంబున జపించుటపిమ్మట తత్పదార్ధముం

గనుటయుదానగార్యమనఘంబుగజేయుట పృష్టుడయ్యుదా

మునవచియింపకుండుటివి ముఖ్యగుణంబులు కౌరవేశ్వరా!


భావం:

ఏ విషయమును అయినాసరే సులభంగా అర్ధం చేసుకునే గుణం, ఎంతసేపయినా ఎదుటి వారు చెప్తున్న విషయాలను శ్రద్ధగా వినే గుణం, కావాలనుకున్న దానిని కేవలం కోరికతో మాత్రమే కాకుండా ఉచితానుచితములు అలోచించి పొందాలని అనుకునే గుణం, ఇతరుల గురించిన విషయములు అవసరము లేనిదే అడుగని గుణం అనేవి పండితులకు ఉండే ముఖ్య గుణములు.

8, మార్చి 2022, మంగళవారం

దశగ్రీవుని మరణానికి ఒక కారణం నంది శాపమా?

మనం ఇంతకుముందు దశగ్రీవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం! అతని వివాహం, అతని జననం, పక్కవారి ప్రభావం వలన అతను తన విచక్షణా శక్తిని కోల్పొతున్న సందర్భాలగురించి, తెలుసుకున్నాం! కానీ  దశగ్రీవునికి నంది శాపం ఎందుకు ఇచ్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం!

తన అన్న కుబేరుని ఓడించిన తరువాత  దశగ్రీవుడు పుష్పక విమానం సొంతం చేసుకుని గర్వంతో విర్రవీగ సాగాడు. అలా ఒకసారి హిమాలయ పర్వతముల మీదుగా వెళ్తూఉండగా అతని విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ముందుకు వెళ్ళలేదు. అలా విమానం ఆగిపోవడనికి కారణం ఏమిటో అర్ధంకాలేదు. అప్పుడు అక్కడికి శివుని భక్తుడు, అనుచరుడు అయిన నంది వచ్చాడు. 

ఆ విమానం అలా అగిపోవడానికి కారణం వారు ఉన్న ప్రాంతం అని, ఆ ప్రాంతంలో పరమేశ్వరుడు పార్వతీ దేవితో సంచారం చేస్తుంటాడు కనుక అక్కడి నుండి ఎవ్వరూ వెళ్ళకూడదు కనుక తన మార్గమును మార్చుకొమ్మని చెప్పాడు. అప్పటికే గర్వం తలకెక్కిన  దశగ్రీవుడు నంది చెప్పిన మాటలను విని, నందిని, అతని సగం మనిషి మరోసగం ఎద్దు రూపమును చూసి ఆ ఎద్దులా ఉన్న ముఖాన్ని చూసి, కోతిలా ఉన్నది అని హేళన చేసాడు. అంతే కాకుండా పరమేశ్వరుడు అనే పేరు అతను ఇంతకు ముందు తన అన్న కుబేరుని వద్ద విని ఉండడం వల్ల అన్నగారి మీద కోపం పరమేశ్వరుని పైకిమారింది, అందువలన అతను కోపంగా ఆ పరమేశ్వరుడు ఎవరు? అని అమర్యాదగా మాట్లాడాడు. 

అతని మాటలకు కోపగించిన నంది అతనిని శపించాడు. అతని శాపం ప్రకారం  దశగ్రీవుడు, అతని జాతి, కోతుల వలన పరాభవం పాలయ్యి, ఆ కోతులే  దశగ్రీవుని మరణానికి కారణం అవుతారు. అతని శాపమును విన్న  దశగ్రీవునికి మరింత నవ్వువచ్చింది. దానికి కారణం అతనికి ఉన్న బ్రహ్మవరం. కానీ అతను తను కోరుకున్నవరంలో అతను మానవులను, కోతులనుండి రక్షణ కోరుకొనలేదు అనే విషయం మరచిపోయాడు. 

6, మార్చి 2022, ఆదివారం

విదుర నీతి - 11

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

యధాశక్తి చికీర్షంతి యధా శక్తి చ కుర్వతే

న కించిదవమన్యంతే పండితా భరతర్షభ

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

మీరినపనులకొడంబడ, కేరినినిందింపకాత్మ హితకార్యములన్

సైరించుకొనెడుపూరుషు డారయునైహిక సుఖంబు హస్తిపురీశా

భావంః

ఓ భరత వంశ మహారాజా! తన తెలివితో పరణితి కలిగి ఎవరయితే తన శక్తిని అర్ధం చేసుకుని ఆ శక్తికి తగిన పనులు చేస్తాడో, తను చేయగలిగిన ఏ పనిని అయినా చులకనగా అనుకోకుండా ఉంటాడో అతనినే పండితుడు లేదా జ్ఞాని అని అంటారు.

4, మార్చి 2022, శుక్రవారం

దమయంతి స్వయంవరం ఎలా సాధ్యం?

మనం ఇంతకుముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావం నుండి తప్పించ గలిగిన శ్లోకం గురించి,  నలుని గురించి, దమయంతి గురించి,  స్వయంవరానికి బయలు దేరిన నలునికి దేవతలు ఎదురయినప్పుడు నలుడు వారికి ముందుగానే మాట ఇవ్వడం గురించి, నలుడు వెళ్ళి దమయంతిని కలిసి, దేవతల తరపున దూతగా వచ్చిన విషయము గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు దమయంతిదేవి నిర్ణయం గురించి తెలుసుకుందాం!

నలుని మాటలను విన్న దమయంతి అత్యంత ఆవేదన చెందింది. తాను ఎంతగానో ప్రేమించే నలుడు తన వద్దకు ఇటువంటి ప్రస్థావన తీసుకురావడం ఆమెకు అత్యంత బాధ కలిగించింది. ఆమె నలునితో తాను అతనినే వరించానని, హంస రాయభారం పంపి, ఇప్పుడు ఈ విధంగా మరొకరిని వివాహం చేసుకొమ్మని చెప్పడం భావ్యం కాదు అని,  స్త్రీ కి ఉండే సహజ బేలతనం కారణంగా ఆమె కన్నీరు పెట్టుకుంది. అతనినే తన భర్తగా 

 నలుని దౌత్యము విఫలం కాకుండా ఏ మార్గంలో తను నలుని వివాహం చేసుకోవాలో నిర్ణయించికుంది. ఆమె కధనం ప్రకారం ఒక దూత తను చెప్ప వలసిన విషయము చెప్పడం మాత్రమే అతని భాద్యత. నలుడు దూతగా తన భాద్యత పూర్తి చేసాడు. అతని మాటలను పూర్తిగా పాటించ వలసిన అవసరం దమయంతికిలేదు. కనుక ఆమె స్వయంవరంలో నలుడిని మాత్రమే వరిస్తాను అని చెప్పింది. 

3, మార్చి 2022, గురువారం

విద్వత్పద్ధతి - 1

 మనం ఇంతకుముందు భర్తృహరి సుభాషితములలో మూర్ఖ పద్దతి గురించి చెప్పుకున్నాం! ఇప్పటి నుండి విద్వత్పద్ధతి గురించి తెలుసుకుందాం!

శాస్త్రోపస్కృతశాబ్ధసుందరగిరః శిష్యప్రదేయాగమా

విఖ్యాతాః కవయో వసంతి విషయే యస్య ప్రభోర్నిర్ధనాః

తజ్జాడ్యం వసుధాధిపస్య సుధియ స్త్యర్ధం వినాపీశ్వరాః

కుత్స్యాః స్యుః కుపరీక్షకైర్న మణయో యైరర్ఘతః పాతితాః

అర్ధం:

శాస్త్ర గిరం = శాస్త్రములచే, ఉపస్కృత = సంస్కరింప బడిన, శబ్ధ = శబ్ధములచే, సుందర= అందమయిన, గిరః = వాక్కులు గలవారు, శిష్య = శిష్యులకు, ప్రదేయ= ఈయదగిన, చెప్ప గలిగిన, నేర్పగలిగిన, ఆగమాః = శాస్త్రములు కలవారు, విఖ్యాతాః = ప్రసిధ్ధులు నగు, కవయః = పండితులు, నిర్ధనాః= ధన హీనులై, యస్య = ఏ, ప్రభోః = రాజు యొక్క, విషయే = దేశమునందు, వసన్తి = ఉంటారో, తత్= అది, వసుధాధిపస్య= రాజు యొక్క, జాడ్యం= మౌఢ్యము, సుధియస్తు= బుధిమంతులన్ననో, అర్ధం= ధనము, వినాపి=  లేకయే, ఈశ్వరాః = సమర్ధులు, మణయః = రత్నములు, యైః= ఏ, కుపరీక్షకైః = పరీక్ష చేయడం తెలియక, అర్ఘతః = అర్హమయిన వెల, పాతితాః = తక్కువ చెప్పినా, తే= వారు, కుత్స్యాః = తగ్గిన విలువ, మణయః= రత్నములు, న= కావు 

తాత్పర్యంః

వ్యాకరణాదిశాస్త్ర పఠనముచేతనిర్ధుష్టముగను మనోహరముగాపలుకుతూ విధ్యార్ధులకు శాస్త్రంబుల బొధించుచు సుప్రసిధ్ధులయిన పండితులు ఏ రాజు దగ్గర అయినా ధనవిహీనులయి ఉంటే అది ఆ ప్రభువు/ రాజు తెలివి తక్కువ తనమును మాత్రమే తెలుపుతుంది. ఒక రత్నముల గురించి జ్ఞానములేని వర్తకుడు అమూల్య రత్నమునకు తక్కువ వెల చెప్పినందువలన ఆ రత్నమునకు ఉన్న విలువ తగ్గిపోదు కదా!

ఈ శ్లోకమునకు తెలుగు పద్యం

సకలకళా విభూషితులు శబ్ధవిదుల్ నయతత్వబోధకుల్

ప్రకటకవీంద్రు లేనృపతి పజ్జను నిర్ధనులై చరింతు రా

వికృతపుజాడ్య మాదొరది విత్తము లేకయ వారు పూజ్యులం

ధకజనదూషితంబులు ఘనంబులు గావె యంమూల్యరత్నముల్

2, మార్చి 2022, బుధవారం

దశగ్రీవుడు - మండోదరి వివాహం

 మనం ఇంతకు ముందు దశగ్రీవుని గురించి, అతని  మూర్ఖత్వం పక్కన ఉన్నవారి వలన ఏ విధంగా పెరుగుతోందో తెలుసుకున్నాం కదా! పంచకన్యలలో ఒకరయిన మండోదరిని దశగ్రీవుడు ఎలా వివాహం చేసుకున్నాడు అని ఇప్పుడు తెలుసుకుందాం!

దశగ్రీవుడు కుబేరుని గెలిచిన తరువాత అతని పుష్పకవిమానం లాక్కుని గర్వంతో ప్రవర్తిస్తున్న సమయంలో అనుకోకుండా ఒకసారి వారికి దితి పుత్రుడు దైత్యులలో ఒకడయిన మయుడు అతని కుమార్తె మండోదరిని కలిశాడు. 

అప్పుడు మయుడు తన భార్య ఒక అప్సరస  అని, ఆమె కొంతకాలం అతనితో గడిపిన తరువాత మాయావి,దుంధుభి అనే ఇద్దరు పుత్రులను, మండోదరి అనే ఈ పుత్రికకు జన్మను నిచ్చిన తరువాత దేవలోకమునకు వెళ్ళో తిరిగిరాలేదు అని, ఇప్పుడు మండోదరికి వివాహ వయస్సు వచ్చినందు వలన తగిన వరునికోసం చూస్తున్నానని చెప్పాడు. దశగ్రీవుడు కూడా తనని తాను పరిచయం చేసుకున్నాడు. తాను పులస్త్యుని మనుమడిననీ, విశ్రవనుని పుత్రుడననీ తన పేరు దశగ్రీవుడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న మయునికి ఒక ఆలోచన తట్టింది. 

అప్పటికే దశగ్రీవుని గురించి, అతని దుర్వ్యవహారముల గురించి, అతని అన్నతోనే యుద్ధం చేసిన విషయం గురించి అన్నీ తెలిసినా మయుడు తన కుమార్తెను దశగ్రీవునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. ఆ ప్రస్థావనను దశగ్రీవుడు అంగీకరిం చాడు. అప్పుడు అక్కడికి అక్కడే అగ్నిసాక్షిగా వివాహం చేయించాడు. 

1, మార్చి 2022, మంగళవారం

విదుర నీతి - 10

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

యస్య కృతం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః

 సమృద్ధిరసమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే

యస్య సమ్సారిణీ ప్రజ్ఞా ధర్మార్ధావనువర్తతే

కామాదర్ధం వృణీతే యః స వై పండిత ఉచ్యతే

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

ఏ మనుజుండు పండితసమీడ్యుడు సంసృతిసాగరంబునన్

బాములనెన్ని జెందిన విపక్వమనస్కత ధర్మమర్ధమున్

గామముకంటె శ్రేష్టమని గాంచి మదిన్విడనాడకుండునో

యామనుజుండు తత్వవిదుడండ్రు జనంబులు మానవేశ్వరా! 

భావం:

ఎవరైతే తాను చేసే పనిని చలి, వేడి, భయము, అభిమానము, కలిమి, లేమి అనేవాటికి లోబడి తమ పనిని ఆపకుండా పని చేసుకుంటూ పోతారో వారిని, ఎవరి బుధ్ధి ధర్మార్ధములను కామము కంటే గొప్పది అని మనస్సులో గట్టిగా భావిస్తూ ఉంటాడో అటువంటి వానిని పండితుడు లేదా జ్ఞాని అని చెప్తారు.