16, డిసెంబర్ 2021, గురువారం

వరరుచి విధి

 మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి, కాలక్రమంలో అతనికి జరిగిన వివాహం గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి కథ చూద్దాం! 

వివాహం జరిగిన  వరరుచి భార్యతో కాలంగడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఉద్యానవనంలో వరరుచి తన భార్యతలను తన ఒడిలో ఉంచుకుని ఆమె జుట్టును చేతితో సరిచేస్తుండగా ఒక నల్లని మచ్చ ఆమె తలపైన గమనించాడు.  అని ఎలా వచ్చింది అని  తన భార్యను ప్రశ్నించాడు. అప్పుడు ఆమె  ఆ బ్రాహ్మణునకు సొంత కుమార్తె కానని, చిన్నప్పుడు ఒక అరటి బోదెలో తలపైన దీపంతో నదిలో కొట్టుకు వస్తున్న ఆమెను ఆ బ్రాహ్మణుడు కాపాడి తన కుమార్తెగా పెంచాడు అని చెప్తుంది. ఆ వివరం విన్న వరరుచికి ఆశ్చర్యం వేసి, విధిని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు అని తెలుసుకుంటాడు. ఆమె జన్మ వృత్తాంతం అంతా ఆమెకు వివరించి చెప్తాడు. కానీ బ్రాహ్మణునిగా పెరిగినా ఆమె ఒక పంచమజాతి కన్య కనుక, ఆమెను వివాహం చేసుకున్నందుకు అతనుకూడా బ్రాహ్మణ్యం వదలి తీర్ధ యాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నట్లు ఆమెకు చెప్తాడు. ఆ తీర్ధయాత్రలు ఆజన్మాంతం చేయాలి అనుకుంటున్నట్లుగా కూడా చెప్తాడు. ఆమె కూడా అతని వెంట తీర్థయాత్రలకు వెళుతుంది. 

ఆ తీర్ధయాత్రలు చేసే క్రమంలో ఆమె పదకొండుసార్లు గర్భవతి అయ్యి పదకొండుమంది మగశిశువుకు జన్మఇచ్చింది. అయితే  ఆమె ప్రసవవేదన పడుతూ అడవులలో గుట్టల ప్రక్కన బిడ్డలకు జన్మ ఇచ్చినప్పుడు వరరుచి ఆ పొదల బయట నిలబడి ఒక ప్రశ్న అడిగేవాడు. పుట్టిన ఆ పసివానికి నోరు ఉందా అని. ఆమె బిడ్డను చూసి ఉంది అని చెప్పగానే "నోరు ఇచ్చిన దేవుడు వానికి ఆహారంకూడా సమకూరుస్తాడు కనుక ఆ బిడ్డను అక్కడే వదలి రా" అని చెప్పేవాడు. ఆమె భర్తమాట విని అలాగే తన 11 మంది పిల్లలను అడవిలో పొదల మద్యవదలి తన భర్తతో తీర్థయాత్రలకు సాగిపోతూ ఉండేది. 

అలా వదిలివేయబడిన 11మంది పిల్లలు ఏమి అయ్యారు? ఆమె తనకంటూ ఒక కుమారుని పెంచుకోవాలి అని ఎందుకు అనుకోలేదు? అలా పెంచుకునేందుకు ప్రయత్నించిందా? తరువాత ఏం  జరిగింది ? తరువాతి టపాలో చూద్దాం!

1 కామెంట్‌: