1, జూన్ 2020, సోమవారం

మానవ జీవితం - పంచమహా యజ్ఞములు

మానవుని జీవితంలో ఉండే  బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాస అనే నాలుగు ఆశ్రమముల గురించి మనకు తెలుసు కదా! ఆ నాలుగు ఆశ్రమములలో ముఖ్యమయినది, మిగిలిన మూడు ఆశ్రమములకు ఆధారమయినది గృహస్థ ఆశ్రమం. 
అయితే ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వారు యజ్ఞములు చేస్తేనే వారికి పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. మరి ఇంతకీ ఆ యజ్ఞములు ఎన్ని రకములు? వానిని ఎలా చేయాలో తెలుసుకుందాం! 

ముఖ్యమయిన యజ్ఞములు ఐదు రకములు. అవి

  1. దేవ యజ్ఞము: వీనిని మనం వాడుక భాషలో యజ్ఞములు అనే వ్యవహరిస్తాము. ఇవి భగవదనుగ్రహం కోసం, ఇష్టకార్యార్ధ సిద్ధి కోసం చేస్తారు. గృహస్తులయితే తమ గార్హపత్యాగ్ని లో హవిస్సును సమర్పిస్తారు. బ్రహ్మచారులయితే లౌకికమైన అగ్నితోనే చేస్తారు. ఇక శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలమును ఇస్తుంది.  
  2. పితృ యజ్ఞము: ఇవి తమను వదలి పరలోకమునకు చేరిన తమ పితృదేవతల కొరకు చేస్తారు.  ఐతే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి  యజ్ఞమును చేయుటకు పుత్రునికి అధికారం లేదని చెప్పెదరు. 
  3. భూత యజ్ఞము: ఈ యజ్ఞమునకు అర్ధం తనతో పాటుగా ఈ భూమిమీద ఉన్న సకల చరాచర జీవరాశులకు ఉపయోగపడేలా తాను అండుచుకోవాలి అని. 
  4. మనుష్య యజ్ఞము: ఈ యజ్ఞమునే అతిధి యజ్ఞం అనికూడా పిలుస్తారు. మన ఇంటికి వచ్చిన అతిధిని గౌరవంగా చూసుకోవాలి.  ఈ యజ్ఞము ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రమములవారికి ఆధారం అవుతున్నాడు.
  5. బ్రహ్మ యజ్ఞము: ఈ యజ్ఞము ద్వారా గృహస్తుడు అనేక కొత్త విషయములను తెలుసుకుంటాడు. అంతేకాక మిగిలినవారికి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఈ యజ్ఞంలో భాగంగా గృహస్తుడు జ్ఞానమును ఆర్జిస్తాడు, అందరికి పంచి పెడతాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి