16, నవంబర్ 2014, ఆదివారం

భృగువు - ఖ్యాతి

భృగువు నవ బ్రహ్మలలో ఒకడు ఇతని భార్య ఖ్యాతి, దేవహుతి, కర్దమ ప్రజాపతిల పుత్రిక. వీరికి ఒక కుమార్తె  ఉన్నది. ఆమే భార్గవి.  ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారు. వారు
  1. దాత 
  2. విధాత 
పుత్రులు ఇద్దరూ మేరు పర్వత పుత్రికలను వివాహం చేసుకున్నారు. 
  1. దాత భార్య యాయతి: వీరి పుత్రుడు మృకండుడు, మృకండుని పుత్రుడే మార్కండేయుడు 
  2. విధాత భార్య నియతి: వీరి పుత్రుడు మహర్షి వేదశిరుడు
భృగు మహర్షి కి ఉశన అనే మరో భార్య యందు ఉశనసుడు (శుక్రుడు) జన్మించాడు.  

4, నవంబర్ 2014, మంగళవారం

మలేషియా నన్ను ఏడిపించింది!

నేను ఇలా చెప్పటం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. మలేషియా నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలను ఇచ్చినది. కానీ చివరిగా అది మిగిల్చిన విషాదం? ఇందులో మలేషియా ఏమి చేసింది పాపం!!
ఏమిలేదు. మా పాప తొలి అడుగులు నేర్చింది, తొలిపలుకులు పలికినది మలేషియాలోనే. మరి ఆ మంచి జ్ఞాపకములకు మలేషియాని మెచ్చుకున్నపుడు ఇప్పుడు నాకు జరిగిన నష్టం కూడా మలేషియానే భాద్యత తీసుకోవాలి కదా!
మా అందరి జీవితములకు ఆధారమైన మా తండ్రిగారు, మమ్ములను వదలి, వారి ప్రయాణం వారి స్వంత మార్గంలో కొనసాగిస్తూ వెళ్ళిపోయారు. ఈ విషయం నేను మలేషియాలో ఉండగానే తెలిసినది. అత్యంత శోకంతో అక్కడి నుండి బయలుదేరిన నాకు, మలేషియా కన్నీటితో వీడ్కోలు చెప్పింది. తన సంతాపం తెలియ చేసింది. కానీ మా తండ్రి గారి పార్ధివ దేహం మాకోసం దాదాపుగా 34 గంటలు వేచి ఉన్నది. నాకు నచ్చలేదు.
నేను మలేషియా లో ఉండటం వల్లనే కదా మా తండ్రిగారికి ఈ అవస్థ. అందుకే నాకు మలేషియా నచ్చలేదు. నాకు వేడ్కోలు చెప్తూ తను ఏడుస్తూ నన్ను కూడా ఏడిపించింది.

మరొక టపా ఎప్పటికి రాయగలనో తెలియదు. కనుక మా ఈ మౌనాన్ని అన్యధా భావించకండి.

అశ్రు నయనములతో
దీపిక

31, అక్టోబర్ 2014, శుక్రవారం

పులహుడు- గతి

పులహుడు నవబ్రహ్మలలో ఒకడు. ఇతని భార్య గతి. ఈమె కర్ధమప్రజాపతి, దేవహుతి ల పుత్రిక. వీరికి ముగ్గురు మగ పిల్లలు కలిగారు. వారు
  1. కర్మశ్రేష్టుడు 
  2. వరీయాంసుడు 
  3. సహిష్ణుడు 

పులస్త్యుడు - హవిర్భవు

పులస్త్యుడు నవబ్రహ్మలలో ఒకడు. ఇతని భార్య హవిర్భవు. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహుతిల పుత్రిక.
వీరికి ఇద్దరు పుత్రులు ఉన్నారు.

  1. అగస్త్యుడు: ఇతను అమితమైన తపఃసంపన్నుడు. మరొక జన్మలో ఇతనే జఠరాగ్ని గా జన్మించాడని చెప్తారు. 
  2. విశ్రవసుడు: ఇతను కూడా తపః సంపన్నుడే. ఇతనికి ఇలబిల అనే భార్య యందు కుబేరుడు కలిగాడు. మరొక భార్య అయిన కైకసి యందు  
  • రావణుడు 
  • కుంభకర్ణుడు 
  • విభీషణుడు 
జన్మించారు. 




30, అక్టోబర్ 2014, గురువారం

శ్రద్ధ - అంగీరసుడు

అంగిరసుడు నవ బ్రహ్మలలో ఒకడు. ఇతనికి శ్రద్ధ అనే దేవహుతి కర్దమ ప్రజాపతుల పుత్రికన్ను ఇచ్చి వివాహం చేసారు. వీరిద్దరికీ నలుగురు అత్యంత సౌందర్యవంతులైన పుత్రికలు కలిగారు.
వారు

  1. సినీవాలి : పూర్తి అమావాస్య కాకుండా ఆనాటి ఉదయం తూర్పున చంద్రరేఖ కనిపించే అమావాస్య. 
  2. కుహూ : పూర్తి అమావాస్య అయి, అంతకు ముందు ఉదయం కూడా చంద్రరేఖ కనిపించని అమావాస్య
  3. రాక :సంపూర్ణ కళలు కలిగిన చంద్రుడు ఉండే పౌర్ణమి 
  4. అనుమతి : పౌర్ణమి అయి ఉండి కూడా ఒక కళ తక్కువ ఉన్న చంద్రుడు ఉండే పౌర్ణమి. 
తరువాతి కాలంలో పుత్రుని కొరకు తపస్సు చేయగా వారికి ఇద్దరు పుత్రులు కలిగారు. వారు 
  1. ఉచధ్యుడు : సర్వశక్తి వంతుడు 
  2. బృహస్పతి : దేవ గురువు 

29, అక్టోబర్ 2014, బుధవారం

నలకూబర, మణిగ్రీవులు- నారద శాపం

నలకూబర, మణిగ్రీవులు మహాదేవుని మిత్రుడయిన కుబేరుని పుత్రులు. వారి తండ్రికి కలిగిన ధనం వలన, తమతండ్రి మహాదేవుని మిత్రుడు అనే భావం వలన వారికి గర్వం అతిశయించినది. ఒకనాటి సమయమందు వారిద్దరూ తమ తమ ప్రియురాళ్ళతో కలిసి, గంగానదిలో వివస్త్రులై  జల క్రీడలు ఆడుతూ తమను తాము మరచిపోయారు. అటువంటి సమయంలో నారద మహర్షి అటు వైపుగా రావటం చూసిన స్త్రీలు వెంటనే సిగ్గుతోవెళ్లి తక్షణం బట్టలు ధరించి చేతులు జోడించి, నారదునకు నమస్కారం చేసారు.
కానీ మధ్యంమత్తు కారణంగా నలకూబర, మణిగ్రీవులు తమ శరీరము మీద స్పృహ లేకుండా ఉన్నారు. తమ శరీరం వివస్త్రంగా ఉన్నది అనే విషయంకూడా మరచి నారదునికి అలాగే నమస్కరించారు. అప్పుడు నారదుడు వారిని 100 దివ్య సంవత్సరముల పాటు భూలోకంలో మద్ది వృక్షములుగా ఉండమని శపించారు.
source: internet
అప్పుడు వారు తమ తప్పును గ్రహించి శాప విమోచనం చెప్పమని కోరగా బాల కృష్ణుని పాదముల స్పర్శ ఏనాడు వీరికి కలుగుతుందో నాడు వీరి నిజరూపం తిరిగి పొందగలరు అని, కారణంగా సర్వలోకములయందు మిక్కిలి కీర్తి గడించగలరు. అని చెప్పి నారద మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు.

విశ్లేషణ:
యౌవ్వనం, ధన సంపత్తిః ప్రభుత్వం అవివేకితా 
ఏకైకమాప్యనర్దాయ, కిము యత్ర చతుష్టయం
ఇది కాదంబరిలోని ఒక ముఖ్యమైన శ్లోకం. దీని అర్ధం 
యౌవ్వనం, ధనం, అధికారం మరియు మూర్ఖత్వం నాలిగింటిలో ఒక్కటి ఉన్ననూ అత్యంత అనర్ధం కలుగుతుంది, కానీ నాలుగూ ఉన్నట్లయితే ఇక ఏమి చెప్పాలి అని
ఇక్కడ నలకూబర, మణిగ్రీవులకు పైన చెప్పిన నాలుగునకు తోడు తాగిన మధిర, ప్రక్కన మగువ కూడా ఉన్నారు. అందుకని వారికి ఏమి చేస్తున్నామో కూడా తెలియలేదు
 ఇక్కడ వ్యాస భగవానుని రచనా విశిష్టత గురించి చెప్పుకోవాలి. నారదుడు సమయమునకు అక్కడకు ఎందుకు వచ్చాడు అనే దానికి "యదృచ్ఛయా" అని వాడారు. అంటే దైవ ఘటన చేత ప్రేరేపించబడిన వాడు అని వైదికమైన అర్ధం చెప్తారు
నలకూబర, మణిగ్రీవులు తనను అవమానించారు అనే దానికంటే వారికి హితమును తెలియచెప్పాలి అని నారద మునీంద్రుడు భావించాడు. కనుక వ్యాసులవారు సమయమందు "అనుగ్రహార్థాయ శాపం దాస్యన్న్ ఇదం జగౌ" అని చెప్పారు. అంటే వారిమీది అనుగ్రహం వలన వారికి శాపం ఇచ్చారు కానీ కోపంతో కాదు. ఈ సందర్భంలో పోతన భాగవతంలో మరింత అందంగా చెప్పారు. మనం ప్రాస్తుతం వాడుతున్న పదజాలం చక్కగా మొదట ప్రయోగించినది పోతనగారే అని ఈ పద్యం చదివిన తరువాత మనకు అనిపించక మానదు. 

కలవాని సుతులమనుచు 
గలకంఠులతోడగూడి కానరు పరులం 
గలలొనైనను వీరికి 
గల క్రోవ్వడగించి బుధులగలపుట యొప్పున్. 
కనుక వారికి గల క్రొవ్వును(పొగరు/అతిశయించిన గర్వం) తీసేసి/ తొలగించి వారిని మంచివారిలో కలుపుట అవసరం అని భావించి శపించారు. కనుకనే బాలకృష్ణుని పాద స్పర్శ కలుగగానే  సర్వలోకములందు కీర్తి కలవారు అవుతారు అని చెప్పారు. 

28, అక్టోబర్ 2014, మంగళవారం

తామస మనువు జననం- విశ్లేషణ

తామస మనువు జననం- విశ్లేషణ

ఈ ఘట్టం లో విశ్లేషించవలసిన అంశం నా మనస్సునకు తట్టినది ఒక్కటే ఉన్నది. అది ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యం కలిగి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్న ఒక తపస్వి మనస్సుని ఒక లేడి వంటి జంతువు కదిలించటం.
ఇటువంటి విషయములు ప్రస్తావనకు వచ్చినప్పుడు మన హిందూ ధర్మ శాస్త్రముల మీద మనకే కొంచెం అపనమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది. దానికి కారణం మనం ఆ విషయమును గురించి తప్ప అందులోని సూక్ష్మ అర్ధమును గ్రహించే ప్రయత్నం చేయలేకపోవుట.
లెక్కకు మించిన ఆయుష్షు కలిగిన సురాష్ట్రుడు, తన భార్యలు, ప్రజలు, మంత్రులుతన ముందే చనిపోవటం చూసాడు కనుక అతనికి వైరాగ్యం కలిగినది. అందుకని అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేయనారంభించాడు. అదికూడా ఘోరమయిన తపస్సు. ఐతే ఇక్కడ ఒక విషయం గమనించండి. అతను ఏమి కోరి తపస్సు చేస్తున్నాడు? ఏ విధమైన కోరికా లేదు. కేవలం భగవత్ సాక్షాత్కారం కోసం మాత్రమే! అతనికి దేహం మీద, దానివలన సంభవించే ఏ విధమైన భోగం మీద కోరిక లేదు కనుకనే తన రాజ్యమును వదలి తపస్సునకు వెళ్ళాడు.
ఇక వర్షం రావటం అనేది సృష్టిలో సహజం. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నపుడు, పంచాభుతాత్మకమైన శరీరం తనలో ప్రాణమును నిలుపుకోవాలనే చూస్తుంది కనుక ఆధారం కోసం చేతులు వెతికాయి. అప్పుడు తనకు దొరికిన ఒక లేడి ని పట్టుకోవలసి వచ్చినది.
ఇక్కడ ఒక విషయం గమనించండి. అతని చేతికి ఒక లేడి దొరికింది. అంటే అది కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుని పొతూ ఉంది. నాకు తెలిసి లేడి కంటే మానవుని శరీరం నీటిలో ఈదే సామర్ధ్యం కలిగి ఉంటుంది. కనుక తన చేతికి దొరికిన ఆ లేడి ప్రాణములను కాపాడాలన్న దృఢ నిశ్చయం ఆ తపస్వికి కలిగి, ఒడ్డునకు చేరే, లేడిని చేర్చే ప్రయత్నం చేసి ఉండాలి. అలా ఒడ్డుకు చేరిన తరువాత, లేడి తన ప్రాణములను కాపాడినందుకు అతనిపై కృతజ్ఞతా భావం ఉంచుకొనుట సహజం.
అలా కాకుండా ఆ తపస్వి మనస్సు ఆ లేడి వలన కదలటం విచిత్రం. తపస్వి అనేవాడు తన మనస్సును నిగ్రహించే సామర్ధ్యం కలిగి ఉంటాడు. అప్పటికి చాలా కాలం నుండి అతను తపస్సులో ఉన్నాడు కనుక అతని మనస్సును నియంత్రించటం అతనికి తెలుసు. కానీ అతని మనస్సు కదిలినది. దానికి కారణం తనకు తెలిసి ఉన్నదేమో అని తనని తను పరిశీలించుకుని ఉండాలి. కానీ అటువంటిది ఏమి అతని తపొదృష్టికి అందలేదు. కనుక ఈ విధంగా తన మనస్సు చలించుటకు కారణం ఆ లేడికి తప్పని సరిగా తెలిసి ఉండాలి.
తనకు తెలిసిన గతజన్మ గురించి చెప్పిన సంగతులను విన్న సురాష్ట్రుడు ఆమెను మానవ కన్యగా అయ్యే అవకాసం కలిగించాడు. ఆమెతో రాజ్యమునకు వెళ్లి, రాజ్య భోగములను అనుభవించాడు.

  1. ఒక తపస్వి ఇలా ఎందుకు చేసాడు ?

తపస్వి అంటే తనగురించి కాక ఈ లోకం, ప్రజల గురించి ఆలోచించే వాడు. ఆమె తన గత జన్మ గురించి చెప్తున్న సమయంలో ఆమె చెప్పిన ఒక విశేషం అతనిని ఈ విధంగా రాజ్యమునకు తిరిగి వచ్చేందుకు ప్రోత్సహించి ఉండాలి.
అది వారికి ఒక మనువు పుట్టబోతున్నాడు అని.
మనువు అంటే అత్యంత గొప్పదయిన భాద్యత. అటువంటి భాద్యతలను గ్రహించబోయే వాడు తపోధనుడయిన తనకు, విజ్ఞానవతి అయిన ఉత్పలమాలకు జన్మించటం సరి ఐనదే అని అతను భావించి, అటువంటి మనువు అరణ్యములలో ఉండే కంటే, ఒక రాకుమారునిగా పుట్టి, అలాగే విద్యాభ్యాసం చేసుకుంటే, అతనికి, అతను పరిపాలించబోయే ప్రజలకు మేలు జరుగుతుంది అని భావించి తిరిగి రాజ్యమునకు వచ్చి ఉండాలి.

నా మనస్సుకు తట్టిన విశ్లేషణ ఇది. ఇంతకంటే గొప్పగా, ఏ పండితులవారయిన చెప్పగలిగితే, వారి పాదములకు నమస్కరించి, దానిని తిరిగి మీ అందరికి తెలిపే ప్రయత్నం చేస్తాను.

27, అక్టోబర్ 2014, సోమవారం

తామస మనువు

పూర్వకాలమునందు సురాష్ట్రుడు అనే పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. అతని మంత్రి పేరు నరసింహశర్మ. సురాష్ట్రుడు ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు. యజ్ఞయాగాదులు చేస్తూ ప్రజలను తన కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవాడు. యుద్ధమునకు వెళితే అరివీర భయంకరుడుగా ఉంటూ, మహశూరుడుగా గుర్తించేవారు.
అతని మంత్రి అయిన నరసింహశర్మ అత్యంత రాజభక్తి కలిగి, అన్ని కార్యములలో రాజునకు కుడి భుజంలా, తలలో నాలుకలా ఉండేవాడు. ఇతనికి  అమితమైన రాజభక్తి వలన ప్రత్యక్ష పరమేశ్వరుడైన సూర్యుని గురించి తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు వరంకోరుకోమనగా, నరసింహశర్మ తమ రాజయిన సురాష్ట్రుని మీది భక్తి, ప్రేమ వలన అతనికి అమితమైన ఆయుష్షు ఇవ్వమని కోరాడు. సూర్యుడు తధాస్తు అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు.
నరసింహశర్మ తమ రాజ్యమునకు తిరిగి వచ్చి రాజునకు జరిగిన సంగతి, అతనికి తాను సంపాదించి పెట్టిన వరమును గురించి చెప్పెను. అప్పటినుండి సురాష్ట్రుడు మరింత ధర్మబద్దంగా పరిపాలన చేయసాగాడు. ఐతే అమితమైన ఆయుష్షు ఇతనికి మాత్రమే ఉన్నది కానీ భార్యలకు, మంత్రులకు లేకపోవుట చేత వారంతా తన కన్నుల ముందరే కాల గర్భంలో కలిసిపోవుట చూసి అతనికి ఈ రాజ్యపాలనయందు విరక్తి కలిగినది. ఆ విరక్తి కారణంగా తన రాజ్యమును మంత్రిమండలికి అప్పగించి తను అడవికి వెళ్లి తపస్సు చేయనారంభించాడు.
మండు వేసవికాలంలో పంచాగ్నియందు (నాలుగు వైపులా అగ్ని కుండలు, కన్నులతో అగ్నికుండం వంటి సూర్యుని చూస్తూ) ఘోరమైన తపస్సు చేసాడు. వర్షాకాలంలో ఆకాశం క్రింద, చలికాలంలో కంఠంవరకు నీటిలో మునిగి ఘోరమైన తపస్సు చేసాడు.
కొంతకాలం అలా తపస్సులో గడచిపోయినది. తరువాత వర్షాకాలం వచ్చినది. ఆకాశం, నేల కలసిపోయే విధంగా అతి భయంకరమైన వర్షం ప్రారంభం అయినది. భూమి మొత్తం నీటితో నిండి, ప్రవహించసాగెను. సురాష్ట్రుడు కూడా ఆ నీటిలో కొట్టుకుని పోవుచుండగాఅతను ఆధారం కోసం ప్రయత్నించాడు. ఆ ప్రవాహంలో తనతోపాటు కొట్టుకు వస్తున్న ఒక లేడి ఆ రాజు చేతికి దొరికినది. అలా ఆ రాజు, లేడి కలిసి ఒక అడవికి చేరుకోగలిగారు. ఆ సమయంలో అత్యంత ఇంత తపోదనుడయిన ఆ సురాష్ట్రుని మనస్సు ఆ లేడి వలన కదిలినది. అది తనకే ఆశ్చర్యం కలిగించగా ఆ లేడిని స్వయంగా దీనికి కారణం ఏమిటి అని అడిగాడు.
దానికి బదులుగా ఆ లేడి తన గత జన్మ సంగతులు చెప్పి, ఆమె అతని మొదటి భార్య, ఉత్పలమాల అనే పేరు కల దానిని అని చెప్పినది.
ఆమె శాపవిమోచనం కలిగేందుకు రాజు సురాష్ట్రుడు ఆమెను కౌగలించుకున్నాడు.
ఆమె వెంటనే మానవ రూపమును పొందినది. ఆమెను ఉత్పలమాలగా గుర్తించి, ఆమెను తీసుకుని తమ రాజ్యమునకు తిరిగి వచ్చాడు. తన మంత్రులకు, రాజ్య ప్రజలకు జరిగిన సంగతి చెప్పి అందరి ముందు ఆమెను యధావిధిగా వివాహం చేసుకుని, సర్వభోగములను అనుభవించ సాగాడు.
కొంతకాలం తరువాత ఆ ఉత్పలమాల ఒక మంచి శుభ ముహూర్తమందు ఒక పుత్రునకు జన్మనిచ్చినది. ఆనందించిన సురాష్ట్రుడు తన రాజ్యం మొత్తం పుత్రొత్సవములను జరిపించాడు. కాలక్రమంలో ఆ పుత్రుని గారాబంగా పెంచుతూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి ఈ పుత్రుడే తామస మనువుగా ప్రసిద్ధి పొందుతాడు అని చెప్పినది. ఆ నాటి నుండి ఆ బాలుని అందరూ తామసుడు అని పిలిచేవారు.
తామసుడు అత్యంత చిన్నవయస్సులోనే అన్ని శాస్త్రములను అభ్యసించెను. తరువాత తామసునకు రాజ్యమును అప్పగించి సురాష్ట్రుడు, ఉత్పలమాల తపోవనమునకు వెళ్ళిపోయారు.
తామస మనువు జననం విశ్లేషణ ఇక్కడ చూడండి. 

ఉత్పలమాల - సురాష్ట్రుని మొదటి భార్య జన్మ వృత్తాంతం

ఉత్పలమాల సురాష్ట్రుని మొదటి భార్య. తమ అమాత్యుడు నరసింహశర్మ చేసిన తపస్సు ఫలితంగా సురాష్ట్రుడు అమితమైన ఆయుష్షు కలిగి ఉన్నాడు. కనుక కాల గమనంలో ఉత్పలమాల గతించి పోయినది.
మరు జన్మలో ధృఢధన్వుని వంశంలో జన్మించినది. కానీ ఆమెకు పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఒకనాటి సమయంలో తన చెలికత్తెలతో వనము నందు సంచరిస్తుండగా, ఒక మునికుమారుడు ఆమెను చూసి, ఆమె అందమునకు వశుడయ్యి, తనను వివాహం చేసుకోమని కోరాడు.
ఆమెకు పూర్వజన్మ గుర్తు ఉన్న కారణంగా ఆమె మనస్సు నందు సురాష్ట్రుడు  ఉన్నాడు. కానీ ఆ విషయం బ్రాహ్మణకుమారునకు చెప్పనవసరం లేదని భావించి, " ఓ బ్రాహ్మణోత్తమా! నేను ఒక రాజ కన్యను, నీవు ముని పుత్రునివి! కనుక నీవు నీకు తగినట్లుగా ఒక బ్రాహ్మణ కన్యను చూసి వివాహం చేసుకో!" అని చెప్పినది.
అలా మాట్లాడుతున్న రాకుమారి తనను అవమానించినది అని భావించిన ఆ ముని కుమారుడు ఆమెను లేడిగా తిరుగుము అని శపించాడు.
ఆ శాపము విని భయం కలిగిన రాకుమారి ఆ ముని కుమారుని క్షమాపణ కోరి, శాపవిమోచనం చెప్పమనగా, ఆ ముని కుమారుడు ఆమె లేడిగా తిరుగుతున్న సమయంలో, సంభవించిన అత్యంత భయకరమైన వర్షం కారణంగా నీటిలో కొట్టుకు పోయే సమయమందు, నీ పూర్వజన్మ భర్త (సురాష్ట్రుడు) నిన్నుఆధారంగా చేసుకుని ఈది, గట్టుకు వచ్చిన సమయంలో, నీకు పూర్వజన్మ స్మృతి  కలుగుతుంది. అప్పుడు ఆ రాజు నీ కంఠమును కౌగలించుకొనిన మరుక్షనణం నీకు మానవ రూపం తిరిగి లభిస్తుంది. అప్పుడు నీవు అతనిని వివాహం చేసుకుని, కొంతకాలమునకు అతని కారణంగా ఒక మనువు కు జన్మనిస్తావు అని శాపవిమోచనం చెప్పారు.
కాలాంతరంలో  మనకు గల 14 మంది మనువులలో నాలుగవ వాడయిన తామస మనువు వారికి జన్మించాడు.  

మరీచి - కళ

మరీచి బ్రహ్మ పుత్రుడు, నవ బ్రహ్మలలో ఒకడు. కళ దేవహుతి, కర్దమ ప్రజాపతుల పుత్రిక. వీరికి పుత్రుడు కశ్యపుడు, పుత్రిక పౌర్ణమి.
ఈ పౌర్ణమి అనే పుత్రిక మరుజన్మలో గంగాదేవిగా జన్మించినది.
కశ్యపుడు ఈ సమస్త సృష్టికి మూల కారణం అయినాడు. ఇతను 13 మంది దక్షుని పుత్రికలను వివాహం చేసుకున్నారు. 

26, అక్టోబర్ 2014, ఆదివారం

నవబ్రహ్మలు

నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులను తన శరీరం నుండి సృష్టించాడు. వారు
  1. బ్రొటన వేలి నుండి దక్షుడు 
  2. ఊరువులు (తొడలు) నుండి నారదుడు 
  3. నాభి నుండి పులహుడు 
  4. చెవుల నుండి పులస్త్యుడు  
  5. చర్మం నుండి భృగువు 
  6. చేతి నుండి క్రతువు 
  7. ముక్కు నుండి అంగిరసుడు 
  8. ప్ర్రాణం నుండి వసిష్ఠుడు 
  9. మనస్సు నుండి మరీచి 
  10. కన్నుల నుండి అత్రి 
ఈ పది మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి అగుట వలన తన సృష్టి కార్యంలో ప్రత్యక్షంగా తోడ్పడక పోయినందువలన, అతనిని తప్పించి మిగిలిన 9 మందిని నవబ్రహ్మలు అని అంటారు. వీరు 9 మంది దేవహుతి, కర్ధముల 9 మంది పుత్రికలను  వివాహం చేసుకుని బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో సహాయం చేసారు. 

ఏకాదశ నీలలోహిత రుద్రులు - భార్యలు - స్థానములు

బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలుపెట్టి, మొట్ట మొదట నలుగురు పుత్రులను సృష్టించాడు.

  1. సనకుడు 
  2. సననందనుడు 
  3. సనత్కుమారుడు 
  4. సనత్ సుజాతుడు 
వారిని సృష్టి కార్యం సహాయం చేయమని చెప్పగా, వారు ఆ కార్యం చేయుటకు తమ అనంగీకారం తెలుపగా, బ్రహ్మదేవునికి కోపం వచ్చినది. కానీ తనకు గల శక్తితో ఆ కోపమును నియంత్రించుకొనెను. కానీ ఆ కోపం బ్రహ్మదేవుని నొసటి భాగం నుండి ఒక పుత్రుని రూపంలో బయటకు వచ్చాడు. క్రోధం కారణం గా జన్మించుట చేత, అతను నల్లగా ఉన్నాడు. పుట్టీ పుట్టగానే, ఏడ్చుట మొదలు పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అయిన బ్రహ్మదేవుడు అడుగగా, తన పేరు ఏంటి? తను ఎక్కడ ఉండాలి? అని అడిగాడు. పుట్టుకతోనే ఏడ్చాడు కనుక అతనికి రుద్రుడు అని పేరు పెట్టారు. నలుపు ఎరుపు కలిగిన రూపం కలిగి ఉన్నాడు కనుక నీలలోహితుడు అని అన్నారు. 
  1. మన్యువు - ధీర - చంద్రుడు 
  2. మనువు - వృత్తి - సూర్యుడు 
  3. మహాకాలుడు - అశన - అగ్ని 
  4. మహశ్చివుడు - ఉమ - వాయువు 
  5. ఋతధ్వజుడు - నియతి - జలము 
  6. ఉరురేతుడు - సర్పి - ఆకాశము 
  7. భవుడు - ఇల - భూమి 
  8. కాలుడు - అంబిక - ప్రాణములు 
  9. వామదేవుడు - ఇరావతి - తపస్సు 
  10. ధృతవ్రతుడు - సుధ - హృదయం 
  11. నీలలోహితుడు - దీక్ష - ఇంద్రియములు 
తనకి పేర్లు, భార్యలు, నివాస స్థానములు నిర్ణయించిన మీదట, సృష్టి కార్యం చేయమని చెప్పగా, నీలలోహితుడు అలాగే చేసాడు. కానీ అతని వలన కలిగిన సంతానం తమోగుణం కలిగిన వారు అయినారు కనుక ఈ సృష్టికి విపత్తు ఏర్పడినది. అప్పుడు మరలా బ్ర్హమదేవుడు వారిని తపస్సు చేయమని అడిగారు. వారు అలాగే అని తపస్సు చేసారు. 

కర్దమ ప్రజాపతి - దేవహుతి

కర్దమ ప్రజాపతి కృతయుగంలో జన్మించారు. ఒకనాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ మహర్షిని తన సృష్టి కార్యంలో సహాయం చేయవలసినది అని అడిగారు. అప్పుడు కర్దమ ఋషి సరస్వతి నదీతీరంలో తపస్సు మొదలు పెట్టారు. అలా 10000 సంవత్సరముల పాటు తపస్సు చేసిన తరువాత ఒకరోజు శ్రీమహావిష్ణువు అతనికి దర్శనం  ఇచ్చారు. ఆ ఆనందంలో కర్దమ ఋషి  అనేక విధములుగా విష్ణుని పూజించి, కీర్తించి, అప్పుడు బ్రహ్మ తనముందు ఉంచిన భాద్యతను నిర్వర్తించుటకు ఒక అనుకూలవతి అయిన కన్య ఎక్కడ ఉంటుందో చెప్పవలసినది అని కోరారు.
అతని సేవలకు , తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ  కన్య స్వాయంభువ మనువు కు జన్మించిన దేవహుతి అని చెప్పి, మరునాటి సమయంలో వారే స్వయంగా కర్ధముని వద్దకు వచ్చి కన్యాదానం చేస్తారు అని చెప్పారు.
మరునాటి సమయంలో స్వాయంభువ మనువు తన భార్య, పుత్రికలతో కలసి కొంతసైన్యం తోడు రాగా కర్ధముని ఆశ్రమమునకు వచ్చారు. తన ఆశ్రమమునకు వచ్చిన అతిధులకు కర్దముడు అతిధి మర్యాదలు చేసి, వారి రాజ్యంగురించిన కుశల ప్రశ్నలు అడిగినమీదట స్వాయంభువ మనువు తను వచ్చిన కార్యం చెప్పారు. గుణ,శీల,జ్ఞాన వంతురాలయిన తన కుమార్తె దేవహుతికోరకు తను వరునికోసం వెతుకుతున్నందున, ఆమె ఒకసారి నారదముని వలన కర్ధముని గురించి విని ఉండుట చేత ఆమె కర్ధముని మనస్సునందే వరించిన కారణంగా, ఆమెను కర్ధమునికి ఇచ్చి వివాహం చేయాలి అనే సంకల్పంతో తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చారు అని.
ఆ మాటలు విన్న కర్దముడు అత్యంత లావణ్య రాశి అయిన దేవహుతిని వివాహం చేసుకొనుటకు తనకు సమ్మతమే కానీ ఒక షరతు ఉన్నది అని చెప్పాడు.
ఆమెకు ఎప్పటివరకు సంతానం కలుగకుండా ఉంటుందో అప్పటివరకు మాత్రమే ఆటను గృహస్థుగా ఉంటానని, పుత్రుడు కలిగిన మీదట అతను వానప్రస్థమునకు వెళ్ళేందుకు అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను అని.
స్వయంభువమనువు తన భార్య శతరూప వలన తన కుమార్తె దేవహుతి అభిప్రాయం తెలుసుకుని, సంతోషించి, వారికి శాస్త్రబద్దంగా వివాహం చేసారు.
అప్పటి నుండి  పరమశాంతంగా, వినమ్రతతో భక్తితో దేవహుతి భర్త సేవచేస్తూ ఉంది.  కొంతకాలము తరువాత చిక్కిపోయిన దేవహుతిని చూసి, ఆమె చేసిన ఈ తపస్సు ఆమె తనఃమనస్సులను పరిశుద్ధం చేసుకొన్నది. కనుక ఆమెకు సకల సౌక్యములను అనుభావింప చేయవలసిన సమయం ఆసన్నమైనది అని భావించి, అతని అద్వితీయమైన తపఃశక్తి వల్ల అనేక అనన్య సామాన్యమైన సౌక్యములతో కూడిన ఒక విమానమును సృష్టించి, ఆమెతో సంతోషంగా కాలం గడుపసాగాడు. కొంతకాలమునకు దేవహుతికి 9 మంది పుత్రికలు కలిగారు.
మరికొంతకాలం తరువాత కర్దముడు వానప్రస్తామునకు వెళ్ళబోతున్నాడు అని తెలుసుకుని, దేవహుతి అతని పాదములకు నమస్కరించి తమకు ఇంకా పుత్రుడు కలుగలేదు కనుక అతనిని అప్పుడే వెళ్ళుటకు ఆమె అభ్యంతరం తెలిపినది.
ఆ మాటలు విన్న కర్దముడు శ్రీ మహావిష్ణువును మనస్సు నందు తలచుకుని చిన్న చిరునవ్వు మొహంపై తొణికిసలాడగ, ఆమెను అనునయిస్తూ, ఆమె ఇప్పుడు గర్భవతి అని, ఆ భగవంతుడే స్వయంగా తమ పుత్రునిగా జన్మించబోతున్నారని, అతని దయవలననే దేవహుతికి సంఖ్యాయోగం వినగలుగుతుంది, ఆమె తరించ గలదు అని చెప్పి,  కర్దముడు వానప్రస్థమునకు వెళ్లి పోయారు.
కొంతకాలమునకు దేవహుతి కపిలునికి జన్మను ఇచ్చినది.
వారికి గల 9 మంది పుత్రికలను 9 మంది బ్రహ్మలకు ఇచ్చి వివాహం చేశారు. కుమార్తెలు, అల్లుడుల పేర్లు

  1. కళ - మరీచి  
  2. అనసూయ - అత్రి 
  3. ఊర్జ - వసిష్టుడు 
  4. శ్రద్ధ  - అంగిరసుడు 
  5. హవిర్భవు - పులస్త్యుడు 
  6. గతి - పులహుడు 
  7. క్రియ - క్రతువు 
  8. ఖ్యాతి - భృగువు 
  9. చిత్తి  - అదర్వుడు 

24, అక్టోబర్ 2014, శుక్రవారం

ఆకూతి వంశం

స్వయంభు మనువు కు గల ముగ్గురు పుత్రికలలో వారికి ఆకుతి అనే పుత్రిక యందు అమితమైన ప్రేమ కలిగి ఉండుట చేత ఆమెను రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసే సమయంలో వారికి జన్మించిన పుత్రుని తనకు వంశోభివృద్ధి కొరకు అడిగాడు. దానికి ఆకూతి, రుచి ప్రజాపతుల ఇద్దరి అంగీకారం తీసుకుని వారి వివాహం జరిపించాడు.
వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యజ్ఞుడు గా జన్మించాడు. స్వామివారిని విడచి ఎన్నటికీ ఉండలేని శ్రీమహాలక్ష్మి కూడా దక్షిణ గా జన్మించినది. ముందుగా స్వయంభువమనువుకు ఇచ్చిన మాట ప్రకారం రుచి, ఆకూతిలు యజ్ఞుని అతనికి ఇచ్చారు. కానీ దక్షిణని తామే పెంచారు. వారికి యుక్తవయస్సు రాగా వారికి వివాహం చేశారు.
యజ్ఞుడు, దక్షిణలకు 12 మంది పుత్రులు కలిగారు.
వారు
  1. తోషుడు 
  2. ప్రతోషుడు 
  3. సంతోషుడు 
  4. భద్రుడు 
  5. శాంతి 
  6. ఇడస్పతి 
  7. ఇధ్ముడు 
  8. కవి 
  9. విభుడు 
  10. వహ్ని/ అగ్ని 
  11. సుదేవుడు 
  12. రోచనుడు 
వీరు స్వయంభు మన్వంతరము సమయంలో తుష్టికారకులు అనే దేవతా గణములుగా ఉన్నారు.  

23, అక్టోబర్ 2014, గురువారం

పురాణ పంచ లక్షణములు

పురాణములకు ఉండవలసినవి ఐదు లక్షణములు అని చెప్పా బడినవి. అవి

  1. సర్గము 
  2. ఉపసర్గము 
  3. వంశము 
  4. మన్వంతరములు 
  5. రాజవంశ చరితము 

21, అక్టోబర్ 2014, మంగళవారం

అష్ట నిధులు

పురాణముల ప్రకారం మనవద్ద ఉన్న ధనమును 8 నిధులు గా చెప్పబడినవి. వీని గురించి మార్కండేయ పురాణంలో చెప్పారు. అవి
  1. పద్మ: ఈ నిధికి సత్వగుణం ప్రధానం. ఈ నిధి వంశ పారంపర్యంగా క్రింది తరములకు చెందుతుంది.  అంతే కాక అది నిరంతరం వృధి చెందుతూనే ఉంటుంది. ఈ నిధి దాన ధర్మములకు, యజ్ఞ యాగాదులకు ఇతర పుణ్యకార్యములకు ఉపయోగపడుతుంది. 
  2. మహాపద్మ: ఇది కూడా సత్వగుణం కలిగిన నిధి. ఈ నిధి 7 తరములవరకు ఉంటుంది. ఇది దాన ధర్మములకు, గృహదానములకు ఇతర సత్కార్యములకు ఉపయోగపడుతుంది. 
  3. మకరనిది: ఈ నిధి మనస్సును ప్రభావితం చేసి, గొప్పలు చెప్పుకునే వారికి, ఇంకొకరితో గొడవపెట్టుకునే వారికి చేరుతుంది. ఒక జీవితకాలం మాత్రమే ఉంటుంది. 
  4. కచ్ఛపనిధి: ఈ నిధి, తాను  స్వధర్మమును వదిలి, తను తినకుండా, ఇంకొకరికి పెట్టకుండా దాచి ఉంచేది. ఇది అతి తక్కువ కాలం చాలా తక్కువకాలం ఉంటుంది. 
  5. ముకుంద: ఈ నిధి రజోగుణం కలది. తమ భోగములను, సుఖములను చూసుకుంటూ, ఇతరులను అవమానించుటకు కూడా వెనుకాడరు. ఈ నిధి కూడా అత్యంత తక్కువ కాలం ఉంటుంది. 
  6. కుంద: ఈ నిధి రజోగుణ ప్రధానమైనది. 7 తరములవరకు నిలిచి ఉంటుంది. ధాన్యమును అమ్ముటవలన ప్రాప్తిస్తుంది. అతిధులను, బంధువులను పోషించుటకు, తమ భోగమునకు ఉపయోగపడుతుంది. 
  7. నీల నిధి: ఇది సర్వ తమోగుణములు కలిగి ఉంటుంది. ఈ ధనం 3 తరములవరకు ఉంటుంది. జ్ఞానం లేని మూర్ఖులుగా ఉంటారు.
  8. శంఖము: ఇది మరింత రజోగుణం కలిగి ఉంటుంది. తను ఒక్కడే తింటూ, తన స్వంత అనుకూలములను చూసుకుంటూ, భార్యా బిడ్డలకు కూడా పెట్టే ఆలోచన కూడా చేయరు. ఇది అత్యంత తక్కువ కాలం ఉంటుంది.  

20, అక్టోబర్ 2014, సోమవారం

షట్దర్శనములు

భగవంతుని చేరటానికి వైదికముగా చెప్పబడినవి 6 దర్శనములు
అవి

  1. సంఖ్య 
  2. యోగం 
  3. న్యాయం 
  4. వైశేషిక 
  5. ఉత్తర మీమాంస 
  6. పూర్వ మీమాంస  

18, అక్టోబర్ 2014, శనివారం

సప్తర్షులు

మనం ఉన్న ఈ మన్వంతరంలో మనకు గల సప్తర్షులు

  1. కశ్యపుడు 
  2. అత్రి 
  3. భరద్వాజుడు 
  4. విశ్వామిత్రుడు 
  5. గౌతముడు 
  6. వసిష్ఠుడు 
  7. జమదగ్ని 

17, అక్టోబర్ 2014, శుక్రవారం

నిమి - జనకవంశం

నిమి ఇక్ష్వాకు పుత్రుడు. సూర్యవంశస్థుడు. ఒకనాడు నిమికి సత్రయాగం ప్రారంభించవలెను అనే కోరిక పుట్టినది. తమ కులగురువైన వసిష్ఠ మహర్షి వద్దకు వెళ్లి యాగం తనతో చేయించమని అడిగాడు. కానీ అప్పటికే వసిష్ఠమహర్షి ఇంద్రునిచే ఒక యాగం చేయిస్తాను అని ఒప్పుకున్నాడు కనుక దేవలోకమునకు వెళ్లి ఇంద్రునిచే యాగం పూర్తీ చేసి తిరిగి వచ్చిన తరువాత సత్రయాగం చేస్తాను అని చెప్పాడు.
కానీ మానవజీవితం అల్పం అని తెలుసు కనుక నిమి తన సమ్కలపమును విరమించుకోకుండా , మరికొందరు ఋత్విక్కులను సమకూర్చుకుని తన యాగము మొదలుపెట్టాడు.
ఇంద్రుని యాగామునకు వెళ్ళిన వసిష్ఠుడు తన శిష్యుడు తలపెట్టిన సత్రయాగామును తలచుకుని ఇంద్రయాగం అయిన వెంటనే అతి వేగంగా వెనుదిరిగి వచ్చాడు. అప్పటికే నిమి మరికొందరు ఋత్విక్కులతో యాగం మొదలుపెట్టుట చూసి, నిమి తనను అవమానించాడు అని భావించాడు. తిన్నగా నిమిని కలుద్దామని అతని వద్దకు వెళ్ళబోగా ద్వారపాలకులు అడ్డుకున్నారు. అసలే కోపంగా ఉన్న వసిష్ఠుడు మరింత కోపించి నిమి మరణించుగాక అని శపించాడు. ఐతే అసలు కారణం విచారించక ఒక గురువయ్యుండి కూడా తన కోపం మీద తనకే నియంత్రణ లేక  అతను  చేసిన పనికి నిమి కూడా అతని గురువయిన వసిష్ఠుని మరణించమని శపించారు
కాలాంతరంలో వసిష్ఠుడు తిరిగి మిత్రావరుణు వలన అప్సరస ఐన ఉర్వసికి జన్మించాడు
ఐతే వసిష్ఠుని శాపంవలన నిమికూడా శరీరం వదిలాడు. ఐతే మొదలుపెట్టిన సత్రయాగం మధ్యలో ఆపుట సరి అయినది కాదు కనుక నిమి దేహమును అనేక రసాయనములతో పూతపూసి పాడవకుండా జాగ్రత్తచేశారు. సత్రయాగం పూర్తి  చేసారు. యాగం చివరి భాగంలో దేవతలు సంతోషించి వరములను ఇచ్చుటకు సంసిద్ధులవగా   ఋత్విక్కులు నిమిని బ్రతికించమని కోరారు. దేవతలు కూడా అతనిని బ్రతికించుటకు సిద్ధపడారు. కానీ నిమి తిరిగి తన దేహమును పొందుటకు అంగీకరించలేదు.    
నిరంతరం మోహం, అహంకారం, సుఖం, దుఃఖం అనే గుణములకు లోనవుతూ అశాశ్వతమైన దేహం నాకు తీసుకొనుట ఇష్టం లేదు  అని చెప్తున్నా నిమిని చూసి, దేవతలు ఋత్విక్కుల కోరిక కాదనలేనిది, అలాగే నీ కోరిక కూడా. అందరి కోరికలు తీరే విధంగా సర్వప్రాణులు కన్నులు ముసితెరచే ప్రక్రియగా నీవి జీవించెదవు గాక ని దేవతలు నిమికి వరమును ఇచ్చారు
ఐతే ఇప్పుడు నిమియొక్క రాజ్యభారమును వహించుటకు రాజులేడు. ఒక రాజ్యం రాజులేకుండా ఉండకూడదు కనుక వారు భద్రపరచిన నిమి దేహమును మధించగా ఒక పుత్రుడు జన్మించెను
  1. ప్ర్రాణములేని దేహంనుండి జన్మించాడు కనుక అతనిని వైదేహుడు అన్నారు
  2. మధించుటచేత జన్మించాడు కనుక అతనిని మిధులుడు అనికూడా పిలిచారు. ఇతనిచే నిర్మించబడిన నగరమే మిధిలా నగరం
  3. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించాడు కనుక జనకుడు అన్నారు 

విధంగా సూర్యవంశం నుండి జనకవంశం ప్రారంభం ఐనది

16, అక్టోబర్ 2014, గురువారం

సౌభరి మహర్షి

ఈ మహర్షి పూర్వ వృత్తాంతం మనకు తెలియదు. కానీ ఇతని ప్రస్తావన మనకు భాగవత మహాపురాణములో చెప్పబడినది.
సౌభరి మహర్షి 12 సంవత్సరములపాటు నీటి అడుగున ఉండి తపస్సు చేసాడు. ఒక సమయంలో అతని దృష్టి ఆ నీటిలో తన భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఒక చేపఫై పడినది. ఆ క్షణంలో అతనికి సంసారంపై ఆకాంక్ష కలిగినది. ఆ ఆలోచన కలిగినదే తడవుగా అతను ఆ నీటిలోనుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఆ రాజ్యమును సూర్య వంశస్థుడయిన మాంధాత అనే రాజు పరిపాలిస్తున్నాడు. కనుక సౌభరి మహర్షి తిన్నగా రాజువద్దకు వెళ్లి తనకు వివాహం చేసుకోవాలను అనే కోరిక కలిగినది కనుక అతనికి ఒక కన్యను  ఇమ్మని అడిగాడు.
మంధాతకు 50 మంది పుత్రికలు ఉన్నారు. వారిలో ఎవరినీ ఇవ్వను అని చెప్పటం ఇష్టం లేక, శుష్కించిన శరీరం కలిగిన ఈ సౌభరి మహర్షిని తన పుత్రికలు వరించరు అని నమ్మకంతో, తన పుత్రికలలో ఎవరైనా తమరిని వరించినట్లయితే వారిని ఇచ్చి వివాహం చేస్తాను  అని సౌభారికి మాంధాత చెప్పాడు. మాంధాత మనస్సులోని ఆలోచనను గమనించిన సౌభరి మహర్షి తన శరీరమును యౌవ్వనప్రాయముతో అలంకరించుకుని అంతఃపురమునకు వెళ్ళాడు. అతనిని చుసిన మాంధాతయొక్క 50 మంది పుత్రికలూ అతనిని వరించారు.
అతని తపః శక్తి తో వారంతా అత్యంత అనుకులమయిన భవనములు, భోగములు సమకూర్చుకున్నారు. ఎంతో వైభవమైన వస్త్రములు, తినుబండారములు, ఉద్యానవనములు ఏర్పరచుకుని సుఖంగా ఉన్నారు.
కొంతకాలం తరువాత సౌభరి మహర్షికి ఏకాంతంలో అతని ఈ పరిస్థితికి రాకముందు తానూ ఎంత నిష్టగా తపస్సు చేసేవాడో గుర్తుకు వచ్చినది. ఒక్కనాడు, ఒక్కసారి సంసారమందు ఉన్న ఒక చేపల కుటుంబమును చుసిన తను ఇంతకాలం 50 మంది భార్యలతో, 5000 మంది బిడ్డలతో కాలక్షేపం చేయుట తప్పు అనిపించినది. కనుక వానప్రస్థఆశ్రమము స్వీకరించి అరన్యమునకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు.
తరువాత అతని భార్యలు కూడా అతని వెనుక అరణ్యములకు వెళ్ళిపోయారు. 

15, అక్టోబర్ 2014, బుధవారం

108 ఉపనిషత్తులు

మన వైదిక మైన శాస్త్రములను వేదములు అంటాం. ఆ వేదములను ఒక చెట్టుగా భావించినట్లయితే ఆ చెట్టుకు కాచిన కమ్మని ఫలములు ఉపనిషత్తులు. ఇవి 108. ఆ 108 ఉపనిషత్తుల పేర్లను మనం ఇప్పుడు చూద్దాం!
  1. ఐతరేయోపనిషత్తు 
  2. అక్షమాలికోపనిషత్తు 
  3. సౌభాగ్యలక్ష్మ్యిపనిషత్తు 
  4. కౌషితకీబ్రాహ్మణోపనిషత్తు 
  5. నాదబిందూపనిషత్తు 
  6. ముద్గాలోపనిషత్తు 
  7. త్రిపురోపనిషత్తు 
  8. ఆత్మబోదోపనిషత్తు 
  9. నిర్వణోపనిషత్తు 
  10. అధ్యాత్మోపనిషత్తు 
  11. ఈశావాస్యోపనిషత్తు 
  12. హంసోపనిషత్తు 
  13. జాబాల్యుపనిషత్తు 
  14. సుబాలోపనిషత్తు 
  15. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు 
  16. యాజ్ఞవల్క్యోపనిషత్తు 
  17. తారాసారోపనిషత్తు 
  18. పరమహంసోపనిషత్తు 
  19. అవధూతోపనిషత్తు
  20. వరాహోపనిషత్తు 
  21. పంచబ్రహ్మోపనిషత్తు
  22. కాలాగ్నిరుద్రోపనిషత్తు 
  23. రుద్రహృదయోపనిషత్తు 
  24. తేజోబిందూపనిషత్తు 
  25. సరస్వతిరహస్యోపనిషత్తు 
  26. కలిసంతరణోపనిషత్తు 
  27. శారీరకోపనిషత్తు 
  28. అమృతబిందూపనిషత్తు 
  29. అమృతనాదోపనిషత్తు 
  30. బ్రహ్మోపనిషత్తు 
  31. బ్రహ్మవిద్యోపనిషత్తు 
  32. ధ్యానబిందూపనిషత్తు 
  33. దక్షిణామూర్త్యుపనిషత్తు 
  34. గర్భోపనిషత్తు
  35. కఠోపనిషత్తు 
  36. ఏకాక్షరోపనిషత్తు 
  37. కఠరుద్రోపనిషత్తు 
  38. క్షురికోపనిషత్తు 
  39. ఆరుణికోపనిషత్తు 
  40. కేనోపనిషత్తు 
  41. ప్రశ్నోపనిషత్తు 
  42. ముండకోపనిషత్తు 
  43. మండూక్యోపనిషత్తు 
  44. తైత్తిరీయోపనిషత్తు 
  45. ఛాందోగ్యోపనిషత్తు 
  46. బృహదారణ్యకోపనిషత్తు 
  47. కైవల్యోపనిషత్తు 
  48. శ్వేతాశ్వతరోపనిషత్తు 
  49. నారాయణోపనిషత్తు 
  50. పరమహంసోపనిషత్తు 
  51. అధర్వశిరోపనిషత్తు 
  52. అధర్వశిఖోపనిషత్తు 
  53. మైత్రాయణ్యుపనిషత్తు 
  54. బృహజ్జాబాలోపనిషత్తు 
  55. నృసింహపూర్వతాపిన్యుపనిషత్తు ; నృసింహోత్తరతాపిన్యుపనిషత్తు 
  56. మైత్రోపనిషత్తు 
  57. మంత్రికోపనిషత్తు 
  58.  సర్వసారోపనిషత్తు 
  59. నిరాలంబోపనిషత్తు 
  60. శుకరహస్యొపనిషత్తు 
  61. వజ్రసూచికోపనిషత్తు 
  62. యోగతత్త్వోపనిషత్తు 
  63. నారదపరివ్రాజకోపనిషత్తు 
  64. సీతోపనిషత్తు 
  65. యోగచూడామణ్యుపనిషత్తు  
  66. నిర్వాణోపనిషత్తు 
  67. మండలబ్రాహ్మణోపనిషత్తు 
  68. శరభోపనిషత్తు 
  69. స్కందోపనిషత్తు 
  70. త్రిపాద్విభూరిమహానారాయణోపనిషత్తు 
  71. అద్వయతారకోపనిషత్తు 
  72. రామరహస్యోపనిషత్తు  
  73. రామతాపిన్యుపనిషత్తు 
  74. వాసుదేవోపనిషత్తు 
  75. శాండిల్యోపనిషత్తు 
  76. పైజ్ఞలోపనిషత్తు 
  77. బిక్షుకోపనిషత్తు 
  78. మహోపనిషత్తు 
  79. యోగశిఖోపనిషత్తు 
  80. తురీయాతీతోపనిషత్తు 
  81. సన్యాసోపనిషత్తు 
  82. అవ్యక్త్యోపనిషత్తు 
  83. అన్నపుర్ణోపనిషత్తు 
  84. సుర్యోపనిషత్తు 
  85. అక్ష్యుపనిషత్తు 
  86. కుండికోపనిషత్తు 
  87. సావిత్ర్యుపనిషత్తు 
  88. ఆత్మోపనిషత్తు 
  89. పాశుపతబ్రహ్మోపనిషత్తు 
  90. పరబ్రహ్మోపనిషత్తు 
  91. త్రిపురాతాపిన్యుపనిషత్తు 
  92. దేవ్యుపనిషత్తు 
  93. భావనోపనిషత్తు 
  94. యోగకుండల్యుపనిషత్తు 
  95. భాస్మజాబాలోపనిషత్తు 
  96. రుద్రాక్షజాబాలోపనిషత్తు 
  97. గణపత్యుపనిషత్తు 
  98. దర్శనోపనిషత్తు 
  99. మహావాక్యోపనిషత్తు 
  100.  ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు 
  101. గోపాలతాపిన్యుపనిషత్తు 
  102. కృష్ణోపనిషత్తు 
  103. శాట్యాయనీయోపనిషత్తు 
  104. హయగ్రీవోపనిషత్తు 
  105. దత్తత్రేయోపనిషత్తు 
  106. గరుడోపనిషత్తు 
  107. బహ్వృచోపనిషత్తు 
  108. ముక్తికోపనిషత్తు 

14, అక్టోబర్ 2014, మంగళవారం

మహాభారతం శ్లోకములు

మనకు గల అన్ని పురాణములలో, ఇతిహాసములలొ ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట " తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి". అంటే కాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా, ఎక్కువ సేపు చెప్తుంటే మనం సహజంగా అనే మాట "ఏమిటి ఆ చాట భారతం" అని కదా! మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా?
మనకు తెలిసినంత వరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది. ఇందులో ఏది చూసినా 18. దీనిలోని పర్వములుకూడా 18. ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం!


  1. ఆదిపర్వం - 9984 శ్లోకములు 
  2. సభాపర్వం - 4311 శ్లోకములు 
  3. అరణ్య పర్వం - 13664
  4. విరాటపర్వం - 3500
  5. ఉద్యోగ పర్వం - 6998
  6. భీష్మ పర్వం - 5884
  7. ద్రోణ పర్వం - 10919
  8. కర్ణ పర్వం - 4900
  9. శల్య పర్వం - 3220
  10. సౌప్తిక పర్వం - 2870
  11. స్త్రీ పర్వం - 1775
  12. శాంతి పర్వం - 14525
  13. అనుశాసనిక పర్వం - 12000
  14. అశ్వమేధ పర్వం - 4420
  15. ఆశ్రమవాస పర్వం - 1106
  16. మౌసల పర్వం - 300 
  17. మహా ప్రస్థాన పర్వం - 120
  18. స్వర్గారోహణ పర్వం - 200

అన్ని కలిపితే మనకు మహాభారతం లో మొత్తం 1,00,696 శ్లోకములు ఉన్నాయి. 

13, అక్టోబర్ 2014, సోమవారం

ఋత్విక్కులు


మనకు పురాణములలో, ఇతిహాసములలొ యాగములగురించి ప్రస్థావన వచ్చినప్పుడు ఋత్విక్కుల గురించి చెప్తారు. మరి ఆ ఋత్విక్కులు అంటే ఎవరు? వారు ఏమి చేస్తారు?

ఋత్విక్కులు అంటే యాగం చేసే యజమాని నుండి ధనం తీసుకుని ఆ యాగమును చేయించే వారు. వీరు 16 మంది.  వారు

  1. బ్రహ్మ 
  2. ఉద్ఘాత 
  3. హోత 
  4. అధ్వర్యుడు 
  5. బ్రాహ్మణాచ్చంసి 
  6. ప్రస్తోత 
  7. మైత్రావరుణుడు 
  8. ప్రతిప్రస్తాత 
  9. పోత 
  10. ప్రతిహర్త 
  11. అచ్చావాకుడు 
  12. నేష్ట 
  13. అగ్నీధ్రుడు 
  14. సుబ్రహ్మణ్యుడు 
  15. గ్రావస్తుతుడు  
  16. ఉన్నేత 


1, అక్టోబర్ 2014, బుధవారం

రేవతి

రేవతి బలరాముని భార్య. ఆమె బలరామునికి చేరిన విధం అత్యంత విచిత్రమైనది.
రేవతి రైవతుని పుత్రిక. పుత్రిక పై అత్యంత ప్రేమ కలిగిన రైవతుడు, ఆమెకు సరి అయిన భర్త ఎవరో సాక్షాత్తు బ్రహ్మదేవుని అడుగుదామని బ్రహ్మలోకమునకు తన కుమార్తెను తీసుకుని వెళ్ళాడు.
అక్కడకు వారు వెళ్ళిన సమయంలో బ్రహ్మదేవుని ముందు కిన్నెరులు నృత్యం, గంధర్వులు గానం చేయుచూ ఉండగా బ్రహ్మదేవుని కలిసే అవకాసం కొరకు వారు కొంత సమయం వేచి ఉన్నారు. వారికి ఆ సమయం దొరకగానే బ్రహ్మదేవుని దర్శించుకుని, నమస్కరించి అప్పుడు వారు అక్కడకు వచ్చిన కారణం బ్రహ్మదేవునకు చెప్పారు.
వారి కోరికను వినిన బ్రహ్మదేవుడు కొంచెం నవ్వి, "ఓ రైవతా! నీ మనస్సులో నీ కుమార్తెకు ఎవరు సరి అయిన భర్త అని ఏ కొందరిని తలచినావో వారు ఎవరూ ఈ సమయంలో జీవించి లేరు. వారే కాదు ఈ కాల గమనంలో వారి పుత్రులు, మనుమలు, ముదిమనుమలు కూడా జీవించి లేరు. మీరు ఇక్కడ నాకోసం వేచి ఉన్న ఈ కొంత సమయంలో భూలోకములో 27 మహాయుగములు గడచినవి. నీవు ఇప్పుడు భూలోకమునకు వెళ్ళుము అక్కడ భూభారమును తగ్గించే నిమిత్తమై శ్రీమహావిష్ణువు శ్రీ కృష్ణునిగా, అనంతుడు బలరామునిగా జన్మించి ఉన్నారు. కనుక నీ కుమార్తెను బలరామునకు ఇవ్వు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. తిరిగి భూలోకమునకు తిరిగి వచ్చిన రైవతుడు తన కుమార్తె రేవతిని బలరామునకు ఇచ్చి వివాహం చేసి, బదరి వనమునకు వెళ్లి తపస్సు చేసుకోసాగాడు. 

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

నాభాగుడు

నాభాగుడు నభగుని పుత్రుడు. సూర్య వంశమునకు చెందినవాడు.
ఇతను మెతకగా ఉండుట చూసి, ఆ అవకాశమును వినియోగించుకుంటూ అతని సోదరులు అతనికి ధనమును ఇవ్వకుండా ఉండిరి. తనకు తన భాగమును ఇప్పించ వలసినదిగా అన్నలను కోరగా, అప్పుడు అన్నలు తమ తండ్రి అయిన నభగుడు చెప్పినట్లయితే అతనికి అతని వాటా ఇస్తాం అని చెప్పారు. అప్పుడు నాభాగుడు తండ్రివద్దకు వెళ్లి, ఈ వృత్తాంతం చెప్పి, ఏమి చేయవలసినది అని తండ్రిని అడిగాడు.
అప్పుడు నభగుడు,  ఆ సమయంలోఅత్యంత జ్ఞానులయిన అంగిరసులు సత్రయాగం చేస్తూ ఉన్నారని, ఆ యాగంలో వారికి ఆ యాగం చేసే 6వ రోజున విస్వేదేవతలకు చేసే సూక్తులు జ్ఞాపకమునకు రావు కనుక నాభాగుని అక్కడ వెళ్లి వారికి ఆ సూక్తులను గుర్తు చేయమని చెప్పాడు. అలా గుర్తు చేసినందువలన బ్రహ్మజ్ఞాని అని లోకం నాభాగుని కీర్తిస్తుంది అని,అలా చేయుట వలన ఆ యాగం చివర మిగిలిన ధనమును నాభాగునకు ఇస్తారు అని కూడా చెప్పి నాభాగుడిని అక్కడకు పంపించాడు.
నాభాగుడు తండ్రికి నమస్కరించి ఆ యాగామునకు వెళ్లి తన తండ్రి చెపిన విధంగా అంగిరసులకు వారు మరచిపోయిన సూక్తులను గుర్తు చేసాడు.అప్పుడు  ఆ అంగిరసులు ఆ యాగంలో మిగిలిన ధనమును అతనికి ఇచ్చాం అని చెప్పి వారు స్వర్గమునకు వెళ్ళిపోయారు. అతనికి అలా లభించిన ఆ ధనమును తీసుకొనుటకు నాభాగుడు వెళుతుండగా, ఒక నల్లని సుందరమైన ఆకారం కలిగిన ఒక యువకుడు ఆ ధనమును తన  చేసుకొనెను.
అప్పుడు నాభాగుడు తనకు అంగిరసులు ఆ ధనమును ఇచ్చినారు కనుక ఆ ధనమును తిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు అతను ఒకవేళ నీ తండ్రి అయిన నభగుడు ఈ ధనమును నీకు ఇవ్వమని చెప్పినట్లయితే ఇస్తాను కనుక నీవు వెళ్లి నీ తండ్రిని అడిగిరా! అని చెప్పి పంపెను.
నాభాగుడు నభగుని వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా, నభగుడు జరిగిన విషయమును తన మనోనేత్రంతో చూసి ఆ యాగం చేసిన బ్రాహ్మణులు ఆ యాగంలో మిగిలిన భాగమును మహాదేవుడయిన శివునకు ఇస్తాం అని సంకల్పించారు కనుక ఆ భాగం శివునకు మాత్రమే చెందుతుంది అని తీర్పు చెప్పి నాబాగుని పంపించాడు.
తిరిగి వచ్చిన నాభాగుడు తన తండ్రి చెప్పిన విషయమును యధాతధంగా చెప్పి, ఆ భాగం మీద తనకు ఏవిధమైన హక్కులేదని చెప్పాడు.
నాభాగుని సత్య సంధతకు సంతోషించిన శివుడు ఆ యజ్ఞ భాగమును నాభాగునకు ఇచ్చి, అతనికి సనాతనమైన బ్రహ్మజ్ఞానమును ఉపదేశించి  వెనుతిరిగి వెళ్ళాడు. కాలాంతరంలో నాబాగునకు అంబరీషుడు జన్మించాడు.
వ్యాసమహర్షి నాబాగుని ఈ చరిత్రకు ఫలశృతి కూడా చెప్పారు.
ఎవరైతే శ్రద్దగా ఈ నాభాగుని వృత్తాంతం ప్రతిరోజూ చదువుతారో/ వింటారో/ పారాయణం చేస్తారో వారు జ్ఞానమును పొందుతారు, మరణానంతరం ముక్తిని పొందుతారు.

నా ఆలోచన:
మన పూర్వులు ఇటువంటి కధలను చాలా చెప్పారు. కొన్ని కధలకు ఫలశృతి కూడా చెప్పారు. అయితే  ఆ ఫల శృతి  ఆ కధను మరలా మరలా చదివేలా చేయాలి అని చెప్పి ఉన్నారు. అలా ఎందుకు? మరి ఈ కధకు ఈ ఫలశృతి ఎందుకు చెప్పారు?

  1. నాభాగుడు తన సోదరులు తన సొమ్మును బలవంతముగా తీసుకున్నపుడు ఏమి ఎదురు చెప్పలేదు, పైగా వెళ్లి వారిని మెల్లిగా అడిగాడు. మనం సహజంగా మన సంపదను ఎవరైనా తీసుకున్తరేమో అనే అనుమానం వస్తేనే వారి మీద గొడవకు దిగుతాం. 
  2. నాభాగుని అతని సోదరులు తండ్రిని అడిగి రమ్మనగానే, తన ఆస్తి మీరు తీసుకుని నన్ను తండ్రిని అడుగమంటారేమిటి అని విసుగును ప్రదర్శించలేదు. 
  3. తీరా తండ్రి వద్దకు వెళ్లి అడిగితే  అన్నలకు చెప్పి నీ ఆస్తి నీకు ఇప్పిస్తాను అని చెప్పకుండా, యాగమునకు వెళ్లి దానం తేసుకో అని చెప్పాడు. మరి ఒక తండ్రిగా అది తప్పుకాదా! ఒకసారి ఆలోచించండి, అన్యాయం చేసిన వారు, పొందినవారు కూడా తన పుత్రులే. కానీ కొందరు అన్యాయ మార్గంలో ఉన్నపుడు వారి తప్పును అలా ఒకేసారి చూపిస్తే వారు మరింత అన్యాయులుగా మరే అవకాశం ఉంటుంది. కనుక అన్యాయమునకు గురి అయిన నాభాగుని అతని విద్యాను ఉపయోగించి అతని ధనమును స్వయంగా సంపాదించుకునే మార్గం చెప్పి, కేవలం ధనమే కాకుండా బ్రహ్మజ్ఞాని అనే బిరుదు కూడా పొందగలవు అని చెప్పి పంపాడు.  
  4. మరి అంగిరసులు నాభాగునకు ఇచ్చిన అదే భాగమును ఋత్విక్కులు శివునకు ఎందుకు ఇచ్చారు? ఆ భాగమును ఎవరికైనా ఇవ్వటానికి ఎవరికి అధికారం ఉంటుంది? మనం ఒక బ్రాహ్మణుని యాగామునకు పిలిచి ఆ యాగమునకు కావలసినవి అన్నీ  సమకూర్చి వారికి అప్పగిస్తాం. అంటే ఆక్షణం నుండి ఆ వస్తు,ధనముల మీద ఆ బ్రాహ్మణులకే అధికారం ఉంటుంది. కనుక ఆ భాగమును దానం చేసే అధికారంకూడా ఋత్విక్కులకే ఉంటుంది. 
  5. శివుడు ఈ భాగం నాదే నీకు చెందదు అని స్వయంగా చెప్పకుండా నభగుని అడిగిరమ్మని ఎందుకు చెప్పాడు? ఒక కొడుకు తప్పు చేసే సమయం అని తెలిసినప్పుడు అతనిని సరిదిద్దే మొదటి అవసరం, భాద్యత తండ్రికి ఉండాలి. పైగా అక్కడ వచ్చే ధనమును తెచ్చుకోమని సలహా ఇచ్చిన వాడు నభగుడే. కనుక నభగుడు జరిగిన సంగతి తెలుసుకుని నాభాగునకు చెప్తేనే అది బాగుంటుంది. 
  6. అసలు ఏమిటి ఈ కధ? మనం మన మనస్సునందు ఈవిధమైన దురాలోచనలు లేకుండా, పెద్దలు చెప్పిన పనిని చేస్తూ ఉంటే మనకు చెందవలసిన సొమ్ము, పేరు, ప్రతిష్టలు మనను చేరి తీరుతాయి. ఒక్కసారి దానం మీది ఆశతో నాభాగుడు అబద్దం చెప్తే పరమశివుడు  అతనికి ఆ ధనమును తిరిగి ఇచ్చే అవకాశం ఉండేది కాదు కదా!
  7. మరి ఆ ఫలశృతి? ఈ కధను ప్రతిరోజూ చదవటం/ వినటం అంటే ప్రతిరోజూ గుర్తు చేసుకోవటం. అంటే మన మనస్సులలో ఈ కద నిలచిపోతుంది. ఒకవేళ మనకు ఎవరితో అయినా గొడవ పడవలసిన సందర్భం ఎదురయినప్పుడు మన మనస్సు ఆ గొడవ పడకుండా ఆపుతుంది. అప్పుడు మన మనస్సు మన ఆదీనంలో ఉండి విచక్షణా శక్తి ని కోల్పోకుండా ఉంటుంది. మరి అదేకదా జ్ఞానం అంటే. 
  8. జీవితాంతం మనం ఈ కధను స్మరిస్తూ ఉంటే జీవితంలో మనం చేసే తప్పులు గణనీయంగా తగ్గుతాయి కనుక మోక్షం కూడా లభించవచ్చు.