20, మే 2016, శుక్రవారం

శ్రీ రామ శతకము-18

సీ:         విద్యుత్సమాన దుర్విషయాను రక్తులై
స్త్రీ సంగమును కోరి చెడుట నిజము
భోగాభిలాషచే భూరి సంపద గూర్చి
నరక దుఃఖము నొందు నరుడు నిజము
బంధువుల్ భార్యయేపరమనువారికి
సంసారబంధంబు సాగు నిజము
పాంచభౌతికమైన పాడు దేహముజూచి
నేను నాదను వాడు నీల్గు నిజము

తే :      ఇట్టి యైహిక మస్థిరమీప్సితముల
దగు నీకను నన్నెప్డుదయను బ్రోవ
నిన్నెనమ్మితి మనమున నీరజాక్ష
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

19, మే 2016, గురువారం

శ్రీరామ శతకము –17

సీ :    శ్రీ రమానాయకా చిత్తగించ గదయ్య 
              వివరింతు నీకు నా విపుల చరిత 
        మవని నేజేయని యఘమొక్కటియులేదు 
                 బండబూతులదిట్టు దండివాడ 
      జారత్వ చోరత్వ చంచలత్వపునుడుల్ 
                 మాటిమాటికి సేయు మేటిమగడ 
      పరహింస పరధన పరకాంతలను జేర 
                బట్టివీడని జగజ్జెట్టి ఖలుడ 

తే : పరుల మేలోర్వ జాలని పాపమతిని 
      ఘనుల నిందల పాల్జేయు కపటికులుడ 
      ఇంకయేరీతిన న్నీవు యేలుకొనెదొ 
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                              - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి     
 

18, మే 2016, బుధవారం

శ్రీ రామ శతకము - 16

సీ:       సంసార రొంపిలో స్తంభంబు కూరిన
ట్లయ్యెను నావిధ మరసిచూడ
శ్లేష్మంబునంబడి లేవనేరక యీగ
తపియించు కరణి నాతపన యయ్యె
కారాగృహంబందు నేరస్థు కైవడి
దేహబాధల తగిలి దీనునైతి
పెనుతుపానుకు జిక్కి పీడింపబడు నోడ
విధమయ్యె యీదేహి వింతగాను

తే:      ఘోరకృత్యంబు లెల్లను కోరికోరి
చేసి నరకంబు చేరను సిద్దమైతి
రమ్మునను గని దరిజేర్చరా మురారి
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి                                            

4, మే 2016, బుధవారం

శ్రీరామ శతకము – 32

సీ : అర్ధ పంచక జ్ఞానమమరియుండిన గదా
             జ్ఞాన మాత్మకు గల్గు మానకెపుడు
      ఆకారత్రయ నిష్ఠయాత్మకుండినగదా  
             అన్య దేవతలందు నానవదలు
      నవవిధ సంబంధమును నమ్మినట్లైన
            ఇతరాంతరంబుల యిష్టముడుగు
      తత్వత్రయంబాత్మతరచి చూచినగదా
              మంత్రాంతరంబులమాని బ్రతుకు
తే : భువిని నీయర్ధముల యొక్క భోగ్య తెరిగి
       చేతినిష్టలనున్నట్టి చేతనులను
       దయను రక్షింతువట తండ్రి ధర్మమూర్తి
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

26, ఏప్రిల్ 2016, మంగళవారం

శ్రీ రామ శతకము-15

సీ :       ప్రకృతి గుణంబులు బాగుగానను జేరి
ప్రకృతి వశ్యుని జేసె ప్రాజ్ఞవినవె
సుఖ దుఃఖములు నాకు చుట్టరికంబులై
కలిమి లేములు నన్ను కెలికి చెరచె
మదము మాత్సర్యంబు మమకార గర్వముల్
కరణత్రయము చేత ఖలుని జేసె
రాగద్వేషంబులు బాగుగా నీడ్వగా
కోపతాపంబులు కోరిచేరె
తే:       ద్వంద్వములు నన్ను నీడ్వగా తపనపొంది
తండ్రి నిను జేరజాలక తలతునిదిగొ
వరద గోవింద వామన వాసుదేవ
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

24, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ రామ శతకము -14

సీ:       శైశ వంబున దేవ శరణన లేకను
మలమూత్రముల మున్గి మరచుటాయె
కౌమారదశయందుగనలేకనుండెనా
చెడు స్నేహంబులు నన్ను చేరి చెరచె
యౌవనంబున నిన్ను యర్చించ కొనకుండ
అంగనా సాంగత్యమడ్డు నిలచె
ముదియందు నిన్బక్తిమురిపించలేక నీ
చెడు రోగముల దెల్వి చెడగనాయె
తే :      శ్రీరమానాధ గోవింద శ్రీనివాస
ఎట్లు తరియింతునే దశనెట్లు గొలుతు
వేగవేంచేసి రక్షించు వేదవేద్య

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

23, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ రామ శతకము -13

సీ:       నీనామములు సహస్రానీకములు గాన
 ఏ నామమున బిల్వ నేర్తునిన్ను
బహు రూపములు నీకు భావ్యమై యుండగ 
ఏ రూపమని నిన్ను నేర్పరింతు
కళ్యాణగుణములు కల వనంతంబులై 
ఏగుణమ్మన నిన్ను నెంచుకొందు
సకల లోకాలలో సర్వంబు నీవౌట
యెందు గలవీవని యెరుగ గలను 
తే :      క్షితిని నిను జూచు వారేరి చిద్విలాస
మలినమతి నేను నిన్నెట్లు దెలియనేర్తు
వచ్చి కాపాడు శరణము జొచ్చినాడ

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఎక్కడ నుండి ఏం తీసుకోవచ్చు!

విషాదప్యమృతం గ్రాహ్యమమేధ్యాదపి కాంచనం
నీచాదప్యుత్తమా విధ్యా స్త్రీ రత్నం దుష్కులాదపి!!

భావం : విషం నుండి అమృతాన్ని, మలినముల నుండి బంగారాన్ని, నీచుని వద్ద నుండి విధ్యను, తన కంటే తక్కువ కులములో ఉన్నా స్త్రీ రత్నమును స్వీకరించ వచ్చును.

వివరణ: విషమును అలాగే స్వీకరిస్తే అనారోగ్యం కలుగు తుంది. అలా కాకుండా దానిని చేయవలసిన విధంగా శుద్ధి చేస్తే అది ప్రాణములను నిలబెట్టే అమృతం అవుతుంది. మురికిగా ఉన్నప్పుడు అత్యంత విలువైన బంగారాన్ని కూడా మనం గుర్తించలేము. దానిని గుర్తించి, మురికిని తొలగించే నిపుణత ఉన్నప్పుడు మనకు బంగారము లభిస్తుంది. నీచుడు (తనకంటే చిన్నవాడు) చేసే పనులలోనుండి కూడా ఉత్తమ విధ్యను నెర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే దానికి కూడా కొంత నిపుణత అవసరం. స్త్రీ రత్నం తనకన్నా తక్కువ కులంలో జన్మించినా కూడా ఆమెను వరించ వచ్చును.  

21, ఏప్రిల్ 2016, గురువారం

శ్రీరామ శతకము – 12

సీ :      నీలమేఘమువాడు నిడుద బాహులవాడు
కరుణారసము జిల్కు కనులవాడు
వెడద వక్షము వాడు వేద స్వరూపుడు
 కమనీయ కంఠంబు గలుగువాడు
కనక రంభాతిరస్కారులూరులవాడు
పద్మ పత్రముమించు పదమువాడు
శ్రీవత్స చిహ్నంబు శ్రీచూర్ణరేఖలు
 కరముల శంఖ చక్రముల వాడు
తే :      వక్షమందున శ్రీలక్ష్మి వాసమొంద
          శేషశయ్యను బవళించ శేషజనుల
దయ కటాక్షించునను మాట తప్పుగాదు

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

20, ఏప్రిల్ 2016, బుధవారం

18 ఉపపురాణముల పేర్లు

మనం ఇంతకూ ముందు 18 పురాణముల గురించి చెప్పుకున్నాం కదా! ఈ 18 పురాణములకు తోడు 18 ఉప పురాణములు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాని పేర్లు తెలుసుకుందాం!
పద్మ పురాణంలో చెప్పబడిన 18 ఉపపురాణముల పేర్లు

  1. సనత్కుమారము 
  2. నారసింహము 
  3. నాండంబము 
  4. నారదీయము 
  5. దౌర్వాసము 
  6. కాపిలము 
  7. మానవము 
  8. నౌశనసము 
  9. బ్రహ్మాండము 
  10. వారుణము 
  11. కాళికా పురాణము 
  12. మాహేశము 
  13. సాంబము 
  14. సౌరము 
  15. పరాశరము 
  16. మారీచము 
  17. భార్గవము 
  18. కౌమారము 

19, ఏప్రిల్ 2016, మంగళవారం

శ్రీ రామశతకము - 11

సీ:       పతియె నాగతి యంచు సతి చేయుధర్మముల్
సీతా పిరాట్టి తాజేసి చూపె
దాన్యమే విధిచేయదగును వారికి
దయ లక్ష్మణుడు దాస్య నిరతి
పారతంత్ర్యపు విష్ట నరులుండు రీతిని
భరతుండు చూపె సద్భక్తి తోడ
భక్తుల సేవయె భగవానుసేవని
శత్రుఘ్నుడు చూపె సత్యముగను
తే :      సర్వచేతన సంరక్ష సలుపుటకును
దశరధాత్మజుడై పుట్టి ధరణి నేలి
లోక కళ్యాణ మొనరించు లోకనాధ

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

18, ఏప్రిల్ 2016, సోమవారం

శ్రీ రామశతకము -10

సీ :      పంచ సంస్కార సంపన్నుడు గాకెట్లు
 విష్ణుదాసుల చెల్మి వేగచేయు
నేను నాదనుటను మానకుండగ నెట్లు
సాత్విక సహవాస సౌఖ్యమొదవు
నారాయిర స్తోత్రములు చేయకుండెట్లు
జ్ఞానము ప్రాప్తించు మానవునకు
తత్వత్రయంబందు తగు నిష్ట లేకెట్లు
ముక్తికాంత వరించి మురిసి పడును
తే :      ప్రేమ నాచార్యు చేపట్టి కామము దిగి
భాగవతధర్మ దాస్య నిర్భరత నున్న
ముక్తి నరచేతికిత్తువు మోదమునను
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

17, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ రామశతకము - 9

సీ :      మంత్రాంతరంబుల మనసు నిల్పితిగాని
తిరుమంత్ర వైభవం బెరుగనైతి
సాధనాంతరముల సాధింప నెంచితి
సిద్ధిసాధన పొందు చెందనైతి
అన్యయుపాయాల నాశించెదను గాని 
నారాయణుని నాత్మ నమ్మనైతి
మనుజమాత్రుల సేవ మమత జేసితిగాని
గురువుల భక్తితో గొలువనైతి
తే :   ఆత్మవంచన పనులెన్నోయమరజేసి
       ఎందు దరిదాపు గానక పొందుగోరి
       నిన్నె నమ్మితి నీయాన నిజముగాను

       అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

16, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ రామశతకము - 8

సీ :      జానకీ దేవి నా సంవెదనం బాపి
రక్షించ వినిపించు రామునకు
మాయమ్మ నీవెప్డు మాతప్పులెల్లను
మన్నించ వినిపించు మాధవునకు
కమలనేత్రినాదు కలుషజాలమడంచి
తప్పించ వినిపించు దాశరధికి
లోకమాతా నాదు లోలత్వ మణగించి
లోకేశు మెప్పించు లోకమెరుగ
తే:    ఇందిరాదేవి మాతల్లి ముందె యుండి
       పురుషకారము చేయుము మ్రొక్కులిడుచు
       ననుచు ప్రార్ధింతు మాయమ్మ నామె ద్వార

        అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

శ్రీ రామశతకము - 7

సీ :      కల్పపర్యంతంబు గల్గు దేహంబని
భ్రమసి చేసితి నెన్నొ పాతకములు
 ద్రవ్యార్జనంబె యాదరువు రక్షణమని
మోహించి గడియింని మోసపోతి
ఆభాస భాంధవు లాత్మయుత్తారకు
లనియెంచి దరిజేర్చి ఆశచెడితి
అన్య దేవతలె నాకాత్మ రక్షకులంచు
కొలిచి శాశ్వత గతి కోలుపోతి
తే :  భక్తవరులను డాయంగ ముక్తి నొసగ
      శ్రీనివాసుడె కర్తయో ననగ వింటి
      చేరి నిను వేడుకొంటిని చేయివిడకు

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

13, ఏప్రిల్ 2016, బుధవారం

శ్రీ రామశతకము - 6

సీ :      ఈరేడు లోకంబు లీశ్వరాధీనమై
భూతి ద్వయంబంచు బొగడ బడియె
దైవంబు మంత్రమాధారమై యుండంగ
భక్తి ముక్తులకెట్లు భంగ మొదవు
మంత్రమాచార్యుని మహిమకు లోబడి
సిద్ధి నందగ జేయు చేతనులకు
ఆచార్యు కృపచేత హరియె ప్రత్యక్షమై
సర్వస్వదానము శక్తి నొసగు
తే : ఇన్నింటికి మూలమాచార్యుడిష్టతముడు
     భాగవతు లెల్లరతనికి పరమ హితులు
      మూలమిది యన్నింటికి నండ్రు మోక్షమతులు

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు

12, ఏప్రిల్ 2016, మంగళవారం

శ్రీ రామశతకము - 5

సీ :      సర్వరక్క్షకుడగు జానకీపతియుండ
 బ్రహ్మ రుద్రేంద్రుల బట్టనేల
మంత్ర రాజంబిదె మహిత వాంచల దీర్ప
                   అన్య మంత్రంబుల వరయనేల
సిద్ద సాధనముయాశ్రీపతేయైయ్యుండ
సాధనాంతర భ్రమ చావదేల
చరమోపదేశంబు శరణమై యుండగ
ఇతరాంతరంబుల యిష్టమేల
తే :      అన్య శేషంబు నాశంబు యాత్మకెపుడు
సకల కైంకర్య మానంద సౌఖ్యములకు     
భాగవత దాస్య కర్తవ్యభోగవిరతి
          అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

11, ఏప్రిల్ 2016, సోమవారం

శ్రీ రామశతకము - 4

సీ : కౌరి సూనుడు మున్ను కలివేళ నుదయించి
తిరువాయి మొజి జేసె నరులు మెచ్చ
ముగురార్యులే తెంచి ముదమొంద జేసిరి
ద్రవిడభాషల ముక్తి తత్వమంత
భాష్యకారులు నాడు భాష్యంబు వెలయించి
చేతనోజ్జీవంబు చేయ గలిగె
పెరియాళు వారులు పెరియ వాచ్చాంబిళ్ళ
భక్తి సారులు పెద భట్టరార్యు
                                
తే : లాది గురువర్యుతిమ్మహినవతరించి
 చేతనుల దిద్ది వైకుంఠ గతికి చేర్చి
రట్టియార్యుల దివ్యాంఘ్ర లాశ్రయింతు
అందుకొనవయ్య శ్రీరామ వందనములు

10, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ రామశతకము - 3

సీ : పాషండఖండనా పాప విద్వంసకా
            చార్వాకమత దూష సాధుశీల
      జైనమతద్వంసి జంభారి వినుతాయ
           బౌద్ధ విద్వంసక భక్తపోష
     శాక్తేయ భంజన సత్సంప్రదాయకా
          అద్వైత మతనాశయాది దేవ
     కుమత సంస్థాపక కులిశంబవై సాధు
          జన రక్షణము జేయు దనుజహరణ

తే : చారు గీర్వాణ నిర్ణేత చక్రహస్త
      తత్త్వ పురుషార్ధ సంపద సత్వగుణడ
      బ్రహ్మసూక్తుల బహుముఖ ప్రజ్ఞరాయ
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు 

9, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ రామశతకము -2

సీ : చోద్యంబుగా నీటజొచ్చి సోమకుద్రుంచి
           మున్వేదముల్దేవే ముదముతోడ
       కూర్మావతారమై కోర్కెతో మందరం
            బూని చరించ వేయుదదిలోన
       వనచర రూపమై వసుధను కాపాడి
             రక్కసు ద్రుంపవేయక్కజముగ
     నరసింహ రూపంబు ధరియించి ప్రేమతో
           ప్రహ్లాదు గావవే భద్ర చరిత

తే : వామనుడవయ్యి బలియొక్క నామ మడచి
      రామ శ్రీరామ బలరామనామదారి
     కృష్ణుడవు నీవు కల్కివి కృపను జూడు
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు