Monday, June 17, 2019

అగ్నిష్వాత్తులు

అగ్నిష్వాత్తులు అనే పితృగణము అమూర్త గణము. వీరి తండ్రి మరీచి, వీరు నివసించు లోకము  సోమ పధము. వీరు అగ్నియందు అనేకములయిన హవిస్సులు వేసి యజ్ఞములు చేశారు కనుక వీరికి ఈ పేరు వచ్చింది. వీరిని సకల దేవతలు ఆరాధిస్తారు.
వీరి పుత్రిక పేరు : ఆచ్చోదా, అమావాస్య 

Saturday, June 15, 2019

వైరాజులు

పితృదేవతలలో ఆమూర్తి గణములలో మొదటి వారు వైరాజులు. వారి తండ్రి పేరు  విరాజుడు. వీరు నివసించు లోకము ద్యు లోకము. వీరిని మానవ దేవతా భేదం లేకుండా అందరూ  ఆరాధిస్తారు. వీరి మానస పుత్రిక పేరు మేన దేవి.ఈమె ఒకానొక శాపం కారణంగా భూలోకమునకు రావలసి వచ్చి, హిమవంతుడిని వివాహం చేసుకున్నది. ఆ తరువాత ఆమె పార్వతిదేవికి  తల్లి అయినది. 

Thursday, June 13, 2019

పితృ దేవతలు - సత్యవతి

ఇంతకు  ముందు మనం పితృ దేవతలు , వారి పుత్రిక అమావస్య గా ఎందుకు పిలవ బడుతుంది అని తెలుసుకున్నాం కదా !
ఆ విషయం  తెలుసుకున్నప్పుడు ఆమెకు పితృదేవతలు ఇచ్చిన శాపం గురించి కూడా తెలుసుకున్నాం! ఆమెను భూలోకంలో మానవజన్మ నెత్తమని వారి శాపం.  వారి శాపమును విన్న అమావస్య అత్యంత బాధకు, పశ్చాతాపమునకు లోనయ్యి ఆ శాపమునకు కలుగు ఉపశమనమును తెలుపమని కోరినది. భూత భవిష్య వర్తమాన కాలములను తెలుసుకొనగలిగిన ఆ పితృ దేవతలు ఆమెకు జరుగబోయే విషయములను చక్కగా వివరించారు.

ఆమె 28వ ద్వాపరయుగములో ఒక దివ్య పురుషునకు జన్మనివ్వవలసి ఉన్నది. అతను మాత్రమే తరువాత వచ్చు అనేక అల్పబుద్ధి, అల్ప ఆయుష్షు కల్గిన మానవులను కాపాడే విధంగా వేదములను విభాగం చేయగలడు. అయితే అతని జననం వలన ఆమె కన్యత్వం చెడదు. ఆ తరువాత ఆమె సముద్ర అంశతో జన్మించిన శంతనుడు అనే ఒక మహారాజును వివాహం చేసుకుంటుంది.
తెలిసింది కదా ఆమె ఎవరో! ఆమే మత్స్య గంధి, యోజన గంధి  అని పిలువ బడే సత్యవతి. 

Tuesday, June 11, 2019

పితృ దేవతలకు అమావస్య తిధి ఎందుకు ఇష్టమంటే ...!

మనం ఇంతకు ముందు పితృదేవతలు 7 గణములని వారి పేర్లు చెప్పుకున్నాం కదా! వారిలో అగ్నిష్వాత్తులు అనే పితృదేవతలకు ఆచ్చోదా అనే మానస పుత్రిక ఉన్నది. ఆమె ఒక వెయ్యి దివ్య సంవత్సరములు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన పితరులు సంతుష్టులై ఆమెను వరం కోరుకొమ్మని అడిగారు. అయితే వచ్చిన ఆ పితృదేవతలలో మావసుడు అనే వానిని ఆమె వరించింది. ఆమె చేసిన ఈ ధర్మ దూరమయిన పనికి ఆ పితృ దేవతలు  ఆమెను భూలోకములో జన్మించమని శపించారు.
అయితే ఆ మావసుడు ఆమెను పుత్రికా దృష్టితో చూసినందువలన ఆమె మావాస్య కాలేదు. అంటే ఆమె అమావాస్య అయినది. ఆమె చేసిన తపస్సును పితృదేవతలు మెచ్చరు కనుక అమావస్య తిధి రోజు పితరులకు అర్పించినది ఏదయినా అక్షయము అవుతుంది.

Sunday, June 9, 2019

పితరులు

శ్రాద్ధము మొదలయిన కర్మలలో మనకు తరచుగా వినిపించే పేరు పితృదేవతలు. అయితే వారు ఎవరు? దీనికి సమాధానము హరివంశములో చెప్పారు.

అమూర్తానాంచ ముర్తానాం పితౄణం దీప్తతేజసం
నమష్యామి సదాతేషాం ధ్యాయినాం యోగ చక్షుషా !

దీనికి అర్ధం : రూపము కలిగిన వారును, రూపము లేనివారూ, అత్యంత ప్రకాశవంతమయిన తేజస్సు కలిగినవారు, యోగ శక్తి సంపన్నమయిన కన్నులతో ధ్యానము ద్వారా అన్ని విషయములగురించి తెలుసుకోగలిగినవారు , అటువంటి యోగ చక్షువులు కలిగినవారి చే ధ్యానింప బడే వారు అయినా పితృ దేవతలకు సదా నమస్కరింతును.

అంటేఅంక గణములుగా ఉన్న పితరులతో కొందరికి రూపములు ఉన్నాయి మరి కొందరికి లేవు. మొత్తం పితర గణములు 7. వానిలో

అమూర్త గణములు : రూపములు లేని వారు
 1. వైరాజులు 
 2. అగ్నిష్వా త్తులు 
 3. బర్హిషదులు 
మూర్త గణములు : రూపములు ఉన్నవారు 
Thursday, May 9, 2019

రామాయణం - ఒక భక్తుని జీవితం

మనం ఇంతకూ ముందు రామాయణం గురించి అనేక విషయములు చెప్పుకున్నాం! రామాయణంలోని వివిధ సంఘటనలను మానవుని దేహంలోని ఏడు  చక్రములతో ఎలా పోల్చారో,  రామాయణమునకు ఉన్న ఆధ్యాత్మిక అర్ధం ఏమిటో, రామాయణమును కల్పవృక్షం, వేదం  మరియు గాయత్రీ మంత్రములతో ఎలా పోల్చాలో చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మహా రామ భక్తుడు అయిన తులసీదాసు రామాయణంలోని ఏడు కాండలను ఒక భక్తుని జీవితంలో రామభక్తిలో చేరుకునే అనేక సోపానములతో పోల్చారు. అవి ఏంటో చూద్దామా!


 1. బాల కాండ - సుఖ సంపాదన సోపానం 
 2. అయోధ్య కాండ - ప్రేమవైరాగ్య సంపాదన సోపానం 
 3. అరణ్య కాండ - విమల వైరాగ్య సంపాదన సోపానం 
 4. కిష్కింద కాండ - విశుద్ధ సంతోష సంపాదన సోపానం 
 5. సుందర కాండ - జ్ఞాన సంపాదన సోపానం 
 6. యుద్ధ కాండ - విజ్ఞాన సంపాదన సోపానం 
 7. ఉత్తర కాండ - అవిరళ హరిభక్త సంపాదన సోపానం 

Monday, May 6, 2019

రామాయణం - 7 చక్రములు

మనం ఇంతకు ముందు మనం రామాయణం దానిలోని ఆధ్యాత్మిక అర్ధం గురించి చెప్పుకున్నాం కదా! ఆ రామాయణం మానవునిలో ప్రాణశక్తిని మేల్కొలిపి 7 చక్రములను జాగృతం చేసి పరమాత్ముని చేరుకొనే మార్గంలో కలిగే అనేకములయిన అనుభవాలను చెప్తుంది అని పెద్దల వాక్కు. అయితే రామాయణంలో ఏ సంఘటనలు ఆయా చక్రములను సూచిస్తుందో ఇప్పుడు చూద్దాం!


