26, ఏప్రిల్ 2016, మంగళవారం

శ్రీ రామ శతకము-15

సీ :       ప్రకృతి గుణంబులు బాగుగానను జేరి
ప్రకృతి వశ్యుని జేసె ప్రాజ్ఞవినవె
సుఖ దుఃఖములు నాకు చుట్టరికంబులై
కలిమి లేములు నన్ను కెలికి చెరచె
మదము మాత్సర్యంబు మమకార గర్వముల్
కరణత్రయము చేత ఖలుని జేసె
రాగద్వేషంబులు బాగుగా నీడ్వగా
కోపతాపంబులు కోరిచేరె
తే:       ద్వంద్వములు నన్ను నీడ్వగా తపనపొంది
తండ్రి నిను జేరజాలక తలతునిదిగొ
వరద గోవింద వామన వాసుదేవ
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

24, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ రామ శతకము -14

సీ:       శైశ వంబున దేవ శరణన లేకను
మలమూత్రముల మున్గి మరచుటాయె
కౌమారదశయందుగనలేకనుండెనా
చెడు స్నేహంబులు నన్ను చేరి చెరచె
యౌవనంబున నిన్ను యర్చించ కొనకుండ
అంగనా సాంగత్యమడ్డు నిలచె
ముదియందు నిన్బక్తిమురిపించలేక నీ
చెడు రోగముల దెల్వి చెడగనాయె
తే :      శ్రీరమానాధ గోవింద శ్రీనివాస
ఎట్లు తరియింతునే దశనెట్లు గొలుతు
వేగవేంచేసి రక్షించు వేదవేద్య

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

23, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ రామ శతకము -13

సీ:       నీనామములు సహస్రానీకములు గాన
 ఏ నామమున బిల్వ నేర్తునిన్ను
బహు రూపములు నీకు భావ్యమై యుండగ 
ఏ రూపమని నిన్ను నేర్పరింతు
కళ్యాణగుణములు కల వనంతంబులై 
ఏగుణమ్మన నిన్ను నెంచుకొందు
సకల లోకాలలో సర్వంబు నీవౌట
యెందు గలవీవని యెరుగ గలను 
తే :      క్షితిని నిను జూచు వారేరి చిద్విలాస
మలినమతి నేను నిన్నెట్లు దెలియనేర్తు
వచ్చి కాపాడు శరణము జొచ్చినాడ

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఎక్కడ నుండి ఏం తీసుకోవచ్చు!

విషాదప్యమృతం గ్రాహ్యమమేధ్యాదపి కాంచనం
నీచాదప్యుత్తమా విధ్యా స్త్రీ రత్నం దుష్కులాదపి!!

భావం : విషం నుండి అమృతాన్ని, మలినముల నుండి బంగారాన్ని, నీచుని వద్ద నుండి విధ్యను, తన కంటే తక్కువ కులములో ఉన్నా స్త్రీ రత్నమును స్వీకరించ వచ్చును.

వివరణ: విషమును అలాగే స్వీకరిస్తే అనారోగ్యం కలుగు తుంది. అలా కాకుండా దానిని చేయవలసిన విధంగా శుద్ధి చేస్తే అది ప్రాణములను నిలబెట్టే అమృతం అవుతుంది. మురికిగా ఉన్నప్పుడు అత్యంత విలువైన బంగారాన్ని కూడా మనం గుర్తించలేము. దానిని గుర్తించి, మురికిని తొలగించే నిపుణత ఉన్నప్పుడు మనకు బంగారము లభిస్తుంది. నీచుడు (తనకంటే చిన్నవాడు) చేసే పనులలోనుండి కూడా ఉత్తమ విధ్యను నెర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే దానికి కూడా కొంత నిపుణత అవసరం. స్త్రీ రత్నం తనకన్నా తక్కువ కులంలో జన్మించినా కూడా ఆమెను వరించ వచ్చును.  

21, ఏప్రిల్ 2016, గురువారం

శ్రీరామ శతకము – 12

సీ :      నీలమేఘమువాడు నిడుద బాహులవాడు
కరుణారసము జిల్కు కనులవాడు
వెడద వక్షము వాడు వేద స్వరూపుడు
 కమనీయ కంఠంబు గలుగువాడు
కనక రంభాతిరస్కారులూరులవాడు
పద్మ పత్రముమించు పదమువాడు
శ్రీవత్స చిహ్నంబు శ్రీచూర్ణరేఖలు
 కరముల శంఖ చక్రముల వాడు
తే :      వక్షమందున శ్రీలక్ష్మి వాసమొంద
          శేషశయ్యను బవళించ శేషజనుల
దయ కటాక్షించునను మాట తప్పుగాదు

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

20, ఏప్రిల్ 2016, బుధవారం

18 ఉపపురాణముల పేర్లు

మనం ఇంతకూ ముందు 18 పురాణముల గురించి చెప్పుకున్నాం కదా! ఈ 18 పురాణములకు తోడు 18 ఉప పురాణములు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాని పేర్లు తెలుసుకుందాం!
పద్మ పురాణంలో చెప్పబడిన 18 ఉపపురాణముల పేర్లు

  1. సనత్కుమారము 
  2. నారసింహము 
  3. నాండంబము 
  4. నారదీయము 
  5. దౌర్వాసము 
  6. కాపిలము 
  7. మానవము 
  8. నౌశనసము 
  9. బ్రహ్మాండము 
  10. వారుణము 
  11. కాళికా పురాణము 
  12. మాహేశము 
  13. సాంబము 
  14. సౌరము 
  15. పరాశరము 
  16. మారీచము 
  17. భార్గవము 
  18. కౌమారము 

19, ఏప్రిల్ 2016, మంగళవారం

శ్రీ రామశతకము - 11

సీ:       పతియె నాగతి యంచు సతి చేయుధర్మముల్
సీతా పిరాట్టి తాజేసి చూపె
దాన్యమే విధిచేయదగును వారికి
దయ లక్ష్మణుడు దాస్య నిరతి
పారతంత్ర్యపు విష్ట నరులుండు రీతిని
భరతుండు చూపె సద్భక్తి తోడ
భక్తుల సేవయె భగవానుసేవని
శత్రుఘ్నుడు చూపె సత్యముగను
తే :      సర్వచేతన సంరక్ష సలుపుటకును
దశరధాత్మజుడై పుట్టి ధరణి నేలి
లోక కళ్యాణ మొనరించు లోకనాధ

అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

18, ఏప్రిల్ 2016, సోమవారం

శ్రీ రామశతకము -10

సీ :      పంచ సంస్కార సంపన్నుడు గాకెట్లు
 విష్ణుదాసుల చెల్మి వేగచేయు
నేను నాదనుటను మానకుండగ నెట్లు
సాత్విక సహవాస సౌఖ్యమొదవు
నారాయిర స్తోత్రములు చేయకుండెట్లు
జ్ఞానము ప్రాప్తించు మానవునకు
తత్వత్రయంబందు తగు నిష్ట లేకెట్లు
ముక్తికాంత వరించి మురిసి పడును
తే :      ప్రేమ నాచార్యు చేపట్టి కామము దిగి
భాగవతధర్మ దాస్య నిర్భరత నున్న
ముక్తి నరచేతికిత్తువు మోదమునను
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

17, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ రామశతకము - 9

సీ :      మంత్రాంతరంబుల మనసు నిల్పితిగాని
తిరుమంత్ర వైభవం బెరుగనైతి
సాధనాంతరముల సాధింప నెంచితి
సిద్ధిసాధన పొందు చెందనైతి
అన్యయుపాయాల నాశించెదను గాని 
నారాయణుని నాత్మ నమ్మనైతి
మనుజమాత్రుల సేవ మమత జేసితిగాని
గురువుల భక్తితో గొలువనైతి
తే :   ఆత్మవంచన పనులెన్నోయమరజేసి
       ఎందు దరిదాపు గానక పొందుగోరి
       నిన్నె నమ్మితి నీయాన నిజముగాను

       అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

16, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ రామశతకము - 8

సీ :      జానకీ దేవి నా సంవెదనం బాపి
రక్షించ వినిపించు రామునకు
మాయమ్మ నీవెప్డు మాతప్పులెల్లను
మన్నించ వినిపించు మాధవునకు
కమలనేత్రినాదు కలుషజాలమడంచి
తప్పించ వినిపించు దాశరధికి
లోకమాతా నాదు లోలత్వ మణగించి
లోకేశు మెప్పించు లోకమెరుగ
తే:    ఇందిరాదేవి మాతల్లి ముందె యుండి
       పురుషకారము చేయుము మ్రొక్కులిడుచు
       ననుచు ప్రార్ధింతు మాయమ్మ నామె ద్వార

        అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

శ్రీ రామశతకము - 7

సీ :      కల్పపర్యంతంబు గల్గు దేహంబని
భ్రమసి చేసితి నెన్నొ పాతకములు
 ద్రవ్యార్జనంబె యాదరువు రక్షణమని
మోహించి గడియింని మోసపోతి
ఆభాస భాంధవు లాత్మయుత్తారకు
లనియెంచి దరిజేర్చి ఆశచెడితి
అన్య దేవతలె నాకాత్మ రక్షకులంచు
కొలిచి శాశ్వత గతి కోలుపోతి
తే :  భక్తవరులను డాయంగ ముక్తి నొసగ
      శ్రీనివాసుడె కర్తయో ననగ వింటి
      చేరి నిను వేడుకొంటిని చేయివిడకు

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

13, ఏప్రిల్ 2016, బుధవారం

శ్రీ రామశతకము - 6

సీ :      ఈరేడు లోకంబు లీశ్వరాధీనమై
భూతి ద్వయంబంచు బొగడ బడియె
దైవంబు మంత్రమాధారమై యుండంగ
భక్తి ముక్తులకెట్లు భంగ మొదవు
మంత్రమాచార్యుని మహిమకు లోబడి
సిద్ధి నందగ జేయు చేతనులకు
ఆచార్యు కృపచేత హరియె ప్రత్యక్షమై
సర్వస్వదానము శక్తి నొసగు
తే : ఇన్నింటికి మూలమాచార్యుడిష్టతముడు
     భాగవతు లెల్లరతనికి పరమ హితులు
      మూలమిది యన్నింటికి నండ్రు మోక్షమతులు

      అందుకొనవయ్య శ్రీరామ వందనములు

12, ఏప్రిల్ 2016, మంగళవారం

శ్రీ రామశతకము - 5

సీ :      సర్వరక్క్షకుడగు జానకీపతియుండ
 బ్రహ్మ రుద్రేంద్రుల బట్టనేల
మంత్ర రాజంబిదె మహిత వాంచల దీర్ప
                   అన్య మంత్రంబుల వరయనేల
సిద్ద సాధనముయాశ్రీపతేయైయ్యుండ
సాధనాంతర భ్రమ చావదేల
చరమోపదేశంబు శరణమై యుండగ
ఇతరాంతరంబుల యిష్టమేల
తే :      అన్య శేషంబు నాశంబు యాత్మకెపుడు
సకల కైంకర్య మానంద సౌఖ్యములకు     
భాగవత దాస్య కర్తవ్యభోగవిరతి
          అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!

11, ఏప్రిల్ 2016, సోమవారం

శ్రీ రామశతకము - 4

సీ : కౌరి సూనుడు మున్ను కలివేళ నుదయించి
తిరువాయి మొజి జేసె నరులు మెచ్చ
ముగురార్యులే తెంచి ముదమొంద జేసిరి
ద్రవిడభాషల ముక్తి తత్వమంత
భాష్యకారులు నాడు భాష్యంబు వెలయించి
చేతనోజ్జీవంబు చేయ గలిగె
పెరియాళు వారులు పెరియ వాచ్చాంబిళ్ళ
భక్తి సారులు పెద భట్టరార్యు
                                
తే : లాది గురువర్యుతిమ్మహినవతరించి
 చేతనుల దిద్ది వైకుంఠ గతికి చేర్చి
రట్టియార్యుల దివ్యాంఘ్ర లాశ్రయింతు
అందుకొనవయ్య శ్రీరామ వందనములు

10, ఏప్రిల్ 2016, ఆదివారం

శ్రీ రామశతకము - 3

సీ : పాషండఖండనా పాప విద్వంసకా
            చార్వాకమత దూష సాధుశీల
      జైనమతద్వంసి జంభారి వినుతాయ
           బౌద్ధ విద్వంసక భక్తపోష
     శాక్తేయ భంజన సత్సంప్రదాయకా
          అద్వైత మతనాశయాది దేవ
     కుమత సంస్థాపక కులిశంబవై సాధు
          జన రక్షణము జేయు దనుజహరణ

తే : చారు గీర్వాణ నిర్ణేత చక్రహస్త
      తత్త్వ పురుషార్ధ సంపద సత్వగుణడ
      బ్రహ్మసూక్తుల బహుముఖ ప్రజ్ఞరాయ
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు 

9, ఏప్రిల్ 2016, శనివారం

శ్రీ రామశతకము -2

సీ : చోద్యంబుగా నీటజొచ్చి సోమకుద్రుంచి
           మున్వేదముల్దేవే ముదముతోడ
       కూర్మావతారమై కోర్కెతో మందరం
            బూని చరించ వేయుదదిలోన
       వనచర రూపమై వసుధను కాపాడి
             రక్కసు ద్రుంపవేయక్కజముగ
     నరసింహ రూపంబు ధరియించి ప్రేమతో
           ప్రహ్లాదు గావవే భద్ర చరిత

తే : వామనుడవయ్యి బలియొక్క నామ మడచి
      రామ శ్రీరామ బలరామనామదారి
     కృష్ణుడవు నీవు కల్కివి కృపను జూడు
     అందుకొనవయ్య శ్రీరామ వందనములు 

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

శ్రీ రామశతకము - 1

సీ : శ్రీ భూమినీశాది సీమంతి నీరత్న 
          దేవేరులౌ నీకు దివ్యపురుష 
       నిఖిల హేయప్రత్యనీక కల్యాణైక 
          గుణగణంబులు నీకు కువలయేశ 
       శంఖ చక్రంబులు శార్జ్ఞఖడ్గంబులు 
           భుషణంబులు నీకు శేషశయన 
      శఠకోప లక్ష్మణాచార్య వర్యులునీదు 
             నిత్యులాప్తులు నీకు నిగమ వినుత  

తే : వివిధ రూపంబులను దాల్చు విశ్వరూప 
      భక్త జనపోష భవహర పరమ పురుష 
      నిన్ను జేరితి నా తండ్రి నన్ను బ్రోవు 
     అందుకొనవయ్య శ్రీ రామ వందనములు !!





7, ఏప్రిల్ 2016, గురువారం

శ్రీ రామ శతకము

శ్రీ రామశతకము తిరుకోవలూరు రామానుజస్వామి వారిచే రచింపబడినది. దీనిని వారు ఆ సీతారాములకు అంకితం ఇచ్చారు. వారు ఈ శతకమును మొదలుపెట్టేముందు శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత  శ్రీరామ చంద్రులవారికి నమస్కరించారు. వీరు ఈ శతకమును సీస, తేటగీతి పద్యములలో రచించినారు. ఈ శతక మకుటం "అందుకొనవయ్య శ్రీరామ వందనములు".

ఉ : శ్రీ రఘురామచంద్ర నిను చిత్తమునందలపోసి పొందరే
      సూరులు తొల్లి మోక్షమును సూరిజన స్త వనీయనిన్నునే
      మారక గొల్చి వేడెదరమాపతి మమ్ముల గూడబ్రోవనీ
      భారమెగాక నన్యులదె భక్తులపాలిటి పెన్నిదానమా

 సీ : శ్రీ రామ చంద్ర నా చిరు విన్నపము వినుము
                         మేదివాగ్దోషమో యెరుక పడదు
        ఎందు వ్యాకరణ సంబంధ దోషముకద్దో
                           ఛందస్సు రీతి పొందెందులేదో
         కవుల స్నేహములేని కతన తెల్యగలేను
                            సత్కావ్య పఠనంబు సలుపలేదు
          నీ నామ స్మరణంబు నానేరములబాప
                      సీస పద్యంబుల జెప్పినాడ

తే : తప్పులేవైన తెలియక చెప్పితేని
      తప్పుబట్ట వటంచు తలచియేదొ
      పలికి అంకిత మిడితి నీ పాదరేణు
     నౌటరామానుజునికృతి నందుకొనుము!!




6, ఏప్రిల్ 2016, బుధవారం

శతకములు

తెలుగు సాహిత్య ప్రక్రియలలో సామాన్య జన జీవనానికి కూడా చదివి అర్ధం చేసుకోవటానికి వీలుగా ఉన్నవి శతకములు. ఎంతో లోతయిన భావములను వాడుక భాషలోని పదములతో చెప్పి, సామాన్య మానవుని కూడా జ్ఞానిని చేయగలిగినవి ఈ శతకములు. ఇంతకీ ఈ శతకముల గురించి మన పెద్దలు ఏమన్నారో చూడండి

చట్టాన్ని చెబుతుంది శాస్త్రం 
హితాహితాలు చెబుతుంది ఇతిహాసం 
బుద్దులు చెబుతుంది పురాణం 
సుద్దులు చెబుతుంది శతకం 

అదన్నమాట శతకమునకు ఉన్న ప్రాముఖ్యం.

ఇంతకీ శతకములు అంటే ఏమిటి? 
శతకం అంటే 100 లేదా 108 పద్యముల సంకలనం. మన సంస్కృతిలో 100 కు, 108 కి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పవలసిన అవసరం లేదు కదా! ఒక శతకంలోని అన్ని పద్యములు ఒకే వృత్తంలో ఉంటాయి. అన్నింటికి ఒక మకుటం ఉంటుంది. మకుటం అంటే కిరీటం కదా! అవును కిరీటమే, కానీ ఇక్కడ సంభోదన అని అర్ధం. ఈ మకుటమును బట్టి ఆ పద్యం ఏ శతకమునకు చెందినదో తెలుస్తుంది.

శతకములలో భక్తి కి సంబందించినవి, సమాజమునకు ఉపయోగికారములు.
ఈ శతకముల వలన ఉపయోగం ?
మాటలు పలుకటం వచ్చిన చిన్న పిల్లలకు వీటిని నేర్పించటం వలన వారి స్పష్టమైన ఉచ్చారణ కలుగుతుంది. మాతృభాషపై పట్టు కలుగుతుంది. భావ వ్యక్తీకరణ తెలుస్తుంది. జ్ఞాపక శక్తీ వృది చెందుతుంది.
ఇక పెద్దలకు నిత్య జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టములను దాటే సలహాలు ఉంటాయి. ఈరోజులలో అందరూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి నేర్చుకునే "వ్యక్తిత్వ వికాసం" ఈ శతకములలో కావలసినంత దొరకుతుంది.
 ఉదాహరణ: వేమన, సుమతి శతకములు

మన పిల్లలకు ఇటువంటి విలువలున్న తెలుగు పద్యములు కనీసం నెలకు రెండు నేర్పితే, వారికి భవిష్యత్తులో మరొకరిపై ఆధారపడి సామాజిక విలువలు, నైతిక విలువలు నేర్చుకునే అగత్యం తప్పుతుంది. 

5, ఏప్రిల్ 2016, మంగళవారం

విదుర నీతి-1

విదుర నీతి  అంటే విదురుడు దృతరాష్ట్రునకు చెప్పిన నీతి. ఈ సందర్భం మహాభారతం ఉద్యోగ పర్వంలో వస్తుంది. సంజయుడు ధర్మరాజువద్దకు రాయభారమునకు వెళ్లి తిరిగి వచ్చి, దృత రాష్ట్రునకు కనిపించి, అక్కడ జరిగిన విషయములను రేపు సభలో చెప్తాను అని ఇంటికి వెళ్ళిపోయిన తరువాత అసంతృప్తితో, ఆవేదనతో ఉన్న దృతరాష్ట్రుడు అతని ఆవేదనను అర్ధంచేసుకోగల వాడు విదురుడు అని అతనిని పిలిపించటంతో మొదలవుతుంది.
దృతరాష్ట్రుడు తన సేవకుని పిలచి విదురుని పిలుచుకు రమ్మని చెప్పాడు. అప్పుడు ఆ సేవకుడు విదురుని ఇంటికి వెళ్లి అతనిని రాజు పిలిస్తున్నారు అని చెప్తాడు.

సంస్కృత శ్లోకం 
ప్రహితో దృతరాష్ట్రేణ దూతః క్షత్తారమబ్రవీత్
ఈశ్వరస్త్వాం మహారాజో మహాప్రాజ్ఞ దిదృక్షతి 

ఏవముక్తస్తు విదురః ప్రాప్యరాజనివేశనం
అబ్రవీదృతరాష్ట్రాయ ద్వాఃస్థ మాం ప్రతి వేదయ

తెలుగు
విదురుని ఇంటికేగి కురువీరునిపంపున సంజయోక్తిదా
నెదదలపోసి కౌరవమహీపతి యుష్మద భీక్షణా ప్తుడై
నిదురయొకింత లేక నను నీకడ కంపెను నానతండు సం
మదభరమొప్ప నిల్వెడలె మానవ నాధుని జూచు వేడ్కతోన్

4, ఏప్రిల్ 2016, సోమవారం

విదుర నీతి

మన పెద్దలు మనకు అనేకములయిన ధర్మములను శాస్త్రములను చెప్పారు. వానిని అవగతం చేసుకొనుట ఈనాడు కష్ట సాధ్యం. దీనికి ముఖ్య కారణం అవి చెప్పబడిన కాలంలో రాచరిక వ్యవస్థ ఉండేది. కానీ ఈ రోజు మనం ఉన్నది గణతంత్ర వ్యవస్థ. కానీ కొంచెం అన్వయం చేసుకొనగలిగితే, ఆ శాస్త్రములలోని అనేక విషయములు మనకు నిత్య జీవన క్రమం అత్యంత ఉపయుక్తములుగా ఉంటాయి.
 అలా ఉపయుక్తం అయిన శాస్త్రములలో నీతి శాస్త్రం ఒకటి. దీనిని అనేక మంది అనేక గ్రంధములలో మనకు అందించే ప్రయత్నం చేసారు. అయితే వ్యాస భగవానుడు మహాభారతమును గ్రందీకరించే సమయంలో ఈ నీటిని విదురుని ద్వారా దృతరాష్ట్రునికి చెప్పించారు. ఈ మహాభారతమును ఆంధ్రీకరించే సమయమందు కవిత్రయంలోని తిక్కన ఆ భాగమును వదలి వేసినాడు.
ఆ వదలి వేసిన భాగమును "శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి" గారు తెలుగులో చక్కగా మూడు అస్వాసములుగ రచించినారు.
ఈ శీర్షికలో సంస్కృత శ్లోకం, దానికి  శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తెలుగు లో చెప్పిన పద్యం/ గద్యం - వాని భావం చెప్పే ప్రయత్నం చేస్తాను.
తప్పులుంటే తెలియ చేయండి.