ఇంద్రాది దేవతల మాటలు విన్న నలుడు ఆశ్చర్యమునకు గురి అయ్యాడు. తాను కూడా అదే స్వయంవరమునకు బయలుదేరానని చెప్పాడు. అలా ఒకే స్వయంవరమునకు వెళ్తున్న తనతో ఆ రాకుమారి వద్దకు దేవతలను వివాహం చేసుకోవాలని ప్రస్థావన తీసుకుని దౌత్యం చేయడం సమంజసం గా ఉండదు అని తన భావన దేవతలకు వివరించాడు.
కానీ ఇంద్రాదిదేవతలు అతనిని పరీక్షించడానికే అక్కడికి వచ్చారు కనుక వారు నలుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాడానికే నిర్భందించారు. ధర్మనిరతుడయిన నలుడు దమయంతి దగ్గరకు దేవతల తరపున దూతగా వెళ్ళాల్సిన పరిస్థితి తప్పలేదు.
అప్పుడు నలునికి మరొక సందేహం కలిగింది. దమయంతి ఒక రాకుమార్తె. ఆమె స్వయంవరమును కూడా ప్రకటించిన ఈ సందర్భంలో ఆమె మందిరంలో కాపలా కొరకు భటులు నిరంతరం ఉంటారు వారిని ఏమార్చి ఆమెవద్దకు ఎలా చేరుకోవాలి? అని. ఆ సమస్యకు దేవతలే ఉపాయం అందించారు. అతను విదేహ రాజ్యములోని దమయంతి రాజ భవనము/ అంతఃపురం ప్రవేశించే సమయంలో అతనిని దేవతల కృపవలన ఎవ్వరూ అడ్డుకొనరు అని దేవతలు వరం ఇచ్చారు.
ఆ వర ప్రభావం కారణంగా నలుడు సులభంగా దమయంతీదేవి అంతఃపురాన్ని చేరుకున్నాడు. ఆ అంతఃపుర శోభను చూస్తూ ముందుకు నడిచాడు. అతను దమయంతిని చూశాడు. ఆమె అతనిని చూసి ఆశ్చర్యపోయింది. తన అంతఃపురంలోనికి రావడానికి ఎంత ధైర్యం? నలుని రూపలావణ్యముల గురించి ఇంతకు ముందు విని ఉండుట వలన, ఆమె అతని రూపమును చూసి భటులను పిలవకుండా మాట్లాడడం మొదలు పెట్టింది.
అతనికి ఇంతకు ముందు హంస వివరించిన దాని కంటే దమయంతి అతనికి అత్యంత సుందరంగా కనిపించింది. అతను తనను తాను అమెకు పరిచయం చేసుకున్నాడు. అతను అక్కడికి వచ్చిన కారణం కూడా ఆమెకు వివరించాడు.
ఇప్పుడు ధర్మసంకటంలో దమయంతి పడింది. ఆమె తాను కోరుకున్న నలుని వివాహం చేసుకుంటే, అతను సరిగా దూత పని చేయలేదన్న అపకీర్తి వస్తుంది, అలాగని ఆమె దేవతలలో ఒకరిని వివాహం చేసుకోలేదు.
మరి ఆమె స్వయంవరం ఎలా జరిగింది? ఆమె నలునికి ఏమి సమాధానం చెప్పి పంపింది? నలుడు దేవతలకు ప్రియంగా దూత కార్యమును చేసినట్లుగా ఎలా అనుకోవాలి? తరువాతి టపాలలో చుద్దాం!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి