27, అక్టోబర్ 2014, సోమవారం

తామస మనువు

పూర్వకాలమునందు సురాష్ట్రుడు అనే పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. అతని మంత్రి పేరు నరసింహశర్మ. సురాష్ట్రుడు ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు. యజ్ఞయాగాదులు చేస్తూ ప్రజలను తన కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవాడు. యుద్ధమునకు వెళితే అరివీర భయంకరుడుగా ఉంటూ, మహశూరుడుగా గుర్తించేవారు.
అతని మంత్రి అయిన నరసింహశర్మ అత్యంత రాజభక్తి కలిగి, అన్ని కార్యములలో రాజునకు కుడి భుజంలా, తలలో నాలుకలా ఉండేవాడు. ఇతనికి  అమితమైన రాజభక్తి వలన ప్రత్యక్ష పరమేశ్వరుడైన సూర్యుని గురించి తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు వరంకోరుకోమనగా, నరసింహశర్మ తమ రాజయిన సురాష్ట్రుని మీది భక్తి, ప్రేమ వలన అతనికి అమితమైన ఆయుష్షు ఇవ్వమని కోరాడు. సూర్యుడు తధాస్తు అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు.
నరసింహశర్మ తమ రాజ్యమునకు తిరిగి వచ్చి రాజునకు జరిగిన సంగతి, అతనికి తాను సంపాదించి పెట్టిన వరమును గురించి చెప్పెను. అప్పటినుండి సురాష్ట్రుడు మరింత ధర్మబద్దంగా పరిపాలన చేయసాగాడు. ఐతే అమితమైన ఆయుష్షు ఇతనికి మాత్రమే ఉన్నది కానీ భార్యలకు, మంత్రులకు లేకపోవుట చేత వారంతా తన కన్నుల ముందరే కాల గర్భంలో కలిసిపోవుట చూసి అతనికి ఈ రాజ్యపాలనయందు విరక్తి కలిగినది. ఆ విరక్తి కారణంగా తన రాజ్యమును మంత్రిమండలికి అప్పగించి తను అడవికి వెళ్లి తపస్సు చేయనారంభించాడు.
మండు వేసవికాలంలో పంచాగ్నియందు (నాలుగు వైపులా అగ్ని కుండలు, కన్నులతో అగ్నికుండం వంటి సూర్యుని చూస్తూ) ఘోరమైన తపస్సు చేసాడు. వర్షాకాలంలో ఆకాశం క్రింద, చలికాలంలో కంఠంవరకు నీటిలో మునిగి ఘోరమైన తపస్సు చేసాడు.
కొంతకాలం అలా తపస్సులో గడచిపోయినది. తరువాత వర్షాకాలం వచ్చినది. ఆకాశం, నేల కలసిపోయే విధంగా అతి భయంకరమైన వర్షం ప్రారంభం అయినది. భూమి మొత్తం నీటితో నిండి, ప్రవహించసాగెను. సురాష్ట్రుడు కూడా ఆ నీటిలో కొట్టుకుని పోవుచుండగాఅతను ఆధారం కోసం ప్రయత్నించాడు. ఆ ప్రవాహంలో తనతోపాటు కొట్టుకు వస్తున్న ఒక లేడి ఆ రాజు చేతికి దొరికినది. అలా ఆ రాజు, లేడి కలిసి ఒక అడవికి చేరుకోగలిగారు. ఆ సమయంలో అత్యంత ఇంత తపోదనుడయిన ఆ సురాష్ట్రుని మనస్సు ఆ లేడి వలన కదిలినది. అది తనకే ఆశ్చర్యం కలిగించగా ఆ లేడిని స్వయంగా దీనికి కారణం ఏమిటి అని అడిగాడు.
దానికి బదులుగా ఆ లేడి తన గత జన్మ సంగతులు చెప్పి, ఆమె అతని మొదటి భార్య, ఉత్పలమాల అనే పేరు కల దానిని అని చెప్పినది.
ఆమె శాపవిమోచనం కలిగేందుకు రాజు సురాష్ట్రుడు ఆమెను కౌగలించుకున్నాడు.
ఆమె వెంటనే మానవ రూపమును పొందినది. ఆమెను ఉత్పలమాలగా గుర్తించి, ఆమెను తీసుకుని తమ రాజ్యమునకు తిరిగి వచ్చాడు. తన మంత్రులకు, రాజ్య ప్రజలకు జరిగిన సంగతి చెప్పి అందరి ముందు ఆమెను యధావిధిగా వివాహం చేసుకుని, సర్వభోగములను అనుభవించ సాగాడు.
కొంతకాలం తరువాత ఆ ఉత్పలమాల ఒక మంచి శుభ ముహూర్తమందు ఒక పుత్రునకు జన్మనిచ్చినది. ఆనందించిన సురాష్ట్రుడు తన రాజ్యం మొత్తం పుత్రొత్సవములను జరిపించాడు. కాలక్రమంలో ఆ పుత్రుని గారాబంగా పెంచుతూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి ఈ పుత్రుడే తామస మనువుగా ప్రసిద్ధి పొందుతాడు అని చెప్పినది. ఆ నాటి నుండి ఆ బాలుని అందరూ తామసుడు అని పిలిచేవారు.
తామసుడు అత్యంత చిన్నవయస్సులోనే అన్ని శాస్త్రములను అభ్యసించెను. తరువాత తామసునకు రాజ్యమును అప్పగించి సురాష్ట్రుడు, ఉత్పలమాల తపోవనమునకు వెళ్ళిపోయారు.
తామస మనువు జననం విశ్లేషణ ఇక్కడ చూడండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి