16, ఆగస్టు 2014, శనివారం

శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద

శ్రీ ముదివర్తి కొండమాచార్యులవారు రచించిన ఈ శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద, ఆనాటి సాగరమధన సమయంలో జరిగిన ఇతివృత్తాన్ని మన కన్నులకు కట్టినట్లుగా చెపుతుంది. 

పాల మున్నీటిలో పవడంపు లతగ
పసి వెన్న ముద్దగా ప్రభవంబు నొంది
కలుములు వెదజల్లు కలికి చూపులకు
మరులంది మధువుకై మచ్చిక లట్లు
ముక్కోటి వేల్పులు ముసురుకొనంగ
తలపులో చెర్చించి తగ నిరసించి
అఖిలలోకాదారు నిగమ సంచారు
నతజనమందారు నందకుమారు
వలచి వరించిన వరలక్ష్మి గాధ
సకలపాపహరంబు సంపత్కరంబు
ఘనమందరాద్రిని కవ్వంబుగాను
వాసుకి త్రాడుగా వరలంగ చేసి
అమృతంబు కాంక్షించి అసురులు సురలు
చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము
పరమ పావనమైన బారసినాడు
మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప
ఒయ్యరముల లప్ప  ఒప్పులకుప్ప
చిన్నారి పొన్నారి శ్రీమహాదేవి
అష్టదళాబ్జమం దావిర్భావించె
నింగిని తాకెడు నిద్దంపుటలలు
తూగుటుయ్యాలలై తుంపెసలార
బాల తా నటుతూగ  పద్మమ్ముచాయ
కన్నెతా నిటుతూగ కలువపూచాయ
అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద
వీక్షిoచు చుండగా వెదురు మోసట్లు
పెరిగి పెండిలియీడు పిల్లయ్యె నంత
కల్పద్రుమంబున కళికలం బోలి
తనువున పులకలు దట్టమై నిగుడ
బారజాచి ప్రమోద భాష్పముల్ రాల
రావమ్మ భాగ్యాల రాశి రావమ్మ
రావమ్మ ఇందిరారమణి రావమ్మ
లోక శోకము బాపు లోలాక్షి వీవు
నాకు కూతురు వౌట నా పుణ్యమమ్మ
అంచు మురిసిపోయి అంబుధిస్వామి
ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరం బంటె
సకియను మంగళ స్నాన మాడింప
వాసవుoడర్పించే వజ్రపీఠమ్ము
పూతనదీజల పూర్ణపుణాహ
కలశాలతోడ దిగ్గజము లవ్వేళ
జలజాతగంధికి జలకమ్ములార్చే
బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము
కట్టంగ సుతకిచ్చె కలశవారాశి
వెలలేని నగలిచ్చె విశ్వకర్ముండు
రాజీవముఖులైన రంభాదులంత
కురులు నున్నగ దువ్వి కుప్పెలు పెట్టి
కీల్జడ సవరించి కింజల్క ధూళి
చెదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి
కళల పుట్టినయిండ్లు కనుదమ్ములకు
కమ్మని కవ్రంపు కాటుక దిద్ది
వెన్నెల తేటయౌ వెడద మోమునకు
గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి
అత్తరు జవ్వాజి అగరు చందనము
హత్తించి,తనువెల్ల ఆమె ముందటను
నిలువుటద్డంబును  నిలిపి రంతటను
తన రూపు శ్రీలక్ష్మి దర్పణమ్మందు
కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి
సింహాసనము డిగ్గి చెంగల్వ దండ
చేదాల్చి యచ్చరల్ చేరి కొల్వంగ
కుచ్చెళ్లు మీగాళ్ళ గునిసియాడంగా
గరుడ గంధర్వ రాక్షస యక్ష దివిజ
సంఘ మధ్యమునకు సరుగున వచ్చె
చెప్పచోద్యం బైన శృగారవల్లి
మొలకనవ్వుల ముద్దుమోమును జూచి
సోగకన్నుల వాలు చూపులు జూచి
ముదురు సంపెంగ మొగ్గ ముక్కును జూచి
అమృతంబు దొలకెడు నధరంబు జూచి
సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు జూచి
ముత్యాలు మేచని మునిపండ్ల జూచి
పాలిండ్ల పై జారు పయ్యెద జూచి
జవజవ మను కౌసుసౌరును జూచి
గుండ్రని పిరుదుల కుదిరిక జూచి
కమనీయ కలహంస గమనంబు జూచి
మొగమున కందమౌ మొటిమను జూచి
మధుసూదనుడు దక్క మగవారలెల్ల
వలపు నిక్కాకకు వసవర్తులైరి
కన్నుల కెగదన్ను కైపున తన్ను
తిలకించు చున్నట్టి దిక్పాలకాది
సురవర్గమును గాంచి సుదతి భావించె
ఒకడంటరాని వాడు ఒకడు జారుండు
ఒకడు రక్తపిపాసి యొకడు జడధి
ఒకడు తిరిపిగా డొకడు చంచలుడు
కాయకంటి యొకండు కటికవాడొకడు
ఒక్కటి తరకైన యింకొక్కటి తాలు
ఈ మొగంములకటే యింతింత నునుపు
శ్రీవత్సవక్షుoడు శ్రితరక్షకుండు
పుండరీకాక్షుoడు భువనమోహనుడు
శంఖ చక్రధరుండు శారంగ హస్తుండు
తప్త చామీకర ధగ ధగ ధగిత
పీతాంబరధరుoడు ప్రియ దర్శనుండు
మణిపుంజ రంజిత మంజుల మకుట
మకర కుండల హార మంజీర కటక
కాంచికా కేయూర కమ్రభుషణుడు
అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య
మాధుర్య గాంభీర్య మార్ద వౌదార్య
శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య
కళ్యాణ గుణ గణౌఘ మహార్ణవుండు
విశ్వమoతయునూ తానైన వాడు
శేషాద్రినిలయుండు శ్రీనివాసుండు
పతియైన సుఖములు పడయంగ వచ్చు
తులలేని భోగాల తులతూగ వచ్చు
ఏడేడు లోకాల నేలంగ వచ్చు
అంచు శౌరికి వైచె అలమేలు మంగ
చెంగల్వ విరిదండ చిత్త ముప్పొంగ
సకల జగంబులు జయవెట్టు చుండ
శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు
తలయంటి పన్నీట తానమాడించి
తడియోత్తి వేణుపత్రము లంత చేసి
నామంబులను దిద్ది నవ భూషణముల
గై సేయ దివిజవర్గముల గొలువ
కదల నై  రావణగజము పై స్వామి
కేశవా యంచును కీరముల్ పలుక
నారాయణా యంచు నెమళులు పలుక
మాధవా యమ్చును మధుపముల్ పలుక
గోవిందా యనుచును కోయిలల్ పలుక
తయితక్క దిమితక్క తధిమిత కిట
ఝణుత తకఝణుత  ఝణుత యటంచు
అచ్చరా విరిబోణు లాడి పాడంగ
ముత్తైదువులు సేస ముత్యాలు చల్ల
చల్లగా వేంచేయు జలదవర్ణునకు
అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష
వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టె
అదేవచ్చె ఇదివచ్చెను అల్లుడటంచు
మామగారెదురేగి మధుపర్క మిచ్చె
పందిటి లోనికి పట్టి తోడ్తెచ్చె
పుణ్య తీర్ధంబులు ప్రోక్షించి ఋషులు
మంగళాశాసన మంగళమ్మిడగా
కమలచేతికి చక్రి కట్టె కంకణము
దివ్య శంఖములు తిరుచిన్నములును
వేణు మర్దల రుద్రవీణలు మొరయ
తలవంచి కూర్చున్న తన్వి కంఠమున
మధువైరి గీలించె  మాంగళ్యమపుడు
చేతుల తలబ్రాలు చేకొని గూడ
పోయగా వెనుకాడు పూబోడి ముందు
శిరము వంచిన యట్టి శ్రీధరుజూచి
పకపక నవ్విరి పల్లవాధరులు
పదునాల్గు భువనముల్ పాలించునట్టి
చల్లని విభునకు జయమంగళంబు
పదము మోపిన చోట పసిడి పండించు
చూడికుత్తుకకు శుభమంగళంబు
అంచు హారతులెత్త అంగనామణులు
సాగే బువ్వముబంతి సంతోషముగను
కలిత కంకణఝణాత్కారమ్ము లెసగ
కటకటలంఘలాత్కారముల్ పొసగ
పిఱుదలపై వేణి పింపిళ్ళు కూయ
మొగమున తిలకంబు ముక్కున జార
చిరుచెమ్మటల దోగి చెదరు గంధమ్ము
ఘమఘమ వాసనల్ గ్రుమ్మరింపంగా
చురుకు జూపుల కోపు చూపర గుండె
వలపుచిచ్చు రగుల్ప వగలాడి యొకతె
కోడిగమ్మడెను గోపాలునిట్లు
మన పెండ్లికొడుకెంతో మహనీయుడమ్మా
మహిళలన్ వలపించు మంత్రగాడమ్మ
మచ్చుమందులు చల్లి మది దోచకున్న
కఱివాని నెవ్వారు కామిoతురమ్మ
సుకియలు పొలిలు సొగియవు గాని
పురపుర మట్టిని బొక్కెడు నంట
పట్టె మంచము వేసి పాన్పమరింప
పాముపై తాబోయి పవళించునంట
అంబారియేనుగే అవతలకంపి
గద్ద మీద వయాళి గదలెడు నంట
వింతవేషములెన్నో వేసెడు నంట
రాసిక్య మితులుంఛి రంగటులుంచి
ఆకారసౌందర్య మరయుదమన్న
కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము
తామరకలిమికి స్థానమ్ము సుమ్ము
ఈ యంటు మనబాల కెపుడు అంటకుండా
తామర సిరిగల ధన్యాత్మునకును
నలచి నల్లెరుతో నలుగిడవలెను
కంద నీటను నొడల్ కడుగంగ వలెను
గంధక లేపమ్ము కడుబూయ వలెను
వాడ వాడల ద్రిప్పి వదలంగ వలెను
ఆ మాట లాలించి హరుపట్టమహిషి
మాధవుచెలియ ఆ పడతి కి ఇట్లాడే
అతి విస్తరంబేల అందాలచిలుక
నీవు నేర్చిన తెల్గు నేర్తురే యొరులు
వెన్నుని నలుపంచు వెక్కిరించితివి
నెలతుక ఎరుపంచు నిక్కుచూపితివి
కలువపూవు నలుపు కస్తూరి నలుపు
కందిరీగ ఎరుపు కాకినోరోరెరుపు
ఈ రెండు రంగులందే రంగు మెరుగో
సొడ్డువేయుట కాదు సూటిగా జెప్పు
వరుని జూచిన కంట వధువును జూడు
మాయ మర్మము వీడి మరి బడులాడు
కలికి కాల్సేతులు కన్నులు మోము
తామర విరిసిన తావులు గావో
తామరలో బుట్టి తామర పెరుగు
కొమ్మిమేనికి దూలగొoడి రాచేదవో
కందనీటి చికిత్స గారవిoచెదవో
ఇంతింత కన్నుల నెగదిగజూచి
సిగ్గుతో నెమ్మోము చేత గప్పికొని
అనలు కొనలు వేయు అనురక్తితోడ
రసికత లేని మా రంగని మెడను
పూలమాలను వేసి పొలుపుగా నతని
గుండెల పై జేరి కులుకంగ దలచు
రంగనాయకి ఎంత రసికురాలమ్మ
శఫరలోచన ఎంత చపలురాలమ్మ
ఆ నవ్వు లీ నవ్వు లరవిరిమల్లే
అందాలు చిందించు లలరింప మదులు
సకల వైభవముల జరిగెను పెండ్లి
ఆంపకమ్ముల వేళ యరుదెoచెనంత
పశుపు కుంకుమ పూలు పండు టెంకాయ
తాంబూల మోడి దాల్చి తరళాక్షి లక్ష్మి
తలపు లోపల గ్రుంగు తండ్రిని జేరి
నాయనా యని పిల్చి నవదుఃఖబాష్ప
కమణులు జలజల కన్నుల రాల
గుండె పై తలవాల్చి కుములు చుడంగ
కడివెడు బడబాగ్ని కడుపులో నణచి
శిరమును మూర్కొని చెక్కిళ్ళు నిమిరి
పాలపూసల తల్లి భాగ్యాలవెల్లి
వేడ్క అత్తింటికి వెళ్లి రావమ్మ
ఆడపిల్లకు తండ్రి అయ్యెడు కంటే
మతి గతి లేనట్టి మానౌట మేలు
వీనుల నీ పాట వినిపించు చుండ
కన్నుల నీ యాట కనిపించు చుండ
నూరటతో నెట్టు లుందు నే అమ్మ
గడియలో నిను వచ్చి కనకుందున
అని సాగరుడు పుత్రి ననునయింపంగా
బుద్దులు గరపిరి పుణ్యకామినులు
ఏమి నోము ఫలంబొ ఏమి భాగ్యంబో
వేదాంత వేద్యుడు విభుడాయే నీకు
ఆముదాలన్నియు ఆణిముత్యములె
చిగురు బోడ్లందరు సింధుకన్యకలే
తల్లి నీ వెరుగని ధర్మముల్ గలవే
నెలత నీ వెరుగని నీతులున్నవియే
పదుగురు నడచిన బాటయే బాట
మందికి నచ్చిన మాటయే మాట
మంచిని విత్తిన మంచి ఫలించు
జొన్నలు విత్తిన చోళ్ళేల పండు
పోయి రాగదమ్మ పుత్తడిబొమ్మ
నీదు పుట్టింటిపై నెనరుంప వమ్మ
కని పెంచకున్నను కళ్యాణి నిన్ను
కన్నులు జాడక ప్రొద్దు గడచునే మాకు
చిలుకలు పల్కిన చివురుమామిళ్ళ
కోయిలల్ గూసిన గుండెలెట్లాడు
పొగడచెట్లకు వ్రేలు పూదోట్ల గన్న
నిమ్మళంబుగ నెట్లు నిలుతుమే కన్నా
కాటుకకాయను  కాంత నేనిత్తు
కుంకుమ భరిణను కొమ్మ నేనిత్తు
జోడుసెమ్మెలు నీకు జోటి నేనిత్తు
పట్టిన దంతయు బంగారు గాగ
ముట్టినదెల్లయు ముత్యంబు గాగ
కడుపుసారెకు వేగ గదలి రావమ్మ
మదిలోన మమ్ముల మరచిపోకమ్మ
అంత మహాలక్ష్మి యనుగు నెచ్చెలుల
చెక్కిళ్ళు ముద్దాడి చుబుకంబులంటి
కంఠమ్ము నిండిన కన్నీళ్ళనాపి
బంగారు చెలులారా! ప్రాణంబులారా!
నేనయ్యి మీరెల్ల నెగడి మాయింట
అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ
పట్టుకుచ్చులు నావి పరికిణీలు నావి
పందిట తూగాడు పయిటలు నావి
కాళ్ళగజ్జెలు నావి కడియాలు నావి
పొలుపైన బొచ్చెన బొమ్మలు నావి
బొమ్మలకును పెట్టు భూషణాలు నావి
స్వేఛ్చగా మీరెల్ల చేకొనరమ్మ
అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ
అని బుజ్జగములాడి అందలంబెక్కి
కమలాక్షునిo టికి కదిలె శ్రీలక్ష్మి
కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు
కండచెక్కెర పాలు కలసియున్నట్లు
అంజనాచాలవాసుడలమేలు మంగ
జంటవాయక సుఖ సంతోష లీల
సాదు రక్షణమును సలుపుచున్నారు
అరుగని మంగళసూత్రమ్ము
చెరుగని కుంకుమ పసుపు
చెదరని సిరులున్
తరుగని సుఖము లొసంగును
హరిసతీ యీ పాట విన్న యబలల కెపుడున్


శ్రీచాగంటి కోటేశ్వరరావు గారు చదివిన యీ ద్విపద ఇక్కడ వినవచ్చు. 

11 కామెంట్‌లు:

  1. 🙏🙏🙏🙏🙏🙏 Amma parameswari lokamulo adavallantha Pandumuttadivuluga vundali lokamulo pillantha nindu nurellu ayuruarogyalatho astaiswaryatho vundali 🙏 thalli parameswari 🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి