16, అక్టోబర్ 2014, గురువారం

సౌభరి మహర్షి

ఈ మహర్షి పూర్వ వృత్తాంతం మనకు తెలియదు. కానీ ఇతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో చెప్పబడినది.
సౌభరి మహర్షి 12 సంవత్సరములపాటు నీటి అడుగున ఉండి తపస్సు చేసాడు. ఒక సమయంలో అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపఫై పడినది. ఆ క్షణంలో అతనికి సంసారంపై ఆకాంక్ష కలిగినది. ఆ ఆలోచన కలిగినదే తడవుగా అతను ఆ నీటిలోనుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఆ రాజ్యమును సూర్య వంశస్థుడయిన మాంధాత అనే రాజు పరిపాలిస్తున్నాడు. కనుక సౌభరి మహర్షి తిన్నగా రాజువద్దకు వెళ్లి తనకు వివాహం చేసుకోవాలను అనే కోరిక కలిగినది కనుక అతనికి ఒక కన్యను  ఇమ్మని అడిగాడు.
మంధాతకు 50 మంది పుత్రికలు ఉన్నారు. వారిలో ఎవరినీ ఇవ్వను అని చెప్పటం ఇష్టం లేక, శుష్కించిన శరీరం కలిగిన ఈ సౌభరి మహర్షిని తన పుత్రికలు వరించరు అని నమ్మకంతో, తన పుత్రికలలో ఎవరైనా తమరిని వరించినట్లయితే వారిని ఇచ్చి వివాహం చేస్తాను  అని సౌభారికి మాంధాత చెప్పాడు. మాంధాత మనస్సులోని ఆలోచనను గమనించిన సౌభరి మహర్షి తన శరీరమును యౌవ్వనప్రాయముతో అలంకరించుకుని అంతఃపురమునకు వెళ్ళాడు. అతనిని చుసిన మాంధాతయొక్క 50 మంది పుత్రికలూ అతనిని వరించారు.
అతని తపః శక్తి తో వారంతా అత్యంత అనుకులమయిన భవనములు, భోగములు సమకూర్చుకున్నారు. ఎంతో వైభవమైన వస్త్రములు, తినుబండారములు, ఉద్యానవనములు ఏర్పరచుకుని సుఖంగా ఉన్నారు.
కొంతకాలం తరువాత సౌభరి మహర్షికి ఏకాంతంలో అతని ఈ పరిస్థితికి రాకముందు తానూ ఎంత నిష్టగా తపస్సు చేసేవాడో గుర్తుకు వచ్చినది. ఒక్కనాడు, ఒక్కసారి సంసారమందు ఉన్న ఒక చేపల కుటుంబమును చుసిన తను ఇంతకాలం 50 మంది భార్యలతో, 5000 మంది బిడ్డలతో కాలక్షేపం చేయుట తప్పు అనిపించినది. కనుక వానప్రస్థఆశ్రమము స్వీకరించి అరన్యమునకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు.
తరువాత అతని భార్యలు కూడా అతని వెనుక అరణ్యములకు వెళ్ళిపోయారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి