30, నవంబర్ 2017, గురువారం

మంచి, చెడు- 3

ధనము నందు అత్యాశ గలిగి ఉండుట కంటే దుర్గుణము లేదు
అబద్ధములు చెప్పుట కంటే పాపము వేరొకటి లేదు - సత్యవాక్కును మించిన తపస్సు లేదు
మనస్సు పవిత్రంగా ఉండుట కంటే గొప్ప తీర్ధము లేదు . సౌజన్యము కు మించి పరివారము లేదు
 మంచి పనులు చేయుట వలన ప్రాప్తిoచిన పరువు అన్నింటి కంటే ప్రకాశమైన అలంకారం
విద్య కంటే విలువ గల ధనము లేదు
లోకనిందను మించి నీచమైన చావు లేదు  

28, నవంబర్ 2017, మంగళవారం

మంచి,చెడు -2

మన పెద్దలు ఏ విషయాన్ని చెప్పినా మంచిని చెడును సమాంతరంగా చెప్తారు. ఒక విషయాన్ని మంచిది అని చెప్తున్నప్పుడు దానికి సంబంధించి చెడుఎలా ఉండవచ్చో కూడా చెప్తారు. ఇటువంటి మంచి చెడుని నిర్వచిస్తున్నప్పుడు వారు ముఖ్యంగా మనిషి సామాజిక బాధ్యతకి ప్రాముఖ్యత ఇచ్చారు. 

అటువంటివి కొన్ని మనం చూద్దాం.

మంచి:  
ఆకలిగొనిన వారల కన్నము పెట్టవలెను
దాహము గలిగిన వారికి దాహశాంతి చేయవలెను
దుఃఖములో ఉన్నవారికి అవసరమయిన సహాయం చేయవలెను ఒకవేళ మన వంతు సహాయం చేయలేక పొతే కనీసం వారికి ఓదార్పు కలిగేలా మసలితే మంచిది.

చెడు : 
పక్కవారి ఆకలిని, దాహమును గమనించకుండా తన భోజనము తాను చేయుట అన్నింటికంటే చెడ్డ పనిగా మన పెద్దలు చెప్పారు.
పక్కవారు దుఃఖంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకపొతే రేపు అటువంటి సమస్య మనకు కలిగినప్పుడు మనకు సహాయం చేయటానికి ఎవరు వస్తారు?

27, నవంబర్ 2017, సోమవారం

మంచి, చెడు -1

ఈ రోజులలో ఉద్యోగం చేసే టప్పుడు అధికారి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేదాని గురించి మన పెద్దలు ఏ విధంగా అది   కత్తిమీద సామువంటిదో విపులంగా ఎలాచెప్పారో చూద్దామా!
యజమాని/ అధికారి  దగ్గర ఎక్కువగా మౌనముగా ఉంటే మూగవాడు అంటారు
యజమాని/ అధికారి  దగ్గర  ఎక్కువగా మాట్లాడితే అధిక ప్రసంగి  అంటారు
యజమాని/ అధికారి కి అత్యంత సమీపంగా ఉంటే గర్వితుడు అంటారు
యజమాని/ అధికారితో అంటీ ముట్టనట్లు దూరంగా ఉంటే భయస్తుడు అంటారు
యజమాని/ అధికారి ప్రవర్తనను ప్రశ్నించకుండా భరిస్తుంటే పిరికివారు అంటారు
యజమాని/ అధికారి ముందు తన ఆత్మగౌరవమును కాపాడుకొనే ప్రయత్నం చేస్తే గౌరవము లేని వ్యక్తి అని చెప్పుకుంటారు
కనుక ఉద్యోగము  చేసే దగ్గర మనపని మనం చూసుకోవాలి, మరీ ఎక్కువగా మాట్లాడకుండా, అవసరమైన దగ్గర మాట్లాడకుండా ఉండకుండా మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. 

26, నవంబర్ 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 100

సీ  : సీస పద్యములిదొ శ్రీరామ మాలగా 
             గూర్చి మీ కొసగితి కొదువ లేక 
        శత పుష్ప మాలిది సంతసంబున గొని 
             దంపతుల్ ముదమొOద దాల్చరయ్య 
       తావి నిండిన పూల దండలివి మెడదాల్చి 
            చెడిపోవకుండగా జేయరయ్య 
       బీద దాసుడిచ్చు ప్రేమ కానుక గొని 
            మంగళంబులు సామి మాకు నొసగు 
       
తే :   గ్రుడ్డి పూలంచు నిర్గందకుసుమమనుచు
        మనసు నందున రోయక మణిసరాల
        టంచు రామానుజుండిచ్చు హారమిదిగొ
       అందుకొనవయ్య శ్రీరామ వందనములు

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి