28, ఫిబ్రవరి 2022, సోమవారం

అయోధ్య - సరయు నది పుట్టుక

 సుర్యుని పుత్రుడయిన 14 మంది మనువులలో ఒకరు అయిన వైవస్వత మనువు అతని భార్య శ్రధ్ధాదేవిలకు సంతానం కలుగుట కోసం వసిష్టమహర్షి చేత యజ్ఞం  చేయించారు అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం! ఆ యజ్ఞం జరుగక ముందు కధనం ఇప్పుడు చూద్దాం!

వైవస్వత మనువు తన భార్యతో కలసి అయోధ్యా అనే నగరమునకు నిర్మించారు. వారు యజ్ఞము చేయుటద్వారా సంతానమును పొందాలని అనుకుని గురు వసిష్టుని ఆశ్రయించారు. కానీ పురాణముల ప్రాకారం ఒక యజ్ఞము చేసినందు వలన అత్యంత ఫలితము పొందాలంటే ఆ క్రతువు నీటి దగ్గర జరగాలి. అయోధ్యా నగరం దగ్గరలో ఏవిధమయిన నీటి వనరులు లేవు కనుక  యజ్ఞము చేయాలని అనుకుంటే ముందుగా అయోధ్యా నగరమునకు నీటి వనరులను సమకూర్చవలసిన అవసరం ఉంది. కనుక వసిష్టుడు వైవస్వతునకు తన కర్తవ్యం భోదించాడు. అప్పుడు వైవస్వతుడు తన శరముతో మానససరోవరమునుండి ఒక నదిని బయలుదేరదీశాడు. ఆ నది అయోధ్య పక్కనుండి వెళ్ళేలా ఎర్పాటు చేసాడు. 

ఆ నది పుట్టుక శరం వలన కలిగింది కనుక ఆ నదికి శరయు నది అనీ, మానస సరోవరము నుండి పుట్టినది కనుక ఆ నదికి సరయు నది అనే పేర్లు వచ్చాయి. ఆ నది ఒడ్డున వారు యజ్ఞము చేసి సంతానమును పొందారు.

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

నల దమయంతి ల పరిచయం

మనం ఇంతకుముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావం నుండి తప్పించ గలిగిన శ్లోకం గురించి,   నలుని గురించి, దమయంతి గురించి,  స్వయంవరానికి బయలు దేరిన నలునికి దేవతలు ఎదురయినప్పుడు నలుడు వారికి ముందుగానే మాట ఇవ్వడం గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు ఆ సంక్లిష్ట పరిస్థితి నుండి ఎలా బయట పడ్డాడో చూద్దాం!
    ఇంద్రాది దేవతల మాటలు విన్న నలుడు ఆశ్చర్యమునకు గురి అయ్యాడు. తాను కూడా అదే స్వయంవరమునకు బయలుదేరానని చెప్పాడు. అలా ఒకే స్వయంవరమునకు వెళ్తున్న తనతో ఆ రాకుమారి వద్దకు దేవతలను వివాహం చేసుకోవాలని ప్రస్థావన తీసుకుని దౌత్యం చేయడం సమంజసం గా ఉండదు అని తన భావన దేవతలకు వివరించాడు. 
కానీ ఇంద్రాదిదేవతలు అతనిని పరీక్షించడానికే అక్కడికి వచ్చారు కనుక వారు నలుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాడానికే నిర్భందించారు. ధర్మనిరతుడయిన నలుడు దమయంతి దగ్గరకు దేవతల తరపున దూతగా వెళ్ళాల్సిన పరిస్థితి తప్పలేదు. 
అప్పుడు నలునికి మరొక సందేహం కలిగింది. దమయంతి ఒక రాకుమార్తె. ఆమె స్వయంవరమును కూడా ప్రకటించిన ఈ సందర్భంలో ఆమె మందిరంలో కాపలా కొరకు భటులు నిరంతరం ఉంటారు వారిని ఏమార్చి ఆమెవద్దకు ఎలా చేరుకోవాలి? అని. ఆ సమస్యకు దేవతలే ఉపాయం అందించారు. అతను విదేహ రాజ్యములోని దమయంతి రాజ భవనము/ అంతఃపురం ప్రవేశించే సమయంలో అతనిని దేవతల కృపవలన ఎవ్వరూ అడ్డుకొనరు అని దేవతలు వరం ఇచ్చారు. 
ఆ వర ప్రభావం కారణంగా నలుడు సులభంగా దమయంతీదేవి అంతఃపురాన్ని చేరుకున్నాడు. ఆ అంతఃపుర శోభను చూస్తూ ముందుకు నడిచాడు. అతను దమయంతిని చూశాడు. ఆమె అతనిని చూసి ఆశ్చర్యపోయింది. తన అంతఃపురంలోనికి రావడానికి ఎంత ధైర్యం? నలుని రూపలావణ్యముల గురించి ఇంతకు ముందు విని ఉండుట వలన, ఆమె అతని రూపమును చూసి భటులను పిలవకుండా మాట్లాడడం మొదలు పెట్టింది.
అతనికి ఇంతకు ముందు హంస వివరించిన దాని కంటే దమయంతి అతనికి అత్యంత సుందరంగా కనిపించింది.  అతను తనను తాను అమెకు పరిచయం చేసుకున్నాడు. అతను అక్కడికి వచ్చిన కారణం కూడా ఆమెకు వివరించాడు. 
ఇప్పుడు ధర్మసంకటంలో దమయంతి పడింది. ఆమె తాను కోరుకున్న నలుని వివాహం చేసుకుంటే, అతను సరిగా దూత పని చేయలేదన్న అపకీర్తి వస్తుంది, అలాగని ఆమె దేవతలలో ఒకరిని వివాహం చేసుకోలేదు.
మరి ఆమె స్వయంవరం ఎలా జరిగింది? ఆమె నలునికి ఏమి సమాధానం చెప్పి పంపింది? నలుడు దేవతలకు ప్రియంగా దూత కార్యమును చేసినట్లుగా ఎలా అనుకోవాలి? తరువాతి టపాలలో చుద్దాం!

26, ఫిబ్రవరి 2022, శనివారం

మూర్ఖుని సంతోష పెట్టడం కుదురుతుందా!

 మనం ఇంతకు  ముందు భర్తృహరి సుభాషితాలలో మూర్ఖపద్ధతి గురించి, మూర్ఖుని మనస్సు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మరొక శ్లోకం చూద్దాం!

లభేత సికతాసు తైలామపి యత్నతః పీడయన్

పిబేచ్చ మృగతృష్ణి కాసు సలిలం పిపాసార్ధితః

కదా చిదపి పర్యటన్ శశవిషాణమాసాదయే

న్నతు ప్రతినివిష్ట మూర్ఖ జనచిత్తమారాధయేత్


అర్ధం ః  యత్నతః = ప్రయత్నమువలన, సిక తాసుఅపి= ఇసుక నుండి కూడా, తైలం= నూనెను, లభేత = పొందవచ్చును, పిపాస = దాహం వలన, అర్ధితః = నీటిని కోరుకునేవానికి, మృగతృష్ణికాసు = ఎండమావులలో, సలిలం = నీటిని, పిబేత్= త్రాగవచ్చును, పర్యటన్= బాగా తిరిగి తిరిగి, కదా చిదపి= ఒకానొక సమయంలో, శశ = కుందేలు, విషాణం = కొమ్ము, ఆసాదయేత్= పొందవచ్చు, ప్రతినివిష్ట = మొండిపట్టు పట్టిన, మూర్ఖ జన = ముర్ఖుల, చిత్తం=మనస్సును, ఆరాధయేత్= మెప్పించడం, న = కుదరదు. 

తాత్పర్యంః

ప్రయత్నంచేసి ఇసుక నుండి కూడా చమురు/ నూనెను తీయ్యవచ్చు, బాగా దాహంగా ఉన్నప్పుడు ఎండమావిలోని నీటిని త్రాగ వచ్చు, ప్రపంచం మొత్తం తిరిగి తిరిగి కుందేటికొమ్మును కూడా సాధింపవచ్చు కానీ మూర్ఖుని మనస్సును ఎవ్వరూ సమాధాన పరచలేరు.

 ఇదే శ్లోకమునకు తెలుగు అనువాదం 

తెలుగు అనువాదం

తివిరి ఇనుమున దైలంబు దీయవచ్చు

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు

దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు

జేరి మూర్ఖులమనస్సు రంజింప రాదు

25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

పుష్పక విమానం రావణునికి ఎలా లభించింది?

 మనం ఇంతకుముందు దశగ్రీవుడు అత్యంత బలశాలి, సకల శాస్త్రముల జ్ఞానము కలిగి ఉండి కూడ  తన చుట్టూ ఉన్నవారి మాటలు విని తన వివేకాన్ని పూర్తిగా కోల్పోతున్న విధానాన్నిచూసాం! ఇంతకు ముందు భాగంలో మనం దశగ్రీవుని అరాచకాలను గురించి విన్న కుబేరుడు తన తమ్ముని ధర్మమార్గంలోనికి మార్చడానికి ఒక ప్రయత్నం చేసాడు. ఆ ప్రయత్నం గురించి, దానికి దశగ్రీవుడు ఎలా స్పందించాడు అని తెలుసుకుందాం!

కుబేరుడు తన తమ్ముని అధర్మ ప్రవృత్తి గురించి తెలుసుకుని, అతనిని మంచి మార్గంలోనికి మార్చడనికి ఒక ప్రయత్నం చేయడనికి ఒక దూతను పంపాడు.  ఆ దూత దశగ్రీవుని వద్దకు వచ్చి, కుబేరుడు అతనికి చెప్పమన్న అన్ని విషయములను చెప్పాడు. కానీ ముందే అధర్మ మార్గంలో ఉన్న దశగ్రీవునికి ఆ మాటలు రుచించలేదు. అంతేకాక ఆ మాటలలో కుబేరుడు తాను పరమశివునకు మిత్రుడని చెప్పడం అతని అహానికి పెద్ద శరాఘాతంగా అనిపించింది. కుబేరుడు తనను హెచ్చరిస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దానివలన అతను తన ఆధిపత్యాన్ని చూపించడానికి, కుబేరుని దూతను హతమార్చాడు. అంతేకాక అతను స్వయంగా కుబేరుని పై యుధ్ధాన్ని ప్రకటించాడు. 

అలకాపురి చుట్టూ తన రాక్షససేనను మొహరింపజేసాడు. ఆ సేనను చూసిన యక్షులు కూడా తమ యుధ్ధాన్ని ప్రారంభించారు. యుధ్దం హొరాహోరీగా సాగింది. అనేక మంది యక్షులు తమ ప్రాణాలను కోల్పోయారు.  ధర్మ యుధ్దం చేస్తున్న కుబేరుడు రాక్షస సేనలను తమపురినుండి తరమ సాగాడు. తమ అపజయాన్ని పసిగట్టిన దశగ్రీవుడు మాయా యుధ్ధాన్ని ప్రారంభించాడు. ఆ మాయా యుధ్ధంలో కుబేరుడిని దశగ్రీవుడు ఒడించాడు. అతని దగ్గరి నుండి పుష్పకవిమానమును లాక్కున్నాడు. అప్పటినుండి ఆ పుష్పక విమానం అతని వద్దనే ఉంది. 

24, ఫిబ్రవరి 2022, గురువారం

విదుర నీతి - 9

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఎనిమిది  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

యస్య కృతం న జానన్తి మన్త్రం మస్త్రితం పరే

కృతమేవాస్య జానన్తి స వై పండిత ఉచ్యతే


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

పరధనలోలుపుండు భయవంతుడు వృధ్య సమృధివిఘ్న సం

భరితుడు గాక యెవ్వడు స్వమంత్రితమంత్రణ కార్యసంతతిన్

బరుల కఱుంగనీక తనపాలిటికార్యము జక్కజేయునా

నరుడిలబండితుండని జనంబులు మెత్తురు కౌరవేశ్వరా

భావం:

ఇతరుల ధనమును పొందాలని లేని, భయములేని వాడు అయ్యి, తను చేయాలనుకున్న పనులకు చెందిన అలోచనలను ఇతరులకు తెలియకుండా చేస్తూ, కేవలం తన పనుల ద్వారా అతని ఆలోచనలను తెలియ పరుస్తూ ఉంటారో అటువంటి వారినే పండితులు అంటారు.

23, ఫిబ్రవరి 2022, బుధవారం

ఇంద్రాది దేవతలు నలునికి వేసిన ముందరికాళ్ళ బంధం!

మనం ఇంతకు ముందు నలుని గురించి, దమయంతి గురించి, వారి మద్యన జరిగిన హంస రాయభారం గురించి తెలుసుకున్నాం కదా! ఆ తరువాత భీమసేనుడు తన కుమార్తె దమయంతికి స్వయంవరం ప్రకటించారని కూడా చెప్పుకున్నాం!

స్వయంవరానికి భీముడు సకల రాజ్యములకు చెందిన రాజులను అహ్వానించాడు. అందరు రాజులు ఆ స్వయంవరానికి వచ్చేసారు. 

ఆ సమయంలోనే నారదుడు ఆ దమయంతి స్వయంవర వార్తను తీసుకుని స్వర్గమునకు వెళ్ళాడు. దమయంతి సౌందర్యమును, గుణవర్ణనము విన్న తరువాత దేవేంద్రునితో కలిసి అందరు దిక్పాలకులు ఆ స్వయంవరమును చూడడానికి బయలుదేరారు. వారికి నారదుని వలన దమయంతికి సరి అయిన వరుడు నలుడు అని తెలుసుకున్నారు. వారు నలుని ధర్మనిరతిని పరిక్షించాలని అనుకున్నారు. 

వారు స్వయంవరానికి వెళ్తున్న నలునికి ఎదురు వచ్చారు. వారు నలుని చూసి తమను తాము పరిచయం చేసుకోకుండానే తమకు నలునివల్ల ఒక సహాయం కావాలని, నలుడు వారి తరపున దూతగా వెళ్ళాలని కోరుకున్నారు. వారు ఎవరో తెలుసుకోకుండానే వారికి సహాయం  చేస్తాను అని, దూతగా వారి అభీష్టం నెరవేరుస్తాను అని మాట ఇచ్చేసాడు. 

అప్పుడు దేవతలు నలునితో ఇంద్రుడు, తాను ఇంద్రుడననీ, తనతో ఉన్న వారు దిక్పాలకులనీ, వారు దమయంతీదేవి స్వయంవరమునకు వచ్చామనీ, కనుక నలుడు వారి తరపున ఆమె వద్దకు వెళ్ళి, వారి గొప్పతనములను, బిరుదులను, వారి వారి శౌర్య ప్రతాపాలను వివరించి చెప్తే ఆమె వారిలో ఎవరినైనా వివాహం చేసుకొనుటకు అవకాశం దొరుకుతుంది కనుక నలుడిని అలా దౌత్యం జరుపమని కోరుకున్నాడు. 

తాను ప్రేమించి, వివాహం చేసుకోవాలని అనుకున్న అమ్మాయి వద్దకు మరొకరి గురించి దౌత్యం చేయడానికి నలుడు ఒప్పుకున్నాడా? అలా ఒప్పుకోకుండా మాట తప్పాడా? తరువాతి టపాలలో చుద్దాం!

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

మూర్ఖుని మూర్ఖత్వానికి మందు

మనం ఇంతకు ముందు మూర్ఖ పద్దతి అనే శీర్షిక పై కొన్ని శ్లోకములు చెప్పుకున్నాం! ఇప్పుడు మనం ఆ ముర్ఖుని మూర్ఖత్వమునకు మందు అనేది ఉన్నదా లేదా అనే విషయం చూద్దాం!

సంస్కృత శ్లోకం

శక్యో వారయితుం జలేన హుతభుక్ఛత్రేణ సూర్యాతపో

నాగేంద్రో నిశితాఙ్కు శేన సముదో దణ్డేన గౌర్గర్దభః,

వ్యాధిర్భేషజసఙ్గ హైశ్చ వివిధైర్మన్త్రప్రయోగైర్విషం

సర్వస్యౌషధమస్తి శాస్త్రవిహితం మూర్ఖస్య నాస్త్యౌషధం

అర్ధంః 

శక్యః = భరించగలిగిన, సూర్య తపః = సూర్యుని ఎండ, చత్రేణ = గొడుగుతో, హుతభుక్ = నిప్పు, జలేన = నీటిచేత, సమదః = బాగా మదంతో ఉన్న, నాగేంద్ర = ఏనుగు, నిశిత = వాడియగు,  అంకుశేన = అంకుశము చేత, గౌః = ఎద్దు, గార్ధభః = గాడిద, దండేన = కర్రతో, వారయితుం = వారించుట, శక్యః =  వీలగును, వ్యాధిః= రోగము, భేషజ = మందులను, సంగ్రహ = తీసుకొనుట, చ= వలన, విషం = విషము, వివిధైః = అనేక రకములయిన, మంత్ర = మంత్రముల, ప్రయోగైః = ప్రయోగముల వలన, సర్వస్వ= అన్నింటికీ, శాస్త్ర= శాస్త్రములలో,  విహితం= విధించబడిన, ఔషదం= మందు, అస్తి= కలదు, మూర్ఖస్య= మొండి వానికి, నాస్తి= లేదు.

అదే శ్లోకమునకు తెలుగు పధ్యంః

జలముల నగ్ని చత్రమున జండమయూఖుని దండతాడనం

బుల వృషగర్ధభంబులను బొల్పగుమత్తకరీంద్రమున్ సృణిం

జెలగెడురోగ మౌషధముచే విషముం దగు మంత్రయుక్తిని

మ్ముల దగ జక్కజేయు నగు మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే


తాత్పర్యంః

అగ్నికి జలము, ఎండకు గొడుగు, మదగజంబు నకు అంకుశము, ఎద్దు గాడిద మొదలయిన జంతువులకు కర్ర, రోగమునకు రకరకములయిన మందులు, సర్ప విషమునకు చాలా రకములయిన మంత్రములు,  అనేక శాస్త్రములలో నివారణముగా చెప్పబడినవి కానీ మూర్ఖుని యొక్క మూర్ఖత్వమును పోగొట్టగలిగిన ఔషదం ఏ శాస్త్రములోనూ చెప్పలేదు.

21, ఫిబ్రవరి 2022, సోమవారం

దారితప్పిన దశగ్రీవుడు

 మనం ఇంతకు ముందు లంక గురించి, ఎవరిది  అనే విషయం గురించి, రాక్షసులకు మొదటగా ఆ లంక ఎలా లభించింది అని, రాక్షసుల సంతానము పెరగటం, ఆ లంకను వదిలి వారు వెళ్ళవలసిన సందర్భం ఎందుకు వచ్చింది, దశగ్రీవుడు నిజంగా అంత చెడ్డవాడా,  కైకసి కుమారులు  పొందిన వరముల గురించి, అతనిపై ఉన్న చెప్పుడు మాటల ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాం కదా! 

ఎంత మంచివారయినా తమ చుట్టూ ఉన్నవారిని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. ఆ విషయం దశగ్రీవుని విషయంలో నిజం అని మనం చూడవచ్చు. అతను తన చుట్టూ తన తాత సుమాలి, అతని మంత్రులు ఉన్నారు.  వారు చెప్పే మాటలు వింటూ కాలం గడుపుతున్న దశగ్రీవునికి వారి అలోచనలలో నుండి అనేక చెడ్డ ఆలోచనలు అతని మెదడులో ఊపిరి పోసుకోసాగాయి. అతని మనస్సులోనికి అరిషట్వర్గములు ప్రవేశించాయి. అతనికి తను సొంతం చేసుకున్న స్వర్ణలంక చిన్నది అనిపించసాగింది. హింస ప్రవృత్తి పెరిగింది. స్వార్ధం పెరిగిపోయింది. అహంకారం మితిమీరి ప్రవర్తించసాగాడు. ఋషులను మునులను భాదించడం మొదలు పెట్టాడు. అతని పద్దతులను, అతని జీవన విధానంలోని మార్పులను తెలుసుకున్న అతని అన్న కుబేరుడు అతనిని మార్చాలని అనుకున్నాడు. మరి అతను ఏమి చేసాడు? దశగ్రీవుడు అన్నగారి మాట విన్నాడా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

విదుర నీతి - 8

మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఏడు  భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగంలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగమునకు కొనసాగింపు. 

సంస్కృత శ్లోకం:

నిషేవతే ప్రశస్తాని నింన్దితాని నసేవతే

అనాస్తికః శ్రద్ధదాన ఏతత్పండిత లక్షణమ్

క్రోధో హర్షశ్చ దర్పశ్చ హ్రీస్తంభో మాన్య మానితా

యమర్ధాన్నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే 


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

జనహిత కార్య సంతతిని సల్పుచుగ్రోధముగర్వముబ్బుసి

గ్గునుజననింద్యసేవన ముకుత్సితబుధ్దియు నాత్మసంస్తవం

బను నివిలేకదానపరుడై సదయుండును శ్రద్ధధానుడౌ

జనుడిలబండితుండని ప్రశంసకునుక్కును కౌరవేశ్వరా!

భావం:

మంచిపనులు చేయడం, నిందింపదగిన పనులను చేయకుండా ఉండుట, నాస్తికుడుకాకుండా ఉండుట, తాను చేసేపనుల పై శ్రద్ధ కలిగి ఉండుట మరియు కోపమును, మితిమీరిన సంతోషమును, గర్వమును, సిగ్గును, బిడియము, తనకు తానే అధికుడు అనుకోవడము అనే లక్షణములు లేకుండా ఉండే వానిని పండితుడు అంటారు. 

19, ఫిబ్రవరి 2022, శనివారం

దమయంతి -- హంస

మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన,  నలునికి హంస దొరకడం గురించి, ఆ హంస దమయంతికి అతని గురించి చెప్తాను అని చెప్పడం గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు దమయంతి గురించి తెలుసుకుందాం!
విదర్భరాజు భీముడు, అతని భార్య కు సంతానం లేదు. వారు దమనుడు అనే మహర్షికి అనేక సపర్యలు, సేవలు చేసి అతని అనుగ్రహాన్ని సంపాదించారు. అప్పుడు వారికి దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కుమారులు, దమయంతి అని ఒక కుమార్తె కలిగారు. ఆమె అపురూప సౌందర్యవతి, గుణశీలి. ఎలావేళలా ఆమెను కనిపెట్టుకుని ఉండడానికి అమె చుట్టూ అనేకమంది పరిచారికలు ఉండేవారు. వారు నలుని గురించి అనేక విషయములు చెప్తూ ఉండేవారు. వారి వద్ద నుండి నలుని ప్రసంశలు విన్న దమయంతి మనస్సులో నలునిపై ప్రేమ చిగురించింది. 
ఆ సమయంలోనే నలుని దగ్గరి నుండి వచ్చిన హంసల గుంపు ఆమె ఉన్న ఉద్యానవనమునకు వచ్చింది. ఆ హం స ల గుంపును చూసిన ఆమె చెలికత్తెలు వానిని పట్టుకోవాలని ప్రయత్నించసాగారు. అక్కడ జరుగుతున్న కోలాహలం వల్ల హంసలు అటూ ఇటూ పరుగులు పెడుతూ వారికి దొరకకుండా తప్పించుకోసాగాయి. కానీ నలునితో మాట్లాడిన హంస తనకు తానుగా వచ్చి దామయంతీదేవి కి దొరికిపోయింది. అంతేకాక ఆ హంస నలుని ప్రస్తావన తెచ్చి, ఈ భూమండలంమొత్తం మీద ఆమెకు భర్త కాగలిగిన సుందరుడు, రాఅజ కుమారుడూ కేవలం నలుడు మాత్రమే అని అనేక విధములుగా చెప్పింది. ముందే నలుని గురించి ఆలోచనలలో ఉన్న దమయంతికి ఇప్పుడు హంస కూడా అలాగే చెప్పడమ్ వల్ల ఆమె మరింతగా అతని ఆలోచనలలో మునిగిపోయింది. ఆమె చెలికత్తెల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆమె తండ్రి భీముడు ఆమెకు స్వయంవరాని ఏర్పాటు చేసాడు. 
మరి ఆమె తనకు నచ్చిన వరుడిని స్వయంవరంలో వరించిందా? ఆ స్వయంవరం ఎంత విచిత్రంగా జరిగింది? అనే విషయాలు తరువాతి టపాలలో చుద్దాం!

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నీచుల మనఃస్తత్వం

మనం ఇంతకు ముందు  భర్తృహరి సుభాషితాలలో కొన్ని చెప్పుకున్నాం! ఇప్పుడు మూర్ఖ పద్దతి లో మూర్ఖుడు తన వద్ద ఉన్న నీచమయిన దానిని చూసి తన పక్కన ఉన్న గొప్పవానిని ఎలా నిరాకరిస్తాడో చూద్దాం!

సంస్కృత శ్లోకం

క్రిమికులచితం లాలాక్లిన్నం విగన్థి జుగుప్సితం

నిరుపమరస ప్రీత్యా ఖాద న్ఖరాస్థినిరామిపం

సురపతిమపి శ్వా పార్శ్వస్థం విలోక్య నశఙ్కతే

నహి గణయతి క్షుద్రో జంతుః పరిగ్రహఫల్గుతాం

అర్ధంః

శ్వా = కుక్క, క్రిమి= పురుగుల, కుల= గుంపుచే, చితం= నిండిన, లాలా= లాలాజలంతో, క్లిన్నం = తడిచినది, నిండినది, విగంధి= చెడ్డవాసన కలది, జుగుప్సితం = అసహ్యం కలిగించునది, నిరామిషం= మాంసము లేనిది, ఖర= గాడిద, అస్థి = ఎముక, నిరుపమ= సమానమయినది ఏదీ లేని , రస= రుచి,  ప్రీత్యా= ఇష్టంతో, ఖాదత్= కొరుకుతూ, పార్శ్వస్థం= పక్కనే ఉన్న, సుర= దేవతల, పతిం= నాయకుడు, అపి = అయినను, విలోక్య = చూసినా, న శంకతే= సిగ్గు పడదు, క్షుద్రః = నీచమయిన, జంతుః= ప్రాణి, ప్రతిగ్రహ= తీసుకొన్న, ఫల్గుతాం= తక్కువ తనమును, న గణయతి హి = అస్సలు లెఖ్ఖ చేయదు కదా!

ఈ సంస్కృత శ్లోకమునకు చక్కని తెలుగు పద్యం

క్రిమిసముదాయసంకులము గేవల నింద్యము పూతిగంధ హే 

యమును నిరామిషంబును ఖ రాంగభవం బగునెమ్ము గుక్క దా 

నమలుచు జెంత నున్న సురనాధుని గన్గొని సిగ్గు జెందద 

ల్ప మని నిజస్వభావము దలంపదు నీచపు బ్రాణి యెయ్యెడన్ 

తాత్పర్యంః

కుక్క పురుగులు కలిగిన, నోటినుండి కారు లాలా జలంతో తడిసిన, కంపుకొట్టే, అసహ్యము కలిగించే, మాంసము లేని గాడిద ఎముకను చాలా ఇష్టముగా కొరుకుతూ , తన పక్కనే సాక్షాత్తు ఆ దేవేంద్రుడే వచ్చి నిలిచినా, అతనిని చూడడు, సిగ్గు పడదు. నీచమయిన ప్రాణులు తమకు దొరికిన వస్తువులు నిజంగా నీచమయినవా, గొప్పవా? అని అస్సలు లేఖ్ఖ చేయవు కదా!  

17, ఫిబ్రవరి 2022, గురువారం

విదుర నీతి - 7

  మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఆరు  భాగములు చెప్పుకున్నాం కదా! ఈ భాగంలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు. 

సంస్కృత శ్లోకం:

ఆత్మజ్ఞానం సమారంభస్తితిక్షా ధర్మనిత్యతా

యమర్థాన్నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

తనుదా నెఱుగుటయోరిమి, యునుబేదలకిడుట వేగ మొందమియునులే

నినరులు తగరీపదవికి, వినుజ్ఞానము లేమిదాని విధమెట్లన్నన్


భావం: ఆత్మజ్ఞానము, ప్రయత్నము, దుఃఖములను ఓర్చుకొనగలిగిన శక్తి, ధర్మానికే ఎల్లవేళలా కట్టుబడి ఉండడం అనేవి ఎవరికి తన మార్గంలో ఆటంకములు కావో వారినే పండితులు అంటారు.  

16, ఫిబ్రవరి 2022, బుధవారం

కుబేరుడు శివునితో స్నేహం

మనం ఇంతకు ముందు గుణనిధి గురించి, అతను దొంగగా మారుట,  అతనికి శివలోకం లభించిన విధానం, తరువాత అతను దమనుడు అనే రాజుగా జన్మించి జన రంజకంగా పరిపాలించిన సంగతి ,తరువాత అతను పులస్త్యుని వంశంలో విశ్రవసునికి కుమారునిగా జన్మించడం, అతనికి వైశ్రవణుడు అని పేరు పెట్టడం, అతను దిక్పాలకత్వం పొందడం,  ఆ తరువాత అతనే కుబేరునిగా మారడం గురించి కూడా తెలుసుకున్నాం! అయితే ఆ కుబేరుడు పరమ శివునికి మిత్రుడు అని చెప్తారు. అతనికి పరమ శివునికి స్నేహం ఎలా కుదిరింది?

పార్వతిదేవి శాపానికి గురి అయిన తరువాత కుబేరుడు పశ్చాత్తాపాన్ని పొందాడు. ఆ పశ్చాత్తాపంతో సుదీర్ఘకాలం మౌనవ్రతం చేసాడు. అతని మౌనవ్రతాన్ని చూసి ప్రసన్నుడయిన ప్రమ శివుడు కుబేరిని వద్దకు వచ్చి, అటువంటి కఠినమయిన వ్రతమును పూర్వకాలంలో తాను స్వయంగా చేసానని, మళ్ళీ ఇంతకాలం తరువాత కుబేరుడు చేసాడు కనుక అతనికి తనతో సమానంగా, అతని స్నేహితుని స్థానం ఇచ్చాడు. అంతేకాకుండా అతనికి ఏకాక్షి అని పింగళి అని పేరు ఇచ్చాడు. 

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

సూర్యుడు సంధ్యాదేవి కలయిక - అశ్వినీ దేవతలు

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి, ఆ నిజం తెలుసుకున్న సూర్యుడు తన ప్రభావాని తగ్గించుకుని తన భార్య వద్దకు బయలుదేరాడు అని, సూర్యుని నుండి తొలగించిన ప్రకాశాన్ని ఉపాయోగించి దేవశిల్పి విశ్వకర్మ దేవతలకు అనేకా రకములయిన ఆయుధాలను తయారు చేసాడు అని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు సూర్యుడు సంధ్యాదేవి వద్దకు ఎలా వెళ్ళాడు? అప్పుడు ఏమి జరిగింది అని తెలుసుకుందాం!

తన భార్య ఎక్కడ ఉన్నదో ముందే తెలుసుకున్న సూర్యుడు తన ప్రకాశాన్ని తగ్గించుకున్న తరువాత ఆమె వద్దకు ఉత్తరకురుదేశమునకు బయలుదేరాడు. ఆమె ఆడగుర్రం రూపంలో ఉన్నది కనుక అతనుకూడా మగ గుర్రం రూపాన్ని ధరించి అమె వద్దకు వెళ్ళాడు. అలా తన వద్దకు వచ్చిన భర్తతో అమె ఇద్దరు కుమారులను (కవల పిల్లలు) కన్నది. అయితే వారు గుర్రం రూపంలో ఉండగా వారికి సంతానం కలిగింది కనుక ఆ ఇద్దరిని అశ్వినులు అని పిలిచారు. వారే దేవవైద్యులుగా ప్రసిద్ది పొందారు. ఆ తరువాత సూర్యునికి, సంధ్యాదేవికి రేవతుడు అని ఒక కుమారుడు జన్మించాడు. అతను సకల శస్త్రాస్త్రకోవిదుడు. 

14, ఫిబ్రవరి 2022, సోమవారం

భారత సాహిత్యం - కొన్ని చిత్రమయిన ప్రక్రియలు

 భారతదేశంలో సాహిత్యానికి, సాంప్రదాయాలకు ఉన్న ప్రాముఖ్యత మనకు అందరికి చాలా బాగా తెలుసు. మన దేశంలోని అనేక బాషలలో మన పురాణ ఇతిహాసములు అనువదించబడినా అందరూ ముక్తకంఠంతో నమ్మే విషయం ఆ పురాణములు, ఇతిహాసములు మొదటగా చెప్పబడినది దేవ బాష అయిన సంస్కృతంలోనే. మన దేశంలో ఉన్న అనేక  బాషలలో అనేక ప్రక్రియలపై ప్రయోగములు చేస్తూ, మన పండితులు కీర్తిని గడిస్తూ ఉండడం మనం చూశాం. ఇటీవలి కాలంలోనే మన తెలుగు బాషకు ప్రత్యెకమయిన అవధానంలో పేరెన్నిక గన్న శ్రీ గరికిపాటి నరసింహారావు గారిని పద్మశ్రీ వరించడం మనం చూశాం.  

అటువంటి సాహిత్య ప్రక్రియలు మనకు ఎన్నో ఉన్నాయి. వానిలో కొన్ని

  1. అనులోమ విలోమ కావ్యములు - ఇటువంటి కావ్యములలో ఒక శ్లోకమును ముందు నుండి చివరి వరకు చదివితే ఒక అర్ధం వస్తుంది, చివరి నుండి మొదటికి చదివితే మరొక అర్ధం వస్తుంది. ఇటు వంటి కావ్యములకు ఉదాహరణగా రాఘవయాదవీయం చెప్తారు. 
  2. ద్వర్ధి కావ్యములు- ఇటువంటి కావ్యములలోఒక శ్లోకమునకు రెండు రకముల అర్ధము చెప్తూ, ఆ రెండు అర్ధములతో రెండు విభిన్నములయిన కధలను చెప్పడం.  ఇటు వంటి కావ్యములకు ఉదాహరణగా హరిశ్చంద్రనలోపాఖ్యానం, రాఘవపాండవీయం చెప్తారు. 
  3. ఏకాక్షరి శ్లోకములు ః ఒక శ్లోకములో, లేదా పద్యములో ఒకేఒక్క అక్షరం మాత్రం ఉపయోగించి చెప్పవలసిన అర్ధం వచ్చేవిధంగా చెప్తారు. ఇటువంటి శ్లోకములు మనం త్వరలోనే చూద్దాం!
  4. కేవలం రెండు అక్షరములు మాత్రం ఉపయోగించి చెప్పవలసిన అర్ధం వచ్చేవిధంగా చెప్తారు. ఇటువంటి శ్లోకములు కూడా మనం త్వరలోనే చూద్దాం!
సాహిత్యంలో ఇవి కొన్ని ప్రక్రియలు మాత్రమే. ఇంకా ఎన్నెన్నో ఉన్నయి. 

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

ఉన్నతులు దిగజారడం మొదలయితే....

 ఒక్కసారి పతనం అవ్వడం మొదలయితే అది ఎక్కడివరకు వెళుతుందో చెప్పే శ్లోకం. ఈ శ్లోకం మన ప్రవచన కర్తలు  చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు మనం సంస్కృత శ్లోకాన్ని, దానికి చెందిన తెలుగు అనువాద పద్యమును చూద్దాం!

సంస్కృత శ్లోకం

శిరశ్శార్వం స్వర్గాత్పశుపతిశిరస్తః క్షితిధరం

మహీధృదుత్తుఙ్గాదవనియవనేశ్చాపి జలధిమ్

అధో గఙ్గా నేయం పదముపగతా స్తోక మధవా

వివేకభ్రష్టానాం భవతి వినిపాతః సతముఖః

అర్ధంః 

సా ఇయం గంగా= ఎంతో ప్రముఖ్యత కలిగిన గంగా నది, స్వర్గాత్= స్వర్గము నుండి, శార్వం = శివుని, శిరః= శిరస్సు, పశుపతి శిరస్తః =శివుని శిరస్సు నుండి, క్షితిధరం = హిమాలయ పర్వతమును, ఉత్తుంగాత్= ఎత్తయిన, మహిధ్రాత్= ఆ కొండ నుండి, అవనిం= భూమిని, అవనేః చ అపి, భూమి నుండియు, జలధిం= సముద్రమును,అధః = క్రింద, పాతాళమునకు, స్తోకం = కొంచెం, పదం = చోటును, ఉపగతా = పొందినది, అధవా = అలా కాక. వివేక భ్రష్టానాం= తెలివి మాలిన వారికి, శతముఖః= నూఱుత్రోవలుగల, వినిపాతః = అధోగతి, భవతి= కలుగుతున్నది.


అదే శ్లోకమునకు తెలుగు పధ్యంః

ఆకాశంబుననుండి శంభునిశిరం బందుండి శీతాద్రి సు

శ్లోకంబైనహిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య

స్తోకాంభోధి బయోధినుండి పవనాం ధోలోకముం జేరె గం

గా కూలంకష పెక్కు భంగులు వివేక భ్రష్టసంపాతముల్


తాత్పర్యంః

గంగానది మొదట ఆకాశము నుండి ఈశ్వరుని తలపైనికి, అక్కడి నుండి హిమాచల పర్వతము మీదికి, ఆ పర్వతము మీది నుండి భూమి మీదకు, అక్కడి నుండి సముద్రములోనికి, అక్కడి నుండి పాతాళమునకు వచ్చినది. గొప్ప స్థితిలో నుండి జారిన వారికి అనేక రకములయిన కష్టములు కలుగుతాయి.


12, ఫిబ్రవరి 2022, శనివారం

విదుర నీతి - 6

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఐదు  భాగములు చెప్పుకున్నాం కదా! ఐదవ భాగంలో విదురుడు ధర్మారాజు గుణములను వివరించాడు. ఇప్పుడు అతను తమ రాజ్యంలో పరిస్థితిని వివరిస్తున్నాడు. 

సంస్కృత శ్లోకం:

దుర్యోధనే సౌబలే చ కర్ణే దుఃశాసనే తథా

ఏతేష్వైశ్వర్యమాధాయ కథం త్వం భూతిమిచ్ఛసి


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః

శకునిరాధాత్మజాత దుశ్శాసనాగ్ర, జాతుదుర్యోధనాది శీర్షంబులందు

రాజ్యమిడిసిరిగోర గౌరవమహీశ తలచితివి కాని చెల్లదధర్మలగుట


భావం: దుర్యోధనుడు, సౌబల రాజయిన శకుని, కర్ణుడు, దుశ్శాసనులపై రాజ్యభారమును ఉంచి, ఇంకా మంచి జరగాలని నీవు ఏవిధంగా అనుకొంటున్నావు?

విశ్లేషణః

ఇంతకుముందు భాగంలో విదురుడు ధర్మరాజు మంచితనం, ఉదారత, అతను పెదతండ్రి స్థానంలో ఉన్న దృతరాష్టునికి ఇచ్చే గౌరవం, అటువంటి ధర్మరాజును దృతరాష్టుడు వివక్షతతో చూడడం చెప్పి, ఇక్కడ అతను ఎవరికోసం అలా చేస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడు స్వభావరిత్యా ఎలాంటి వాడయినా అతని చుట్టూ ఉన్నవారు అతనిని మంచి మార్గంలో నడిపేవారు కాదు. అతని మీద శకుని దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్ణుని చూసుకుని అతని అహంకారం మరింత పెరుగుతూ ఉంటుంది. ఇక తమ్ముడయిన దుశ్శాసనుడు అన్నగారు ఏమి చెప్తే అది తప్పకుండా పాటిస్తాడు. ఇలా అతని చుట్టూ ఉన్న ఈ ముగ్గురివల్ల అతని పొగరు, అహంకారం మరింత గా పెరుగుతూ ఉన్నప్పుడు, వీరి సంరక్షణలో రాజ్యం సుఖంగా ఉండే అవకాశం లేదు.  

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

దేవశిల్పి - దేవతల ఆయుధాలు

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, యమునికి చాయాదేవి ఇచ్చిన శాపం గురించి, ఆ శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి, ఆ నిజం తెలుసుకున్న సూర్యుడు తన ప్రభావాని తగ్గించుకుని తన భార్య వద్దకు బయలుదేరాడు అని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

సూర్యుని నుండి తొలగించిన ప్రకాశాన్ని దేవశిల్పి విశ్వకర్మ కొన్ని విచిత్రమయిన శక్తివంతములయిన ఆయుధాలను, వాహనాలను తయారు చేయడానికి ఉపయోగించాడు. అలా తయారుచేయబడిన వస్తువులు

  1.  విష్ణుమూర్తి సుదర్శన చక్రం, 
  2. పరమశివుని త్రిశూలం, 
  3. కుమారస్వామి శక్తి ఆయుధం,
  4. యముని దండం
  5.  వసువులకు శంఖములు,
  6. అగ్నికి రధము,
  7.  కుబేరునికి పుష్పకము మరియు కొందరు దేవతల ఆయుధములు తయారుచేసెను. 
అంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రం, పరమశివుని త్రిశూలం కూడా సూర్యుని తగ్గించబడిన ప్రకాశంనుండి తయారు చేశారంటే సుదర్శన చక్రం, త్రిశూలంకి ఉన్న శక్తి అపరిమితం కాదా! మన పురాణాల ప్రకారం సుదర్శన చక్రం, త్రిశూలల శక్తి అపరిమితం, వానిని కేవలం విష్ణుమూర్తి , పరమశివులు మాత్రమే సంధించగలరు. మరి ఇక్కడ మనం నేర్చుకున్నదానికి, నిజానికి ఉన్నతేడాను ఎలా అర్ధం చేసుకోవాలి? తరువాతి టపాలలో చూద్దాం!

10, ఫిబ్రవరి 2022, గురువారం

నలుడు -- హంస

 మనం ఇంతకు ముందు షట్చక్రవర్తుల గురించి, కలి ప్రభావాన్ని తగ్గించుకునే శ్లోకాన్ని తెలుసుకున్నప్పుడు నలుని గురించిన ప్రస్తావన చూశాం! మరి ఆ నలుడు ఎవరు? అతనికి అంత ప్రాముఖ్యత ఎందుకు ఉన్నది? అని ఇప్పుడు తెలుసుకుందాం!

నిషాద రాజ్యమునకు రాజు వీరసేనుడు. అతని కుమారుడు నలుడు. నలునికి విదర్భ రాజ పుత్రిక అయిన దమయంతి గురించి అనేక విషయములు తెలుస్తూ ఉండుటవలన ఆమె అంటే అతనికి ప్రేమ కలిగింది. 
ఒకరోజు నలుడు తన ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అతనికి ఆకాశంలో తిరుగుతున్న హంసల గుంపు కనిపించింది. వానిని వెంబడిస్తూ వెళ్ళిన అతను ఒక హంసను పట్టుకున్నాడు. మిగిలిన హంసలు అక్కడి నుండి ఎగిరి పోయాయి కానీ ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. 
నలునికి పట్టుబడిన హంస అతని మనస్సులో ఉన్న దమయంతి పై ప్రేమను గమనించి, నలుడు ఇప్పుడు తనను వదిలితే తను వెళ్ళి దమయంతికి అతని గురించి గొప్పగా చెప్తానని మాట ఇచ్చింది. దమయంతి పేరు విన్న నలునికి తిరిగి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేకుండానే ఆ హంసను వదలి పెట్టాడు. ఆ తరువాత ఆ హంస నిజంగా దమయంతి దగ్గరకు వెళ్ళిందా లేదా? వెళితే ఏమి చెప్పింది? దమయంతికి నలుని పైన ప్రేమ కలిగిందా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

9, ఫిబ్రవరి 2022, బుధవారం

చ్యవన మహర్షి - నామకరణం

మనం ఇంతకుముందు చ్యవన మహర్షి సుకన్యను ఎలా వివాహం చేసుకున్నారు అని, అతనికి తిరిగి యవ్వనం ఎలా వఛింది అని తెలుసుకున్నాం కదా! ఇంతకీ ఈ చ్యవన మహర్షి ఎవరు? ఎవరి పుత్రుడు? అతనికి ఆపేరు ఎందుకు పెట్టారు అని ఇప్పుడు తెలుసు కుందాం!

పూర్వకాలంలో భృగువు అనే మమర్షి ఉండేవాడు. అతను అనేక యజ్ఞములు, యాగములు చేస్తూ ఉండేవాడు. ఆ యాగములను ఆపాలని దమనుడు అనే దైత్యుడు అనుకున్నాడు. ఒకరోజు సాయంకాల సమయం లో భృగువు అడవిలోనికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆశ్రమంలో కేవలం అతని గర్భవతి అయిన భార్య మాత్రమే ఉన్నది. ఆశ్రమం  లో ఎవ్వరూ కనిపించక ఆ దమనుడు ఋషి, అతని భార్య ఎక్కడ ఉన్నారు అని గద్దించి అడుగగా, భయపడిన ఆగ్నిదేవుడు అతనికి గర్భవతి అయిన ఋషిపత్ని ఉన్న వైపును తన జ్వాలలతో చూపాడు. అప్పుడు దమనుడు అ ఋషిపత్ని జుట్టు పట్టుకుని బయటకు లాక్కొని వచ్చాడు. 

అలా బయటకు లాగుకొని వస్తున్న సమయంలో ఆఅ మె గర్భం నుండి శిశువు బయటకు వచ్చాడు. అతను వచ్చీ రాగానే ఆ ప్రదేశమంతా ప్రకాశం నిండిపోయింది. ఆ బాలుడు తన తల్లిని బయటకు లాగుతున్న దమనుని కోపంగా చూడగానే అతను అక్కడికక్కడే భస్మం అయి పోయాడు. 

ఆ బాలుడు గర్భం నుండి చ్యుతుడు అయిన కారణంగా అతనికి చ్యవనుడు అని పేరు పెట్టారు.

8, ఫిబ్రవరి 2022, మంగళవారం

శ్రీకృష్ణదేవరాయలు - నమస్కారం


శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల గురించి మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా! తన ఆస్థానంలో కావులకు స్థానం కల్పించి వారిని పోషించుటే కాక శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆయన  ఆముక్తమాల్యద అనే ప్రబంధమును రచించారు. ఈ గ్ర్రంధము గోదాదేవి గురించిన కధను చెప్తుంది. ఆ ప్రబంధము మొదలుపెడుతూ శ్రీకృష్ణదేవరాయలు మొట్టమొదటగా చెప్పిన పధ్యం మనం ఇప్పుడు చెప్పుకుందాం!


శ్రీ కమనీయ హారామణిం జెన్నుగ దానును గౌస్తుభంబునం

దాకమలావధూటియు నుదారత దోప బరస్పరాత్మలం

దాకలితంబు లైన తమ యాకృతులచ్ఛత బైకి దోపన

స్తోకత నందు దోచె నన శోభిలు వేంకటభర్త గొల్చెదన్


అర్ధం ః

శ్రీ = లక్ష్మిదేవి, కమనీయ = అందమయిన, హార= హారమందలి, మణిన్‍= రత్నంలో, చెన్నుగ= గొప్పగా, తానును = తను, కౌస్తుభం = కౌస్తుభ మణి, నందు= లోపల, ఆ = ఆ, కమలావధూటియును = లక్ష్మీదేవియును, ఉదారత = గొప్పగా,తోపన్= ప్రతిబింభించగాఅ, పరస్పర = ఒకరికొకరు, ఆత్మలందు= హృదయము/ మసస్సులలో, ఆకలితంబులైన = ప్రేమగా నిలచి ఉన్న, తమ = తమ ఇద్దరి, ఆకృతులు = ఆకారములు, అచ్ఛతన్= శరీరముల స్వచ్ఛత చేత, పైకి తోపన్= పైకి కనిపిస్తూ ఉండగా, అస్తోకతన్= ఆధిక్యము వలన, అందున్= ఆ రత్నములందు, తోచె = కానవచ్చెను,  అనన్ = అన్నట్లుగా, శోభిలు = ప్రకాశిస్తున్న, వేంకటభర్తన్ = వేంకటేశ్వరస్వామిని, కొల్చెదన్= నమస్కరిస్తాను. 


తాత్పర్యంః

లక్ష్మీదేవియొక్క సుందరమయిన కంఠహారమందలి మణియందు వేంకటేశ్వరుడు, అతని కౌస్తుభమణిలోలక్ష్మీదేవి ప్రతిబింబించగా, పరస్పరము వారి మనస్సులందు ప్రేమాతిశయముచేత నిలచి ఉన్న తమ ఇద్దరి ఆకారములును శరీరము స్వచ్ఛముగా ఉండుట వలన బహిః ప్రకాశములై కనిపిస్తున్నశ్రీ వేంకటేశ్వరస్వామికి నమస్కరిస్తున్నాను. 


7, ఫిబ్రవరి 2022, సోమవారం

సంధ్య- ఛాయ- సూర్యుడు- విశ్వకర్మ

  మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ గురించి, యమునికి చాయాదేవి ఇచ్చిన శాపం గురించి, ఆ శాపమునకు సూర్యుడు చూపిన పరిష్కారం గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తన భార్య పిల్లలమీద వివక్ష చూపడానికి కారణం తెలుసుకోవడానికి సూర్యుడు తిన్నగా ఛాయాదేవి వద్దకు వెళ్ళి ఆమె పిల్లల మధ్య అలా ఎందుకు వివక్ష చూపుతోందో అని అడిగాడు. ఆమె సూర్యునికి సరి అయిన సమాధానం చెప్పలేక పోవాడాన్ని గమనించిన సూర్యునికి అమె పై అమితమైన కోపం వచ్చింది. అప్పుడు అతను ఆమెను శపిస్తానని అన్నాడు. సూర్యుని మాటలకు భయపడి, ఆమె సంధ్యాదేవికి ఇచ్చిన మాట ప్రకారం ప్రాణ సంకట సమయంలో నిజమును చెప్పవచ్చు అని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు తన ప్రాణములకు సంకటం ఉన్నది అని గమనించి ఆమె నిజాన్ని అతనికి తాను సంధ్యాదేవిని కానని, ఆమె తయారు చేసిన ఒక ఛాయను మాత్రమే అని, సంధ్యాదేవి చాలాకాలం క్రితమే తనను అక్కడ ఉంచి వెళ్ళిందనీ, సావర్ణి, శనైశ్చరుడు తన పిల్లలు అని చెప్పింది.  

ఛాయాదేవి చెప్పిన  విషయాలను విన్న సూర్యుడు సంధ్యాదేవి ఇంకా పుట్టింట్లోనే ఉన్నది అనే ఆలోచన వల్ల మామగారయిన దేవశిల్పి విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. సూర్యుడు చెప్పిన విషయాలను విన్నవిశ్వకర్మ, కొంతకాలం క్రితం  తన కుమార్తె తన వద్దకు వచ్చిందనీ,  వచ్చినప్పుడు ఆమె సుర్యుని వేడిని తాను భరించలేక పోతున్నందున అలా వచ్చినట్లు చెప్పిందని, ఆమెకు నచ్చజెప్పి ఆమెను తిరిగి పంపానని, ఆమె అప్పుడే తన వద్ద నుండి తిరిగి వెళ్ళి పోయిందని చెప్పాడు. అప్పుడు ఆమెకు ప్రియం కలిగించేలా సూర్యునికి అతని వేడిని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తానని  దేవశిల్పి విశ్వకర్మ చెప్పాడు. మామగారు చెప్పిన మాటలు విన్న సూర్యుడు  అతను చెప్పిన మాట ప్రకారం  ఒక భ్రమియంత్రంలో ప్రవేశించి అతని ప్రకాశమును 16వ వంతునకు తగ్గించుకున్నాడు.

ఆ తరువాత సూర్యుడు స్వయంగా తన దివ్య దృష్టి ద్వారా తన భార్య సంధ్యాదేవి ఎక్కడ ఉన్నదో తెలుసుకుని, ఆమె  వద్దకు వెళ్ళాడు. 

6, ఫిబ్రవరి 2022, ఆదివారం

నిజమయిన జ్ఞానం

మనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తామో, మనకు ఏమీ తెలియనప్పుడు అంతా తెలిసినట్లు ఎలా ప్రవర్తిస్తామో, వివరించి చెప్పే చక్కని సంస్కృత శ్లోకం, దానికి తగిన తెలుగు పద్యం ఇప్పుడు చూద్దాం! 

సంస్కృత శ్లోకం

యదా కించిత్ జ్ఞోహం గజ ఇవ మదాంధః సమభవం

తధా సర్వజ్ఞోస్మీత్యభవ దవలిప్తం మమ మనః

యదా కించిత్కించితిద్భుధజనసకాశాదవగతం

తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః

అర్ధంః

అహం = నేను, యదా= ఎప్పుడు, కొంచిద్ జ్ఞ= తక్కువ జ్ఞానం కలిగిన వాడు, గజఏవ= ఏనుగు వలే, మదఅంధ= గర్వము వల్ల కళ్ళు మూసుకుని పోయిన వాడు, సమభావం = ఉంటినో, తధా= అప్పుడు, సర్వజ్ఞ= అన్నీ తెలిసిన వాడు, అస్మిఇతి = అయితిని, మమ = నా యొక్క, మనః= మనస్సు, అవలిప్తం= గర్విం, అభవత్= కలిగినది, యదా= ఎప్పుడు, కించిత్ కించిత్ = కొంచెం కొంచెం, బుధ జన= పండితుల, సకాశాత్= దగ్గరి నుండి, అవగతం = తెలిసిన తదా=అప్పుడు, మూర్ఖ = మూర్ఖుడిని, అస్మిఇతి= అయ్యాను, జ్వర= జ్వరము, ఇవ = వలే, మే = నా, మదః= గర్వము, వ్యపగతః= పోయినది

ఈ సంస్కృత శ్లోకమునకు చక్కని తెలుగు పద్యం

తెలివి యొకింత లేనియెడదృప్తుడ నై కరిభంగి సర్వమున్

దెలిసితి నంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి యిప్పుడు

జ్జ్వలమతు లైనపండితుల సన్నిధినించుక భోధశాలి నై

తెలియనివాడనై మొలగితిం గతమయ్యె నీతాంతగర్వమున్

తాత్పర్యంః

నేను కొద్దిగా జ్ఞానం ఉన్నప్పుడు, మనస్సులో గర్వం కలిగి, కళ్ళు మూసుకుని పోయి, గజం వలే ఉన్నాను, తరువాత పండితుల సహచర్యం వల్ల, కొద్ది కొద్దిగా జ్ఞానం కలిగిన తరువాత, నిజంగా నేను ఎంత మూర్ఖుడినో తెలిసింది.  నా మనస్సులోని గర్వం ఒక జ్వరం లా విడిపోయింది. 

5, ఫిబ్రవరి 2022, శనివారం

విదుర నీతి- 5

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో నాలుగు భాగములు చెప్పుకున్నాం కదా! నాలుగవ భాగంలో దృతరాష్ట్రుడు చెప్పిన సమాధానం చూశాం కదా! ఇప్పుడు ఆ తరువాత విదురుడు చెప్పిన మాటలు తెలుసుకుందాం!


సంస్కృత శ్లోకం:

రాజా లక్షణసంపన్నస్త్రైలోక్యస్యాధిపో భవేత్

ప్రేష్యస్తే ప్రేషితశ్చైవ దృతరాష్ట్ర యుధిష్టిరః

విపరీత తరశ్చ త్వం భాగధేయే న సమ్మతః

అర్చిషాం ప్రక్షయాచ్ఛైవ ధర్మాత్మాధర్మకోవిదః

ఆనృశంస్యాదనుక్రోశాద్ధర్మాసత్యా త్పరాక్రమాత్

గురుత్వాత్త్వయి సంప్రేక్ష్య బహూన్ల్కేశాంస్థితిక్షతే


శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః 

అనవిదురుండుపల్కెసకలావనినాధుడు ధర్మకోవిదుం

డును శుభమూర్తి స్వచ్ఛయశుడు జితసత్యుడు ధర్మరాజుగా

నని నిను రాజ్యమూనుటకనర్హుని గా మదిదా నెఱింగిస

త్యనయదయానృశంస్యపరుడై భువినీకిడి గాసి నొందడే

భావం: దృతరాష్ట్రుడు చెప్పిన మాటలు విన్న విదురుడు "ఓ రాజా! ఎంతో గొప్ప లక్షణములు ఉన్న యుధిష్టరుడు సకల లోకములకు ప్రభువు కాగలిగిన వాడు, నీ మాటలను శ్రద్ధగా విని ఆచరించే వాడు. కానీ అతనిని నీవు అడవులకు పాంపావు. నీవు ధర్మం తెలిసిన వాడవు, కానీ కంటిచూపు లేని నీవు అతని విషయంలో నిజంగానే గుడ్డివానిలా ప్రవర్తించి, అతని రాజ్యమును తిరిగి ఇవ్వడానికి నిరాకరించావు. అజాతశత్రువయిన అతను దయ, ధర్మ,సత్య,పరాక్రమములు కలిగి ఉన్నప్పటికీ నీ పైన ఉన్న గౌరవ మర్యాదల కారంణం గా అన్నింటినీ భరిస్తున్నాడు "

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

యముని శాప పరిష్కారం

 మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి, ఛాయాదేవి సవతి ప్రేమ  గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి పరిణామాల గురించి తెలుసుకుందాం!

తల్లితో శపించబడిన యముడు, తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా వివరించాడు. యముడు చెప్పిన మాటలు విన్న వివస్వంతుడు / సూర్యుడు ఆలోచించాడు.  యమునికి సంధ్యాదేవి ఇచ్చిన శాపమును తప్పించే అవకాశం లేనందువలన సూర్యుడు ఆతనికి మధ్యేమార్గంగా ఒక వరం ఇచ్చాడు. అతని తల్లి ఇచ్చిన శాప కారాణంగా యముని కాలు  భూమిపై పడాలి, దానికి సూర్యుడు యముని కాలులోని మాంసమును క్రిములు తీసుకుని భూమిపైకి వెళతాయి అని, అలా జరగడం వలన అతని కాలులోని మాంసం భూమి పైకి వెళ్ళిన కారణంగా యమునికి పుర్తిగా శాప విమొచనం కూడా కలుగుతుంది అని చెప్పాడు. ఆ పరిష్కారం విన్న యముడు తన అవేశమును తగ్గించుకుని వెళ్ళిపోయాడు. 

ఒక తల్లి తన బిడ్డలందరినీ సమానంగా చూస్తుంది. కానీ తన భార్య ముందు పుట్టిన పిల్లలు, తరువాత పుట్టిన పిల్లల మధ్య భేదం ఎందుకు చూపుతోందో అర్ధం కాలేదు. ఆ విషయాన్ని తెలుసుకోవడనికి  సూర్యుడు తన భార్య వద్దకు బయలుదేరాడు. 

మరి తరువాత ఏం జరిగింది? నిజం బయటపడిందా, లేదా? తరువాతి టపాలలో చూద్దాం!

3, ఫిబ్రవరి 2022, గురువారం

మూర్ఖుడిని మాటలతో మార్చడం వీలవుతుందా!

మనం ఇంతకు  ముందు భర్తృహరి సుభాషితాలలో మూర్ఖపద్ధతి గురించి, మూర్ఖుని మనస్సు గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మరొక శ్లోకం చూద్దాం!

వ్యాళం బాలమృణాళితన్తుభింసౌ రోద్ధుం సముజ్జృమ్భ తే

భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమప్రాంతేన నన్నవ్యాతి

మాధుర్యం మధుబింధునా రచయితుం క్షారాంభుధే రిహతే

మూర్ఖాన్యః ప్రతినేతుమిచ్ఛతి బలాత్సుక్తైః సుధాస్యందిభిః

అర్ధం ః  వ్యాళం = మదపుటేనుగును, బాలమృణాలతంతుభిః =లేత తామర తూటిలోని దారములతో,రోద్ధుం =కట్టుటకు, సముజ్జృంభతే = ప్రయత్నించును,భేత్తుం = పగులగొట్టుట/ కోయుట,వజ్ర మణిం= రత్నములలో శ్రేష్టమయిన వజ్రమును, శిరీష కుసుమ = దిరిసెనపువ్వు యొక్క, ప్రాంతేన = అంచుతో, సన్నహ్యతి = పూనుకొనుట,మాధుర్యం = తియ్యదనం,మధు = తేనె, బింధునా= చుక్కతో,  రచయితుం = చేయుటకు,క్షారాంబుధేః =ఉప్పు సముద్రమునకు,  ఈహతే = ప్రయత్నిస్తాడో, మూర్ఖాన్= మూర్ఖులను, బలాత్= బలవంతంగా. ప్రతినేతుం = మార్చాలని, ఇచ్ఛతి = అనుకుంటాడో, అసౌ= అతడు,  యః = ఎవడు, సుధాస్యందిభి = తీయ్యని, సూక్తిభిః = మంచి మాటల చేత, 

తాత్పర్యంః

మదపుటేనుగులను తామరతూటిదారముతో బందించాలని అనుకునే వాడు, దిరిసెనపువ్వుకొన చేత వజ్రమును కోయాలని అనుకునే వాడు, సముద్రంలోగల ఉప్పు నీటిని తియ్యాగా మార్చాలని అనుకుని దానిలో ఒక్క తేనెచుక్కను వేసే వాడు, మూర్ఖుని మనస్సును మంచి మాటలతో మార్చాలని అనుకునే వాడు అందరూ సమానం. 


 ఇదే శ్లోకమునకు తెలుగు అనువాదం 

తెలుగు అనువాదం

కరిరాజు బిసతంతుసంతతులచే గట్టన్ విజృంభించువా

డురువజ్రంబు శిరీషపుష్పములచే నూహించు భేదింపదీ

పురచింపన్ లవణాబ్ధిన్ మధుకణంబుం జిందు యత్నించు ని

ద్ధరణిన్ మూర్ఖులు దెల్ప నెవ్వడు సుధాధారనుకారోక్తులన్

2, ఫిబ్రవరి 2022, బుధవారం

విదుర నీతి - 4

 మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో మూడు భాగములు చెప్పుకున్నాం కదా! మూడవ భాగంలో విదురుడు దృతరాష్టృని అదిగిన ప్రశ్నల గురించి తెలుసుకున్నాం! ఇప్పుడు ఆ ప్రశ్నలకు దృతరాష్టృడు సమాధానం ఇచ్చాడా లేదా? అని తెలుసుకుందాం!

సంస్కృత శ్లోకం:

శ్రోతుమిచ్ఛామి తే ధర్మ్యం పరం నైఃశ్రేయసం వచః

అస్మిన్రాజర్షివంశే హి త్వమేకః ప్రాజ్ఞసంమతః

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః 

అనవిని ధృతరాష్టృండనె, విను కౌంతేయాగృజోక్తివినకునికంజిం

తనుజెంది ధర్మమునీ,లిని రాజర్షికులవర్య తెలియంజెపుమా

భావంః

విదురుని మాటలు విన్న దృతరాష్టృడు, కౌంతేయ పుత్రులలో పెద్దవాడయిన ధర్మరాజు మాటలు (సమాధానం) సంజయుడు చెప్పనందువల్ల కలిగిన ఆలోచన కారణంగా, ఈ రాజర్షికులములో పుట్టిన నీ నోటి నుండి ధర్మబద్దమయిన గొప్ప  శుభములను కలిగించే మాటలను వినాలి అనుకుంటున్నాను. 

విశ్లేషణః

ఇక్కడ దృతరాష్టృడు విదురునికి సమాధానం ఇచ్చాడా లేదా? అబద్దం అయితే చెప్పలేదు. అలాగని నిజము పూర్తిగా చెప్పలేదు. ఈ సందర్భంలో మనకు దృతరాష్టృని లౌక్యం తెలుస్తుంది. అతనికి  మంచి చెడుల మద్య వ్యత్యాసం బాగా తెలుసు. కానీ ఆమాటలు బయట పెట్టని లౌక్యం ఉంది. మంచి మాటలు వినాలని ఉంది తప్ప ఆ మాటలలోని మంచిని స్వీకరించే మనస్తత్వం మాత్రం లేదు.