మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఏడు భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగంలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగమునకు కొనసాగింపు.
సంస్కృత శ్లోకం:
నిషేవతే ప్రశస్తాని నింన్దితాని నసేవతే
అనాస్తికః శ్రద్ధదాన ఏతత్పండిత లక్షణమ్
క్రోధో హర్షశ్చ దర్పశ్చ హ్రీస్తంభో మాన్య మానితా
యమర్ధాన్నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే
శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః
జనహిత కార్య సంతతిని సల్పుచుగ్రోధముగర్వముబ్బుసి
గ్గునుజననింద్యసేవన ముకుత్సితబుధ్దియు నాత్మసంస్తవం
బను నివిలేకదానపరుడై సదయుండును శ్రద్ధధానుడౌ
జనుడిలబండితుండని ప్రశంసకునుక్కును కౌరవేశ్వరా!
భావం:
మంచిపనులు చేయడం, నిందింపదగిన పనులను చేయకుండా ఉండుట, నాస్తికుడుకాకుండా ఉండుట, తాను చేసేపనుల పై శ్రద్ధ కలిగి ఉండుట మరియు కోపమును, మితిమీరిన సంతోషమును, గర్వమును, సిగ్గును, బిడియము, తనకు తానే అధికుడు అనుకోవడము అనే లక్షణములు లేకుండా ఉండే వానిని పండితుడు అంటారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి