14, డిసెంబర్ 2021, మంగళవారం

వరరుచి అమానుషత్వం

మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను  విక్రమాదిత్యునికి చెప్పటం వల్ల సత్కారం పొందాడు  తెలుసుకున్నాం.  ఆ వరరుచి  విధిరాతలో ఉన్న పంచమజాతి కన్యతో వివాహాన్ని ఎలా తప్పించుకోవచ్చని అనుకున్నాడు? నిజంగా తప్పించుకున్నాడా లేదా? ఇప్పుడు చూద్దాం! 

మహారాజుగారు వరరుచిని విందుకు ఆహ్వానించి,అతను రాజ్యసభలో ఏమి చెప్పకుండా మౌనంగా ఉండటానికి కారణం అడిగాడు. ఆ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ, ఈ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నంలో తనకు వారి రాజ్య భవిష్యత్తుకు సంబందించిన ఒక విచిత్రమయిన విషయం తెలిసిందని, దానిని సభలో అందరి ముందు చెప్పలేక మౌనంగా ఉన్నాను అని చెప్పాడు వరరుచి. 

వరరుచి మాటలు విన్న మహారాజు కు ఆశ్చర్యంతో పాటుగా కుతూహలం కూడా పెరిగి ఆ విషయాన్నీ తమకు చెప్పా వలసినదిగా కోరారు. అప్పుడు వరరుచి తాను ఆలోచించి పెట్టుకున్న వ్యూహాన్ని రాజ్యరక్షణకోసం అన్నట్లుగా మహారాజుకు చెప్పాడు. 

"మహారాజా! నాకు తెలిసిన విషయమా ప్రకారం నిన్నటి రాత్రి మన రాజ్యమునకు సంబందించిన ఒక గ్రామంలో పంచమజాతి స్త్రీ ఒక ఆడపిల్లకు జన్మను ఇచ్చింది. ఆ శిశువు భవిష్యత్తులో ఈ రాజ్యమునకు తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఆ బిడ్డను తక్షణమే అంతమొందించాలి" అని చెప్పాడు వరరుచి. 

వరరుచి తెలివితేటల గురించి, అతని పాండిత్యము గురించి తెలిసిన విక్రమాదిత్యుడు అతని మాటలను ఏమాత్రం అనుమానించలేదు. కానీ ఒక పురిటి పసికందును చేతులారా చంపటానికి మనసుకూడా రాలేదు. ఇదే విషయం  వరరుచికి చెప్పి ఏమి చేయమంటారు అని వరరుచిని సలహా అడిగాడు మహారాజు. దానికి వరరుచి ఆ పసిబిడ్డను ఒక అరటి దూటలో పడుకోబెట్టి, ఆ బిడ్డ తలవైపున ఒక వెలుగుతున్న దీపాన్ని ఉంచి నదిలో వదిలి వేయమని చెప్పాడు. 

విక్రమాదిత్యుడు తూచా తప్పకుండ వరరుచి ఆలోచనను అమలుపరచాడు. తరువాత ఆ విష్యం గురించి మహారాజు, వరరుచి ఇద్దరు మరచిపోయి తమ జీవనాన్ని సాగించారు. కొంతకాలానికి వరరుచి రాజ ఆస్థానాన్ని వదలి గమ్యంలేకుండా దేశాటనకు వెళ్ళాడు. 

ఆ పసిబిడ్డ బ్రతికిందా? వారి వివాహం నిజంగా జరిగిందా? లేక వరరుచి నిజంగా విధిని తప్పించుకోగలిగాడా? తరువాతి టపాలలో చూద్దాం!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి