30, జూన్ 2016, గురువారం

శ్రీరామ శతకము – 43

సీ :  హెచ్చుతగ్గులు లేక ఎవరువచ్చిన నేను
           మెచ్చెదననుమాట యెచ్చటుండె
      మెచ్చుకోలుకు నేను యిచ్ఛగించనటంచు
           ముచ్చటించితివేల ఖచ్చితముగ
      మచ్చిక నీరూపు వచ్చి చూపించుము
           లచ్చికి జోహారు లెచ్చు తెలుపు
      పచ్చవిల్తుని తండ్రి రచ్చకీడ్వకునన్ను
            వచ్చి కాపాడుము మెచ్చననక
తే :  ఉచ్ఛదశ వీడి వేవచ్చి నచ్చవయ్య
      మచ్చుకైనను నిన్వీడ పిచ్చివాడ
      లచ్చియానను నీయాన మెచ్చునన్ను

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

29, జూన్ 2016, బుధవారం

పురాణ,ఉపపురాణముల లక్షణములు

మహాపురణ లక్షణములు పదిగా చెప్పబడినవి. అవి 
  1. సర్గము    :  కారణ సృష్టి (బ్రహ్మ సృష్టి)
  2. విసర్గము  :  బ్రహ్మ సృష్టి ననుసరించి దక్ష,మరీచ్యాదుల సృష్టి
  3. వృత్తి        : భూతములకు అవసరములయిన సాధనములు (భోజనం మొదలగునవి)
  4. రక్ష          : దుష్టసంహారముకొరకు భగవానుని అవతారములు, వాని లీలలు
  5. మన్వంతరములు :   14మనువులు, ఆ మన్వంతరములలో దేవతలు, ధర్మములు
  6. వంశము    : బ్రహ్మ మొదలు పరంపరనుగత శరీర సముదాయ ప్రవాహము
  7. వంశానుచరితము  : ఒకొక్క వంశములోని మహాపురుషుల ఆచార, గుణ వర్ణనము
  8. సంస్థ  :  ప్రళయము
  9. హేతువు  : సృష్టికి హేతుభూతుడగు జీవుని తెలుపునది
  10. అపాశ్రయము : ప్రస్థానత్రయమున కనిపించు విశ్వతైజసప్రాజ్ఞులు అనే మాయావృత్తులు మూడిటియందు పరమాత్మ ఏవిధంగా సాక్షిగా ఉంటాడో చెప్పటం. 
ఉప పురాణ లక్షణములు ఐదుగా చెప్పబడినవి. అవి
  1. సర్గము
  2. ప్రతిసర్గము/ విసర్గము
  3. మన్వంతరములు
  4. వంశం
  5. వంశానుచరితం 
ఉపపురాణములకు ఒకే కర్త ఉండవలసిన అవసరం లేదు. అంటే ఒకే ఉపపురాణములలో విషయములను అనేక మహర్షులు చెప్పు ఉండవచ్చు.   

28, జూన్ 2016, మంగళవారం

శ్రీరామ శతకము – 42

సీ :  నిన్ను ధ్యానముజేసి నేతరించెదనన్న
           నిమిషమైన మనస్సు నిలివదాయె
      నిన్నర్చనజేయుచు నే సుఖించెదనన్న
            గడియ తీరిక లేక గడుపుటాయె
      దీపధూపములిచ్చి దేవగొల్చెద నన్న
            దుస్సహవాసంబు దొలగదాయె
      సద్గ్రంధ పఠనంబు సలుపగోరెద నన్న
            పారమొందని నీచపఠనమాయె
తే :  ఇంక నేరీతి నిన్నాశ్రయించగలను
      ఏమితోచక నీస్తోత్రమెపుడు జేతు
      బాలునజ్ఞాని రక్షించు భారమనక
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

27, జూన్ 2016, సోమవారం

పురాణములు - నిర్వచనం

మన పెద్దలు పురాణాములను చదవమని చెప్తారు. అంతే కాకుండా మనకు 18 పురాణములు, 18 ఉపపురాణములు ఉన్నయి అని కూడా చెప్తారు కదా! మరి ఇంతకీ పురాణములు అని వాటిని ఎందుకు పిలుస్తారు?
ప్రతిదానిని నిర్వచించిన వారు పురాణములను కూడా నిర్వచించి ఉంటారు కదా! అదే ఇప్పుడు చెప్పుకుందాం!
వేద వ్యాస మహర్షి నిర్వచనం :
యస్మాత్పురాహ్యనక్తీదం, పురాణం తేన తత్స్మృతమ్.
ఇక్కడ “పురా” అనే పదమునకు ఉన్న అర్ధములు చూస్తే,         
  •      పూర్వం జరిగినది
  • పూర్వం జరిగినా, మరలా జరుగునది


అని అర్ధములు ఉన్నవి.

కనుక పురాణం అంటే మానవ హృదయములను ఆకర్షించు సంఘటనలు ఎన్ని సార్లు జరిగిననూ వానిని హృద్యంగా చెప్పేవి అని అర్ధం.

26, జూన్ 2016, ఆదివారం

శ్రీరామ శతకము – 41


సీ :   వేడ్కతో గూర్చుండ వేంచేయగల వేని
           హృదయ పీఠమునిత్తు కొదువలేక
        కూర్మిచే పూజల గొనగ వచ్చెదవేని
            అంజలి పుష్పములమరనిత్తు
        పాద్యమింపుగ గొన భ్రమసివచ్చెదవేని
            కరమొప్ప కన్నీట గడుగ గలను
       వేదస్తోత్రద్వనుల్ వినగ వచ్చెదవేని
          దీనాతి రావముల్ విన్నవింతు
తే :   నాకున్నంత వానిలో నీకు నిడెద
       దయను నేజేయు సేవలు తనివిదీర
       గైకొనగ రమ్ము కరుణను గరుడవాహ
       అందుకొనవయ్య శ్రీరామ వందనములు!! 

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

25, జూన్ 2016, శనివారం

వైశ్యుడు- నిర్వచనం

మనం ఇంతకు ముందు బ్రాహ్మణుని గురించి శాస్త్రములు ఏమి చెప్పయో, ఎవరిని మనం బ్రాహ్మణులు అని పిలవాలో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఎవరిని వైశ్యులు అని చెప్తున్నారో చూద్దాం!
చాణక్యుని నీతిలో వీరిని ఈ విధంగా నిర్వచించారు
లౌకికే కర్మణి రతః పశూనాం పరిపాలకః
వాణిజ్యకృషి కర్తాయః స విప్రో వైశ్య ఉచ్యతే!!

భావం:  ఎవరైతే సాంసారికమైన పనులయందు ప్రీతి కలిగి ఉంటారో, పశువుల పాలన చేస్తూ ఉంటారో, వ్యాపారము, వ్యవసాయము చేస్తూ ఉంటారో అటువంటి వాడు బ్రాహ్మణుడయినా, వైశ్యుడని చెప్ప బడుతున్నడు. 

24, జూన్ 2016, శుక్రవారం

శ్రీరామ శతకము – 40

సీ :  సాహాయ్యమొనరించి సంతోషమొందించ
             సుగ్రీవుడనుగాను సుమ్ముదేవ
     సామర్ధ్యమునను రాక్షసరాజు వంచించ
             రోషమందగను మారుతిని గాను
    వేడ్కచే ప్రీతితో విందులు జేయను
             శబతరిని గానంచు చాటి చెపుదు
    శరణంచు నినుగోరి సాన్నిధ్యమర్ధింప
             సాహసంబున విభీషణుడ గాను

తే :  భూరి కైంకర్యములు జేయతరముగాదు
      కించిరజ్ఞుని దరిజేర్చు కేలుమోడ్తు
      ఆశ్రయించిన దాసుని ఆర్తి దీర్చి
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

22, జూన్ 2016, బుధవారం

శ్రీరామ శతకము – 39

సీ :  పాదుకలనుగొని పాద పూజలుజేయ
              భరతుండగాను సద్భక్తి తోడ
      ఇంపుగా సేవలు ఎల్లవేళల జేయ
              లక్ష్మణుండను గాను లక్షణముగ
      ప్రాణమర్పించియు ప్రాపుగోరగ నేను
               అల జటాయువుగాను యమితభక్తి
      జపహోమములు జేసి సంతోషపెట్టను
               ఋష్యాదులందొక ఋషినిగాను

తే :  పారతంత్ర్యము చేపట్టి తరచునేను
       నిన్ను పొందగ లేనయ్య నీరజాక్ష
      దయను నను జేరదీసియు భయము బాపి

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

20, జూన్ 2016, సోమవారం

శ్రీరామ శతకము – 38

సీ : విత్తమార్జన జేయ వెంగలి నైచెడి
            బద్దాత్మలకు నేను బానిసైతి
      జ్ఞానమార్జింపను హీనుండ మతిచెడి
            దుర్జనంబులగూడి ధూర్తనైతి
     ధర్మార్జనముజేయ ధారిణి గతిజెడి
           వేదబాహ్యుల గూడి విఫలునైతి
     మోక్షమునార్జింప మూఢునై గురి జెడి
           నాస్తికులనుగూడి నాశమైతి

తే :  పుడమి నెచటను శాంతిని బొందలేక
      మాటిమాటికి దోషముల్ మదన పెట్ట
      నిన్ను జేరితి నాతండ్రి నన్ను విడక
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

18, జూన్ 2016, శనివారం

శ్రీరామ శతకము – 37

సీ : గజరాజు మొరయిడకాచిరక్షించుట
           దబ్బరయని నేనదలతునయ్య
     ద్రౌపది మొరవినిదయతోడ బ్రొచుట
            కల్లయంచని నెంతు నుల్లమందు
     ప్రహ్లాదుగాపాడ పరుగెత్తి పోవుట
           అంతహుళక్కియే యందునయ్య
    మునుజటాయువునకు ముక్తినిచ్చుటయన
          వట్టిదంచును నెంతు వారిజాక్ష

తే :  కుబ్జశబరుల నార్తిపోగొట్టుటెల్ల
      అదియబద్దము స్రీరామయవనినాధ
      నేడుననుబ్రోవ నవియెల్లనిక్కమగును
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

16, జూన్ 2016, గురువారం

శ్రీరామ శతకము – 36

సీ :  శ్రీరమాధిపనీకు సేవజేసెదనన్న
          నిన్వీడియుండరు నిత్యులెపుడు
      భూరికానుకలిచ్చి పూజింతునన్నను
          శ్రీలక్ష్మినిన్వీడి తొలగిపోదు
      పట్టెమంచము పరుపు బట్టలిచ్చెదనన్న
          పానుపయ్యెను నీకు పాపరేడు
      అర్ఘ్యపాధ్యముచ్చి అర్చించెదనన్నను
           క్షీరాబ్ధి నీ చెంత జేరియుండు
తే :   భక్ష్యభొజ్యము లివ్వరేభక్తవరులు
       వేదగానము జేయరే వేల్పులెల్ల
       ఈశ నిర్భాగ్యుడను పేదఏమియిడుదు
       అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

14, జూన్ 2016, మంగళవారం

శ్రీరామ శతకము – 35

సీ :  మంత్రరత్నము నెప్డుమదిలోన ధ్యానించ
           బలురోగ సంఘముల్ బాసిపోవు
      మంత్రరత్నము నెప్డుమదిలోన ధ్యానించ
            ఈషణత్రయభీతిలేక తొలగు
      మంత్రరత్నము నెప్డుమదిలోన ధ్యానించ
           సంసారబమ్ధమే సమసిపోవు
      మంత్రరత్నము నెప్డుమదిలోన ధ్యానించ
          ఆభిజాత్యములెల్ల నంతమొందు
తే :  మంత్రరత్నమునేనింక మరవనయ్య
      నిర్భరత్వమునీయందు నిలిపితయ్య
      దాసుకైంకర్యమిదియని తలపవయ్య

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

12, జూన్ 2016, ఆదివారం

శ్రీరామ శతకము – 34

సీ :  నాతల్లి దండ్రివి నా యిష్ట దైవమా
           నాతోడు నీడవు నాగశయన
      నాకర్త భర్తవునా కల్పవృక్షమా
           భుక్తి ముక్తి నొసంగు పుణ్యపురుష
     నానాధనాయకా నాకామధేనువా
           రక్ష్య రక్షకభార రమ్యవేష
    నాగురు దైవము నాభాగ్యదేవతా’
          మంత్రార్ధ భోధక మాన్యచరిత

తే :   పరమపదనాధ కృపజూడు పద్మనాభ
       నిన్నెనమ్మితి బ్రోవుము నన్నువిడకు
       మెల్లవేళల భారంబు చెల్లనీక

       అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

10, జూన్ 2016, శుక్రవారం

శ్రీరామ శతకము – 33

సీ : ఏ  నామమున బిల్వ నేగుదెంచెదో కాని
            శ్రీరాముడని బిల్తు చిరము నేను
     ఏ రూపమున నీవు యెట్లుగుపడెదవో
           శ్రీరామురూపివై చేరునన్ను
     ఏ మొరాలించుచు ఎచ్చటికేగెదో
           నామొరాలించుచు నన్నువిడకు
      ఏ చోట నుందువో యేలిక నాసామి
           నాగేహమందుండి యేగ కెపుడు
తే : నేను నీవాడనంచును నిన్నుచేరి
      యాశ్రయించితి దాసులయార్తి దీర్చు
      అవనినేగోరు పురుషార్ధమదియె సుమ్ము
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

9, జూన్ 2016, గురువారం

బ్రాహ్మణుడు

హిందూమత  గ్రంధములన్నింటిలో ముఖ్యంగా చెప్పే విషయములను చూసుకుంటే వానిలో గోపూజ, బ్రాహ్మణ పూజ ముఖ్యం అని చెప్తారు. దీనిని పట్టుకుని కొందరు శాస్త్రములు సమసమాజమునకు అవరోధములు, ఒక జాతి వారిని గౌరవించి, మరొక జాతిని తక్కువ చేసి చెప్తున్నారు అని తప్పుగా అనుకుంటున్నాం! ఈ వ్యవస్థ ఏర్పడ్డప్పుడు వంశమును బట్టి వర్ణం ఏర్పడలేదు. అంటే ఒక బ్రాహ్మణుని కొడుకు బ్రాహ్మణుడు కావలసిన అవసరం లేదు. అలాగే మిగతా వర్ణములు కూడా. ఈ వర్ణములు వారు చేసే పనిని బట్టి నిర్ణయించారు. ఆ వర్ణములకు నిర్వచనములను స్పష్టంగా చెప్పారు.

బ్రాహ్మణుడు: నిర్వచనం 

బ్రాహ్మణుని గురించి చాణక్యుడు ఈవిధంగా చెప్పారు.

ఏకాహారేణ సంతుష్టః షడ్ కర్మనిరతః సదా !
ఋతుకాలాభిగామీ చ స విప్రో ద్విజ ఉచ్యతే !!

భావం : రోజుకు ఒక్కసారి భోజనం చేసి సంతోషంగా ఉండేవాడు, ఆరు కర్మలను నియమముగా చేసేవాడు, కేవలం సంతానంకోసము మాత్రమే వివాహం చేసుకునే వాడిని బ్రాహ్మణుడు అంటారు.
ఆరోజులలో అలా చెప్పారు మరి. ఇంతకీ బ్రాహ్మణుడు నియమముగా చేయవలసిన ఆ ఆరు కర్మలు ఏమిటి? వీని గురించి మనుస్మృతి లో చెప్పారు.
 అధ్యాపన మధ్యాయనం యజనం యాజనం తదా!
దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణా నామకల్పయత్ !!
                                                                               మనుస్మృతి : 1-88
భావం : చదువుట, చదివించుట, యజ్ఞములు చేయుట, చేయించుట, దానము చేయుట, ఇతరుల దానమును గ్రహించుట అనే ఆరు కర్మలు చేసిన వాడే బ్రాహ్మణుడు. 
గ్రంధకాలంలో వర్ణ వ్యవస్థ అలా ఉండేది. కనుక ఆ సమయంలో బ్రాహ్మణుడు, అంటే పైన చెప్పిన అన్ని పనులు నియమం తప్పక చేసేవాడికి అంత ప్రాముఖ్యం ఇవ్వటం తప్పు కాదు అనేది నా భావన. ఈరోజులలో ఉన్న కొందరు అధర్మమార్గంలో నడుస్తున్న బ్రాహ్మణులను చూసి ఇటువంటి వారికి శాస్త్రం అంత  గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదు కదా అని అనుకోవచ్చు. అయితే ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. శాస్త్రములలో చెప్పిన బ్రాహ్మణులు తన బ్రాహ్మణత్వమును కష్టపడి, ప్రయత్నించి సాధించారు. వారికి అది జన్మతః లభించలేదు. ఇప్పటికీ కొందరు నిజంగా పైవిధంగా జీవిస్తున్న బ్రాహ్మణులకు మనం అంత గౌరవం ఇచ్చి తీరాలి అనేది నా భావన. 

8, జూన్ 2016, బుధవారం

శ్రీరామ శతకము – 32

సీ :  అర్ధపంచక జ్ఞానమమరియుండిన గదా
           జ్ఞాన మాత్మకు గల్గు మానకెపుడు
      ఆకారత్రయ విష్టయాత్మకుందినగదా
           అన్యదేవతలందు నాసవదలు
     నవవిధ సంబంధమును నమ్మినట్లైన
            ఇతరాంతరంబుల యిష్టముడుగు
    తత్వత్రయంబాత్మతరచి చూచిన గదా
           మంత్రాంతరంబులమాని బ్రతుకు
తే :  భువిని నీయర్ధముల యొక్క భొగ్యతెరిగి
      చేతినిష్టలనున్నట్టి చేతనులను
      దయను రక్షించుతువట తండ్రి ధర్మమూర్తి

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

7, జూన్ 2016, మంగళవారం

పశువు - మనిషి

పరమ శివుని పశుపతిగా చెప్పినప్పుడు మానవులను పశువులుగా చెప్తారు. అందరూ మానవులకు పశువులకు గల భేదం ఏమిటి అని ఆలోచిస్తారు తప్ప వారి మధ్య ఒకేలా ఉండే గుణములు ఏవి అని ఎందుకు చూడరు? కొందరు చూస్తారు కదా! చాణక్యుని మాటలలో మనిషికి పశువుకు భేదంలేని విషయములు నాలుగు. అవి

ఆహార నిద్రా భయ మైదునాని, సమాని చైతాని నృణాం పశూనాం!
జ్ఞానం న రాణామధికో విశేషో, జ్ఞానేన హీనాః పశుభిః సమానాః !!  
   
భావం : ఆహారం, నిద్ర, భయం మరియు మైధునం అనే నాలుగు మానవులకు పశువులకు సమానం. కానీ మానవులకు విశేషమైన మరో లక్షణం జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానమును వదలేసిన మనిషి కూడా పశువుతో సమానమే!

6, జూన్ 2016, సోమవారం

శ్రీరామ శతకము – 31

సీ :  విజ్ఞానఖని నీవు అజ్ఞాన నిధి నేను
                     అల్పుడంచని యెంచకాదరించు
       జీవోద్దరుడ వీవు జీవద్వేషిని నేను
                 హింసాత్ముడన కను హితముగూర్చు
       ప్రకృతినిగ్రహుడీవు ప్రకృతి బద్దుడ నేను
               ప్రాపాత్ముడ కను పరమునిమ్ము
       దోషభోగ్యుడవీవు దోషకృత్యుడ నేను
              ఛం డాలుడన కను క్షమను గాచు

తే : తనయునెపుడైన వీడునే తండ్రి యెందు
      సజ్జనుల స్నేహమొనగూర్చి సన్నిధికిని
      జేర్చుకొనుగాదె నామొర చెవిని విడుచు
      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

5, జూన్ 2016, ఆదివారం

జీవన చిత్రం - ప్రయత్నం

జీవన చిత్రం - సార్ధకం గురించి చెప్పారు బాగానే ఉంది. అయితే అవన్నీ ఇప్పటి నుండే ఎందుకు? చక్కగా విశ్రాంత సమయం (రిటైర్మెంట్ తరువాత) చూసుకోవచ్చు కదా! అనుకోకండి. మనలాంటి మేధావులు ముందుముందు వస్తారనే కాబోలు భర్తృహరి తన వైరాగ్య శతకంలో ఇలా చెప్పారు.

యావత్స్వస్థ మిదం శరీర మరుజం యావజ్జరా దూరతో 
యావచ్చేన్ద్రియ శక్తిరప్రతిహతా యావత్క్షయో నాయుషః !!
ఆత్మ శ్రేయసి తావదేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్ 
సందీప్తే భవనే తు కూపఖననం ప్రత్యుద్యమః కీదృశః !! 
                                              -- భర్తృహరి - వైరాగ్య శతకం - 75

భావం : శరీరంలోనికి రోగములు రాకమునుపే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ముసలితనము రాకమునుపే, ఇంద్రియ పటుత్వము కలిగి ఉన్నప్పుడే, ఆయుషు క్షీణించక ముందే బుద్ధి మంతుడు తన ఆత్మ శ్రేయస్సు కొరకు ప్రయత్నములు చేసుకోవాలి. అలాకాకుండా అన్నీ చేజారిపోయిన తరువాత ప్రయత్నించుట ఎలా ఉంటుందంటే ఇల్లు అగ్నికి కాలిపోతున్నప్పుడు, నీటిని సంపాదించటం కోసం బావిని తవ్వటం మొదలు పెట్టినట్లు ఉంటుంది.

కాబట్టి ఇలా మారే ప్రయత్నం మనం ఇప్పటి నుండే మొదలు పెట్టవచ్చు.  

4, జూన్ 2016, శనివారం

శ్రీరామ శతకము – 30

సీ :  స్వామీ ! నీరూపెట్లు చక్కగ నమ్ముదు
                  కలరూపునన్నాకుగాన బడితో
       వందిమాగధు లెల్ల వందనంబులుజేయ
               గైకొని యుండుట కలను నమ్మ
       శ్రీలక్ష్మి నీసేవ చెలగిచేయునటన్న
               యెట్లు నమ్ముదు దేవ ఎరుక చేయు
       వైకుంఠపురిని గొప్పవాసినుండునటన్న
                నమ్మసాధ్య మదెట్లు నాకు జెపుమ

తే :  కాననీ విశ్వరూపంబు కనులనింప
       నేల చేసెద వాలస్యమేల చూపు
       నాకు నీవైభవంబంత నటనరాయ
       అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

                           - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

3, జూన్ 2016, శుక్రవారం

జీవన చిత్రం - సార్ధకం

జీవన చిత్రం లో ఉన్న విచిత్రమైన సందర్బమును మునుపు చెప్పుకున్నాం కదా! మరి దానికి పరిష్కారం ? ఆత్మను ఉద్దరించుకునే పద్దతి? తపస్సులు వంటి పెద్దపెద్ద పనులు మనం ఈకాలంలో ఎలాగూ చేయలేము. కనుక మనకు తగిన విధంగా చక్కని, సులువైన ఉపాయం చెప్పారు మన పెద్దలు.

కురు పుణ్య మహోరాత్రం స్మర నిత్యం మహేశ్వరం !
త్యజ దుర్జన సంసర్గం భజ సాదు సమాగమమ్ !!

భావం :  రాత్రింబవళ్ళు పుణ్య కర్మలు చేయాలి, పరమేశ్వరుని నిత్యం స్మరించాలి. దుష్ట సాంగత్యం విడవాలి. సజ్జనుల వెంట ఉండాలి. 

అబ్బా ఎంత చక్కగా చెప్పారో! అసలు మనకు సమయం ఉండక పోవటం కదా సమస్య! ఇప్పుడు పుణ్యకార్యములు ఎక్కడ చేయాలి? అది కూడా రాత్రింబవళ్ళంట! సరిపోయింది. రెండోది, నిత్యం దేవుని స్మరించాలంట. పూజలు, పునస్కారములు చేసే సమయం ఉంటే ఇన్ని తిప్పలు ఎందుకు? మూడవది, దుష్టులకు దూరంగా ఉండాలి. సరే! మన చుట్టూ ఉన్నవారిలో 99 మంది అలాంటి వారే మరి ఇప్పుడేమిటి చేయటం? సజ్జనులు, కలియుగం లో ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకేం తెలుసు?

పుణ్యకార్యములు అంటే అవి కేవలం దేవాలయంలో మాత్రమే చేసేవి, మన ఉద్యోగాలు వ్యాపారాలు మానుకుని చేసేవి అని అర్ధంకాదు. తోటి మనిషికి మనం చేయగలిగిన సాయం చేయటం. మనం పని చేసే చోట మన వలన మరొకరికి ఇబ్బంది కలుగ కుండా చూసుకోవటం, వీలయితే ఇబ్బందులలో ఉన్నవారికి సాయం చేయటం. అది ఎవరైనా కావచ్చు. ఇంట్లో వంటచేసే సమయంలో మీ భార్యకు సహాయం చేయటం దగ్గరి నుండి, ఆఫీసులో మీ సహోద్యోగి వరకు ఎవరికైనా మీరు సహాయం చేయవచ్చు. దానికి పెద్ద సమయం పట్టాడు కదా!
నిత్యం దేవుని స్మరించటం! దీనికోసం గంటల తరబడి దేవుని గదిలో ఉండవలసిన అవసరం లేదు.  మనస్సులో తలచుకుంటూ ఉంటే చాలు.
ఈ రోజులలో మంచివారు చెడ్డవారు అని ఎవరిని వేరు చేసి చూడలేము. కనుక మన చుట్టూ ఉన్నవారిలో ఉన్న మంచి గుణములు చూసి, మనం వారి నుండి ఏమి నేర్చుకోగలమో నేర్చుకుని, వారి చెడు గుణములు/ అలవాట్లు మానుకోమని/ మార్చుకోమని చెప్పి , అవసరమయితే ఆ విషయంలో వారికి సాయం చేయగలగాలి.



2, జూన్ 2016, గురువారం

శ్రీరామ శతకము – 29

సీ :  వీడల్పుడంచని వీడనాడెదవేని
               సౌలభ్యుడంచెట్టు చాటు కొనెదు
        అజ్ఞుండుఛండాలుడని వీడ దలతేని
                సర్వజ్ఞు బిరుదు నిస్సారమగును
       వీడకించనుడని విని నూరకుంటేని
                 భవదీయ కీర్తికి భంగమొదవు
      ఆర్త ప్రపన్నుని యార్తి దీర్చవదేని
               శోకహరుడను పేరు లేక యుండు

తే :  మాధవిట్లెప్పుడును చేయుభోధనలను
       చెవికినెక్కించుకొని వేగచేతనులను
       కృపను రక్షించు గోవింద కృష్ణవర్ణ
       అందుకొనవయ్య శ్రీరామ వందనములను !!

                                   - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

1, జూన్ 2016, బుధవారం

జీవన చిత్రం

మానవుడు  ఈ లోకంలో పుట్టిన దగ్గరనుండి ఎన్నో పనులు చేస్తాడు, మరొకరితో చేయిస్తాడు. కానీ కొన్ని విషయములు మరచిపోతాడు.  వాని గురించి చాణక్యుడు ఏమి చెప్పాడంటే

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయన్తీ,
 రోమాశ్చ శత్రవ ఇవ ప్రహరన్తి గాత్రం !
ఆయుః పరిస్రవతి భిన్నఘటాదివామ్బో,
లోకో న చాత్మహిత మాచరతీతి చిత్రం!!

భావం :  పెద్దపులివలె వృద్దాప్యం తరుముకు వస్తుంది, రోగములు శత్రువు వలే శరీరమును ఆక్రమిస్తాయి. పగిలిన కుండ నుండి నీరు నిరంతరం బయటకు పోయినట్లుగా మానవును ఆయుషు క్షీణిస్తుంది. అయినా కూడా మానవుడు తన ఆత్మకు మేలు చేకుర్చుకొనుటకు ప్రయత్నం చేయడు. ఇదేమి చిత్రమో!!

నిజమే కదా! ఈ రోజులలో ప్రతిఒక్కరు తమ తమ పనులలో హడావిడిగా ఉంటున్నారు. ప్రక్కవారిగురించి పట్టించుకోవటం మానేసి, తమను తాము పట్టించుకునే సమయం కూడా ఉండటంలేదు. పెద్దలను చూద్దామా అంటే, భగవత్ ధ్యానం చేయండి అని ఎవరైనా చెప్తే "అప్పుడే నాకు ముసలి తనం వచ్చింది అని చెప్తున్నావేమిటి " అంటూ సాగదీస్తారు. ఒకరోజు గడచింది అంటే మనకు ఉన్న సమయంలో ఒక విలువైన ఘట్టం ముగిసినట్లే కదా! అయినా దానిని మనం పట్టించుకోం.

ధర్మ, అర్ధ, కామ, మోక్షములు అనే నాలుగు పురుషార్ధములలో ఈ రోజు ప్రతిఒక్కరు అర్ధం వెనుక పరిగెడుతున్నారు. దానికి ముందు ఉన్న ధర్మం ఎవరికీ పట్టటం లేదు. తరువాత కామం వంతు. మోక్షం గురించి ఆలోచించే తీరికే లేదు. ఇంకా ఎన్ని జన్మలు పరుగెత్తినా అర్ధ, కామములు పరుగెత్తిస్తూనే ఉంటాయి తప్ప కనీసం విరామం కూడా ఇవ్వవు. అదే అర్ధమును ధర్మముతో, కామమును మోక్షముతో ముడి వేస్తే కదా ఆత్మకు ఉద్దరణ.
సులువుగా ఆత్మకు ఉద్దరణ కలిగే మార్గంకూడా మన పెద్దలు అనేక సందర్భములలో చెప్పే ఉంచారు. అవి మరో టపా లో చూద్దాం!