28, అక్టోబర్ 2014, మంగళవారం

తామస మనువు జననం- విశ్లేషణ

తామస మనువు జననం- విశ్లేషణ

ఈ ఘట్టం లో విశ్లేషించవలసిన అంశం నా మనస్సునకు తట్టినది ఒక్కటే ఉన్నది. అది ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యం కలిగి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్న ఒక తపస్వి మనస్సుని ఒక లేడి వంటి జంతువు కదిలించటం.
ఇటువంటి విషయములు ప్రస్తావనకు వచ్చినప్పుడు మన హిందూ ధర్మ శాస్త్రముల మీద మనకే కొంచెం అపనమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది. దానికి కారణం మనం ఆ విషయమును గురించి తప్ప అందులోని సూక్ష్మ అర్ధమును గ్రహించే ప్రయత్నం చేయలేకపోవుట.
లెక్కకు మించిన ఆయుష్షు కలిగిన సురాష్ట్రుడు, తన భార్యలు, ప్రజలు, మంత్రులుతన ముందే చనిపోవటం చూసాడు కనుక అతనికి వైరాగ్యం కలిగినది. అందుకని అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేయనారంభించాడు. అదికూడా ఘోరమయిన తపస్సు. ఐతే ఇక్కడ ఒక విషయం గమనించండి. అతను ఏమి కోరి తపస్సు చేస్తున్నాడు? ఏ విధమైన కోరికా లేదు. కేవలం భగవత్ సాక్షాత్కారం కోసం మాత్రమే! అతనికి దేహం మీద, దానివలన సంభవించే ఏ విధమైన భోగం మీద కోరిక లేదు కనుకనే తన రాజ్యమును వదలి తపస్సునకు వెళ్ళాడు.
ఇక వర్షం రావటం అనేది సృష్టిలో సహజం. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నపుడు, పంచాభుతాత్మకమైన శరీరం తనలో ప్రాణమును నిలుపుకోవాలనే చూస్తుంది కనుక ఆధారం కోసం చేతులు వెతికాయి. అప్పుడు తనకు దొరికిన ఒక లేడి ని పట్టుకోవలసి వచ్చినది.
ఇక్కడ ఒక విషయం గమనించండి. అతని చేతికి ఒక లేడి దొరికింది. అంటే అది కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుని పొతూ ఉంది. నాకు తెలిసి లేడి కంటే మానవుని శరీరం నీటిలో ఈదే సామర్ధ్యం కలిగి ఉంటుంది. కనుక తన చేతికి దొరికిన ఆ లేడి ప్రాణములను కాపాడాలన్న దృఢ నిశ్చయం ఆ తపస్వికి కలిగి, ఒడ్డునకు చేరే, లేడిని చేర్చే ప్రయత్నం చేసి ఉండాలి. అలా ఒడ్డుకు చేరిన తరువాత, లేడి తన ప్రాణములను కాపాడినందుకు అతనిపై కృతజ్ఞతా భావం ఉంచుకొనుట సహజం.
అలా కాకుండా ఆ తపస్వి మనస్సు ఆ లేడి వలన కదలటం విచిత్రం. తపస్వి అనేవాడు తన మనస్సును నిగ్రహించే సామర్ధ్యం కలిగి ఉంటాడు. అప్పటికి చాలా కాలం నుండి అతను తపస్సులో ఉన్నాడు కనుక అతని మనస్సును నియంత్రించటం అతనికి తెలుసు. కానీ అతని మనస్సు కదిలినది. దానికి కారణం తనకు తెలిసి ఉన్నదేమో అని తనని తను పరిశీలించుకుని ఉండాలి. కానీ అటువంటిది ఏమి అతని తపొదృష్టికి అందలేదు. కనుక ఈ విధంగా తన మనస్సు చలించుటకు కారణం ఆ లేడికి తప్పని సరిగా తెలిసి ఉండాలి.
తనకు తెలిసిన గతజన్మ గురించి చెప్పిన సంగతులను విన్న సురాష్ట్రుడు ఆమెను మానవ కన్యగా అయ్యే అవకాసం కలిగించాడు. ఆమెతో రాజ్యమునకు వెళ్లి, రాజ్య భోగములను అనుభవించాడు.

  1. ఒక తపస్వి ఇలా ఎందుకు చేసాడు ?

తపస్వి అంటే తనగురించి కాక ఈ లోకం, ప్రజల గురించి ఆలోచించే వాడు. ఆమె తన గత జన్మ గురించి చెప్తున్న సమయంలో ఆమె చెప్పిన ఒక విశేషం అతనిని ఈ విధంగా రాజ్యమునకు తిరిగి వచ్చేందుకు ప్రోత్సహించి ఉండాలి.
అది వారికి ఒక మనువు పుట్టబోతున్నాడు అని.
మనువు అంటే అత్యంత గొప్పదయిన భాద్యత. అటువంటి భాద్యతలను గ్రహించబోయే వాడు తపోధనుడయిన తనకు, విజ్ఞానవతి అయిన ఉత్పలమాలకు జన్మించటం సరి ఐనదే అని అతను భావించి, అటువంటి మనువు అరణ్యములలో ఉండే కంటే, ఒక రాకుమారునిగా పుట్టి, అలాగే విద్యాభ్యాసం చేసుకుంటే, అతనికి, అతను పరిపాలించబోయే ప్రజలకు మేలు జరుగుతుంది అని భావించి తిరిగి రాజ్యమునకు వచ్చి ఉండాలి.

నా మనస్సుకు తట్టిన విశ్లేషణ ఇది. ఇంతకంటే గొప్పగా, ఏ పండితులవారయిన చెప్పగలిగితే, వారి పాదములకు నమస్కరించి, దానిని తిరిగి మీ అందరికి తెలిపే ప్రయత్నం చేస్తాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి