29, మే 2023, సోమవారం

భాస్కర శతకం -2

మన తెలుగు సామెతలలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి అని నానుడి కదా ! మరి ఇంతకూ ఆ మాట ఎక్కడనుండి తీసుకున్నారో చూద్దామా!

అక్కర పాటు వచ్చుఁ సమయంబున జుట్టములొక్కరొక్కరి 

న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికి జూడగ యుక్తమేసుమీ 

యొక్కట నీటిలో మెరక నోడలబండ్లును బండ్లనోడలున్ 

దక్కకవచ్చుఁచుండుట నిదానముగా దెలంప భాస్కరా!

అర్ధం: భాస్కరా = ఓ సూర్యాదేవా !, అక్కర = తగిన, పాటు = అవసరము, వచ్చుఁ = వచ్చిన , సమయంబునన్ = సమయంలో, చుట్టములు = బంధువులు, ఒక్కరొకరి = ఒకరు మరొకరి , మక్కువన్ = ఇష్టంగా , ఉద్ధరించుట = కాపాడుట , చూడగా = ఆలోచిస్తే , మైత్రికి = స్నేహమయునకు , యుక్తము= సరియైనది , =అవును, సుమీ = సుమా! ఒక్కటన్ = ఒకవేళ , నీటిలో = నీటిలోపల , ఓడలన్ = పడవలమీద , బండ్లును = బండ్లు , మెరకన్ = భూమిమీద , బండ్లన్ = బండ్ల మీద , ఓడలున్ = పడవలు , తక్కక = ఆగకుండా , వచ్చుఁచుండుట = రావడం, తలంపన్ = ఆలోచించగా , నిదానం= నిదర్శనము, కాదె= కదా !

తాత్పర్యం : ఈ ప్రపంచంలో చుట్టములు, బంధువులు ఒకరికి అవసరమయినప్పుడు మరొకరు చక్కగా సహాయం చేసుకుంటారు అది ఎంత సహజం అంటే నీటిపైన ఉన్నప్పుడు బండ్లు పడవలమీద , భూమిమీద ఉన్నప్పుడు అవే పడవలు బండ్లమీద ప్రయాణం చేస్తాయి కదా!






28, మే 2023, ఆదివారం

భాస్కర శతకము - 1

తెలుగులో అనేక నీతి శతకములు ఉన్నాయి. వానిలో మనం ఈ టపాలో భాస్కర శతకము లోని ఒక పధ్యము నెర్చుకుందాం!

శ్రీగలభాగ్యశాలి గడు జేరగవత్తురు తారుదారె దూ

రాగమున ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వను

ద్యోగముచేసి రత్ననిల యుండనికాదె సమస్తవాహినుల్

సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురు మూర్తిభాస్కరా

అర్ధంః మునిసన్నుత = మునిలచే మన్ననలు పొందే, మత్ = నాకు, గురుమూర్తి = గురురూపుడు అయినట్టి, భాస్కరా = ఓ సూర్య భగవానుడా! దూర = దూరము నుండి, ఆగమన= వచ్చుట వలన కలిగిన, ప్రయాసమునన్ = శ్రమకు, ఓర్చియున్= భరించి, నిల్వన్= నిలుచుటకు, ఉద్యోగము = ప్రయత్నము , చేసి , తారుదారె= తమకుతమే, అదటన్ = అనురాగంతో, శ్రీ = సంపదలు, గల =కలిగిన, భాగ్యశాలి = అదృష్టవంతుని, కడు= చాలా/ ఎక్కువగా, చేరగవత్తురు = దగ్గరకు చేరుతారు. సమస్త = సకలమైన, వాహినుల్ = నదులు, సాగరున్= సముద్రమును, రత్న= రత్నముల కోసం,  ఎల్లన్ = సమీపించునది

తాత్పర్యం : ఎక్కడెక్కడో పుట్టిన అనేక నదులు రత్నములు కలిగి ఉన్నాడు అనే ఆశతో సముద్రమును చేరినట్లు ప్రజలుకూడా అనేక వ్యయ ప్రయాశలకు ఓర్చుకుని తమంతట తామే ధనవంతుల ఇంటికి వస్తూ ఉంటారు.






29, ఆగస్టు 2022, సోమవారం

శ్రీనాధుని చే చెప్ప బడిన గణేశ ప్రార్ధన

 శ్రీనాధుడు రచించిన భీమఖండం లో గణపతిని స్తుతిస్తూ చెప్పిన పద్యం చాలా బాగుంది.

ఏనికమోముతార్పెలుక నెక్కినరావుతురాజు సౌరసే

నానియనుంగుబెద్దన వినాయకదేవుడు కర్ణతాళఝం

ఝానిలతాడనంబున నిరంతరమున్ బ్రబలాంతరాయసం

తానమహాఘనాఘన కదంబములన్ విదళించు గావుతన్


తాత్పర్యం: ఏనుగు ముఖం కలిగి, తన వాహనము ఎలుకను ఎక్కిన కుమారస్వామికి స్వయాన పెద్ద అన్న అయిన వినాయకుడు, తన పెద్ద పెద్ద చెవులను విసురుతూ ఎల్లప్పుడూ అత్యంత దట్టంగా అలుముకుంటున్న విఘ్నములు అనే కారు మబ్బులను చెల్లా చెదురుగా పోగొట్టును గాక. 






30, మార్చి 2022, బుధవారం

నల దమయంతుల వివాహం అందరికి సంతోషకారకం అయ్యిందా?

మనం ఇంతకు ముందు దమయంతి నల మహారాజుల వివాహం గురించి,  ఆ వివాహానికి దేవతలు రావడం, వారిని పరిక్షించి,వారికి వరములను ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత వారి  జీవితంలో సంభవించిన మార్పులను గురించి ఇప్పుడు చూద్దాం! 

ఇంద్రాది దేవతలు స్వయంవరం అయిన తరువాత ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా వారికి ద్వాపర, కలి యుగములు భౌతిక దేహముతో పురుషుల వలే ఎదురు వచ్చారు. వారిని చుసిన దేవతలు వారిని ఆపి ఎక్కడకు బయలుదేరారు అని అడుగగా వారు దమయంతి స్వయంవరం లో పాల్గొనడానికి వెళ్తున్నామని చెప్పారు. వారిద్దరిలో కూడా కాళీ అత్యంత ఉత్సాహంగా ఉండడాన్ని గమనించిన దేవతలు వారికి ఆ స్వయంవరం పూర్తి అయినది అని చెప్పారు. ఆ మాటలు విన్న ఆ ఇద్దరు యుగ పురుషులు నిరాశ చెందారు. కానీ దేవతలు అంతటితో ఆగకుండా ఆ దమయంతి నలుని తప్ప దేవతలను కూడా వివాహం చేసుకోనని చెప్పిందని, దానికి ప్రముఖ మయిన కారణం నలుని ధర్మ పరాయణత అని చెప్పిన మాటలు వారు చెప్పారు. 

ఆయా మాటలను విన్న  కలి  కి ఆవేశం వచ్చింది.నలునిలో ఉన్న ఏ ధర్మదక్షతను ఆమె అతనిని వరించిందో ఆ ధర్మమునకు నలుని దూరం చేస్తాను అని కలి ప్రతిజ్ఞ చేసాడు. 

అలా కాళీ చేసిన ప్రతిజ్ఞ కు ద్వాపరుడు కూడా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. 

మరి వారు నలుని నిజంగా ధర్మ బ్రష్టుని చేశారా? లేదా? చేస్తే ఎలా చేయ గలిగారు? దాని వలన నల దమయంతిల జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అని తరువాతి టపా లలో చూద్దాం!

16, మార్చి 2022, బుధవారం

విదుర నీతి - 13

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు అంతే కాకుండా పండితులకు ఉండే ముఖ్య లక్షణముల గురించి తెలుసుకుందాం! 


సంస్కృత శ్లోకం:

నాప్రాప్యమభివాంచంతి నష్టం నేచ్ఛన్తి శోచితుం

ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

పోయిన దానికిదాదల పోయడశక్యార్ధములకుబోడాపదలన్

బాయడు ధైర్యముదీనుల రోయడుతత్వజ్ఞుడగునరుండు మహీశా!

భావంః పండితుడు తను పొందలేక పోయినదాని గురించి దుఃఖించడు, తనకు సాధించడానికి అసాధ్యమయిన లక్ష్యములను సాధించాలని కోరుకొనడు, తన లక్ష్యములను సాధించే క్రమంలో ఎదురయిన సమస్యలను చూసి ధైర్యమును కోల్పోడు, అంతే కాకుండా తన ముందు ఎవరయినా ధైర్యమును కోల్పోయిన వారిని అనాదరించడు. 

15, మార్చి 2022, మంగళవారం

నలుడు, దమయంతిల వివాహం

మనం ఇంతకుముందు దమయంతి స్వయంవరమునకు దేవతలు వచ్చారని, వారు నలుని దమయంతి వద్దకు రాయభారానికి పంపారని, ఆ రాయబారాన్ని తీసుకుని నలుడు దమయంతి దగ్గరకు వెళ్ళడం గురించి చెప్పుకున్నాం!

నలుడు దమయంతి సమాధానాన్ని దేవతలకు చెప్పాడా? వారు స్వయంవరమునకు ఎలా వచ్చారు?ఆ తరువాత స్వయంవరం ఎలా జరిగింది?  అని ఇప్పుడు తెలుసుకుందాం!

దమయంతి సమాధానమును నలుడు దిక్పాలకులయిన దేవతలకు తెలియజేసాడు. దమయంతి సమాధానమును విన్న దేవతలు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు, కానీ వారు దమయంతి స్వయం వరమునకు తప్పకుండా రావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దిక్పాలకులు నలుగురు (ఇంద్ర,వరుణ,అగ్ని మరియు యమధర్మరాజు) ఆ స్వయంవరమునకు నలుని రూపంలో వచ్చారు.

ఆ స్వయంవరమండపం లో అన్ని రాజ్యముల నుండి రాజులు వచ్చారు. వారిలో కొందరు కేవలం ఆమెను చూడడానికి మాత్రమే వచ్చారు. దమయంతి తన చేతిలో వరమాలతో ఆ మండపం లోనికి వచ్చింది. ఆఅమె పక్కన ఉన్న చెలికత్తెలు ఆమెకు ఒకొక్క రాజు గొప్పతనమును చెబుతూ వస్తున్నారు. అలా వస్తున్న వారికి ఒక దగ్గర ఐదుగురు నల మహారాజులు కనిపించారు. అప్పుడు చెలికత్తెలకు ఏమి చెప్పాలో అర్ధంకాలేదు. దమయంతికి కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉంది. ఆమెకు అక్కడ ఉన్న ఐదుగురిలో ఒక్కడు నలుడు ఆని మిగిలిన వారు దేవతలు అని తెలుసు కనుక ఆమె వారిని మనస్సులోనే ప్రార్ధించడం మొదలుపెట్టింది. వారిలో మానవుడయిన నలుడు ఎవరో తెలుసుకొనగలిగే ఉపాయమును చెప్పమని కోరుకున్నది. ఆమె దృడసంకల్పానికి సంతోషించిన దేవతలు నిజమయిన నలుని పాదములు భూమిని తాకుతూ ఉంటాయని ఆమెకు స్పురించింది. ఆమె అక్కడ ఉన్న ఐదుగురు నలమహారాజులను గమనించింది. ఆ ఐదుగురిలో కేవలం ఒక్కరి పాదములు మాత్రమే నేలను తాకుతూ ఉన్నాయి. మిగిలిన నలుగురి పాదములు భూమిని తాకకుండా ఉన్నయి. అప్పుడు దమయంతి తన వరమాలను నలుని మెడలో వేసింది. 

వారి వివాహాన్ని చూసి సంతోషించిన ఇంద్రుడు, నల మహారాజు చేసే ప్రతి యజ్ఞమునకు స్వయంగా వచ్చి హవిర్భాగమును స్వీకరిస్తానని, అగ్నిదేవుడు నలుని కోరికపై అతను ఎక్కడ కావాలంటే అక్కడకు వస్తానని, వరుణుడు కూడా నలుని కోరికపై ఎక్కడికి అయినా వస్తానని, యమధర్మరాజు నలుని మనస్సు ఎల్లవేళలా ధర్మం పైననే నిలచేలా చేస్తానని వరములు ఇచ్చారు. 

14, మార్చి 2022, సోమవారం

అష్ట వినాయకులు

 మనం ఇంతకు ముందు ఏకాదశ రుద్రుల గురించి,  నవ బ్రహ్మల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం స్వయంభువులుగా అవతరించిన అష్ట వినాయకుల గురించి తెలుసుకుందాం!

వీని గురించి స్వయంగా వేద వ్యాసుడే ఒక శ్లోకంలో చెప్పాడు. ఆ శ్లోకం ఇప్పుడు మనం చూద్దాం!

స్వస్తిశ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం

బల్లాళం మురులం వినాయక మిదం చింతామణీ దేవరం

లేన్యాద్రిం గిరిజాత్మకం సురవరం విఘ్నేశ్వరం ఓఝురం

గ్రామే రంజన సంస్థితో గణపతిః కుర్యాత్ సదా మంగళం

  1. మయూరేశ్వరుడు
  2. సిద్ధి వినాయకుడు
  3. బల్లాళేశ్వరుడు
  4. వరద వినాయకుడు
  5. చింతామణి గణపతి
  6. గిరిజా పుత్రుడు
  7. విఘ్నేశ్వరుడు
  8. మహాగణపతి