 1. మూలాధారం: రామాయణంలో శివధనుర్బంగం జరిగిన సంఘటన ను మూలాధారంగా చెప్తారు. స్థిరత్వమును చేకూర్చే ఈ చక్రమును శ్రీరాముని కళ్యాణముతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
 2. స్వాధిష్టానం: రామాయణంలో కైక అడిగిన రెండు వరముల కారణంగా శ్రీరాముడు వనవాసమునకు వెళ్లే సంఘటనను స్వాధిష్టాన చక్రం గా చెప్తారు. భావావేశములకు మూలమయిన ఈ చక్రమును విపరీతమయిన భావావేశము నిండిన ఈ సంఘటనతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
 3. మణిపుర: వనవాసమునకు వెళ్లిన సీతారాములకు దివ్యమయిన ఆభరణములు పరమ పతివ్రత అయిన అనసూయాదేవి ఇవ్వటం అనే సంఘటనను మణిపుర చక్రంగా చెప్తాము. ఈ ఆభరణములు తరువాతి కధలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తాయి. అటువంటి దివ్య మణిమయములయిన ఆభరణములు సీతాదేవికి సంక్రమించే సంఘటనను మణిపుర చక్రంతో పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
 4. అనాహతం: వనవాసం సజావుగా ఆనందముగా సాగుతున్న సమయములో శూర్పణఖ ప్రవేశించుటను అనాహత చక్రంతో పోల్చారు. సరిగ్గా రామాయణంలో అసురవధ ఈ ఘట్టంతరువాతనే ముఖ్యంగా జరుగుతుంది కనుక అడ్డంకులు తొలగించు అనాహత చక్రం తో ఈ సంఘటనను పోల్చుట సరిగ్గా సరిపోతుంది. 
 5. విశుద్ధి: సీతా వియోగం వలన పరితపిస్తున్న శ్రీరాముడు  పరమ శుద్ధ భక్తురాలయిన శబరిని కలిసిన సంఘటనను ఈ విశుద్ధి చక్రంతో పోల్చారు. 
 6. ఆజ్ఞా: రామాయణంలో సుగ్రీవుని ఆజ్ఞతో సీతాదేవిని వానరులు వెతుకుటకు బయలుదేరు సంఘటనను ఆజ్ఞా చక్రం మొదలుగా పోల్చారు. అయితే సహజంగా ఈ చక్రం వరకు చేరిన ప్రాణమునకు దివ్య దర్శనం జరుగుతుంది. మరి రామాయణంలో జరిగిన ఆ క్షణకాల దివ్య దర్శనం ఎం అయ్యి ఉంటుంది?  దీనికి సమాధానంగా మన పెద్దలు కిష్కిందకాండలో సీతను వెతుకుతూ వెళ్లిన హనుమంతుడు మొదలగు వారికి కలిగిన ఒక అనుభవాన్ని చెప్తారు. సూర్యప్రభాదేవి . అనుకోకుండా ఒక కొండా గుహలో బందీలయిన వానర వీరులను సూర్యప్రభాదేవి ఒక్క క్షణకాలంలో సముద్ర తీరమునకు చేర్చుతుంది. 
 7. సహస్త్రారం: ఈ చక్రం మానవుని దైవత్వమునకు దగ్గర చేస్తుంది అని చెప్పుకున్నాం కదా! రామాయణంలో శ్రీరామ పట్టాభిషేకం ఘట్టమును ఈ చక్రముతో పోల్చారు.